ఆచంట శారదాదేవి కథల్లో శిల్పసౌందర్యం -మొదటిభాగం

రాసినవి చిన్నకథలే అయినా, అవి ఆరు డజన్లకి మించకపోయినా, తెలుగు కథాసాహిత్యంలో ఒక విశిష్ఠ స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి ఆచంట శారదాదేవి. రాసి కాదు వాసి ప్రధానం అనడానికి సాక్ష్యం ఆవిడ సాహితీ ప్రస్థానం.

50వ దశకంలో అతులిత కీర్తిని ఆర్జించిన తెలుగురచయిత్రులలో కొంతమంది ఈనాటి కొలమానాలకి నిలవరన్న సంగతి నాకు ఈమధ్యనే బోధపడింది. ఎలా రాసి పంపినా పత్రికలు ప్రచురించుకునే రోజుల్లో కాలం, కర్మం కలిసొచ్చి కొందరికి తగని, తరగని కీర్తి వచ్చిందంటే తప్పులేదేమో. కానీ విలక్షణమయిన కథలు రాసిన కొందరి పేర్లు కొందరికి మాత్రమే తెలిసి, కాలక్రమాన అంతరించిపోవడం చూసినప్పుడు మాత్రం అయ్యో అనిపించకమానదు. ఈనాడు ఆచంట శారదాదేవి పేరు చాలామందికి తెలీదంటే ఆశ్చర్యం లేదు.

శారదాదేవి కథల్లో పాఠకులని పట్టి ఊపేస్తూ ఆరాటపెట్టేసే సంఘర్షణలు ఉండవు. సంఘంమీదా, సాటి మనుషులమీదా కోపం, కసి, కక్షలాటివి కనిపించవు. సంఘర్షణ అసలు లేదనను కానీ ఆ సంఘర్షణ పెనుగాలిలా వచ్చి కుదుళ్ళలోనుంచీ మన నమ్మకాలనీ, విలువలనీ పెకలించేసి, పడగొట్టేసేది కాదు. ఈకథల్లో ఒక సంఘటనకి ముందూ, తరవాతా పాత్రల మానసిక స్థితిని తరిచి చూచి, జీవితపు లోతుల్ని కనుక్కోవాలన్న తపన కనిపిస్తుంది. సంఘంలోనూ మనుషుల్లోనూ గల లోపాల్నీ, అవకతవకల్నీ నిశితంగా పరిశీలించి, ఒక రకమైన వేదనతో, తమకంతో, విచారణతో వాటిగురించి ఆలోచిస్తూ, ఆ ఆలోచనలు మనతో పంచుకుంటున్నట్టు ఉంటుంది. కొన్ని కథలని lyrical అనొచ్చునేమో కూడా. ఎంచేతంటే అవి ఏదో ఒక పరిస్థితిని మాత్రమే వర్ణిస్తాయి. అంతకుమించి కథకు కావలిసిన ఎత్తుగడా, సంఘర్షణా, ముగింపూలాటి మసాలాలుండవు. బహుశా ఈనాటి విమర్శకుల, పాఠకుల కొలమానాలకి లొంగకపోవచ్చు కూడా ఇవి.

శారదాదేవి కథనంలో ఒక ప్రత్యేకత కథకుడిస్వరం నిర్లిప్తంగా, నిరామయంగా అనిపించడం. అయితే అది విసుగు పుట్టించేది మాత్రం కాదు. కారణం ఆమె ఎంచుకున్న వస్తువులలో, వాటిని మలిచిన తీరులో కూడా ప్రశంసనీయమైన చాకచక్యం చూపడం. ఇతివృత్తం సాధారణమయినా, అసాధారణమయినా, దాన్ని విశ్లేషిస్తూ, దానికి ఒక తాత్త్వికకోణం ఆపాదించి ఇదీ జీవితం అని చెపుతున్నట్టుంటాయి ఆమె కథలు. ఎందుకిలా జరుగుతోందన్న జిజ్ఞాసా, దీనికేదో అంతరార్థమో, పరమార్థమో ఉందేమోనన్న సదసద్సంశయం కనిపిస్తాయి ముగింపులో.

ఏకాంతం, ఆత్మీయత కొరవడిన దంపతులూ, ఒక ప్రత్యేక వ్యక్తికోసం నిరీక్షణా, భవిష్యత్తుమీద ఆశ, భిన్న సందర్భాలలో మానసిక ప్రవృత్తులూ, సమాజంలో ఎగుడుదిగుళ్లూ, మధ్యతరగతి కుహనావిలువలూ – ఇవన్నీ శారదాదేవిగారికి కథావస్తువులే. ఇవి అందరికీ తెలిసినవే, అందరికీ అనుభవమే అయినా రచయిత్రి మరోసారి ఈ సంగతులే స్పృశించి, కథల్లో ఆవిష్కరిస్తే మనకి ఓహో అనిపిస్తుందే తప్ప ఎవరికి తెలీదు కనక అనిపించదు. అందుకే ఇవి మంచికథలయేయి.

శారదాదేవిగారి పేరు విని పారిపోయిన చిలుక కథ పేరు విననివారు ఉండరనుకుంటాను. (ఇంగ్లీషు అనువాదం ఇక్కడ చూడొచ్చు.) ఈ కథ స్త్రీస్వేచ్ఛకి సంబంధించిన కథగా విశేషఖ్యాతి నార్జించుకుంది. ఇందులో ప్రధానాంశం స్వేచ్ఛ అని అంగీకరించినా, ఇది కేవలం చిలుకని పంజరంలో పెట్టినట్టు స్త్రీని మగవాడు ఇంట్లో బంధించడం అనడం సబబు కాదు. ఈకథలో ప్రధానపాత్ర కామాక్షమ్మ కోరుకున్న స్వేచ్ఛకి నిర్వచనం నాలుగుగోడల మధ్యనించీ విమోచన కాదు.

సుందరరావు. ఒంటరివాడు. “పట్నాల్లో ఏముంది దుమ్ము, ధూళి తప్ప,” అంటూ ఊరికి దూరంగా మామిడితోపులో ఇల్లు కట్టుకుని, రెండేళ్ళపాటు వంటవాడు, నౌకరుతో కాలం గడుపుతాడు. తరవాత “ఈ ఇంట్లో భార్య అనే ఒక వస్తువు కూడా ఉంటే బాగుంటుందనిపించి” కామాక్షమ్మని పెళ్ళి చేసుకుంటాడు. సుందరరావుకి భార్య “ఒక వస్తువు” కావడం గమనార్హం. పోతే, అతని దినచర్య – చీకటితోనే బయల్దేరి పట్నానికి వెళ్లిపోయి, అక్కడ వ్యాపారమేదో చూసుకుని, స్నేహితులతో రోజంతా పేకాడి, చీకటి పడ్డాక తిరిగి రావడం. వస్తూనే పేపరు తెస్తాడు. భోజనం అయేక పేపరులో తల దూర్చి కూర్చుంటాడు.

కామాక్షమ్మ తమలపాకులు చిలకలు చుట్టి, ఇస్తుంది. కొన్ని తింటాడు. ఆఖరికి కామాక్షమ్మ “పట్నంలో విశేషాలేమిటి?” అని అడుగుతుంది.

“ఏముంది. మామూలే,” అంటాడు పేపరు అడ్డం పెట్టుకుని.

మళ్ళీ నిశ్శబ్దం.

కామాక్షమ్మే ఏవో చెబుతుంది. మల్లె చెట్టు పూసింది. వానలు పడలేదు… ఇలా ..

ఆఖరికి అతను “రేడియోలో ఏదైనా ప్రోగ్రాము ఉందేమో చూడరాదూ” అంటాడు.

కామాక్షమ్మ లేచిపోతుంది.

అంతే వాళ్ళ సంభాషణ. ఈ చిన్న సంభాషణలో వాళ్ళ అన్యోన్యతా, దాంపత్యజీవితం కూడా మనకి అర్థమయిపోతాయి.

కొంతకాలం అయినతరవాత, కామాక్షమ్మ “మీకు పని అంతా పట్నంలోనే కదా. పట్నంలోనే కాపురం పెడదాం” అంటుంది. దానికి సుందరరావు సమాధానం, “ఆ పట్నంలో ఈ ఏకాంతం, ప్రశాంతం ఎక్కడ దొరుకుతాయి?” అని.

నిజానికి సుందరరావు ఆ యింట్లో అనుభవిస్తున్న ఏకాంతం కానీ ప్రశాంతత కానీ ఏమీ లేదు సరి కదా తను ఏకాంతం, ప్రశాంతత అనుభవించడం లేదన్న స్పృహ కూడా లేదు అతనికి. మానవసంబంధాల విషయంలో అతనిదృష్టి ఎంత సంకుచితమో, ఆభార్యాభర్తల సంబంధం ఎంత పేలవమో ఆ ఒక్కవాక్యంలో తెలిసిపోతుంది. ఇక్కడ స్త్రీకి ఇల్లు పంజరం అన్న కాన్సెప్టు ఒక పొర మాత్రమే. అంతకంటే ముఖ్యమైన కోణం – కామాక్షమ్మ అసంతృప్తికి కారణం – వారిద్దరిమధ్య లోపించిన అన్యోన్యత. రోజంతా ఇంట్లో లేకపోయినా, కనీసం తిరిగి వచ్చేక అయినా ఆమనిషిని ఆప్యాయంగా పలకరించడం, మంచీ చెడ్డా కనుక్కోడంవంటివి లేవు, నాలుగు పొడి పొడి మాటలే తప్ప. ఒక మనిషి మరొక మనిషిని కొట్టక్కర్లేదు. తిట్టక్కర్లేదు. కేవలం ఎదురుగా మనిషి ఉంది అని గుర్తించనైనా గుర్తించకుండా, ఆమె అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చెయ్యడంద్వారా ఆ మనిషిని చిత్రవధ చెయ్యొచ్చు.

ఒకరోజు ఆ “ఏకాంత, ప్రశాంత” వాతావరణంలోకి కాలు విరిగిన ఓ చిలుక వచ్చి వాలుతుంది. కామాక్షమ్మ ఆ చిలుకని చేరదీసి, చికిత్స చేసి, చిన్నారి అని పేరు పెట్టుకుని, దానికి పంజరం ఏర్పాటు చేసి, దాని ఆలనా పాలనా చూసుకుంటూ, దానితో ఊసులాడుతూ పొద్దు పుచ్చుకుంటుంది.

కాలు నయం అయేక, వీలు చిక్కగానే చిలుక ఎగిరిపోతుంది. కామాక్షమ్మ కన్నబిడ్డ పోయినంతగా బాధ పడుతుంది కానీ సుందరరావుకి మాత్రం చీమ కుట్టినట్టయినా ఉండదు. మామూలుగానే లేచి ఊళ్ళోకి వెళ్ళిపోతాడు ఆరోజూ, ఆతరవాతా కూడా. కామాక్షమ్మ బాధ పడుతోందని అతనికి తోచదు.

మళ్ళీ వసంతకాలం వస్తుంది. తోటలోకి పక్షులు వస్తాయి కిలకిల్లాడుతూ. తోటమాలి శంకరం ఒక చిలుకని పట్టనా అని అడుగుతాడు. ఆమె వద్దంటుంది. స్వేచ్ఛగా అవి ఎగురుతూంటే చూసి ఆనందించడమే మేలు అని సమాధానపడుతుంది.

ఇక్కడ మళ్ళీ మానవసంబంధాల తాలూకు ఛాయలు కనబడతాయి. కామాక్షమ్మ చిలుకయందు చూపింది దయ కాదు. ఆ చిలుకలో ఆమె చలనంగల మరొక ప్రాణిని చూసుకోడం. అదే కథలో ప్రధానాంశం అని నా అభిప్రాయం.

మానవసంబంధాల్లో అత్యంత ప్రధానమయింది గుంపుతత్త్వం. మనిషికి మనిషి కావాలి. ఒకరి జీవితంతో మరొకరి జీవితం విడదీయలేనంతగా పెనవేసుకుపోవడం ఒక్క మానవులలోనే జరుగుతుంది. కుక్కా, ఎద్దూలాటి జీవులు మనిషిని ఆలంబన చేసుకున్న కథలున్నాయి కానీ ఒక కుక్క మరొక కుక్కనీ, ఒక ఎద్దు మరొక ఎద్దునీ ఆలంబన చేసుకున్నట్టు కనిపించదు.

కామాక్షమ్మజీవితంలో లోపించింది స్వేచ్ఛ కాదు. ఆత్మీయతా, మనసు విప్పి మాటాడగల మరొక మనిషీ. అది సుందరరావు ఇవ్వలేదు. చిలుక ఇచ్చినట్టే ఇచ్చి, పారిపోయింది. కామాక్షమ్మజీవితంలో అసలైన విషాదం ఇల్లు పంజరం కావడం కాదు. ఇంట్లో మరోజీవి తనఉనికిని గుర్తించకుండా ప్రవర్తించడం!

శారదాదేవిగారి ఇతరకథల్లో కూడా ఈ అంశం – అంటే ఒకమనిషి మరొక మనిషికోసం ఆరాటపడడం – కనిపిస్తుంది. పారిపోయిన చిలుకలో మరొక ప్రాణికోసం తపన అయితే, ఒక్కనాటి అతిథి, మరీచిక, మామూలు మనిషి లాటి కథల్లో కేవలం ఒకరోజు పరిచయమైన ఒకే ఒక వ్యక్తిమీద ఆత్మీయత పెంచుకుని, పొందలేనప్పటి వేదన చూస్తాం.

ఉదాహరణకి “ఒక్కనాటి అతిథి” తీసుకోండి. ఊరవతల ఒక చలివేంద్రం నేపథ్యం. ఆదారంట పోయే బాటసారులకి మజ్జిగ దాహం ఇచ్చి సేదదీర్చడం గౌరయ్య ఉద్యోగం. అతనికూతురు కేతకి రోజూ తండ్రితో అక్కడికి వచ్చి, పాకముందు అలికి ముగ్గులు పెట్టడంలాటివి చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒకతను వచ్చి ఆరాత్రికి అక్కడ బస చేస్తాడు. కేతకికి ఎంతో ఇష్టమయిన పొగడచెట్టుకింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. అతను పొగడపూలు దండ కట్టి ఆమెకి ఇస్తాడు.

మర్నాడు గౌరయ్య “మళ్ళీ వస్తారా” అని అడుగుతాడు. అతను “నేను వచ్చినతోవను మళ్ళా రాను. వెళ్ళినచోటికి మళ్ళా వెళ్ళను.” అని అంటూ కేతకికేసి చూసి నవ్వాడు. ఆ చూపు ఆమెని ఆఖరిసారి హృదయానికి హత్తుకుని  సెలవు తీసుకుంటున్నట్టున్నది. కేతకి దిగులుతో తల వంచుకున్నది” .

ఆతరవాత కొంతకాలానికి కేతకికి పెళ్ళవుతుంది. అత్తవారింటికి సాగనంపుతూ కేతకితల్లి సుముఖి పొగడపూలు తెల్లనిగుడ్డలో మూట కట్టి ఇస్తుంది. కేతకి “బరువు” అంటూ ఆమూట అక్కడే పడేసి వెళ్ళిపోతుంది..

ఈకథకీ మరీచిక కథకీ తేడా నేపథ్యంలో మాత్రమే. ఇది కూడా ఊరికి దూరంగా ఏకాంతప్రదేశంలోనే జరుగుతుంది. కథ శీర్షికలని బట్టి రచయిత్రి కథాంశంలో ఊనిక మార్చడానికి మళ్ళీ రాసేరేమో అనిపిస్తుంది. అంటే ప్రధానాంశం అతిథి మనిషి కాదు ఆ మనిషిమీద పెంచుకున్న ప్రేమ మరీచికలాటిది అని అనేమో.

ఈరెండుకథలకి మామూలు మనిషి కథకీ తేడా, ఈకథ ఊరవతల కాక, ఊళ్ళో జరుగుతుంది. రైల్లో కనిపించిన ఒకబ్బాయిని తన మనోనాథుడుగా ఊహించుకుని, తనకోసం వస్తాడని కలలు కంటున్న అమ్మాయికి అతను భార్యతో సినిమాహాల్లో కనిపించడంతో అతను మామూలు మనిషి అయిపోతాడు.

అయితే అన్ని కథలూ ఇలా కలలప్రపంచమే కాదు. చాలాకథల్లో నిజమైన సమస్యలు తీసుకుని వాస్తవంగా సమర్థవంతంగా అవిష్కరిస్తారు శారదాదేవి. వాటిలో వివాహేతరసంబంధాలగురించిన కథలు కొన్ని.

మంచిపని, స్మృతి – ఈ కథల్లో అక్రమసంబంధాలూ, వాటి ఫలితాలూ, వాటిని ఎవరు ఎలా పరిష్కరించుకుంటారు వంటి విషయాలు ఆవిష్కరించడం జరిగింది. ఈవిషయంలో సమాజంలో, జనులు దృష్టిలో వచ్చిన మార్పులు కనిపిస్తాయి.

మంచి పని సుందరం పరువుగల ప్రిన్స్‌పాల్. కొంతకాలం క్రితం భార్య పుట్టింటికి వెళ్ళినసమయంలో విద్యార్థి సుభద్రతో సంబంధం పెట్టుకుంటాడు. ఆమె గర్భవతి అవుతుంది. సుందరం మౌనం వహిస్తాడు. ఆమె మరొకరిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుంది. సమస్య తీరిపోయింది. ఆ కాలేజీలోనే పని చేస్తున్న వివాహితుడైన శివరావు మరొక అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. అది చట్టరీత్యా నేరం కనక సుందరం రిపోర్టు రాయాలి.

శివరావు భార్యా, సంబంధం పెట్టుకున్న అమ్మాయీ కూడా అతనిఉద్యోగం నిలబెట్టమని సుందరం భార్యని ప్రాధేయపడతారు. సుందరందృష్టిలో ఇద్దరాడవాళ్ళ మద్దతు గెల్చుకున్న భాగ్యశాలి శివరావు! తనగతం తెలీని భార్య కూడా ఆ ఇద్దరాడవాళ్ల అభ్యర్థనని బలపరుస్తుంది. అంత జరిగేక కూడా సుందరం సుభద్రవిషయం భార్యకి చెప్పలేడు. “రేపు రిపోర్టు రాస్తాను” అనడంలో శివరావుకి ఆయనమద్దతు లేదన్నది స్పష్టం. ఆయనకి శివరావుయందు సానుభూతి ఉంటే రిపోర్టు రాసే ప్రశ్న లేదు. ఈకథలో స్త్రీ పురుష సంబంధాలవిషయంలో ఒక సామాజికకోణం, మధ్యతరగతి విలువలలో మార్పు కనిపిస్తుంది.

స్మృతి లో ప్రిన్సిపాల్ కాలేజీలో కొత్తగా చేరిన అమ్మాయి తన అక్రమసంతానం అని తెలుసుకుని, ఆ అమ్మాయిని పెంచుకోడానికి నిర్ణయించుకుంటాడు. అయితే ఆ అమ్మాయికి మాత్రం తన సంబంధం చెప్పడు. ఈకథల్లో వివాహేతర సంబంధాలని రహస్యంగా ఉంచడం కనిపిస్తుంది.

అందుకు భిన్నంగా వానజల్లు లో అది సాధారణ విషయం. ఒక వానరోజు వరండాలోకి వచ్చి నిలబడిన వ్యక్తిని ఇంట్లోకి రానిచ్చి, అతను ఆ రాత్రి అక్కడ ఉంటానంటే సరేనంటుంది ఒకావిడ. తరవాత అతను తన మొదటిభర్త అని గుర్తిస్తుంది. ఆరాత్రి అతను ఆవిడపడకగదిలోకి వస్తే ఆమె అభ్యంతరం చెప్పదు. కానీ మర్నాడు “నాతో వచ్చేయి” అన్నప్పుడు మాత్రం గతం గుర్తు చేసి, అతనితో పో నిరాకరిస్తుంది. మరి ఈ ఒక్కరోజు అనుభవానికి ఎందుకు అంగీకరించింది అంటే కేవలం శారీరకమైన అవసరం అంటుంది. ఇది బహుశా రచయిత్రి సమాజంలో, మనుషులు ఆలోచించే విధానంలో వచ్చినమార్పులు గుర్తించి తను కథలలో చొప్పించేరేమో అనిపించింది. 50వ దశకంలో స్త్రీ, పురుషులమధ్య తప్పు అనిపించే సంబంధం 80 వచ్చేసరికి ఆదర్శం కాకపోయినా, సహజం అనుకునే స్థితికి వచ్చినజాడలు ఈకథలో ఆవిష్కరించినట్టు కనిపిస్తోంది.

ఇలాటి ఇతివృత్తాలు పాఠకులకి రకరకాలుగా ఆలోచించుకోడానికి అవకాశమిస్తాయి. ముగింపులో పరిష్కారంకంటే ఇలాటి సమస్యకి ఎవరు ఎలా స్పందిస్తారు అన్నదే ప్రధానం అనుకుంటాను ఒక పాఠకుడు శివరావుని అభినందించవచ్చు, మరొక పాఠకుడు సుందరాన్ని విమర్శించవచ్చు. మరొకరు ఆ ముగ్గురు స్త్రీలని గర్హించవచ్చు. ఇంకా మరొక రచయిత ఇదే వస్తువుని తన అభిరుచికి తగినట్టుగా మరో కథ రాయొచ్చు. సాధారణంగా మనం వ్యాఖ్యల్లోనూ విమర్శల్లోనూ చూస్తాం ఈధోరణి. ఈకథకి సాహిత్యప్రయోజనం అదే – ఇన్ని రకాల ఆలోచనలు రేకెత్తించగలగడం – అని నా అభిప్రాయం.

ఈర్ష్య ఒక మానసిక ప్రవృత్తి. కారుమబ్బులు, మార్పు – ఈ రెండు కథల్లో ఈర్ష్య రెండు కోణాల్లో ఆవిష్కరించడం జరిగింది.

(తరువాయి భాగం లింకు ఇక్కడ )

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “ఆచంట శారదాదేవి కథల్లో శిల్పసౌందర్యం -మొదటిభాగం”

 1. సౌమ్య గారూ! కధలు చదివి ఆరోగ్యం పాడైన వారు ఎవరన్న ఉన్నారా? చదవండి… జీవితం ఎంతో పెద్దది…

  మెచ్చుకోండి

 2. సౌమ్యా, ఊరికే నన్నాడిపోసుకోవాలని కాకపోతే, చూసి తీసుకోవచ్చుకదా ఒకొకటే. లేదా వరసగా మీదనించి కిందకి చదువుకోవచ్చు :p.

  మెచ్చుకోండి

 3. Interesting!
  నాకిప్పుడు ఈవిడ కథలేవన్నా దొరికితే చదవాలనిపిస్తోంది!!
  మీరిలా నా టు-రీడ్ జాబితాలు పెంచుకుంటూ పోటే, వాటి ఎత్తుల మధ్య నేను కృంగి, నేనేదో మధ్యలోది లాగడానికి ప్రయత్నించి ఎత్తులన్నీ కూలి నా వెన్ను విరిగి – ఏమన్నా అయిందంటే మీదే బాధ్యత!! :))

  మెచ్చుకోండి

 4. సత్యవతిగారూ, శారదాదేవిగారి మరణం తేదీవివరాలకి ధన్యవాదాలు. ఇంటర్నెట్లో తెలుగు సాహిత్యంగురించి ఎంతో ఉన్నా అవన్నీ ఓ నలుగురు మహారచయితలగురించే. ఇకమీదట కూడా ఏమైనా అనుమానాలు వస్తే మిమ్మల్ని అడగొచ్చా? 🙂
  మాలతి

  మెచ్చుకోండి

 5. శారదా దేవి గారు 1999 లో మరణించారు.ఆమెను నేను 1999 మొదట్లో చెన్నై లో చూశాను.తరువాత కొంతకాలానికి మృతిచెందారు.అదే సభలో కల్యాణ సుందరి గారిని కూడా చూశాను.ఆ సభకి కల్పన కూడా వచ్చింది.

  మెచ్చుకోండి

 6. @ కల్పనా, 🙂 నువ్వు పగడాలమీద రాసేవరకూ ఈ వ్యాసం చదవవేమోననుకున్నా. త్వరగా రాసేయి మరి. కథావిమర్శగురించి అన్నిరకాల అభిప్రాయాలు ఉండడం నిజమే.
  స్మైలీలు – కోలన్, end bracket కొడితే నవ్వు మొహం
  సెమికోలన్, end bracket కొడితే నాలుక బయట పెట్టి కొంటెగా వెక్కిరిస్తున్న మొహం,
  కోలన్, డి (ఇంగ్లీషు అక్షరం) టైప్ చేస్తే పెద్దగా నవ్వు…
  కోలన్, beginning bracket కొడితే భ్రూకుటి ముడిచి, కళ్లు చిట్లించి … :D.
  ఇప్పటికి ఇంతే పాఠం.

  మెచ్చుకోండి

 7. “ కొన్ని కథలని lyrical అనొచ్చునేమో కూడా. ఎంచేతంటే అవి ఏదో ఒక పరిస్థితిని మాత్రమే వర్ణిస్తాయి. అంతకుమించి కథకు కావలిసిన ఎత్తుగడా, సంఘర్షణా, ముగింపూలాటి మసాలాలుండవు. బహుశా ఈనాటి విమర్శకుల, పాఠకుల కొలమానాలకి లొంగకపోవచ్చు కూడా ఇవి.”
  80 ల తర్వాత కథా స్వరూపం మారిపోయింది అని కొందరు విమర్శకులు చెపుతుంటారు. ఆ పద్ధతి లో ఇప్పుడు మీఊ చెప్పేవేవీ కథల్లో వుండక్కరలేదు.ఏదో ఒక పరిస్థితి ని వర్ణించినా కూడా అది కథ కిందకే వస్తుంది. కానీ “ కొందరు విమర్శకులు, పాఠకుల” కొలమానాలు మాత్రం వేరు గా వున్నాయి.
  శారదా దేవి గారి కథల గురించి వివరంగా చెప్పారు. రెందో భాగం కోసం ఎదురుచూస్తాము.
  నేను కూడా ఆమె కథ “ పగడాలు” మీద కధానుభవం లో రాద్దామని కొన్ని “ జన్మల” కిందట డిసైడ్ అయ్యాను. ఇంకా “ కొన్ని అదనపు జన్మలు” పట్టేలా వుంది. బాబోయి. ఎవరైనా కాస్త నాకు స్మైలీ లు పెట్టడం గురించి చెప్పండి బాబు…లేకపోతే అపార్ధాలు వచ్చేస్తాయి.

  మెచ్చుకోండి

 8. @ Gowri Kirubanandan, ఈ పుస్తకాలు ఇప్పుడు లైబ్రరీలలో మాత్రమే దొరుకుతాయనుకుంటాను. చివరి సంకలనం, వానజల్లు, ప్రచురణకర్త వివరాలు ఇస్తున్నాను ప్రయత్నించి చూడండి.
  Y. V. Subrahmanyam
  26-13-63 Sanyasi Raju Street
  Gandhi nagar, Vijayawada – 520 003
  Or
  Sahiti
  1-99/3 Lingogiguda
  Saroor Nagar, Hyderabad 500 035.
  మాలతి
  పాఠకులందరికీ, విన్నపం- శారదాదేవిగారు 1996లోనో 98లోనో మరణించారని చదివినట్టు గుర్తు. తెలుస్తే చెప్పగలరు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s