ఆచంట శారదాదేవికథల్లో శిల్పసౌందర్యం రెండోభాగం

మొదటిభాగం లింకు ఇక్కడ

కారుమబ్బులు కథలో మబ్బులు ప్రతీకగా ఆవిష్కరించడంలో శారదాదేవి ప్రత్యేకత కనిపిస్తుంది. ఉత్తమపురుషలో చెప్పిన ఈ కథలో ఆమెపేరు మనకి తెలీదు. ఆమె, శ్రీధర్ ఆఫీసులో కలుసుకుని, ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరిమధ్య ఎనలేని అన్యోన్యం. ఆమెకి ప్రమోషన్ వచ్చిందని తెలిసినతరవాత అతని ప్రవర్తన మారిపోతుంది. అతను ఉద్యోగం వదులుకోడానికి సిద్ధపడుతున్నాడని తెలిసి తను అంతకుముందే ఉద్యోగం మానేయడానికి నిశ్చయించుకున్నాననీ, కారణం తమకి పుట్టబోయే పాపాయి అనీ చెప్తుంది ఆమె.

శ్రీధర్‌ మనసులో కారుమబ్బులు తొలగిపోయేయి. కానీ అతనిలో మార్పు వచ్చింది తను ఉద్యోగం మానేసినతరవాతే అన్నవిషయం ఆమెని బాధిస్తుంది. దానిమూలంగా ఆమెకి నిస్పృహ. మనసులో కారుమబ్భులు కమ్ముకోడం మొదలవుతుంది. శ్రీధర్ మనసులో కారుమబ్బులు అతని ఓర్వలేనితనానికి ప్రతీక అయితే ఆమె మనసులో కారుమబ్బులు అతనియందు ఆమెకి కలిగిన నిస్పృహకి ప్రతీక. ఆ కారుమబ్బులు వారిఆత్మీయతని కూడా ఆవరించే ప్రమాదం ఉందనీ, వాటినుండీ తనని తానే రక్షించుకోవాలనీ ఆమే గుర్తించి, “ఉద్ధరేదాత్మ నాత్మానమ్” అన్న గీతావాక్యం స్మరించుకుంటుంది.

ఇక్కడ విశేషం – ఆ కారుమబ్బులగురించిన స్పృహ ఆమెకి ఉంది కానీ అతనికి లేదు. రెండు సందర్భాలలోనూ రక్షకురాలు ఆవిడే. మొదట తనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి అతన్ని inferiority complexనించి రక్షించింది. రెండోసారి తనలో కలిగిన నిస్పృహని గుర్తించి దాన్నించి తనని తనే రక్షించుకోవాలని గ్రహించింది. అలాటి ఆలోచన శ్రీధర్‌కి తట్టలేదని అన్యాపదేశంగా సందేశం.

ఈ కారుమబ్బులు ప్రయోగంలో విలక్షణమైన కోణం ఉంది. మనకి నిజజీవితంలో కారుమబ్బులు వర్షం తెస్తాయి కనక హర్షదాయకం. కానీ సాహిత్యంలో అనూచానంగా కారుమబ్బులు దిగులు, నిస్పృహలకి సూచనగా వాడడమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈకథలో కారుమబ్బులు మొదట శ్రీధర్ మనసునావరించిన ఈర్ష్యకి ప్రతీకగానూ, తరవాత అతనిధోరణిలో వచ్చినమార్పుకి భార్యలో కలిగిన అసంతృప్తికి ప్రతీకగానూ వాడడం జరిగింది. ఈమబ్బులు తొలిగినప్పుడే ఇద్దరికీ మోక్షం. ప్రత్యక్షంగా కనిపిస్తున్న వాస్తవాన్ని అధిగమించి ప్రతీత్మకంగా పెట్టిన శీర్షిక ఇది అని ఇందుకే అంటున్నాను.

మనజీవితాల్లో డబ్బు అత్యంత ప్రధానమయిన అంశం. పూర్వకాలంలో మతం ప్రాతికపదికగా వర్గవిభజన జరిగితే, ఇప్పుడు ధనం ఆధారంగా తరతమ తరగతులు ఏర్పడ్డాయి. రెంటిమూలంగానూ  దురంతాలు ఒక్కలాగే జరుగుతున్నాయి. ఏమాత్రం తేడా లేదు.

మధ్యతరగతి కుహనావిలువలు ఎత్తి చూపే కథలు పగడాలు, ఆకలి. మొదటికథలో ఓ చిన్నపల్లెలో చిన్న దుకాణం పెట్టుకుని, మనుమరాలిని పెంచుకుంటూ కాలం గడుపుకుంటున్న ఓ ముసలి తాతమీద నిష్కారణంగా పగడాలదండ దొంగిలించేడని నేరం మోపి, అతను చెమటోడ్చి కూడబెట్టుకున్న పదిరూపాయలు లాక్కుని, అతనిబతుకు సర్వనాశనం చేస్తుంది తల్లి. అది అన్యాయమని తెలిసీ, ఏమీ చెయ్యలేని చిన్నపిల్ల వాసంతి జీవితాంతం ఆబరువు మోస్తుంది మెళ్ళో పగడాలదండ రూపంలో. తన చిన్నతనంలో జరిగిన ఈ సంఘటనని, చాలాకాలం తరవాత తిరిగి పుట్టింటికి వస్తున్నసమయంలో గుర్తు చేసుకుంటున్నట్టు చిత్రించడం జరిగింది ఈకథలో.
ఋజువు లేకుండా దొంగతనం అంటగట్టడం హేయం అయితే, ఆ దండ తమయింట్లోనే దొరికినతరవాత,  ఆ సంగతి ఒప్పుకోకపోవడం హేయాతిహేయం.

“తాతతో చెప్పి రానా, అమ్మా, పగడాలు దొరికాయని?” అని వాసంతి ఉత్సాహంగా అడిగితే, అమ్మ కంగారుగా, పగడాలు పమిటకు వత్తుకుంటూ చీవాట్లు పెట్టింది, “ఛీ! సొమ్ము ఇంట్లోనే ఉంచుకుని వాడిని ఉత్తినే హింస పెట్టేమని నలుగురూ అనుకోరూ? ఎంత అప్రతిష్ఠ!!” అంటుంది తల్లి.
మధ్యతరగతివారి కుహనావిలువలకీ, పిరికితనానికీ ఇది పరాకాష్ఠ. శారదాదేవిగారి కథల్లో ఇలాటి అవగాహన చాలా చూస్తాం.

“తనకేమీ అర్థం కాలేదు. కారణం లేకుండానే దొంగతనం చేశాడని అపవాదు వేసి బాధ పెడితే తాతకి ఏమీ అవమానం, అమర్యాద లేదు. కాని దొరికిన వస్తువు దొరికిందని చేసిన తప్పు ఒప్పుకవడం తమకెంతో అమర్యాద! అప్రతిష్ఠ!! అనుకుంటుంది వాసంతి. ఈ భావం చిన్నపిల్లచేత వ్యక్తం చేయడంలో కృత్రిమవిలువలు పుట్టుకతో రావని రచయిత వ్యాఖ్యానం కావచ్చు.

ఆకలి కథలో పట్టెడు మెతుకులకోసం అలమటిస్తూన్న ఒక యువకుడికి ఒకయింటి అరుగుమీద స్నేహితుడు కనిపిస్తాడు. ఆఇంట్లో పెళ్లి జరుగుతోంది. అది చూసి, తనకి అన్నం పెట్టించమని ఆ స్నేహితుడిని అడిగితే, అది తనఇల్లు కాదనీ, పెళ్ళివారు ఏమంటారో కనుక్కుని చెబుతాననీ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. మరి కనిపించడు. ఆ యువకుడు చేసేది లేక వీధులంట తిరుగుతూ, దారిపక్కన పళ్లు అమ్ముకుంటున్న ఒక అవ్వని చూస్తాడు. ఆమె రెండుపళ్ళు ఇస్తుంది తినమని. ఆ తరవాత అతను వ్యాపారం పెట్టుకుని, బాగా డబ్బు సంపాదించి, ఆ అవ్వకి రెండణాలు బాకీ తీర్చాలనుకుంటూనే తాత్సారం చేస్తాడు. చివరికి అతను వెళ్ళేవేళకి అక్కడ అవ్వ లేదు. మరో చిన్నపిల్లాడు కనిపించి, “ఆకలేస్తోంది ఒక అణా ఇవ్వమ”ని అడుగుతాడు. అతను తను తెచ్చిన రెండణాలూ ఆపిల్లాడికిచ్చి ఋణం తీర్చుకున్నానని తృప్తిగా వెళ్లిపోతాడు.

ఈకథలో కూడా కొన్ని మెలికలు లేక మలుపులు శిల్పం దృష్ట్యా గమనార్హం. మొదటిది స్నేహితుడు పెళ్లింట మరోమనిషికి అన్నం పెట్టించడానికి సంకోచించడం. మనదేశంలో పెళ్ళళ్లలో మరోమనిషికి అన్నం పెట్టం అనేవారుంటారని అనుకోను. ఆ స్నేహితుడు ఎందుకలా అన్నాడో కథకుడు చెప్పడు. నాకు కనిపించిన కారణం ఒక బిచ్చగాడిని తనస్నేహితుడుగా గుర్తించడానికి అతని మధ్యతరగతి విలువలు ఆటంకం కావచ్చు అని. పగడాలులోలాగే ఇక్కడ కూడా మధ్యతరగతి కృత్రిమవిలువలు ఎత్తిచూపడం జరిగింది. రెండో మెలుపు, ఒక్కపూట తిండికోసం అంతగా అలమటించిన వ్యక్తి అవ్వని మర్చిపోడు కానీ అప్పు తీర్చడానికి మాత్రం తాత్సారం చేస్తాడు. అతను నాలుగు డబ్బులు చేతిలో పడినవెంటనే ఆ రెండణాల అప్పు ఎందుకు తీర్చలేదు? దీనికి కూడా తార్కికంగా జవాబు చెప్పలేం. లోకరీతి అని సమాధానపడాలి. ఇలాటివి అందరం చేస్తూనే ఉంటాం. రేపు, రేపంటూ వాయిదా వేయబడే మంచిపనులెన్నో మన రోజువారీ జీవితాల్లో.

మారిన మనిషి లో నౌకరు నారాయణ యజమానురాలు చెప్పినపనులు చెయ్యడానికి నిరాకరించడం ప్రధానాంశం. ఈఇల్లు కూడా ఊరిచివరే ఉంటుంది. వాడిని మానిపిస్తే మరొకరు ఇంతదూరం వచ్చి పని చేసేవారు దొరకరని కొంత తామసించినా, చివరకి భర్తతో చెప్తుంది. ఆయన అతన్ని కోప్పడతారు. నారాయణ మారు మాట లేకుండా వెళ్ళిపోతాడు. చాలాకాలంతరవాత మళ్ళీ రిక్షా తొక్కుతూ కనిపిస్తాడు రైల్వే స్టేషను దగ్గర. రాత్రీ, చీకటీ, వానా .. ఈవాతావరణంలో తను ఆరిక్షాలోనే ఎక్కవలసివస్తుంది. ఆవిడ గుర్తు పట్టదు కానీ నారాయణకి గుర్తే. అయితే ఇప్పుడతను ఆ అహంకారి నారాయణ కాదు. “ఏమీ లేనప్పుడు అంత అహంభావం. అన్నీ ఉన్నప్పుడు ఈ అణకువ” అనుకుని ఆశ్చర్యపోతుంది ఆవిడ.

ఈకథ నడిపినతీరు అద్భుతం. మనస్తత్త్వాలు విశ్లేషించడంలో శారదాదేవి ప్రతిభ అనన్యసామాన్యం అనడానికి నిదర్శనం ఈకథ. ఇందులో నారాయణ మనస్తత్త్వం మాత్రమే కాక నారాయణలాటి మనిషిని యజమానులు అంచనా వేసే తీరు కూడా ఆవిష్కరించడం జరిగింది. కథ అంతా ఉత్తమపురుషలో యజమానురాలికోణంలో చెప్పినా, ఆమె ఆలోచనలో లోపాలు కూడా పాఠకుడికి బాగానే అర్థం అవుతాయి. ఈకథలో విశేషం అదే.

త్రాసులో డబ్బుగల ఆసామీ సీతారామయ్యకి భార్యకీ కూతురికీ తనడబ్బు ఖర్చు చేయడంతో సరిపోతుంది కానీ ఆయనయందు ఆప్యాయత చూపించే తీరిక లేదు. నౌకరు గురవయ్య “మీపుట్టినరోజు బాబూ” అంటూ ఓ ఆపిల్ పండూ, ఓ గులాబీ పువ్వు తెచ్చి ఇచ్చినప్పుడు అర్థం అవుతాయి ఆయనకి మానవీయవిలువలు.

శారదాదేవి కథల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన మరొక గొప్ప అంశం ప్రకృతి చాలా కథల్లో ఇళ్ళు ఊరికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. మబ్బులూ, నక్షత్రాలూ, చిరుగాలులూ, వానచినుకులూ లేని కథ దాదాపు లేదు. ఒకొకప్పుడు ఒక పేజీ నింపుతారు ఇలాటి వర్ణనలతో. అయితే అవి విసుగనిపించవు. వాతావరణాన్ని కథలో పాత్రగా మలిచడం శారదాదేవి ప్రత్యేకత. ఉదాహరణకిః
కోరికలు ఒక మఱ్ఱిచెట్టు చెప్పిన కథ. అందులో ఒక వర్ణన చూడండి.
“చీకటి పడింది. నక్షత్రాలు ముగ్గులు పెట్టాయి. చందమామ తరలి వచ్చాడు కానీ గాలి కదిలింది. నా (చెట్టు) ఆకులు గలగలలాడినవి. ఆకాశాన్నందుకోడానికి ముందుకు సాగినవి.

పారిపోయిన చిలుక లో కామాక్షమ్మ ఊరిచివర ఏకాంతంలో రోజూ ఆకాశం, మబ్బులూ చూస్తూ కూర్చుంటుంది. “ఆకాశాన తెల్లనిమేఘాలు అటూ ఇటూ పరుగెడుతున్నాయి, ఏదో తొందరపని ఉన్నట్టు. ఆ కొసనించి ఒక తెల్లని మబ్బుతునక ముందుకు పరిగెడితే ఈకొసనుంచి మరొక పిల్లమబ్బు ముందుకు సాగుతోంది. మధ్యలో రెండూ ఒక క్షణం ఒకటిగా మారిపోతున్నాయి. రెప్పపాటులో విడిపోతున్నాయి. మళ్ళా ఎవరిత్రోవ వారిది. ఆకాశాన్ని అలముకొని రూపాలు మార్చుకొంటున్నాయి – చెదిరిన దూదిరేకుల్లా, జారిన మల్లెమొగ్గల్లా. ఏవో, ఏవో … …”

మబ్బులనీ, నక్షత్రాలనీ ప్రతీత్మకంగా వాడుకోడంలో గొప్ప చాకచక్యం చూపిస్తారు శారదాదేవి. ఉదాహరణకి, పారిపోయిన చిలుకలో “ఎంత అందంగా పరుగెడుతున్నాయి!. ఎంత ఆప్యాయంగా కౌగిలించుకుంటున్నాయి! ఎంతలో విడిపోతున్నాయి! ఏమి క్షణికానుబంధాలు! అనుకున్నది”. కామాక్షమ్మ వాటిని చూస్తూ. ఆకాశంలో మబ్బుల అందంతోపాటు వాటి ప్రవృత్తిని ఎనిమిదోక్లాసు చదివిన కామాక్షమ్మ మానవసంబంధాలకి అన్వయించుకోడంలో రచయిత్రి నేర్పు కనిపిస్తుంది ఇక్కడ. ప్రతిమనిషిలోనూ కవితాత్మ ఉంటుందన్న ధ్వని ఒకటి. రెండోది ఈ వర్ణనలో జరగబోయేకథ కూడా సూత్రప్రాయంగా ఆవిష్కరించడం. మబ్బుల్నీ, మామిడితోపులోకి వచ్చే పోయే చిలుకల్నీ చూసి ఆనందించే కామాక్షమ్మ ఒకరోజు విరిగిన కాలుతో తమముంగిట వాలిన చిలుకమీద మమకారం పెంచుకుంటుంది. కానీ ఆ చిలక్కి మాత్రం అది నిర్బంధమే. అవకాశం దొరగ్గానే ఎగిరిపోతుంది – మబ్బుతునకలు కలుసుకుని విడిపోయినట్టుగానే. పైవర్ణనలో చమత్కారం అదీ.

శారదాదేవి కథల్లో సున్నితమయిన మనోవిశ్లేషణ, జీవితంగురించిన తాత్త్వికచింతన ఉంటాయి. “తాను విరివిగా పుస్తకాలు” చదివినట్టు చెప్పుకున్నా, ఆ చదువుఛాయలు, విదేశీ భావజాలాల భేషజం ఈకథల్లో కనిపించవు. కల్తీలేని సిసలైయిన తెలుగుకథలు ఇవి.

ఏకథ ఎప్పుడు ప్రచురించారు అన్న వివరణ ఏ సంకలనంలోనూ లేదు. కానీ మొదటి మూడు సంకలనాలూ 60వ దశకంలోనే వచ్చేయి కనక అవి తొలిదశలో రచనలనీ, వానజల్లు సంకలనం 1991లో వచ్చింది కనక అందులోనివి మలిదశలో రచనలనీ అనుకుంటే, వస్తువు ఎంపికలోనూ, పరిష్కారంలోనూ ముందుకథలకంటే మలిదశలో రచనలు కొంచెం వేరుగా కనిపిస్తాయి. ప్రధానంగా మన జీవనవిధానంలో, మన దృక్పథాలలో వచ్చినమార్పులు ఆమెకథల్లో కూడా చోటు చేసుకున్నాయి. తొలినాటికథల్లో ఒక విధమయిన నిర్వేదం, ఉదాసీనత అంతర్గతంగా కనిపిస్తాయి. అయితే ఏకథలోనూ నిరీహ, నిర్మోహం లేవు. ఆమె పాత్రలు సజీవపాత్రలు. ప్రతిమనిషికీ కోరికలుంటాయి. జీవితంమీదా భవిష్యత్తుమీదా ఆశ ఉంటుంది. ఇవి విశ్లేషించే తీరులో శారదాదేవి అద్భుతమయిన సమతుల్యత సాధించేరు.

శారదాదేవి జీవితవిశేషాలగురించి తెలిసింది స్వల్పం. ఆంధ్రజ్యోతి ఆనంద ఉగాది సంచికలో (1975) ఆమే ఇచ్చిన వివరాలు – పుట్టింది 1922లో. ఊరు విజయవాడ. ఇంగ్లీషు యం.ఏ. చదివారు. తెలుగు యం.ఏ. పూర్తి చేశారు. హిందీ విశారద, కొద్దిగా సంస్కృతం, సంగీతం కూడా నేర్చుకున్నారు. తిరుపతిలో పద్మావతీ కాలేజీలో తెలుగు లెక్చరరుగా 1954 నుండీ పని చేశారు. 1944లో ఆచంట జానకిరాంగారితో వివాహమయిన తరవాత విరివిగా పుస్తకాలు చదివే అవకాశం కలిగిందిట.  1945లో తొలికథ అచ్చయింది. తాను రచయిత్రిగా రూపొందడానికి “నార్ల వెంకటేశ్వరరావుగారి ప్రోత్సాహం చాలావరకు కారణం అన్న నమ్మకం” తనలో బలంగా ఉంది అంటారామె.

ఆచంట శారదాదేవి కథలు చదువుతుంటే చక్కటి తెలుగుకథలు చదువుతున్నామన్న ఆనందం కలుగుతుంది. మంచి కథలు చదివేం అన్న సంతుష్టి కలుగుతుంది. వస్తువులు ఎంచుకోడంలో, కథని మలచడంలో, జీవితాన్ని వ్యాఖ్యానించడంలో శ్లాఘనీయమైన ప్రతిభ చూపిస్తారామె.

వ్యాసం నిడివి దృష్ట్యా శిల్పంగురించి ఒక్కవాక్యం చెప్పి ముగిస్తాను. ఎత్తుగడా, సన్నివేశాలూ, సంఘటనలూ, ముగింపూ, పాత్ర చిత్రణా – అన్నీ సమతుల్యంగా అమరిన కథలివి.

ప్రచురించిన సంకలనాలు –
1. పారిపోయిన చిలుక. విజయవాడ, ఆదర్శగ్రంథమండలి, 1963
2. ఒక్కనాటి అతిథి. విజయవాడ, ఆదర్శగ్రంథమండలి, 1965.
3. మరీచిక. విజయవాడ, ఆదర్శగ్రంథమండలి, 1969
4. వానజల్లు. హైదరాబాదు, సాహితి, 1991.

చివరి సంకలనం ప్రచురణ వివరాలు
Y.V. Subrahmanyam,
26-13-63 Sanyasi raju st.,
Gandhi nagar, Vijayawada 520 003.
OR
Sahiti
1-99/3 Lingogiguda
Hyderabad 500 035.

(జులై 21, 2010.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “ఆచంట శారదాదేవికథల్లో శిల్పసౌందర్యం రెండోభాగం”

 1. @ కల్పనా, ఆలస్యంగానైనా విపులంగా చర్చించినందుకు శిక్ష కాదు ధన్యవాదాలు చెప్పుకోవాలి. :). శారదాదేవిగారు 1999లో ఒకసభలో పాల్గొన్నారనీ, ఆసభకి ఆవిడా నువ్వూ కూడా హాజరయేరనీ సత్యవతిగారు నాకు రాసేరు. శారదాదేవిగారు ఏ సభల్లోనూ పాల్గొన్నట్టు నేనెప్పుడూ వినలేదు. మద్రాసులో ఆసభలో ఏం మాటాడేరో తెలుసుకోవాలని ఉంది. ఆవిడ స్వతహాగా చాలా మితభాషి. నేను వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆవిడ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మ్.

  మెచ్చుకోండి

 2. మాలతి గారు,

  నా కోసం మీరు రెండో భాగం పెడితే నేను ఇంత ఆలస్యం గా చదివినందుకు ఏం శిక్ష వేసినా నేను సిద్ధం.
  రెండు భాగాలు కూడా చాలా చక్కగా వచ్చాయి. ఈ కథలు రాశారు, వాటిల్లో ఇతివృత్తం ఇదీ అని రాయటం చాలా తేలిక. కానీ మీరు కేవలం కథల గురించి కాకుండా వాటిల్లోని శిల్పాన్ని, ఏ వైపు నుంచి పాత్రల్ని నడిపించింది కూడా రాసారంటే మీరు ఎంత శ్రమ పడ్డారో ఈ సుదీర్ఘ వ్యాసం రాయడానికి నేను అర్ధం చేసుకోగలను.

  శారదా దేవి గారి కథల్లోని తాత్త్విక చింతన గురించి మీరనంది నిజమే. అది కొందరు ఇతర రచయితల రచనల్లో కనిపించినట్లు తెచ్చి పెట్టుకున్న తాత్త్విక చింతన గా కాకుండా నిజం గా ఆమె వ్యక్తిత్వం గా కనిపిస్తుంది. అలాగే నాకు నచ్చిన మరో అంశం, ఆమె మీద జానకి రామ్ గారి ప్రభావం లేకుండా ( ఉండేమో మరి నాకైతే తెలియదు) తనదైన సొంత వ్యక్తిత్వం తో కథలు రాసినట్లు కనిపిస్తారు.

  నిజంగా ఈ వ్యాసం శారదా దేవి గారు జీవించి వున్న రోజుల్లో వచ్చి వుంటే ఆమె ఎంతో సంతోషించి వుండేవారు. తన కథల గురించి సరిగ్గా అర్ధం చేసుకోవడం కంటే ఒక రచయిత కు కావలసింది ఏముంటుంది? కనీసం ఇప్పుడైనా మీరు రాయటం వల్ల ఆవిడ గురించి తెలియని అనేకమంది తెలుసుకోగలుగుతున్నారు. అది కూడా మంచిదే.

  నాకోసం అని పెట్టేటప్పటికి కొంచెం రెచ్చిపోయి కామెంట్ రాసినట్లు వున్నాను.ఇక ఆపేస్తున్నాను.

  మెచ్చుకోండి

 3. @ అఫ్సర్, మీరు కూడా బ్లాగువైరాగ్యం అంటే ఎలాగండీ. మీరూ బాగా తెలిసినవారే కనక, మీకు తెలిసినరచయితలగురించి మీబ్లాగులో మీరు పరిచయం చేస్తే బాగుంటుంది. ఈనాటి యువతలో చాలామందికి వీరినిగురించి తెలుసుకోవాలన్న కాంక్ష ఉన్నదని తెలుస్తూనే ఉంది కదా. మోనోగ్రాఫ్ – నాతపన కూడా అదేనండీ. ఆధునిక వీరసాహిత్య సామ్రాట్టులు కొ.కు., శ్రీ,శ్రీ . రచనలు మళ్ళీ మళ్లీ అచ్చేసి సాహిత్యసేవ చేసేం అని జబ్బలు చరుచుకునేవారు ఇలాటి మంచిరచయితలను కూడా వెలుగులోకి తెచ్చి, ఈనాటి యువతరానికి పరిచయం చేసే ప్రయత్నం ఎందుకు చెయ్యరు అని. పైన సత్యవతి చెప్పినట్టు అక్కడా, అక్కడా ఓ కథ సంకలనంలో కలిపో, ఆవిడ రాసేరు అని ఓ వాక్యం రాసో పొంగిపోతారు.
  @ అనిల్, మీకు ఆకథలు గుర్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
  @ సత్యవతి, మీరన్నమాట నిజమే. మొక్కు తీర్చుకోడానికన్నట్టు రెండు పేరు ఉచ్చరించి చేతులు దులుపుకోడమే కానీ సమగ్రంగా వారి రచనలు పరిశీలించి, సాధికారకంగా వారిని గురించి చెప్పినవారు నాకు కనిపించడంలేదు. మీకు వీలయితే, లేదా వీలయినప్పుడు నేను తెలుగు రచయిత్రులమీద రాసిన పుస్తకం చూసి, మీ అభిప్రాయాలు రాయండి. పుస్తకం వివరాలు: Quiet and Quaint: Telugu Women’s Writing, 1950-1975. Published by Potti Sreeramulu Telugu University, Hyderabad. 2009. Rs.45.00
  ఇంతవరకూ మాటాడుకోడం జరక్కపోతేనేం లెండి. ఇప్పుడు మొదలుపెడదాం. నా ఐడీ thulikan@yahoo.com.
  మీరు నావ్యాసం చదివి, వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. ఈ మధ్యనే శారదాదేవి గురించి వ్రాయడానికి నాకు ఆవిడ సంకలనాలు రెండే దొరికాయి.ఇప్పుడు మీ వ్యాసం చదివాక మీ వ్యాసం “కాస్త ముందు దొరెకెనా నా వ్యాస మటులుండెడెది కాదే”అని చాలా విచారించాను.శారదాదేవి అనగానే పగడాలు ఒక రోజు ఇట్లా మూడు నాలుగు కధల్నే అక్కడక్కడా “పాత మంచి కధలు శీర్షికల్లో ప్రచురిస్తుంటారు.మీతో అప్పుడప్పుడూ మాట్లాడకపోవడం ఎంత నష్టమో అర్ధ మైంది.నేను మిత్రరత్నాలకు చదవడానికిచ్చి వానజల్లు పారిపోయిన చిలక దాదాపు పదేళ్ళ కింద పోగుట్టుకున్నాను.మీ వ్యాసం చదివాక నేను భూమికలో వ్రాసిన వ్యాసం నాకు నచ్చకుండా పోయినా మనసుకు మాత్రం చాలా హాయిగా వుంది.

  మెచ్చుకోండి

 5. పగడాలు, ఆకలి రెండూ గుర్తున్నాయి.
  మీరన్నట్టు “చక్కటి తెలుగుకథలు చదువుతున్నామన్న ఆనందం కలుగుతుంది. మంచి కథలు చదివేం అన్న సంతుష్టి కలుగుతుంది.” బహుశ అందుకే నేమో ‘ఆ కథలు‌’ గుర్తుండి పోతాయి.
  ఆ తరం కథలని ఈ తరం పాఠకులకి పరిచయం చేస్తున్నందుకు మీకు అభినందనలు.

  మెచ్చుకోండి

 6. మాలతి గారూ:

  ఈ మధ్య బ్లాగు వైరాగ్యం పట్టుకునేట్టున్న సమయంలో ఆచంట శారదాదేవి గారి కథల మీద మీ చక్కని వ్యాసం మళ్ళీ ఇటు లాగింది. కనీసం ఇరవయేళ్ళుగా శారదాదేవి గారి కథలు (ఆ పాత “ఒక నాటి అతిధి” ముఖచిత్రమూ, లోపలి లెటర్ ప్రెస్ తెలుగు అక్షరాలు ఇప్పటికీ మంచి గుర్తు) ఒక తెలియని బాధని కలిగిస్తాయి. మీలాంటి వారు ఎవరయినా, మీ కాలం వారు (ఎందుకంటే, ఈ కాలం వాళ్ళు నాలుగు పుస్తకాలు చదివి పరమ చదువు వీర చక్రాలు ధరించి తిరుగుతున్నారు కనుక) అలాంటి వారి మోనోగ్రాఫు రాస్తే బాగుంటుంది.

  http://www.afsartelugu.blogspot.com

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.