మహాకవయిత్రి ఆతుకూరి మొల్ల – 2వ భాగం

నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఒకొకప్పుడు మనం చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యడానికి “అది కాదు ఇది” అంటూ సాగదీస్తాం. బాలకాండంలో సాకేతపురం ఎలా ఉందో చెప్తూ ఆమె చేసిన వర్ణన చూడండి.

మదనాగయూధసమగ్రదేశము గాని

కుటిలవర్తనశేషకులము గాదు.

ఆహవోర్వీజయహరినివాసము గాని

కీశసముత్కరాంకితము గాదు

సుందరస్యందనమందిరంబగు గాని

సంతతమంజులాశ్రయము గాదు

మోహనగణికాసమూహగేయము గాని

యూధికానికరసంయుతము గాదు

సరససత్పుణ్యజననివాసము గాని

కఠిననిర్దయదైత్యసంఘము గాదు

కాదు కాదని కొనియాడఁ దగినట్టి

పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.

ఈ పద్యానికి నాకు అర్థం తెలీక భైరవభట్ల కామేశ్వరరావుగారిని అడిగేను. అడిగిన వెంటనే కాదనకుండా, ఆయన చక్కని వివరణ ఇచ్చారు. వారు చెప్పిన అర్థం కింద పొందుపరుస్తున్నాను, కృతజ్ఞతతో. (ఇంకా ఇతర ప్రముఖ పద్యాలకి వారి విశ్లేషణ వారి బ్లాగులో చూడవచ్చు. http://telugupadyam.blogspot.com ).

“మదనాగయూధ…” పద్యంలో శ్లేష ఉంది. “నాగము” అంటే ఏనుగు, పాము రెండర్థాలు వస్తాయి. “మదనాగయూధము” అన్నప్పుడు మదించిన ఏనుగుల సమూహము అని అర్థం తీసుకోవాలి. సాకేతపురంలో ఉండే నాగములు ఠీవి కలిగిన ఏనుగులే కాని కుటిలమైన పాములు కావు. అలాగే, “హరి” అంటే గుఱ్ఱము, కోతి అని రెండర్థాలున్నాయి. సాకేతపురంలో ఉన్న హరులు యుద్ధరంగంలో విజయం సాధించిన గుఱ్ఱాలే కాని కోతిమూక కాదు అని. “స్యందనము” అంటే రథము, నీటి ఊట (spring) అని రెండర్థాలు. ఆ పురంలో ఉండే స్యందనాలు అందమైన రథాలే కాని, నీటి ఊటలు (మంజులము అంటే నీటి ఊట) కావు అని. “గణికా” అంటే వేశ్యలు, అడవిమొల్లలు (wild forest flowers) . ఆ ఊరిలోని గణికలు చక్కగా పాటలు పాడే అందమైన వేశ్యలే కాని అడవిమొల్లలు (యూధికా) కాదని.

ఈ అర్థం చూసిన తరవాత నాకు ఈ రామాయణం అందరికీ అర్థమయే సులభశైలిలో ఉందనిపించలేదు  కానీ, కథ మనకి తెలిసిందే కనక కావచ్చు చదువుతుంటే ఇది అంతగా బాధించదు. “కాదు, కాదం”టూ, ఏది అవునో వివరిస్తున్నానని తానే చెప్పడంలో ఆమె గడుసుదనం మాత్రం చూడగలం. .

అలాగే ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తూ కవితలల్లడంలో సొగసు చూడండి. అరణ్యకాండలో సీతని వెతుకుతూ రాముడు తిరుగుతున్న ఘట్టం –

ఏమృగంబును గన్నఁ నేణాక్షి గానవే

యని పెక్కుభంగుల నడిగి యడిగి

ఏపక్షిఁ గనుగొన్న నెలనాగ గానవే

యని పెక్కుభంగుల నడిగి యడిగి

…      …        …

సీత గానఁబడమి శ్రీరామచంద్రుండు

విరహతాపవహ్ని వేఁగి వేఁగి

అంటూ సీతకోసం ఆయన అనుభవించిన వేదనని పాఠకులమనసుకి గట్టిగా తగిలేలా చెప్తుంది మొల్ల. ఈ ప్రయోగం యుద్ధకాండలో నిశేషించి ఇతోధికంగా భావసమన్వితమవుతుంది. మూడు ఆశ్వాసాలలో ఆమె చేసిన యుద్ధవర్ణన చదువుతుంటే స్వయంగా యుద్ధం చూసైనా ఉండాలి, లేదా యుద్ధానికి సంబంధించిన గ్రంథాలు విశేషంగా చదివి అయినా ఉండాలి అనిపించకమానదు.

మొల్ల పదాలు వాడుకోడంలో పొదుపరి, ఆమెకి ఆమెయే సాటి అంటూ మలయవాసిని, ఆరుద్ర సుందరకాండలో రామలక్ష్మణులని వర్ణించమని సీత హనుమంతుని అడిగినసందర్భం ఉదహరిస్తున్నారు. హనుమంతుడు నిజంగా రాముని పంపున వచ్చినవాడవునో, ఇది కూడా రాక్షసమాయేనేమో నన్న సందేహంతో సీత వారిని వర్ణించమంటుంది. అప్పుడు హనుమంతుడు రాముని వర్ణించిన విధానం చూడండి.

సీ. నీలమేఘచ్ఛాయఁ బోలు దేహము వాఁడు

ధవళాబ్దపత్రనేత్రములవాఁడు

కంబుసన్నిభమైన కంఠంబు గలవాఁడు

బాగైనయట్టి గుల్భములవాఁడు

తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాఁడు

పద్మరేఖలు గల్గుపదయుగంబులవాఁడు

చక్కని ఫీనవక్షంబువాడు

తే. కపట మెఱుగఁనిసత్యవాక్యములవాఁడు

రమణి! రాముండు శుభలక్షణములవాఁడు

ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు

వరుస సౌమిత్రి బంగారువన్నెవాఁడు.

రాముని వర్ణించినతరవాత, లక్ష్మణుని గురించి మళ్లీ వేరే చెప్పక్కర్లేదు. ఆయనకి కూడా పైవర్ణనంతా సరిపోతుంది, రంగు మాత్రమే వేరు అని. ఈపద్యం కూడా నేను చిన్నప్పుడు విన్నాను కానీ ఇది మొల్లవిరచితమని ఇప్పుడే తెలిసింది!

పూర్వకవులు మొల్ల పాండిత్యాన్ని స్పృశించినట్టు కనిపించదు కానీ ఆధునికకాలంలో పండితులు కొందరైనా ఆమె కవిత్వాన్ని తమ వ్యాసాల్లో వివరంగానే చర్చించారు.

దివాకర్ల వెంకటావధానిగారు, “తానంత విద్యాసంపన్నురాలు కాదని చెప్పుకొన్నా ఈమె కావ్యమున పాండిత్యలోపమెచ్చటను కానిపింపదు. ఈమె వర్ణనలన్నియు ప్రబంధోచిములయి మిక్కిలి ప్రౌఢముగా నుండును. అందును సాకేతనగరవర్ణనము శ్లేష శబ్దాలంకారపూరితమై ఆమె పాండితీవిశేషమును పలు విధముల సూచించుచున్నది” అంటారు. “ఈమె శైలిని మృదుమధురపద గుంఫితమును, భావబంధురమునై సర్వజనరంజకముగా నుండును”, “ఔచిత్యపోషణలో కూడా అందె వేసిన చేయి” అని కూడా ప్రశంసించారు. (ఆంధ్ర వాఙ్మయచరిత్ర, పు 59-60).

అయితే ఈ ఔచిత్యపోషణవిషయంలో ఆండ్ర శేషగిరిరావుగారి అభిప్రాయం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఆమె స్త్రీలని వర్ణించడంలోనే కాక ఇతర సందర్భాలలో కూడా స్త్రీల అంగాలను ఉపమానాలలో వాడుకుని “పూర్వకవి సాంప్రదాయాన్ని పాటించుట విశేషము” అంటారు. శేషగిరిరావుగారు ఈవిషయాన్ని మూడు పేజీలనిడివిలో చర్చించడం నాకు విశేషంగా అనిపించింది!

నేను ఈవ్యాసం రాయడానికి ఉపక్రమించిన తరవాత, మొల్ల సినిమాగా కూడా వచ్చిందని నాస్నేహితురాలు సౌమ్య చెప్పింది. ఈసినిమా వచ్చేవేళకి అంటే 1970లో నేను ఇండియాలోనే ఉన్నాను. అప్పట్లో సినిమాలు బాగానే చూసేదాన్ని కూడా. అయినా ఎంచేతో ఇది మాత్రం నాదృష్టికి రాలేదు. ఇప్పుడు లైబ్రరీలో పుస్తకాలు చూస్తుంటే ఇంటూరి వెంకటేశ్వరరావు మొల్ల జీవితం ఆధారంగా రాసిన నవల, ఆ నవల ఆధారంగా సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ కనిపించేయి. ఈ నవలవిషయంలో నటుడు చిత్తూరు నాగయ్య కథాగమనంవిషయంలో వెంకటేశ్వరరావుతో విబేధించేరని ఇద్దరూ తమ ముందుమాటలలో చెప్పుకున్నారు. ఆ అభిప్రాయబేధాలు  ప్రత్యేకించి ఏవిషయంలోనో తెలీదు గానీ నాకు అభ్యంతరకరంగా అనిపించిన విషయాలు ప్రస్తావిస్తాను.

ప్రాక్తనకవులగురించి చదువుతున్నప్పుడు సహజంగానే ఆ కాలంలో ఆచారవ్యవహారాలగురించి కూడా తెలుసుకోగలుగుతాం అన్న ఆశ ఉంటుంది మనకి. సుప్రసిద్ధ కవులజీవితాలకీ, ఆనాటి సాంఘికపరిస్థితులకీ అవినాభావసంబంధం ఉంటుంది. మనఅవగాహన కూడా పరస్పరానుబంధంగానే ఉంటుంది. అంటే ఒకటి తెలిస్తే, రెండోది మరింత విపులంగా తెలుస్తుంది. అంచేతే ఏదో ఒక ఎజెండా పెట్టుకుని రచయితలు తమ ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేస్తే, అది సాహిత్యానికి ద్రోహమే అవుతుంది. పలువురి ప్రశంసలు పొందిన ఒక సుప్రసిద్ధ కవయిత్రిని తీసుకుని నవల రాస్తున్నప్పుడు ఆ గౌరవం నిలబెట్టేదిగా ఉండాలే కానీ తమ రాజకీయసిద్ధాంతాలు ప్రచారం చేసుకోడానికి ఆ పాత్రని తమ ఇష్టంవచ్చినట్టు మలచడం ఆపాత్రని అగౌరవపరచడమే అని నా అభిప్రాయం..

వెంకటేశ్వరరావు తమ నవలలో మొల్ల చిన్నతనంలో అనాగరీకంగా, విసృంఖలంగా ప్రవర్తించినట్టు చిత్రించారు. ఆనాటి సాంఘికదురన్యాయాలు దుయ్యబట్టడం మొల్లద్వారా జరిగినట్టు చూపించడంకోసం అలా చిత్రించడం జరిగినట్టుంది. సమర్థుడయిన రచయిత ప్రచారంలో ఉన్న వ్యక్తిత్వాలని యథాతథంగా వాడుకుంటూనే, కథని నడిపించగలడు. గలగాలి. అంతటి బలమైన మరొక పాత్రని సృష్టించలేక, మొల్లని వాడుకున్నట్టు అనిపించింది నాకు ఈనవల చదువుతుంటే. నాదృష్టిలో ఇది నవలారచనలో లోపమే.

రెండో అభ్యంతరం – అలా మొల్ల విశృంఖలంగా ప్రవర్తిస్తుండగా, ఒక దేవదాసి ఉద్బోధనతో జ్ఞానోదయమై, అడవులకు పోతుంది. అక్కడ ఒక సుందరాకారుడు కనిపించి మొల్లకి “ఆడదాని”లా ప్రవర్తించడం, సిగ్గు పడడంతో సహా, నేర్పి ఆమెని “నిజమైన ఆడదాన్ని” చేస్తాడు. ఇది కూడా నాకు అసంబద్ధంగానే అనిపించింది.

ఆమె రచించిన రామాయణంలో అవతారికలోనూ, చివర మంగళాశాసనంలోనూ కూడా  తాను శ్రీగౌరీశవరప్రసాద లబ్ధననీ, గురుజంగమార్చనవినోద, సూరిజనవినుత, నిత్యశైవాచార సంపన్న, కవితాచమత్కారి అయిన ఆతుకూరి కేసయసెట్టి తనయని అనీ, మొల్ల నామధేయను అనీ చెప్పుకుంది. మహాభక్తుడూ, కవీ అయిన కేసయసెట్టి ఇంట పెరిగిన మొల్లని అదుపాజ్ఞలు లేక దుడుకుగా ప్రవర్తించిన అనాగరీకురాలుగా ఊహించడం సమర్థనీయంగా తోచడంలేదు నాకు. అంతేగాదు. ఆమె రచించిన గ్రంథంలో ఎనలేని పాండితీగరిమ ప్రదర్శించింది. అంతటి పాండిత్యం శ్రద్ధగా నిష్ఠతో ఎన్నో గ్రంథాలు చదివితే తప్ప రాదు. పరమ నిష్ఠాగరిష్ఠుడయిన తంఢ్రి శిక్షణలో ఆమె విద్యావతిగానే పెరిగినట్టు కనిపిస్తోంది.

సినిమావిషయం నాస్నేహితురాలు వైదేహికి చెప్తే, తను ఇంటర్నెట్‌లో ఉందని నాకు లింకు పంపింది. సినిమాగా బాగుంది. బహుశా మొల్ల పేరు పెట్టకుండా మరో బలమైన స్త్రీపాత్రని సృష్టించి తీసినా ఆ సినిమాకి లోపమేమీ ఉండేది కాదేమో.

మొల్ల రామాయణం పండితులనీ పామరులనీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. కారణం ఆమె పాండిత్యమే కానీ ఆమె కుమ్మరి వంశజురాలు కావడం కాదు. ఆమెచుట్టూ అల్లినకథలు ఆ కావ్యాన్నే ఆధారం చేసుకుని, ఆ గౌరవాన్ని ఇనుమడించేలా చేయడమే సమంజసం.

మొల్లకి పూర్వం చాలామంది మగకవులు రామాయణాలు రాశారు కానీ మొల్ల రామాయణం మాత్రమే కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచింది అన్నారు ఆరుద్ర సమగాంధ్ర. సాహిత్యం, 2వ సంపుటంలో. ఈ ఒక్కవాక్యం చాలు మొల్ల కవితాప్రౌఢిమ ఎంతటి పటిష్ఠమైనదో ఘనతరమైనదో చెప్పడానికి.

ఈ రామాయణం అంతర్జాలంలో లభ్యం. పాఠకులసౌకర్యార్థం పిడియఫ్ ఫైలు కూడా ఇస్తున్నాను, molla-ramayanam.

000

ఉపయుక్తగ్రంథాలు.

ఆరుద్ర. సమగ్రాంధ్ర సాహిత్యం. 2 సం. హైదరాబాదు, తెలుగు సాహిత్య ఎకాడమీ. 2005 ?

మలయవాసిని, కోలవెన్ను. తెలుగు కవయిత్రులు. వాల్తేరు, ఆంధ్రా యూనివర్సిటీ. 1979.

మొల్ల, ఆతుకూరి. మొల్ల రామాయణం. ఏలూరు. రామా అండ్ కో. 1937. (నెట్‌లో లభ్యం.)

లక్ష్మీకాంతమ్మ, ఊటుకూరి. ఆంధ్ర కవయిత్రులు. 2వ కూర్పు. 1980.

వెంకటేశ్వరరావు, ఇంటూరి. కుమ్మరి మొల్ల. మద్రాసు, ఆంధ్రా ఫిల్ము పబ్లికేషన్స్. 3వ ముద్రణ. 1969.

సత్యనారాయణ, సుంకర. కుమ్మరి మొల్ల (బుర్రకథ). విజయవాడ, విశాలాంధ్ర ప్రచురణాలయం, 1963.

(గమనిక. ఈబుర్రకథ 1963లో ప్రచురించినా, రాయడం 1951లోనే జరిగిందనీ, అనేకప్రాంతాలలో బహుళ ప్రశంసలు పొందిందనీ రచయిత రాసేరు.)

వెంకటావధాని, దివాకర్ల. ఆంధ్రవాఙ్మయచరిత్రము. హైదరాబాదు. ఆంధ్ర సారస్వత పరిషత్తు. 1961.

శేషగిరిరావు, ఆండ్ర.. ఆంధ్ర విదుషీమణులు. రచయిత, 1995.

Lalita, K. and Tharu, Susie. Eds. Women Writing in India. 600 B.C. to the Present. V.1. New York: The Feminist Press, 1991. pp.95-96.

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మహాకవయిత్రి ఆతుకూరి మొల్ల – 2వ భాగం”

  1. అనిలు, మీరు ఎందుకు కాదనుకుంటున్నారు. నేను నావ్యాసంలో రాసినట్టు పుస్తకమూ, సినిమా చూసే రాసేను. నేను రాసిన సమాచారం కరెక్టే.!

    మెచ్చుకోండి

  2. “వెంకటేశ్వరరావు, ఇంటూరి. కుమ్మరి మొల్ల. మద్రాసు, ఆంధ్రా ఫిల్ము పబ్లికేషన్స్. 3వ ముద్రణ. 1969.” కాదనుకుంటాను.
    “కథానాయిక మొల్ల” అన్నట్టు గుర్తు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s