మహాకవయిత్రి ఆతుకూరి మొల్ల

“కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. మొల్ల రామాయణంలో అవతారికలో మొల్ల స్వయంగా చెప్పుకున్వవి ఆమె నెల్లూరు మండలంలో గోపవరంగ్రామంలో జన్మించింది అనీ, తండ్రి ఆతుకూరి కేసయ సెట్టి అని మాత్రమే మనకి తెలిసిన వివరాలు. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ లేని ఇతరకథలు చాలానే ఉన్నాయి. నిజానికి రాధికాస్వాంతనం రాసిన ముద్దుపళనిని తప్పిస్తే, పూర్వకవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో.

మొల్ల రామాయణం ఒక్కటే అందరికీ తెలిసిన ఆమెరచన. ఆమె ఇంకా ఏమైనా రచనలు చేసిందో, లేదో, అవి దొరుకుతాయో లేదో తెలీదు. కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగువారు కాని పండితులదృష్టిని ఆకర్షించడం విశేషం. తొలిసారిగా నేను గమనించింది మొల్ల రామాయణంలో 2400 శ్లోకాలు రాసిందని “మానుషి” అన్న ఇంగ్లీషు పత్రికలో చూసినప్పుడు. (తరవాత ఆ వాక్యం తొలగించబడింది). ఆతరవాత లలిత, తారూ రాసిన “Women writing” అన్న పుస్తకంలో కూడా మొల్లరామాయణంలో పద్యాలని శ్లోకాలనే వ్యవహరించేరు. అప్పుడే నాకు మొల్లగురించిన ఆసక్తి మొదలయింది. ఇవి చదివినప్పుడు నాకు తోచిన మొదటిఆలోచన శ్లోకం అన్నది సంస్కృత సాంప్రదాయవిశేషం. మొల్ల జానుతెలుగులో రాయపూనుకున్న కవయిత్రి. ఆమె రచనని శ్లోకాలు అనడం ఆమెకి ఒక పాండిత్యస్థాయిని కల్పించడంకోసమేమో అనిపించింది.  ఆరుద్ర మొల్ల రామాయణంలో ఉన్నవి 871 గద్యపద్యాలు అనీ, ప్రస్తుతం లభ్యమయిన ప్రతులు సమగ్రమయినవి కాకపోవచ్చు అనీ రాశారు (సమగ్రాంధ్ర సాహిత్యం, సం.2.). నాకు దొరికిన ప్రతిలో పద్యాలూ, వచనం ఒకే వరసలో లెక్కించి, మొత్తం ఆరుకాండలలో 880 ఉన్నట్టు చూపించారు. అందులో వచనంగా గుర్తించిన భాగాలు 208. అవి కొన్ని కేవలం ఒకటి రెండు మాటలు “అట్టి సమయంబున,” “అని మఱియును” లాటివి అయితే, కొన్ని దాదాపు ఒకపేజీ నిడివి ఉన్నాయి. మరో రెండు, మూడు చోట్ల గద్య అని కూడా ఉంది. దీనికి పీఠిక రాసినవారు (పరిష్కర్త కావచ్చు) క.కో.రా. అని ఉంది కానీ ఆయనెవరో నాకు తెలీదు. కవి కోరాడ రామకృష్టయ్యగారేమో.

మొల్లనిగురించి తెలిసింది చాలా తక్కువ అని మొదట్లో చెప్పేను. చదువుతున్నకొద్దీ, నాకు అబ్బురం అనిపించిన కొన్ని విషయాలు ముందు ప్రస్తావిస్తాను.

మొదటిది ఆమెపేరు “కుమ్మర” మొల్లగా ప్రచారం కావడం. నేను చూసినంతవరకూ మరే ఇతర కవిని గానీ కవయిత్రిని గానీ కుల, వృత్తులపేరుమీదుగా ప్రస్తావించినట్టు కనిపించదు. ఆమె తనకు తానై ఎక్కడా తనపేరు “కుమ్మర మొల్ల” అని చెప్పుకోలేదు. మరి ఈ కుమ్మర అన్నపదం ఇంటిపేరుకి మారుగా ప్రాచుర్యంలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు.

పూర్వకవులు తమగ్రంథాదిని కులగోత్రాలు, వంశక్రమం చెప్పుకోడం సాంప్రదాయం. మొల్ల తాను రచించిన రామాయణానికి అవతారికలో “గురులింగజంగమార్చనపరుడు, శివభక్తరతుడు, బాంధవహితుడు” అయిన కేసయసెట్టి తనయనని చెప్పుకుంది. తండ్రినిగురించి రాస్తున్నప్పుడు కూడా కులప్రసక్తి కానీ వృత్తి ప్రసక్తి కానీ చేయలేదు. అంచేత, ఈ కుమ్మర నామవిశేషణం ఆమెపేరుకి ముందు తగిలించడం, ఆధునికయుగంలో పరిష్కర్తలూ, ప్రచురణకర్తలూ చేసిన నిర్ణయంగానే కనిపిస్తోంది తప్ప మొల్ల అభిమతంగా తోచదు.

రెండవ అంశం “మొల్ల” అన్న పేరు ఆధారంగా పండితులు ఆమెవృత్తి లేక కులం నిర్ణయించ పూనుకోడం. ఆండ్ర శేషగిరిరావుగారు “ఆంధ్రవిదుషీమణులు” అన్న గ్రంథంలో ఈ విషయంలో విపులంగా చర్చించేరు. స్థూలంగా ఆయనపుస్తకంలో వివరాలు – మొల్ల మల్లియజాతికి చెందినపువ్వు. పూర్వకాలంలో పువ్వులపేర్లు వేశ్యలు మాత్రమే పెట్టుకునేవారు. అంచేత ఆమె వేశ్య కావచ్చునని ఒక వాదన. ఈవాదనకి ప్రతిగా కనుపర్తి వరలక్ష్మమ్మగారు మొల్ల తన రామాయణంలో వేశ్యలగురించి ప్రస్తావించినతీరు చూస్తే, ఆమె వేశ్య కాదని స్పష్టంగా తెలుస్తుందంటారు. శేషగిరిరావుగారు కూడా ఆమె కులటాంగన కాదనే నిర్ధారించేరు.

మొల్ల కాలనిర్ణయం చేసినప్పుడు కూడా ఆమె రామాయణంలోని అవతారికే ఆధారమయింది. అందులో ఆమె గౌరవపురస్సరంగా పేర్కొన్న పూర్వకవులు ఆధారంగా ఆమె పదహారవ శతాబ్దం కృష్టదేవరాయలకాలంలో జీవించి ఉండవచ్చునని పండితుల అభిప్రాయం. ఇక్కడ నాకు కలిగిన సందేహం –  మొల్ల తన రామాయణంలో పేర్కొన్నకవులు గుర్తుగా వారి జీవితకాలం ఆధారంగా ఆమె కాలనిర్ణయం చేసేరు కానీ ఆమెతరవాతి కవులు ఎవరైనా ఆమెని పేర్కొన్నారో లేదో వివరించలేదు. నేను సాహిత్యమంతా తరిచి చూడలేదు కానీ పైన పేర్కొన్న పండితులు పేరెన్నిక గన్నవారే. వారి వ్యాసాలలో ఈ ప్రస్తావన లేదు. శేషగిరిరావుగారు ఏదో ఒక ఉదాహరణ చెప్పేరు కానీ మళ్లీ అది మొల్లగురించి కాదేమోనన్న సందేహం కూడా వెలిబుచ్చారు. మరి మొల్లని ఆమెకాలంలోనూ, ఆ తరవాతా ఎవరైనా ఆమెను రామాయణకర్త్రిగా గుర్తించి ప్రశంసించేరా లేదా, ఈ విషయంలో పరిశోధన ఏమైనా జరిగిందా లేదా అన్నది తెలిసినవారెవరైనా చెప్పాలి.

విద్య మాటకొస్తే, తాను అట్టే చదువుకోలేదని ఆమె వినయంగా చెప్పుకున్నా, ఆమెరచనలో చమత్కారాలూ, పాండిత్యప్రకర్షా, పూర్వకవుల గ్రంథాల్లో భాషగురించి ఆమె చేసిన వ్యాఖ్యానాలు చూస్తే, ఆమె విస్తృతంగా కావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నట్టే కనిపిస్తుంది. ఉదాహరణకి, అవతారికలో ఈ పద్యం చూడండి.

దేశీయపదములు దెనుగు సాంస్కృతుల్

సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి

శయ్యలు రీతులుఁ జాటు ప్రబంధము

లాయా సమాసంబులర్థములును

భావార్థములుఁ గావ్యపరిపాకములు రస

భావచమత్కృతుల్ పలుకుసరవి

బహువర్ణములును విభక్తులు ధాతు లం

లంకృతి చ్ఛంధోవిలక్షణములుఁ

గావ్యసంపదక్రియలు నిఘంటువులును

గ్రమములేవియు నెఱుఁగ విఖ్యాత

గోపవరపు శ్రీకంఠమల్లేశు వరముచేత

నెఱి కవిత్వంబు జెప్పఁగా నేర్చికొంటి.

పైపద్యంలో వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, శయ్యలు, సమాసములు, విభక్తులూ, భావ చమత్కృతులూ, వాటి క్రమం తెలియదంటూనే అంత చిట్టాఆవర్జాలు వల్లించడం ఏమీ తెలీనివారికి సాధ్యం కాదు కదా. అంతే కాదు, తాను సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణానికి తెలుగుసేత చేస్తూ, మళ్లీ అందులో సంస్కృత సమాసాలు వాడడం సముచితం కాదంటుంది.

తాను అలా “కావ్యసంపదక్రియల” జోలికి పోనని చెప్పి, పదం చూడగానే పాఠకుడికి అర్థం తోచాలనీ, లేకపోతే ఆ రచన మూగ, చెవిటివారు ముచ్చటలాడినట్టే ఉంటుందంటూ హాస్యమాడుతుంది.

తేనె సోఁక నోరు తీయన యగురీతి

తోడ నర్థమెల్లఁ దోఁచకుండ

గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము

మూఁగచెవిటివారి ముచ్చట యగును.

నాలుకకి తేనె తగలగానే నోరు తీయన అయినట్టే పదానికి అర్థం చదివినవెంటనే పాఠకుడికి స్ఫురించాలి అని ఆమె భావన!

తెలుగుదనం ఉట్టిపడే పదకేళి “రాముడు గీముడుంచు”, “విల్లా ఇది కొండా”, “సందుగొందులు దూరిరి” లాటివి ఉన్నాయి. సాయంశోభని వివరిస్తూ చెప్పినపద్యాలలో మచ్చుకి ఒకటి –

మేలిమి సంధ్యారాగము

వ్రాలిన చీకటియు గఁలిసి వరుణునివంకన్

నీలముఁ గెంపును నతికిన

పోలికఁ జూపట్టే నట నభోమణి తలగన్.

సాయంకాలపు నీరెండ, కమ్ముతున్న చీకటులతో కలిసి నీలాలూ, కెంపులూ ఆకాశంలో అతికినట్టున్నాయిట.

పాఠకులమనసుని అలరించే చమత్కారాలూ (కందువలు) సామెతలూ కూర్చి అందంగా చెప్తే వీనులవిందుగా ఉంటుంది అంటుంది మొల్ల.

కందువమాటలు సామెత

లందముగాఁ గూర్చి చెప్ప నది తెలుఁగునకుం

బొందై రుచియై వీనుల

విందై మరి కానుపించు విబుధులమదికిన్.

ఆండ్ర శేషగిరిరావు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మవంటి అనేక ప్రముఖులు మొల్ల తన రామాయణాన్ని జానుతెనుగులో, సులభశైలిలో సకలజనులకూ అర్థమయేరీతిలో రాసింది అని మెచ్చుకున్నారు. మొల్ల కూడా అలాగే తన రామాయణం “మూగ చెవిటి ముచ్చట” కాకుండా ఉండేలా రాయదల్చుకున్నట్టు చెప్పుకుంది. ఆమెరచనలో చవులుఁ బుట్టు జాతీయాలు కోకొల్లలుగానే ఉన్నా, సంస్కృత సమాసాలు, ముఖ్యంగా యుద్ధవర్ణనలో, నాయకీ, నాయకుల వర్ణనలలో క్లిష్ట భూయిష్టమయిన సంస్కృతసమాసాలు చాలానే కనిపించేయి నాకు మాత్రం. చాలాచోట్ల అర్థంకోసం తడుముకోవలసివచ్చింది. “జాను తెనుగు,” “వాడుకభాష” లాటి పదాలకి ఆనాడు ఉన్న అర్థాలు ఈనాడు అన్వయించుకోలేం అనుకోవాలి మనం.

మూలరామాయణంలో లేని కొన్ని సన్నివేశాలు మొల్ల స్వతంత్రించి ఇతర రామాయణాలనుండి స్వీకరించడం జరిగింది. వాటిలో ఒకటి అయోధ్యకాండలో రాముడు స్వర్ణనది దాటేముందు గుహుడు ఆయనపాదాలు కడగడం.

సుడిగొని రాముపాదములు సోఁకి ధూళివహించి  ఱాయెయే

యేర్పడ నొక కాంతనయ్యెనఁట పన్నుగనీతని పాదరేణువి

య్యడవడి నోడసోఁకనిదియేమగునో యని సంశయాత్ముఁడై

కడిగెగుహుండు రాముపదకంజయుగంబు భయమ్ముపెంపునన్.

ఈ సన్నివేశం వాల్మీకిరామాయణంలో లేదు కానీ అధ్యాత్మరామాయణంలో ఉందని ఆరుద్ర అంటున్నారు. అలాగే మరో సన్నివేశం – పరశురాముడు రాముని ఎదుర్కొని కయ్యానికి కాలు దువ్వడం కూడా వ్యాస రామాయణంలో లేదనీ, భాస్కరరామాయణంనుండి తీసుకున్నదనీ అంటున్నారాయన. వీటివల్ల మొల్ల విస్తృతంగా తెలుగు, సంస్కృతగ్రంథాలు చదివిందనే అనుకోవాలి. ఈ గుహుడికథ చిన్నప్పడు  నాలుగోక్లాసు, ఐదోక్లాసు వాచకాల్లో ఉండేది. ఈ కథ అంత ప్రాచుర్యం పొందడానికి మొల్ల రామాయణమే కారణం కావచ్చు

(తరువాయి భాగం ఇక్కడ.)

(ఈవ్యాసం తొలిసారిగా ప్రచురించిన పుస్తకం.నెట్ వారికి కృతజ్ఞతలు.)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “మహాకవయిత్రి ఆతుకూరి మొల్ల”

 1. ఆలస్యంగా చూస్తున్నాను.
  పద్యమా శ్లోకమా అనే విషయంలో ఆయా ఆంగ్ల వ్యాసాలు రాసిన రచయిత్రులకి స్పష్టమైన అవగాహన ఉండకపోవచ్చును. లలితగారు కూడా నాకు తెలిసినంతలో ప్రాచీన తెలుగు సాహిత్యం బాగా తెలిసిన వారు కాదు.
  మొల్ల జానుతెనుగులో రాస్తానని చెప్పినాక కూడా కొన్ని చోట్ల విరివిగా సంస్కృతం వాడడం – వర్ణనకీ, యుద్ధ ఘట్టాల్లో ఆ బీభత్స గాంభీర్యానికీ సంస్కృత పదబంధాలే తగును అనే భ్రమ కావచ్చును.
  అవతారికలో తనకేమీ తెలియదని చెప్పుకోవడం – ఇది కొంత విచిత్రం. కోన్‌కిస్కా కవులు కూడా నేనింత పిస్తా, అది చేస్తా, పొడిచేస్తా అని గొప్పలు చెప్పుకున్న వాళ్ళే. అంచేత ఈవిడ ఇలా చెప్పటం కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తున్నది.

  ఇష్టం

 2. @ అనిల్,
  1. తొలగించబడిన వాక్యం మానుషి ఇంగ్లీషు పత్రికలో శ్లోకాస్ అన్న పదం ఉన్నది. అది రాసింది బెంగాలి పండితురాలు నబొనీతదేవ్ సేన్.
  2. లలితా, తోరూ పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. వీళ్లిద్దరూ హైదరాబాదులోనే ఉన్నారనుకుంటాను. వీరిలో లలిత తెలుగావిడే. ఆవిడకయినా వాటిని శ్లోకాలు అనరని ఎందుకు తెలీలేదో నాకర్థం కాదు.
  3. చాలామంది తెలుగువారు కానివారు, ఉదా. మానుషిలో రాసినావిడ బెంగాలీ స్కాలర్ నబొనీత దేవ్ సేన్, అలాగే మరికొందరు ఇంగ్లీషు పండితులు కూడా మొల్ల రామాయణం చర్చించారు. ముఖ్యంగా దాన్ని Sita sings blues అన్న మోటోతో ఫెమినిస్ట్ కోణంలో.
  మీవ్యాఖ్యకి ధన్యవాదాలు
  – మాలతి

  ఇష్టం

 3. ఇప్పుడు ఆవాక్యం తొలగించబడింది. ఏ వాక్యం?
  ఆతరవాత లలిత, తారూ (వీరేవరో) రాసిన “Women writing” అన్న పుస్తకంలో కూడా శ్లోకాలనే వ్యవహరించేరు మొల్ల రామాయణంలో పద్యాలని.
  కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగులు కాని పండితుల (సరిగ్గ అర్ధం కాలేదు ) దృష్టిని ఆకర్షించడం విశేషం.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s