ఊసుపోక – అడక్కండి మరి

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని మనకో సామెత. అంటే అడగడం తేలిక అని. ఆమాటకొస్తే చెప్పడం కూడా తేలికే. పుట్టి, బుద్ధెరిగి ఎన్నిసార్లు విన్నానో ఆడి తప్పకు, చెప్పుడుమాటలు వినకు లాటివి. “చెప్పినట్టు వినకపోతే చెడిపోతావురా నాయనా” అంటూ అడిగినా అడగకున్నా చెవినిల్లు కట్టుకుని పోరేవారిమాట సరే సరి.

చెప్పడం తేలికే చెయ్యడం కష్టం కానీ. మాటవరసకి నాకే దారినపోయే దానయ్యమీద కోపం వచ్చిందనుకోండి. “అలా కోపం తెచ్చుకోకూడద”ని చెప్పేవాళ్లు కనీసం రోజుకి నలుగరయినా తగల్రూ?అది విన్నప్పుడల్లా “పోనీ, మీరు చెప్పండి అలా కాకపోతే ఎలా తెచ్చుకోవాలో” అని అడగబుద్ధేస్తుంది నాకు. ఇంట్లో అమ్మా, నానమ్మా, పెద్దమ్మా, ఊళ్ళో ప్రాణస్నేహితులు, ఆఫీసులో ఆనందరావులూ – అందరూ మనకి ఉపదేశాలు ఇచ్చేసేవాళ్ళే, దాదాపు ఆదేశాలిచ్చేస్తున్నట్టే ఉంటాయవి.

“తన కోపమె తన శత్రువు” అని విజ్ఞులు గాఠ్ఠిగా పాఠాలు చెప్పేస్తారు. “నీకోపం నిన్నే తినేస్తుంది” అని సైకాలజిస్టులు – ఉచిత కాదులెండి డబ్బుచ్చుకునే – బోధ చేస్తారు. ఆపైన ఇరుగమ్మా పొరుగమ్మా, “పోనిద్దూ, వాడి పాపాన వాడే పోతాడు లేదా దానిపాపాన అదే పోతుంది లెస్తూ” అంటూ సామరస్యం గరుపుతారు. చేపలబజారులో సంద్రాలు “పోన్లెండమ్మా. ఏటుండిపోతాది, ఆల పాపం ఆలనే కట్టి కుడుపుతాది. నీకేల తామసం” అంటూ తత్త్వాలు వివరిస్తుంది. నాకు తెలీక, నిజంగా తెలీకే అడుగుతున్నా వీళ్ళల్లో ఒక్కరైనా అస్సలెప్పుడూ అలా కాకపోతే మరోలా కోపం తెచ్చుకోలేదా అని.

సరేలెండి అడగడంతో మొదలెట్టి చెప్పడంలోకి దిగిపోయేను. మీరేమో “అదేమిటి?” అని అడగలేదు -:). సరే నేనే వస్తాను అడుగుటతీరుతెన్నులు సమస్యకి. క్లాసులోనూ పండితసభల్లోనూ, నలుగురు కూడినచోట అడగడాలూ ఉంటాయి, చెప్పడాలూ ఉంటాయి మరి. అది మానవనైజంలో తప్పనిసరి భాగం.

అసలు “నన్నడిగితే” అనగానే మీకు “నిన్నెవరడిగేరు” అనాలనిపిస్తుంది. కానీ మీరలా అంటే కట్, కట్, కట్. మాటలూ పాటలూ కట్టయిపోతాయి. అది చాలా అడ్డగోలు ప్రశ్నకింద జమ అవుతుంది. అడుగులోనే హంసపాదు. అంచేత మరే ప్రశ్నలు అడక్కుండా నేను చెప్పేది వినండి. మళ్లీ మీకు ఏదో సందేహమో, అనుమానమో, తగిలినట్టుంది. ముందసలు మీరడక్కండి. నేను చెప్పేది వినండంతే.

చిత్తగిస్తున్నారా? సరే. చెప్పొచ్చేదేమిటంటే, అడగడం ఒక కళ. దానికి సాధన కావాలి. ఏకాగ్రత కావాలి. అంటే చెప్పేవాడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి. ఆతరవాత ఏం అడగాలో తెలియాలి. ఉదాహరణకి, మీరు లెక్కలమేష్టర్ని నాలుగో డైమెన్షనుగురించి అడుగుతారేమో కానీ తెలుగు పద్యానికి ప్రతిపదార్థం అడగరు కదా. ఆ లెక్కలమేష్టరుకి తెలుగు పద్యాలు కూడా తెలిసుంటే సరే అనుకోండి. ఇప్పుడు మరో ప్రశ్న. ఆయనకి వచ్చో రాదో ముందు తెలుసుకోవాలి కదా. దానికి మరెవరినైనా అడగాలి “ఏమండీ లెక్కల మాష్టారిని తెలుగు పద్యానికి అర్థం అడగనా?” అని. ఆయన్నే కూడా అడగొచ్చనుకోండి. కానీ అలా అడిగినప్పుడు మీకు నిజము తెలుస్తుందన్న భరోసా ఉండాలి.

“నాకు తెలీదండీ” అని చెప్పడానికి ఆయన సిగ్గుపడి, “వీడికెలాగా ఏమీ తెలీదు కదా, నేనేం చెప్తే అదే నమ్మేస్తాడు” అని ఆయనకి తోచిందో లేదా కల్పించో చెప్పేస్తారనుకోండి. మీరదే వేదం అనుకుని, దానిమీద ఓ టపా రాసేసి మరో పదిమందికి పంచిపెట్టేయొచ్చు. (ఇందలి నీతి  – కథలు ఇలాగే పుట్టును) లేదా, ఆయనమాట మరియు కథమీద నమ్మకం కుదరక, నెట్టెక్కి, నాలుగు కీలు నొక్కి ఏ కామేశ్వరరావుగారి సైటులోనో అసలు నిజం కనుక్కోవచ్చు. “ఇంత శ్రమెందుకూ, మిమ్మల్నడిగే బదులు మేం ఆసైటుల్లోనే నేరుగా చూసుకోవచ్చు” కదా…అంటే అమ్మో మీకు తెలివొచ్చేస్తోందన్నమాటే. నిజమే. అలా కనుక్కోవచ్చు కానీ అందులో ఇంత వినోదం ఏమైనా ఉంటుందా? లేదు. మీకు మీరే అలా సమాధానాలు కనిపెట్టేసుకుంటేనూ, మీ సమస్యలన్నీ పరిష్కరించేసుకుంటేనూ మీకు సామాజికదృక్పథం లేదని నేననుకోవలసివస్తుంది. ఎందుకంటారా? హమ్మయ్య, అడిగేరు కదా, ఇప్పుడు చెప్తాను. అవునూ, అన్నట్టు మీరేమిటి అడిగేరు?

నేను కొంతకాలం కొందరికి తెలుగు పాఠాలు చెప్పేనని మీకెరికే కదా. మరి వాళ్ళకి తెలుగొచ్చిందా అని అడక్కండి. అంటే ఇది అడగకూడని ప్రశ్నకి ఉదాహరణ.

మరో సన్నివేశం తీసుకుందాం. చాలామందికి అడగడానికి మొహమాటంగా ఉంటుంది. “నన్నడిగేంతటివాడివయావా?” అని పెద్దలు కోప్పడతారని భయం కొంత. “పెద్దలు వారితో మనకేల?” అని అడగక్కుండా సరిపెట్టుకునేవారు కొందరు.

అసలు లక్ష్మీదేవి అంతటిమహాతల్లికి కూడా ఆ సంశయం వచ్చేసిందంటే అడగడం ఎంత నికృష్టమో ఆలోచించండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి సరసవినోదకేళిలో సరదాగా ఆవిడ చెంగు పుచ్చుకు లాగబోయే సురుచిరసమయంలో గజేంద్రుడు అడగనా వద్దా అని ఆలోచించకుండా నన్ను రక్షించవా అని అడిగేశాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు సిరికిన్ జెప్పకుండా, శంఖుచక్రంబున్ చేదోయి సంధింపకుండా లేచిపోయేడు. మరి ఆయనగుప్పిట్లో ఆవిడ చీరచెరగుంది కనక ఆవిడకి ఆయనవెంటపడక తప్పదు. (ఆడవాళ్ళు భర్తలగుప్పిళ్లలో ఇట్లే చిక్కుదురు). ఇంతకీ గబగబా ఆయనవెంట పడి పోవడమే కానీ “ఎక్కడికండీ?” అని అడగడానికి ఆవిడకి సందేహం మరి – అడిగిన తనమగడు నుడువడని.

అలా ఆవిడ అడుగులేస్తూ తీస్తూ అడగనా వద్దా అన్న సందిగ్ధావస్థలో పడిపోయిందిట. నిజమే మరి. జవాబు చెప్పరని తెలిసి ఎవరు మాత్రం అడిగి తమని తాము కించపరుచుకోడానికి సిద్ధపడతారు.

ప్రప్రథంగా అడగడంలో మొదటిబాధ అది. అడగడం అంటే “నాకు తెలీదు, మీకు తెలుసు, మీకు తెలిసిన బ్రహ్మరహస్యములు నాకున్ జెప్పి నన్ను తరింపజేయుడు” అని. బిచ్చం అడుగుకోడానికీ జ్ఞానం అడుగుకోడానికీ తేడా స్థాయిలోనే. ఈజగన్నాటకంలో రెండు సీనులలోనూ పాత్రలు అవే – ఇచ్చేవాడూ, పుచ్చుకునేవాడూ.

అంత సదసద్విమర్శ మనసులో చేసుకుని తీరా అడిగినతరవాత అవతలిమనిషికి తెలీకపోతే మరింత  కష్టం. అవతలాయనకి కూడా చిన్నతనమే కదా. అలా మనమూ వాళ్లూ చిన్నతనాలు పోతూ … చాలా చాలా ఇరుకున పడి కొట్టుకోవలసివస్తుంది ఏతావాతా. లేదా, మనం అడిగేం కదా అని ఆయన

“నాకు తెలీదండీ” అనకుండా ఆపక్కవాళ్ళనో ఈ పక్కవాళ్ళనో అడిగి చెప్పొచ్చు. లేదా, ఆయనకి తోచిందేదో చెప్పొచ్చు. అలా తోచింది చెప్తే మాత్రం తప్పేముంది? మనం అడగనిప్రశ్నకి చెప్పేరన్నమాట. ఏదోలెద్దురూ, కనీసం సంభాషణ సాగింది కదా. అసలు అడగడాలూ, చెప్పడాలూ, అప్పచెప్పడాలూ, (అంటే విన్నవీ కన్నవీ, కననివీ) – ఇవన్నీ ఏమిటంటారు. కేవలమూ ఊసుపోకకి కాకపోతే ఇలా తెలుసుకున్నసంగతులమూలంగా మనం పండితులమయిపోతామేమిటి మీ భ్రమ కానీ!

నాచిన్నప్పుడు మాక్లాసులో ఓ అబ్బాయి ఉండేవాడు. అతనంతే. పరీక్షల్లో అడగనిప్రశ్నలకి జవాబులు రాసేవాడు.

“అదేం?” అంటే “అసలు పరీక్షలెందుకండీ? నాకెంత తెలుసో మీకు తెలియడానికే కదా. మీరడిగిన దానికంటే నాకు ఎక్కువే తెలుసని నేను ఋజువు చేస్తున్నాను ఇలా అడగనిప్రశ్నలకి జవాబులివ్వడంద్వారా. అంచేత మీరు నాకు నిజానికి నూటొక్క మార్కులివ్వాలి” అని దబాయించేవాడు. పాపం, మామాష్టారు కూడా మార్కులేసేసేవారు నిజమే కదా అని. ఇంకా, “పోనీ పాపం, ఏదోరకం తెలివి ప్రదర్శించేడు కదా. అయినా నేను వాడికి ఇవ్వగల ఆస్తులేమీ ఎలాగా లేవు. నాలుగుమార్కులెక్కువేస్తే నాసొమ్మేం పోయిందీ. నిజానికి వాడికి తెలిసిన ఆ ఫలానాసంగతులన్నీ భవిష్యత్తులో జీవితంలో పనికిరావనేముందీ …” ఇలా ఆయనధోరణిలో ఆయన చెప్పుకుపోయేవారు. తెలిసింది కదూ మనం అడిగినప్రశ్న అది కాదని…

ఎందుకొచ్చినబాధ. అడక్కుండా ఉంటే సరిపోతుంది అంటారా. లేదండీ. నేనలా అనుకోను. అడగాలి, అడిగించుకోవాలి, ఆడించుకోవాలి, చెప్పాలి, చెప్పించుకోవాలి, చెప్పుదెబ్బలు… అయ్యో తప్పుమాటొచ్చింది, షమించాలి..

అయినా అందరూ అడగ్గానే చెప్పేస్తారేమిటి? మొత్తం ఎంటైర్ ప్రపంచంలో ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు మహానుభావులు. మీరు అడగాలే కానీ చెప్పడానికి మేం లేమా అంటూ ధైర్యసాహసాలతో ప్రకటించుకోగలవారు. ఈసారి మీకు సందేహం వచ్చినప్పుడు వారిదగ్గరికి వెళ్ళండి. మీప్రశ్నకి జవాబు రాలేదూ … …అయ్యో, అదేమిటి లేచిపోతారేం. ఉండండుండండి … హుమ్.

000

(ఆగస్ట్ 4, 2010.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

24 thoughts on “ఊసుపోక – అడక్కండి మరి”

 1. ఐదేళ్ళ తరవాత మళ్ళీ ఇప్పుడూ చదివితే కూడానూ, 2010లో ఏ భాగాన్ని గురించి కామెంటానో ఆ భాగమే మళ్ళీ నా కళ్ళనాకట్టుకుంది! మరి ఈ ఐదేళ్లలో నా బుర్ర ఏ మాత్రం మారెలేదో ఏవిటో? ఇది ఇప్పుడెవర్నడగాలో? 🙂 🙂

  మెచ్చుకోండి

 2. కొందరు తెలుసుకోవలనుకుంటారు వాళ్లకి ఎటువంటి జిజ్ఞాస ఉండదు ఊరికే చెప్పేవాళ్ళున్నారని అడుగుతారు..కొందరు ప్రశ్నిస్తారు? మళ్లీ ఇందులో రెండు రకాలు వాళ్లకి తెలిసి మనల్ని అడుగుతారు మనకి తెలుసో లేదో తెలుసుకోవడానికి.కొందరు నిజంగానే అడుగుతారు…నా పద్యం ఒకటి గుర్తొస్తోంది “దేహమ్ము జీవమ్ము ఈశ్వరవాదమ్ము సందేహమ్ము నుండే సమస్తముదయించే ప్రశ్నించు వానికే దొరుకు పరమాత్మ వాస్తవమ్ము సుమ్మి వాసుధమాట.”

  మెచ్చుకోండి

 3. 🙂 ఒక మణికట్టు విరిగిన సందర్భంలో కొన్ని ఆడియోలు చేసేను. తరవాత పాఠం పెట్టగలిగేక, అవి తీసేసేను ముఖ్యంగా కొందరు అవి తెరుచుకోడం లేదు అన్న తరవాత.

  మెచ్చుకోండి

 4. ఇద్దోక్కటి చదివేసి నిద్రపోతాం అనుకోని మొదలు పెట్టాను… నవ్వుకొంటూ ఇప్పుడే ముగించాను. అందరూ ఆడియో, వీడియో అంటున్నారు .. ఆ లింకులు నాకు కనపడలేదండి. ఇంకెక్కడైనా షేర్ చేసి ఉన్నారా?

  మెచ్చుకోండి

 5. @ శ్రీలలితగారూ, అభినందనలు. చాలా సంతోషంగా ఉందండీ మీరు నాకథని విశ్లేషించడానికి ఎంచుకున్నారంటే. కథాజగత్ సైటులో మీ విశ్లేషణ ఎక్కడుందో కనిపించలేదు. దయచేసి, లింకు ఇవ్వండి.
  పోతే, మీరు పద్ధతి అంటూ మీరింత ఆలస్యం చేయాలా. మంచి వార్త ఎలా చెప్పినా సంతోషమే. మరొకసారి అభినందనలతో, – మాలతి
  @ కల్పన, విజృంభించడానికేముందిలే. హీహీ. థాంక్స్.

  మెచ్చుకోండి

 6. మాలతిగారూ,
  నేను అసలు ఇక్కడ మీ టపాకు కామెంట్ పెట్టాలి. కాని ఒక విషయం చెప్పకుండా కామెంట్ పెట్టడం ఉచితం కాదనే ఉద్దేశ్యంతో ఈ చోటు ముందు దానికి ఉపయోగించుకుంటున్నాను. అసలు ఈ విషయం మీకు పధ్ధతి (formal)గా చెప్పాలని చాలా రోజులనుంచి నేను అనుకుంటున్నాను. కాని అంత పధ్ధతిగా చెప్పే ప్రయత్నంతో రోజులు గడిచిపోతున్నాయి తప్పితే పని మాత్రం జరగలేదు. ఆఖరికి ఇంక ఏదోరకంగా మీతో ఈ విషయం చెప్పాలని ఇక్కడ వ్రాస్తున్నాను.
  విషయమేమిటంటే..
  మీరు వ్రాసిన “రంగుతోలు” కథ పై నేను వ్రాసిన విశ్లేషణకు కథాజగత్ లొ నాకు తృతీయ బహుమతి వచ్చింది. కథలో మీరు చెప్పిన భావాన్ని నేను సరిగ్గా చెప్పేనో లేదో కాని నాకు తోచిన భావాన్ని అక్కడ చెప్పాను. దీని గురించి ఎప్పుడో మీకు తెలియపరచవలసింది. ఇంత ఆలస్యంగా చెపుతున్నందుకు మరోలా భావించవద్దు. నేను వ్రాసిన భావం లో తేడా వుంటే మరోలా భావించవద్దని మనవి.
  కృతఙ్ఞతలతో,
  శ్రీలలిత..

  మెచ్చుకోండి

 7. మొదటి రెండు పారాగ్రాఫ్ లు చదివేటప్పుడు మాలతి గారు ఏమి చెప్పాలనుకున్నారో నాకు అర్థం కాలేదు. ఆఫీస్ లో ఖాళీ టైమ్ దొరికినప్పుడు అందులో ఏముందో చూద్దాం అని ఆడియో ఫైల్ ప్లే చేశాను. ఆడియో పూర్తిగా విన్న తరువాతే నాకు అర్థమయ్యింది. రామచంద్రరావు గారు చెప్పినట్టు పేరా పేరాకి మధ్య విశ్రాంతి ఉంటే బాగుండేది.

  మెచ్చుకోండి

 8. మాలతి గారు,

  చాలా ఆలస్యం గా వచ్చాను. చాలా రోజుల తర్వాత మీ పోస్ట్ కి 15 కామెంట్లు వచ్చాయి. ఇదే కలిసివచ్చినట్లు వుంది. మరిక విజృభించండి.ఆడియో కూడా బావుంది. మీరు మరీ కొంచెం నట్లు కూడా వచ్చాయి అని అంత వినయం గా చెప్పాలా? అవును కదా. అసలు మన శీర్షికే అడగకపోయినా చెపుతా అక్కడ కూడా వర్తించ్చిందా?హాహాహా.

  నేను చెప్పేది వినండంతే.
  నేను రాసేది చదవండంతే

  ఇదే మన టాగ్ లైన్ కావాలి.

  మెచ్చుకోండి

 9. ప్రవీణు, ఏంటి నీ చిన్నప్పటి నుంచి ట్రైను చార్జీలు పెరగలేదా? విమానం చార్జీ తగ్గలేదా??

  మెచ్చుకోండి

 10. @ తార, ఓ, అలాగా? నాకు గాంధీగురించి తెలిసింది చాలా తక్కువండీ.
  @ యస్సార్ రావుగారూ, మీరు నన్ను నొప్పించలేదు. నేను స్టూడియోలో చెయ్యలేదు కనక స్టూడియో క్వాలిటీ రాదని అందరికీ తెలిసిందే. ఉన్నదాన్లోనే మెరుగుపరిచే విధానం మీరు సూచించారనే నేను కూడా అనుకున్నాను. ప్రవీణ్ శర్మగారు కూడా అదే అనుకున్నట్టు రెండో వ్యాఖ్యలో కనిపిస్తోంది. ఆడియోవిషయంలో మీ ఉత్సాహం చూస్తే నాకు వచ్చే ఊసుపోక కూడా చెయ్యాలనిపిస్తోంది. ఈసారి మరింత జాగ్రత్త పడతాను :))
  @ ప్రవీణ్ శర్మగారూ, మీ విడియో చూసానండీ. ఏం, బాగానే ఉంది కదా. స్పష్టంగా చదివేరు. మామూలుగా కవితలో ఉండే విరుపులు ఉంటే ఇంకా బాగుంటుందనుకుంటాను. అక్కడ కామెంటు పెట్టడానికి లాగిన్ కావాలంటే మాత్రం నాకు చేతకాలేదు.

  మెచ్చుకోండి

 11. మీకు రేడియోలో పని చేసిన అనుభవం ఉందా? మీ వ్యాఖ్య రెండవసారి చదివాను. నేను పెద్ద కవితలు రికార్డ్ చేసేటప్పుడు అలసట ఎందుకొచ్చిందో నాకు అర్థమయ్యింది. ఆ వీడియోలు ఇంకా ప్రాసెస్ చెయ్యలేదు. తరువాత చేస్తాను.

  మెచ్చుకోండి

 12. ప్రవీణ్ శర్మ గారూ !
  మీరు నా వ్యాఖ్య సరిగా చదవలేదనుకుంటాను. మాలతి గారి వాయిస్ బాగులేదని నేనెక్కడా అనలేదే ! ఒక టెక్నీషియన్ గా నాకున్న అనుభవంతో ఆ వాయిస్ కి మరింత మేరుగులిచ్చే , ఆవిడకు శ్రమ తగ్గించే సలహా ఇచ్చానంతే ! అవి స్వీకరించడం, లేకపోవడం మాలతిగారి ఇష్టం.

  మాలతి గారూ !
  శ్రేయోభిలాషిగా ఇచ్చిన సలహా మిమ్మల్ని నొప్పిస్తే మన్నించండి.

  మెచ్చుకోండి

 13. రామచంద్రరావు గారు. మీకు మాలతి గారి వాయిస్ నచ్చలేదా? నా వాయిస్ అంత కంటే భయంకరంగా ఉంటుంది. ఈ వీడియోలో వాయిస్ వినండి: http://www.dailymotion.com/video/xe68hk_yyyyy_news

  మెచ్చుకోండి

 14. ప్ర)గాంధీగారూ కస్తూర్బా అప్పుడప్పుడూ గొడవ పడేవాళ్ళని మొన్నో పేపర్ కాయితంలో చదివాను. నిజమేనంటారా?

  కాదు తప్పు..
  అప్పుడప్పుడూ కాదు, ఎక్కువగా, తీవ్రంగా, ఆ గొడవల్లో వారి పెద్ద కొడుకు నలిగి పొయ్యాడు..

  మెచ్చుకోండి

 15. మీ ఆడియో ఆఫీస్ లో విన్నాను. అక్కడ విండోస్ మీడియా ప్లేయర్ లో మీ ఆడియో రన్ అయ్యింది. లెక్కల మాస్టర్, తెలుగు పద్యం గురించి మీరు చెప్పినది బాగుంది. చిన్నప్పుడు ఓ ట్రావెల్ ఏజెంట్ మా నాన్నగారికి రైలు లో ఫస్ట్ AC టికెట్ విమాన టికెట్ తో సమానం అంటే మా నాన్నగారు నమ్మేశారు.నిజానికి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కి ఫస్ట్ AC టికెట్ 1890 రూపాయలు. వైజాగ్ నుంచి హైదరాబాద్ కి విమాన టికెట్ 3000 రూపాయలు.

  మెచ్చుకోండి

 16. మీరు ఆడియోని avi ఫార్మాట్ లో అందించగలరా? మీ ఆడియో లినక్స్ లో ఓపెన్ అవ్వడం లేదు. avi ఆడియోలు చాలా సిస్టమ్స్ లో ఓపెన్ అవుతాయి.

  మెచ్చుకోండి

 17. @ SRRao గారూ, సొంత గొంతూ, సొంత అభిప్రాయాలేనండీ. సరే. మరోసారి చేసి చూస్తాను. సలహాలు ఉచితంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు.
  @ సుజాత, ఈమధ్య కనిపించకపోతే తప్పిపోయేవనుకున్నాను. నాటపాలమీద ఓ కన్నేసి ఉంచుతున్నావన్నమాట. ఇదుగో లైబ్రరీకి వెళ్తున్నా. రాగానే చెప్తా :))
  @ కొత్తపాళీ, నా ప్రతిభ ఏం లేదండీ. నిజ అనుభవమే, రవంత మార్పులతో!!

  మెచ్చుకోండి

 18. “అసలు పరీక్షలెందుకండీ? నాకెంత తెలుసో మీకు తెలియడానికే కదా. మీరడిగిన దానికంటే నాకు ఎక్కువే తెలుసని నేను ఋజువు చేస్తున్నాను ఇలా అడగనిప్రశ్నలకి జవాబులివ్వడంద్వారా.”

  హ హ హ. brilliant.

  మెచ్చుకోండి

 19. అయితే అడక్క తప్పదన్నమాట!

  మీకేం తెలుసో మాకు తెలీదు.మీకు అన్నీ తెలుసని మేమనుకుని అమాయకంగా అడిగేస్తాం! మాకేమీ తెలీదని మీకు తెలుసు కాబట్టి “అడిగింది చాల్లే, నోర్మూసుకుని చెప్పింది విను!”అని తోచిందేదో చెప్పేస్తారు ప్రశ్నకు సంబంధం ఉన్నా లేకపొయినా! అంతేగా జరిగేది?

  సరే కాస్కోండి!

  ప్ర)గాంధీగారూ కస్తూర్బా అప్పుడప్పుడూ గొడవ పడేవాళ్ళని మొన్నో పేపర్ కాయితంలో చదివాను. నిజమేనంటారా?

  ఇహనేం , ఎత్తుకోండి 1962 నుంచీ!

  మీకు ఎవరన్నా గుర్తొస్తే నా పూచీ లేదు మరి! :-))

  మెచ్చుకోండి

 20. మాలతి గారూ !
  బావుందండి. మీరు ‘ అడక్కండి మరి ‘ అన్నా అడిగేస్తున్నా ! ఆడియో లో స్వరం మీదేనా ?
  మీదే అయితే ఓ చిన్న సలహా. మీరు చెప్పడంలో ఒక విరుపు సహజంగానే వుంది కానీ మీరు స్వరం కొంచెం పెంచి అంటే volume పెంచి కాదు, Voice open చేసి చెబితే ఆ విరుపులు మరిన్ని మెరుపులు మెరుస్తాయి. అలాగే ఒకేసారి కాకుండా పేరా పేరా కి విశ్రాంతి ఇచ్చి చెప్పండి. స్వరం మీ కంట్రోల్ లో వుంటుంది.
  ఉచిత సలహాలిచ్చినందుకు అన్యదా భావించారని అనుకుంటాను. నాకున్న అనుభవం ఇలా చెప్పించింది, మీరు అడక్కుండానే.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s