వెలుగు (కథ)

అమావాస్య చీకట్లని చీల్చుకుని వెలుగురేకలు నాలుగు దిక్కులా పరుచుకుంటున్నాయి నింపాదిగా.

వల్లరి పక్కమీంచి లేచి, వెనకవరండావేపున్న తలుపు బార్లా తీసి, వంటింట్లోకి వెళ్లింది. ఫిల్టరులో కాఫీ పొడేసి, నీళ్ళు కాచి పోసి, స్నానాలగదిలోకెళ్ళి టూత్ పేస్ట్ బ్రష్షుమీద పెట్టుకోబోతూంటే వచ్చిపడిందో పురుగు. హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చిందో అది, ఆవిడమొహంమీదుగా ఎగిరి ఎదురుగా ఉన్న అద్దంమీద వాలింది ఒయ్యారంగా. ఆవిడ ఓ క్షణంసేపు దీక్షగా ఆ పురుగువేపు చూసి, తరవాత అటూ ఇటూ చూసి, పక్కనున్న తువాలందుకుని దాన్ని బయటికి తోలడానికి ప్రయత్నించింది.

ఆ పురుక్కి కూడా అప్పుడే తెల్లారిందేమో అది హుషారుగా అద్దంమీంచి గోడమీదకీ, గోడమీంచి షవర్ కర్టెన్‌మీదకీ గెంతులేయడం మొదలెట్టింది. కొంచెంసేపు రెణ్ణిముషాలపాటు నిష్ దున్నలతో దొమ్మీ … ఆ తరవాత వల్లరి మరోసారి దీక్షగా దాన్ని చూసింది. దానిభాషలో అది హీహీ, హాహా అనుకుంటోందనిపించింది కూడా. తనకి మాత్రం తెల్లారి లేస్తూనే ఈ సంతేమీ అంత సరదాగా అనిపించలేదు. “నీ ఖర్మ. నీ ఇష్టం ఒచ్చినంతసేపు నీ దొమ్మరాట ఆడేసుకు ఫో,” అనుకుని పళ్లు గరగరా తోముకోడం మొదలెట్టింది.

మామూలుగా అమెరికాలో ఇళ్లు చిట్టడవుల్లోనూ, కారడవుల్లోనూ ఉండకపోయినా, చీమలూ, కాకులూ దూరడానికి వీల్లేకుండానే కడతారు. ఆవిడకి ఈ ఇళ్ళంటే నవ్వు. గట్టిగా తంతే కూలిపోయే అట్టగోడలూ, పెద్ద పెద్ద అద్దాలతలుపులూ పెట్టి ఇళ్లయితే కడతారు కానీ పైరుగాలి రిమరిమలు కాకపోతే పోనీ పైన్ కొమ్మల్లోంచొచ్చే ఈదురు గాలయినా చొరలేనంత పకడ్బందీగా కడతారు. అందుకే తను లేవగానే పడగ్గది వెనకతలుపూ, ముందుగదిలో patioతలుపూ బార్లా తీసేస్తుంది. కనీసం ఎండెక్కేవరకూ అయినా గాలాడుతుంది బయటికీ లోపలికీ అని.

ముందుగదిలో గాజుతలుపు వెనక జల్లి తలుపుంది. వెనకవేపు పడగ్గదిలో కూడా అలా జల్లితలుపు పెట్టించుకుంటే, ఈగల్నీ దోమల్నీ తదితర జీవసంతతినీ జల్లించేసి, ఫ్రెష్, శీతలవాయులని మాత్రమే లోనికి పంపుతుందని చాలామందే సలహా ఇచ్చేరు కానీ తనకి నచ్చలేదు. “పోన్లెద్దురూ. అవి మాత్రం జీవులు కావేమిటి. వస్తాయి, పోతాయి చుట్టాల్లాగే. అవేమీ నాఇంట్లో కాపురాలు పెట్టేయవు కదా. ఇది వాటికి కేవలం రాదారీ మాత్రమే,” అంటూ వచ్చింది. నిజానికి తను ఆతలుపు తీసినందువల్ల తండోపతండాలుగా దోమలు వచ్చి పడిపోలేదెప్పుడూ. ఇప్పుడే, అదీ ఈ ఒక్క పురుగే వేంచేసిందిలా. దారి తప్పే కావచ్చు.

ఆలోచిస్తూ ఆ పురుగుని మరోసారి పరీక్షగా చూసింది ఆవిడ. దీనిపేరేమిటయి ఉంటుందో! సీతాకోకచిలుకలా రెక్కలున్నాయి కానీ సీతాకోకచిలుక కాదు. ఈగలా నల్లగానే ఉంది కానీ ఈగ కంటే బాగా పెద్దదిగా ఉంది. పోతుటీగలు అని ఉంటాయి కానీ ఇది బాగా పెద్దదిగా ఉంది. తను స్నానాలగదిలో దీపం వెయ్యగానే వచ్చింది, అద్దంమీద దీపానికి దగ్గరగా వాలింది. శలభమో దీపంపురుగు అంటే ఇదేనేమో. దీపప్పురుగులు ఎలా ఉంటాయో … … ప్చ్. ఏమిటో ఇండియా వదిలి వచ్చేసింతరవాత అన్నీ మర్చిపోతోంది. ఆఖరికి తను తెలుగుదాన్నన్న సంగతి కూడా వాళ్లూ వీళ్లూ ఏ దసరాకో దీపావళికో పిలిస్తే తప్ప గుర్తు రావడం లేదు.

ఆ పురుగువేపు మరోమారు చూసింది. దీపానికి దగ్గరగా తచ్చాడుతోంది కనక దీపం తీసేస్తే పోతుందేమో అన్న ఆలోచన వచ్చి, దీపం ఆర్పేసి, మౌనప్రార్థన చేస్తున్నట్టు రెండు నిముషాలాగి, మళ్లీ దీపం వేసింది. పురుగు కనిపించలేదు. హమ్మయ్య, పోయింది అనుకుని, గబగబ పళ్లు తోమేసుకుని, కాఫీ కప్పుతో కంప్యూటరుముందు కూర్చుంది ఆనాటి వార్తలూ విశేషాలూ, యమ్మెస్ కిటికీలో బంధుదర్శనాలూ … ఆలా చూస్తూ కళ్ళెత్తి చూస్తే, ఎదురుగా గోడమీద ఆ పురుగు మళ్లీ ప్రత్యక్షం! ఇదెక్కడి గోల అని కొంచెంసేపు విసుక్కుని, సరే, ఈ క్షుద్రకీటకంకోసం నావిలువైన కాలాన్ని వెచ్చించడమేమిటి అని తనకి తనే బుద్ధి చెప్పుకుని, మెయిలు తెరిచింది.

ఆ మానవురాలు తనని అలా నిర్లక్ష్యం చెయ్యడం అవమానకరంగా భావించిందేమో, ఆ పురుగు గోడమీంచి చటుక్కున ఎగిరిపోయింది. అలా ఎగిరిపోతున్న ఆ జీవాన్ని చూస్తే, తనకి ఆనందమూ, బాధా కూడా కలిగేయి. ఆనందం పోతోంది కదా అని, బాధ దానిమనసు నొప్పించేనేమోనని.

అలా అనేక మిశ్రమఆలోచనలతో సతమతమవుతూ ఓ గంటసేపు పీసీకి గరుడ‌సేవ చేసి టీవీ చూద్దాం అని ముందుగదిలోకి వచ్చి ఇటు తిరిగితే మళ్ళీ ఆ పురుగు జల్లితలుపుమీద ప్రత్యక్షం!

పురుగు

ఆవిడకి ఏం చెయ్యాలో తోచలేదు. అట్టే ఓనిముషంపాటు తేరిచూసి, ఊరుకోడానికే నిశ్చయించుకుంది.

రెండో కాఫీ సేవిస్తూంటే కళ్లు గదిలో నల్దిక్కులా తిరుగుతున్నాయి. అనుకోకుండానే, తను ఆ పురుగుకోసం చూస్తోంది. చుట్టాల్లేనమ్మ దయ్యాల్ని పట్టుకు ఏడ్చినట్టు … … మళ్లీ అనుమానం. ఆ జల్లితలుపు మూలంగా ఆ  పురుగు కానీ కళ్లు కానక, దిక్కు తోచక బయటికి పోలేక కొట్టుకుంటోందేమో అని. లేచి వెళ్లి, జల్లితలుపు కాస్త పక్కకి తోసి దాని విడుదలకి తగిన ఏర్పాటు ఏర్పాటు చేసింది. మరి ఆ పురుక్కి. ఆవిడ సహృదయత అర్థం కాలేదో, అసలు బయటికి వెళ్ళే ఉద్ధేశ్యం లేదో, ఇప్పుడే కాదనో … కదల్లేదు.

పసిబాలుడు తల్లిగుండెలకి హత్తుపోయికున్నట్టు ఆ జల్లితలుపుకి అతుక్కుపోయిన ఆపురుగుని చూస్తుంటే వల్లరికి మరో అనుమానం వచ్చింది. ఒకవేళ ఆ జల్లికన్నాల్లో దానికాళ్ళు ఇరుక్కుపోయి, ఎగర్లేకపోతోందేమో అని. దగ్గరికి వెళ్లి సందేహిస్తూనే సుతారంగా ఓ రెక్కమీద తగిలీ తగలనట్టు వేలేసి చూసింది. దానికేమీ ఆనినట్టు లేదు తన ఆదుర్దా. అది నిదానంగా ఒక మిల్లిమీటరు ఓపక్కకి జరిగి, సద్దుకుని, రెక్కలు పరుచుకుని సుఖాసీనురాలయింది విలాసంగా.

వల్లరి నిట్టూర్చింది. అయ్యో పాపం దారి తప్పి నాలుగ్గోడలమధ్యకి వచ్చేసింది అంటూ ఇనుమడించిన జాలితో సాయం చేయబోతే అదేమో మరింత షోకులు పోతోంది. ఇటు దయచేయి తల్లీ అని దారి చూపించినా కదలడం లేదు. బయట అంత విశాలప్రపంచం, ప్రకృతిసిద్ధంగా సూరీడు వెదజల్లిన వెలుగూ అన్నీ వదిలేసి, ఎందుకిలా ఈ నాలుగ్గోడలమధ్యా ఇరుక్కోడం? గాలాడని ఈయింట్లో ఈ కృత్రిమనియాన్ వెలుగులో అది పొందుతున్న ఆనందం ఏమిటో … …. అది దీపం పురుగే అయితే, దీపంకోసమే లోపలికి వచ్చి ఉంటే, మరి ఈ దీపంకంటే శతాధికంగా వెలుగు బయట ఉంది కదా. ఏంటో మనుషులని అంటాం కానీ పురుగులు కూడా అంతేలా ఉంది. చిన్న కంతలోంచి కనిపించే రవంత వెలుగుకోసం అంత తాపత్రయం, అక్కడేదో తట్టెడు దివ్య వెలుగునొల్లుకుందాం అనుకుని ఆ కంతలోకి దూరడం. “బుద్ధిహీనురాలా, ఇదుగో, ఇటూ దారి, పో, స్వేచ్ఛగా హాయిగా తిరుగు ఆరుబయట” అని చెప్తే వినకుండా ఇదేం రోగం? హుమ్ అనుకుంటూనే తన కార్యక్రమాల్లో పడిపోయింది ఆవిడ.

వల్లరి ఊళ్ళో పనులు పూర్తి చేసుకుని ఇంటికొచ్చేసరికి నాలుగయింది. ఇంటికొచ్చి, ఏసీ వెయ్యడానికి అద్దాలతలుపు మూయబోతూ జల్లితలుపుమీద పురుగుకోసం చూసింది. అది కనిపించలేదు. హమ్మయ్య, వదిలింది అనుకుంటూ, ఏసీ పెట్టుకుని సోఫాలో కూలబడి అద్దాలతలుపువేపు చూసింది. పురుగు తలుపువార కార్పెట్‌మీద పడి ఉంది. అయ్యో అనుకుంటూ దగ్గిరికెళ్లి చూసింది. సందేహం లేదు. దానిజీవితం ముగిసింది. ఇది హఠాన్మరణమా, దుర్మరణమా, ఆత్మహత్యా, దీనిచావులో తనకి పాలేమయినా ఉందా, ఉంటే దానిచావు హోమిసైడా, మాన్ స్లాటరా ?? … వల్లరి ఆలోచిస్తూ, ఆపురుగుని తీసి బయట పడేసింది. హుమ్. ఈ మాయామేయ జగత్తులో ఒక చిన్న కీటకంయొక్క పాత్ర ముగిసింది. దాదాపు మూడుగంటలసేపు తనని అలరించి, విసిగించి, ఉడికించి, ఏడిపించినంత పని చేసి వెళ్ళిపోయింది. పాపం అనుకోవాలో థాంక్స్ చెప్పుకోవాలో … కొందరు మనింటికి వచ్చినప్పుడు  సంతోషంగా ఉంటుంది. కొందరు వెళ్లిపోయేక సంతోషంగా ఉంటుంది … చిన్నగా నవ్వుకుంది.

మర్నాడు ఉదయం మామూలుగానే తలుపు తియ్యబోతూంటే ముందురోజు ప్రహసనం గుర్తొచ్చి కాస్సేపు ఆగింది. తరవాత నెమ్మదిగా తలుపు సగం మాత్రం తెరిచి, తొంగి చూసి, ఏ జీవుడూ కనపడలేదని నిర్ధారణ అయేక, వల్లరి తన దినచర్యలో పడింది.

మామూలుగానే కాఫీకప్పుతో కంప్యూటరుముందు కూర్చుని మౌస్ మీద చెయ్యేసింది. మరుక్షణంలో చేతిమీద వాలింది మరోపురుగు పెంపుడు చిలకలా! ఆవిడకి మళ్ళీ జాలి ముంచుకొచ్చింది. పాపం, ఈ పురుక్కి తెలీదేమో నిన్నటి పురుక్కి పట్టిన గతి. ఈనాలుగ్గోడలమధ్య ఇరుక్కుని అది ప్రాణాలతో బయట పడ్డం కల్ల. ఇన్నాళ్ళూ మనుషులకే ఉంటుందనుకుంది – ఇల్లూ,  విద్యుత్ వెలుగులకోసం తాపత్రయం. వీటికోసం పరుగులు మానవధర్మం అని … … కానీ ఇప్పుడీ పురుగుసంతతిని చూస్తూంటే సృష్టిలో ఏజీవి అయినా అంతేనేమో అనిపిస్తోంది. తనబుర్రలో వెయ్యివాట్ల బల్బు వెలిగినట్టయింది ఆ క్షణంలో!

తనింక ఈ తగువులొదిలేసుకుని, ఇరుగూపురుగులతో శాంతయుత సహజీవనం అవలింబించాలి. అంతే!

(11 జూలై 2010.)

.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

11 thoughts on “వెలుగు (కథ)”

 1. @ సత్యవతిగారూ, ఫ్యాన్ తగిలి కిందపడ్డ పిచ్చుకపిల్ల :))- నిజమేనండీ, ఇలాటివి చాలా చిన్నవిషయాలయినా గుర్తుండిపోతాయి. …సామెతలూ, పద్యాలూ… ఇవేనండీ అమెరికాలో నాలాటి కొందరు చాలా మిస్సయేది. ఎవరికి ఏవి అందుబాటులో లేవో వాటిమీదే కదా యావ! మీ అభిప్రాయాలకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. చాన్నాళ్ళ తరువాత ఒక హాయైన కథ చదివినట్లయింది.కథలో వర్ణన తాత్వికత పెనవేసుకుని సహజంగా కలిసిపోయాయి.ఈ మధ్యన మీ కధలన్నీ చదివినందువల్ల జీవితాన్ని objective గా పరిశిలించి.ఒకింత హాస్యం మానవ స్వభావ చిత్రణ ఎక్కువ కనిపించే మీకథల్లో అమెరికా గురించి వ్రాసినా తెలుగు నుడికారం గుబాళిస్తుంది..సామెతలు పద్య భాగాలు తెలుగు పదాలు మనసులో జాగ్రత్తగా నిక్షేపించుకున్నారు.నా చిన్నప్పుడు ఫ్యాన్ తగిలి కిందపడ్ద పిచ్చిక పిల్లని సాసర్ లో నీళ్ళుపోసి దాని ముక్కు ముంచి కాసేపాగి బయటికి పంపి అమ్మయ్య అనుకోడం గుర్తొచ్చింది.
  సత్యవతి

  మెచ్చుకోండి

 3. @ కల్పన, నీవిశ్లేషణ చాలా బాగుంది. అవును, కథని మరింత అర్థవంతం చేయడానికే పురుగు అని కాక వెలుగు అని పేరు పెట్టేను. బాగా గ్రహించేవు.
  జల్లితలుపు – తెలుగుభాషకి నా చేతనయిన సేవ :p.

  మెచ్చుకోండి

 4. ఈ కథ లో మీరు చాలా విషయాలు తాత్త్వికంగా చెప్పినట్లు అనిపించింది. పైకి చూడటానికి ఇదొక పురుగు కథ లాగా అనిపించిన మీరు పెట్టిన టైటిల్ వెలుగు నుంచి , మీరు వాడిన పద చిత్రాలు చూస్తే మీరు పురుగు ని బేస్ చేసుకొని మరి కొన్ని జీవిత సత్యాల్ని ఆవిష్కరించినట్లు అర్థమైంది.
  ఉదాహరణకు విశాల ప్రపంచం లోని సహజ సిద్ధమైన వెలుగు ని వదిలేసి ఆ పురుగు కృత్రిమమైన వెలుతురు కోసం లోపలికి రావడమేమిటి? ఆలోచించి చూసుకుంటే అచ్చంగా మనమంతా చేస్తున్న పని ఇదే కదా అనిపించటం లేదూ. చిన్న కంత లోంచి కనిపించే రవ్వంత వెలుగు కోసం మనందరి తాపత్రయం ఏమని చెప్పాలి?
  వల్లరి కి చివర్లో వెలిగిన వెయ్యి వాట్ల బల్బ్ పాఠకులకు కూడా వెలుగుతుంది. చుట్టువున్న వారితో సహజీవనం శాంతి మార్గం సర్వదా శ్రేయోదాయకం.
  జల్లితలుపు -మెష్ డోర్ కి తెలుగు అనువాదం బావుంది.
  మంచి కథ చదివించారు మాలతి గారు. ఎప్పటిలాగానే!

  మెచ్చుకోండి

 5. @ ఇందు, స్నేహం లేదండీ, దాన్ని తరిమేయడానికి చేసిన విఫలయత్నం. 🙂 మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.
  @ నాగేస్రావ్, లక్ష్మణరేఖ, హా. మరి పని చేసిందా? మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 6. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, పురుగుపిల్ల …కాదేదీ కథకనర్హం 🙂
  చలి కాలంలో మాఇంట్లోకి చీమలు బారులుతీరి వస్తూంటే “పోన్లెద్దురూ. అవి మాత్రం జీవులు కావేమిటి. వస్తాయి, పోతాయి చుట్టాల్లాగే” అనుకొంటూంటాను. కానీ మాఇంటావిడ మాత్రం చుట్టూ లక్ష్మణ రేఖ గీచుకుంటూ వస్తుంది.

  మెచ్చుకోండి

 7. @ చావాకిరణ్, :). థాంక్స్.
  @ లక్ష్మీరాఘవ, మీపేరు ఇక్కడ చూడగానే చాలా ఆనందమయిందండి. “అమెరికాలో పురుగు కూడా ఆలోచింపజేస్తుంది” 🙂 భలే చెప్పేరు. అచట పుట్టిన చివురుకొమ్మయిన చేవ అన్నట్టు. థాంక్స్.
  @ సత్యవతిగారూ, తప్పకుండాను. అలాగే, మీరు టైముంటే, టైమున్నప్పుడు మొల్ల మీద రాసినవ్యాసం కూడా చూడగలరు. మొల్లవిషయంలో కూడా ఆధారాల్లేని కథలు ప్రచారంలో ఉన్నంతగా ఆమె సామర్థ్యం, ఉపజ్ఞ గుర్తిండం జరగలేదనే నా అభిప్రాయం- మాలతి

  మెచ్చుకోండి

 8. ఒక చిన్నపురుగు గురించి ఇంత కథ అల్లడం రచయితలకే చెల్లు అన్న విషయం చాలా బాగా అర్థం అయింది..అమెరికా లో చిన్న పురుగు సావాసం కుడా ఆలొచిపచేస్తుంది..ఇది నిజం..బాగున్నది మీ కథ..
  లక్ష్మీ రాఘవ

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s