అమ్మ తపన

పైకి వెళ్ళే ఎలివేటరుకోసం ఎదురు చూస్తున్నాను. నాకంటె ముందొచ్చి, నొక్కిన బటనే మరోసారి నొక్కి గోడమీద ఉన్నఅంకెని చూస్తున్నాడొకతను.

మూడు.

మూడో అంతస్థులో ఎవరో ఎలివేటరుని పట్టుక్కూర్చున్నారులా ఉంది ఎంతకీ దిగి రావడంలేదు. మరో గళ్లచొక్కా కుర్రాడు గబగబా వచ్చి ఆ బటనే మళ్ళీ నొక్కి హడావుడిగా అటూ ఇటూ చూడ్డం మొదలెట్టాడు. వారంరోజులనించీ చూస్తున్నాను ఈ వరస. ఇంతా చేస్తే మూడో అంతస్థుకి వెళ్తాడు. అంత తొందరైతే మెట్లెక్కి పోకూడదూ? అతను మళ్ళీ బటను నొక్కేడు.

నాకు నవ్వొచ్చింది ఈ ఎలివేటరు మనస్తత్త్వం.

“ఈ యంత్రాంగం అంతా మనకాలం వృథా కాకుండా ఉండడానికి,” అన్నాడతను నావేపు చూసి.

“తాబేలు గెలిచినకథ ఇందుకే వచ్చింది,” అన్నాను.

“దూరంగా కారిడర్‌లో జూలీ కనిపించింది, గబగబా నడుస్తూ దూరంనించే చెయ్యూపింది.

అప్రయత్నంగా ఎలివేటరు ముల్లు చూశాను. ఇంకా మూడుమీదే ఉంది!

“మెట్లమీంచి పోతే బావుణ్ణేమో,” అన్నాడు గళ్ళచొక్కా కుర్రాడు ఎవరితోనో తెలీకుండా.

జూలీ దగ్గరకొచ్చేస్తోంది.

మెట్లు … అనుకుంటూ మళ్ళీ గోడమీద ముల్లువేపు చూశాను. రథం కదిలింది. అన్యాయం .. రెండు … ఒకటి … ఆగింది.

జూలీ ఇంకొంచెం దగ్గరయింది. “హాయ్” అంది దగ్గరకొచ్చేస్తూ.

నేను కూడా హాయ్ చెప్పి ఎలివేటరులోకి అడుగేసి, ఓమూలకి నక్కి నిల్చున్నాను. గళ్ళచొక్కా కుర్రాడు క్లోజ్ బటను నాలుగుసార్లు నొక్కేడు గబగబ. సగం మూసుకున్న తలుపుని ఓ చేత్తో ఆపి తోసుకుంటూ జూలీ ఒక్క పెట్టున వచ్చి ఎలివేటరులో పడి, వగరుస్తూ హమ్మయ్య అంది.

“బావున్నావా?” అంది నావేపు తిరిగి.

“బాగానే ఉన్నాను. నువ్వు?”

“బ్రహ్మాండం అనుకో.”

“ఏం? ఏమిటి విశేషం?” యదాలాపంగానే అడిగేను.

“హాఁ” అంది కళ్ళెగరేస్తూ.

నాకాశ్చర్యం వేసింది. ఆవిడెప్పుడూ అంత తేలిగ్గా ఒక్క “హాఁ”తో పోనివ్వలేదు.

తొమ్మిదో అంతస్థు వచ్చింది. ఇద్దరం ఎలివేటరులోంచి బయటపడి మాబల్లలవేపు నడిచేం. సర్దుకుని మాసీట్లలో కూర్చునేవేళకి జూలీబల్లమీద ఫోను మోగింది. ఆర్నెల్లనించీ చూస్తున్నాను. రోజుకు పన్నెండు కాల్సు వస్తాయి. ప్రతి కాలూ ముప్పావుగంట సాగుతుంది. ఫోన్ కాకపోతే ముఖాముఖీ మాటాడ్డానికి ఎవరోఒకరు వస్తారు. టామ్, డిక్, హారీ … ఎవడో ఒకడు. … ఇన్నిటిమధ్య నన్ను వేధించుకు తినడానికి టైముంటుంది ఆవిడకి!

“ఇందిరాగాంధీ కిరాతకురాలి‌లా ఉంది. నీ అభిప్రాయం ఏమిటి?”

“మీదేశంలో అంత జనాభాని ఎలా భరిస్తున్నారు?”

“దారిద్ర్యం ఎక్కువ కదా?”

ఆఖరికి విసుగేసి చెప్పేను, “ఆ రాజకీయాలన్నీ నాకు పట్టవు. పైగా నాకిక్కడ చచ్చే పనుంది.”

జూలీ సిగరెట్ తీసి, నోట బెట్టుకోబోతూ, “అభ్యంతరమా?” అంది.

నిస్సందేహంగా నాకు అభ్యంతరమే. “లేదు” అన్నాను ఆవిడవేపు చూడకుండా.

“చూశావా ఎవరో మహాయిల్లాలు కోళ్ళు నరికేకత్తితో మొగుణ్ణి పొడిచేసిందిట. బతికున్నన్నాళ్ళూ నానాహింసా పెట్టేట్ట … మీదేశంలో మొగాళ్ళు ఆడవాళ్ళని కొడతారా? వాళ్ళు కొట్టినా తిట్టినా ఆడవాళ్ళు కిక్కురుమనకుండా పడివుంటారుట నిజమేనా?”

ఆవిడ ప్రశ్నలతో, సందేహాలతో, తలా తోకా లేని అభిప్రాయలతో నాకు తల తిరిగిపోతుంది. … ఆడవాళ్ళ అధ్వాన్నస్థితి … దరిద్రం … బానిసత్వం … మొగాళ్ళ నిరంకుశత్వం …

“ఇవాళ ఉత్తరాలు ఒచ్చేయా?” అంటాను మాట మార్చడానికి. ఇవాళా అదే అడిగేను.

“నాకు తెలీదు.” ఇదీ ఆనవాయితీగా వచ్చే జవాబే.

“చూసొస్తాను” అంటూ లేవబోయాను. నిజానికి కొంచెంసేపుంటే నాబల్లదగ్గరికే వస్తాయి. నేను వెళ్ళవలసిన అవుసరం లేదు.

“ఏం? అర్జెంటుగా రావలసినవేమైనా ఉన్నాయా?” జూలీ అడిగింది. అంతలో ఆవిడబల్లమీద ఫోను మోగింది. ఫోను తీసి హలో అంది. నాకు మరో ముప్పావుగంటవరకూ ఇబ్బంది లేదు. నేను ఉత్తరాలమాట ఒదిలేసి, ఫైళ్ళు తీసుకున్నాను.

మనసు ఫైళ్ళమీదికెళ్ళడం కష్టంగా ఉంది. ఎంత కూడదనుకున్నా జూలీ తత్త్వం చిరాకు పెడుతోంది నన్ను. … మీదేశం, మీనాయకులూ, ఇందిరాగాంధీ, ఆడజాతీ, దిక్కులేని పిల్లలూ, కూడులేని బతుకులూ … ఏమిటో ఈ అమ్మాయి తాపత్ర.యం! మహా అయితే ముప్ఫై ఏళ్లుంటాయేమో. క్షణం తీరికలేని జన్మ. గుక్క తిప్పుకోలేని బతుకు. ఎనలేని వ్యాపకాలు. చేస్తున్న ఉద్యోగంమీద ధ్యాస లేదేం? ధ్యాసలేని ఉద్యోగం చేయనేల?

జూలీ ఫోన్ పెట్టేసి, కిటికీలోంచి చూస్తూ అంది, “ఎండ అద్భుతంగా ఉంది కదూ!”

“ఆఁ” అన్నాను ఆలోచిస్తూ. నేను పుట్టినదేశంలో ఎండలు అద్భుతంగా ఉన్నాయని మురిసిపోతూ చెప్పుకోం. మాడి ఛస్తున్నాం అని ఏడుస్తాం.

“మీకు ఎండలు చాలా ఎక్కువ కదూ?”

ఉత్తరాలొచ్చేయి. కావలసినవేం లేవు. ఓ రెండు కేటలాగులూ, మౌత్ వాష్ శాంపిల్ బాటిలూ, భీమా లేకుండా ఛస్తే వచ్చే ప్రమాదాలగురించి వివరించే భీమాకంపెనీ ఉత్తరం ఒకటీ, కానీ ఖర్చు లేకుండా లక్షలు సంపాదించే అద్భుతమయిన ఐడియాలూ, … విసుగ్గా చెత్తబుట్టలోకి విసిరేశాను. జూలీవేపు ఛూశాను. ఆతృతగా ఉత్తరాలు చదువుతోంది.

నేను నా ఫైలు తీసుకుని పీటరుతో మాటాడడానికి వెళ్ళేను. తిరిగి వచ్చేసరికి జూలీ కిటికీలోంచి ఏదూరతీరాల్లోకో చూస్తోంది.

“ఎక్కడికెళ్ళేవు?” ఎందుకో ఎనలేని హషారు తెచ్చుకుంటున్నట్టు కనిపించింది. కానీ నేను పట్టించుకోకుండా ఉండడం మంచిది.

పీటరుకి నేనంటే ప్రత్యేకాభిమానం. జూలీయే కాదు వేరే ఒకరిద్దరు కూడా ఈ విషయమై వ్యాఖ్యానించేరు. నిజానికి చెప్పుకోదగ్గ పెద్ద కారణం ఏమీ లేదు. గాడిదలా చాకిరీ చేస్తాను కనక. అతనికి కనీసం ఒకటిన్నర మనుషులపని కిడుతుంది నాకిచ్చే ముప్పాతిక జీతానికీను. నేనామాట అంటే జూలీ ఒప్పుకోదు.

“పీటరు పెళ్ళాన్ని ఒదిలేశాడు, తెలుసా?” హేళనగా నవ్వుతుంది.

నాకలాటి సరసాలు నచ్చవు. “చూడు, నాకతని వ్యక్తిగత విషయాలు అనవసరం. నాకు సంబంధించినంతవరకూ ఈ ఆఫీసులో మనుషులూ, ఈ ఫైళ్ళూ ఒకటే,” అన్నాను కఠినంగా ఓ బొత్తి ఫైళ్ళు ఎత్తిపట్టుకుని గాల్లో ఊపుతూ.

జూలీమొహం కళ తప్పింది క్షణకాలం. మరీ కఠినంగా మాట్లాడేనేమో అనిపించింది. అదే మాట నేను కొంచెం సౌమ్యంగా చెప్పివుండొచ్చు.

తను సిగరెట్ తీసి చేత్తో పుచ్చుకుని నావేపు చూసింది.

పీటరుతో మాటాడినా చిక్కు తేలలేదు. ఫైలంతా గందరగోళం. ఎలా రాయాలో బోధపడ్డంలేదు. విసుగ్గా కాయితాలు బల్లమీదికి విసిరేశాను.

“విసుగ్గా ఉందా?” జూలీ అడిగింది.

నేను మాట్లాడలేదు. తను చేతిలో సిగరెట్ వేపూ నావేపూ మార్చి మార్చి చూసి మళ్ళీ పెట్టెలో పెట్టేసింది. ఆశ్చర్యపోవడం నావంతయింది. ఎక్కు పెట్టినబాణంలా పెట్టెలోంచి తీసిన సిగరెట్టెప్పుడూ కాల్చకుండా ఒదిలిపెట్టలేదావిడ.

“హేయ్,” నేను మాటాడకుండా ఉండలేకపోయేను. “ఏమైంది?”

జూలీ జవాబు చెప్పలేదు. ఎదురుగా బల్లమీదున్న కాయితాలవేపు చూస్తూంది. ఏదో చాలా బాధ కలిగించేదే అయివుండాలి అనిపించింది నాకు.

తను హఠాత్తుగా లేచి వచ్చి, నాకెదురుగా కుర్చీలో కూర్చుంది. “ఇది చూడు,” అంది ఏదో దినపత్రికలోంచి కత్తిరించిన కాయితపుముక్క చూపిస్తూ.

అదొక మరణవార్త. ఎక్కడో పియోరియా అనబడే ఊళ్ళో హారియట్ క్రిస్టెన్సన్ అనే ఆవిడ మరణించింది గుండెజబ్బుతో. వయసు యాభై. వచ్చే ఆదివారం అంత్యక్రియలు.

జూలీ తన తల్లిపేరు బార్బరా అని చెప్పినట్టు గుర్తు. “మీ చుట్టమా?” అనడిగేను. అంతకంటే ఏం మాట్లాడాలో నాకు తోచలేదు.

జూలీ తలొంచుకుని, నెమ్మదిగా, అతినెమ్మదిగా అంది, “నాకు జన్మనిచ్చిన స్త్రీ.”

నేను తుళ్ళిపడ్డాను. “మీ అమ్మా?”

జూలీ అవునన్నట్టు తలూపింది.

కాలం నత్తలా నడుస్తోంది నింపాదిగా.

“ఆవిడ మా అమ్మ. నాకు ఈ సంగతి తెలుసుకోడానికి పదహారేళ్ళు పట్టింది. సోరెన్సన్స్ నన్ను పెంచుకున్నారని తెలిసినప్పుడు నాకు పదకొండేళ్ళు. …. అప్పట్నుంచీ మాఅమ్మని చూడాలని ఒకటే తహతహ. … కనిపించినవాళ్ళనందర్నీ అడిగేను. … నర్సులూ, డాక్టర్లూ, రెసిడెంట్ నర్సులూ … ఎంతమందిని అడిగేనో లెక్క లేదు. ఫెడరల్ రికార్డులూ, హాస్పిటల్ ఫైళ్లూ, ఎన్ని చూశానో కళ్ళు పొడుచుకు  .. ప్రత్యేకం దీనికోసమే మూడు స్టేట్స్‌లో నాలుగు సంస్థల్లో మెంబర్ని అయ్యేను….” గుక్క తిప్పుకోడానికి ఓ క్షణం ఆగింది. “ఆఖరికి నిన్ననే న్యూజెర్సీనించి ఉత్తరం వచ్చింది ఆవిడ పియోరియాలో ఉన్నట్టు. … రాత్రంతా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయేను.” నాచేతిలోంచి ఆ పేపరుకటింగ్ తీసుకుంది.

“అయాం సారీ, సో వెరీ సారీ,” అన్నాను. ఇక్కడ అందరూ అనే మాటే. నాకు మాత్రం మహ వెగటుగా తోచింది.

జూలీ వెలితిగా నవ్వింది, “తమాషాగా లేదూ? నేనూ మాఅమ్మా ఒకరినొకరం తొలిసారి చూసుకోడం నేను పుట్టినప్పుడు … అప్పట్లో నాచుట్టూ ఏం జరుగుతోందో నాకు తెలీదు. మళ్ళీ చూసుకోడం ఇప్పుడు, ఆవిడ చనిపోయేక! ఈసారి తనచుట్టూ ఏం జరుగుతోందో ఆవిడకి …”

నాకు గుండెలు పట్టేసినట్టయింది. కుర్చీలోంచి లేచి, దగ్గరికెళ్ళి, భుజంమీద చెయ్యేసి, “కాఫీకి వెళ్దాం, రా” అన్నాను.

ఆ అమ్మాయి కళ్ళెత్తి నావంక చూసింది. తడిగా ఉన్నాయవి.

కెఫీటీరియాకి వెళ్తున్నంతసేపూ, కాఫీ తాగుతున్నంతసేపూ, జూలీ మాటాడుతూనే ఉంది. ఎవరెవరిని కలుసుకుందో, ఏం మాటాడిందో, ఏ ఫైళ్ళు పట్టుకోడానికి ఎన్ని అవస్థలు పడిందో, ఏ ఏ సంస్థలు ఏం పనులు చేస్తాయో …

ప్రతి మాటా జాగ్రత్తగా వింటున్నాను. తెరిచినపుస్తకంలా కనిపించింది ఆ సమయంలో ఆ అమ్మాయి  … హఠాత్తుగా నన్నడిగింది, “మీదేశంలో పెళ్ళిళ్లే నయం అనుకుంటా. తండ్రిపేరు తెలీని పిల్లలుండరు.”

ఆవిడ ఏమంటోందో నాకు అర్థమయింది. గుండెల్లో పొడిచినట్టయింది. నేను జవాబు చెప్పలేదు.

జూలీ మళ్ళీ అడిగింది, “నువ్వు మీపెద్దలు నిర్ణయించిన సంబంధమే చేసుకుంటావా?”

గబుక్కున లేచేన్నేను. “ఏమనుకోకు. నేను అర్జెంటుగా పంపవలసిన కాయితాలున్నాయి. వెంటనే వెళ్ళాలి. మనం తరవాత మళ్ళీ మాటాడుకుందాం. ఏమనుకోవు కదూ?”

కాఫీకీ, టిప్పుకీ డబ్బు బల్లమీద పడేసి, గబగబా నాసీటువేపు నడిచేను. కళ్ళు తిరుగుతున్నట్టుంది.   పెద్దవాళ్ళు చూసుకుంటారు అన్నీ … భగవంతుడా! చూసుకుంటున్నారా? చూసుకున్నారా?

జూలీ పీటర్ ఆఫీసుగదిలోంచి వచ్చి, తనసంచీ అందుకుంది, “నేను శలవు పెట్టేను. రేపు కూడా రాను. సర్విస్‌కి వెళ్తున్నాను.”

“మీ తల్లిమృతికి నేను సంతాపం వెలిబుచ్చుతున్నాను,”

జూలీ గుమ్మంవేపు నడుస్తూ “థాంక్సూ” అంది.

జూలీ వెళ్ళిపోయింది.

నామనసంతా అల్లకల్లోలంగా ఉంది. తనమాటలు గుదిబండలయి గుండెల్లో కొట్టుకుంటున్నాయి. ఫైలు తీస్తే ఒక్క అక్షరం కూడా కనిపించడంలేదు. టైము చూశాను. కనీసం ఇంకో గంటసేపైనా పని చెయ్యాలి. జూలీ శలవు తీసుకుంది. నేను కూడా అడిగితే బాగుండదు.

పెద్దలు చేసే పెళ్ళి … అరేంజిడ్ మేరేజస్ … తండ్రిపేరు తెలీని పిల్లలు …నాకు పిచ్చెత్తిపోతోంది. ఫోన్ తీసి చిన్నమామయ్య నెంబరు కొట్టేను. కామాక్షి పిన్ని తీసింది. ఆవిడ ఈమధ్యే వచ్చింది ఇండియానించి చుట్టపుచూపుగా. ఫోను తియ్యడానికి మొహమాటం ఆవిడకి.

“నేను పిన్నీ, శారదని.”

“ఆఁ. బావున్నావా?”

నేను జవాబు చెప్పలేదు.

“శారదమ్మా!” అంది పిన్నే మళ్ళీ అట్నుంచి.

“ఆఁ. ఆఁ. బాగానే ఉన్నాను” అన్నాను తొట్రుపాటుతో.

“మాటాడకపోతేనూ …”

“ఏం లేదు … నాకేం తోచడంలేదు పిన్నీ. ఇవాళ సాయంత్రం మాయింటికోమారు రాకూడదూ,” వీలయినంత మామూలుగా ధ్వనిస్తూ అన్నాను.

“అలాగే” అంది పిన్ని. ఆ ఒక్కమాటకే నామనసు చల్లబడింది.

“ఇంకోగంటలో నాపనయిపోతుంది. ఇక్కడనించి తిన్నగా మీఇంటికి వచ్చి నిన్ను మాయింటికి తీసుకెళ్తాను. మళ్ళీ నేనే దింపుతాలే.”

సరేనంది పిన్ని. ఎప్పుడూ ఇంతే ఆవిడ. తూచినట్టు ఎంత మాటాడాలో అంతే మాటాడుతుంది. వెయ్యి ప్రశ్నలతో వేధించుకు తినడం ఆవిడ పద్ధతి కాదు. నేను ఫోను పెట్టేయబోతూంటే అంది “మీచిన్నమామయ్యకి కూడా ఫోన్ చేసి చెప్పు.”

“అలాగే” అనేసి ఫోను పెట్టేశాను.

000

అయిదయేసరికి చిన్నమామయ్య ఇంటిముందు వాలేను. ఇంట్లో ఇంకెవరూ లేరు. పిన్ని  వాకిట్లో సిద్ధంగా ఉంది. ఉల్లిపాయరంగు వెంకటగిరి చీరే, తెల్ల జాకట్టుతో.

“వెళ్దామా?” అంది పిన్ని నన్ను చూడగానే ఆప్యాయంగా.

పద అన్నాను నేను కూడా వెనక్కి తిరుగుతూ.

కారు నడుపుతున్నానన్నమాటే కానీ మనసంతా చిరాగ్గా ఉంది. ఎంత ప్రయత్నించినా జూలీమొహం మనసులోంచి చెరుపుకోలేక పోతున్నాను.

లేక్ మొనానా పక్కనించి వెళ్తున్నాం. నీటిమీంచి పిల్లగాలులు మొహాన సుతారంగా తాకుతున్నాయి ఊరడిస్తున్నట్టు.  పిన్ని వేపు చూశాను. ఆవిడ కిటికీలోంచి అటువేపు చూస్తోంది.

“ఇక్కడ కూచుందాం,” కారు పక్కకి తీసి ఆపేను. ఇద్దరం కారు దిగి నీళ్ళకి దగ్గరగా గడ్డిమీద కూర్చున్నాం. గాలి మెల్లిగా వీస్తోంది. నీళ్ళలో అలలు చిన్నగా కదులుతున్నాయి. బాతులు నీళ్ళమీద తేలుతూ, ఒడుపుగా చిన్నచేపల్ని మింగడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒడ్డున ఓ రెండు బాతులు సేద దీరుతున్నాయి.

“ఇంటినించి ఉత్తరాలు వస్తున్నాయా?” పిన్ని అడిగింది..

“రెండ్రోజులక్రితం ఒకటొచ్చింది.”

హఠాత్తుగా నామీద నాకే చిరాకేసింది. నామీద నాకే జుగుప్స ఉవ్వెత్తున లేచి పడింది. దిగంతాలలోకి దృష్టి సారించి చూస్తూ అన్నాను, “అన్నయ్యా, వదినా, పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. పిల్ల ఆ యింట మహా గౌరవంగా పెరుగుతున్నమాట కూడా నిజమే. కానీ, దాన్ని కన్న తల్లిని నేనూ …”

ఒక నిముషం ఆగి మళ్ళీ అన్నాను, “ఎవరేం అనుకున్నా సరే నాకఖ్ఖర్లేదు. ఎవరేం అన్నా నేను పట్టించుకోను. నిజానికి నాతప్పుకి … అసలు నాతప్పు మాత్రం ఎందుకవుతుంది? నాతప్పు కాదు. .. తప్పు ఎవరిదైనా బిఢ్డ ఎందుకు బాధపడాలీ? దాన్నిక్కడికి తెచ్చి పెంచుతాను. నాబిడ్డని నాదగ్గరే పెట్టుకుంటాను.”

ఈ మాటలు అనేశాక, మనసు కుదుటపడింది. ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది. నాబిడ్డ నాదగ్గరున్నంత హాయిగానూ ఉంది.

“మంచిది. తీసుకురా,” అంది పిన్ని.

నేను తలెత్తి ఆవిడమొహంలోకి చూశాను. ప్రశాంతంగా ఉంది. మొనోనా నిర్మలంగా ప్రవహిస్తూంది.

హాయిగా గుండెలనిండా గాలి పీల్చుకున్నాను. సోమవారం జూలీకి చెప్పేస్తాను.

000

(ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం. నవంబరు 12, 1982.

నా ఆంగ్లానువాదం, Mother Figure,  ఇక్కడ)

నా

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

11 thoughts on “అమ్మ తపన”

 1. మీస్పందనకోసం ప్రత్యేకంగా ఎదురు చూసేను. మీరు కథ, కథనంమీద స్పందిస్తారు కనక.. చదివి మీఅభిప్రాయం వ్రాసినందుకు దన్యవాదాలు వనజగారూ.

  మెచ్చుకోండి

 2. అబ్బ … గుండె మెలితిప్పిన బాధ. తప్పు వున్నా లేకపోయినా పిల్ల అమ్మ దగ్గరే పెరగాలి. జూలీ ప్రవర్తనకు కారణం అర్ధమైంది. మర్చిపోలేని కథ.

  మెచ్చుకోండి

 3. @ ఇందూ, మధన, వేదన నిజమేననుకోండి. అనాలోచితంగానో, స్వార్థంతోనో మరోజీవిని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చినతరవాత, ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోవడం కూడా ఘోరమే కదా. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. @ శారద, ఈరోజుల్లో ఇలా రాస్తే కొందరికి నచ్చడంలేదు. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
  @ శాయిరాంఘంటా, మీకు ఇది నచ్చినందుకు సంతోషం. కుడివేపు వర్గాలపట్టీలో కథలు చూడండి. దాదాపు నాకథలన్నీ ఉన్నాయి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.