ఊసుపోక – ఇంటికీ ఒంటికీ ఆరోగ్యం కోపం

(ఎన్నెమ్మకతలు 59)

తనకోపమె తన శత్రువు అంటారు కానీ నన్నడిగితే ప్రపంచాలు కోపాలవల్లే మెరుగుపడ్డాయని నా అభిప్రాయం. విశ్వామిత్రుడికి కోపం రాకపోతే పాపం త్రిశంకుడికి సొంత సొర్గం పొడగట్టేది కాదు. సత్యభామకి కోపం రాకపోతే పువ్వుగుర్తు పద్యం వినే భాగ్యం మనకి కలక్కపోను. ప్రజలకి కోపం రాకపోతే, రెండోపార్టీ పాలనలోకి రాదు. అంచేత కోపమువలన కొన్ని మంచిపనులు జరుగుతాయనే నాసిద్ధాంతం. అసలు ప్రతివారూ వారానికో నెలకో డే ప్లానరులో గుర్తెట్టుకుని, ఒక కోపం తెచ్చుకోవాలని కూడా ప్రతిపాదిస్తాను నన్నడిగితే.

పోతే, మనలాటి సామాన్యమానవులకి కోపం రావడం సాధారణంగా రెండువిధాల జరుగుతుంది. ఒకటి – మనం అనుకున్నది అనుకున్నట్టు జరక్కపోతే. రెండు – మనకి కావలిసినట్టు లేదా మనం చెప్పినట్టు ఎదటివారు చెయ్యకపోతే. రెండు సందర్భాలలోనూ కోపావిర్భావం జరిగేతీరు మాత్రం ఒకటే. మొదట విసుగు, తరవాత నిరాశ, ఆ తరవాత నిస్పృహ, ఆ పైన పైస్థాయి చిరాకు కలుగుతాయి. ఈ చివరిస్థాయిలో టెంపరేచరు పెరిగేక కోపంలాటిది వస్తుంది. ఆపైన నిజమైన కోపం రేగిపోతుంది.

కోపం వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? మీరూ చదివే ఉంటారు వ్యక్తివికాసం పుస్తకాల్లోనో, సంఘమర్యాద కితాబుల్లోనో. ఆ మనశ్శాంతి మంత్రాలు ఇలా ఉంటాయి – ఒకటి దగ్గర మొదలెట్టి వందవరకూ లెక్కపెట్టు.  వెనక మహరాణులకి కోపగృహాలుండేవిట. ఇప్పుడు తత్సమమైన గదిలోనో ఉన్నగదిలోనే ఓ మూలనో చేరి కుళ్ళి కుళ్ళి కుమిలిపో.

పోతే, ఆ పుస్తకాల్లో చెప్పనివి, ఇతోధికంగా ప్రాక్టీసులో ఉన్నవీ, ఎవరికి వారే చేసుకునే ఏర్పాట్లు ఏమిటంటే – గళమెత్తి కేకలేయడం, తలుపులూ గోడలూ తన్నడం. లేదా, తమకంటే చిన్నవాళ్ళూ, మెత్తనినవాళ్ళూ దొరికితే వాళ్ళమీద గొంతు చించుకు కేకలేయడం … మరి సామెతుంది కదా మెత్తనివారిని చూస్తే మొత్తబుద్ధని. అంటే చాలామంది అలా చేస్తారనే కదా అర్థం. పదుగురాడు మాట, మరియు చేయు పని పాటియై చెల్లు ధరను. అసలు మెత్తనివాళ్ళు మనచేత మొత్తబడడానికే పుట్టేరని నా గట్టి నమ్మకం.

ఇంకో దారి – మీరు డెస్క్ లేదా లాప్‌టాప్‌కోవిదులయితే ఇది పనికొస్తుంది. ఏదో ఓ టపా చూసి, ధణుతెగిరేలా, కసి తీరా ఓవాఖ్యానం రాసి పారేయడం. … “మీకథల్లో ఇంగ్లీషు వాడకండి, తెలుగులోనే రాయండి” అంటూ నేను సతాయించినట్టుగా అన్నమాట. దీనికి ప్రతిగా, “ఏంటండీ యూ అండ్ యువర్ సతాయింగ్ … హేపీగా ఇంగ్లీష్‌లో రాస్తే ఎవ్విరిబడీ అండర్స్టాండ్ కదా. థింకెబౌటిట్. kaneesam ingleeshu aksharaallo raaste maaku arthamavuthundi” అంటూ నన్నెవరూ కోప్పడ్డానికి పూనుకోలేదెంచేతో మరి. బహుశా దీనికి the other రూపమేమో ఈమధ్య వస్తున్న “మాకిష్టం లేని బ్లాగులు” జాబితాలు. అయితే, ఈ జాబితాల్లో కొంచెం నచ్చనివి, ఎక్కువ నచ్చనివీ, చచ్చినా నచ్చనివీ, ఏడ్చి మొత్తుకున్నా నచ్చనివీ, ఏడు పుఠాలేసినా నచ్చనివీ, నచ్చింపించుకోలేనివీ …. ఇలా అభీష్టాలవారీగా ఒక క్రమం ఏమైనా ఉందేమో నాదృష్టికింకా ఆనలేదు. ఏమైనా ఇది కూడా మనశ్శాంతిని ప్రసాదించేదే అని మాత్రం ఒప్పుకుతీరాలి. అలా ఒప్పుకోడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

అమెరికనులకి కోపం శమించడానికి మార్గాలు – ఒకటి. లాంగ్ వాక్కెళ్ళడం. రెండు. ఐస్‌క్రీం తినడం. నేను లాంగ్ వాక్ రోజూ వెళ్తాను కనక దానికీ, కోపోపశమనానికీ సంబంధం లేదు. ఇహ ఐస్‌క్రీం తినడానికి నాకు కోపమే రానక్కర్లేదు. ఏ వేళప్పుడయినా తినగలను, అదీ మహదానందంతో. అంచేత ఐస్క్రీం కోపాలూ, తాపాలూ తీర్చడానికి పనికొచ్చే సాధనం కాదు కనీసం నావిషయంలో. ఇంకా షాపింగ్, మేకింగ్ అవుట్ కూడా వున్నాయి కానీ అవి  ప్రస్తావించడానికి వేరే టపా కావాలి.

మరి నేనేం చేస్తానంటే – ఇల్లు ఖాళీ చెయ్యడం. అంటే నేను ఇల్లు మారడం కాదు. గిన్నెలూ, గరిటెలూ, పుస్తకాలూ తదితరాలూ ఫుట్‌బాల్లా గదిలో ఈమూలనించి ఆమూలకి విసిరేయడం కాదు.  ఏళ్ళతరబడి నేను వాడని సామగ్రీ మరోయింటికి తరలించేయడం నేను అంటున్నది. ఇంటినించి ఇంటికి చరించేవే చరాస్తులు. దీనికి converse చరాస్తులు ఇలాగే పంపకాలు అవుతాయి.

మొదట తాపీగా, ఓపిగ్గా లైబ్రరీలో పుస్తకాలు stock verification చేసినట్టు, గత ఆరేళ్లుగా, నాలుగేళ్లుగా, రెండేళ్ళుగా – ఒఖ్ఖ అంటే ఒఖ్ఖసారి కూడా వాడనివి – ఏరి పోగులు పెడతాను. ఆ తరవాత వాటిలో ఆరేళ్ళుగా వాడనివి మొదట పారేస్తాను. ఆ తరవాత నాలుగేళ్ళుగా వాడనివి, రెండేళ్ళుగా వాడనివి … ఇలా ఎంతో జాగ్రత్తగా, మహానిష్ఠతో .. కోపం చల్లారేవరకూ ఏరడం, పారేయడం .. ఇందులో సుఖం ఏమిటంటే, ఈవిధానంలో ఒరులని నొప్పించడం లేదు సరికదా నా ఇల్లు సర్దుకోడం కూడా అయిపోతుంది పనిలో పనిగా. ఇదీ నా పద్ధతి.

అసలు ఇది ఎందుకు మొదలు పెట్టేనంటే, ఈమధ్య కొంతకాలంగా నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకని అడక్కండి. అది నా ప్రైవేటు విషయం. ప్రైవేటు విషయాలు పత్రికలలోనూ, టీవీలోనూ ప్రచారం చేసుకునేరకం కాదు నేను. అంచేత ప్రస్తుతానికి కేవలం కోపోపహరణ రీతులు మాత్రమే వివరిస్తానిక్కడ.

పైన చెప్పినట్టు క్రమపద్ధతిలో ఏరి పోగులు పెట్టడం జరుగుతుండగా, ఆ వరసలో కనిపించిన పెద్ద కుప్ప గత 30 ఏళ్ళుగా నేను పోగుచేసిన ఆడియో టేపులు. అన్నీ మంచి కర్ణాటసంగీతమే కానీ రెండేళ్ళకి పైనే అయినట్టుంది ఒక్కసారి కూడా వినలేదు. అస్సలు వాటిమీద చెయ్యేస్తే గొంగళీపురుగులు పాకినట్టు ఒళ్ళు జలదరిస్తోంది. ఎప్పుడైనా, నాగీత బాగుండి, ఏ సుజాతో (గడ్డిపూలు), ఆస్ట్రేలియా శారదో తమబ్లాగులో ఓ మంచి పాట పెట్టినప్పుడు లేదా చర్చించినప్పుడు “అయ్యో అది నాదగ్గరుందే, నేను వినడంలేదే!” అని విచారించడమే కానీ ఆ కాసెట్ తీసి స్టీరియోలో పెట్టే సద్బుద్ధి కలగడంలేదు. … అంచేత అవి కూడా ఇప్పుడు విసర్జించవలసిన గుట్టలోకి చేరిపోయేయి. తీరా గుట్ట అయితే పడింది గానీ చూస్చూసి చెత్తబుట్టలోకి గిరాటేసే గుండెబలం మాత్రం లేకపోయింది నాకు. “గుండెబలం ఏమిటి?” అనకండి. నిజంగా మనకి అస్సలు ఏవిధంగానూ పనికిరాని, అక్కర్లేని వస్తువులు కూడా పారేయడానికి మనసొప్పదు. అలాటిది అంతో ఇంతో ఇష్టపడి దాచుకున్న వస్తువులని వదిలిపెట్టడం సామాన్యమా? మీకు నామాట నమ్మకం లేకపోతే, మీకు మీరే ఓ ప్రయోగం చేసి చూసుకోండి.

ఇంతకీ నేను అలా పొరుగువారికి బట్వాడా చేసేసేవిషయంలో “అవునూ”, “కాదు” అనుకుంటూ సందిగ్ధావస్థలో ఓరోజంతా కొట్టుమిట్టాడితే మర్నాటికి మరో దారి కనిపించింది. తదనుగుణంగా, వెంటనే హడావుడిగా నాకున్న నలుగురు తెలుగుమిత్రులనీ ఫోన్లో పిలిచేసి, అడిగేశాను “చక్కని శాస్త్రీయసంగీతం టేపులిస్తాను, పుచ్చుకుంటారా?” అని. వాళ్ళయితే పుచ్చుకోడానికి ఇచ్చగించేరు కానీ నాకే మరో చిక్కొచ్చి పడింది.  “రికార్డింగు బాగుందా?” “గాయకులెవరు” లాటిప్రశ్నలు వాళ్ళు అడిగేరు. … చిక్కు – వాళ్ళు అలా అడిగినందుక్కాదు. వాళ్లు అంత ఉత్సాహం చూపించేసరికి నాకే వాటిమీద మమకారం వచ్చేసింది. ;). (ఇది మళ్ళీ వాళ్ళతో అనకండి. బాగుండదు.)

అన్నట్టు, ముందే చెప్పవలసిన మరోమాట – నాకోపం ప్రథమపాదం రోజుల్లోనే, నేనెలాగా పాటలు వినడంలేదు కదా అని స్టీరియో సెట్టు దానం చేసేశాను. ఆతరవాతన్నమాట ఈ టేపులేం చెయ్యడం అన్న ప్రశ్నొచ్చింది. (ప్చ్. తె.త.!­)

సరి. రికార్డింగ్ బాగుందా? అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, అవి నేను మళ్ళీ వినాలి కదా. అన్నట్టు ఇక్కడే, ఇంకా చాలా ముందే చెప్పవలసినమాట మరోటుంది – నేను టేపులు కొన్నతరవాత అవి ఎక్కడ పాడయిపోతాయో అని,  ఒరిజినలులు దాచేసి, “వాడుక కాపీలు” వేరే చేసి పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఎంతో ఉదారబుద్ధితో పంపకాలు పెట్టదలుచుకున్నవి ఈ వాడుక కాపీలన్నమాట. (ఇలాటప్పుడే నా కోపం పరిపక్వదశకి చేరుకోలేదనీ, నాకు వైరాగ్యం సంపూర్ణంగా సిద్ధించలేదనీ అంటారు శాస్త్రవిదులు)

ఇంతకీ రికార్డింగ్ బాగుందో లేదో చూడ్డానికి కెసెట్ ప్లేయరు కావాలి. దానికోసం బయల్దేరితే, మళ్ళీ నాసాంకేతిక పరిజ్ఞానం ఎంత వెనకపడి ఉందో మరోసారి ఋజువైంది. … ప్రతిషాపువాడూ ఎంతో ఓపికగా చెప్పేడు ఇప్పుడెవరూ కెసెట్ ప్లేయర్లు వాడడం లేదుట. అందరూ సీడీ ప్లేయరులూ, ఐపాడులే వాడుతున్నారుట. … నేనిలా కొత్తవిషయాలు తెలుసుకుంటూ షాపు వెంట షాపు తిరగ్గా, తిరగ్గా, కనిపించినవాటి వరస ఇలా ఉంది –

ఒక షాపులో ఒకటుంది కానీ అది పెద్దదిగా ఉంది. నాకు పెద్దవస్తువులు ఇష్టం లేదు.

మరోషాపులో సీడీ మరియు కాసెట్ ప్లేయరు. నాదగ్గర సీడీలు లేవు. నాకు పనికిరాని భాగం ఇంటికి తెచ్చుకోడం నాకు అభ్యంతరం.

మరోషాపులో కాసెట్ ప్లేయరు చూడ్డానికి బాగుంది – ఇది కూడా నాకు ముఖ్యమే. కాసెట్ ప్లేయరు శ్రవణానందం కావాలి కానీ నేత్రానందం కానక్కర్లేదు అంటారు కొందరు … ఏమో, వాళ్ళకి ఫరవాలేదేమో కానీ నాకు వస్తువు చూడ్డానికి కూడా బాగుండాలి. అసలు ఒకొకప్పుడు కేవలం చూడ్డానికి బాగుందని కొన్నవి కూడా ఉన్నాయి, ప్రతిసారీ కాదనుకోండి. …. ఇంతకీ అది చూడ్డానికి బాగుంది కానీ హెడ్సెట్ లేకుండా పని చెయ్యదుట. అంచేత అది కూడా “నేతి, నేతి” గోతిలో పడిపోయింది. ..

ఇలా తిరుగుతున్నానే కానీ మరో పక్కన నామనసులో మరో ఆరాటం – ఇంట్లో ఎ.టి.పి. ఆట అయిపోతోందే అని. … .. అలా అటు టెన్నిసూ, ఇటు కెసెట్ ప్లేయరూ… చెరోపక్కకీ లాగుతూ నా ప్రాణాలు తోడేస్తుంటే, చివరికి తెగించి ఓ చిన్న వాక్మన్ లాటిది కొన్నాను ఇంట్లో గదిగదికీ తిరుగుతూ, పిల్లిపిల్లనో చంటిపిల్లనో ఎత్తుకు తిరిగినట్టు తిరగొచ్చని.

ఇంటికొచ్చి, టీవీ పెట్టేసరికి, షరపోవా మాచ్ పాయింట్ దగ్గరుంది. అయ్యో పాపం కిం క్లైస్టర్ అని జాలి పడబోతుంటే, చూస్తూండగానే కిమ్ నాకళ్ళముందే రెచ్చిపోయి (నాకోసమే కానోపు) గేం కొట్టేసింది.  ఇంకేముంది ఆపైన అంతా సుఖాంతం. కిం గెలిచేసి నన్ను ఆనందసాగరంలో ముంచేసింది.

అలా ఆరోజు సోఫాలో వాలి, కాలుమీద కాలేసుకుని, టెన్నిస్ వ్యాఖ్యాతలనోరు నొక్కేసి, ఆట మాత్రం చూస్తూ, “పరిపాలించుమని పలుమారు వేడితే” …అంటూ జేసుదాస్ పాడుతుంటే, ఐస్‌క్రీం తింటూ నేను పొందిన ఆనందం వివరించడానికి మాటలు చాలవు. మీక్కావలిస్తే మీరే అనుభవించి తెలుసుకోండి, అంతే.

మరి కోపంమాటేమిటి అంటారా? అయ్యో, రామా! ఇంట ఇంత నాటకం జరుగుతుంటే ఇంకా అదెక్కడ గుర్తుంటుందీ? . … అసలు నాకు జ్ఞాపకమే లేదు మీరడిగేవరకూ …

(ఆగస్టు 24, 2010. )

.

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఊసుపోక – ఇంటికీ ఒంటికీ ఆరోగ్యం కోపం”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.