ఉత్తమశ్రేణి కథకుడు శారద (యస్. నటరాజన్) -1

శారద కలంపేరుతో తెలుగువారికి విజయవాడ, తెనాలి నేపథ్యంతో అద్భుతమైన కథలు అందించిన శారద కేవలం రాసింది ఏడేళ్ళపాటు, 1948 నించి 1955 వరకూ అంటే ఆశ్చర్యం కలక్కమానదు. ఆయనగురించి అప్పుడూ ఇప్పుడూ కూడా పాఠకులకి తెలిసింది చాలా తక్కువ. తమిళడనీ, ఏదో హోటల్లో సర్వర్‌గా పని చేస్తూ స్ఫూర్తిదాయకమైన కథలూ, నవలలూ రాసేడనే తప్ప ఆయన వ్యక్తిత్వం, ఉపజ్ఞ అజ్ఞాతంగానే ఉండిపోయేయి ఇంతకాలం.

తెనాలిలో శారదగారి మిత్రులూ, సాహిత్యాభిమానులూ కలిసి, శారద సాహిత్యవేదిక అన్న సంస్థ స్థాపించి, శారదగారి రచనలనన్నిటినీ సేకరించి సంకలనాలుగా ప్రచురించడం ప్రారంభించేరు. తొలి సంకలనం రక్తస్పర్శ 1998లో వచ్చింది. కవర్ పేజీ రెండోవేపు “ఈపుస్తకంద్వారా వచ్చిన ఆదాయం శారద సాహిత్యం ప్రచురణకై వినియోగింపబడుతుంది” అని వివరించేరు ఆ సంస్థవారు.

ఇంతవరకూ మూడు సంపుటాలు వచ్చేయి. వాటిలో ఒకటైన శారద రచనలు పుస్తకానికి శారదగారి ఆప్తమిత్రులలో ఒకరైన ఆలూరి భుజంగరాయశర్మ (భుజంగరావు) శారద జీవితంగురించి సవిస్తరంగా ముందుమాట రాశారు. ఆ విశేషాలు నన్ను చకితురాలిని చేశాయి. అదంతా ఇక్కడ రాయలేను కానీ కొన్ని ప్రధానాంశాలు చెప్తాను.

శారద బాల్యం పుదుక్కోటైలో గడిచింది. తల్లి పోయేనాటికి శారదకి రెండేళ్ళు. సుబ్రహ్మణ్య అయ్యర్‌కి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. శారద కడసారి బిడ్డ. ఇద్దరు అక్కలకి తెనాలిలో అబ్బాయిలకిచ్చి పెళ్లి చేసాడు తండ్రి.. ఒక అల్లుడు భీమారావు హోటల్ యజమాని. ఆయన, మామగారి కోరినమీదట, బావమరిది శారదకి హోటల్లో ఉద్యోగం ఇచ్చాడు. అక్కడ పని ఎక్కువా జీతం తక్కువా అయి శారద తిండికి చాలానే తిప్పలు పడ్డాడు.

తెనాలి వచ్చేనాటికి శారదకి పన్నెండేళ్లు. పదిహేనేళ్ళు తిరక్కుండా తండ్రి గతించాడు. తండ్రి దహనక్రియలు అయింతరవాత, యింటికి తిరిగి వస్తూ, మూర్ఛ వచ్చి రోడ్డుమీద పడిపోయేడుట. ఆ మూర్చవ్యాధితోనే 32వ ఏట మరణించేడు.

శారదకి చిన్నతనంనించీ కథలమీద ఆసక్తి. మద్రాసులో తండ్రి దినమణికదిర్ ఆఫీసులో సంపాదకుడుగా కొంతకాలం పనిచేయడం శారదకి పత్రికలూ, కథలమీద ఆసక్తి పెంచుకోడానికి దోహదం అయిందేమో. తెనాలి వచ్చింతరవాత ఒక వీధిబడి పంతులుదగ్గర పట్టుదలతో తెలుగు నేర్చుకుని కథలు రాయడం మొదలు పెట్టేడు. కాయితాలు కొనడానికి స్తోమతు లేక కలెక్టరాఫీసువారు పారేసిన చిత్తుకాయితాలు ఏరుకుని, రెండోవేపు రాసేవాడుట. హోటల్లో నిలకడలేని ఉద్యోగం చేస్తూనే.

1946లో అరసం నిర్వహించిన సాహిత్య పాఠశాల శారదకి తనదైన దృక్పథం, మార్గం ఏర్పరుచుకోడానికి దోహదం అయిందంటారు సురేష్. (శారద రచనలు, ముందుమాట.)

తెలుగు స్వతంత్రలో 1950-51 మధ్యలో క్షణంలో సగం అన్న ధారావాహిక శీర్షికలో రాజకీయ వ్యంగ్యరచనలు చేశాడు. రెండు నాటికలు, ఆరు నవలలు రాశాడు. చివరినవల చీకటితెరలు అసంపూర్ణం. ఇంకా కవితలు కూడా రాశాట్ట. నేను చూడలేదు.

శారద కర్తవ్యోన్ముఖుడు. తెలుగుస్వతంత్రలో ప్రచురించిన నా సమస్యలు అన్న ఒక వ్యాసంలో తన ఆర్థికబాధల గురించి రాస్తాడు. స్వాతంత్ర్యం వచ్చేక దేశం బాగుపడుతుందనుకున్నాడు కానీ తనలాటి వారిజీవితాలలో ఏమీ మార్పు లేదని వాపోతాడు. రచయితలకి పారితోషికం హక్కు అని ఉద్యమం లేవదీశాడు. మూర్ఛ జబ్బు వలన ఎప్పుడు ఎక్కడ పడిపోతాడో తెలీనిబాధతో, ఏపూట పస్తో తెలీని పరిస్థితుల్లో కూడా చందాలు వసూలు చేసి అన్నదానం చేసేడంటే ఆయన సంస్కారం, కార్యదీక్ష అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా రాయడం “చూడండి, శారద ఎన్ని కష్టాలు పడ్డాడో” అని చెప్పడానికి కాదు. చాలామంది మహారచయితల్లాగ శారద రాసేదొకటీ, చేసేదొకటీ కాదని చెప్పడంకోసం ఇది. అంతే కాదు. ఆయన కథలు కేవలం “చూసి” రాసినవి కావేమో అనిపిస్తుంది. ఆయన కళ్ళారా చూసిన జీవితం, అనుభవించిన కఠోరసత్యాలూ, ఆవేదనా, ఆత్మఘోషా ప్రతిభావంతంగా చిత్రించాడాయన తన కథల్లో. అందుకే అరవై ఏళ్ళతరవాత ఆ కథలు చదువుతుంటే నాకు ఆనాడు చదివిన అనుభూతే కలుగుతోంది మళ్ళీ ఇప్పుడు.

ఏది సత్యం, మంచీచెడూ, అపస్వరాలు నవలలు ధారావాహికంగా వారపత్రికలలో వచ్చినప్పుడు ఎంతో ఉత్సుకతతో చదివిన వేలాది పాఠకులలో నేనూ ఉన్నాను. విజయవాడలో కృష్ణ ఒడ్డున కొండలూ, నల్లరాతి మండపం, మొగల్రాజపురం చూడకపోయినా, శారద రచనలమూలంగా అవి నాకు సుపరిచితంగానే ఇప్పటికీ అనిపిస్తున్నాయంటే ఆయన శైలి ఎంత ప్రశస్తమయినదో ఊహించుకోవచ్చు.

కథలు రాయడం ఒక ఎత్తయితే, వాటిని మనకళ్ళముందు ప్రత్యక్షమయేలా చిత్రించడం మరొక ఎత్తు. ఉన్నదున్నట్టు, చూసింది చూసినట్టు చాలామంది రాయగలరు. కానీ వాళ్ళు చూసింది మన మనసుల్లో శాశ్వతంగా ముద్ర వేసేట్టు కొందరు మాత్రమే రాయగలరు. శారద సృష్టించిన ప్రపంచం అలాటిది. ఆ వాతావరణం, ఆ మనుషులూ మనకి నిజాలు అయిపోతాయి ఆకథలు చదివిన తరవాత.

ఒక సన్నివేశాన్ని గానీ, ఒక పాత్రని గానీ ఎంతో నేర్పుగా ఆవిష్కరింపజేస్తాడు శారద. ముఖ్యంగా నవలల్లో అడుగడుగునా బిళ్లగోచీ పోసి పంచె కట్టిన అబ్బాయిలూ, అరచొక్కా, బీడీలు, సిగరెట్లూ, కాఫీ హోటళ్లలో గందరగోళంగా వినిపించే రకరకాల శబ్దాలూ, మొగల్రాజపురం మొదట్లో పెద్దలోగిలి, విజయవాడ స్టేషనూ, క్రిష్ణ నీళ్లూ, శివాలయం వీధిచివరనున్న అఢ్డసందులో మూడో కొట్టూ, మొగల్రాజపురం వెళ్ళేదారిలో కొండమీద త్రిమూర్తులకి పైన ఖిలమైన ఎనిమిది స్తంభాల నలుచదరపు నల్లరాతి మండపం, అక్కడ బ్రాకెట్లూ, పేకాటా, సిగరెట్లూ .. … ఈదృశ్యాలు చదవడం అయిపోయినతరవాత కూడా మనసులో నిలిచిపోతాయి పాఠకులమనసులో.

ఏదిసత్యం ఆయన మొదటి నవల అనుకుంటాను. అందులో ప్రధానాంశం అన్యోన్యంగా ఉండే ఒక మధ్యతరగతి దంపతుల జీవితం. భర్త సాంబశివరావు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కాలు విరిగితే, ఫ్యాక్టరీ యజమాని అతనికి వైద్యం సరిగ్గా జరగనివ్వడు compensation ఇవ్వవలసివస్తుందని. భార్య పార్వతి తప్పనిసరిగా ఉద్యోగంలో చేరితే, సాంబశివరావుకి అనుమానాలు idle brain is devil’s workshop అన్నవతుగా. ఆ అనుమానాలకి పార్వతి సహోద్యోగి సుబ్బారావు  ఆజ్యం పోసి వారిద్దరి జీవితాలు సర్వనాశనం చేస్తాడు. మనిషిలో మానసిక దౌర్బల్యాలు ఎలా ఏర్పడతాయో, వాటిమూలాన జీవితాలు ఎలా నాశనం అవుతాయో హృద్యంగమంగా చిత్రిస్తారు శారద ఈ నవలలో.

మంచీ చెడూ లో ప్రధానాంశం 50 దాటిన భద్రయ్య 20 ఏళ్ల పద్మని పెళ్లి చేసుకున్నందున వచ్చిన అనర్థాలు. భద్రయ్య కొడుకు భాస్కర్రావు కంటే రెండేళ్ళు చిన్నది సవతితల్లి పద్మ. ఆమె తనకి ఈడూ జోడూ అయిన భాస్కర్రావుమీద మనసు కానీ ప్రపంచానికి జడిసి కొంతా, భాస్కర్రావు గుణగణాలు ఎంచి కొంతా వెనక్కి తగ్గుతుంది.

భద్రయ్య  ఆప్తమిత్రుడూ, దూరపుబంధువూ అయిన సుదర్శనం భద్రయ్యకి వ్యాపారంలో అండ. ఆయన కూతురు సరోజిని సవిత్తల్లిమూలంగా అగ్ని ప్రమాదానికి గురయి, మొహం కాలిపోయి, ఆ వికృతరూపాన్ని మేలిముసుగుతో కప్పుకుని రోజులు గడుపుకుంటూ ఉంటుంది. భద్రయ్యకి పద్మతో రెండోపెళ్లి ఏర్పాటు చేసింది సుదర్శనమే. తరవాత తనకూతురిని భాస్కరానికి చేసుకోమంటాడు. పెళ్ళిచూపులనాడు కానీ భాస్కర్రావుకీ, భద్రయ్యకీ సరోజిని రూపం తెలీదు. భాస్కర్రావు సరోజిని చూడగానే, తడుముకోకుండా “నేనసలు ఈ జన్మకి పెళ్ళి చేసుకోదలచలేదు” అన్నాడు చాలా సహజంగా సుదర్శనంగారిమొహం చాలా తీవ్రంగా మారిపోయింది.

“నీకూతురు నచ్చలేదు” అంటే ఆయనకి అంత బాధ అనిపించేది కాదు. … … కానీ భాస్కర్రావుమాటల్లోని తీవ్రమైన వ్యంగ్యం ఆయనగుండెల్లో గుచ్చుకున్నట్టయింది. (శారద నవలలు. పు. 163.)

భాస్కర్రావు మాటగురించి “కడివెడు పాలల్లో ఒక్కచుక్క విషం! అంతులేని దయా ప్రేమా గల మనస్సుకు ఒక్క పుల్లవిరుపు మాట” అంటాడు కథకుడు. నిజమే. అనాలోచితంగా, ఆవేశంతో మనం అనే మాట పుల్లవిరుపుమాట అవతలివారిని ఎంతగా నొప్పిస్తుందో అని ఆలోచించేవారు తక్కువ.

సుదర్శనం భాస్కర్రావు అన్నమాటమీద కోపంతో భద్రయ్యకుటుంబంమీద కక్ష కట్టి వారిఆస్తిని సర్వనాశనం చేస్తాడు. పద్మ కోరికలు తీర్చుకోడానికి ఇతరులనాశ్రయించి ఇల్లు విడిచి, వేశ్యగా బతుకు వెళ్ళబుచ్చుకుంటుంది. కథలో ఇంకా చాలా మెలికలున్నాయి. చివరికి పద్మ తనకి పుట్టిన బిఢ్డని పెంచమని భాస్కరానికి ఇచ్చి వెళ్ళిపోవడంతో కథ ముగుస్తుంది.

ఈకథలో ప్రధానాంశం పద్మ, భాస్కర్రావుల కథ అయితే, రెండో అంశం సుదర్శనంగారి కూతురు సరోజినీ, ఆమెని డబ్బుకోసం పెళ్ళాడిన శేఖరం కథ. పెళ్ళిచూపులనాడు భాస్కర్రావూ వాళ్ళూ వెళ్ళిపోయినతరవాత సరోజిని తనగదిలోకి పోయి భోరుమన్నది. ఆమెబాధ తండ్రికి అర్థం కాదు. ఆయన పంతాలకి పోయి, పద్మకి మన్మథుడిలాటి పెళ్ళికొడుకుని తెస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. వెనకా ముందూ ఎవరూ లేని యువకుడు శేఖరంతో సరోజిని పెళ్ళి జరిపిస్తాడు. శేఖరం జల్సారాయుడు. సరోజినితో అతని పనల్లా డబ్బులు వడుక్కునేవరకే. కొంతకాలానికి తిట్టడందాకా వచ్చేక, సుదర్సనంగారు నయాన్నా, భయాన్నా చెప్పి అతన్ని ఓదారికి తీసుకురావడం ఈనవలలో విశేషం.

ఇదే ఇతివృత్తం స్వార్థపరుడు అన్న మరో చిన్నకథలో కూడా చూస్తాం. బహుశా ఆ చిన్నకథతో ప్రారంభమయిన ఈ సమస్యని ఈనవలలో ఒక కొలిక్కే తెచ్చేడేమో రచయిత అనిపిస్తోంది నాకు. ఏది ఎప్పుడు రాసేరో నాకు తెలీదు కనక నిజంగా ఇలాగే జరిగిందని చెప్పలేను కానీ మొత్తంమీద వికలాంగులజీవితంగురించి శారద ఎక్కువగా ఆలోచించినట్టే కనిపిస్తుంది ఈ రెండూ చూస్తే.

ఈ నవలలో నాకు కాస్త ఎబ్బెట్  టుగా అనిపించినవి రెండు – వారంరోజుల్లో ఇంటికి రానున్న కొడుక్కి మాటమాత్రమయినా చెప్పకుండా భద్రయ్య హడావుడిగా పెళ్ళి చేసుకోడానికి కారణం కనిపించదు. ఈరోజుల్లో హడావుడి పెళ్ళిళ్ళు చూస్తున్నాం కానీ వెనకటి రోజుల్లో అస్సలు లేవనను కానీ చాలా తక్కువ. భద్రయ్య అంత హఠాత్తుగా పెళ్ళి చేసేసుకోడానికి తగినంత బలమైన కారణం నాకు కనిపించలేదు. రెండోది, భాస్కర్రావుని ఎంతో ఉదాత్తుడుగా చిత్రించాడు రచయిత. తండ్రి పెళ్ళి అయిపోయేవరకూ ఆ సంగతే తెలీని భాస్కర్రావు, “పిన్నీ, నీకు తీరని అపచారం చేశాం. క్షమించు” అంటాడు (పుట. 175). అంతటి ఉదాత్తుడయిన భాస్కర్రావు సరోజినిమొహం చూడగానే తనకి పెళ్ళిమీదే విరక్తి పుట్టిందని అనడం ఏమాత్రం సెన్సిటివిటీ ఉన్నవాడయినా చేసేపని కాదనుకుంటాను. ఆ తరవాత స్నేహితుడితో కూడా అదే మాట, “ఆ రూపం చూసినతరవాత ఎవరికైనా పెళ్ళిమీద విరక్తి కలుగుతుంది” అంటాడు. తన సవిత్తల్లి పద్మ విషయంలో ఎంతో ఔదార్యం చూపిన ఈ భాస్కరమేనా అనిపించక మానదు ఈ సందర్భంలో.

అయితే భాస్కర్రావు పాత్రచిత్రణలో ఈ ప్రవృత్తి వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోడం? నాకు తోచింది ఇది – నిత్యజీవితంలో ఇలా స్పందించడం మరీ అంత జరగని విషయం కాదు. ఏ మనిషి కానీ ఒక్కొక్కప్పుడు చటుక్కున మాట తూలడం సహజమే. అయితే రచయిత ఆలోచించవలసిన విషయం – కథల్లో ఏదో ఒక కోణాన్నో ఒక అభిప్రాయాన్నో ఆవిష్కరించడానికి పాత్రలు సృష్టించడం జరుగుతుంది కనక దానికి కట్టుబడి నడిపించాలి ఆ పాత్రని. రెండోది మనదేశంలో ఇలాటివి – సవిత్తల్లి పిల్లల్ని హింసించడం, అగ్నిప్రమాదాలకి గురిచేయడంలాటివి అంత రహస్యంగా ఉంచడం అనుమానాస్పదమే. ఊళ్ళోనే ఉన్న భద్రయ్యకి ఈ సంగతి తెలీకుండా ఉండడం మనదేశంలో జరిగే సంగతేనా? శారద ఈ రెండు సన్నివేశాలని ఎందుకు సృష్టించేరో నాకు తెలీదు. ఇలా జరగడానికి అస్సలు అవకాశం లేదు అని కూడా నేను అనడం లేదు. కానీ ఇవి కథకి ఆయువు పట్టు. అంచేతే ఇవి సృష్టించడం జరిగి ఉండవచ్చు.

రెండో బాగానికి లంకె ఇక్కడ

ఈకథమీద ఈ బ్లాగులోనే చర్చలు ఇక్కడ చూడవచ్చు –

http://wp.me/p9pVQ-ys

http://wp.me/p9pVQ-yR

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “ఉత్తమశ్రేణి కథకుడు శారద (యస్. నటరాజన్) -1”

 1. @ అనిల్, ధన్యవాదాలు.
  @ సావిరహే, అదేనండి, మనం చాలామంది మంచిరచయితలని మర్చిపోతున్నాం. మీకు గుర్తున్నందుకు సంతోషం.
  @ SSRao, సంతోషం. మీరు కూడా స్వార్థపరుడు చర్చలో పాల్గొనగలరని ఆశిస్తున్నాను.
  @ సౌమ్య, నా పొరపాటే. దిద్దేను. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. “భద్రయ్యకి పద్మతో రెండోపెళ్లి ఏర్పాటు చేసింది భద్రయ్యే.”
  -అంటే… రెండో భద్రయ్య -సుదర్షనం అనా మీ ఉద్దేశ్యం?

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ !
  ‘ శారద ‘ గురించి మంచి పరిచయం అందిస్తున్నారు. ధన్యవాదాలు.
  మీకు, మీ కుటుంబానికి
  వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

  SRRao

  శిరాకదంబం

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s