ఉత్తమశ్రేణి కథకుడు శారద (యస్. నటరాజన్) – 2

స్వార్థపరుడు కథలో వకీలు విజయరాఘవరావు కూతురు పద్మకి ఒకే ఒక్క లోపం – పుటకతోనే చచ్చుపడిన కాళ్లు. విజయరాఘవరావు వారాలకుర్రాడు ప్రకాశాన్ని చేరదీసి మొదట వారాలు ఏర్పాటు చేసి, చదివించి, తరవాత అల్లుడిని చేసుకుంటాడు. ప్రకాశరావు జల్సాలకోసం డబ్బుకోసం పద్మని పీడిస్తూ ఉంటాడు. తనపరిస్థితి క్షణ్ణంగా తెలిసిన పద్మ మొదటినుండీ పెళ్ళికి సుముఖురాలు కాదు కానీ తంఢ్రి వేదన చూసి ఒప్పుకుంటుంది. మొదట్లో కొన్నాళ్ళు ఇచ్చినా, చివరికి విసిగి, తనదగ్గర లేదు అంటుంది.

“మీ నాన్ననో, అమ్మనో అడిగి …” అని మాట ఆపి భార్య ముఖవర్చస్సులోని మార్పుకి  విభ్రాంతుడయినాడు ప్రకాశరావు. అసహ్యం వ్యక్తపడే ముఖకవళికలు పెట్టి, పద్మ “వాళ్ళను అడగను. నాదగ్గర లేదు,” అని ఖచ్చితంగా చెప్పేసింది.

ప్రకాశరావు “గడపకేసి నడిచాడు. పద్మ ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. ప్రకాశరావు అనుకున్నట్టు ఆమె అతనిపాదాలపై బడలేదు. అప్పుడే కాదు ఆమె జీవితాంతంవరకూ అతనికోసం ఏవిధమయిన బాధా పడనూ లేదు.”

(ఈకథ ఏమిటి ఇట్లా ముగిసీ ముగియనట్లున్నది అని ఎవరూ ఆశ్చర్యపడనక్కర్లేదు. పద్మ ఏమాత్రం తను కుంటిది అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు ఫీల్ ఐవున్నా కథ సుఖాంతమై ఉండేది. పద్మని ప్రకాశరావు పాదాలమీద పడెయ్యటం సంభవిస్తే ఈకథ వ్రాయటం అనవసరం. ఒక్క సుఖంకోసం మాత్రమే ప్రకాశరావు ఆమెని పెళ్ళి చేసుకోలేదు కద? -రచయిత).

………

ఈ కథ చదివిన తరవాత నాకు కలిగిన ఆలోచనలు – ప్రకాశరావు చిన్నప్పుడు వారాలు చేసుకుని చదువుకున్నాడు కనక చదువుమీద శ్రద్ధ ఏమాత్రమో అప్పట్లో ఉండే ఉంటుంది అనుకోవాలి. కాలేజీలో చేరడానికి ఉత్సాహం చూపించేడు కానీ పెళ్ళి తరవాత చదువుమీద శ్రద్ధ తగ్గిపోయింది. డబ్బుకి ఇరకాటంగా ఉన్నప్పుడు కనీసం తన సాదరు ఖర్చులకయినా ఓ చిన్న ఉద్యోగం చూసుకోవచ్చు అతను. ఇది తార్కికంగా ఆలోచించేవారికి తోచే ప్రశ్న. కానీ సుఖాలకలవాటు పడ్డవాళ్ళకి అలాటి ఆలోచనలు రావు అని రచయిత ఉద్దేశ్యం కావచ్చు. పద్మని వదిలేసి పోతానని అరిచి పోవడంతో కథ ఆగిపోయింది కానీ అతను ఎక్కడికి పోతాడు, పోతే ఎలా జరుగుతుంది అన్న ప్రశ్నలకి సమాధానాలు లేవు. బహుశా అక్కర్లేదు కూడాను. ఎందుకంటే, ప్రకాశరావులాటి స్వార్థపరులకి దన్నిచ్చే ఉదారులు ఉన్న లోకం ఇది.

ఇక్కడే మరో ఆలోచన కూడా వస్తోంది నాకు. ప్రకాశరావు ఒక్కడేనా స్వార్థపరుడు. అతన్ని చేరదీసిన విజయరాఘవరావు, అతన్ని పెళ్ళాడ్డానికి అంగీకరించిన పద్మ – వీళ్ళందరికీ ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయి. స్వార్థం అన్నది ప్రతివారి ప్రవృత్తిలోనూ కనిపించదా?

ఈ కథ నాకు ప్రత్యేకంగా కనిపించడానికి మరో కారణం కథ చివర రచయిత ఇచ్చిన వివరణ. రచయిత ఇలా ఎప్పుడు వివరించవలసివస్తుంది అన్నది నా సందేహం. నేను ఆరోజుల్లో వివరణలు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఆ అవసరం కనిపిస్తోంది. అది ఒక కారణం. రెండోది పద్మ వ్యక్తిత్వం. ఆమె పెళ్ళికి ఒప్పుకున్నది తంఢ్రికి మనశ్శాంతి అని. అంచేతే పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు కానీ ప్రకాశరావు తనని వదిలేస్తానన్నప్పుడు కానీ ఆమె ఎలాటి తీవ్రమైన అనుభూతులకి లోను కాలేదు.

ఈ నవలాత్రయంలో నాకు ఎక్కువగా నచ్చిన నవల అపస్వరాలు. ఇందులో మొదటి కుటుంబం స్కూల్లో తెలుగు పండితుడు రంగయ్య గారిది. ఆయన కొడుకు సదానందం సాధుశీలి, భావుకుడు, చిత్రరచనలో ఆసక్తి గలవాడు. కూతురు జయకి పెళ్ళయింది. రెండో కుటుంబం రంగయ్యగారి వియ్యంకుడు శేషాద్రిరావుది. ఆయనకొడుకు త్రయంబకరావుతో రంగయ్యగారి అమ్మాయి జయకి పెళ్ళి అయింది. కట్నంలో వెయ్యి రూపాయలు తక్కువ అయేయని మామగారు పిల్లని కాపురానికి రానివ్వడు. ఆయన కూతురు రమణమ్మ వితంతువు. తమ్ముడిని హేళన చేసీ ముక్కచీవాట్లేసీ తమ్ముడూ,, మరదలి కాపురాన్ని ఓ కొలిక్కి తెస్తుంది.

కథలో మరో ముఖ్య పాత్ర వరదరాజు. సకల దుర్వ్యసనాలూ ఉన్న వరదరాజు కొందరిపట్ల ఎంతో మానవత్వం ప్రదర్శించడం ఈకథలో విశేషం. అతనికి రంగయ్యగారంటే అపరిమతమయిన గౌరవం ఉన్నా ఆయన సంసారం కూలిపోడానికి పరోక్షంగా కారణమవుతాడు.

కట్నంమూలంగా సంప్రాప్తించే అనర్థాలు ప్రధానాంశం అయినా, నవలలో సందర్భానుసారంగా “ఓనమాలు రాని పబ్లిషర్లు” రచయితలవిషయంలో చూపే నిరాదరణ, ధర్డ్ ఫారం ఫెయిలయిన మెంబర్లతో textbook కమిటీలూ, “భాషాహంతకులు” రాసే textbooks (పుట 297), డబ్బు విరజిమ్మి గెలిచే ఎలక్షన్లూ, నాటకాలపేరుతో మృత్యుంజయశాస్త్రి కళాపోషణ – లాటి అనేకవిషయాలమీద బలమైన విసుర్లు ఉన్నాయి. ఆనాటి సామాజిక వాతారణం అద్భుతంగా చిత్రించాడు శారద తన రచనల్లో.

హాస్యం, వ్యంగ్యం పుష్కలంగా ఉన్న నవల ఇది. అంచేతే నాకు నచ్చిందేమో కూడా. పై రెండు నవలల్లో కథ సీరియస్‌గా సాగుతుంది. ఈనవలలో శారద శైలి మరింత పదును తేలి, వాస్తవానికి మరింత దగ్గిరయినట్టు అనిపించింది నాకు.

శారదకథల్లో స్త్రీపాత్రలన్నీ బలమైనవి. మంచీ చెడూలో పద్మ “తప్పుదారి” తొక్కినా, అలాటిపని చెయ్యడానికి కూడా ధైర్యం కావాలి. అలాగే తండ్రులు కూతుళ్లంటే అభిమానం చూపడం కూడా చూస్తాం. తమకి చేతనయినంతలో తండ్రులు కూతుళ్లని సుఖపెట్టడానికి ఎంతో తపన పడతారు. సరోజిని ముఖం కాలిపోడానికి సవిత్తల్లి కారణం. సుదర్శనం రెండో పెళ్ళి చేసుకోకపోతే సరోజిని ఈస్థితికి వచ్చేది కాదని ఆయన క్షోభ. అయినా మళ్ళీ మూడోపెళ్ళి చేసుకోడం విచిత్రంగా కనిపించవచ్చు ఈనాటి పాఠకులకి కానీ ఆనాడు అది సర్వసామాన్యం. సరోజిని ఓర్పుతో భర్తలో కాస్త చలనం కలిగించడం చూస్తాం. స్వార్థపరుడు కథలో పద్మ, తండ్రికోసం పెళ్ళికి ఒప్పుకున్నా, గొప్ప చిత్తస్థైర్యం ప్రదర్శిస్తుంది ముగింపులో.

మిగతా నవలలు నేను ఆరోజుల్లో చదవలేదు. వాటిగురించి అసలు నాకు తెలీదు కూడాను. ఇప్పుడే మొదటిసారిగా చూశాను. వాటిలో మహీపతి డిటెక్టివ్ కథ. చీకటిదారులు రచయిత మరణించినందున అర్థంతరంగా ఆగిపోయిన నవల. ఈకథకి కూడా మధ్యతరగతి జీవితాలూ, ఆకలీ, ఆర్థికసమస్యలూ ప్రాతిపదికే అయినా కొంతవరకూ ప్రేమకథలాగా కూడా నడుస్తుంది ఉన్నంతమేరకి. చివరికి రచయిత ఏం చేసేవాడో పాఠకులే ఊహించుకోవాలి.

1950-51 మధ్యకాలంలో శారద తెలుగు స్వతంత్రలో క్షణంలో సగం శీర్షికతో సుమారు 20 వ్యంగ్యాత్మక వ్యాసాలు రాసేరు. ఆనాటి రాజకీయాలమీద తీక్షణమైన విమర్శలతోపాటు మనుషులకీ, వస్తువులకీ, మనస్తత్త్వాలకీ వ్యంగ్యాత్మకంగా పేర్లు పెట్టడంలోనూ, చిత్రవిచిత్రమైన వాక్యాలు నిర్మించడంలోనూ ఎంతో ఉపజ్ఞ చూపించారు శారద.

శారద రాసిన రెండు నాటికలు నరబలి, అహల్య. .

క్షణంలో సగం వ్యంగ్యరచనల్లోంచి కొన్ని చమత్కారాలు మచ్చుకి చూడండి!

—-

కథ గోదావరికీ నేను పోలీసు స్టేషనుకీ వెళ్ళాము. గడియారం తప్పు నడుస్తోంది. కాలం ఎదురు తిరిగింది. కొరియా యుద్ధం సమాప్తమయ్యేట్టుంది. .. సైనిక కవాతుల వార్తాచిత్రాలకి “శాంతి రక్షణ” అని పేరు పెట్టడం ఎంతైనా సముచితంగా ఉంది. నేతిబీరకాయలో నెయ్యి తియ్యటం విషయమై నియమించబడిన కేంద్రనిపుణల సంఘం రిసెర్చి నిమిత్తం మద్రాసు రానున్నారు.

“భార్యా రూపవతీ శత్రుః” అనే సామెతని “భార్యా జ్ఞానవతీ శత్రు!” అని దిద్దుకోవలసివచ్చిందన్నారు గీతారావుగారు. కారణం వారు ఇదివరలో, (భార్యకి చదువురాని కాలంలో) ఏం చెప్పినా ఆమెకి గొడవగా ఉండి, భర్తనైపుణ్యానికి ఆశ్చర్యపోయేదట. ఇప్పుడ కాస్త చదువుకుంది! కథ అడ్డం తిరిగింది. భర్త చెప్పేవన్నీ పోసికోత కబుర్లని విమర్శిస్తోంది. (క్షణంలో సగం. పు. 217. జులై 27, 1951)

………….

వాదనల్లో ఉండే విషయాల్ని ఊరికే ఊకదంపుడుగా వాదించడం విద్యారావుకి అలవాటు. అవి ఎటూ తేలవు కనక … ఒక పురుగు రెండుగా చీలుతుంది. .. దాని ప్రతిభాగం ఒక్కో పురుగు అవుతుంది. అంటే దేని వ్యక్తిత్వం దానిదేనన్నమాట. మళ్లీ ఆ పురుగులు చీలుతాయి…. అట్లాగే … ప్రకృతిలో నివసిస్తూ, “వాయుపట సమితులు” స్థాపించిన మహానుభావులూ ప్రకృతివైచిత్రికి లోబడి రెండేసిగా చీలుతూ, తూలుతూ, తమ చుట్టూ వాతావరణాన్ని మలినం చేస్తున్నారు (శా. రచనలు. పు. 218. ఆగస్టు 3, 1951)

………….

మూడుగంటల చవట చిత్రాలకి ఆరులక్షలవ్యయం చేతకాని ప్రభుత్వానికి చేసిందన్నా తప్పు అవటం ఇష్టంలేని యుద్ధానికి సంవత్సరాలతరబడి సమాలోచనలు, దూరపుకొండలైన “శాంతి”కి సంతకాల సంరంభం, స్వంతాన కథ రాయలేని వాడికి పాతపత్రికలు శరణ్యం, సరుకులేని పత్రిక్కి మెరిసే ముఖచిత్రం (పు. 223. ఆగస్టు 24, 1951)

…………

(విద్యారావుగారు ప్రకటించనున్న నవ్యాంధ్రనిఘంటువులో కొన్ని ముత్యాలు)

తెల్లకాకిః ప్రతివాదితరఫున సాక్షులు తమకళ్ళతో ప్రమాణపూర్తిగా చూచిన పక్షి.

సోషలిజం. ఎన్నికలు సమీపిస్తున్నకొలదీ ప్రతిపార్టీకి ఎదటిపార్టీల ఆశయాలలో కనబడని ఒక తత్త్వవిశేషం.

సంస్కరణః ప్రతివాడూ చెయ్యాలనుకునేదీ, “అనివార్యకారణాలవల్ల” విరమించేదీను.

విమర్శకుడుః ప్రీవ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిసినిమా మీదా రివ్యూ రాయలేకపోతే బతకలేని ఒక తెలుగు సత్యవాది.

.(శారద రచనలు. పు. 229. అక్టోబరు 26, 1951.)

కేవలం ఏడేళ్ళలో శారద సృష్టించిన సాహిత్యం తెలుగువాళ్ళకి ఒక వరం. ఆయన స్ఫూర్తి, ఉపజ్ఞ, ప్రతిభావిశేషాలు చెప్పడానికి ఇలాటి చిన్నవ్యాసాలు చాలవు. ఆ రచనలు చదివి తెలుసుకోవలసిందే. తెనాలిలో ఆయన మిత్రులు ఆయన రచనలనన్నిటినీ సేకరించి ప్రచురించడానికి పూనుకోవడం ఎంతైనా హర్షించదగ్గ విషయం. వారు ఇంతవరకూ ప్రచురించిన పుస్తకాల వివరాలు కింద ఇస్తున్నాను.

ఈ రచయితకథ స్వార్థపరుడు కి నాఅనువాదం ఇక్కడ చూడవచ్చు.

శారద సాహిత్యవేదిక, తెనాలి, వారిచ్చిన వివరాలనిబట్టి, శారధ రాసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం దొరకగల శారద సాహిత్యం.

1. రక్తస్పర్శ. తెనాలి. శారద సాహిత్యవేదిక, 1998.

ప్రతులకు, హైదరాబాదులో, విశాలాంధ్ర బుక్ హౌస్, దిశ పుస్తకకేంద్రం, నవోదయ, నవయుగ. విజయవాడలో, నవయుగ, నవోదయ, మైత్రి బుక్ హౌస్, ప్రగతి.  వెల 30 రూ.

2. శారద నవలలు. హైదరాబాదు, పర్‌స్పెక్టివ్స్, 1999.

దొరికేచోటు. నవోదయ బుక్ హౌస్,

3-3-865 ఆర్యసమాజ్ ఎదురు వీధి

కాచిగూడ, హైదరాబాదు 500 027.

ఫోను. 4652387.  వెల. 100 రూ.

3. శారద రచనలు. తెనాలి. శారద సాహిత్యవేదిక, 2002.

ప్రతులకు. హైదరాబాదులో విశాలాంధ్ర, దిశ పుస్తకకేంద్రం, నవోదయ.

విజయవాడలో, నవోదయ, ప్రజాశక్తి బుక్ హౌస్.  వెల 50. రూ.

(సెప్టెంబరు 11, 2010.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “ఉత్తమశ్రేణి కథకుడు శారద (యస్. నటరాజన్) – 2”

  1. * ఒక తమిళుడై ఉండి, తెలుగుని మాతృభాషగా చేసుకుని, ఆ భాషా మాధ్యమంలోనే , తన చుట్టూ ఉన్న సమాజన్ని తన దృష్టితో, పాఠకుడికి ఆవిష్కరించి చూపడం ఒక అద్భుతం.
    తెలుగులో ఆలోచించి, తెలుగులో స్పందించి, తెలుగులో తన అభిప్రాయాలన్ని ఒక తెలుగు వాడిగా, ‘వాడి‌’ గా, వేడి గా, చురుకు తగిలేలాగ వ్రాసిన “శారద” ని అభినందనించలేకుండా పోతున్నాను.

    * నేటి టి.వి “విశ్లేషకుడు”ని “శారద” ఏ విధంగా నిర్వచించేవారో? 🙂

    * శారద లోని ఆ రాజకీయ చైతన్యమే నన్ను ” స్వాతంత్ర స్వరూపం” పోస్ట్ చెయ్యడానికి పురికొల్పింది. ప్రస్తుతం తెలుగువారికి కావల్సింది కూడా ఆ “దృష్టి – స్పూర్తి”.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s