ఊసుపోక – “లుండెడివి కావా?”

(ఎన్నెమ్మకతలు 60)

సుప్రసిద్ధ రచయిత ముళ్ళపూడి వెంకటరమణగారు చాలా చాలా కాలం క్రితం, అంటే బ్లాగురులలో ముప్పాతికమంది పుట్టకముందే అడిగినప్రశ్న అది. పై శీర్షికలో ఇచ్చిన పదకేళి వెంకటరమణగారి ప్రశ్నలో రెండోసగం మాత్రమే. పూర్తి ప్రశ్న “శ్రీకృష్ణునకు మీసములుండెడివా, లుండెడివి కావా?” అని.

శ్రీకృష్ణునకు మీసములుండెడివో, లుండెడివి కావో అన్నది నాకు అంతగా పట్టలేదు కానీ “లుండెడివి” అన్నది ఎప్పుడు సార్థకమవుతుంది అన్న సందేహం వచ్చింది.

“లు”కారమునకు ఉత్త్వంబు పరంబైనప్పుడు, ఉత్వంబు లుప్తంబగునా? “లు”కారంబు నిత్యంబగునా, బగదా అని అన్నమాట.

ఇంకా “లుండెడివికావు,” “లుండవచ్చును,” “లుండెననుటకు ఆధారములు లేవు” – అంటూ “లుండు” క్రియాపదం నానారకాలుగానూ వాడవచ్చునా? సంధి నిత్యమా, వైకల్పికమా? – ఇలా చాలా ప్రశ్నలు ఉదయించేయి నా బుద్ధిహీన బుర్రకి.

ఏంటీ ఇదంతా పాణినీయమా?, చిన్నయసూరి వ్యాకరణంలో సూత్రాలా? అంటూ హెవీ డ్యూటీ పృచ్ఛలేయకండి. నాకూ తెలీదు. చెప్పేను కదా కేవలం నాకొచ్చిన తిలకాష్ఠబంధనం సందేహాలే అని.

నేను తెలుగుకథలు అనువాదాలు చెయ్యడం మొదలుపెట్టినరోజుల్లో నాఅనువాదాలు అమెరికన్ స్నేహితులకి చూపించేదాన్ని వారి అభిప్రాయాలకోసం. వారు “ఇక్కడ కామా ఉండాలి,” “ఇక్కడ కేపిటలుండాలి” అంటూ నాభాషలో లోపాలు చూపేవారు. (వీటిని ఈకలాగుడు, లేక సరిచూతలు అంటారని సౌమ్య ఉవాచ). నా అమెరికన్ సోదరసోదరీమణులు భాషావిషయకంగా నన్ను అలా జ్ఞానవంతురాలిని చేయడం సమంజసమే అయినా, అసలు విషయం, కథాంశం, పాత్రలూ, కథలో సంస్కృతికి సంబంధించినవిషయాలు – వీటిగురించి మాటాడరేం అని నాకు బాధగా ఉండేది.

ఆఖరికి తెగించి ఒకావిడని సూటిగా అడిగేశాను. దానికి ఆమె సమాధానం, “కథలోని విషయాలని విమర్శించడం మాకు మర్యాద కాదు. అంచేత మేము ఆ విషయాలు మాటాడం,” అని చక్కగా బోధ చేసింది నాకు.

ఇలా భావాలని ఒదిలేసి, భాషని దులపడం పాశ్చాత్యసాంప్రదాయం అని అనడంలేదు నేను. ఇది మన ఘనాపాఠీ పండితులు కూడా చేస్తారు. వెనక ప్రెగడ నరసరాజు ఇలాగే దేశదేశాలా చక్కర్లు కొట్టేవాడుట “నేను మీకవిత్వంలో తప్పులు పట్టగలను” అంటూ. అసలు కవిత్వానికి అది చెల్లుతుందేమో కూడా. ఎందుకంటే, కవిత్వంలో ప్రధానంగా ఛందోలక్షణాలకే కదా పెద్దపీట. కాదంటారా? సరే, మీరే రైటు. నాకు ఛందోలక్షణాలూ తెలీవు. అందులో తప్పులు పట్టే మేధా లేదు. అంచేత మీరేం చెప్తే అదే రైటు.

ఇంతకీ ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే, అసలు కథ చదివినప్పుడు కథలో ఏముందో, అది మనకి బాగుందో లేదో చెప్పడం మానేసి, ప్రూఫ్ రీడింగ్ చెయ్యడం ఎప్పుడు జరుగుతుంది అని. ఒకానొప్పుడు, కథే కాకుండా, కథమీద వ్యాఖ్యలు కూడా ఈ ప్రూఫ్ రీడింగ్‌ వాత బడుతున్నాయి. రామాయణంలో పిడకలవేట అంటే ఇదేనా? అన్నట్టు ఈసామెత పుట్టుపూర్వోత్తరాలేమిటో ఎవరైనా చెప్పగలరా దయచేసి? నిజంగా నాకు తెలీకే అడుగుతున్నాను.

ఆమధ్య ఒక ప్రముఖపండితుడు నావిన్నపాన్ని కాలదన్ని లేదా అపార్థం చేసుకుని, “మీవంటి పొగరుమోతు, దురహంకారి…” అంటూ ఓ పనస చదివితే, నాకు తల తిరిగి నోట్లోకొచ్చింది. చాలా అయోమయం అయిపోయింది. “పొగరుమోతు” అనాలా? “పొగరుబోతు” అనాలా? ఏ సందర్భములలో “మ”కారంబు “బ”కారంబగును లాటి అనేక సంశయాలతో నానా కంగాళీ అయిపోయింది నాబుర్ర.

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. “పొగరుమోతు” అని తిట్టినా, “పొగరుబోతు” అని తిట్టినా, “మీరు” అంటూ మన్నించినందుకు మహ ముచ్చటేసిందనుకోండి. అవును మరీ. నా సర్విస్‌ పాటి వయసు లేని కుర్రాడు! నువ్వు అనకుండా మీరన్నాడంటే … మన సంస్కృతీ, సాంప్రదాయాలు ఎంత కూలంకషంగా గ్రహించినవాడై ఉండాలి!!

ఇంగ్లీషులో ఈమర్యాదలు లేవు. “చెప్పు,” “చెప్పండి,” “చెప్పవే,” “చెప్పరా” – అన్నిటికీ ఒకే ఒక్క పదం. కదాచితుగా సర్లూ, మేడములు వాడినా, మామూలుగా పేరు పెట్టే పిలుపులు. నా అమెరికా జీవన తొలిదశలో నా మోకాలెత్తు లేని పిల్లలు నన్ను పేరు పెట్టి పిలిస్తే నాకు ఆశ్చర్యంగా ఉండేది. అయితే ఒకమాట మాత్రం ఒప్పుకుంటాను బేషరుతుగా.  సకలం తెలిసిన పెద్దలు మేలథై, మలాటీ అంటూ నానావిధాలా నాపేరు పచ్చడి చేసేస్తుంటే, పిల్లలు మాత్రం చక్కగా చిలకల్లా పలికేవారు. అంచేత అది నాకు శ్రవణానందకరంగానే ఉండేది.

తిట్టడం మాటకొస్తే, అందులో కూడా అమేయమయిన మర్యాద పాటిస్తారు అమెరినులు. మనలాగ సూటిగా, నిర్మొహమాటంగా, “మీరొఠ్ఠి చెత్తవెధవలండీ” లేక “నువ్వొఠ్ఠి చెత్తవెధవ్వి” (మీరు, నువ్వు తేడాలు ఇంగ్లీషులో లేనందున) అనరు. ఎంతో నాజూగ్గా, స్వరం బాగా తగ్గించి. తామే ఏదో దొంగతనం చేస్తున్నట్టు ఇరుదిక్కులా పరకాయించి చూచి, “మీమాట ఎవరైన వినినచో, మీరు ఒఠ్ఠి చెత్తవాదనలు (గమనించండి ఇక్కడ చెత్త అన్నది వాదనకి అన్వయించడం జరిగింది) చేయుచున్నారని అనగలరని అనుకొనుటకు అవకాశము గలదని నేను మీకు చెప్పుటకు చింతించవలసివచ్చినందుకు … “ – ఇలా మూడునిముషాలు సాగదీస్తారు. వింటుంటే రాజాధిరాజ, రాజమార్తాండ, జలధిగంభీర, మూరురాయరగండ అనే వందిమాగధులు గుర్తు రావాలి మనకి. మనం ఆ ఘోషలో పడిపోయి, ఆ ఉపన్యాసంలో అసలు విషయం ఏమిటో అర్థం చేసుకునేసరికి ఆ పెద్దమనిషి మూడంగలేసి రెండు వీధులు దాటేసి వెళ్ళిపోయుంటాడు.

ఇంతకీ అసలువిషయానికొస్తే,

దండిపండితుని వాక్కులే ఒప్పు

మనము వినకున్న ముప్పు

ఎందుకొచ్చిన సొద చెప్పు

ఇంతటితో ఈరొద సమాప్పు (అంటే సమాప్తం).

శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారికి అనేకానేక నమస్సులతో. – మాలతి

(సెప్టెంబరు 18, 2010.)

.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “ఊసుపోక – “లుండెడివి కావా?””

 1. రవి, కొంతకాలంగా ఇతరపత్రికలకి నారచనలు పంపడం మానేసాను. పాఠకులు ఇక్కడ కూడా చదువుతున్నారు. మీరు ఇక్కడికొచ్చి చదివినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. మీ దత్తదేశంలో మన పండగల వేడుకలుండునా, లుండవా?
  (శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారికి క్షమార్పణలతో)

  మెచ్చుకోండి

 3. మీరు చెప్పింది చాలా బాగుంది. తెలుగు వెలుగు పత్రికకు కధనాలు రాయండి. భాషాభిమానులు స్పందిస్తారు.

  మెచ్చుకోండి

 4. @ నాగేస్రావ్, అలాగాండీ. బాగుంది. ధన్యవాదాలు.
  @ తెరెసా, రెండోసారి చదూకుని అంటే పెద్ద కాంప్లిమెంటండీ. ధన్యవాదాలు. -:))

  మెచ్చుకోండి

 5. హ హా!! అమెరికన్లు తిట్టడంలోనూ ఎంత మర్యాద పాటిస్తారో మహా రంజుగా వివరించారు 🙂

  మీ ఊసుపోక టపాలన్నీ రెండో సారి చదూకుని మరో సారి నవ్వుకునేలా ఉంటాయి.
  ‘తల తిరిగి నోట్లోకొచ్చింది’ –ఈ expression అయితే అద్దిరింది 🙂

  మెచ్చుకోండి

 6. >>పిడకలవేట అంటే ఇదేనా? అన్నట్టు ఈసామెత పుట్టుపూర్వోత్తరాలేమిటో ఎవరైనా చెప్పగలరా
  మాలతిగారూ, ఈమధ్య ఒక బ్లాగులో ఎవరో అన్నారు, రామాయణం నాటకాలు వేసేప్పుడు మధ్యలో బౌద్ధ పిటకాలు చదివేవారట. ఆ పిటకాలే పిడకలుగా మారినయ్, అని.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s