స్వార్థపరుడు – సింహావలోకనం

ఈ చర్చలో పాల్గొన్న సాహితీమిత్రులు – సౌమ్య, లలిత (తెలుగు4కిడ్స్),  కొత్తపాళీ, సత్యవతి, వైదేహి. ఈ చర్చని జయప్రదం చేసినందుకు, మీకు ధన్యవాదాలు.

ఈ చర్చకి ధ్యేయం – ఒక కథలో వివిధ అంశాలు – ఒకొక పాఠకుడిని ఒకొక విధంగా ఆకట్టుకుంటాయనీ, పాఠకులందరూ ఒక కథని ఒకేలా అర్థం చేసుకోరనీ.

ఇది చాలామందే ఒప్పుకున్నా, ఆ అంశాలు ఏమిటి, ఏ అంశం ఎవరిలో ఏ ఆలోచనలు రేకెత్తిస్తుంది ఎవరు దేనికి ప్రాధాన్యతనిస్తారు వంటివి మరోమారు పునః పరిశీలించడంకోసం ఇది మొదలు పెట్టేను. ఇది పైన చెప్పిన సాహితీమిత్రులమూలంగా కొంతవరకూ ఈచర్చలో విశదమయిందనే అనుకుంటున్నాను. ఇంకా కొన్ని కథలు కూడా ఇలాగే పరిశీలిస్తే, మనం కథని ఎలా అర్థం చేసుకుంటాం అన్నది మరింత స్పష్టం కాగలదు.

ఈచర్చద్వారా నేను ఆశించిన ఫలితం ఏమిటి అంటే – ముందు కానివి చెప్తాను – ఈ చర్చలో ఎత్తిచూపిన అంశాలమూలంగా రచయిత కథ తిరగరాయాలని కాదు. ఎత్తి చూపిన అంశాలన్నీ కథలో లోపాలనీ కాదు.

ఉపయోగకరం ఏమిటంటే – పాఠకుల స్పందనలు ఇలా తెలుసుకోడం మూలంగా, ఇతర పాఠకులకీ, రచయితలకీ, తాము ఊహించని కోణాలు కనిపించవచ్చు. రచయితలు మరొక కథ రాస్తున్నప్పుడు, ఇవి తలుచుకుని, కథని తాము మలచదలుచుకున్న విధానం, కథ ఏర్పడుతున్నవిధానం మరొకసారి తరిచి చూచుకోవచ్చు.

సాధారణంగా పాఠకులు తమ అనుభవాలూ, పరిస్థితులూ, తమజీవితంలోనో తమ ఆప్తులజీవితంలోనో జరిగిన సంఘటనలూ – వీటి నేపథ్యంతో కథకి స్పందిస్తారు. నిజానికి కథ రాసే రచయితవిషయంలో కూడా అంతే జరుగుతుంది కదా. సాహిత్య విశ్లేషణకి అలవాటు పడ్డవారు కథని మరింత సూక్ష్మదృష్టితో పరిశీలించి, ఇంకా కొన్ని కొత్త కోణాలు దర్శించగలరు. అవి ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస మాత్రమే ఇక్కడ నాకు.

ఇంతవరకూ ఈచర్చలో వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇక్కడ క్రోడికరిస్తున్నాను. పూర్తి పాఠాలకి వెనకటి టపా – స్వార్థపరుడు చర్చ- చూడండి.

సూక్ష్మంగా వారి స్పందనలు ఇలా ఉన్నాయి –

సౌమ్య – స్వార్థపరుడు కథలో ఎవర్నైనా స్వార్థపరుడు అనొచ్చేమో. పద్మ పాత్ర అసంపూర్తిగా ఉండిపోయినట్టు అనిపించినా, రచయిత అంతే చెప్పదల్చుకున్నాడేమో అని సరిపెట్టుకోవచ్చు.

ముగింపులో రచయిత వ్యాఖ్యానం, అందునా కథ రాయగానే వ్యాఖ్య రాస్కుంటారా అని సందేహం.

లలిత – తెర తీసినట్టు పాత్రలని క్రమపద్ధతిలో ఆవిష్కరించడం బాగుంది. పద్మ భవిష్యత్తుగురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా ఆమె బాధపడలేదని స్పష్టంగా చెప్పారు. పద్మ పాత్రద్వారా జీవితాన్ని అర్థం చేసుకోడానికి ఒక పరికరాన్ని ఇచ్చినట్లయింది. ప్రకాశరావుని తిట్టడమో, అతనిలో మార్పు ఆశించడమో కాక, పరిస్థితులని అర్థం చేసుకుని (పెళ్ళి చేసుకున్నప్పుడూ, వదిలేస్తానని బెదిరించినప్పుడూ కూడా) తనజీవితాన్ని నిర్దేశించుకున్న పద్మ పాత్ర ఆశ్చర్యపరిచింది.

ప్రకాశరావుకి చివరిక్షణంలో ఉన్నది ప్రతీకారవాంఛ. … జీవితాంతం మోసం చేసి బతికేకన్నా ముగింపులో అతను వెళ్ళిపోయినట్టు చూపించడమే నయం. ప్రకాశరావునే స్వార్థపరుడు అనుకోవాలి అని కథలో ఎక్కడా లేదు కానీ అతనిగురించి ఎక్కువ ఆలోచిస్తాము బహుశా.

మరోముఖ్యమైన విషయం ఆడపిల్లకి పెళ్ళి చేసేసి మనశ్శాంతి కొనుక్కోడం అర్థరహితం అన్నది.

పోతే రచయిత చివరలో వివరణ రాయవలసిన అవుసరం లేదు. అది కథలో స్పష్టంగానే ఉంది. అయినా ఈవివరణ ఇబ్బందిగా అనిపించలేదు.

కొత్తపాళీ – ధనిక ఆసామీ బీదకుర్రాణ్ణి చేరదీసి, చదువు చెప్పించి, అవకరమున్న తనకూతుర్నిచ్చి పెళ్ళి చెయ్యడం మనసాహిత్యంలో సర్వసామాన్యం. ఆ మాత్రందానికి ఎవర్నీ స్వార్థపరుడు అనేసుకోనక్కర్లేదు. అది mutual benefit scheme .

ఈకథలో భిన్నంగా కనిపిస్తున్నవిః 1. డబ్బున్నంత మాత్రాన అన్ని సమస్యలూ తీరిపోవు, 2. ఆడపిల్ల జీవితానికి పెళ్ళి ఒక్కటే పరమావధి కాదు, 3. డబ్బున్నంతమాత్రాన ఆనందాన్నీ, మెరుగైన జీవితాన్నీ కొనుక్కోలేము.

ఈ సత్యాలని ఆవిష్కరించడానికే ఈ కథ రాసినట్టుంది. చివర రచయిత వ్యాఖ్యానం, ముఖ్యంగా రెండో పాయింటు, వీటిని బలపరిచేందుకే.

ఈ సత్యాలని ఆవిష్కరించాలనుకోవడం ఆనాడు వస్తున్న సాహిత్యం యొక్క ప్రభావం కావచ్చు, మార్క్సిస్టు ప్రభావం – సమాజంలో ప్రతీదీ డబ్బుసంబంధమే అన్న ధోరణి -కావచ్చు.  శారద నిజజీవితంలో మార్క్సిస్టు సాహిత్యాన్ని చదివేరనే గుర్తు కానీ ఈకథలో ఏదో సిద్ధాంతానికి కట్టుబడి రాసినట్టు అనిపించలేదు. పద్మలాటి స్త్రీకి తనదైన జీవితం, ఒక స్వేఛ్ఛ ఉండాలనీ, ప్రకాశంవంటి మొగుడితో అది సాధ్యపడదనీ రచయిత బలంగా నమ్మినట్టే కనిపిస్తుంది.

శైలివిషయం – కథానిర్వహణలో అపరిపక్వత, ఒక మాదిరి అమాయకత్వం కనిపిస్తున్నాయి. అపరిపక్వత అంటే – కథ పద్మగురించీ, ప్రకాశంగురించీ అయినప్పుడు, ముప్పాతిక వంతు విజయరాఘవరావుగురించి ఉండడం, ఇంకా వాక్యనిర్మాణంలో స్పష్టత లేకపోవడం కనిపిస్తాయి ఈకథలో.

పి. సత్యవతి – ఈకథకి స్వార్థపరుడు శీర్షిక నప్పలేదు. ఇందులో శారద పద్మవ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలనుకున్నట్టు ఆయన రాసిన నోట్ బట్టి అర్థమవుతుంది కానీ ఆవిధంగా కధానిర్మాణం జరగలేదు. పద్మ అలా ఉండిపోయిందంటూ కథ ఆపడం బాగుంది. నోట్ అనవసరం.

ప్రకాశరావు ఆర్థిక సుస్థిరతకోసమే పద్మని చేసుకున్నాడు. స్వయంగా ఆర్థికసుస్థిరత గల పద్మ ఆ అలంకారప్రాయుడైన భర్త లేకపోయినా జీవించగలను అనుకోడమే ఈకథలో వస్తువు. అయితే ప్రకాశరావు స్వార్థం, పద్మ తల్లిదండ్రులస్వార్థం అన్నీ కలిసి కథానిర్మాణంలో కొంత అపరిపక్వత కనిపిస్తుంది.

వైదేహి – కథ సాఫీగా చదివించింది. బలమైన వ్యక్తిత్వంగల పాత్ర పద్మది. పాత్రచిత్రణ దృష్ట్యా అందం, చదువు, డబ్బు, సంస్కారం ఉన్న పద్మ శారీరక అవకరం కారణంగా ఆత్మన్యూనత గలదానిగా చూపించకపోవడం బాగుంది. పెళ్లి తప్పనిసరి అని భావించలేదు. ప్రకాశరావు తనని పెళ్ళి చేసుకోడం త్యాగమనో, ఆదర్శమనో అపోహలు కూడా లేవు ఆమెకి. అందుకే, అతను తనని అలక్ష్యం చేసి నిందించినప్పుడు అంత నిర్లిప్తంగా వదులేసుకోగలిగింది ఆ సంబంధాన్ని.

ఈకథలో వైరుధ్యాలు – మొదట్లో పద్మ ప్రకాశరావుపై అభిమానాన్ని పెంచుకున్నదనీ, వాళ్ళిద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారనీ, తల్లిదండ్రులు ప్రోత్సహించేరనీ అంటూనే, తరవాత అతనిపై ప్రత్యేకమయిన అభిమానం లేకుండానే పెళ్ళికి ఒప్పుకుందని అంటారు. అలాకాక, మొదటినుంచీ ప్రత్యేక అభిమానం లేదనో, లేదా, అతని ప్రవర్తనమూలంగా ఆ అభిమానాన్ని కోల్పోయిందనో చిత్రిస్తే, వైరుధ్యాలు లేకపోవడం, ఆమె వ్యక్తిత్వానికి మరింత బలం చేకూరడం జరిగేది.

తండ్రి పాత్ర – అతనిది స్వార్థమని అనలేము. చదువుకే కాక, భోజనానికి కూడా జరగని ప్రకాశరావుకు చదువు, ఆస్తి, బంధుత్వాన్ని ఇచ్చాడు ఆయన. ఇంత సహాయం చేశానని దర్పం, భేషజం, హోదా చూపించకుండా సౌమ్యంగా, ఆర్ద్రంగా తనకూతురిని పెళ్ళి చేసుకోమని ప్రకాశరావుని అడగటం గమనించగలం. పెళ్ళి చేసుకుంటేనే అంటూ ఏవీ నిబంధనలు పెట్టలేదు. అలా చూస్తే, అవకరమున్న తనకూతురి భవిష్యత్తు తన చేతనైనట్టు తీర్చి దిద్దాలన్న తపన కనబడుతుంది. దాన్ని స్వార్థం అనలేము.

ఈకథలో అందరికంటే లాభపడింది ప్రకాశరావు. అతనే స్వార్థపరుడు అయే అవకాశం ఉంది. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న పాత్ర. మొదట్లో పద్మతో పరిచయం పెరిగినప్పుడు ఆమెను తన జీవితభాగస్వామిగా ఊహించడానికే సందేహిస్తాడు. తను తగడనుకుంటాడు. తరవాత, పెళ్ళి ప్రపోజల్ వచ్చినప్పుడు ఇంతకంటే కృతజ్ఞత ఎలా తీర్చుకోగలను అనుకుంటాడు. పెళ్ళివేళ స్నేహితుల అభినందనలో జాలి చూస్తాడు. మొదట చదువుకోసం తంటాలు పడ్డవాడు జరుగుబాటు దొరికిన తరవాత చదువు మానేశాడు. పద్మ అవకరంగురించి తెలుసు, పెళ్ళికి ఎవరూ బలవంతం చెయ్యలేదు, పూర్తి సమ్మతితో జరిగిన వివాహం. తనకి ఆర్థిక స్థిరత్వాన్నీ, హోదాని, సాఫీ జీవితాన్ని సమకూర్చిన భాగస్వామితో తన వైవాహికజీవితానికి కట్టుబడి ఉండకపోవడం అతని వ్యక్తిత్వంలో లోపం, బాధ్యతారహితం.

రచయిత చివరలో వివరణ ఇవ్వడం అనవసరం. అది కథ సృజనాత్మకతను, లక్ష్యాన్ని దెబ్బ తీస్తుంది.

——

నా అభిప్రాయం – నేను ఈకథని ఎంచుకోడానికి ప్రథమ కారణం మొదట చెప్తాను. నేను సాధారణంగా మనసంస్కృతీ, సాంప్రదాయాలు చర్చించే కథలకి ప్రాధాన్యతనిస్తాను, విదేశీపాఠకులకి అనువాదాలద్వారా మన సంస్కృతీ, సాంప్రదాయాలు చెప్పడానికి పనికొస్తాయిని.

వారాలు చేసుకోడం వెనక ఉన్న సాంస్కృతికచరిత్ర శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అనుభవాలూ, జ్ఞాపకాలు పుస్తకంలో చూసేవరకూ నాకు తెలీదు. అది చదివినతరవాత, మనరచయితలు ఈవిషయం ఎలా అవిష్కరిస్తున్నారు అన్న జిజ్ఞాస కలిగింది. అయితే శ్రీపాదలాగ ఎవరూ ఈ అంశాన్ని ఆ కోణంలో తడమలేదు.

విశాఖ రచయిత యం. రామకోటి గారు ఒకకథ రాసేరు. పేరు గుర్తులేదు కానీ ఆకథలో వారాలబ్బాయిని ఆ ఏర్పాటుకి అంగీకరించిన కుటుంబాలు చాలా హీనంగా చూస్తారు. చివరికి ఆ అబ్బాయి చదువు మానేసి, దొంగ అవుతాడు. అందుకు భిన్నంగా, డి. కామేశ్వరి వీక్లీబాయ్ (ఈశీర్షిక నాకు నచ్చలేదు) కథ వారాలు చేసుకుని చదువుకుని, ఎంతో ఉన్నతస్థాయి చేరుకున్న ఒకాయన కథ. అందులో వారాలు ఒప్పుకున్న కుటుంబంలో అమ్మాయిని వారాలు చేసుకున్నాయన కుటుంబంలో అబ్బాయికిచ్చి పెళ్ళి చెయ్యడం అసలు కథ అనుకోండి.

శారదగారి స్వార్థపరుడు కథలో మరొక కోణం. చిన్నతనంలో అనేక అవస్థలు పడిన ప్రకాశరావు ఉదారుడైన విజయరాఘవరావు దయవల్ల నిరాటంకంగా సాగుతుంది. దరిమిలా ఆయన మంచితనంమూలంగానే, సంఘంలో కూడా ఉన్నతస్థాయి సంపాదించుకుంటాడు. కానీ ఆ నడమంత్రపుసిరి అతనికి నరాలమీద కురుపు అయింది. అకస్మాత్తుగా వచ్చిన సిరిమూలంగానూ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు మూలంగానూ తనకి దొరికిన పెన్నిధిని సద్వినియోగం చేసుకోలేక, స్వార్థపరుడుగా మారిపోయేడు. ఈదృష్టితో చూస్తే, కథానిర్మాణంలో నాకు లోపం కనిపించలేదు.

కథాంశంలో మార్క్సిస్టు భావాలు ఛాయామాత్రంగా ఉన్నాయేమో నాకు తెలీదు. నాకు ఆ ధోరణులు తెలీవు కనక కథగానే చదివేను. శిల్పం దృష్ట్యా చూసినప్పుడు నాకు ఈకథలో సిధ్ధాంతాలు కనిపించలేదు, కేవలం ఇది ఒక మానసికతత్త్వ చిత్రణ మాత్రమే అనుకుంటున్నాను.

వైదేహి అన్న వైరుధ్యం కూడా వైరుధ్యం కాదనే అనుకుంటున్నాను. కథలో వాక్యం – “పద్మ ప్రకాశరావుని అభిమానించింది అతని లేమికారణంగా” అని. అతను మంచివాడు, వినమ్రుడు, చక్కగా చదువుకుంటున్నాడు – ఇలాటివి కాక, “లేమికారణంగా” అని ప్రత్యేకంగా చెప్పడంతో అది జాలి అనే ధ్వని ఉంది. అది జాలి కాదు అనుకున్నా, మామూలుగా ఒకమనిషితో కబుర్లతో కాలక్షేపం చెయ్యడం వేరు. పెళ్ళికి తలపడడం వేరు. అలా ఆలాచిస్తే, అప్పటికి అతనిప్రవర్తనలో మార్పు గమనించిన పద్మ అతను వెళ్ళిపోతానంటే, నిరామయంగా ఊరుకోడంలో ఆశ్చర్యంలేదు. ఇది కథలో రచయిత వాచ్యం చెయ్యలేదు కానీ అతనిప్రవర్తన పద్మ చూస్తూ ఊరుకుంది అని కథకుడిద్వారా చెప్పించడంలో ఆంతర్యం అదే అనుకుంటాను.

రచయిత చివరలో ఇచ్చిన వివరణ – ఇది కేవలం ముగింపుకి మాత్రమే అన్వయించుకోవాలి అని అనుకుంటున్నాను. అయితే “పద్మని ప్రకాశరావు కాళ్ళమీద పడేయడం సంభవిస్తే, ఈకథ రాయడం అనవసరం” అన్నవాక్యంతో, ఆ వివరణ కథ అంతటికీ వర్తిస్తుందేమో అనిపించినా, ఆ తరవాతి వాక్యం మళ్ళీ ప్రకాశరావుమీదికే మళ్ళించాడు రచయిత. “ఒక్క పద్మసుఖంకోసం మాత్రమే ప్రకాశరావు ఆమెని పెళ్ళి చేసుకోలేదు కద” అంటాడు రచయిత. అంచేత మొత్తంకథ ప్రకాశరావుగురించే అనుకోవాలి.

పోతే, ఆకాలంలో ఇలా వివరణలిచ్చేవారా అంటే, నాకు తెలిసినంతవరకూ లేదు. నా అనుమానం, రచయితకి సాహితీమిత్రులు ఎక్కువే కనక వారు తరుచూ కలుసుకుని కథలు చర్చించుకునేవారనీ, (ఈనాటి బ్లాగులలో లాగ) అలాటి చర్చ ఏదో జరిగో, జరుగుతుందన్న అనుమానంతోనో శారద ఆ వివరణ ఇచ్చేరని.

ఈకథ అనువాదం చెయ్యడం మొదలు పెట్టినతరవాత, కొత్తపాళీ చెప్పిన అపరిపక్వత కొంత కనిపించింది. నాకు సంబంధించనంతవరకూ మొదటిది, పేర్లవిషయంలో. ఇది అనువాదం చేస్తున్నప్పుడు నాకు చాలా ముఖ్యమయిన విషయం. కథలో విజయరాఘవరావుకి వకీలు, లాయరు, పంతులుగారు అనే కాక, సందర్భాన్నిబట్టి, భర్త, తండ్రి అని కూడా వాడడం జరిగింది. కథ చదువుతున్నప్పుడు పాత్రలనీ, ఆవరణనీ మనం ఊహించుకున్నట్టు మన సంస్కృతి తెలీనివారు ఊహించుకోలేరు. ఆదృష్టితో చూస్తే, అనువాదంలో ఏదో ఒక పేరు ఎంచుకుని, దాన్నే consistentగా వాడవలసివస్తుంది. రెండోది – ఇదే మొదటిది నిజానికి – కథలో వాక్యాలు కొన్నిచోట్ల సాఫీగా సాగలేదు. అంటే ఒక  పాత్రగురించి మాటాడుతూ, మరొకపాత్రమాటలు ప్రవేశపెట్టడం, మళ్ళీ మొదటిపాత్ర దగ్గరికి రావడంలాటివి, అదీ ఒకే పేరాలో చెప్పడం కాస్త గందరగోళంగా ఉంటుంది పాఠకుడికి. రెండోది, అనుకుంటున్నారేమో అంటూ సందేహాస్పదంగా వాక్యం ముగించడం అవసరమైనదానికంటే ఎక్కువ జరిగింది. నామటుకు నాకు అది బాగులేదు. కానీ ఇవి చాలా చిన్న లోపాలు అనుకుంటాను.

ఇంకా ఎవరికైనా ఇక్కడ స్పృశించని కోణాలు ఈకథలో కనిపిస్తే రాయడానికి సందేహించకండి.

ధన్యవాదాలతో.

మాలతి

(సెప్టంబరు 20, 2010. )

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “స్వార్థపరుడు – సింహావలోకనం”

 1. మాలతి గారూ,
  నేను కూడా నా అభిప్రాయాలని క్లారిఫై చేయాలన్న ఉద్దేశ్యంతో మాత్రమే వివరణ ఇచ్చాను.అంతే.
  మీరు చేస్తున్న పని బావుంది.ఇటువంటి చర్చలు సరైన సాహితీ వివేచన కు దారి తీస్తాయి .అందుకు వేదిక కల్పించిన మీకు అభినందనలు.

  ఇకపోతే మీరు క్షమాపణలు లాంటి బరువైన భాష వాడి నన్ను బెదరకొట్టకండి ప్లీ…..జ్:-) :-))

  మెచ్చుకోండి

 2. @ వైదేహీ, నేను ఇక్కడ చేసింది మరొకసారి అందరి అభిప్రాయాలు సూక్ష్మంగా వివరించడం మాత్రమే (అసలు సింహావలోకనం అన్నమాట సరియైనది కాదేమో కూడా). నీ అభిప్రాయాలు కూడా పైన కోట్ చేశాను. ఒక కథని అందరూ ఒకేలా చదవరు అన్నదే మనం ఇక్కడ నిరూపించదలుచుకున్నది. ఒకరు తప్పు, మరొకరు ఒప్పు అని కానీ, నేనే రైటు అని కానీ చెప్పడం కాదు. మీఅందరి అభిప్రాయాలూ సమీకరించిన తరవాత నా అభిప్రాయం కూడా చెప్పేను. నామాటల్లో నీకు మరోలా అనిపిస్తే, క్షమాపణలు.

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ,
  మీ పోస్ట్ ఇప్పుడే చూసాను.
  నేనన్న వైరుధ్యాలు గురించి మనం ఆల్రెడీ ఈ మెయిల్ లో చర్చించుకున్నప్పుడు క్లారిఫై చేసానుకున్నాను. మీరు మళ్ళీ మీ సింహావలోకనంలో ఆ సంగతి ప్రస్తావించారు కాబట్టి మళ్ళీ క్లారిఫై చేయక తప్పటం లెదు 🙂

  మీరు పెట్టిన పిడి ఎఫ్ లో రెండవ పేజీలో చివరి మూడు లైనుల్లో” ఆమెకి అతనిపై అభిమానంకలిగింది” అని కధకుడు వ్రాసారు.మళ్ళీ మూడవ పేజీలో “పద్మ అతనిపై ప్రత్యేకమైన అభిమానం చూపలేకపోయింది” అంటారు.నేను చెప్పదలచుకుంది కధకుడు ఒకే మాటని (అభిమానం) ఒకే సందర్భం గురించి (వారిద్దరి మధ్యనున్న సంబంధం) రెండు రకాలుగా వ్రాయటం (ఒకసారి ఉందని ఒకసారి లేదని ) గురించి. ఇంకొంచెం శ్రద్ధ చూపి ఉండాల్సింది.

  ప్రధానంగా పద్మ సంస్కారవంతురాలు కాబట్టి అతని లేమిడి ని చూసి జాలిపడటానికీ,అభిమానించడానికీ అవకాశం ఉంది.అతని వ్యక్తిత్వంలో ఎదో ఒకగుణం ,విశేషం ఆమెని ఆకర్షించి ఉండలి.అది అభిమానం గా పరిణమం చెంది ఉండాలి.కేవలం “జాలి” మాత్రమే అయ్యుంటే పద్మ లాంటి బలమైన వ్యక్తిత్వం,హుందాతనం కలిగిన అమ్మాయి జాలి ప్రాతిపదికగా వివాహానికి అంగీకరించి ఉండదు. పద్మ వ్యక్తిత్వంలో బలం ఆమె స్వాభిమానం కూడా. అందుకే తనను నిర్లక్ష్యం చేసిన భర్తను నిరామయంగా,హుందాగా త్యజించింది.

  అంతేకాకుండా ఇక్కడ రచయిత “అభిమానం’ అని స్పష్టం గా చెప్పినపుడు జాలి అన్న “ధ్వనిలో” తీసుకొన వలసిన అవసరం లేదేమో అని నా అభిప్రాయం. నాకు తెలిసినంతవరకూ లేమిడిని చూసి కరుణ కలుగుతుంది.కేవలం ‘జాలి” వల్ల పెండ్లి
  చేసుకునేంత అభిమానం కలగడం మానవ మనస్తత్వానికి విరుద్ధం.

  మెచ్చుకోండి

 4. చర్చని ఇలా క్రోడీకరించుకోవడం బాగుంది మాలతిగారు.
  చివర్లో అనువాద అనుభవంగా మీరు చెప్పిన మాటలు కూడ బాగున్నాయి. నా ఉద్దేశంలో – అటువంటి పరిస్థితిలో అనువాదం చదవబోయే పాఠకుల్ని దృష్టిలో ఉంచుకుని, యథాతథంగా కాకుండా, వాక్యాలకి, పదాలకి అనుగుణమైన మార్పులు చేసుకుంటూనే అనువాదం సాగాలని నా ఉద్దేశం. మీరన్నట్టు, మూలకథలో ఉన్న సామాజిక, కుటుంబ వాతావరణాన్ని పట్టుకోవడమే అనువాద లక్ష్యం కావాలి, ఒక్కొక్క వాక్యాన్ని సూటిగా తర్జుమా చెయ్యడం కంటే.

  కల్పన గారు, మీరు మీ సీరియల్ని త్వరగా ముగించి మళ్ళీ కథానుభవం లాంటి శీర్షికల్ని పునరుద్ధరించాలని మనవి చేసుకుంటున్నాం అధ్యక్షా!

  మెచ్చుకోండి

 5. @ కల్పనా, ఎప్పుడు వచ్చినా మీరాక మాకానందం 🙂 అవును. కథలో రచయిత స్వరం కూడా చర్చించవలసిన అంశమే. ఇదివరకు నేను రెండు వ్యాసాల్లో – రచయితా, కథకుడూ – అన్నశీర్షికతో కొంత చర్చించాను కానీ ఏదో ఒక కథని తీసుకుని సూక్ష్మంగా పరిశీలించలేదు. నువ్వు ఏదో ఒక కథ నీకథానుభవంలో పెడతానంటున్నావు కదా. కానియ్ మరి. నేను ఇంకా ఆలోచిస్తున్నాను. మల్లాది రామకృష్ణశాస్త్రిగారికథల్లో కథకుడు స్పష్టంగానే కనిపిస్తాడు. నారెండో ఆలోచన ఆచంట శారదాదేవిగారి పారిపోయిన చిలుక. ఈకథని స్త్రీవాదకథగా గుర్తించారు, అందులో కామాక్షమ్మ, ప్రధాన స్త్రీపాత్రని పంజరంలో చిలుకతో పోలుస్తూ. నేను మాత్రం ఆకథని ఇంకా విస్తృతపరిధిలో చూడవచ్చు అనుకుంటున్నాను. ఇవి కాక ఇంకెవరైనా ఇంకే కథ అయినా చర్చకి బాగుంటుందంటే సూచించవచ్చు.
  నీ సపోర్టుకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 6. మాలతి గారు,

  క్షమించాలి. ఇంtha మంచి కథా చర్చ లో పాల్గొనలేకపోయినందుకు….

  అసలు ఇలాంటి చర్చ కథల గురించి మనకు అవసరం అని ఇప్పుడు నేను మళ్ళీ ఒక పెద్ద లెక్చర్ ఇవ్వటం లేదు.ఎందుకంతే అవసరం కాబట్టే మాలతి గారు మొదలుపెట్టారు కాబట్టి. ఇంత మంది ఇంత బాగా చర్చించాక నేను చెప్పటానికి ఏమీ మిగలలేదని మనవి చేసుకుంటున్నాను అఃద్యక్ష…కొత్త చర్చ మొదలు పెట్టమని విజ్నప్తి కూడా చేసుకుంటున్నాను.

  నా బ్లాగ్ లో కూడా ఇంతకు ముందే kathaanubhavam అనే శీర్షిక మొదలుపెట్టాను. అందులో ఒక కథ చదివి ఎలా అర్థం చేసుకోవచ్చు, నాకు ఎలా అర్థం అయింది అనేది చెప్పతమే ప్రధాన ఉద్దేశం. అయితే కథల్లో టోన్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అని నా సూచన. ఈ సారి కథాచర్చ లో ఆ విషయం మీద కూడా దృష్టి పెడదాము.

  kalpana

  మెచ్చుకోండి

 7. మాలతి గారూ,
  కథా చర్చ బాగా జరిగింది.
  ఇతరుల వ్యాఖ్యల ద్వారా, నేను వాటిని ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, వేరే కోణాల గురించి కూడా ఆలోచిస్తున్నాను. వ్యాఖ్యలే కాదు, వాటికి మీ ప్రతిస్పందన కూడా నా మటుకు నాకు ఒక education.
  తర్వాతి కథ కోసం ఎదురు చూస్తున్నాను.
  ఇంకా ఎక్కువ మంది పాల్గొంటారని ఆశిస్తున్నాను.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.