భానుమతి కథానికలు

భానుమతి అత్తగారిపాత్ర లేని కథలు రాసేరని చాలామందికి తెలీదన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది.

మొదటి చిన్నకథ వేదికలో చర్చ చక్కగా సాగిందన్న హుషారులో భానుమతి కథ ఎంచుకున్నాను రెండో చర్చకి. ఆవిడ హాస్యరచయితగా సుప్రసిద్ధులు కనక, వారిదే ఒక కథ తీసుకుని, ఆకథ ఆధారంగా మరింత విస్తృతపరిధిలో తెలుగు హాస్యంమీద చర్చ కొనసాగించాలని నా కోరిక. ఈవిషయం హడావుడిగా మూడూళ్ళలో ఉన్న ముగ్గురు స్నేహితురాళ్ళకి చెప్తే, ఆ ముగ్గురూ ముక్తకంఠంతో “హాస్యంగా రాస్తారు, ఆపైన ఏముంది మాటాడ్డానికి?” అన్నారు. నాకైతే ఔచ్ మనిపించింది. అంచేత తెలుగు హాస్యం చర్చ వాయిదా వేసుకుని, మరొక విషయం తీసుకోబోతున్నాను. మళ్ళీ ఆముగ్గురే, “భానుమతి అత్తగారికథలు కాక ఇంకా ఏమైనా రాసేరా?” అన్నారు ఆశ్చర్యపోతూ.

అంచేత భానుమతిగారి అత్తలేని కథలగురించి చెప్తాను. కానీ వారి అత్తగారిగురించి రెండుమాటలైనా చెప్పకపోతే ఆవిడ నొచ్చుకోగలరు. అంచేత జెస్ట్ రెండంటే రెండు మాటలు  –

అత్త లేని కోడలుత్తమురాలోయమ్మా

కోడలులేని అత్త గుణవంతురాలోయమ్మా

ఇది బోలెడు ప్రాచుర్యం పొందిన దంపుళ్ళ పాట. వాస్తవం ఎలా ఉన్నా, మన సాహిత్యంలో కోడళ్లని ఆరళ్లు పెట్టే అత్తలే ఎక్కువ. మంచి అత్తగారు అన్నది తీయని బజ్జీల్లా హాస్యాస్పదం. కానీ భానుమతిగారికి నవ్వడం ఇష్టం. అంచేత ఆవిడ కారంబూరెల్లాటి అత్తగారిని సృష్టించేరు. తియ్యని మిరపకాయలాటి కోడలిని చిత్రించేరు. ఆ ఇద్దరికథలే అత్తాకోడలీయాలు. అత్తగారికథలకి – అత్తగారూ, ఆవకాయ పొడీ, అత్తగారూ ఆవునెంబరు 23, ఆత్తగారూ జపానుయాత్రా -. ఇలా అత్త పేరున ఎన్ని శీర్షికలున్నా, నిజానికి అన్ని కథలూ అత్తాకోడలీయాలే. అన్నికథల్లోనూ అమాయకురాలయిన అత్తగారు ఓ చిక్కు తెచ్చిపెడతారు. కోడలు చిక్కు విప్పుతారు. అత్తగారికి కోపం లేదు. కోడలికి చిరాకు లేదు. అన్ని కథల్లోనూ కథకి కావలసిన ఎత్తుగడా, రెండో మూడో సన్నివేశాలూ, చిన్న సంఘర్షణా, హాయనిపించే ముగింపూ చక్కగా అమిరిపోయి ఉంటాయి గూటిలో గువ్వల్లా. ఇవన్నీ తెలుగు పాఠకులకి కరతలామలకం.

పోతే భానుమతి గారి అత్త లేని కథలగురించి మరో నాలుగు మాటలు –

భానుమతి కథానికలు (1965) అన్న సంకలనంలో ఉన్న పదకొండు కథల్లోనూ పదికథల్లో అత్తగారు కనిపించరు. ఈసంకలనంలో సగం కథలు మనజీవితాల్లో విషాదాల్నీ, అగాథాల్నీ తవ్వి తీసి ఆర్ద్రంగా మనసుని తాకేలా ఆవిష్కరించినవి. రెండో సగం భానుమతి మార్కు హాస్యం మేళవించి, అతిసాధారణ విషయాలమీద రాసిన స్కెచ్చిలు.

అత్తగారికథలన్నిటిలోనూ కథకురాలు “నేను”. ఈసంకలనంలో కూడా సగంకథల్లో “నేను” కథకురాలు. ఆ నేను స్త్రీ పాత్రే.. “నేను” అనే తప్ప ఆవిడ పేరేమిటో మనకి తెలీదు. అంచేత నాకు ఈవ్యాసం రాయడంలో మొదటి ఇబ్బంది లేక సందేహం కథకుడు అనాలా, కథకురాలు అనాలా, రచయిత్రి అనాలా ఆ పాత్రని ఉద్దేశించి రాస్తున్నపుడు అని. కథకురాలు అనే అనడానికి నిశ్చయించుకున్నాను, అదేమంత అందంగా లేకపోయినా. రెండోది, ఆవిడ ఆనాటి ఆనవాయితీ ప్రకారం, మావారు, వాళ్ళాయన… లాటి నుడికారమే వాడతారు కానీ భార్య, భర్త లాటి పదాలు వాడరు. అంచేత, నేను కూడా ఈవ్యాసంలో అవే పదాలు వాడుతున్నాను.

ఇంక కథలమాటకొస్తే, భానుమతి కథలు రాయడంలో సిద్ధహస్తురాలు అని నేను వేరే చెప్పక్కర్లేదు.

ఈ సంకలనానికి ముందుమాటలో పాలగుమ్మి పద్మరాజు గారు “భానుమతీ రామకృష్ణగారిని మీకు పరిచయం చెయ్యడానికి సాహసించేటంత వెర్రివాణ్ణి కాను నేను” అన్నారు. ఆయనే అలా అంటే, నేనెంతటిదాన్ని! అంచేత ఇది చాలా సూక్ష్మంగా ముగించేస్తాను. పద్మరాజుగారి మాటల్లోనే “ఇవి కథలూ, ఆత్మకథలూ కూడా.” “ఇందులో ఏ కథా సాహిత్యవేత్తలూ, విమర్శకాగ్రేసరులూ, కథానికకు నిర్ణయించిన చట్రంలోకి ఇమడదు.” అంతే కాదు, “మనకి తత్త్వజిజ్ఞాస ఎక్కువయిపోయి. మనదేశీయ సాహిత్యంలో మనుషులు కనబడరు, ఊహలూ, లక్ష్యాలు, విలువలు, మనుషుల్లాగ మాట్లాడతాయి. నిజమైన మనుషుల్ని చూసి, వారి ఆకారాలూ, అంతరాంతరాలూ, మాటల్లో పొదగగల అపురూపమైన ప్రతిభ గల బహుకొద్దిమంది రచయితల్లో భానుమతీ రామకృష్ణగారు ఒకరు” అంటారాయన.

ఇంకా ఈ సంకలనంలో పతిత, లోభిహృదయం మాత్రం బలహీనమయినవి అన్నారు పద్మరాజుగారు. నాకు మాత్రం అవి కూడా నచ్చేయి. అంచేత అందులో ఒక కథే చర్చకి పెట్టబోతున్నాను.

వెనక అట్టమీద ప్రచురణకర్తలమాటని బట్టి, ఇవి అత్తగారికథలతరవాత రాసినవి.

ఇంక నామాటగా – ఇవి చదువుతుంటే – మనజీవితాల్లో అట్టడుగుపొరల్లో కనిపించీ కనిపించని అగాథాల్లో ఇరుక్కుపోయిన రకరకాల అనుభూతులని వెలికి తీసి మన కళ్ళముందు పెట్టడంలో భానుమతి సిద్ధహస్తురాలు అనిపించింది నాకు.

జీవితంలో అగాథాలు సదా నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పే రాంబాబు కథ. నవ్వుతూ, తుళ్ళుతూ హాయిగా కబుర్లు చెప్పే రాంబాబు భార్యమాట అడిగితే మాత్రం ముడుచుకుపోతాడు. కథకురాలు వాళ్ళాయనస్నేహితుడు రాంబాబు. ఇద్దరూ “మీఆవిడనీ, పిల్లాడినీ చూపించు” అంటూ పట్టు బడితే, ఆఖరికి ఓరోజు భార్య హేమనీ, ఏణ్ణర్థం పిల్లాడినీ తీసుకొస్తాడు. ఖర్మవశాత్తూ ఆరోజే వాళ్ళింట్లో ఉండగానే హేమకి ఫిట్స్ వస్తాయి. రాంబాబు ఎంతో ఓపిగ్గా విషయం వివరిస్తూ, హేమ ఆ ఫిట్ నించి తేరుకునేవరకూ సేవలు చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది అతని మనోవేదన వీళ్ళిద్దరికీ.

“ఒక్కొక్కళ్ళ జీవితాల్లో ఇల్లాంటి నగ్నసత్యాలు దాగివుంటాయని తెలీని ఎదుటివాళ్ళకు రాంబాబు కఠినుడుగానూ, స్వార్థపరుడుగానూ కనిపిస్తాడు. నిజానికి రాంబాబు హేమకి చేసిన సేవ, అతని ఓర్పు చూస్తే రాంబాబు దేవుడిలా కనిపించాడు. అందుకే అతను జీవితాన్ని అంత తేలిగ్గానూ తీసుకుని ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడనిపించింది.

ఫైకి ఎక్కువగా నవ్వుతూండేవాళ్ళకి లోపల ఎక్కువ బాధలుంటాయేమో”

అంటూ ముగుస్తుంది కథ.

పతిత లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన అందమయిన అమ్మాయిని వయసు మళ్ళిన కరణం తనకిచ్చి పెళ్ళి చెయ్యమని ఆ పిల్లతండ్రిని అడుగుతాడు. తండ్రి ఒప్పుకోకపోవడంతో, కరణం వాళ్ళమీద కక్ష కట్టి, ఆ అమ్మాయిశీలంమీద లేని అపవాదులు ప్రచారం చేసి ఆమె జీవితం నాశనం చేస్తాడు.

లోభి హృదయం కథలో శెట్టి తన దుకాణానికి సరుకులకోసం వచ్చే మూగపిల్లమీద మమకారం పెంచుకున్నతీరు ఎంతో ఆర్ద్రంగా వివరిస్తుంది రచయిత్రి. భానుమతి ఉత్తమపురుషలో చెప్పని బహు కొద్ది కథల్లో ఇదొకటి.

ఆ పిల్లకి మాటలు రావు కనక వాళ్ళ అవ్వ తమకి కావలసిన పచారీ సామాన్లు ఓ పలకమీద రాసిచ్చి దుకాణానికి పంపుతుంది. పిల్ల తండ్రి పట్నంలో పనికోసం వెతుక్కుంటూన్నసమయంలో, వీళ్ళు డబ్బుకి ఇబ్బందయి, అప్పు పెట్టమంటుంది అవ్వ. శెట్టికి మనసొప్పదు. “ఇచ్చినన్నాళ్లు ఇచ్చేను, ఎల్లకాలం అప్పు పెడితే, వ్యాపారం ఎలా సాగుతుందం”టూ ఆపిల్లని కసురుకుని, ఆ పలక విసిరేస్తాడు. పలక బద్దలవుతుంది. ఆ పసిపిల్ల ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ మూగపిల్లని అలా కసురుకుని పంపేసిన తరవాత శెట్టి అంతరాత్మ పేచీ పెడుతుంది. రచయిత్రి ఇక్కడినుండీ కథ మలచిన తీరు అద్భుతం.

భానుమతిగారి చాలాకథల్లో “నేను”లాగే, రెండు “మనసులు” ఉండడం కూడా చూస్తాం కొన్నికథల్లో. ప్రతిమనిషి బుర్రలోనూ ఒక “మరో మనిషి” (the still small voice within అంటాడు Wordswoth) ఉంటాడు. ఆ బుర్రలోనే ఒక మనిషి “నీస్వార్థం చూసుకో” అంటూ ముందుకి తోస్తుంటే, ఆ రెండో మనిషి “అది మంచిపని కాదు” అని నస పెడుతూ ఉంటుంది. లోభిహృదయం కథ ఒక్కటి చాలు రచయిత్రి ఈ అంతస్సంఘర్షణని ఎంత గొప్పగా ఆవిష్కరించారో మనం గ్రహించడానికి.

తెలివితేటల విలువలు (ఆంధ్రజ్యోతి రజతోత్సవ సంచిక, 1982). కథకురాలి ఆయనా, ఆయన స్నేహితుడు రావుగారూ అదే పనిగా ఒకరినొకరు ఫూల్, ఫూల్ అని పిలుచుకుంటూ, మంచీ, చెడ్డా, కష్టం, సుఖం అన్నీ మాటాడుకుంటూ ఉంటే, కథకురాలికి ఆశ్చర్యం. రావుగారిఅల్లుడు స్కూటరు ప్రమాదం జరిగి ఆస్పత్రిలో పడ్డాడని చెప్పినప్పుడు కూడా రావుగారు హాహా అని నవ్వుతూనే చెప్తాడు ఆసంగతి. చివరికి “ఆ ఇద్దరు ఫూల్సునీ చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయేను” అంటుంది కథకురాలు.

కృత్యాద్యవస్థ – కథలో కథకురాలిని చక్కన్నగారు (అదేనండీ మన సినిమా చక్రపాణిగారు నిజజీవితంలో) కథ రాయమని అడుగుతారు. అప్పుడు పైన చెప్పిన రెండోమనిషి (ఆవిడ బుర్రలో) రాయి రాయి అని పోరు మొదలు పెడుతుంది. మొదటి మనిషి  మూడు లేదూ, మేటరు లేదూ, కాగితం లేదూ, కలం లేదూ అంటూ పేచీ పెడుతుంది. పోనీ మొన్నో ఎప్పుడో సగం రాసి వదిలేసిన కథలున్నాయి కదా, పొట్టిగా, నున్నగా గుండులా ఉండే మామీ (తమిళ మామీ, ఇంగ్లీషు మామీ కాదు), ఆవిడ సంగీతం, రైలు ప్రయాణం, హత్యలూ … ఇలా అనేక రకాలుగా కథ మలుపులు తిరిగి, ఆఖరికి కథకురాలిని పనిపిల్ల పిలిచి లేపేయడంతో ముగుస్తుంది. ఇందులో రెండోభాగంలో అత్తగారు ఉన్నారు. పార్వతమ్మ అనే దూరపుబంధువు ఒకావిడ కాస్త ఆలస్యంగా గర్భం ధరించినప్పుడు అత్తగారి అందించే అనుపానాలు బెడిసికొట్టడం. “ఇలాంటి కథ అడ్డం తిరిగిన కేసులు నాకు వదిలేయడం అత్తగారికి అలవాటేకదా” అంటుంది కథకురాలు. ఇదంతా చక్కన్నగారు కథ రాయమన్నతరవాత కథకురాలికి కలగా వచ్చిన వైనం! నాకు తెలిసినంతవరకూ, అత్తగారి చర్యలమీద కోడలు చేసిన వ్యాఖ్య ఇదొక్కటే. ఇక్కడ కోడలికి బదులు కథకురాలు కనిపించింది.

చాలా చిన్న, అతి మామూలు విషయాన్ని తీసుకుని కొన్ని స్కెచ్‌లు రాసేరు. ఉదాహరణకి, ఎందుకులెండి వాళ్ళాయనచేత సిగరెట్ మానిపించే యత్నం. పెద్ద ఆకారాలూ, చిన్న వికారాలూ బల్లీ, తొండాలాటి చిన్న కీటకాలని చూస్తే కలిగే భయాలు. భానుమతిగారికి రైలు ప్రయాణం, విమానప్రయాణం అంటే భయంట (చూ. నాలో నేను). బల్లులంటే తనకెంత భయమో భలే వివరిస్తారు పెద్ద ఆకారాలూ, చిన్నవికారాలూ లో. వరసలు మనబీరకాయపీచు చుట్టరికాలు తవ్వి తీసి అక్కయ్యా, అమ్మమ్మా అంటూ వరసలు పెట్టి పెద్దవాళ్ళు తమకంటె ఎంతో చిన్నవాళ్ళని కూడా పిలుస్తూ విసిగించడం. ఇది మన తెలుగు ఇళ్ళల్లో మాత్రమే సాధ్యమేమో.

భానుమతిగారు ఏ అంశం తీసుకున్నా, తనదైన శైలిలో, కథనంలో, కథ నడపడంలో, పాత్రచిత్రణలో గొప్ప నేర్పు చూపుతారు. సంభాషణలు ఎలా రాయాలో భానుమతిని చూసి నేర్చుకోవాలి.

ఆమె స్ఫూర్తి కథకి పేర్లు పెట్టడంలో కూడా ద్యోతకమవుతుంది. ఉదాహరణకి, “పతిత”  “లోభిహృదయం” లాటి పదాలు వింటే మన మనసులో చప్పున తట్టే ఊహలకీ భానుమతి ఈకథల్లో ఆవిష్కరించిన కోణం వేరు. ఇది కూడా ఉత్తమకథకుని లక్షణాల్లో చెప్పుకోదగ్గ విశేషమే.

రాయను రాయను అంటూనే ఇప్పటికే చాలా పొడిగించేను.

మొదట్లో చెప్పినట్టు, లోభి హృదయం కథ చర్చకి పెడుతున్నాను. కథ చదివి మీ, మీ అభిప్రాయాలు రాస్తారని ఆశిస్తున్నాను.

(సెప్టెంబరు 26, 2010.)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “భానుమతి కథానికలు”

 1. ఏకబిగిన చదివానండీ. అంతా చదివేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాక తెలిసింది ఏదో సస్పెన్సు కథ చదువుతున్నట్టు ఊపిరి బిగబట్టానని.
  మంచి విశ్లేషణ.

  ఇష్టం

 2. మాలతి గారు,

  భానుమతి గారి కథల మీద వ్యాసం బావుంది.

  “మనజీవితాల్లో అట్టడుగుపొరల్లో కనిపించీ కనిపించని అగాథాల్లో ఇరుక్కుపోయిన రకరకాల అనుభూతులని వెలికి తీసి మన కళ్ళముందు పెట్టడంలో భానుమతి సిద్ధహస్తురాలు అనిపించింది నాకు.”

  అక్షర సత్యం. మరి లోభి హృదయం మీద చర్చ పెట్టారు కాబట్టి అక్కడ మాట్లాడుకుందాము.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s