ప్రముఖ కవి అఫ్సర్ గారి బ్లాగులో నేను!

వయసుకి నాకంటే చిన్న అయినా సాహిత్యంలో చాలా పెద్దపేరున్న అఫ్సర్ నన్ను గుర్తించేరంటే, నాకు ఆరిపోతున్న ఉత్సాహం తేరుకుని మళ్ళీ ఉరకలేస్తానంటోంది.

ఒకే నెలలో మొదట ప్రముఖ రచయిత్రి పి. సత్యవతిగారు నాకధలమీద వ్యాసం (భూమికలో), ఆ తరవాత ప్రముఖ కవి అఫ్సర్ ముఖాముఖి అంటూ నా నాలుగుమాటలు తనబ్లాగులో పెట్టడం నాకొక అపూర్వ గౌరవం.

అఫ్సర్ గారితో నా ముఖాముఖీ

నిడదవోలు మాలతి – ఓటమి ఎరుగని కలం. ఆ మాటకొస్తే కలం కాలం నించి ఇప్పటి కీబోర్డు కాలం దాకా విరామమెరుగని కలం. రాత నుంచి కంప్యూటరు దాకా ఎంతో ఓపికగా, శ్రద్ధగా రూపాంతరం పొందడమే కాకుండా, రచనా స్వభావాన్ని కూడా కాలానుగుణంగా మార్చుకున్న మాలతి గారు అటు ఆంధ్రా, ఇటు అమెరికా తెలుగు జీవితాల మధ్య సామ్యాలనూ, సామరస్యాలనూ వెతికే ప్రయత్నం చేశారు. స్వీయ రచనల్లోనూ, అనువాదాల్లోనూ వొక నిష్టతో, నియమంతో పని చేస్తున్నారు. వయసూ, బతుకు బాధలతో నిమిత్తం లేకుండా ఎత్తిన కలం…(టచ్ చేసిన కీబోర్డు అనాలా?!) వదలకుండా, అన్ని అవరోధాలనీ జయించి రచయితగా తన ఉనికిని సదా కాపాడుకుంటున్నారు. అచ్చు లోకంలోనే కాకుండా, అంతర్జాల లోకంలో కూడా సుపరిచితమయిన పేరు నిడదవోలు మాలతి.

1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
వచ్చింది. అయితే అది అమెరికా రావడంవల్ల మాత్రమే కాకపోవచ్చు. సాధారణంగా జీవితంలో జరిగే అనేకసంఘటనలలో అమెరికా రావడం ఒకటి. అమెరికా రావడంవల్ల మరొక సంస్కృతిగురించి సవిస్తరంగా ఆలోచించుకోడానికి అవకాశం కలిగింది. విదేశీ సంస్కృతి, మనస్తత్త్వాలవిషయంలో అవగాహన మెరుగు పడిందనుకుంటాను ఇక్కడికి వచ్చేక.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
ఆమార్పు నేను అమెరికా వచ్చినతరవాత రాసిన కథలన్నిటిలోనూ కనిపిస్తుంది. ప్రధానంగా, ఏ సంస్కృతిలో కానీ వారి నైతికవిలువలు వారున్న వాతావరణం, సామాజికపరిస్థితులు ప్రాతిపదికగా ఏర్పడతాయి. వారి ఆలోచనాధోరణి వారి సామాజికచరిత్రలోనుండీ ఉదయిస్తుంది కనక ఈ రెండు సంస్కృతులలోనూ గల వైవిధ్యమూ, అంతర్గతంగా గల సామ్యాలూ ఎత్తి చూపుతూ రాయడానికి ప్రయత్నించేను,

నా ఈ అవగాహనకి మంచి ఉదాహరణ – రంగుతోలు కథ. మనకి రంగు కేవలం అందానికి సంబంధించినది అయితే, అమెరికాలో తొక్కరంగు జాతికి సంబంధించినది. ఇక్కడ “నల్లవాడు” అన్నపదంలో వాళ్ళ ఆర్థిక, సామాజిక, చారిత్ర్యక ఛాయలెన్నో ఉన్నాయి. దానితోపాటు, గత 50 ఏళ్ళుగా జరుగుతున్న సివిల్ లిబర్టీస్ ఉద్యమంమూలంగా, తొక్క రంగులో గల నెగిటివ్ ఇమేజిని తొలగించే ప్రయత్నం కూడా ఉంది. ఇది ఎత్తిచూపడానికి ప్రయత్నించాను రంగుతోలు కథలో.
అలాగే, కొత్తసీసా పాతసారా కథలో ఉమ్మడికుటుంబాలలో అనూచానంగా వస్తున్న జీవనసరళి అమెరికాగడ్డమీద ఎలాటి మార్పులకి (metamorphosis) లోనవుతుందో చిత్రించాను. అంతేకాదు. మనవారి ఈ ప్రవర్తనా, పరివర్తనా కూడా అమెరికనులు ఎలా అర్థం చేసుకుంటారో కూడా చూపించడానికి ప్రయత్నించేను.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనలకి ఏ విధంగా భిన్నమయినవి?
ఈప్రశ్నకి కూడా సమాధానం పైజవాబులో కొంతవరకూ ఉంది. నాకథల్లో అక్కడా, ఇక్కడా కూడా నాచుట్టూ ఉన్న సమాజంలో మనుషుల తత్త్వాలని, నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలనీ, ఆ సమస్యలని పరిష్కరించుకునే తీరులో వైవిధ్యాన్నీ పరిశీలించి ఆవిష్కరించడానికే ప్రయత్నించాను. ప్రయత్నిస్తున్నాను. ఏపరిస్థితుల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఆ ప్రవర్తనకి కారణభూతమయిన పరిస్థితులు ఏమిటి అనే నేను సదా ఆలోచిస్తుంటాను. అంచేత అమెరికా వచ్చినతరవాత నా మొట్టమొదటి కార్యక్రమం అమెరికా, ఆంధ్రా – ఈ రెండుసంస్కృతులలో గల వ్యత్యాసాలూ, సామ్యాలూ, వాటికి సంబంధించిన తాత్త్విక చింతనా – ఇవి పరిశీలించి చూసుకోడమే అయింది. అది కొంతైనా అర్థమయిన తరవాతే కథలు రాయడం మొదలు పెట్టేను. అమెరికన్ సమాజంలో, సంస్కృతిలో నాకు అర్థమయినవిషయాలే నాకథల్లో కూడా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇతివృత్తం దృష్ట్యా ఇది ఒక మార్పు.

రెండో మార్పు శైలిలో. కొందరు స్నేహితులు ఎత్తి చూపినతరవాతే నేను పరిశీలించి చూచుకొన్నాను. మొదట భాష చూడండి. మనదేశంలో ఉన్నప్పుడు రాసినకథల్లో సంస్కృత సమాసాలు ఎక్కువ. ఆ పద్ధతిలో నారచన సాగిస్తే, ఇప్పుడు నాకథల్లో ఇంగ్లీషు ఎక్కువ ఉండాలి న్యాయానికి. కానీ అలా జరగలేదు. ఇక్కడికి వచ్చేక పూర్వంకంటె మంచి తెలుగులో రాయాలన్న తపన నాకు ఎక్కువయింది. నిజానికి ఇంగ్లీషు మాటలు ఇప్పటికంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు రాసినకథల్లోనే ఎక్కువ.

శైలిలో మరొక అంశం వ్యంగ్యం. ఇండియాలో ఉన్నప్పుడు నాకథల్లో హాస్యం ఉంది కానీ వ్యంగ్యం లేదు. అది ఈమధ్య ఎక్కువగానే ఉంటోంది నాకథల్లో.

మూడోది రచన పట్ల నాదృష్టి. ఇండియాలో ఉన్నప్పుడు రచయితగా నాస్థాయి ఏమిటి అన్న స్పృహ నాకు ఉండేది కాదు. రాయాలనిపించింది రాయడం, పత్రికలకి పంపడంతో నా పని అయిపోయేది. ఇప్పుడు ఎవరు నన్ను రచయితగా గుర్తించడం లేదు? ఎందుచేత? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి కారణాలు అనేకం. నా పరిస్థితులూ, జీవితంలో, సమాజంలో, సాహిత్యంలో వచ్చినమార్పులూ – అన్నీ కలిసి నాలో ఇలాటి ఆలోచనలు కలిగిస్తున్నాయేమో. వయసు కూడా ఒక కారణం కావచ్చు. జీవితంలో చరమదశకి చేరుకున్నాక, “నేను నా జీవితంలో సాధించినదేమిటి?” అన్న ప్రశ్న రావడం సహజం కదా.

4. అమెరికాలో వున్న తెలుగురచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
తెలుగురచయితగా నాకు రెండు శాఖలున్నాయి. 1. స్వీయరచనలు, 2. అనువాదాలు.
స్వీయరచనల్లో తెలుగులో నేను రాసిన తెలుగుకథలూ, పరిశీలనాత్మకవ్యాసాలూ ఉన్నాయి. ఇంగ్లీషుఅనువాదాల్లో నారచనలతోపాటు ఇతర రచయితలకథలూ, పరిశీలనాత్మకవ్యాసాలూ ఉన్నాయి. విశేషంగా కాకపోయినా కొన్ని కవితలు కూడా రాశాను. నాకృషి ఇంత విస్తృతంగా ఉండగా, ఈనాటి రచయితలు “మాలతి అనువాదాలు చేస్తోంది” అని నా మొత్తం వ్యాపకాలని ఒక్క వాక్యానికి కుదించేయడం నాకు అయోమయంగా ఉంది.

భవిష్యత్తుమాటకొస్తే, నాకు భవిష్యత్తు అమెరికాలోనూ లేదు, ఇండియాలోనూ కూడా ఉన్నట్టు కనిపించడంలేదు.
అంతర్జాలంలో నా వెబ్ సైట్, http://thulika.net, నా బ్లాగు https://tethulika.wordpress.com
నాకు గర్వకారణం కావాలి. మొదట, తూలిక.నెట్‌ గురించి చెప్తాను. ఈ సైటులో నాధ్యేయం ఉత్తమ తెలుగుకథలని అనువదించి తద్ద్వారా మనసంస్కృతిని విదేశీ పాఠకులకి తెలియజేడం. ఈ కారణంగానే తూలిక.నెట్ కొన్ని యూనివర్శిటీ సైటులదృష్టిని ఆకర్షించింది. ఉదా. http://www.intute.ac.uk/cgi-bin/search.pl?term1=thulika.net&submit=Search&limit=0&subject=All (Great Britain). కొన్ని ప్రముఖ సైట్స్ నా వ్యాసాలని వారి సైట్లలో మునర్ముద్రించుకున్నారు.
ఉదా. http://www.driftline.org. (University of Iowa, Bowling Green, Iowa),
http://www.india-forum.com/forums/
ఇలాటి గుర్తింపులవల్ల నాతరవాత తూలిక.నెట్ భవిష్యత్తు ఏమిటి అన్న ఆలోచన నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. నాకు సన్నిహితురాలు, వర్థమాన రచయిత్రి అయిన వి. బి. సౌమ్యని (పుస్తకం.నెట్), అడిగితే, తాను ఆ బాధ్యత స్వీకరించడానికి అంగీకరించింది. ఇది నాకు కొంత సాంత్వన కలిగించినవిషయం. మరి ఆమెచేతిలో తూలిక ఎలా రూపు దిద్దుకుంటుందో మీరే చూసుకోవాలి.

తూలిక.నెట్ నేను ఒక్కదాన్నీ చేపట్టిన కార్యక్రమం. అమెరికాలో తెలుగు సాహిత్యానికి విస్తృతంగా సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటున్న వివిధ సాహిత్యసంస్థలు ఈ నా ప్రయత్నానికి తగిన మద్దతు ఇచ్చి, విజయవంతం చేసి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు.
ఎందుకంటే, ఈనాడు సాహిత్యక్షేత్రం కూడా ఒక వ్యాపారమే. అన్ని వ్యాపారాలలోలాగే సాహిత్యంలో కూడా అవే నీతులకి ప్రాముఖ్యత. అంటే – p.r. work , people skills, పెట్టుబడిదారీ ధోరణీ (చందాలూ, రిజిస్ట్రేషను ఫీజులూ, నానా సంస్థల పెత్తందారులతో భేటీ) లాటివి. నావ్యక్తిత్వంలో ఆ పోకడలు లేవు. నాకు ఆ సామాజికస్థాయి కూడా లేదు. ఈ సాహిత్య ప్రముఖుల ఎజెండాలలో, ఇజాలజాలంలో పడి కొట్టుకుపోయే బలం కూడా లేదు.
అంతకంటే ప్రబలకారణం – కొందరు సాహిత్య ప్రముఖులకి, ముఖ్యంగా అమెరికా తెలుగు సాహితీ ప్రముఖులకి, నేను నావ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు బాధాకరం అయేయి అనుకుంటాను. అంచేత కూడా వీరిదృష్టికి కూడా నేను ఆనలేదు. అపార్థం చేసుకోకండి. నానా సంఘాలూ, సంస్థలూ నన్ను వారిసభలకి పిలిపించి దుశ్శాలువాలు కప్పాలనీ, విశిష్టసేవా పురస్కారాలు నాకు ఇవ్వాలనీ నేను కోరడం లేదు.
నేను ఏధ్యేయంతో తూలిక.నెట్ స్థాపించేనో ఆ ధ్యేయాన్ని బలపరచడానికి మన తెలుగుసంఘాలూ, సాహిత్యాధినేతలూ (నేను తెలుగుకి ఎంతో గొప్పసేవ చేస్తున్నానని నామొహంమీద పొగిడేవాళ్ళతో సహా) ఈ సైటుకి ప్రత్యేకించి ఇస్తున్న మద్దతు ఇదీ అని చెప్పడానికి నాకేమీ కనిపించడం లేదు అని అంటున్నాను. ఆ సంఘాల ప్రత్యేకసంచికలలో ప్రచురించే వ్యాసాలూ, సాహిత్య సభల్లో ఇచ్చే ఉపన్యాసాలూ చూస్తే మీకే అర్థమవుతుంది ఈమాటల్లో యథార్థం.

పోతే, తెలుగు తూలిక విషయం – నేను 2007 డిసెంబరులో మొదలు పెట్టేను. ఈ బ్లాగుద్వారా ఈనాటి యువతరం పాఠకులతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. వారికి నేనెవరో, నా బతుకేమిటో తెలియదు. నన్ను కేవలం మరొక బ్లాగరుగా మాత్రమే గుర్తించి, నాకథలనీ, కబుర్లనీ, వ్యాసాలనీ చదివి, నాసాహిత్యాన్ని నిష్కల్మషంగా ఆదరిస్తున్నారు. తెలుగు తూలిక చదివే పాఠకులలో బ్లాగరులు కానివారు కూడా చాలామందే ఉన్నారు. వీళ్ళంతా ఈనాటి పాఠకులు కనక వారి ఆదరణ నాకొక ప్రత్యేకగౌరవంగానే భావిస్తున్నాను.
తెలుగుతూలికద్వారా కూడా నేను ఇంతకుమించి చెయ్యగలిగింది ఏమీ లేదు కానీ ప్రస్తుతం జరుగుతున్న సంరంభంలో నాకు రవంత నిరాశ కలిగిస్తున్నది నేను చర్చలకి పెట్టిన అంశాలలో పాల్గొనేవారు ఎక్కువమంది లేకపోవడం. ఎందుచేతో తెలీదు మరి.

చివరిమాటగా బ్లాగ్ రచనలగురించి – బ్లాగులలో ప్రచురించేరచనలకి సాహిత్యస్థానం ఉందా లేదా అన్నవిషయంలో – నా అభిప్రాయం చెప్తాను. సూక్ష్మంగా చూస్తే, బ్లాగులలో రెండు రకాల సాహిత్యం కనిపిస్తోంది. మొదటిది – నలుగురు కూడి మాటలాడుకునేవేళ తమ సహజధోరణిలో చెప్పుకునే కబుర్లలాటివి. దీన్ని సుమారుగా జానపదవాఙ్మయంతో పోల్చవచ్చు. రెండోరకంలో చేర్చదగ్గవి శిష్టజనవ్యావహారికంలో, ఎకెడమీకానికి బెత్తెడు ఎడంగా వస్తున్న కవితలూ, కథలూ, సాహిత్యచర్చలు. ఉదాహరణకి, భైరవభట్ల కామేశ్వరరావు, పి. సత్యవతి, మీరు, కల్పన – మీబ్లాగుల్లో కనిపించే రచనలు. (ఇక్కడ తెలుగు తూలిక కూడా చేర్చవచ్చుననుకుంటాను). ఈ రచనలు కేవలం బ్లాగుల్లోనే కనిపించినా వీటికి సాహిత్యవిలువ లోపం ఏమీ లేదు. అలాగే పుస్తకాలగురించి వి. బి. సౌమ్య, అనేక సాంకేతికవిషయాలు వివరిస్తున్న వీవెన్ … ఇలా ఎందరో ఎంతో మంచి విషయాలు అందిస్తున్నారు. వీరి రచనలు ఏ పత్రికలలో రచనలకీ తీసిపోవు.

అసలు బాధ ఏమిటంటే, మనకి వ్యక్తిపూజలే కానీ వస్తునిష్ఠ లేదు. రచయితపేరుని బట్టి, అది అచ్చయిన పత్రికపేరుని బట్టీ రచనవిలువ నిర్ణయించడం మన రాచరికపుసంప్రదాయమేమో మరి. ఏమైనా, రచనని మాత్రమే రచనగా తీసుకుని విశ్లేషిస్తే, మన సాహిత్యం మెరుగు పడే అవకాశం ఉంది.

———

ఈ ఇంటర్వూమీద వ్యాఖ్యలకి వారి సైటు చూడండి. లింకిదుగో –

http://afsartelugu.blogspot.com/2010/09/blog-post_30.html

 

మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “ప్రముఖ కవి అఫ్సర్ గారి బ్లాగులో నేను!”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.