లోభి కథ – సింహావలోకనం

ఇది రాయడం ఆలస్యం అయింది. ఒక కారణం నాతో ఈ కథ చర్చించిన ఒక స్నేహితురాలు కమ్ పాఠకురాలు తన అభిప్రాయాలు ఇక్కడ పెడుతుందని ఎదురు చూడ్డం. రెండోది ఏవో సొంతగొడవల్లో పడి, రాయడానికి తీరిక లేకపోవడం.

పోతే కథకి వస్తే, నలుగురు పాఠకులు వెలిబుచ్చిన అభిప్రాయాల పూర్తి పాఠం ముందు టపాలో చూడండి. ఇక్క డ సారాంశం ఇస్తున్నాను.  –

లలిత – కథ నిడివి కొంచెం ఎక్కువ, సట్లెటీ తక్కువా అనిపిస్తోంది. పాత్రల స్వభావం రచయితే స్పష్టం చేసినా, శెట్టి స్వభావం అర్థం చేసుకోడం కష్టం అయింది.

మాధురీకృష్ణ – ఈకథలో పాత్రలన్నీ – శెట్టి, శెట్టిభార్య, మూగపిల్ల, పిల్ల తండ్రీ, అవ్వ – అందరూ నిజజీవితంలోంచి వచ్చినవారే. మనలో ప్రతి ఒక్కరం ఏదో సందర్భంలో శెట్టితోనూ, చిన్నపిల్లతోనూ, లేదా అలాటి సందర్భంతోనూ పోల్చుకోగలుగుతాం. ఈ రెండు పాత్రలూ మన అర్హతలకీ, అనర్హతలకీ, mis-qualificationsకీ, ( అవలక్షణాలు అనొచ్చా?) అద్దం పడతాయి. భానుమతిగారు సూక్ష్మదృష్టితో శెట్టి అంతర్మథనాన్నీ, మనసులో సాధారణంగా కలిగే సంఘర్షణనీ, దాన్ని మనసు లొంగదీసుకునే యత్నాన్ని చాలా బాగా ఆవిష్కరించేరు. ఒక సాధారణ పాఠకురాలిని అయిన నాకు ఇది తృప్తికరంగా ఉంది. కథ కళ్ళ నీరు తెప్పించింది.

కల్పన – శీర్షిక – ఎంతటి లోభి కైనా ఒక హృదయం వుంటుంది. దానికి మంచి చెడుల విశ్లేషణ వుంటుంది అని చెప్పటానికి రచయిత్రి ఆ పేరు పెట్టినట్లు అనిపించింది.

ఇతివృత్తం – సట్లెటీ లేనట్టు కనిపించినా, అది ఆ కాలంరచనల తీరు. రచయిత్రి రెండు విషయాలు చక్కగా ఆవిష్కరించినట్టు కనిపిస్తోంది. 1. మూగపిల్ల దారిద్ర్యం, ఆత్మాభిమానం, మూగతనంవల్ల వచ్చిన అశక్తత 2. శెట్టి పాత్ర. మూగపిల్ల కారణంగా అతనిలో కలిగిన అంతస్సంఘర్ణణా, మార్పూ రచయిత్రి బాగా చిత్రించారు. ఇక్కడ కులప్రసక్తి కూడా ఉంది. ఆరోజుల్లో కులం గురించి మాటాడడం తప్పు కాదు. శెట్టి కులస్థులు లోభులు అన్న జనసామాన్యంలో ఉండే అభిప్రాయం తప్పు అని ఆవిష్కరించడం చక్కగా చేసినా, కొంచెం ఓవర్ చేసినట్టు కూడా అనిపిస్తుంది.

తరవాత కథదగ్గర మాత్రం ఆలోచించవలసి వచ్చింది. శెట్టి తన తప్పు తెలుసుకోవటం బావుంది. తన తప్పు దిద్దుకోవటం కూడా బావుంది. ఆ తర్వాత ఆ మారిన మనస్సుతో అతను తన వ్యాపారం చేసుకున్నట్లు చూపించవచ్చు. కానీ రచయిత్రి ఒక అడుగు ముందుకేసి కథ ను అక్కడితో ఆపకుండా అతను పూర్తిగా వ్యాపారం వదిలేసి పురాణాలు చదువుకుంటూ వుండిపోయినట్లు….ఆ మూగ పిల్లను ఎలాగైనా మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటున్నట్లు చెప్పడం దగ్గరే కొంచెం ఆగి ఆలోచించాల్సి వచ్చింది.
మూగపిల్ల తప్పనిసరిగా శెట్టి మనసు మార్చేసింది. జీవితం పట్ల, వ్యాపారం పట్ల అతని దృక్పథం కూడా మార్చింది. అది కాక శెట్టి కి మూగపిల్ల మీద ఒక అవ్యాజ్యమైన ప్రేమ కూడా అంకురించింది. ఆ ప్రేమ అతని లోని డబ్బు పట్ల కాపీనాన్ని కూడా అధిగమించింది. ఒక తండ్రి కి ఒక పిల్ల పట్ల కలిగే ప్రేమ. ఆ ప్రేమ కి ఒక కారణం వుండదు. తిరిగి దాని నుంచి ఏదో పొందాలన్న కోరిక వుండదు. అది ఎవరికి ఎందుకు ఎవరిపై కలుగుతుందో చెప్పలేం. అది చూపించింది రచయిత్రి ఈ కథలో. అయితే అది సహజంగా వుందా లేదా అన్నది ఒక్కో పాఠకుడు ఒక్కోలా ఫీల్ అవవచ్చు.

పి. సత్యవతి – ఒక వ్యక్తి స్వభావాన్ని బొత్తిగా నలుపు తెలుపుల్లో కాకుండా ఆ వ్యక్తిలో వుండే అనేక ఛాయల్ని చూపించడం బాగుంది. మూగపిల్ల అంతరంగచిత్రణ, సెట్టి మానసికపరిణామం అంతా మొదట్లో బాగానే అనిపించాయి. కల్పన చెప్పినట్లు ఒక్కొక్కరి మీద ప్రేమ ఎప్పుడు ఎందుకు కలుగుతుందో చెప్పలేం. ఎందుకంటె జీవితం ఒక ఈక్వేషన్ కాదు కాబట్టి. సెట్టి అంతరంగ మథనాన్ని భానుమతి బాగానే చిత్రించారు కానీ ముగింపు కొంచెం అతిగా అనిపించింది .ఏమైనా భానుమతి అత్తగారికథలే జీవంతొణికిసలాడుతుంటాయి.

—-

నా అభిప్రాయం.

ఈ కథ నాకు నచ్చడానికి కారణం పైన నలుగురూ చెప్పిన అంశాలే. నాక్కూడా రచయిత తీసుకున్న విషయం, ఆవిష్కరించిన తీరు ఆర్ద్రంగా స్ఫురించేయి. సూక్ష్మంగా చూసినప్పుడు చిన్నచిన్నవిషయాల్లో రచయిత్రి తీసుకున్న శ్రద్ధ కూడా కనిపిస్తుంది.

అవ్వ కావలిసిన పచారి సామాన్లు పలకమీద రాసి పంపడంలో కొత్తకోణం కనిపించింది. మొదటిది అవ్వకి రాయడం, చదవడం వచ్చు అన్న సంగతి. రెండోది, అందులో సృజనాత్మకత. అలాగే శెట్టి ఆపిల్లమీద ఎందుకు కసురుకుంటాడో కథ కొంత చదివినతరవాత కానీ తెలీదు మనకి. అలా రచయిత్రి మనలో ఉత్సుకత కలిగించడంలో కృతకృత్యులయేరు అనిపించింది. దాదాపు కథ అంతా – ఎందుకిలా జరిగింది, ముందేం అవుతుంది అన్న ఉత్సుకతని నిలుపుకుంటూ నడిపించడం నాకు బాగుంది.

లలిత చెప్పినట్టు కథనం సూటిగా సాగింది. ఇది భానుమతిగారి అన్ని కథల్లోనూ కనిపిస్తుంది. సూటిగా చెప్పినా, నీటుగా చెప్పడంమూలంగా నీరసంగా అనిపించదు. అది భానుమతి రచనల్లో ప్రత్యేకత.

మాధురీకృష్ణ వెలిబుచ్చిన అభిప్రాయాల్లో నాకు కొత్తగా తెలిసింది మనందరిలోనూ కూడా ఈ శెట్టిలక్షణాలూ, మూగపిల్ల లక్షణాలూ, ఉంటాయన్నది. నిజమే. కథలో పాత్రలతో మనం పూర్తిగా తాదాత్మ్యం పొందకపోవచ్చు కానీ ఒకొక పాత్రలో ఒక్కొక్క కోణం మనల్ని అంతర్ముఖులని చేసి, మనలోకి తొంగి చూసుకునేలా చేస్తుంది. ఇది గమనించినప్పుడు కథలో ధ్వని లేదు అనలేమేమో … అంటే కథ సూటిగా చెప్పేసినా, ఇంకా ఆలోచించుకోడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట.

కల్పన విశ్లేషణలో కూడా నాకు తోచని అంశాలు కథని మరోలా ముగించి ఉండకూడదా అన్నది ఒకటి. శెట్టిని పిచ్చివానిగా చెయ్యడంలో రచయిత్రి ఆలోచన ఏమై ఉంటుంది? అది కేవలం కథకోసమేనా, లేక, తద్వారా మరొక సందేశాన్ని ఏమైనా రచయిత్రి ఇవ్వదలుచుకున్నారా అన్న ప్రశ్న అయితే కలిగింది కానీ నాదగ్గర సమాధానం లేదు. అలాగే, ఒకరిమీద మరొకరికి ప్రేమ ఎప్పుడు ఎలా కలుగుతుందో చెప్పలేం అన్నది కూడా ఈకథలో అంతర్లీనంగా ఉన్న సందేశంగానే కనిపిస్తోంది.

సత్యవతిగారన్నట్టు జీవితం ఒక ఈక్వేషన్ కాదు. ప్రతి మనిషి మాటలూ చేష్టలూ కూడా సైకాలజిస్టుల చట్రాల్లో ఇమడవు.

ఈ విషయం మనకి పదే పదే గుర్తు చేయడానికే రచయితలు కథలు రాస్తారు. పాఠకులు చదువుతారు. అంతే కాదు. ఇదంతా కథలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నా, ఇలా మరొకరు మరోసారి ఎత్తి చూపినప్పుడు మరింత స్పష్టమవుతుంది. మరో పాఠకుడు మరోసారి చెప్పిన విషయాలు మనచేత “అవును సుమా, నేనూ అలాగే అనుకున్నాను” అనిపిస్తాయి ఒకొకప్పుడు. లేదా, “ఓహో, అలాగా. నాకు తోచనేలేదు” అనిపించవచ్చు.

గమనిక – ఇది ఘన సాహిత్య చర్చా వేదిక కాదు. అసలు దీన్ని చర్చ అనడం నాతప్పు. నేను కోరుతున్నది మీరు – రచయితలయినా కాకపోయినా, బోలెడు సాహిత్యం చదివినా చదవకపోయినా, ఈ ఒక్క కథ చదివినప్పుడు మీకేం అనిపించిందో అది రాయండి. అంతే నాకు కావలసింది. ఏకథకి ఎవరు ఎలా స్పందిస్తున్నారనే తప్ప, మీరు కథ సరిగ్గా అర్థం చేసుకున్నారా, తప్పుగా అర్థం చేసుకున్నారా అన్నది కాదు నాకు కావలసింది.


(అక్టోబరు 8, 2010)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “లోభి కథ – సింహావలోకనం”

 1. ఓ, కల్పనా, నాకు ఈ రెండుకథలపేర్లూ కొత్తే. ఇద్దరం ఒకేసారి పెట్టడం కొత్త అనుభవం. :). బాగుంది. ఏదీ నీకు తెలుసు కదా నా ప్రస్తుత వ్యాపకం. రోఢ్డుమీద మనిషి నాకింకా అందలేదు. చూద్దాం.

  మెచ్చుకోండి

 2. కథానుభవం కోసం నేను కూడా మళ్ళీ రాజారాం గారి కథలు చదువుతున్నాను. అయితే ఈ సారి ఇద్దరం ఒకే రచయిత వి తీసుకోవచ్చు. బతకనేర్చిన మనిషి చదివాను కానీ మరి ఈ రోడ్డు మీద మనిషి నేను చదవలేదు. బతకనెర్చిన మనిషి అయితే నేను కథ ఇవ్వగలను.

  మెచ్చుకోండి

 3. @ కల్పనా, ముగింపుగురించి నాకు మరో ఆలోచన వస్తోంది. ఉయ్యాల ఒకవేపు ఎంతదూరం లాగితే, రెండోవేపు అంతదూరం పోయినట్టు, లోభం – ఔదార్యం, కోపం – ప్రేమా కూడా ఒక చివరినించి మరోచివరికి అంత ఊపుతో పోతాయని చెప్పడమేమో అది. అంటే మొదట మితిమీరిన కోపం తరవాత మితిమీరిన ప్రేమా -అని చూపడానికి ఆయనని పిచ్చివాడిగా చిత్రించి ఉండవచ్చు.
  తరవాతి కథ – పి. సత్యవతిగారు “రోడ్డుమీద మనిషి” (మధురాంతకం రాజారాం) సూచించారు. తనదగ్గరుందనీ. వెతికి పట్టుకుని స్కాన్ చేసి ఇస్తానీ అన్నారు. వైదేహి కూడా తనలైబ్రరీలో వెతుకుతోంది. ఎవరైనా సరే అందుబాటులో ఉంటే, నాకు పంపితే, దానిమీద కబుర్లు మొదలుపెడదాం.

  మెచ్చుకోండి

 4. మాలతి గారు,

  తర్వాత కథ ఏమిటో చెప్పేయండి. అలాగైనా ఒక మంచి కథ చదువుతాము.

  ఇది చర్చ కాదు , కేవలం ఒక కథ చదివినప్పుడు ఏమనిపించిందో చెప్పమనడం వల్ల మరింత ఎక్కువ మంది పాఠకులు స్పందిస్తారేమో చూద్దాము.

  కల్పన

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.