ఊసుపోక – కత్తీ, కొయ్యకాలూ

(ఎన్నెమ్మకతలు 61)

కొన్నాళ్ళుగా పాత ఊసొకటి ఎదలో మెదుల్తోంది గందరగోళంగా –

(అందుచేత ఈ ఊసుపోక కూడా గందరగోళమే!!)

“మాతాతగారి కత్తి చూస్తే, యుద్దానికెళ్ళాలనిపిస్తుంది

నాన్నగారి కొయ్యకాలు చూస్తే ఎందుకులే అనిపిస్తుంది.”

అనునిత్యం అదొక సమరం. క్షణక్షణం సందిగ్ధావతంసం.

“నలుగురికాళ్లకింద నలగనిదారి” కోరి వరించిన ఫ్రాస్ట్‌లా*

నిలబడ్డాను నా బాట చీలినచోట

ఏ దారి తొక్కితే కలుగు ఉపశమనం? ఏది నాగమ్యం?

గుమ్మానికటోకాలూ, ఇటోకాలూ

ఈ ఇల్లా? మరో ఇల్లా?

ఈ ఊరా? మరో ఊరా?

అస్తమానం అనుమానాలు, సందేహాల శరపరంపర!

చీరా? చొక్కా?

మఫినా? పెసరట్టా?

సినిమాకా? సంగీతకచేరీకా?

బీచికా? బజారుకా?

ఎటు మళ్ళితే ఏసుఖాలు నోచుకోగలను?

మనసుఊయల ఊగిసలాడని మానవుడు భువిలో లేడేమో.

అడుగడుగునా దారి ఫోర్కులే.

ఎటు పోతే ఏమి జరుగునో?

ఏ వృకాసురుడు ఎదురుపడునో?

ఏ పుట్టి ములుగునో?

– ఏ సిద్ధాంతినడిగితే తెలుస్తుంది?

గోడమీద పిల్లివాటంగా “శుభప్రదం, భ్రమలు గొలిపే వెలుగు, దిగ్భ్రాంతి” అంటారు.

లేదా,

“అశుభాలు ఎదుర్కొనవచ్చు. గాఢాంధకారం, కళ్ళు పొడుచుకు చూసినా కనిపించని కటికచీకటి, అయోమయం,” అంటూ వల్లిస్తారే తప్ప,

“ఇక్కడ నీకు సుఖం, అక్కడ కష్టాలు” అంటూ నిర్ద్వంద్వంగా చెప్పగల పండితులేరీ?

పిట్టలని భ్రమ పడకండి. ఇవి ఆ చెట్టున కాసిన కాయలు!

జీవితాలు instruction manualsతో రావంటారే కానీ ఆ మాన్యూలులు మాత్రం మాననీయమా? ఎదురైన ప్రతివారూ అందించే ఉచితసలహాల్లా సమస్తం తెలిసినవిషయాలే కానీ కావలిసినవీ, పనికొచ్చేవీ చెప్పేడుస్తాయా ఆ మాన్యూలులు?

శిశిరంలో మంచుకొంగలు పడమటికి తరలిపోతాయి.

చలి వెనుక పడినాక, తూరుపుదిక్కుకి తిరిగొచ్చేస్తాయి. ఆర్నెల్లక్కడా, ఆర్నెల్లిక్కడా…

ఆ స్తోమతుగల అదృష్టవంతులు కూడా అక్కడో ఇల్లూ, ఇక్కడో ఇల్లూ కట్టుకు ఆర్నెల్లక్కడా, ఆర్నెల్లిక్కడా …

ఆ కొంగల్నీ, ఈ మనుషుల్నీ చూస్తే నాకు ఈర్ష్య. ఆ సుళువుకి కాదు, ఆ నిర్వృతికి.

నాకు నవ్వు కూడా వస్తుంది ఆసందట్లోనే. Going south – పడమటికేగుట – అనగా బతుకో ప్రణాళికో  పశ్చిమాంచలానికి దిగజారిపోడం అని కూడా అర్థం ఉంది మరి!

పెద్ధ పెద్ద దుకాణాల్లో సరుకులు చూస్తే నాకు గుండెదడ.

అధికధర ఇచ్చుకుని తెచ్చుకున్న వస్తువు అధికమంచి విలువనిస్తుందన్న భరోసా లేదు.

ధర తక్కువైతే వస్తువునాణ్యత హీనం అనడానికి లేదు. “ఎంత ఖర్చుకి అంత విలువ” అవునో కాదో, ఏది అవధరించగల సత్యమో చెప్పగలనాధుడు నిజముగా కనిపించుట లేదు.

ప్రతిమంచినీ ఆశ్రయించుకుని చెడుగు.

సుఖంలోనే దుఃఖం ఊపిరి.

పురిటినొప్పుల్లో హర్షాతిరేకం.

వడగళ్ళవర్షంలో అసమానసౌందర్యం.


కూలినగోడల్లో నడయాడే పురాతన స్మృతులు.

ఈ కథకి ముగింపు లేదు.

రేపేమి జరుగనున్నదో ఏ పెరుమాళ్లకెరుకో నాకెరుక కాదు కనక.

* “The Road not taken” by Robert Frost.

(అక్టోబరు 11, 2010)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “ఊసుపోక – కత్తీ, కొయ్యకాలూ”

 1. బాగుంది!
  ‘శ్రీశ్రీ ఈ సందిగ్ధావస్థను ఒకలా చెపితే మీరు మరో కోణం నుంచి ఇంకా బాగా చెప్పారు.’
  -నిజం చెప్పాలంటే, నేను ఈ సందిగ్ధావస్త తోనే ఇడెంటిఫై చేస్కోగలుగుతున్నా, శ్రీశ్రీ అవస్థ కంటే 😉

  మెచ్చుకోండి

 2. అధ్భుతంగా వ్రాసారండీ .కత్తి పట్టుకునేటప్పుడు కొయ్యకాలుకైనా సిద్ధంగా వుండాలేమో Frost poem నాకు చాలా ఇష్టం చివరికి అంటాడు కదా? And that has made all the difference అని .మనని ప్రత్యేకంగా నిలబెట్టే difference.

  మెచ్చుకోండి

 3. @ శారద, మీ అభిమానానికి ధన్యవాదాలు.
  @ కొత్తపాళీ, -:))
  @ కల్పనా, అవును. సదసద్సంశయం అనుకుంటా ఆ కవిత. నాకు లీలగా గుర్తుంది కానీ మాటలు గుర్తులేవు. మఫినా, పెసరట్టా అన్న వాక్యం ఆస్ఫూర్తితో రాసిందే -:))
  రాయడానికేమీ తోచక రాసిందిది. కొందరికైనా it made sense అంటే నాకు తృప్తిగా ఉంది.

  మెచ్చుకోండి

 4. ఆ కొంగల్నీ, ఈ మనుషుల్నీ చూస్తే నాకు ఈర్ష్య. ఆ సుళువుకి కాదు, ఆ నిర్వృతికి.

  చక్కగా చెప్పారు. శ్రీశ్రీ ఈ సందిగ్ధావస్థను ఒకలా చెపితే మీరు మరో కోణం నుంచి ఇంకా బాగా చెప్పారు.

  మీ స్థితి, పరిస్థితి రెండూ కూడా అర్థమయ్యాయి.

  మెచ్చుకోండి

 5. Fantastic!
  “మాతాతగారి కత్తి చూస్తే, యుద్దానికెళ్ళాలనిపిస్తుంది

  నాన్నగారి కొయ్యకాలు చూస్తే ఎందుకులే అనిపిస్తుంది.”

  Awesome way to express dilemmas!
  చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెపుతున్నానుకోవద్దు. చాలా తేలిగ్గా, subtle గా వుంటూ కూడా చాలా లోతైన విషయాలు చర్చించే మీ శైలి నాకు చాలా ఇష్టం!

  శారద

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s