ఊసుపోక – నవ్వొచ్చినప్పుడు చెప్పు

(ఎన్నెమ్మకతలు 63)

“నూకలిస్తా మేకలు కాస్తావా?”

“కాస్తా”

“పెద్దపులొస్తే, భయపడవా?”

“భయపడను.”

“ఉఫ్ అంటేనే భయపడ్డావు, పెద్దపులొస్తే భయపడవా? హాహా”

చిన్నపిల్లల్ని ఆడించే ఆట ఇది!

మొహమ్మీద మొహం పెట్టి ఉఫ్ అని ఊదితే పిల్లలు ఉలికిపడతారు. పిల్లలేమిటిలెండి, ఎవరైనా అంతే కదా. చటుక్కున వెనక్కి జరిగి మొహం పక్కకి తిప్పుకుంటారు.

ఇది ఈకాలపు నాగరీకులకి చెప్తే మొదట పిల్లల్ని భయపట్టి ఆనందించడమేమిటి అని విస్తుపోతారు. తరవాత అది హాస్యం అనుకున్నందుకు నవ్వుతారు. అంటే కథ చెప్పినవారి తెలివితక్కువతనానికి… J. కాదంటారా?

మొన్న శనివారం రోజంతా హిచ్‍కాక్ సినిమాలు చూపించారు. ఆతరవాత డిక్ కావెట్ ఇంటర్వూ. నాకు చాలా సరదాగా అనిపించింది — హిచ్‌కాక్ మొహం గంభీరంగా పెట్టి, బొమ్మలా కూచుని హాస్యరసపోషణ వివరిస్తుంటే భలే నవ్వొచ్చింది.

నిజంగా హాస్యం పుట్టించడం ఆయనదగ్గరే నేర్చుకోవాలనిపించింది. వాటిలో నాకు నచ్చిన ఒకమాట భయం హాస్యానికి మూలం అని. ఈమాట వినగానే నాకు నవ్వొచ్చింది. సైకో సినిమాలో షవర్ సీను కూడా చాలా హాస్యరసస్ఫోరకం అంటాడాయన.

మీకెలా వచ్చింది ఈ ఆలోచన అంటే, ఆయనకి మూడునెలలప్పుడు, వాళ్ళమ్మ బూ అని (మన ఉఫ్‌లాగే) తనని భయపెట్టిందిట. అప్పట్నించీ ఆభయం అలా ఉండిపోయిందిట ఆయనలో. అసలు మూడునెలలప్పుడు జరిగినసంగతి పిల్లలకి గుర్తుంటుందా? ఏమో మరి.

గత రెండురోజులుగా ఈవిషయం నేను ఆలోచిస్తూనే ఉన్నాను. భయంలోంచి హాస్యం ఎలా వస్తుందని.

బహుశా భయపడినప్పుడు కాక, అది అయిపోయింతరవాత, ఆమాత్రందానికి భయపడడమేమిటి అని నవ్వుతాం కాబోలు.

మామూలుగా అసలు నవ్వు తెప్పించడానికి ఏం చేస్తారు ఎవరైనా? కోతిచేష్టలు ఒక పద్ధతి. నాకు అట్టే రాదు. ఎప్పుడు నవ్వనా అని చూస్తూ కూర్చుంటాను. ఎప్పుడు నవ్వాలో పక్కవాళ్లు చెప్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది.

రెండోపద్ధతి ఎదటివాడిని వెక్కిరించడం. అది మనని కానంతసేపు చాలా బావుంటుంది. పట్టలేనంత నవ్వొస్తుంది. కానీ అది నన్నే అయితే మాత్రం మహా చిరాకేస్తుంది.

మరోపద్ధతి ఈమధ్య టీవీలోనూ, సినిమాల్లో, బహుశా సాహిత్యంలోనూ కూడా అతిగా కనిపిస్తున్నది మరియు వినిపిస్తున్నది బూతుమాటలు. అతి సామాన్యం అయిన రెండు మాటలే తీసుకోండి.

“రావన్ ఎక్కడా కనిపించడేం?” అని అడుగుతాడు ఒకడు.

“ఏమో .. నాకేం ఎక్స్.ఎక్స్.ఎక్స్ తెలుసు?” అంటాడు రెండోవాడు.

ఇంతే సంభాషణ.

శ్రోతలు విరగబడి నవ్వుతారు హోరెత్తించేస్తూ. ఇక్కడ ఆ ఎక్సులు లేకపోతే ఎకసక్కేలు లేవు. నాకిది హాస్యరసస్ఫోరకం కాదని చెప్పడానికి సిగ్గేస్తోంది. బహుశా నా ఐక్యూ సెన్సాఫ్ హ్యూమరుపరంగా చాలా తక్కువస్థాయిలో ఉండి ఉండాలి. అన్నట్టు సెన్సాఫ్ హ్యూమరంటే హాస్యరసాస్వదనాగుణం అనొచ్చా?

అమెరిన్ టీవీతో పరిచయం ఉన్నవాళ్ళకి కేరల్ బర్నెట్ షో కరతలామలకమే అనుకుంటా.

వాటిలో టిమ్ కాన్వే (Tim Conway) చింపిరి జుత్తుతో, వణుకుతూ, అడుగులో అడుగేసుకుంటూ అయోమయంగా దిక్కులు చూస్తూ, మతిమరుపు మాటలతో .. ప్రేక్షకులని తెగ నవ్విస్తాడు. అది చూసి నేను కూడా నవ్వేను. (ఇప్పుడు నావంతు కూడా వస్తుంది త్వరలోనే అనిపించి దిగులేస్తోంది, నవ్వు రావడం లేదు :(. ) అసలు టిమ్ కాన్వే కూడా అప్పుడయితే “నటించేరు” కానీ ఇప్పుడయితే సహజసిద్ధం కావచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించు ఆవయసులోనే ఉన్నారాయన! బహుశా చింపిరి జుత్తుతో కాకపోవచ్చు. నాసందేహం అసలు ఇప్పుడు మళ్ళీ అలాటి పాత్ర ఆయన సృష్టించగలరా? సృష్టిస్తే అది రాణిస్తుందా అని. మనకి నవ్వొస్తుందా?

హిచ్‌కాక్ చెప్పిన మరోజోకుతో ముగిస్తాను. నిజానికి ఆయన చెప్పినవిధానం మరింత అందాన్నిచ్చింది ఆ సన్నివేశానికి. అవకాశం ఉన్నవాళ్లు యూట్యూబులో చూడండి.

ఆయన ఒకసారి తన స్నేహితులు 14మందికి డిన్నరిచ్చేడుట. మొత్తం వంటకాలన్నీ నీలం–అన్నం, రొట్టెలూ, సూప్, ఐస్‌క్రీం… అన్నీ నీలమే.

నీకెలా వచ్చింది ఆ ఆలోచన అని అడిగేడు డిక్ కావెట్.

హిచ్‌కాక్ ఛాయామాత్రంగా తలూపి, “out of the blue” అన్నాడు. దీనిమీద నావ్యాఖ్య అనవసరం.

మనకి కూడా ఇలాటివి ఉన్నాయి.

వివాహవేళ విందు. అందరూ భోజనాలకి కూర్చున్నారు వరుసలు తీరి. విస్తళ్ళు వేసి, వాటినిండా కూరలూ పచ్చళ్లూ వడ్డించేసేవారు.

వడ్డన పూర్తయింది. బ్రాహ్మణులు ఔపోసన పట్టి, వంటకాలమీద చల్లి, భోజనాలకి ఉపక్రమించేరు.

ఇద్దరు ప్రముఖ పండితులు (వాళ్ళపేర్లు ఇప్పుడు నాకు గుర్తు రావడంలేదని చెప్పడానికి సిగ్గుగా ఉంది). ఒకాయన అట్టే పొడగరి కాదు.

ఆరోజుల్లో మీకు తెలుసు కదా పెద్ద పెద్ద అరిటాకులు. ఆకు చివర కందకూర.

ఆ పొట్టి శాస్త్రిగారికి కందకూర చాలా ఇష్టం. అదేమో ఆకు చిగుర్న ఉంది.

కూర అందక, ఊరుకోలేక నానా అవస్థా పడుతున్నారాయన.

పక్కనున్న పండితుడు, “శాస్త్రిగారూ, ఆకందకేనా అంత ఆరాటం?” అన్నారుట నవ్వుతూ.

రెండో శాస్త్రిగారు, “అవునండీ, ఆకందకే,” అని జవాబిచ్చేరుట.

ఇక్కడ మరోమాట  – Out of the blue అన్న వాచకానికి వివరణ అక్కర్లేదు కానీ ఈ “ఆకందకే” అన్నమాటకి వివరణ ఇవ్వాలా ఒద్దా అన్నది తేల్చుకోలేకపోతున్నాను. :p.

(29 నవంబరు 2010)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “ఊసుపోక – నవ్వొచ్చినప్పుడు చెప్పు”

 1. @ కొత్తపాళీ, అద్భుతం. మేకతోక పద్యంలా అర్థం తీయడానికి వీలుగానే ఉంది (నేను చెప్పనులెండి :)). ఈటపాకి తగిన స్పిరిటు కూడా. బోల్డు ధన్యవాదాలు.
  @ రవి, భలే ఉందండీ మీపద్యం కూడా ఈటపాకి సమతూకంలో అమరింది. అది తెనాలి రామకృష్ణయ్యది కాదండీ. బాగా గుర్తు రావడంలేదు కానీ 20వ శతాబ్దపు పండితులే. ఒకరిపేరు ఏదో శాస్త్రిగారు. ఎటొచ్చీ మనకి చాలామంది పండితులున్నారు కదా శాస్త్రి పేరుతో…
  మరొకసారి మనఃపూర్వక ధన్యవాదాలు పద్యాలు రాసిచ్చినందుకు.

  మెచ్చుకోండి

 2. కం||
  “ఆకందక” వృత్తాంతము –
  జోకందక పరితపించు శుంఠాగ్రణులన్
  నాకెందుకనూరకనే
  కూకుందక కందమందుఁ గూర్చితిఁ గనుమా!

  బావున్నాయండి, ఊసుపోక కబుర్లు. “ఆకందక” – ఎపిసోడ్ తెనాలి రామకృష్ణయ్యదేమో అని అనుమానంగా ఉంది.

  మెచ్చుకోండి

 3. కం. ఆకందకు పోకందకు
  ఈ కందకు శ్లేష జేర భేకం బాకా
  నాకమ్మును తాకినదది
  ఈ కందము శ్రుతినిమించ ఈశ్వరు కృపతో! 🙂
  Don’t try to find meaning in the above “poem”! It is a deliberate hodge podge of several famous kanda padyam references, mingled with the “pun” from this post.
  Peace out!!

  మెచ్చుకోండి

 4. @ కొత్తపాళీ, నేను మీపద్యంకోసం ఇంకా ఎదురుచూస్తున్నాను. అసలు ఈటపా రాసేముందే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా మళ్ళీ మిమ్మల్ని ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని ఊరుకున్నా.
  @కొత్తావకాయ, **అట్లే పోయుము** బాగుందండీ. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. “అట్లు పోయనా”? అని నాయనమ్మ అడిగితే “అట్లే పోయుము” అని సమాధానం ఇచ్చిన తాతగారు గుర్తొచ్చారు. భయానికి, హాస్యనికి సున్నితమైన బంధుత్వం. మొదటి దాని మోతాదు మించిందా.. రెండో దాని రంగు చెడినట్టే. 🙂

  మెచ్చుకోండి

 6. కందపద్యం – నిజమే చూశరా, తట్టను కూడ లేదు. రెండేళ్ళ కిందట అయితే ఆ రెండక్షరాలు వినబడితే పద్యమే స్ఫురించేది. ఇప్పూడయినా వస్తుందనుకోండి, కొంచం కష్టపడాలి. 🙂

  మెచ్చుకోండి

 7. కందకి లేని దురద కత్తి పీటకెందుకూ? 🙂
  భయానికీ హాస్యానికి కనెక్షను ఆసక్తిగా ఉంది. మనమే ఉట్టినే భయపడ్డామని తెలుసుకున్నప్పుడూ నవ్వేసుకుంటాము కదా.

  మెచ్చుకోండి

 8. @ అనిలు, 🙂 బాగుందండీ. … – ఆకందక, జోకందక, నాకెందుకని ఊరకుందక (అదేలెండి ఊరుకుండక అని కానీ ఊరక కుందక అని కానీ)…
  ఛందస్సు తెలిసినవారు ఓ కందపద్యం రాయాలిప్పుడు!..

  మెచ్చుకోండి

 9. తప్పదు..ఇవ్వాల్సిందే!
  అందరికి ఆ హాస్యరసాస్వదనాగుణం ఒకే మొతాదులో ఉండదు కదా? పైగా కొంతమందికి ‘ఆకందక’ అర్ధం అందక పోవచ్చు కూడా. 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s