అనువాదకులూ, సంపాదకులూ …

ఒకే పుస్తకానికి రెండు అనువాదాలెందుకు అని సౌమ్య అడుగుతోంది. ఈమధ్యనే అఫ్సర్ గారి బ్లాగులో సంకలనకర్తల, సంపాదకుల బాధ్యతలగురించి చర్చ మొదలయి, చాలా అభిప్రాయాలు తెలుసుకోడానికి అవకాశం కలిగింది. మొదటి ప్రశ్నా, రెండో చర్చా చూసినతరవాత నాకు నిరంకుశో కవయః అన్నది మార్చి నిరంకుశో సంపాదకః మరియు అనువాదకః అనడం సబబేమో అనిపిస్తోంది!

నామటుకు నేనూ యథాశక్తి ఈఅగ్నికి ఆజ్యం పోస్తూనే ఉన్నానని ఒప్పేసుకుంటాను. ఇప్పుడు మరోసారి…

ముందు కొన్ని నేపథ్య శకలాలు మీముందు పెడతాను.

కాళీపట్నం రామారావుగారి యజ్ఞం కథ నేను అనువాదం చేసి తూలిక.నెట్‌లో పెట్టేను 2003లో. ఆతరవాత జైకోవారు ప్రచురించిన నాసంకలనంలో (2006) కూడా వచ్చింది.  ఆతరవాత డా. సి.యల్.యల్. జయప్రదగారు రామారావుగారి కథలన్నీ అనువాదం చేశారు, సాహిత్య ఎకాడమీ ఆ సంకలనం ప్రచురించారు. అంచేత యజ్ఞం కథకి కనీసం రెండు అనువాదాలు ఉన్నట్టే లెఖ్ఖ.

నేను అనువాదం చేయడం మొదలుపెట్టిన కొత్తలో నా అమెరికన్ మిత్రుల సలహాలు తీసుకుంటూ ఉండేదాన్ని. ఆరోజుల్లో వారికి మనకథలు ఎందుకు అయోమయం అవుతాయో, మన అనువాదాలు అమెరికాలో ఎందుకు ప్రాచుర్యం పొందలేదో, (యూనివర్సిటీలమాట కాదు నేను అంటున్నది. సాధారణపాఠకులకి అసలు మనకి ఈరచయితలు ఉన్నారని కూడా తెలీదు, ఎంచేత అని),  కొంతవరకూ అర్థమయింది నాకు.

ఒక కారణం మనవాళ్ళకి అసలు విదేశాల్లో వీటిని ప్రాచుర్యంలోకి తెచ్చే ఆసక్తి లేకపోవడం. ఉదాహరణకి ఎంతమంది తెలుగువాళ్ళు తెలుగు అనువాదపుస్తకాలు తమ అమెరికన్ స్నేహితులకి పరిచయం చేస్తారంటారు? తమ అమెరికన్ మిత్రులు మనసంస్కృతిగురించి ప్రశ్నలు వేయడం సహజంగానే జరుగుతుంది కదా. అలాటప్పుడు, “ఇదుగో, ఇవి మాకథలు. ఇవి చదవండి. మాసంస్కృతి తెలుస్తుంది కొంతవరకైనా” అనే తెలుగువారు ఉన్నారంటారా? నాకు కనిపించలేదు.

రెండో కారణం – అనువాదంలో భాష. అనువాదం ఎలా చెయ్యాలి అన్న విషయంలో – మనదేశంలో విస్తృతంగా చర్చలూ, సభలూ, సమావేశాలూ, కోర్సులివ్వడాలూ జరుగుతున్నాయి. అయినా విదేశాల్లో తెలుగుకథకి ప్రాచుర్యం లేదు. ఎంచేత? నేననుకోడం మనకి వస్తున్న అనువాదాలు మనదేశంలో ఇతరభాషలవారికి అర్థమయేలా ఉంటున్నాయి కానీ మనసంస్కృతి బొత్తిగా తెలీనివారికి అర్థమయేలా ఉండడంలేదని.

ఇది మరొక కారణం రెండో అనువాదం పుట్టడానికి. ఈ రెండో అనువాదంలో మార్పులుంటాయి మనసంస్కృతీ, సాంప్రదాయం, సామెతలూ – ఇలాటివి ఇతరసంస్కృతుల వారికి విడమర్చి చెప్పడం, అవసరమైతే మరింత విపులంగా చెప్పడం జరుగుతాయి కాబట్టి.

అయితే, ఆ మార్పులు ఎంతవరకూ అన్నవిషయంలోనే పేచీ. యజ్ఞంకథలో (Rite of sacrifice) నేను కొన్ని మార్పులు చేశాను. ప్రధానంగా కథలో అప్పల్రాముడు గ్రామపంచాయితీలో తనవాదన వివరించే ఘట్టంలో. దాదాపు నాలుగు పేజీల ఉపన్యాసం అది. అందులో కథకుడు మూడుసార్లు ముందుకీ వెనక్కీ నడుపుతాడు కథని. అంటే, అప్పల్రాముడు ఇచ్చే ఉపన్యాసం మధ్యలో కథ ఆపి కథకుడు పూర్వగాథ వివరిస్తాడు. అలా కథ ముందుకీ వెనక్కీ పోవడం అయోమయంగా ఉంటుంది మనకథనవిధానం తెలీనివారికి. అంచేత, అదంతా ఒకే ఉపన్యాసంగా మార్చేను, రామారావుగారి అనుమతితోనే. రామారావుగారు పెద్దమనసుతో అంగీకరించేరు. కానీ ఇప్పుడాలోచిస్తే, నేను చేసినపని న్యాయం కాదనే అనిపిస్తోంది. ఎంచేతంటే, మన తెలుగుకథ తీరుతెన్నులు మార్చేయడం జరిగింది నేను చేసిన మార్పువల్ల. మౌఖిక సాహిత్యసాంప్రదాయంలో అలా ముందుకీ వెనక్కీ వెళ్ళడం జరుగుతుంది. నేను చేసిన మార్పువల్ల ఆ కోణం పోయింది.

ఇలాటి విస్తృతమార్పుల విషయంలో దాసు కృష్ణమూర్తిగారి అభిప్రాయం అఫ్సర్ గారి బ్లాగులో చూడండి. కృష్ణమూర్తిగారు అనుభవజ్ఞులు. వారిని తప్పుపట్టడం నా ఉద్దేశ్యం కాదు. పదుగురాడుమాట పాటియై చెల్లు ధరలో. అంచేత, సంపాదకులూ, సంకనలకర్తలూ, అనువాదకులూ ఇలా మార్పులూ చేర్పులూ చేస్తూంటే అదే పాటి అయిపోతుందేమో కొంతకాలానికి.

ప్రస్తుతానికి, నా అభిప్రాయాలు మాత్రం మరోలా ఉన్నాయి. ఇప్పుడు నాకు అలా అంత భారీఎత్తున మార్పులు చెయ్యడం న్యాయం కాదని అనిపిస్తోంది. ఎందుకంటే, ప్రతి రచయితకీ తనదైన శైలి ఉంటుంది. పునరుక్తులూ, సందర్భోచితం కాని పదాలూ ఆశైలిలో భాగమే. ఉదాహరణకి, బలివాడ కాంతారావుగారి కథలో “మేనేజరు ఆ కోరిక కొనసాగించాడు” అన్న వాక్యం “ఆకోరిక కూడా తీర్చాడు” అన్న అర్థంలో వాడినట్టు కనిపిస్తోంది సందర్భాన్ని బట్టి. (ఈవిషయం సౌమ్య అడిగేవరకూ నాకు తోచలేదు). ఇలాటి అసామాన్య వాడుకకీ, అపభ్రంశాలకీ, తప్పులకీ, ఒప్పులకీ – అన్నిటికీ ఆ రచయితే బాధ్యుడు. ఆయన అలా రాస్తారు, కొన్ని ప్రాంతాల్లో అలా అంటారు అని మనకి తెలియాలంటే అవన్నీ అలాగే ఉంచాలి కానీ పదోతరగతి కాంపోజిషన్ క్లాసులా కలం పుచ్చుకుని దిద్దుతూ పోకూడదు. అలా దిద్దితే, పాఠకులకి అందేది ఆ సంపాదకుడి, అనువాదకుడి భాషే కానీ రచయిత భాష కాదు.

కిందటేడు, నేను “ఉత్తమాఇల్లాలు” అని రాస్తే, అక్కడి సంపాదకులలో ఒకరు, “మా”కి దీర్ఘం కాదు త కింద థ ఒత్తు పెట్టాలి (“ఉత్థమ” అని) అని సలహా ఇచ్చేరు. నాకు చెప్పకుండా ఆయనే అలా మార్చేసి ప్రచురించి ఉంటే, పాఠకులు అది నాతెలుగే అనుకునే ప్రమాదం ఉంది కదా. నేనే అలా రాస్తే, అది వేరే కథ.

ఇప్పుడు ప్రస్తుతానికీ, మళ్ళీ అనువాదాలకీ వద్దాం. ఈమధ్యకాలంలో అంటే యజ్ఞం అనువాదం నుండి ఇప్పటివరకూ చాలా అనువాదాలే చేశాను. ఒకరిద్దరు రచయితలు నాఅనువాదాలలో “నేను అనుకున్నది అది కాదు” అన్నారు. మరి ఎందుకు అలా జరిగిందంటే, రెండు కారణాలు

మొదటిది, ఉన్నదున్నట్టు అనువాదం చెయ్యడమా, ఇంగ్లీషులో సాఫీగా సాగేలా చెయ్యడమా అన్నది ప్రతి అనువాదకుడికీ ఎదురయ్యే సమస్య. చిన్న ఉదాహరణ – ఈమధ్య నేను ఒక కథ అనువాదం చేస్తున్నప్పుడు ఒక వాక్యం “ఆ మధ్యాన్నమంతా దట్టంగా పేరుకున్న టెన్షన్‌ ఒక్ఖసారిగా బద్దలైనట్టు వేసవి కాలపు థండర్‌ స్టార్మ్‌ నగరం మీద విరుచుకు పడిపోయింది.” అని. ఇక్కడ “బద్దలైనట్టు” అన్నమాటలో “-అట్టు” అంటే like or as if అనే అర్థం. లేదా, shattering the tension అనొచ్చు. కానీ Shattering అంటే తెలుగులో బద్దలవుతూ, అనో బద్దలుగొడుతూ అనో ఉండాలి. మరి నాఅనువాదంలో ఏది నప్పుతుంది, రచయితకి ఏది నచ్చుతుంది, అసలు వాడుకలో ఉన్న పదజాలం ఏమిటి, ఉన్నది ఉన్నట్టు రాయాలా, ఆమాటకి అర్థం ఇదీ అని అర్థం చేసుకుని రాయాలా – ఈ ప్రశ్నలకి సమాధానాలనిబట్టి నేను ఏది వాడతాను అన్నది ఆధారపడి ఉంటుంది. (కొత్తపాళీ, అవునండీ. ఇది మీ ఇండియన్ వాల్యూస్ కథే. మీరు మాఊరొచ్చినప్పుడు ఈవిషయం వివరంగా చర్చించుకుందాం.).

రెండోది, వేరు వేరు పాఠకులు వేరు వేరు కోణాల్లో కథని దర్శిస్తారన్నది. మరి అనువాదకుడు కూడా పాఠకుడే కదా. అంచేత, పాఠకుడిగా అనువాదకుడు ఏ కోణం అర్థం చేసుకున్నాడో అదే కోణాన్ని అనువాదంలో ఆవిష్కరించడం జరుగుతుంది. అంచేత, కొన్ని మార్పులో, మార్పుల్లా కనిపించేవో చెయ్యడం జరుగుతుంది. అయితే, మొత్తం కథంతా సమూలంగా మార్చేసి తిరగ రాసి, అది మూలరచయితకథగా ప్రచురిస్తే మాత్రం ఆ రచయితస్ఫూర్తికి అపచారమే అనుకుంటాను. సంపాదకులు అలా చేసినప్పుడు, మల్లాదికథకీ శ్రీపాదకథకీ తేడా తెలీకుండా పోయే ప్రమాదం ఉంది. అన్నీ ఒకేమూసలో, ఒకే బాసలో – అదే సంపాదకులబాసలో రూపు దిద్దుకుని, అసలు రచనకి ఎసరు పెడతాయి.

ఇలా ఆలోచిస్తూ పోతే తెలుగుకథని తెలుగుకథగా ప్రచురించేటప్పుడు సంపాదకులకి లేని (లేదని నేను అనుకుంటున్న సౌలభ్యం) అనువాదకుడికి అవుసరమేమో అనిపిస్తోంది. ఈవిషయం నేను ఆలోచిస్తూ ఉండగానే, రెండు సంకలనాలు ప్రచురించడం జరిగిపోయింది. మూడోది ప్రచురణకర్తలు సిద్ధం చేస్తున్నారు. అందుకు నేను చింతించాలో సంతోషించాలో నాకే తెలీడంలేదు.  :).

(6 December 2010, )

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “అనువాదకులూ, సంపాదకులూ …”

 1. కల్పనా, చాలా ముఖ్యమైన అంశం ముందుకి తెచ్చేవు. ఈ విషయంలో నిర్ణయాలు కష్టమే. నువ్వన్నట్టు రచయితలు అందుబాటులో ఉంటే అడుగుతాను. వారు లేనప్పుడు అనువాదకురాలిగా నేనే నిర్ణయించుకోవాలి. నిజానికి నాకు వస్తువు విషయంలో తప్పులు తెలీవు కనక అవి అలాగే ఉండిపోతాయి. ఎవరిదాకానో ఎందుకు, నేనే చాతకపక్షులు మొదటిసారి రాసినప్పుడు frozen సొమాసాలు అని రాసేను. ఒకమ్మాయి 70లో అవి లేవండీ అని నాకు ఈమెయిలిచ్చింది. ఇది మారిస్తే, నా తెలివితక్కువతనం ఎవరికీ తెలీదు. మార్చకపోతే, అనువాదం ముఖ్యంగా విదేశీ పాఠకులకి అయినప్పుడు, వారు అపోహ పడే అవకాశం ఉంది. ఇలాటి సందర్భాలలో అనువాదకుడు తన ఎడిటోరియల్ లో ఇది విశదీకరించవచ్చు. – ఈరచయితకి ఇలాటి అంశాలలో శ్రద్ధ లేదు. అదీ అతని తత్త్వం అనో మరోలాగనో వ్యాఖ్యనించవచ్చు. కానీ కథంతా తిరగరాయడం అన్యాయమనే అంటాను.
  కొన్ని సందర్భాలలో తార్కానికి అందనివి కూడా కథే కదా అని ఊరుకోవాలి. రచయితకి తెలీదు అంటే మరి అలా రాసినప్పుడు తెలీదనే అర్థం కదా. ఆ కథలో తప్పులకీ ఒప్పులకీ కూడా రచయితే బాధ్యుడు.
  ఉదాహరణకి, నాకు మెడికల్ టెర్మినాలజీమీద ఆసక్తి లేదు. కథ చెప్పడానికి మెడికల్ తంతు అంతా వివరించడం నాకు ఇష్టమూ కాదు, చేతనూ కాదు. నాకు కావలసింది మానవీయకోణం మాత్రమే. అలాటప్పుడు నాకథని అనువదిస్తూ దాన్నిండా మెడికల్ పదజాలం పెట్టేయడం న్యాయం కాదనే అనుకుంటాను, ఈరోజుల్లో చాలాకథలు అలా ఉంటున్నా. అంతే కాదు, నాకు లేని సాంకేతిక పరిజ్ఞానాన్ని నాకు ఉన్నట్టు చూపించడం జరుగుతుంది. నాకథ అలా మారిస్తే నాదైన శైలికి భంగమే.

  మెచ్చుకోండి

 2. మాలతి గారు,

  సౌమ్య వ్యాసం చదవాలి. చదివి సౌమ్య సందేహాలేమిటో చూస్తాను. ఇక మీ వ్యాసానికి సంబంధించి నాకు ఇంకొక సందేహం..మీరు అనేక మంది రచయితల కథలు అనువాదాలు చేస్తూ ఉంటారు కదా.. రచయిత ఒక తప్పు రాశాడనుకోండి…అది భాష పరమ్గా కానీ, లేదా ఇతివృత్త పరమ్ గా కానీ…అప్పుడు సామాన్యం గా అనువాదకులు ఏం చేస్తుంటారు? రచయిత దృష్టికి తీసుకెళ్తారనుకోండి. చనిపోయిన రచయితలైత్గే.:-))
  ఆ తప్పు సరిచేయకపోతే…అది అనువాదకుడి లోపం అనుకుంటారు. సరి చేస్తే…మూల రచయిత తప్పు ని కప్పి పుచ్చినట్లు అవుతుంది కదా…వూరికె…చర్చ లో మరో కోణం చూపించటానికి….

  మెచ్చుకోండి

 3. కొత్తపాళీ, వ్యక్తీకరణ, భావప్రకటన – అవునండీ. మౌలికంగా నేను అంటున్నది కూడా అదే. అయితే, ఒకొకప్పుడు రచయిత ఏమనుకుంటాడో అన్నభయంచేత, ముఖ్యంగా ఇంగ్లీషులో రాస్తున్నవారివిషయంలో, అటూ ఇటూ చేస్తాను. పోతే, నాకు ఆశ్చర్యం కలిగించింది దాసు కృష్ణమూర్తిగారు అంత విస్తృతంగా కథని మార్చడం. ఈవిషయంలో చర్చకి చాలా అవకాశం ఉంది. కానీ ఎవరూ తమ అభిప్రాయాలు ఇక్కడ ప్రకటించలేదు. మీవ్యాఖ్యకి దన్యవాదాలు. కనీసం మీపేరు చూసైనా ఎవరైనా వస్తారేమో చూద్దాం. 🙂

  మెచ్చుకోండి

 4. మాలతి గారు, నా కథలో వాక్యం గురించి – తెలుగులో నేను రాసిన వాక్యానికీ, మీరు సూచించిన ప్రత్యామ్నాయ వాక్యానికీ భావంలో ఆట్టే తేడాలేదు. కానీ ఆంగ్లంలో ఈ రెండిటి వ్యక్తీకరణలకీ తగినంత మౌలికమైన భేదం ఏర్పడుతున్నది. ఐతే, ఈ ఒక్క సందర్భంలోనూ ఆ టెన్‌షను బద్దలైంది అన్న భావం ముఖ్యం వ్యక్తీకరణకంటే – అందుకని ఈ రూపాన్ని ఎంచుకున్నా పరవాలేదని నాకనిపిస్తున్నది. కానీ మరికొన్ని సందర్భల్లో అలా కుదరకపోవచ్చు. నేను చేసిన కథ/కవిత అనువాదాల్లో వ్యక్తీకరణకంటే మొత్తమ్మీద భావానికే ప్రాధాన్యత నిచ్చాను. కథల్లో అయితే మూలరచన రూపాన్ని స్థూలంగా ఫాలో అవుతూ ఆంగ్లంలో నా మాటల్లో కథని తిరిగి చెప్పే ప్రయత్నమే చేశాను. అఫ్కోర్సు మీ అనుభవం చాలా విస్తృతం, అంచేత మీ గమనికలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

  మెచ్చుకోండి

 5. Very interesting discussion, Malati garu. Yes, I recognized the sentence 🙂

  సౌమ్య – ఒక నవలకి, కథకి అనేక అనువాదాలు ఉండడాన్ని “సమస్య” అని మీరెందుకంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. నా వుద్దేశంలో the more, the merrier. భారతీయ రచనలని పాశ్చాత్య భాషల్లోకి అనువాదం చేసేటప్పుడు ఆ రచనకి పాఠకులు భారతీయులా, విదేశీయులా అనే ప్రశ్న చాలా సమంజసమైనదే. హారతి కళ్ళకద్దుకోవడం అనేది తెలుగురాని మరో భారతీయునికి వివరించనక్కర్లేదు, కానీ విదేశీయులకి వివరించాలి. ఒక అనువాదాన్ని ఏదన్నా భారతీయ సంస్థ, ముఖ్యంగా భారతీయ మార్కెట్టుకోసం ప్రచురిస్తున్నప్పుడు ఆ అనువాదం ఇలా ప్రతీ చిన్న సాంస్కృతిక విశేషాన్నీ విపులంగా వివరించనక్కర్లేదు. ఆ మేరకు అనువాదకుని పని సులువవుతుంది.

  మెచ్చుకోండి

 6. @ అఫ్సర్ గారూ, అవునండీ. ఇది అవుసరమైన చర్చే. మీరు ఇంకాస్త వివరంగా సంపాదకుల, సంకలనకర్తలబాధ్యతలగురించి రాస్తారని ఆశించేను.
  సంకలనకర్తలు ఏవో కొన్ని నియమాలు పెట్టుకుని ఎంపిక చేస్తున్నారనుకుందాం. ఆ నియమాలమూలంగా, జరుగుతున్న హాని ఏమిటి? ఏవి సంకలనాల్లోకి రాకుండా హరించుకుపోతున్నాయి? వాటిని కాపాడుకోడానికి మనం ఏం చెయ్యగలం? ఉదాహరణకి, అవే కథలు మళ్ళీ మళ్ళీ సంకలనాలూ, ఆసంకలనాల్లోంచి తీసినకథలు మళ్ళీ మరో సంకలనం – ఎందుకు చేస్తున్నారంటారు? అలాగే, సంపాదకులూ, సంకలనకర్తలూ, అనువాదకులూ తమకి తోచినట్టు మార్పులు చేసేయడం సమంజసమేనా? సమంజసం కాకపోతే రచయితలు ఎలా ప్రతిఘటించగలరు? – ఇవన్నీ నాకు కలుగుతున్న సందేహాలు.

  @ సౌమ్య, బెంగాలీలకి టాకూర్ కాలంనించీ మంచి పేరొచ్చింది. వాళ్ళఇంగ్లీషు కూడా నువ్వన్నట్టు – పాఠకులందరికీ మనవాతావరణం తెలీదు – అన్న ప్రాతిపదికతోనే చేశారనుకుంటా. ఎందుకంటే, ఆ అనువాదాలు ఇంగ్లీషువాళ్లని మనసులో పెట్టుకు చేసినవే అని నా అభిప్రాయం. మన తెలుగువాళ్లలో కూడా అలాటి ఇంగ్లీషు రాయగలిగినారున్నారు. ఉదా. నార్ల. కానీ అనువాదాలకొచ్చేసరికి, చాలామంది ఇంగ్లీషొచ్చిన పొరుగు తెలుగువాడికోసమే రాసినట్టు అనిపిస్తుంది! నువ్వన్నట్టు, అంతర్జాతీయంగా ఆదరణ పొందాలి అనుకుంటూ అనువదించడం ఒకటి, అలాటి అనువాదాలు ప్రాచుర్యంలోకి రావడానికి పాటుపడడం రెండు – చేస్తే, మనతెలుగుకథకి ఇంతకంటే ఘనంగా బతకగలదని అనుకుంటాన్నేను.

  కన్నడ తెలుగంత అర్థ్వాన్నం కాదేమో. రాజారావు, అనంతమూర్తి, ఈమధ్యకాలంలో రామానుజన్ లాటివారు అంతర్జాతీయంగా సుప్రసిద్ధులే కదా కదా.

  మెచ్చుకోండి

 7. నాకో సందేహం – మీరన్న మల్టిపుల్ అనువాదాల విషయంలో…ఒక్క తెలుగు/కన్నడకే ఎందుకా సమస్య?

  బెంగాలి నవల్లను తీసుకుందాం ….బయట పుస్తక ప్రదర్శనల్లో నాకు భారతీయ నవల్ల అనువాదాల్లో అవే ఎక్కువగా కనిపిస్తాయి.వాటిక్కూడా అలా రెండు మూడు ఆంగ్లానువాదాలు ఉంటాయా? స్వదేశీయులకి ఒకటి, విదేశీయులకి ఒకటి అని? నాకు ఎప్పుడూ రెండు అనువాదాలు కనబడలేదు వాటికి మాత్రం ..

  మరి వాళ్ళు అందరికీ సూటయ్యేలా అనువాదం చేయగలిగినపుడు ఇతర భాషల విషయం లో మాత్రం ఎందుకు చేయలేరు?

  అసలు నాకేమనిపిస్తుందంటే అనువాదం చేసేటప్పుడు అనువాదకులు పాఠకులకు ఈ కథా వాతావరణం గురించి చాలా బాగా తెలుసు – అని ఊహించుకోకుండా, అనువాదం చేస్తే చాలేమో అని. ఏమంటారు?

  మెచ్చుకోండి

 8. మాలతి గారూ:

  ఇది చాలా అవసరమయిన చర్చ. కానీ, మన వాళ్ళకి అవసరమయిన విషయాల మీద చర్చించే ధైర్యం లేదు. తెలుగు సాహిత్యం పిరికిపందల సమూహం! పెట్టుబడికి, కట్టుబడికి దాసోహం!

  సంపాదకుడు, ఎడిటరు అంటే దానికి ఈ కాలంలో పెద్ద విలువేమీ లేదు. నాలుగు రాళ్ళు వెనకేసుకొచ్చిన ప్రతి వాడూ సంపాదక చింపాంజీనే!

  ఏది సంపాదకత్వం? ఒక రచనని వ్యక్తిగత కుల/ప్రాంత/ఆశ్రిత పక్ష వాతాలకి గురి కాకుండా ఎలా ఎంపిక చెయ్యాలి? కనీసం ఈ విషయం మీద మనకి గౌరవం వుండాలని నా అభిప్రాయం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s