ఊసుపోక – నేను పట్టినకుందేలికి నిజంగా మూడుకాళ్ళేనండీ

(ఎన్నెమ్మకతలు 64)

పట్టు పట్టరాదు, పట్టెనేని పట్టు విడువరాదు అని ఆర్యోక్తి. ఆ మాట వినే కావచ్చు తా పట్టినకుందేలికి మూడే కాళ్ళంటూ పట్టు పట్టి ప్రాణంమీదికి తెచ్చుకున్నాడు ఓ బుద్ధిమంతుడో మందబుద్ధో …

ఆ తాబట్టిన కుందేలికి మూడే కాళ్ళని పట్టు పట్టినవాడూ, వాడిచేత నిజం చెప్పాలని పట్టు పట్టిన రాజూ – ఇద్దరికీ కూడా ఐక్యూ చాలా లో అయుండాలి.

తాబట్టినకుందేలికి మూడే కాళ్ళని పట్టు పట్టిన బుద్ధిమంతుడు లేక మందబుద్ధి సంగతే తీసుకుందాం.

ఆయన పట్టిన కుందేలికి నిజంగా మూడే కాళ్ళు ఎందుకు కాకూడదు? ఆమధ్య ఎప్పుడో మూడు,  నాలుగేళ్ళయిందేమో ఒక వార్త విన్నాను కేరళలో ఒక పాప ఎనిమిది చేతలతో పుట్టిందని? ఆ తల్లిదండ్రులేమో సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవే అష్టబాహువులతో తమఇంట పుట్టిందని మురిసిపోతే, డాక్టర్లేమో ఆరోగ్యం కాదనో, ఈనాటిసమాజంలో ఫిట్టవదనో, ఆరుచేతులు ఉత్తరించేసి, ఆపిల్లని “మామూలు” మనిషిని చేశారు.

ఇందుకు ప్రతిగా మరోకథ. కొన్ని దశాబ్దాలక్రితం కెనడాలో ఓ తల్లికి ఐదుగురు పాపలు కలిగేరు ఏకకాలంలో. ఆపిల్లలతాలూకు పెద్దలు వెంటనే ఓ డేరా వేసేసి, ఆ పసిపిల్లలకి ఓ ప్రదర్శనశాల ఏర్పాటు చేసి, టికెట్లు పెట్టి డబ్బు చేసుకున్నారు. పాపం పుట్టిన క్షణంనుండీ వాళ్లు చేసిన ప్రతిపనీ, బోర్లా పడ్డం, పాకడం, కూర్చోడం, మూడుచక్రాలబండి తొక్కడం – అన్నీ వింతలే. అలా ప్రదర్శింపబడుతూ పెద్దవాళ్ళయేరు. ఆతరవాత వాళ్ళ జీవితాలు నానా కంగాళీ అయేయి ఆ లైమ్‌లైట్ భరించలేక. .

నవనాగరీక సమాజంలో నాకర్థం కాని భాగాల్లో ఇదొకటి – అందరూ ఒకే మూసలోనుంచి వచ్చినట్టు ఓ బాణీలో ఫిట్టవాలి. మరోపక్క ఎవరికి వారే ఏకైక నమూనా అయి రాజిల్లాలి. ఏకకాలంలో రెండూ సాధ్యం కావు కదా. అంచేత జరిగేదేమిటంటే ఏవిధంగానూ సుఖానికి నోచుకోకుండా పోతాం.

ఇంతకీ కుందేలుకథ – ఇది నాకు నచ్చదు. నచ్చకపోవడమే కాదు, పెద్ద అభ్యంతరాలే ఉన్నాయి.

ఓ రాజుగారి వంటవాడు కుందేలు కూరొండుతాడు. తీరా వండినతరవాత జిహ్వచాపల్యం ఆచుకోలేక ఓ కాలు రుచి చూస్తాడు. అక్కడ మొదలవుతుంది అసలు తంటా. ఆ తరవాత ఆ మహరాజు గారు నాలుగోకాలేదీ అనడగడం, తాబట్టిన కుందేలికి మూడే కాళ్లని వంటవాడుగారు నొక్కి వక్కాణించడం, ఆపైన రాజుగారు మండిపడి, వాడిని నానాహింసలూ పెట్టడం – స్తంభానికి కట్టి తాట ఒలిపించేయడం, తలకిందులుగా వేలాడదీసి అరికాళ్ళకింద మంటలు పెట్టడం, సలసల కాగుతున్న నూనెలో ముంచేయడం – ఇదీ కథ. వెధవ కుందేలుకాలుకోసం ఇంత కిరాతకమేమిటి అని నాకు కోపం.

ఇప్పుడు ఇంకొంచెం తార్కికంగా ఆలోచిద్దాం. అసలు రాజుగారికెందుకంత పట్టుదల వంటవాడిచేత అబద్ధమాడుతున్నట్టు ఒప్పించాలని. నిజంగా వాడు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు ఉండకూడదా? ఆరోజుల్లో కనక ఆరాజుగారి ఓఘాయిత్యం చెల్లిపోయింది కానీ ఇప్పుడయితే అంతర్జాతీయస్థాయిలో సైంటిస్టులు భారీఎత్తున జెనిటిక్స్ స్టడీ చేసేసి, రిసెర్చిమీద రిసెర్చీలు చేసేసి, ఏ ఖండంలో, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎలాటి కుందేళ్ళు ఎలాటి కండిషన్డ్ పరిస్థితుల్లో ఏ కుందేళ్ళు  ఎలాటి పిల్లల్ని కంటాయో, కనడానికి ఎలాటి అవకాశాలుంటాయో సాధికారకంగా నిరూపించేసి, ప్రోగ్రామర్లు ప్రోగ్రాములు రాసేసి, సాఫ్టువేరు ఇంజినీర్లు వాటిని సానబెట్టేసి (ఏమిటీ? పెట్టరా? సరే, నేను అలా అనుకున్నానులెండి) … ఉండేవాళ్ళు. అదేలెండి ఆ వంటవాడు ఇంతమంది సైంటిస్టులనీ, కంప్యూటరు ఇంజినీర్లనీ తనదగ్గర పనిలో పెట్టుకుని భరించగల స్తోమతు గలవాడయితే మాటే …

అలాగే, ఆ వంటవాడికి కూడా ఎందుకంత పట్టుదల? అలానిప్పుల్లో కాలీ, నీళ్ళల్లో నానీ, ఎండలో ఎండీ, పెనుకొండలమీంచి దొర్లీ … ఎందుకంతఅవస్థ? నీటుగా, “తప్పయిపోయిందండీ, రుచిగా ఉందో లేదో చూడ్డానికి ఓ ముక్క కొరికి చూశాను మహాప్రభో, ఇదంతా తమకోసమే. రుచులెరిగిన తమరికి రుచిలేని కూర వడ్డించలేను కదా” అంటూ డిప్లొమేటిగ్గా క్షమాపణలు చెప్పుకుంటే సరిపోయేది కదా. తానేదో జానపదసినిమాలో కథానాయకుడయిపోయనట్టు వేషాలు కాకపోతే ఎందుకు చెప్పండి. అంతే కాదు. అసలు అలా కొండలమీంచి దొర్లించేస్తేనూ, నిలువెత్తు నీళ్ళకుండీల్లో ముంచేస్తేనూ, మహాగ్నికీలల్లో కబాబ్‌ చేసేస్తేనూ ఇంకా బతికి ఉన్నాడా తాబట్టిన కుందేలికి మూడు కాళ్లో ముప్ఫైకాళ్లో చెప్పడానికి?

అందుకే పట్టు పట్టరాదంటే సరే. పట్టి విడవరాదంటే మాత్రం నేనొప్పుకోను. ఒకొకప్పుడు ఏట్లోకి దిగితే కానీ లోతు తెలీదు. లోతు తెలిసినతరవాత అలవికాదనుకుంటే వెనక్కి తిరిగి ఒడ్డుకి చేరడమే తెలివి నన్నడిగితే.

పట్టు పట్టడానికి ఎంత తెలివి కావాలో, పట్టు విడవడానికి సమయం వచ్చిందని గ్రహించడానికి కూడా అంత తెలివీ కావాలి. అసలైన తెలివి అదే.

(డిసెంబరు 10, 2010. )

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “ఊసుపోక – నేను పట్టినకుందేలికి నిజంగా మూడుకాళ్ళేనండీ”

 1. @లలిత, -అరే ఈ కథ మీకు నచ్చదా? – :)) – అదేం లేదండీ. ఊసుపొకకి రాసినవి సీరియస్ గా కాదు కదా. మీరు సామెతకథల్లో చేర్చండి తప్పకుండా. నాకు కొంత బాద కలిగించింది చిన్నపిల్లలకి చెప్పే కథలో అంత హింస ఏమిటని.

  మెచ్చుకోండి

 2. అరే ఈ కథ మీకు నచ్చదా?
  మీతో కలిసి తయారు చేస్తున్న సామెత కథల సీరీస్ లో దీనిని కూదా చేరుద్దామనుకుంటున్నానే.
  ఇంతకు ముందు కుందేలు కథ, దాని మీద మీ విశ్లేషణ చదివానే కానీ ఈ కథ మీకు నచ్చదని గమనించలేదనుకుంటా.
  ఇది మూర్ఖంగా పట్టుబట్టడాన్ని వర్ణించే సామెత కదా.
  ఈ సారి ఈ సామెత కథని ఇంకో కథలో ఇమిడ్చి సామెత ప్రయోగాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మిగిలిన ఆలోచనలు ఇంకొన్ని రోజులలో మీతో చర్చిస్తాను.

  మెచ్చుకోండి

 3. కొత్తపాళీ, పట్టు పట్టడానికి తెలివి అఖ్ఖర్లేదు.. – నిజమేనండీ. ఎందుకు అలా రాసేనో నాకే తెలీదు. మీరు బాగా పట్టుకున్నారు. 🙂

  మెచ్చుకోండి

 4. చివరి వాక్యం జీవిత సత్యాల్లో ఒకటి. నాదొక అబ్జెక్షను – పట్టు పట్టడానికి పెద్దగా తెలివి అక్కర్లేదు, కొంచెం మూర్ఖత్వం (దీన్నే ముద్దుగా తిక్క అనచ్చు) ఉంటే చాలు. కొకు కథల్లో ఇలాంటి మూర్ఖపు పాత్రలు తరచు కనిపిస్తూ ఉంటారు.

  మెచ్చుకోండి

 5. >>పట్టు పట్టడానికి ఎంత తెలివి కావాలో, పట్టు విడవడానికి సమయం వచ్చిందని గ్రహించడానికి కూడా అంత తెలివీ కావాలి. అసలైన తెలివి అదే. <<

  TOO GOOD AND VERY GOOD ..

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s