మార్పు 1

దాదాపు నాలుగు నెలలయిపోయింది మంచి కథ రాద్దాం అనుకుంటూనే. ఏదో రాయాలనే కానీ ఏం రాయాలన్నది తెలీడం లేదు. అంచేత నాకు తోచిందంతా రాసేద్దాం అనుకుని మొదలు పెట్టేనిది. ఇది నవల కాకపోవచ్చు. ఈమధ్య ఊసుపోక కూడా అట్టే సాగడంలేదు. అంచేత దానికి ఇది మరో రూపం అన్నా తప్పు లేదు. దేశం ఆమూలనించి ఈమూలకి వచ్చి పడ్డాక, అమెరికా మరోసారి కొత్తగా కనుగొన్నట్టుంది! అంచేత అదే రాయానుకుని మొదలు పెడుతున్నాను.

ఇది దేన్నిగురించి అంటే మార్పుగురించే … మనలో, మన పరిసరాల్లో, మాటతీరులో, ఆశల్లో, ఆశయాల్లో … మార్పు. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ …J. )

000

“ఇప్పుడెందుకండీ మారడం? డెబ్భై ఏళ్ళొచ్చినా స్థిరత్వం లేదూ,” అంది నాస్నేహితురాలు నవ్వుతూ.

నేను “ఊరు మారుదాం అనుకుంటున్నా,” అన్ననేరానికి.

“హీ, హీ,” అన్నాను.

మరేమనను? నిజమే మరి. ఇప్పుడెందుకన్న ప్రశ్న ఎప్పుడయినా అడగొచ్చు. ముప్ఫై ఏళ్లనాడు మారతానంటే మాత్రం ఎందుకని అడక్కుండా ఉంటారా ఎవరు మాత్రం?

అసలు నేనెందుకు మారాలనుకున్నానో చెప్పేముందు, ఇది ఎందుకు రాస్తున్నానో చెప్తాను. లేదా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది నవల అనిపించుకోదు. ఇందులో గొప్ప సంఘర్షణలూ, సందేశాలూ ఉండకపోవచ్చు. ఇందులో వ్యంగ్యం లేదు. హాస్యం ఉంటుందేమో ఇప్పుడే చెప్పలేను. ఒక్కమాటలో ఇది ఎలా తయారవుతుందో పూర్తయేవరకూ చెప్పలేను. పూర్తవుతుందో లేదో కూడా చెప్పలేను.

ఎందుకు మారడం అన్నప్రశ్న ఉదయించేక, అసలు ఎవరైనా ఎందుకు మారతారు, మారకపోతే ఏం, మారితే ఎందుకు మారేరు, మారకపోతే ఎందుకు మారరు, నిజంగా మార్పు కోరే మార్తారా, ఎలాటి మార్పు కోరి మార్తారు … ఇలా ఎన్నైనా ప్రశ్నలు వేయడానికి, లేదా వేసుకోడానికి ఆస్కారం ఉంది కదా. అంచేత మార్పు అన్న పదం ఎన్నిరకాలుగా దర్శనమిస్తుందో సూచనప్రాయంగానైనా చెప్పాలని మొదలు పెట్టేను. ఉన్నఊరినించి కట్టుకున్నబట్టలవరకూ, తెల్లారి లేచినదగ్గర్నుంచీ పొద్దు పోయేవరకూ ఎన్నో మార్పులు చూస్తాం. అంతే కాదు. మనుషులు మారడం, మనిషి నిజంగా మారడని గాఢంగా విశ్వసించడం కూడా మార్పుతాలూకు పర్యాయరూపాలే కదా.

నేను చూసిన లోకం, ఆలోకంలో మనుషులు ఆధారంగా ఇది నడుస్తుంది. ఎప్పుడు ఏ కథైనా మనకి తెలిసినప్రపంచంలోంచే పుడుతుంది కనక (పుంఖానుపుంఖాలుగా బుక్కులు చప్పరించేసి ఒప్పగించేసేవారిని తప్పిస్తే), నాకు తెలిసినమనుషులూ, నేను చూసినలోకమే ఇక్కడ మీకు తారసిల్లుతుంది. అయితే ఏ ఒక్కపాత్రా ఏ ఒక్కరూ కాదు. అంతర్గతంగా ఉన్న ఒక మానవనైజాన్ని పదిచోట్ల చూడ్డం తటస్థించినప్పుడు దాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించేను.

ఇప్పుడు మొదటికొస్తాను. పై ప్రశ్న నాకు తగిలేక, మంచి చిక్కటి కాఫీ మూడు కప్పులు పుచ్చుకుని, సుదీర్ఘంగా ఆలోచించేను. నాకు స్థిరత్వం ఉందా లేదా అన్నది. అన్నట్టు స్థిరత్వం అనరేమో, స్థిరంలేదూ అనడమే ఆనవాయితీ అనుకుంటా. ఆమాటకేం గానీ,

ఆలోచించగా, ఆలోచించగా నాకు తోచించేమిటంటే – ఒకరకంగా చూస్తే, నాకు చాలా స్థిరత్వం ఉంది. ఎందుకంటే నేను అంత తేలిగ్గా కదలను ఉన్నచోట్నుంచీ దేనికైనా సరే – చిన్నవిషయం గానీ పెద్దవిషయం గానీ. అర్జంటుగా వంకాయకూరలోకి కొత్తిమీర కావాలన్నా కనీసం మూడురోజులపాటు నన్ను నేను “పద, పద”మంటూ ఉసిగొల్పుకోవాలి!

మరోరకంగా చూస్తే, స్థిరత్వం లేదనే అనిపిస్తుంది. ఏ ఉద్యోగమూ పట్టుమని పదేళ్ళు చెయ్యలేదు. పంతాలకి పోయి వదిలేసినవి కొన్నయితే జరక్క వదిలేసినవి కొన్ని. అందుచేత జరిగిన నష్టం ఏమిటంటే నా బతుకంతా గంటకూలీ ఉద్యోగాలే. కేవలం నాతెలివతక్కువతనం చేతే.

ఇంక ప్రస్తుతానికొస్తే, మూడేళ్ళుగా అనుకుంటున్నాను “మారాలి” అని. అయితే ఎవరితోనూ అనలేదు కనక ఈమాట రహస్యంగానే ఉండిపోయి, ఇప్పుడు నా మార్పు చాలామందికి షాకు అయిపోయింది. నేను కదలడమే ఓ ఘనకార్యం అయినట్టు.

కానీ జరిగిందేమిటంటే, నాకిక్కడ విసుగేస్తోంది.

ముప్ఫైయేళ్ళపాటు నడిచినబాటలే నడిచి,

తిరిగినవీధులే తీరిగి విసుగెత్తిపోయేను. తిన్న తిండే తింటూ, కడిగిన గిన్నెలే కడుగుతూ, తొడిగిన బట్టలే తొడుగుతూ … మళ్ళీ మళ్ళీ అవే ఉతికారేసుకుంటూ … మరీ గానుగెద్దు బతుకు అనిపించిపోయింది నామటుకు నాకే.

పొద్దు పొడుస్తూనే కాఫీ కప్పు పుచ్చుకు అదే సోఫాలో అదే మూల కూర్చుని చూస్తే అదే ధృశ్యం,

సాయంత్రం అదే చెట్టూ, అదే పుట్టా … ఆ చెట్లంటా పుట్టలంటా తిరిగే ఉడతలు మాత్రం అవే కాకపోవచ్చు.

నాకళ్ళముందే, నేను చూస్తూండగానే, చిట్టీ పొట్టీ ఉడతలు కనిపించడం, అవి పెరిగి పెద్దవవడం, కొంతకాలం కనిపించకపోడం, మళ్ళీ చిట్టీ పొట్టీ ఉడతలు హడావుడిగా పరుగులు తీస్తూ …. ఇలా ఎన్ని ఉడతతరాలు చూసేనో! …. తలుచుకుంటే నవ్వొస్తోంది కానీ విసుగు కూడా వేస్తోంది వాటిని.. చూసి చూసి వేసారిపోయేను.

కనీసం ఇల్లు మారాలి … ఇల్లు మారితే ఉడతలకి బదులు పాములనో పందికొక్కులనో చూస్తానేమో .. అవి మాత్రం నన్ను ఉల్లాసపరుస్తాయా? ఏమో, చూస్తే కదా తెలిసేది. కూర్చున్నచోటినుండి కదలకపోతే ఎలా తెలుస్తుంది ఆవలితీరంలో ఏముందో? … ఇలా సదసత్సంశయంలో కొట్టుమిట్టాడుతూ ఇల్లు అమ్మకానికి పెట్టేను. రెండుసార్లు ఏం జరగలేదు. ఇది మూడోసారి.

ఇలా మారుదాం, మారుదాం అని ఆలోచిస్తూ కూచుంటే, ఏదో ఓ సమయంలో విసుగెత్తిపోయి. పోతాను, పోతాను అనడమే కానీ పోవేం, అని అరవడం జరుగుతుంది కదా. అదే లెండి నావిషయంలో నామీద నేనే ….

ఆఊపులోనే ఏదో ధైర్యం కూడా తన్నుకొచ్చింది. ముందులా కాక, ఈసారి అయినవాళ్ళకీ కానివాళ్ళకీ, రోడ్డుమీదా బజారులోనూ ఎదురైనవాళ్ళకీ … ప్రతివారికీ నేను ఇక్కడినించి మకాం ఎత్తేస్తున్నానోచ్ అంటూ ఎలుగెత్తి చాటేను. ఇంట్లో అక్కర్లేని సామాను పోగెట్టి దానం చేసేశాను. కొన్ని వీధిలోకి గిరవాటెట్టేను. వారానికోమారు అదేదో నోములా వస్తువులు పారేస్తుంటే గొప్ప ఉషారొచ్చిందంటే నమ్మండి. ఇల్లు మారినా మారకపోయినా ఇలా స్టెప్పులవారీగా ఇల్లు ఖాళీ చెయ్యడంలో కూడా ఒక మార్పులాటి అనుభూతి వచ్చింది. ఇదొక జీవనసత్యం. మనం అప్పుడప్పుడు ఇలా సామాను గిరవాటేస్తూండాలి అనే నిర్ణయానికి కూడా అప్పుడే వచ్చేశాను.

ఇహ ఊళ్ళో … స్నేహితులకి చెప్పినప్పుడు మళ్లీ జవాబు చెప్పుకోడాలు.

(తరువాయి భాగం త్వరలోనే)

మార్పు 2

(డిసెంబరు 18, 2010)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “మార్పు 1”

 1. అన్నట్లు, నాకిప్పుడే ఒకటి తట్టింది – మీరు ఇందులో చెప్పిన స్థిరత్వాన్ని “బద్దకం” అందురని… :)))

  మెచ్చుకోండి

 2. “(పుంఖానుపుంఖాలుగా బుక్కులు చప్పరించేసి ఒప్పగించేసేవారిని తప్పిస్తే)”
  “మనం అప్పుడప్పుడు ఇలా సామాను గిరవాటేస్తూండాలి ”

  ఎన్ని జీవన సత్యాలో కదా!:-))

  అలా మొదలయిందన్న మాటా మీ వూరు మార్పు…

  మెచ్చుకోండి

 3. @ శారద, **టిక్కట్లూ, వసతీ అన్నీ మొగుడూ పిల్లలూ ఏర్పాటు చేస్తే వాళ్ళని సవాలక్ష తిట్లు తిడుతూ బయల్దేరుతాను.** హాహా, ఎంతమందికి ఆ సౌలభ్యం మాత్రం ఉంటుందండీ.
  @ స్ఫురిత, మీరు కూడా పెద్దమార్పులే చూస్తున్నారన్నమాట. సరే మీకు నా శుభాకాంక్షలు. అసలు మార్పు క్షణక్షణం ఎదురవుతూనే ఉంటాం కదా. నాకు ఎదురయినవి ఎంతమందికి ఎదురవుతున్నాయో, ఎవరు ఎలా వాటిని అన్వయించుకుంటున్నారో చూడాలనే నా ప్రయత్నమండీ. అందుకే దీన్ని నవల అనలేనన్నాను. మీరు మళ్లీ ఇటొచ్చినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. చాలా రోజుల తర్వాత మీ blog కి వచ్చాను. ప్రస్తుతం నేను కూడా ఒక పెద్ద మార్పు, దాని వల్ల , కోసం వచ్చిన సందిగ్ధావస్తలో కొట్టు మిట్టాడుతూ ఉండి మీ మార్పు చదివాను…ఎప్పట్లానే బాగుంది అక్కడక్కడా చక్కిలిగింతలు పెడుతూ…

  మెచ్చుకోండి

 5. అప్పుడప్పుడూ స్థలం మార్పు అవసరమేనండీ!
  అంటున్నాను కానీ, నిజానికి నాకూ ఉన్న చోటునుండి కదలాలంటే తగని బధ్ధకం. ఏదైనా వెకేషన్ కి వెళ్ళాలన్నా, టిక్కట్లూ, వసతీ అన్నీ మొగుడూ పిల్లలూ ఏర్పాటు చేస్తే వాళ్ళని సవాలక్ష తిట్లు తిడుతూ బయల్దేరుతాను.
  కొత్త చోట మీకంతా బాగుండాలని ఆశిస్తూ
  శారద

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s