మార్పు 2

“ఎక్కడికి మార్తావు?” – తొలి ప్రశ్న.

ఏమో… పక్కఊరికి కాపోతే ఊళ్ళోనే ఈకొసనించి ఆకొసకి, ఈ వీధినించి మరోవీధికి … ఎక్కడికైనా సరే మారాలి. అంతే. నాక్కావలసింది మార్పు. అంతే. ఎక్కడికి అన్నది నాక్కూడా తెలీదు.

అడిగినవాళ్ళు నవ్వేరు. కుక్క తోకని వేటాడినట్టుందని అనలేదు కానీ అలా అనుకుని ఉండడానికి అవకాశాలున్నాయి!

ఇంకా సలహాలు, సందేహాలూ, అభిమానాలు చూపించుకోడానికి అవకాశాలు.

“ఎందుకండీ? ఈ ఇల్లు బాగుంది కదా.”

“ఇలాటి ఇల్లు మళ్ళీ దొరుకుతుందంటారా?”

“మీరిక్కడుంటే మాకు బాగుంది. మీరు దూరం వెళ్ళిపోడం మాకు బాగులేదు …”

హుమ్. నేను నిట్టూరుస్తాను మనసులోనే. ఏమిటో ఈ పీటముళ్ళు – విప్పలేం. ఊరుకోలేం.

ఊళ్ళో ఉన్నాం అన్నమాటే కానీ ఏడాదికోమారైనా కలుస్తామా అంటే అనుమానమే. అయినా పక్కవీధిలో నేనున్నానంటే అదో భరోసా కాబోలు.

విధిగా ఏటేటా జరుపుకునే పండుగలూ పబ్బాల్లాగే వాళ్ళ విదేశీప్రయాణాలూను. అలాటివేం లేని నేను మార్పుకోసం మరోవీధికి మారతానంటే వారికెందుకింత వింత? బహుశా నేనిక్కడ ఉండడం వాళ్ళకి అలవాటయిపోడం చేతా? అటెళ్తే మాలతిగారిల్లు … అనుకుని తృప్తిపడతారా? అనా అనుకోడానికి నేనిక్కడ లేనప్పుడు కూడా అనుకోవచ్చు కదా…. హా .. హా.

“మేం ఇప్పటికి 73 దేశాలు చూశాం.”

నాకేమో అన్ని దేశాలున్నాయని కూడా తెలీదు.

“అలాగా? మీరు వాటినిగురించి రాయాలి.” – నాకు వచ్చిన, రాగల ఒకే ఒక్క ఆలోచన.

“ఎక్కడండీ … గుర్తుండవు.”

“నిజమే, మర్చిపోతాం. అందుకే రాయాలంటున్నాను. పొటోలున్నాయి కదా.”

“ఊ…మ్… ఆఁ … ఫొటోలున్నాయనుకోండి. ఊం ఆం.. ఐనా గుర్తుండవు.” బుర్ర గోక్కోరు కానీ అలాటిదృశ్యం నామనసులో మెదులుతుంది. వాళ్ళవేపు పరీక్షగా చూస్తాను ఎందుకలా అన్నారా అని.

“మరెందుకండీ వెళ్ళడం?” అంటాను నవ్వి.

వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ఇలాటిసందర్భాలు నాలుగయేక ఏదో ఓ రోజు అడిగేస్తాను ఊరుకోలేక. “ఎందుకండీ అలా తిరగడం?” అని.

చాలా కారణాలుంటాయి చెప్పడానికి.
— “కాలక్షేపానికి …”

— “చూశాం అని చెప్పుకోగలగడానికి”

— “ఉన్న ఇంట్లో, ఉన్న ఊళ్ళో ఉండి ఉండి విసుగేసి నాలుగు రోజులపాటు మార్పుకోసం.”

— “ఇంతకాలం రెక్కలు ముక్కలు చేసుకు సంపాదించేం .. మరి అనుభవించాలి కదా …”

“మాకు డబ్బుంది కనక మేం వెళ్తాం, నీకేం?” అన్నా అనొచ్చు. అంటారని కాదు కానీ అన్నట్టే ఉంటుంది ఒకొక మొహం చూస్తే.

మరోరకం –

“మీ అమ్మాయి ఏం చేస్తోందండీ?” మాట మారుస్తారు.

“కూర బాగుంది. ఎలా చేశారండీ?” నావంతు మాట మార్చడం.

ఇలా నాలుగు చుట్లవుతాయి.

“వస్తానండీ. పాల్లేవు రేపు కాఫీకి. బజారుకెళ్ళాలి” అంటూ లేస్తాను. పాలు కాకపోతే పళ్ళు, బజారు కాకపోతే షికారు … ఏదో వంక. ఈ పసలేని వస కన్నా ఏ పిట్టల్నో చూస్తూ గడిపినా నయమే మరి.

ఇంతకీ మార్పు సంగతి కదూ మొదలు పెట్టేను. ఉత్తరపు పొలిమేరల్నించీ దక్షిణానికి జైత్రయాత్ర. ఇక్కడినించి అక్కడికి ఓ గీత గీస్తే, నేరుగా అక్కడ దిగుతాం అన్నమాట.

కారెక్కి, విస్కాన్సిన్ పొలిమేరలు దాటుతుంటే వాన మొదలయింది. పెద్దవర్షం కాదు కానీ, చిన్నచిన్న తుంపర్లు. వైపర్స్ వేస్తే తడి చాలక కిర్రు కిర్రుమంటూ గోల, ఆపేస్తే, విండ్‌షీల్డ్ మీద తుప్పర్లమూలంగా రోడ్డు కనిపించకపోడం … అలా వైపర్లు వేస్తూ తీస్తూ నాకు కాలక్షేపం….

రెండు రాష్ట్రాలు దాటేవేళకి వాన కూడా వెనకబడింది. హమ్మయ్య అనుకున్నాను. దాంతోపాటే నేను వెనక వదిలేసిన మిత్రులు గుర్తుకొచ్చేరు.

టెడ్ ఈదేశం వచ్చినరోజునే పరిచయం అయ్యేడు. అప్పటికి ఇంకా చదువు పూర్తి కాలేదు. ఆతరవాత క్రమంగా,  పెళ్లీ, పిల్లలూ, ఉద్యోగాలూ, ఇల్లు కొనడం … గత ముప్ఫై ఏళ్ళలోనూ మూడు, నాలుగుసార్లన్నా కలిశామో లేదో … అయినా కలిసినప్పుడు మాత్రం రోజూ చూస్తున్నంత చనువుగా మాటాడుకుంటాం. నాయిల్లు అమ్మకం అయిపోయేక, రాత్రి ఎందుకు హైవేమీద అని మర్నాడు ఉదయం బయల్దేరుదాం అనుకున్నాను.

నామనసులో మాట టెడ్‌కి వినిపించిందేమో అన్నట్టు, మరొక పూర్వవిద్యార్థి ఊళ్లోకి వచ్చేడనీ, అంచేత నన్ను కూడా రమ్మని పిలిచేడు. తనే వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానన్నాడు.

వాళ్ళిల్లు ఊరవతల ఓ కీకారణ్యంలో ఉందిలెండి. ఇదివరకోసారి పిలిస్తే, నేను బయల్దేరి, రోజంతా రోడ్లంట తిరిగి కనుక్కోలేక ఇంటికొచ్చేశాను. అంచేతన్నమాట నన్ను కూడా తనే వచ్చి తీసుకెళ్తానన్నది. ఆ రెండో విద్యార్థి

ఛార్లెస్ అదే నా పూర్వవిద్యార్థి ఇప్పుడు తను తెలుగు చెప్తున్నాననీ, తను కూడా దక్షిణరాష్ట్రంలోనే ఉన్నాడు కనక నన్ను వాళ్ళఊరు పిలుస్తాననీ అన్నాడు. నాకు భలే తమాషాగా అనిపించింది. ఎందుకంటే, పారేయబోయిన వస్తుసంచయంలో నేను తయారుచేసిన తెలుగుపాఠాలు కూడా ఉన్నాయి.

ఆమాటే అన్నాను అతనితో. “ఆ తెలుగుపుస్తకాలూ, కాయితాలూ అవీ పారేయడానికి సిద్ధంగా ఉన్నాను.”

“అయ్యొయ్యో, పారేయకండి.”

సరే. అన్నాను. ఇలాటివే నాకు అర్థం కావు. ఎందుకంటే గత రెండు, మూడేళ్ళలో ఇక్కడ యూనివర్సిటీవారితో నాకు కలిగిన అనుభవాలు తలుచుకుంటే నాకు వచ్చే మాటలు ఇక్కడ రాయతగ్గవి కావు. “శనొదిలిపోయింది” అనుకుని వాటితాలూకు ఛాయలు కూడా లేకుండా తుడిపేసుకుందాం అనుకుంటున్న సమయంలో, మళ్లీ … నారదసంసారం గుర్తొచ్చింది. వదిలేసుకుందాం అన్నప్పుడల్లా ఏదో బంధం పట్టి వెనక్కి లాగుతూ ఉంటుంది….

“కీంంంంంం” – పక్కనున్న కారు హోరెత్తడంతో ఉలికిపడి, నాలేనులోకి సర్దుకున్నాను.

ఇలా ఏళ్ళూ పూళ్లూ కనిపించని విద్యార్థులు కనిపించి ఇంత అభిమానం కురిపిస్తే, ఊళ్ళో ఉన్న ప్రొఫెసరు జో ఎందుకు పలకరించలేదో అని నాకు మళ్ళీ ఆలోచనలు. ఇది కొత్తగా వచ్చిన చిక్కుప్రశ్న నాకు. ప్రొ. జో నేను ఈదేశం వచ్చినరోజునే మాయింటికొచ్చి “నమస్కారమండీ” అంటూ చేతులు జోడించి నన్ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచేశారు. ఆ తరవాత చెప్పేరు తనకి వచ్చిన తెలుగుముక్క అదొక్కటే అని!  మాఅమ్మాయి పుట్టినప్పుడు ఆస్పత్రిలో మొట్టమొదటి విజిటర్లు ఈ దంపతులే. రెండో విజిటర్ టెడ్. అంచేత వీళ్ళతో నాకు చాలా చరిత్ర ఉంది. ఇంతకీ ఆదినుండీ జో దంపతులు కూడా నాకు ఎన్నివిధాల, ఎన్నిసందర్బాల్లో ఆదుకున్నారో మాటల్లో  చెప్పలేను. గత అయిదారేళ్లుగా కలవడం లేదు కానీ మూడేళ్ళకిందట మాఅమ్మాయి లోకల్ పేపరులో front page news అయినప్పుడు (Lambs for lions విడుదల సందర్భంలో) ఆయన తనకి తానే నాకు ఫోను చేసి అభినందనలు చెప్పేరు. అప్పుడు కూడా నేను ఆశ్చర్యపోయేను. మరి నేను ఇక్కడినుండి వెళ్లిపోతున్నానని ఓ కార్డు పంపితే, భోజనమో, బ్రేక్ఫాస్టో అక్కర్లేదు కనీసం ఒక్కముక్క – ఓ ఈమెయిలో, ఫోన్కాలో, మరో కార్డో – వస్తుందనే ఆశించేను.  ఎంచేతో … ఈమాట చెప్తే మాఅమ్మాయి కూడా ఆశ్చర్యపోయింది. అంతే కాదు. వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారు. ఆరోగ్యం బాగానే ఉంది. నామరొక పూర్వ విద్యార్థి ముందురోజు వారితో బ్రంచి చేశానని చెప్పేడు. నాకు ఇది కూడా విచిత్రంగానే ఉంది – నేను ఈఊరు వదిలి వెళ్ళిపోతున్న శుభసందర్భంలో వీళ్లందరూ నాకు మళ్లీ కనిపించడం!

ఇదుగో ఇలాటప్పుడన్నమాట నాకు ఎవరితో ఏం మాటాడాలో తెలీనిది. ఆయనకి నాయందు అభిప్రాయం మారిపోయిందా? ఎందుకు మారింది? ఆయన మారేరా? ఎందుకు? నేనేం చేసాననీ? …నాగురించి ఇంకెవరైనా ఏమైనా ఆయనకి చెప్పేరా? ఏముంది చెప్పడానికి? పోనీ అలా ఎవరైనా చెప్పేరనుకున్నా (అలాటిమనిషులు ఉన్నారనుకోండి, అది వేరేకథ) ఆయన అలా చెప్పుడుమాటలు విని అభిప్రాయాలు మార్చుకునేమనిషి కారు. ఆమాట గట్టిగా చెప్పగలను. ఏమైనా ఈసంఘటన నాకు ఏనాటికీ అర్థంకాని చిక్కుప్రశ్నగానే మిగిలిపోతుందనుకుంటాను. లేదా, ఇలా కథలు రాసుకోడానికి పనికొస్తుంది!

ఆ దంపతులు నాకు జవాబు ఇవ్వకపోయినా, నేను మాత్రం వాళ్ళు నాకు చేసిన సాయం, పరమ సంక్లిష్ట సమయాల్లో నన్ను ఆదుకున్నవైనం ఏనాటికీ మరిచిపోలేను.

టైము చూశాను. రెండయింది. అయోవా దాటిపోయాను. నేను బయల్దేరుతున్నప్పుడు వేసుకున్న ప్లాను ప్రకారం నాతొలిమజిలీ ఇక్కడే. ఇక్కడ ఆగి, రాత్రి ఏహోటల్లోనో పడుకుని తెల్లారి మళ్ళీ రోడ్డెక్కుదాం అనుకున్నాను. కానీ ఇంకా టైము రెండే …అప్పుడే ఆగిపోయి మిగతా రోజంతా ఏమిటి చెయ్యడం? అసలు అలసట కూడా లేదు. సరే మరికొంచెం ముందుకెళ్ళి అలసట అనిపించినప్పుడో, టాంకు ఎమ్టీ చూపించినప్పుడో ఆగుదాంలే అనుకుంటూ ముందుకి సాగేను.

పక్కనుంచో పెద్ద ట్రక్కు దూసుకుపోయింది. ఇక్కడ మీకు నా హైవే మర్యాదలు కొన్ని చెప్పాలి. మామూలుగా నేను స్పీడ్ లిమిట్లోనే పోతాను. నాకు అవతల ములిగిపోయే రాచకార్యాలేవీ లేవు కదా. రేపు చేరినా ఒకటే, వచ్చేవారం చేరినా ఒకటే అని నాఅభిప్రాయం. రెండోది, నాది చిన్నకారు కనక ట్రక్కు నాకు పెట్టినా నేను ట్రక్కుకి పెట్టినా నాకే ముప్పు. అంచేత కూడా మర్యాదగా అవి లేక వారు (ట్రక్కుకి మానవస్థాయి అంటగడితే) పక్కనించి పోతున్నసమయంలో, నేను కాస్త వెనక్కి తగ్గుతాను. లేదా అవి లేక వారు నావెనకనించి మీదమీదకి వచ్చేస్తుంటే నేనే పక్కలేనులోకి తప్పుకుంటాను.

ఇంతకీ, నాపక్కనుంచి ట్రక్కులు వరసగా రెండో మూడో దూసుకుపోయేయి కానీ నాకారు మాత్రం ఇంకా అల్లల్లాడుతున్నట్టే ఉంది. ఏమిటా అన్న భయం మొదలయింది. పాతకారు కదా. ఇది గానీ ఆ ఒడ్డుకి చేర్చదా ఏమిది, ఖర్మ అనుకుంటూ కొంచెంసేపు పాడుకున్నాను. నిజానికి అలాటి భయం ఉండకూడదు. వచ్చేముందు మెకానిక్‌కి కారు చూపించి అన్నీ సవ్యంగా ఉన్నాయని ధృవపరుచుకునే బయల్దేరేను. ఇంతకీ ముందున్నంత ఊపు లేదు కానీ కాస్త ఊగుతున్నట్టే అనిపిస్తోంది. పక్కకి తిరిగి చూస్తే, మరో తొమ్మిదిమైళ్లలో కారుకీ నాకూ కూడా మేత దొరుకుతుందని సైన్‌బోర్డు తెలియజేసింది.

సరే, ఆ ఎక్సిట్ తీసుకుని కారు ఓ పక్కని ఆపి, దిగేను. అప్పుడు తెలిసింది కారెందుకు ఉయ్యాలలూగిందో.

ఉధృతంగా చండప్రచండంగా పెనుగాలి, ఝంఝామారుతం! అసలు అంత ఉధృతంగా గాలి వీస్తుంటే నాకారు రోడ్డుమీద ఉన్నందుకే మహదానందం అయింది ఆక్షణంలో. గబుక్కున మళ్ళీ కారెక్కేసి, ఆ స్టోరు సింహద్వారందగ్గిరికి వీలయినంత దగ్గరికి వెళ్లి, షాపులోకి ఒక్క ఉదుటున జొరబడ్డాను.

మరో వంద మైళ్ళు వెళ్ళేవేళకి కారు ఊపు తగ్గింది. కాన్సస్ సిటీ దాటేవేళకి ఆరవుతోంది. ఆసిటీ దాటినతరవాత ఆరాత్రికి ఆగేను. మైలేజి చూస్తే అయిదువందలమైళ్ళు అయిపోయింది! నేను 300 కంటే ఎక్కువ చెయ్యలేను అనుకున్నాను. బహుశా నాకు వెనకటి ఊరు వదిలేస్తున్న ఉత్సాహమేమో తెలీదు కానీ అస్సలు అలుపే లేదు. ఆలెక్కన నేను రెండోరోజుకే డలస్ చేరిపోతాను. నాస్నేహితురాలు సుధని పిలిచి మర్నాడు సాయంత్రానికి వచ్చేస్తున్నానని చెప్పేను.

మర్నాడు రోడ్డెక్కేవేళకి గాలి బాగా తగ్గిపోయింది. పైగా నాకింకా ఆశ్చర్యం రోడ్లమీద అట్టే కార్లు లేవు. ఎప్పుడో ఓ పెద్ద ఊరు వచ్చినప్పుడు తప్పిస్తే, అక్కడో కారూ, ఇక్కడో ట్రక్కూ తప్పిస్తే రోడ్డంతా నాకోసమే వదిలేశారేమో అనిపించిందంటే నమ్మండి. నాడ్రైవింగు కూడా అలాగే ఉందిలెండి ఆపూట. దిక్కులు చూస్తూ రెండుసార్లు రోడ్డుపక్క పిట్టగోడలకి పెట్టేయబోయేను. నా అదృష్టం బాగుండి ఆచుట్టుపక్కల పోలీసులెవరూ లేరు.

అయినా కార్లే లేని రోడ్డుమీద పోలీసులేం చేస్తారులే అనుకుని, ఒళ్ళు దగ్గరపెట్టుకుని డ్రైవింగు సాగించేను ఆతరవాత

అలా ఖాళీరోడ్లతోపాటు విశాలంగా ఆకాశం మూడువేపులా పరుచుకుని, ఒకొకప్పుడయితే, విమానంలో ఆకాశంలోకి చొచ్చుకుపోతున్న స్పృహ.. నిజంగా ఆదృశ్యం చూసి తీరాలి.

అలా చూస్తుంటే, వెనక్కి వదిలేసిన స్నేహితులలో జూడీ గుర్తొచ్చింది. నేను కమ్యూనిటీ కాలేజీలో,  పనిచేస్తున్నప్పుడు పరిచయం అయింది. నేను ఉద్యోగం మానేసినా, అప్పుడప్పుడు కలుసుకుంటుంటాం. ఈమధ్యే దాదాపు ఏడాదిగా కలవలేదు. ఇంకా ఊరు వదిలేసి పోతున్నాను కదా అని ఈమెయిలస్తే, వెళ్ళేముందు కలుద్దాం అంది. ఆవిడ  రాసిన పుస్తకంగురించి చెప్పాలి ఇక్కడ తప్పనిసరిగా చెప్పాలి. నిజానికి అది ఆవిడకథ కాదు. ఆవిడ స్నేహితురాలు జాకీ మిల్లర్ కథ. పుస్తకంపేరు Because I am Jackie Millar! – నేను జాకీ మిలార్ని కనక అన్న అర్థంలో.

మనుషులు మారరని నేను గట్టిగా నమ్ముతాను. పైపైకి మారినట్టు కనిపించినా, ప్రాథమికంగా వాళ్ళ మనస్తత్త్వాలు ఎప్పట్లాగే ఉంటాయని. మారడం అంటే నేను పుట్టినప్పుడు ఇలా ముసిలిమొహంతో పండువెంట్రుకలతో పుట్టలేదు కదా. అంతేకాక, నేను నేర్చుకున్న అనేక పాఠాలమూలంగా నాఅభిప్రాయాల్లో మార్పు వచ్చిఉండొచ్చు. కానీ నాలో ఉండే ఒక ప్రత్యేకగుణం మాత్రం అలాగే ఉందనీ, ఉంటుందనీ కూడా అనుకుంటాను. నా అనుభవాలు అలాటివి.

అందుకు భిన్నంగా, జాకీమిల్లర్ మనుషులు మార్తారు అనడం కాదు క్రియలో అద్భుతంగా ప్రదర్శించింది. ప్రదర్శిస్తోంది. క్షమ ఇంతగా ఘనంగా ఆచరణలో పెట్టినమనిషిని నాజీవితంలో నేను చూడలేదు.

వివరాలు వచ్చే టపాలో…

మార్పు 1, మార్పు 3

(డిసెంబరు 21, 2010)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “మార్పు 2”

 1. @ అనిల్, ఏమోనండీ ఎవరితో షేర్ చేసుకుంటారన్నది మీయిష్టం. నేనన్నది ఆ యా ప్రదేశాలగురించి రికార్డ్ చేసి ఉంచితే బాగుంటుందని. ఎవరి అనుభవాలు వారివే కదా.

  మెచ్చుకోండి

 2. @ కల్పనా, నాక్కూడా అలాగే ఉంది. అందుకే రాసేస్తే, దుగ్ధ తీరిపోతుందని. .. జో విషయం నాక్కూడా అయోమయంగానే ఉంది. silent treatment – ఇంకెవరైనా అయితే ఊరుకునేదాన్ని కానీ ఆయనలాటి జంటిల్మన్ ఇలా చేసారంటే నాకాశ్చర్యంగా ఉంది. పుస్తకంగురించి వాలుగు రోజుల్లో పెడతాను.

  మెచ్చుకోండి

 3. మాలతి గారు,

  మీరు కథ రాసినా, అనుభవాలు రాసినా కళ్ళ నీళ్ళు తెప్పిస్తారు. మనసంతా భారంగా అయిపోయింది. జో…గురించి మీరు రాసినది చదవగానే…నాకు కూడా వాళ్ళు తెలుసుకదా…మీరు విస్కాన్సిన్ దాటగానే ఎలా ఫీల్ అయి ఉంటారో నాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. మిల్లర్ పుస్తకం చదవాలని ఉండి. లిస్ట్ లోకి మరో పుస్తకామ్ చేర్చుకున్నాను.మూడో భాగం ఎప్పుడూ?

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s