చాతక పక్షులు e-Book

ఎమెస్కోవారు ప్రచురించిన నా నవల నాకు చాలా నిరాశ కలిగించింది. ఎమెస్కో వంటి సుప్రసిద్ధ సంస్థ ఒకనవలని ఇంత అవకతవకగా ప్రచురించి బజారులో పెట్టగలదని నేను ఊహించలేదు. ఇప్పటికే కొందరైనా గమనించి ఉంటారు.

ఈ పుస్తకంలో జరిగిన పొరపాట్లు ఏమిటంటే –

– నా తొలిపలుకు, వైదేహి శశిధర్ ముందుమాట – రెండూ కలిపేసి, అదో పేజీ ఇదో పేజీ – చెన్నాపట్నం చెరుకూ ముక్కా నీకోముక్కా, నాకోముక్కా అన్నట్టు – అచ్చొత్తించేశారు. ఈ విషయం జ్యోతిగారు నాకు ఇ-మెయిలిస్తే, నేను ఎమెస్కో లక్ష్మిగారిని పిలిచి అడిగేను. ఆమె జవాబులు వింటే, ఆమెకి ఇదేమంత పెద్దవిషయంగా తోచినట్టు నాకు అనిపించలేదు.

ఇప్పటికి ఎన్ని కాపీలు పంపిణీ అయేయో నాకు తెలీదు కానీ కనీసం మిగతా కాపీలలో ఆ నాలుగుపేజీలు సక్రమంగా పెట్టి రీబైండ్ చెయ్యమంటే, చేస్తాం అని మాటిచ్చేరు ఆమె. కాని అది జరిగిన దాఖలాలు లేవు.

– వెనక అట్టమీద పాఠకులఅభిప్రాయాలు ఇస్తున్నానని నాతొలిపలుకులో చెప్పేను. ఆమాటలు అలాగే ఉన్నాయి కానీ పాఠకుల అభిప్రాయాలు వెనకఅట్టమీద లేవు!

– ముఖచిత్రం కూడా నవలకి నప్పేది కాదు. ఎలా ఉండాలో సూచిస్తూ చిత్రకారుడు ఆర్లె రాంబాబు వేసిన బొమ్మలు వారికి ఇచ్చాను. ఎమెస్కో వాటిని ఉపయోగించుకోలేదు. కనీసం ఆ బొమ్మ నమూనాగా వాడుకుని ఉండవచ్చు.

ఇవన్నీ నాదృష్టిలోకి వచ్చేక, నేను చూసీ చూడనట్టు ఏమీ చెయ్యకుండా ఊరుకోడం, నారచనలని ఆదరించే పాఠకులకీ, ఉదారంగా తమ సహకారం అందించిన మిత్రులకీ కూడా న్యాయం కాదు.

అందుచేత, మీకందరికీ నా year-end కానుకగా e-Book అందిస్తున్నాను.

ఎమెస్కో వారు సరిగ్గా చేసివుంటే నా పుస్తకం ఇలా ఉండి ఉండేది అని గ్రహించగలరు.

తాజాకలం. నేను ఇది ప్రచురించిన తరవాత, ఎమెస్కోవారి ప్రచురణ కొనడమా వద్దా  అని నా మిత్రులొకరు నిన్న అడిగేరు. మ్. నాకు తెలీదు. నేను చెప్పగలిగినదల్లా, ప్రచురించినపుస్తకంలో కథాభాగం సరిగ్గా లేదని ఇంతవరకూ నాకు చెప్పలేదు కనక సరిగ్గానే ఉండి ఉంటుందనుకుంటున్నాను. కొనేముందు మరోసారి చూసుకుని కొనుక్కోండి. వారికి మీ అసమ్మతి కూడా తెలియజేయవచ్చు.

ఇప్పటికే కొన్నవారు అస్తవ్యస్తమయిన భాగాలకి కరెక్టు వెర్షను ఈ పుస్తకం, ఇతర పుస్తకాలూ కూడా నాసాహిత్యం పిడియఫ్ పేజీలో చదువుకోవచ్చు.

తా.క. ఇ-పుస్తకంగా నేను ప్రచురించినప్పుడు కొందరు అభ్యంతరం చెప్పేరు అది ఎమెస్కోవారికి అన్యాయం అని. దరిమిలా నేను విచారించి తెలుసుకున్న విషయం ఎమెస్కోవారికి నేను ప్రింటు హక్కులు ఇచ్చేను కానీ ఇతరమాధ్యమాలలో ప్రచురించడానికి కాదు. రెండోది, వారు నాకు ఇప్పటికీ (నవంబరు 2015) రాయల్టీ ఏమీ ఇవ్వలేదు.


ఇట్లు

శుభాకాంక్షలతో

నిడదవోలు మాలతి

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “చాతక పక్షులు e-Book”

 1. @ అభిమాని, మీరు సరిగ్గానే చెప్పేరండీ. ఆరోజుల్లో అమెరికా వచ్చినవెంటనే ఉండే ఇతర ఒత్తిళ్లూ, మామూలుగా మనఇళ్ళల్లో ఉండే, స్త్రీ, పురుషులమధ్య ఉండే (లేదా లేని ఇంటిమెసీ), దానివల్ల మరింత దూరం అవడం జరిగిందనే ఇక్కడ చెప్పడానికి ప్రయత్నించేను. గీత పాత్ర కూడా మీరన్నట్టు సెల్ఫ్ సెంటర్డ్ గానే కనిపిస్తుంది. రాస్తున్నప్పుడు నేనది సెల్ఫ్ సెంటర్డ్ అనుకోలేదు. దేశం కాని దేశంలో హఠాత్తుగా వచ్చిపడ్డప్పుడు కలిగే అయోమయం, అంతర్మధనం అనే అనుకున్నాను. మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. Malati garu, Sahasam ani enduku rasanu ante.. ila free book adinchna tarvta… novel publisher ninchi emaina headaches vastayemo ani doubts lekunda mee blog lo upload chesaru kada anduku.

  Hari and Geeta characters madya intimacy kanipinchaledu. hari patla enduku mubhavamga undi? Hari emi egoistic kadu kada.I felt geeta is self centred and only worried about herself and not about her husband.

  Hari geeta katha kanaa… Geeta Tapati characters madya chemistry bavundi.

  మెచ్చుకోండి

 3. @ బుడుగోయ్ గారూ, మీ అభిప్రాయాలూ, విశ్లేషణా వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. మీ విశ్లేషణ బాగుంది. వరసక్రమంలో జవాబులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
  1. ఆర్థికంగా ఇన్వెస్ట్ చేసినవారు – వారికి ఆదృష్టి ఉన్నట్టు కనిపించలేదండీ. ఉంటే ఇలాటి పొరపాటు జరిగిందని చెప్పినతరవాత కూడా మరో 500 కాపీలు మార్చకుండా ప్రింట్ చేశేస్తారా? ఎమెస్కోవారు ఏదో ప్రణాళికపేరుతో సభ్యులకి కాపీలు పంపేసి వాళ్ల పెట్టుబడి రాబట్టుకుంటున్నారు. .
  2. శ్రమ తీసుకుని కూర్చినవారికి – వారి డబ్బు వారికి కూర్పు అవగానే వచ్చేస్తుందండీ. అమ్మకాలతో వారికి సంబంధం లేదు.
  3. డబ్బు పెట్టి కొన్న పాఠకుడు – ఈ విషయం నిదానంగా ఆలోచించినమీదట నాకు కలిగిన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. పుస్తకం ఇంట్లో ఉండాలని కోరుకునే పాఠకులకి ఇ-బుక్ తృప్తినివ్వదు. ప్రింట్ పుస్తకం ఇంటిల్లిపాదీ చదువుతారు. శాశ్వతంగా తమలైబ్రరీలో ఉంటుంది. పోతే, ప్రింట్ పుస్తకంలో గల్లంతయిన పేజీలు కావాలంటే మళ్ళీ డబ్బు పెట్టి కొనుక్కోండి అనడం కూడా నాకు సమంజసంగా తోచడంలేదు. మరో కారణం, నానవల ఇంతకు పూర్వం రెండుసార్లు – ఎపివీక్లీ.కామ్ లోనూ, తెలుగుతూలికలోనూ ఉచితంగా లభించింది. అంచేత ఇది మరొకసారి. అంతే
  నవలగురించి –
  1. చాతకపక్షులవిషయంలో మీరు చెప్పినమాట నిజమే. నాకు అలాటి బొమ్మ దొరకలేదు. అంతే.
  2. అనాక్రొనిజములు – నిజమేనండి. నేనెంత జాగ్రత్తగా చూసినా అవి వచ్చేస్తున్నాయి. ఇళ్ళల్లో కంప్యూటర్లు ఇప్పుడున్నంత విస్తారంగా లేకపోవచ్చు కానీ అస్సలు లేకుండా పోలేదనే అనుకుంటున్నాను. బహుశా వెనక్కి తిరిగి చూసుకుని రాయడానికీ, ఆధునిక జీవితాన్నిగురించి రాయడానికీ ఇదొక ముఖ్యమైన తేడా అనుకుంటా. వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు సీక్వెన్స్ సరిగ్గా గుర్తుండదు.
  3. నవల జీవితాన్ని ప్రతిబింబిస్తుందంటారు. మన జీవితాల్లో చూడండి ఒకొకరు వస్తుంటారు, పోతుంటారు. నవలకి సంబంధించినంతవరకూ, వారు మనజీవితాల్ని ఎంతవరకూ ప్రభావితం చేసారో అంతే చిత్రించడం జరుగుతుంది. కానీ వారి జీవితాలు, ఆ జీవితాల్లో వచ్చిన మనుషులూ – ఇలా విస్తరించుకుంటూ పోతే, ఎక్కడ ముగింపు?
  4. సాహిత్య చర్చలవిషయంలో వైదేహి కూడా అలాటి అభిప్రాయమే వెలిబుచ్చారు. నాకు మాత్రం అది అవసరంగానే అనిపించింది. మీరే అన్నట్టు ఈకథలో ప్రధానాంశం గీతే. గీత భావుకురాలు. ఆద్యంతాలా ఆమె తన వ్యక్తిత్వాన్ని తీరిచి దిద్దుకోడానికి (పాత్ర ఎదగడానికి), చివరకి రచయిత్రి కావడానికీ దోహదం చేసిన మనుషులూ, సంఘటనలూ చిత్రించడం జరిగింది. ఆ దృష్టితో చూస్తే, ఈ సాహిత్యచర్చలు ఆమె రచయిత్రి కావడంలో భాగం. నిజానికి ఈనాటి వర్థమాన రచయితలు ఇలాటి చర్చలలో పాల్గొనడం చూస్తూనే ఉన్నాం కదా.
  నేను మరొక నవల రాస్తే, మీ సలహాలు తప్పకుండా గుర్తు పెట్టుకుంటాను. మరొక పాఠకుడికి ఈనవలని మీరు రికమెండ్ చేస్తానంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి కృతజ్ఞతలు.
  – మాలతి

  మెచ్చుకోండి

 4. మాలతి గారు, ప్రచురణ కర్తలది నిస్సందేహంగా తప్పే కాని ఇలా పుస్తకం ఫ్రీగా ఇవ్వడంలో తొందరపడ్డారనిపిస్తోంది. మొట్టమొదట ఆర్థికంగా కొంత ఇన్వెస్ట్ చేసిన వారికి, శ్రమ చేసి కూర్చినవారికి, మీ పుస్తకాన్ని డబ్బులు పెట్టి కొన్న పాఠకుడికి కొంత చికాకు కలిగించే విషయమే. కల్పన గారి సలహా కూడా అనుసరణీయమే.

  ఇక పుస్తకం విషయంలో నేను గమనించిన రెండు మూడు విషయాలు..
  1) చాతకపక్షులు ఎప్పుడు పైకే చూస్తుంటాయని చదివినట్టు గుర్తు. కేవలం స్వాతి వాన నీళ్ళే తాగటం కోసం సదా ఎదురుచూస్తుంటాయని “రామక్రిష్ణ కథామృతం”లో చదివినట్టు గుర్తు.

  2) మీ పుస్తకంలో ఒక అనాక్రోనిజం దొరలినట్టు నా అనుమానం. గీతపాత్ర మొదట హరిని కలిసినప్పుడు ప్రెసిడెంట్ నిక్సన్ ఉద్వాసన గురించి చర్చిస్తుంటారు. ఆ ఎరా ఆరేళ్ళైనా గడవకముందే అలాన్ గ్రీన్‌స్పాన్ గురించి, ఇళ్ళలో పర్సనల్ కంప్యూటర్లు ఉండడం గురించి ప్రస్తావన ఉంటుంది. కథకు సన్నివేశానికి ఇవి అంత ప్రధానమైనవి కాకపోయినా, సరిచేస్తే బాగుంటుంది.

  ఇక నవల రాయడమనేది చాలా దీర్ఘకాలం జరిగే ప్రక్రియ. ఒకే mood, consistency, level of energy…maintain చేయడం పెద్ద సవాలే. మధ్యమధ్యలో తానా మీద విరుపులు, సాహిత్య విమర్శ రంగంలో రచయిత అభిప్రాయాలూ వచ్చి అవధానంలో అప్రస్తుతప్రసంగంలా ఉన్నాయి. అలాగే నవల మాధ్యమం చాలా విస్తారమైనది. కొన్ని పాత్రలను విస్తరించకపోవడం, (హరి బాక్‌గ్రౌండ్?) కొన్ని పాత్రలను అర్ధాంతరంగా వదిలేయడం (చిత్ర/సునాదలు చివరకు ఎమైనట్టు? ) కొంత అరకొరగా అనిపించాయి.

  నవల ఆసాంతం చదివించిందంటే దానికి ఒకే ఒక కారణం గీత అనుభవాలను చాల వాస్త్వైకంగా చిత్రీకరించడమే. చివరగా నవలను ముగించిన తీరు, గీత పాత్ర నిజం గ్రహించి టైటిల్ ను జస్టిఫై చేసిన తీరూ బాగుంది. అదీ టూకీగా మూడు ముక్కల్లో నా అభిప్రాయం.
  చాతకపక్షులు మరో పాఠకుడికి రికమెండ్ చేస్తారా అంటే తప్పకుండా అనే చెబుతాను.

  మెచ్చుకోండి

 5. @ అభిమాని, ఇందులో సాహసమేముందండీ. :))
  @ కల్పన, లేదులే. ఇక్కడ చూసేవాళ్లు క్రియేట్ స్పేస్ చూస్తున్నట్టు కనిపించడంలేదు. పైగా మళ్ళీ అది అమెరికాలో వారికి మాత్రమే పరిమితం. థాంక్స్.

  మెచ్చుకోండి

 6. అదీ మాలతి గారంటే…అలా వుండాలి…మీ సొంత ప్రచురణకు కంగ్రాచూలేషన్స్. ఈబుక్ బదులు మీరు క్రెయటివ్ స్పేస్ లో వుంచితే దీన్ని కొందరు కొనుక్కునే అవకాశం వుండేమో….ఆలోచించండి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.