ఆ ఒఖ్ఖ మాటా! (కథ)

“నిన్ను చూసి ఆరేళ్ళయింది. నాకయితే ఏళ్ళూ పూళ్లూ అయినట్టుంది. బొత్తిగా రాడం మానేశావు? ఈ ఏడయినా ఒకసారి రాకూడదుటే?”

అలనాటి చెలి కామేశ్వరి రాసిన ఉత్తరం చేత పుచ్చుకుని దిగంతాల్లోకి చూస్తూ కూర్చుంది శాంత, గతించిన రోజులు తలబోసుకుంటూ. మనసు మొద్దు బారిపోయింది. మనిషిలో చలనం లేదు. కళ్ళలో శూన్యం.

ఆరోజు ఆరేళ్ళకిందట బొంబాయిలో సీతమ్మత్త  మాట నిన్నో మొన్నో విన్నట్టు మెదులుతోంది మనసులో.

కామేశ్వరితో పదిరోజులు గడిపి, శలవు తీసుకుని రైలెక్కింది. “బొంబాయిలో దిగి, అమ్మని ఓ సారి చూడు. మనవాళ్ళకోసం పరితపించి పోతోంది” అన్నాడు నిరంజనం.

శాంతకి ఇష్టంలేదు కానీ నిరంజనంమాట కాదనలేక సరేనంది.                                                                                             000

శాంత అమెరికా వచ్చి పాతికేళ్ళకి పైనే అయింది. మొదట తొమ్మిదేళ్ళు అసలు ఇండియా వెళ్ళడమే పళ్ళేదు. తీరా వెళ్ళగలిగే సమయం వచ్చేసరికి అమ్మా, నాన్నా పోయేరు. ఇద్దరక్కయ్యలూ, ముగ్గురు తమ్ముళ్ళూ ఉన్నారు కానీ అందరికీ ఊపిరి తిరగని పనులే. రమ్మంటారు కానీ తీరా వెళ్తే పట్టుమని ఓ గంట కూచుని మాటాడే తీరిక లేదెవరికీ.

మూడోసారి కామేశ్వరిఇంట్లోనే దిగింది. నాలుగు రోజులు అక్కడుండి, ఆ తరవాత ఇద్దరూ దేశాలు తిరిగేరు. ఇద్దరికీ ఇష్టమయిన స్థలాలు చూశారు. ఇష్టమయిన స్నేహితులతో కలిసి గతం ఆటలూ, పాటలూ కలబోసుకు తలబోసుకుంటూ ఆనందించేరు.

ఆ ప్రయాణం శాంతకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. గొప్ప సంతృప్తినిచ్చింది.

“అబ్భ, ఎంత బాగుందే నీతో ఇలా తిరుగుతుంటే! నాలో చచ్చిన సరదాలనీ మళ్ళీ ప్రాణం పోసుకున్నాయి. ఇకమీదట నువ్వెప్పుడు ఇండియా వచ్చినా, నాదగ్గరకే రావాలి. నాతోనే ఉండాలి,” అంది కామేశ్వరి ఆప్యాయంగా శాంత భుజాలచుట్టూ చెయ్యేసి, ఆ భుజంమీద తల వాల్చి. ఒకసారి కాదు పది సార్లు అంది ఆమాట. అలా చెయ్యకపోతే “నామీద ఒట్టే” అంది కన్నీళ్ళతో.

“ఇంత చెప్పాలిటే. నాకు మాత్రం అంత హాయిగానూ లేకపోతే మళ్ళీ వస్తానా? అసలు నీపెళ్ళిలోనే చెప్పేను కదా” అంది శాంత.

“పెళ్ళేమిటి, బీచిలో పిచికగూళ్ళు కట్టినరోజుల్లోనే అనేదానివి కదా. నేను మీఊరొస్తే మీఇల్లే నానివాసం అని.”

“హుమ్. ఏమిటో, ఆ స్కూలురోజులూ, పండుగలూ, పబ్బాలూ .. మీనాన్నగారికి ట్రాన్స్‌ఫర్ అయింతరవాత కూడా మనశలవులు అయితే మాయింట్లో లేపోతే మీయింట్లోనే కదా… ఇప్పుడు మళ్ళీ అలాగే ఉంది నాకు ఇంతకాలం అయింతరవాత అమెరికానుంచి ఇండియా వచ్చి నీతో గడుపుతూంటే.”

శాంతకి కామేశ్వరి పెళ్ళి నిశ్చయమయినరోజు గుర్తొచ్చింది. వేలు విడిన మేనత్తకొడుకు నిరంజనంతో. “బావుంది. ఇహ ఎలాటి అరమరికలకీ తావు లేదు. నువ్వు మావాళ్ళింటికోడలివయేవు.” అంది బ్రహ్మానందపడిపోతూ.

తిరిగి బయల్దేరే రోజున మళ్ళీ ముందులాగే కామేశ్వరి శాంతచేత ప్రమాణం చేయించుకుంది త్వరలోనే వస్తాననీ, ఇద్దరం ఇలాగే కిలకిల్లాడుతూ దేశసంచారం చేద్దాం అనీ.

ఆతరవాత రెండు సార్లూ కూడా అలాగే చేసింది. ఇది కామేశ్వరింట్లో మూడోసారి.

000

నిరంజనం చెల్లెలు కరుణ స్టేషనుకొచ్చి, శాంతని ఇంటికి తీసుకెళ్ళింది.

“శాంతమ్మా, బాగున్నావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందీ… పదేళ్ళవుతోందేమో కదూ. కిందటిసారి వచ్చినప్పుడు ఇక్కడికి రాకుండానే వెళ్ళిపోయేవు …” సీతమ్మత్త ఏదో చెప్తోంది. ఆవిడలో పెద్దతనం బాగా కనిపిస్తోంది. ఉన్న నాలుగురు పిల్లలదగ్గరా మూడేసి నెలలుచొప్పున వంతులవారీగా ఆవిడ్ని చూసుకుంటారు.

శాంత, అవునూ, కాదూ, అయుండొచ్చూ అంటూ పొడి పొడి మాటలతో సమాధానాలు చెప్పుకొస్తోంది.

తననుకున్నంత భయంకరంగా లేదు వీళ్ళింట్లో అని కూడా అనిపించింది పావుగంటయేక.

మాటలసందర్భంలో “అయితే నువ్వు ప్రతిసారీ వాడింట్లోనే దిగుతావు. మీ అక్కలూ,  తమ్ముళ్లూ – నీకూ వాళ్ళకీ మాటల్లేవేమిటి?” అందావిడ.

శాంత ఉలిక్కిపడింది ఆమాటకి. నిజానికి ఆమాట మాటలసందర్భంలో వచ్చినట్టు లేదు. చాలాసేపు పట్టింది ఆమాట శాంతకి తలకెక్కడానికి. ఆతరవాత జవాబు తోచలేదు.

“వాళ్ళనీ చూశానే. ఏం, ఎందుకలా అడుగుతున్నావూ?” అంది నెమ్మదిగా, సాలోచనగా.

“ఇప్పుడదంతా ఎందుకమ్మా?” అంది కరుణ.

ఆమాటతో శాంతకి మరీ అయోమయం అయింది.

“ఏం, బావ ఏమైనా అన్నాడా? వాళ్ళకేమైనా అసౌఖ్యం కలిగిందేమిటి నావల్ల?” అంది కాస్త గాభరా పడుతూ.

కరుణ తేలిగ్గా తీసిపారేసింది, “అబ్బే, అదేం లేదు లెద్దూ. వాడేమీ అన్లేదు.”

“మరెవరన్నారు?”

“ఎవరూ అనలేదు. అమ్మదంతా అదోరకం తెలిసీ తెలీని అడివిమేళం. ఏదో నోటికొచ్చింది అనేస్తుంది. నువ్వేం అనుకోకు,” అంది కరుణ.

శాంతకి మాత్రం అంత తేలిగ్గా అనిపించలేదామాట. “ఎందుకలా అంది?” మళ్ళీ గట్టిగా అడగాలనుంది.

ఏమంటుంది? “పోన్లెద్దూ. ఏదో అన్నాను. దానికంత ఆర్భాటం ఏమిటి. అసలయినా నిజంగా వాడికలా అనిపిస్తే వాడే అనును నీతో. పైగా మాకోడలికీ నీకూ ప్రాణాలిచ్చి పుచ్చుకునే స్నేయితం కదా” అనొచ్చు. అది అమాయకత్వమేనా కావచ్చు, ఎత్తిపొడుపేనా కావచ్చు.

ఆతరవాత మరి మాటలు సాగలేదు.

శాంత మనసు గిజగిజలాడుతోంది. చాలా అడగాలనుంది. ఏదో ఒకటి స్పష్టంగా తెలిస్తే బాగుండు.

“మీవదిన ఏమైనా అందా?” అని కరుణని అడిగితే? కామేశ్వరి అలా అనగలదని తను కలలో కూడా అనుకోలేదు. అలా అనుకోడం తనకి సాధ్యం కాదు. అయినా అసలు సంగతి తెలుసుకోవాలని కూడా అంత పట్టుదలగానూ ఉంది.

“ఆమధ్య అన్నయ్య ఆఫీసు డౌన్‌సైజ్ చేస్తూ, కింది స్థాయికి దించేశారు కదా. ఆర్థికంగా వాళ్ళపరిస్థితులు బావులేవు. అదీ అమ్మ బాధ. ఎవర్నో ఒకర్ని అనాలి, నువ్వు దొరికేవు,” అనొచ్చు.

శాంత నిట్టూర్చింది. జవాబు ఏదయినా ఒకటే. తనకి నిజంగా the truth, the whole truth, nothing but truth తెలుస్తుందన్న ఆశ లేదు.

పోనీ బావనే అడిగితే?

“ఛ, ఛ. నేనలా అంటానా? అసలు నీకెందుకొచ్చిందీ ఆ సందేహం? నాకు తెలీదేమిటి మీ ఇద్దరి స్నేహం” అంటాడేమో?

“ఛ, ఛ. నేనలా అనలేదు. ఎవరన్నది ఆమాట నీతో, అమ్మేనా? అవిడదో తిక్కమాలోకం. ఏమాటా తిన్నగా అర్థం చేసుకు చావదు” అంటాడేమో.

“ఆమధ్యనెప్పుడో చెల్లికి డబ్బు సర్దమని అడిగితే, శాంత వచ్చినప్పుడు కాస్త ఖర్చులు అయేయి. ఇప్పుడు సర్దలేనన్నాను ఏదో మాటల్లో. దానికి ఆవిడ ఇన్ని పెడర్థాలు తీసినట్టుంది. అది నీగురించి కాదులే.” అంటూ సాకులు చెప్పొచ్చు.

తన సందేహానికి ఎన్నిరకాల జవాబులు ఉండొచ్చో అన్నీ ఊహించుకుంది. అంతే. వాటిల్లో ఏఒక్కటయినా … కాదా, మరో సమాధానం అయినా సరే … ఏ పరిస్థితుల్లోనూ అసలు నిజం తెలుస్తుందన్న ఆశ మాత్రం లేదు.

పోనీ కామేశ్వరినే అడిగితే –

“ఎంతమాటన్నావే! చూస్చూసి నన్నలా అడగడానికి అసలు నీకు నోరెలా వచ్చిందే? నీకూ నాకూ మాటలొచ్చిందగ్గర్నుంచీ మనసు విప్పి మాట్లాడుకోడమే కానీ గుట్లెరుగుదుమా? నాకు నొప్పయితే నీకు చెప్పనా? నువ్విలా అడిగినందుకే నాకు ప్రాణం గిలగిల కొట్టుకుపోతోంది.”

శాంత కళ్ళు చెమ్మగిల్లేయి. నిజమే. కామేశ్వరికి అలాటి బాధ ఏమయినా ఉంటే తనతో తప్పకుండా మాట మాత్రం అని ఉండేదే. ఒక్కటి మాత్రం నిజం. సీతమ్మత్తమాటలో నిజం ఉందో లేదో, ఉంటే ఎన్నిపాళ్ళుంటుందో తనకి ఏనాటికీ తెలీదు. కానీ ఆమాట మాత్రం తనమనసులోంచి ఏనాటికీ చెరగదు.

మాటకున్న కున్న తెగులే అది. చివ్వున విసిరిన బాకులా నాటుకుపోడం దాని లక్షణం palimsest లాగ – తోలుపత్రాలమీద రాసిన రాతలు చెరిపి కొత్తవి రాసినప్పుడు పాతరాతలు అడుగుపొరల్లో పూర్తిగా చెరక్కుండా ఛాయామాత్రంగా ఉంటాయిట. మనసులో నాటుకున్న మాటా అంతే. ఎన్ని విధాల తిరగా బోర్లా వేసి వివరణలిచ్చుకున్నా ఆ పదాలతాలూకు ఛాయలు అంతరాంతరాల కెలుకుతూనే ఉంటాయి.

నిజానికి తను ఇండియాకి వచ్చిన ప్రతిసారీ కొంత సొమ్ము కామేశ్వరిచేతిలో పెట్టి,

“ఉంచవే ఖర్చులకి” అంటూ వచ్చింది. కామేశ్వరి మొదట తీసుకోడానికి ఒప్పుకోలేదు.

శాంత నెమ్మదిగానే అయినా గట్టిగానే చెప్పింది. “చూడు, కామూ, అక్కడ నా మంచీ చెడ్డా నేనే చూసుకోవాలి. గుక్కెడు మంచినీళ్ళు కావాలన్నా నేను లేచి తెచ్చుకుంటే ఉంది లేపోతే లేదు. ఇక్కడ నీయింట్లో కనీసం పది రోజులపాటు ఏ చీకూ చింతా లేకుండా తిరగాలని నా ఆశ. బజారులో ఓ పువ్వు కొన్నా, ఓ సినిమాకెళ్ళినా ఎంతివ్వాలో, చిల్లరెంతో నేను లెక్కలు చూసుకోనక్కర్లేదు అనుకుంటే నామనసెంత తేలిగ్గా ఉంటుందో తెలుసా. నాకదే మహరాజభోగం. అంచేత కాదనకు. ఉండనీ” అని.

“ఏమిటో నీది మరీ చాదస్తం. ఇది ఇద్దరికీ సరిపోతుంది,” అంది కామేశ్వరి.

“ఏమోలెద్దూ. ఉండనీ. తరవాత చూసుకుందాం,” అంది శాంత.

ఎవరి ఆర్థిక స్తోమతు ఏమిటి అంటూ చర్చలకి దిగకుండా ఇద్దరూ ఎవరి పరువు వారు నిలుపుకున్నారు. ఒకరి పరువు రెండోవారు నిలబెట్టేరు.

ఇప్పుడు సీతమ్మత్త ఆడిన ఆ ఒఖ్ఖమాటతో మొత్తం వాతావరణం మారిపోయింది.

కుండెడు పాలలో ఒక్క విషపుచుక్క!

ఆరేళ్ళయింది. కామేశ్వరి అన్నట్టు ఏళ్ళూ పూళ్ళూ అయినట్టే ఉంది తనక్కూడా. దాన్ని మరొక్కమారు చూస్తే బాగుండు. వయసు మీద పడుతున్న కొద్దీ ఆ యావ మరింత బలంగా పట్టి కుదుపుతోంది … కామేశ్వరి రమ్మంటోంది. అది ఆ మాట మనస్ఫూర్తిగానే అంటోందని తనకి తెలుసు కూడా.

అయినా … మనసులో మరో ముల్లు … ఉలిములికిలా కెలుకుతోంది. వెళ్దాం అనుకున్నప్పుడల్లా అనుమానం … మాటలతో వచ్చిన చిక్కే ఇది. ఒక మాట అనేసింతరవాత “నేనలా అన్లేదూ,” “నేనన్నది అది కాదూ” అంటూ ఎన్ని రకాలుగా దిద్దుకోబోయినా ఆ మొదట పడిన ముద్ర చెరపలేం. … palimpsest లాగే మరి …  తోలుపత్రాలమీద చెరిపి, చెరిపి మళ్ళీ మళ్లీ రాసుకోవచ్చు కానీ ముందు రాసిన రాతల తాలూకు ఛాయలు పూర్తిగా తుడపలేం.

తను వాళ్ళింట్లో నాలుగు రోజులు గడిపినందున ఆ దంపతులకి ఖర్చులు పెరిగేయో లేదో తనకి తెలుసు. కామేశ్వరికి తెలుసు. నిరంజనానికి తెలుసో తెలీదో తనకి తెలీదు. వాళ్ళమ్మకి తెలుసో తెలీదో తనకి తెలీదు. తెలీదనే అనుకోవాలి. అందుకే అవిడ అలా అనగలిగింది. మళ్ళీ అంత తేలిగ్గానూ “పోన్లెద్దూ. ఏదో తోచింది, అన్నాను. నువ్వేం పట్టించుకోకు” అని అనగలిగింది.

ఆశ్చర్యం. ఆ మాటలకున్న బలం ఆవిడకి నిజంగా తెలీదా? అమాకత్వమా? లౌక్యమా? అనదలుచుకున్న మాట అనేసి, “పోనిద్దూ, నువ్వు పట్టించుకోకు” అంటే ఏమీ జరగనట్టు ఊరుకోడం సాధ్యమేనా? అందుకే అంటారు కఠోరాణి వజ్రాదపి, మృదూని కుసుమాదపి అని. పువ్వుల్లా మృదువుగా ఉన్న మాటలు కూడా వజ్రాల్లా గుండెల్లో గునపాలయి గుచ్చుకోగలవు. పైగా అవి చేసే గాయాలు కంటికి ఆనవు కనక ఆ హింస ఋజువు చెయ్యలేం. ఎంతలేసి మాటలూ అనేసి “పోనిద్దూ, ఏదో మాట అలా వచ్చేసింది, ఏమనుకోకు” అనడం ఎంత తేలిక! అది మనవాళ్ళకే చెల్లిందేమో. బహుశా చాలామందికి “పోతుందేమో కూడా” .. తనకి అంత తేలిగ్గా “పోదు.” అది తన లక్షణమేమో మరి. ఆమాట వేసిన ముద్ర ఆబోతుమీద అచ్చేసినట్టే. మరింక చెరగదు. మరోసారి కామేశ్వరింట్లో దిగితే … పూర్వంలాగా తనకి మనసులో అంత హాయిగానూ అంత స్వేచ్ఛగానూ ఉండకపోచ్చు. ఉండదనే అనిపిస్తోంది …

శాంత కలం తీసుకుంది తాను ఇండియా రాలేకపోడానికి కారణం ఎంతో వివరంగా రాసింది మూడున్నర పేజీలు. రాలేకపోతున్నందుకు ఎంత బాధగా ఉందో వివరించింది. బతికి బాగుంటే ఎప్పుడో వస్తానేమో అన్న ఆశ వెలిబుచ్చుతూ ముగించింది.

ఆ ఉత్తరంలో డబ్బు ప్రసక్తి లేదు. ఎందుకు దాన్ని కూడా హింస పెట్టడం? అనుకుంది శాంత నిట్టూరుస్తూ. ఇన్నేళ్ళ తరవాత తొలిసారిగా పల్చని తెర దిగింది వారిద్దరిమధ్య …

(జనవరి 3, 2011)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఆ ఒఖ్ఖ మాటా! (కథ)”

 1. @ శ్రీనివాస్, ఇప్పటికి – చాలా ఆలస్యంగా – అర్థమయిందండీ మీరన్నమాట. సారీ. ఇప్పుడు దిద్దుకున్నాను మీరు చూపిన పదం. థాంక్స్.

  మెచ్చుకోండి

 2. @ లలిత, – బాకులో – మార్చేనండి. పొరపాటు చూపినందుకు ధన్యవాదాలు.
  ఎవికేయఫ్ – ఆశ్చర్యమేనండీ. మరో స్నేహితురాలు కూడా తనకి కూడా పుస్తకం రాలేదన్నారు. ఈసారి ఎంచేత ఆలస్యం చేస్తున్నారో మరి. వచ్చేక, మీరు ఆసాంతం చదివేక మీ అభిప్రాయాలు తెలియజేస్తారని నేను ఎదురు చూస్తున్నాను. 🙂

  మెచ్చుకోండి

 3. “మాటకున్న కున్న తెగులే అది. చివ్వున విసిరిన బాకులో నాటుకుపోడం దాని లక్షణం.”
  బహుశా “బాకులా” అని మీ ఉద్దేశమేమో?
  చాలా బాగా చెప్పారు మాలతి గారూ.
  చాలా రోజుల తర్వాత మీ కథ చదువుతున్నాను.
  AVKF వారు పంపామన్నారు కానీ మీ కథల అత్తయ్య పుస్తకం ఇంకా నాకు అందలేదు.
  I’m waiting to read your stories in print, in leisure.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s