ఊసుపోక – ప్రముఖ ఇ-భిప్రాయాలు

(ఎన్నెమ్మ కతలు 65)

చాలాకాలం తరవాత ఓ పుస్తకం పట్టుక్కూర్చున్నాను. ఎంతసేపూ రాయడమే అయితే ఎలా?  చదివితేనే కదా కొత్త ఊహలు కలిగేది అనుకుంటూ.

“బావున్నారాండీ?” అంటూ తారకం వచ్చేడు.

ఆ వెనకే, “బాబుగోరిని సూసి నానొచ్చిన” అంటూ సంద్రాలు ప్రవేశించింది.

నాకయితే అనుమానంగానే ఉంది.

“ఏంటి కథ? ఇద్దరూ ఒక్కసారే వచ్చేరు,” అన్నాను.

“సెప్పలే? ఆ బాబుకారు సూసొచ్చిన అనీ” అంది సంద్రాలు విసురుగా.

తారకం కిమ్మనలేదు. నాకిది రెండో టిప్పు. ఇద్దరూ కూడబలుక్కునే వచ్చేరు. -:)

“కూర్చోండి. ఆ కుర్చీ ఇలా లాక్కో, తారకం. ఊమ్ …. ఏమిటి విశేషాలు? ఏం చేస్తున్నావు ఈమధ్య?” అంటూ ప్రశ్నలమీద ప్రశ్నలు గుప్పించేశాను కసిగా.

“విమర్శ లు రాస్తున్నానండీ.” అన్నాడు తారకం.

“ఆహా. వ్యాఖ్యలు దాటి విమర్శలస్థాయికి ఎదిగేవన్నమాట. బాగుంది,” అన్నాను సంతోషంగా.

ఈనాటి సాహితీక్షేత్రం చూస్తుంటే ఇలా అంచెలంచెలుగా ఎదగవలసిని అవసరం కనిపిస్తోంది. అది తారకం గ్రహించినందుకు నాకు పరమానందంగా ఉంది. ఎంతైనా అతడు నా శిష్యుడికిందే లెఖ్ఖ కదా.

సంద్రాలు గుర్రుగా చూసింది అతనివేపు.

“ఏమయింది? అలా చూస్తున్నావేమిటి?”

“ఎట్ట సూస్తున్ననంతవు?”

“ఏమో. నీమొహం చూస్తే నీకేదో చిరాగ్గా ఉన్నట్టుంది. ఏమిటదీ అన్నా?”

“ఆ బాబు సూడు తల్లీ. నివ్వే గంద మమ్ముల్ని స్నెయితం సేసినవ్. ఆ మరియాద నిలుపుకోక్కర్నేదా?”

సందేహం లేదు. ఇద్దరూ కూడబలుక్కునే వచ్చేరు.

“ఏం చేసాడేమిటి?” అని సంద్రాల్నీ, “ఏం చేశావేమిటి?” అని తారకాన్నీ వరసగా అడిగేశాను.

తారకం జవాబు చెప్పడానికి తడుముకుంటుంటే, సంద్రాలు అందుకుంది, “మా యప్పకతలమీద ఇది బాగోనేదూ, అది బాగోనేదూ అంటూ రాసేసినాడు. ఇదేఁవన్నా మరియాదగున్నదా? నివ్వే సెప్పు,”

ఓరి భగవంతుడా! అదన్నమాట అసలు సంగతి. వీళ్ళిద్దరూ పంచాయితీ పెట్టడానికొచ్చేరు నాదగ్గరికీ. మరోపక్కన నాకు ఆశ్చర్యంగా కూడా ఉంది.

“ఏమిటీ, మీ అక్క కథలు రాస్తుందా? నాకెప్పుడూ చెప్పలేదే?” అన్నాను.

“మరేనండీ. పజ్జాలూ, ఇంకా ఏవో కూడా రాసుద్దండీ.”

“ఏం చదువుకుందేమిటి?” అన్నాను. అడిగేశాక అనవసర ప్రశ్న అనిపించింది.

“ఎనిమిది సదివిందండీ. ఇంగిలీసు గూడ కూడబలుక్కంట సదువుతాది.” అంది సంద్రాలు రవంత సిగ్గు పడుతూ.

“బాగుంది. మీ అక్కకథలు తీసుకురా ఈసారి వచ్చినప్పుడు. చదువుతాను. మరి నువ్వెందుకు చదువుకోలేదూ?” అన్నాను వాళ్ళ అక్క చదువుకున్నందుకు సంతోషం, సంద్రాలు చదువుకోనందుకు విచారం వెలిబుచ్చుతూ.

“ఏటో పడ్నేదమ్మా. మరి గంత నివ్వు మాట తప్పించేస్తన్నవు” అని నాతోనూ, “మాయప్ప కతలమీన మంచిగ రాస్తే ఈబాబు సొమ్మేటి పోతది?” అని తారకంతోనూ అందామె.

అవునన్నట్టు తల పంకించి, “ఎందుకలా రాసేవూ?” అని తారకాన్ని నేను కూడా అడిగేను.

“అది కాదండీ. ఆకథల్లో భాష పరమ ….” అని ఆగి, సంద్రాలివేపు చూసి, “బాగులేదండీ. భావాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పైగా పేజీకీ పుంజీడు అచ్చుతప్పులు. ఎలా చదువుతాం చెప్పండి,” అన్నాడు.

సంద్రాలందుకుంది, “బాసేటి బాస? మాం మాటాడేది బాస కాదా? నివ్ మాటాడేదే బాసా? అసల్నివ్వెవ్రు ఇనాగే రాయాల అనాగే రాయాల అంటా ఎంపుల్లు ఎట్టడానికి?”

తారకం గుక్కిళ్ళు మింగుతూ, “అది కాదమ్మా. మీరు మాటాడేది భాష కాదని కాదు నేనన్నది. ఎక్కువమంది చదవాలంటే ఎక్కువమంది వాడే బాషే మాటాడాలి కదా. కథలయినా కవితలయినా, వ్యాసాలయినా రాయడానికి కొన్ని నిబంధనలున్నాయి. అవి పాటించకపోతే అవి కతలూ, కవితలూ, వ్యాసాలూ అవవు?” అన్నాడు.

“అని ఎవరు రూల్సు సేసేరూ?” అంది సంద్రాలు కళ్ళు చిట్లించి.

“చాలామంది చేసేరమ్మా. ఆనందవర్థనుడినించీ ఆరెస్సెస్ వరకూ ఎందరో పెద్దలు ఎన్నో సూత్రాలు చేశారు. చక్కగా వారిగ్రంథాల్లో వివరించేరు.”

“అవుతే ఔనీ. ఆల్లెవరో నాకెరిక నేదు. మాయప్పకి నేదు. ఔతే నాకూ, మాయప్పకూ మనసులో ఏటి తోస్తే ఆ బావాలు సెప్పకూడదంటావేటి? నీకు బాగోనేపోతే నివ్వు సదామాక. నాలాటోల్లూ, మాయప్పలాటోల్లూ కోకల్లలు సదూకుంతారు. సదూతున్నారు. పైగా అచ్చరాలు బావోలేవంతే అది మాయప్ప తప్పెట్ల ఔతాది? ఆ పొత్తకాలు అచ్చేసినోల్లనడుగు.”

తారకానికి సందు దొరికింది. “నేనదే అంటున్నానమ్మా. ఆళ్ళదే తప్పు.” అన్నాడు అసలు విషయం వదిలేసి.

“ఏటంటన్నవు. మాయప్ప కతలు కతలే కావని నివ్వన్నేదా?”

తారకం నావేపు చూశాడు.

“నేనేం చెప్తాను నీకు నువ్వే తెచ్చుకున్న తద్దినం ఇదీ,” అని అర్థం వచ్చేలా తలా బుజాలూ ఊపేను.

తారకం ఆలోచించి సామ్యానికి దిగేడు, “అది కాదమ్మా. మీయప్ప మంచికథలే రాయొచ్చు, రాయగలరని నాకు చాలా నమ్మకం కూడాను.”

“మరిగయితే నువ్వేటంటవు?”

మళ్ళీ తారకం నావేపు చూశాడు.

అంతవరకూ నేను పరకాయించి చూడలేదు అతడిని. ముందులా ఇప్పుడు చింపిరి జుత్తూ, కళవళపడుతున్న కళ్లూ లేవు. బాగా నునుపు తేరేడు. అంటకత్తెరేసిన తలా, చెంపలమీద తీరిచిదిద్దిన తుప్పవెంట్రుకలూ, కళ్ళకి జోడూ, కాళ్ళకి దేశవాళీ జోళ్ళూ – పకడ్బందీగా ధీమాగా ఉన్నాడు.

ఇప్పుడు తారకం నాదగ్గరికి పాఠాలు నేర్చుకోడానికి రాలేదు! వీలయితే నాకే చెప్పడానికి సిద్ధమయి వచ్చేడు. ఆ వీలు వచ్చింది కూడాను.

“సమకాలీనసాహిత్య క్షేత్రం మీ చిన్నప్పటిలా కాదండీ. మీకు మంచిపేరు రావాలంటే, మీగురించి నలుగురికీ తెలియాలంటే, మీరు నలుగురితో కలిసి మెలిసి తిరగాలి.”

ఈపాఠం నాకే.

సంద్రాలు అయోమయంగా చూసింది. “ఏటంటన్నడా బాబు?”

“బోన్సాయి బుర్రలు” అన్నాను.

“అదేటి?”

“పుష్టిగా ఏపుగా ఎదగాల్సినమొక్కలికి తల్లి దుంప నరికేసి, మొక్కల్ని ఎదక్కుండా చేస్తారు. అలాగే కొందరి బుద్ధులు కూడాను. కురుచబుద్ధివారి కంటికి అట్టే దూరం ఆనదు. అలాటివాళ్ళ కళ్ళ బడాలంటే నువ్వు ఎల్లవేళలా వారిముందు తచ్చాడుతుండాలి.”

“మీరు చాలా క్రూరంగా మాటాడుతున్నారు,” అన్నాడు తారకం చిన్నబుచ్చుకుని.

“పోనీ. నువ్వు చెప్పు సుతారంగా,” అన్నాను.

“అది కాదండీ. నూతిలో కప్పలా ఎంతసేపూ మీరు మీ ఇంట్లోనే కూర్చుని రాసుకుంటానంటే ఎలా?”

నేను మాటాడలేదు.

అతను సంద్రాలువేపు తిరిగి అన్నాడు, “చూడమ్మా. మీఅక్క అంటే ప్రత్యేకించి నాకేమీ కోపం లేదు. కానీ ఆమె కొన్ని నియమాలు పాటించాలి. ముళ్ళపూడివారు సూర్యనమస్కారాలు అన్నారు చూడండి అలాగే సూర్యనమస్కారాలో సంధ్యావందనాలో (విమర్శకులూ, సమీక్షకులూ తదితరులయొక్క లింగభేదాన్ననుసరించి అన్నమాట) – చేస్తూండాలి శ్రద్ధగా .. మీఅక్కగారిని సభలకి వస్తూండమని చెప్పండి. రెండోవరసలో మూడో కుర్చీలో కూర్చోవాలి అని కూడా చెప్పండి.”

“అదేల? మూడోకుర్సీ పెసలేటి?”

“స్పెషలేంటంటే వేదికకి దగ్గరగా ఉంటుంది. ఆ వరసలో కూర్చోడానికి మిగతావారు వచ్చినప్పుడు మీఅక్కగారు నిలబడవలసి వస్తుంది.”

“మాయప్పని పెతీ సబలా గుంజీలు తీమంతరా?”

“అది కాదండీ. ఆమె అలా నిలుచున్నప్పుడల్లా వేదికపై నున్నవారి కళ్ళబడతారు. అందుకూ. సభ అయింతరవాత ఆమెపుస్తకం కాపీలు వేదికమీదున్నవారందరికీ ఇవ్వాలి. వారి దస్ఖతులు మరోకాపీమీద తీసుకోవాలి. కనీసం నెలకోమారైనా ఓ సభలో కనిపించాలి. మీ ఊళ్ళో సభలేం లేకపోతే ఆమెనే ఓ సభ పెట్టేయమనండి ఏ గొడ్లపాకలోనో. దారే పోయిన నలుగురిని పట్టుకొచ్చి కూచోపెట్టినా చాలు. పత్రికలవారిని మాత్రం తప్పనిసరిగా పిలవాలి.”

సంద్రాలు మాఇద్దరివేపూ చూసింది చిరాగ్గా, “బాగున్నాది పొలం దున్నినట్టే.”

తారకం మొహం మతాబాలా వెలిగింది. “అదేనమ్మా సాహిత్యవ్యవసాయం అంటే. మన తెలుగు సాహిత్యం సుక్షేత్రం కావాలంటే వ్యవసాయం చాలా అవుసరం. పాశ్చాత్యసాహిత్యం అంతగా రాణించడానికి అదే కారణం,” అన్నాడు హుషారుగా.

మళ్ళీ ఏమనుకున్నాడో, “లేదా, మీ అక్కగారు సొంత సైటో బ్లాగో పెట్టేసుకుని వారి ఇ-భిప్రాయాలు వారే ప్రచురించుకోవచ్చు కూడాను.”

మళ్ళీ నాకే!

సంద్రాలు లేచి, “ఈ లుకలుకలన్నీ మీరే పడండి. మాకవేవీ తెలీవు. మాబోంట్లం మాకు తోసింది సేస్కంట పోతం. మాయప్ప ఆమెకి తోసింది రాస్కంట పోతది. అంతే” అంది.

తారకం క్షణకాలం తటపటాయించి, నావేపు తిరిగి, “మీరు నాకు అప్తులు. మీవల్ల సంద్రాలుగారు కూడా నాకు ఆప్తులే. నిజం చెప్తున్నా. ఆవిడ వారిఅక్కగారని నాకు తెలీదు. తెలిస్తే అలా రాస్తానా?”

“నీ విమర్శలన్నీ పరిచయాలని బట్టే అంటావా?”

“అలా అని కాదనుకోండి. రచయిత వ్యక్తిత్వాలనిబట్టి రచన అర్థం చేసుకుంటాం కదా.”  అన్నాడు డొంకతిరుగుడుగా.

అతనితో పిడివాదం పెట్టుకోలేక ఊరుకున్నాను. అతను సూచిస్తున్న వ్యాఖ్యానాలకీ రచయిత వ్యక్తిత్వానికీ ఏం సంబంధం లేదని ఇద్దరికీ తెలుసు.

“ ఏమయినా నేనిలా అన్నానని మరెవరితోనూ అనకండి. సాటి విమర్శకులు లోపాయికారిగా మా అంతర్రహస్యాలు  చెప్పేశానని నామీద ధ్వజమెత్తగల్రు,” అన్నాడు.

సరేలే అన్నాను. వాళ్ళిద్దరూ వెళ్ళేక తెలుగు సాహిత్యక్షేత్రంగురించి ఆలోచిస్తూ కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాను చాలాసేపు!

(జనవరి 7, 2011.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఊసుపోక – ప్రముఖ ఇ-భిప్రాయాలు”

  1. సాహిత్యం పుట్టినప్పటి నుండి ఉంది ఇది..కాకపోతే..మీ పోస్ట్‌లో ఆ బొమ్మలో లాగా అక్కడెక్కడో హొరైజన్దగ్గిర కనపడేది.
    ఇప్పుడు ఇ అభిప్రాయలు కదా, వారిష్టం వచ్చింది వారు వ్రాసుకుంటారు..ఇష్టం ఉంటే సదూకోండి. లేకపోతే..సంద్రాలలో దూకండి. 🙂

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s