మార్పు 8

మార్పు 8

నాలుగురోజులయింది వీధిలో అడుగెట్టి. “నువ్వే మీ విస్కాన్సిన్ మంచు తీసుకొచ్చేవు మాప్రాణాలమీదకి” అంటూ నన్నే దెప్పుతున్నారు నా సన్నిహితులు, తదితర సారమతులూను.

నిజం చెప్పొద్దూ నాకు మంచు కురిసిన తొలిరోజు చాలా హుషారుగానే ఉండింది కానీ గత మూడురోజులనించీ నరకం మొదలయింది. నాలుగ్గోడలమధ్యా కూర్చుని పరమ నిదానంగా నత్తగుల్లల్లా ఈడుస్తూనో ఏడుస్తూనో పోతున్న కార్లని చూస్తుంటే చిరకేస్తోంది. చెప్పేను కదా నేను అడుగెత్తు మంచులోనూ మోకాల్లోతు నీళ్ళలోనూ కూడా బండి నడిపిన ధీర సారధిని. అలాటిది ఇప్పుడు బయట అడుగుపెట్టడానికే జడుపు. ఎందుకా? అలా అడగండి చెప్తా … నాకు లేని భయాలు నా నేస్తులూ ఇతర చాదస్తులూ నూరి పోసేసేరు నాకు అని నా అభిప్రాయం.

“నీ పిరికితనం ఒప్పుకోలేక వాళ్ళనీ వీళ్ళనీ ఆడిపోసుకోడం, తప్పులెన్నువారు … హీ, హీ”… అంటారా? హుమ్. మరే తప్పులెన్నువారు …

నాదసలే తిరిగే కాలు. తిట్టేనోరు లేదు కానీ కొంతవరకూ చేసే చెయ్యే … ఇలా 12 బై 14 గదిలో అదే సోఫాలో అదే దృశ్యం చూస్తూ గంటలతరబడీ రోజులతరబడీ కూర్చోడం చాలా బాధగా ఉంది. అక్కడికీ పోనీ భారీ ఎత్తున వంటలు చేసేద్దాం, ఆ కూరలు తరుక్కోడాలూ, గిన్నెలు కడుక్కోడాలూ కొంత కాలక్షేపం అనుకుంటే అదీ కుదరడంలేదు.

ఈఊళ్ళో మన దేశవాళీ కూరలు గోరుచిక్కుడుకాయలూ, పొట్లకాయలూ, బీరకాయలూ, దొండకాయలూ — ఎంచక్కా తాజా తాజాగా దొరుకుతుంటే ఫ్రీజు చేసినవి కొనుక్కోడమేమిటని నేను ఫ్రోజెనువి కొనడం మానేశాను. అంచేత సరిగ్గా మంచు ముమ్మరంగా కురిసినరోజునే మాయింట్లో కూరలకి కరువొచ్చింది. కూరలు నిండుకున్నప్పుడే మంచు కురియును అనిపిస్తోంది – వాన పడ్డప్పుడే గొడుగు పట్టుకెళ్ళడం మరిచిపోయినట్టు. బట్టలుతుక్కుందాం అంటే, “ఎనెర్జీ పొదుపుగా వాడండి. వాషరు వాడకండి. హెయిర్ డ్రయరు వాడకండి, ఎలెక్ట్రిసిటీతో వాడేవన్నీ ఆప్చేసేయండి” అంటూ ఊరు గోలెత్తిపోతోంది.

చుట్టూ చూశాను – నేను వాడే వస్తువులు – స్టౌ, మైక్రోవేవ్, ఫ్రిజ్, టీవీ, కంప్యూటరు, – నాబతుకుంతా వీటిచుట్టూ పరిభ్రిస్తూ ఉంటుంది. ఇవి లేకపోతే బతుకే లేదు. కారుంది కానీ అది కూడా ప్రస్తుతపరిస్థితుల్లో నిరుపయోగమే కదా.

నిజానికి విస్కాన్సిన్ మంచుతో పోలిస్తే ఇక్కడ పడ్డ మంచు టుప్పుటుప్పూ తొలకరి చినుకుల్లా చూపుకి గట్టిగా ఆనదు కూడానూ. అయినా ఈమంచుకే స్కూళ్ళు మూతపడిపోడాలూ, రోడ్లమీద కార్లు ఢీకొట్టుకోడాలూనూ … నాకైతే నవ్వుగానే ఉంది.

లేదులెండి. ఇక్కడ పడ్డ రెండంగుళాల మంచూ గడ్డ కట్టుకుపోయి ఐస్ రింక్ లా ఉంది నిజానికి. అన్నట్టు చెప్పేనా, టెనిస్ తరవాత నాకు అంతగానూ ఇష్టమయిన స్పోర్టు ఐస్ స్కేటింగ్. టీవీలో ఫిగర్ స్కేటింగ్ చూసినప్పుడల్లా అనుకుంటాను నేను కూడా స్కేటింగ్ నేర్చుకోవాలని. ఆ వెంటనే మంచులో పడి చెయ్యి విరగ్గొట్టుకున్న దుర్దినం కూడా గుర్తుకొస్తుందనుకోండి. (అన్నట్టు నేను విరగ్గొట్టుకోలేదు. అదే విరిగింది నా సంకల్పం లేదు.)

కిటికీలోంచి గడ్డకట్టుకుపోయిన మంచు చూస్తూ మరోసారి అనుకున్నాను ఎంచక్కా నేను ఐస్ స్కేటింగ్ చెయ్యగలిగితే, మిషెల్ క్వాన్ లా ట్రిపుల్ ఆక్సిల్,  డబుల్ టౌ గంతులేసుకుంటూ వెళ్ళి నాలుగు కూరలు తెచ్చుకునేదాన్ని కదా అని …

మొత్తంమీద ఇలా నాలో నేను చాలా విచారణలు చేసుకుని, మరియు గుండె దిటవు చేసుకుని, వెన్ను చరుచుకుని, “ఒస్, ఏమవుతుంది, మహా అయితే పడి మరోసారి కాలో చెయ్యో విరగ్గొట్టుకుంటాను, అంతే కదా, పైగా ఇక్కడ ఏ పొన్నమ్మాళూ అక్కర్లేదు, సుధావాళ్ళింట్లో కాలుమీద విరిగిన కాలేసుకుని దర్జాగా జరుపుకోవచ్చు” అని సుళువులు చెప్పుకుని బయల్దేరేను. మరోసారి చెప్తున్నా ఇది నాకు నేనయి చేసుకున్న నిర్ణయం కాదు. అలా జరగడానికి నేను అవకాశం కల్పించుకున్నాను అంటే కొంతవరకూ సమంజసమే కానీ కాలో చెయ్యో విరగ్గొట్టుకొనుటకే బయల్దేరుట లేదు.

తీరా తొలి అడుగు వేసినప్పుడు తెలిసింది నా టెనిస్ షూలు ఎంత అరిగిపోయేయో … మంచు చల్లగా ఎడమకాలు మడమకి తగిలింది. కాలెత్తి చూశాను. మడమ 99 శాతం అరిగిపోయి ఉంది. ఇంతకాలం ఆజోళ్ళెలా వేసుకు తిరుగుతున్నానా అని ఆశ్చర్యపోయేను.

ఇప్పుడు అర్జెంటుగా కూరలతోపాటు జోళ్ళు కూడా కొనుక్కోవాలని అర్థమయింది. టైము చూస్తే పదిన్నర. ఆఫీసులవారు ఆఫీసుల్లోనూ, బజార్లు తిరిగేవారు మాలుల్లోనూ స్థిరపడిపోయి ఉంటారు ఈపాటికి. రోడ్లమీద కార్లు అతి తక్కువ ఉండే సమయం. నెమ్మదిగా కారు తీసి వీధికెక్కేను.

…. మామూలుగా ముప్పావుగంటలో ముగిసే బజారు ఇవాళ రెండు గంటల యాభై నిముషాలు పట్టింది. ఇంత చలిలోనూ చిరుచెమటలు కూడా పట్టేయి. మొత్తంమీద మంచులో కారు నడిపి నా పూర్వ వైభవం జ్ఞప్తికెలయించుకున్నాను. అహో, ఒహో ,,,  నాకింకా పూర్వవాసనలు పోలేదు. పూర్వసువాసినులా అని అడక్కండి మరి :). ఆ వైభవం ఇప్పుడు కూడా ఉందనే చెప్తున్నా. ఈభాగం మాత్రం మారలేదన్నమాట.

అయితే ఇక్కడ కూడా మామూలు మనబతుకుల్లో సర్వసాధారణమయిన ఐరనీ లేకపోలేదు. కూరలూ, జోళ్ళూ తెచ్చుకున్నాను, ఫ్రోజెన్ కూడా. టెంపరేచరు మళ్ళీ మెరుగవుతోంది! అంటే మంచుపాతరేసుకున్న కూరల అవుసరం లేదు. మ్.మ్.మ్.

నేను మంచులో కారు నడపగలను. మంచులో నడవగలను, అదేలెండి నా సరికొత్త పాదరక్షలతో. అన్నట్టు చెప్పేనా? నా చేపాటికర్ర మాత్రం పారేయకుండా జాగ్రత్తగా తెచ్చుకున్నాను నాతోనే. అది పుచ్చుకు బయల్దేరితే ఎంత సరదాగా ఉందో …. స్కేట్ చేస్తున్నంత సంతోషంగానూ ఉంది!

(ఫిబ్రవరి 5, 2011)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “మార్పు 8”

 1. “ఎంచక్కా నేను ఐస్ స్కేటింగ్ చెయ్యగలిగితే, మిషెల్ క్వాన్ లా ట్రిపుల్ ఆక్సిల్, డబుల్ టౌ గంతులేసుకుంటూ వెళ్ళి నాలుగు కూరలు తెచ్చుకునేదాన్ని కదా అని …”
  – :))
  షాపుల వాళ్ళంతా ఇలాగే గెంతుకుంటూ వ్యాపారం సాగిస్తారా? 😛

  మెచ్చుకోండి

 2. @Ennela, మీవ్యాఖ్య చూస్తే నాకు నవ్వాగలేదండీ. నేనే రాసినవాక్యం అయినా. నేను కూడా విస్కాన్సిన్ లో ఉన్నంతకాలం చలికాలం రాకముందు కొత్తజోళ్ళు కొనేదాన్ని. టెక్సస్ లో చలి ఉండదని అందరూ చెప్తేనూ… మోసపోయేనన్నమాట. హీహీ.

  మెచ్చుకోండి

 3. //మంచు చల్లగా ఎడమకాలు మడమకి తగిలింది. కాలెత్తి చూశాను. మడమ 99 శాతం అరిగిపోయి ఉంది. ఇంతకాలం ఆజోళ్ళెలా వేసుకు తిరుగుతున్నానా అని ఆశ్చర్యపోయేను.//…భలే ఫన్నీ గా ఉంది…మళ్ళీ మంచు కాలం వచ్చేదాకా వాటిని చూసే పని లేదుగా…కొందరు ముందుగానే వింటర్ షాపింగ్ చేసుకుంటారు కానీ, చాల సార్లు మా వారికి కూడా కాళ్ళల్లోకి మంచు నీళ్ళొచ్చాక కొనుక్కోవాలని గుర్తొస్తుంది..మళ్ళీ షరా మామూలే…

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.