భండారు అచ్చమాంబగారి కథల్లో ఏముంది?

అచ్చమాంబ గారి కథలు Achamamba-final9

అచ్చమాంబగారి కథలు సుమారు పదేళ్ళుగా చర్చల్లో కనిపిస్తున్నాయి. అబలా సచ్చరిత్రరత్నమాల పేరు నాకు పరిచితమే అయినా కొండవీటి సత్యవతిగారి వ్యాసం నాలుగేళ్ళక్రితం చూసేకే, అచ్చమాంబగారి కథలగురించి తెలిసింది. అప్పటినుండీ నాకు ఆసక్తి కలిగింది. ఈకథలు ఈనాటి పాఠకులు ఆదరిస్తారా లేదా, ఆదరిస్తే, ఏ కారణాలవల్ల అని. అందుకే ఇక్కడ పెట్టి మీ అభిప్రాయాలు కోరేను. లలితగారి స్పందన మీరు చూసే ఉంటారు.  చూడకపోతే ఇప్పుడు చూడండి. నాకు మరో రెండు స్పందనలు విడిగా మెయిలులో వచ్చేయి. నాటపాకి దాదాపు 600 హిట్స్ వచ్చేయి. అంతమందీ చదివేరు అనుకోను కానీ కనీసం అందులో సగం మంది అయనా పిడియఫ్ తెరిచి చూసేరనే అనుకుంటున్నాను అచ్చమాంబగారిమీద అభిమానంతోనో కుతూహలంతోనో. అంచేత ఇక్కడ నాఅభిప్రాయాలు చెప్తాను.

ప్రధానంగా అచ్చమాంబగారి కథలు చదవడానికి మనం ఆ కాలం గుర్తు చేసుకోవాలి. ఆనాటి భాషా, శైలే ఆమె కూడా ఉపయోగించుకున్నారు తమ కథలు చెప్పడానికి. ఆనాటి సామాజికధోరణులూ, సాహిత్య ప్రయోగాలూ కూడా కనిపిస్తాయి ఈకథల్లో.

సంగిసెట్టి శ్రీనివాస్‌గారు సంపాదించిన పది కథలున్నాయి ఈ సంకలనంలో. శ్రీనివాస్ గారూ, సుజాతారెడ్డిగారూ రాసిన పరిచయాలు నేను నాటపాలో పెట్టకపోవడానికి రెండు కారణాలు – మీరు ఆ పుస్తకం కొని చదవాలని. రెండోది ఇతరుల అభిప్రాయాలు చదవకముందు, అవి ఉన్నవి ఉన్నట్టు చదివి మీ స్పందనలు తెలియజేయగలరని.

తెలుగు కథాచరిత్ర పరిణామంలో సమాజంలో భావజాలంలో వస్తున్న మార్పులు స్పష్టమవుతాయి ఈకథలు చదివితే.

ఇతివృత్తాల మాటకొస్తే సాంఘికసమస్యలు – స్త్రీవిద్య, మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థికసమస్యలూ ఉన్నాయి ఈకథల్లో.

గుణవతియగు స్త్రీ – ఇది అచ్చమాంబగారు రాసినకథ కాదు. దశకుమారచరిత్రలో కథని తిరగరాసేరు ఆమె. ఈ కథ చదివినప్పుడు మనం అది గుర్తు పెట్టుకోవాలి. పోతే, కథలో ప్రధానాంశం దారిద్ర్యదశలో సంసారం నడపడానికి కావలసిన నేర్పరితనం.

“భర్త ధనవంతుడయిననప్పుడు సంసారము జక్కగా జేయుట యంత వింత గాదు. కాని యతడు దరిద్రుడయినచో, నిత్యము యతనిని బాధింపక, యింటగలదానితో యెటులనో గడిపి యాతనినాందింప జేయుట దుస్తరము” అంటూ ప్రారంభిస్తారు కథ. శక్తికుమారుడనే వర్తకుడు పొదుపుగా సంసారము చేయగల కన్యకని వెతకడానికి తవ్వెడు వడ్లు తీసుకుని బయల్దేరుతాడు. ఆ వడ్లతో తనకి సుష్టుగా భోజనము పెట్టగలదా లేదా అన్నది ఆ అమ్మాయి చాకచక్యానికి పరీక్ష అన్నమాట. ఆ పరీక్షలో నెగ్గిన కన్యని వివాహమాడుతాడు. అయితే కథ అక్కడితో అయిపోలేదు. ఆమె చాకచక్యానికి పరీక్ష అయిన తరవాత, వివాహం అయినతరవాత, ఆమెగుణగణాలవిషయంలో కూడా పరీక్ష పెడతాడు. ఆమెని నానావిధాలా కష్టపెట్టడమే ఆ పరీక్ష. వాటికి తట్టుకుని ఆమె నిలబడి గుణవతి అనిపించుకుంటుంది.

ఆర్థికపరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఉన్నదానితో సర్దుకుపోవడం నేర్చుకోవాలి. అందులో తప్పు లేదు. ఇది ఏ కాలంలోనైనా అనుసరించదగ్గ నీతే. ఆనాడు స్త్రీలు అలా గడుపుకొచ్చేరు. ఈనాడు అచ్చంగా అలాగే చెయ్యకపోవచ్చు కానీ ప్రధానంగా పొదుపు అన్నదే ఈకథలో సందేశం. ఆ రోజుల్లో పురాణాలకున్న ప్రాముఖ్యత కారణంగా అచ్చమాంబగారు ఈ కథ రాసి ఉండవచ్చు. నిజానికి ఈరోజుల్లోనూ అలాటి కథలు వస్తున్నాయి. నాకు పేరు సరిగ్గా గుర్తు లేదు కానీ కొంతకాలం క్రితం ఒక నవల చదివేను. అందులో పద్మ అనే అమ్మాయి అత్యంత  చాకచక్యంతో స్వల్పఖర్చుతో మొత్తం ఊరునే మార్చేస్తుంది. దానికి సాహిత్య ఎకాడమీ ఎవార్డు కూడా వచ్చింది. నాకైతే అది పంచవర్షప్రణాళికకి ప్రోపగండా మెటీరియల్లా అనిపించిందనుకోండి. అది వేరే సంగతి.

ఈకథగురించి నా అభిప్రాయం ఏమిటంటే ఇది అచ్చమాంబగారి స్వకపోలకల్పితం కాదు కనక ఈకథని ఆ దృష్టితోనే అంటే పురాణకథగానే గ్రహించాలి.

అయితే ఈకథలో రెండోభాగం, వర్తకుడు పెళ్ళాడినతరవాత కూడా ఆ అమ్మాయిని పరీక్షించడం హీనంగానే కనిపిస్తుంది. బహుశా ఆనాటి సమాజంలో అప్పటికి ఇంకా బలంగా పాదుకొని ఉన్న  సాంప్రదాయపు ఛాయలు అచ్చమాంబగారిమీద కూడా పూర్తిగా పోలేదు అనుకోవాలి.

ప్రస్తుతానికి మనం “అక్కడినుండి ఇక్కడికి వచ్చేం” అని గ్రహిస్తే తృప్తిగా ఉంటుంది. కానీ ఒక మాట చెప్పకతప్పదు. దురదృష్టవశాత్తు, ఈనాటికి కూడా,  ఆధునికతని నిర్దేశిస్తున్న అమెరికాదేశంలో కూడా స్త్రీలని అలానే చూసేవారు (తెలుగిళ్ళలో కూడా) ఇంకా అక్కడా అక్కడా కనిపించడమే ఆశ్చర్యం.

లలితా శారదలు – ఇది పిల్లలకథ. మనం చెప్పుకునే అన్ని పిల్లలకథలాటిదే ఇది కూడా. అంటే అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ అన్న సుజనవాక్కుకి కథారూపం.

లలిత తాసిల్దారుగారి అమ్మాయి. ఆడింది ఆటా పాడింది పాటా. తల్లిదండ్రుల దన్ను ఆసరాగా సాటి పిల్లల్ని నానావిధాలా ఏడిపిస్తూ ఉంటుంది. బీదకుటుంబంలో పుట్టిన శారద తత్త్వం అందుకు పూర్తిగా విరుద్ధం. వీరిద్దరిమధ్యా ఏర్పడిన స్నేహం తరవారు వారు పెరిగి పెద్దవారయేక, పిల్లలపెంపకానికి కూడా ఆదర్శప్రాయం కావడమే ఈ కథలో ఇతివృత్తం.

శారద ఒకరోజు ఒక గులాబీచెట్టుదగ్గర నిలబడి, ఇంత అందమయిన పువ్వుకి ఈ ముళ్ళు ఎందుకొచ్చేయో అని విచారిస్తుండగా, లలిత వచ్చి ఆ పిల్లని కొట్టబోతుంది ఏకారణం లేకుండానే. చెయ్యి తప్పి ముళ్లమీద పడి, లలితచేతికి గాయం అవుతుంది. శారద ఆచేతికి గాయం తుడిచి, ఉపచారం చేస్తుంది. తాను ఆమెకి అపకారం చేయబోయినా, ఉదారంగా తనకి ఉపకారం చేసిన శారదని లలిత మెచ్చుకుని, తాను కూడా అదే నడవడి అలవర్చుకోడానికి నిశ్చయించుకుని, అందరితోనూ స్నేహంగా ఉండడం నేర్చుకుంటుంది.

పెరిగి పెద్దయి, పెళ్ళయి అత్తవారిళ్ళకి వెళ్ళిపోతారు. కొంతకాలం తరవాత లలిత పుట్టింటికి వచ్చి, చిన్నప్పుడు ఆడుకున్న తోటకి వెళ్తుంది. శారద కనిపిస్తుంది. ఇద్దరూ తమపిల్లలసంగతి ముచ్చటించుకుంటారు. శారద లలితని, “మనమిక మన సంతానమునెట్టుల సుగుణసంపన్నముగా జేయవలెనో చెప్పుమా?” అని అడుగుతుంది. లలిత “నీకు నేను చెప్పేదేమిటి” అని, తమ చిన్ననాటి సంఘటన పిల్లలకి చెప్పి, “మా యీ కతనెప్పుడును మరువకుడు. …. ఇతరుల అపరాధములను క్షమించి వారిపై కోపగింపకుండుటయే మంచివారనిపించుకొనుటకు లక్షణము.” అని బోధిస్తాను అంటుంది.

ఈకథ పిల్లలకథగా చెప్పడానికి నేను అనుకుంటున్న కారణం – మంచిబుద్ధులు పిల్లలకి చిన్నతనంలోనే ఏర్పడాలి. పెద్దయినతరవాత కక్షలూ కార్పణ్యాలూ అంత తేలిగ్గా వదలవు అని.

జానకమ్మ – పేదవాడయిన రంగరాజుగారి గారాలపట్టి. సుగుణవంతురాలు. ధనానికి లోపమయినా గుణాలకి లోపం లేని ఉత్తమబాలిక. రంగరాజుగారు ఉన్నదానిలోనే ఊరికి ఎవరొచ్చినా ఆదరించి అతిథి సత్కారాలు చేస్తూ కాలం పుచ్చుతున్నారు. జానకమ్మ పెరిగి పెద్దయేక, పెళ్ళి ఎలా చెయ్యాలా అని రంగరాజుగారు ఆరాటపడుతున్నరోజుల్లో పొరుగూరిలోని ధనవంతుల అబ్బాయికిచ్చి చెయ్యమని సలహా ఇస్తారు స్నేహితులు. వారు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని రంగరాజుగారు మధనపడుతుండగా, ఒక బ్రాహ్మణుడు వచ్చి పెళ్ళికొడుకు తల్లిదండ్రులు జానకమ్మని కోడలుగా చేసుకోడానికి ఉత్సాహపడుతున్నారనీ, కట్నకానుకలు కూడా అక్కర్లేదనీ చెపుతాడు. జానకమ్మ కలవారికోడలయి సుఖపడుతుంది. ఈకథ అతి సమాన్యంగా ఉన్నా, ఇందులో సదాచారసంపన్నులయింట పిల్లలపెంపకం, కాటవరం పల్లె వర్ణనలలో రచయిత్రి భావుకత, నైపుణ్యం కనిపిస్తాయి.

దంపతులకలహము –   భార్య భర్తకి చరణదాసి కాదన్న వాదన 20వ శతాబ్దం తొలి దశకంలోనే  ప్రారంభమయిందనడానికి ఈకథ సాక్ష్యం అనుకోవచ్చు. అయితే కథ నడిపినతీరు ఆకాలంలో భావాలకి అనుగుణంగానే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. “ఇది మీకాలం కాదు, మేం భర్తలకి దాసీలము కాము” అంటూ ముత్తవ్వతో వాదనకి పూనుకున్న లలిత చెప్పినకారణాలు చిలిపికజ్జాలుగానే కనిపిస్తాయి.

అప్పటికి పెళ్ళయి రెండు నెలలయింది. ఇద్దరికీ నాటకం చూడ్డానికి వెళ్ళాలని సరదా ఉన్నా వీలు పడలేదు. అలాటి సమయంలో సాటి ఉద్యోగస్థులు భార్యలతో నాటకానికి వెళ్తుంటే, నారాయణరావు కూడా భార్యతో నాటకానికి వెళ్ధాం అనుకుని, ఇంటికొచ్చి లలితని నాటకానికి పదమంటాడు. తాను అమ్మమ్మని చూడడానికి వెళ్లడానికి అంతకు మున్నే నిర్ణయించుకోడం, తనని అడగకుండా అతను టికెట్లు కొనడం కారణంగా కోపగించుకొని లలిత నాటకానికి రానంటుంది.

ముత్తవ్వ ఒక కథ చెబుతుంది. పూర్వం ఒక బాలిక ఇదేవిధంగా ప్రతిచిన్న విషయానికి మొండిపట్టు పట్టి, ప్రతిఘటిస్తుంటే భర్త విసుగేసి దేశాంతరం వెళ్ళిపోయేడనీ, వారిద్దరూ మళ్ళీ ముఖాలు చూచుకొనలేదనీ చెప్తుంటే దుఃఖాతిరేకంతో కంఠం గద్గదికమవుతుంది. అది ఆమెకథే అని తెలుసుకున్న లలిత మనసు మార్చుకుని ఇంటికి వస్తుంది. ఇక్కడ భర్త నారాయణరావు కూడా నాటకం చూస్తున్నా, తాను భార్యని నొప్పించేనన్న వ్యథలో మనస్థిమితం లేక, నాటకం సగంలో లేచి, కొంచెంసేపు గోదావరి ఒడ్డున తిరిగి పశ్చాత్తాపంతో ఇంటికి వచ్చేస్తాడు.

ఈకథ ముత్తవ్వ లలితకి చేసిన బోధనలు చదువుతున్నప్పుడు పాతకథలాగే తోస్తుంది. కానీ ఇందులో ప్రధానంగా మనం గమనించవలసిన విషయం కోపాలకి కారణం అయిన సంఘటన ఎంత ఘనమయినది అన్నది. కథలో సందేశం “ఇచ్చిపుచ్చుకోడం లేదా పట్టూ విడుపూ ఇద్దరిలోనూ ఉండాలి” అన్నది నారాయణరావులో కూడా పరివర్తన చూపడంతో ఆవిష్కృతమయింది. ఇద్దరి వాదనలూ ప్రతిపాదించడంలో రచయిత్రి నైపుణ్యం చూపించారు. మనం చూడవలసింది అదీ. నిజానికి ఈనాటి పత్రికలలో కూడా ఇదే ఇతివృత్తంతో కథలు చూడగలరు జాగ్రత్తగా గమనిస్తే.

సత్పాత్రదానము – ఈకథలో కూడా ఆధునిక భావాలు కనిపిస్తాయి. దయార్ద్రబుద్ధి గల కేశవుడు అనే చిన్న అబ్బాయి వీధిలో గుడ్డిబిచ్చగాడికి కొంచెం డబ్బు ఇవ్వమని తల్లిని అడుగుతాడు. తల్లి ఆ బిచ్చగాడితో మాటాడి, అతనికి పల్లెలో ఎదిగిన కొడుకులన్నారనీ, ఇలా అడుక్కుని సంపాదించినది కూడా ఈయన వాళ్ళకే పెడుతున్నాడనీ తెలుసుకుంటుంది. ఆ బిచ్చగానిపుత్రులు డబ్బుకి ఇబ్బంది పడుతూ కూడా ఏ బస్తీకో వెళ్ళి బతుకు మెరుగు పరుచుకోడానికి ఏమాత్రమూ ఉత్సాహం చూపకపోవడం వివేకవంతులలక్షణం కాదనీ, ఈబిచ్చగాడు అడుక్కుని తెచ్చి వారికే ఇవ్వడం న్యాయం కాదనీ అలాటివారికి ధర్మం చెయ్యడం అపాత్రదానమేననీ అంటుందామె. “కొన్ని పశువులు గడ్డిలేక మన్ను నోటికి తగులుచుండినను ఒకచోటనే గరిక మేయుచుండును గానీ వానికి గొంచెముదూరములో పచ్చని పసరిక యున్నను నవి లేచి అచ్చటికి అరుగనొల్లవు,” అన్న పరుషవాక్యంలో ద్యోతకమవుతుంది రచయిత్రి అభిప్రాయం.

ప్రతివారూ శ్రమించి జీవితాలు సుఖవంతం చేసుకోవాలన్న దృఢమైన విశ్వాసం ఆమె ఇతరకథల్లో కూడా చూస్తాం.

స్త్రీవిద్య – సంభాషణరూపంలో సాగిన కథనం. భార్యకి చదువు రాకపోతే, రాజకీయబంధితుడుగా జైలులో ఉన్న భర్తతో కబుర్లు చెప్పుకోడానికి వీలు ఉండదు. తమ్ముడిచేత ఉత్తరాలు రాయించినా స్వేచ్ఛగా మనసు విప్పు చెప్పుకోడం సాధ్యం కాదు కదా. మొదట్లో “నాకెందుకు చదువు? నేనేమి కచేరీకి బోవలెనా?” అని వాదించిన భార్య కథ పూర్తయేవేళకి చదువుకోడానికి సుముఖురాలవుతుంది. ఆ రోజుల్లో స్త్రీలకి చదువు అఖ్ఖర్లేదని చెప్పేవారి వాదనలన్నీ ఈకథలో కనిపిస్తాయి. ఆ కారణాలు తెలుసుకోడానికైనా ఈ కథ చదవాలి.

ధనత్రయోదశి – కథలో ఈనాడు మంచికథకి ఉండవలసిన లక్షణాలు – ఎత్తుగడా, సంఘర్షణా, ముగింపూ, పాత్రచిత్రణా – వంటి కథాంగాలన్నీ పటిష్ఠంగా చోటు చేసుకున్నాయి ఈకథలో.

సూక్ష్మంగా కథ – ఆర్థికంగా చితికిపోయిన వెంకటరత్నము చిన్నగుమాస్తాగా ఒక సెట్టికొట్లో పని చేస్తుంటాడు. దీపావళీపూట ఇద్దరు పిల్లలకి బాణాసంచా కొనడానికి డబ్బు లేదు. కడుపునిండా మంచి భోజనమయినా లేదే అని బాధ పడుతుంటాడు. అతనిదిగులు ఆసరా చేసుకుని పెద్దగుమాస్తా కృష్ణమూర్తి సెట్టికి చెప్పకుండా వందరూపాయలు తీసుకోమని అతన్ని ప్రోత్సహించి, బలవంతంగా అతనిజేబులో ఆ నోటు కుక్కుతాడు. వెంకటరత్నం అర్థమనస్కంగా తీసుకున్నా, అలా తీసుకున్నందుకు బాధ పడతాడు. భార్య విజయలక్ష్మి సంగతి తెలుసుకుని, డబ్బులేకపోయినా ఆత్మగౌరవంతో బతుకుతున్నామనీ, తమకి అదే సంపద అనీ చెప్పి, ఆ డబ్బు తిరిగి సెట్టికి ఇచ్చిరమ్మంటుంది. వెంకటరత్నం సెట్టికి డబ్బు ఇచ్చేసి జరిగినసంగతి చెప్పి, క్షమాపణ వేడుకుంటాడు. సెట్టి అతని నిజాయితీని పరీక్షించడానికి తానే అలా చేసేనని చెప్పి, అతనికి జీతం పెంచి, ఆ దంపతుల్ని సత్కరించి పంపుతాడు.

నాఅభిప్రాయంలో నమ్మదగ్గ దిద్దుబాటు కథ ఇదీ. ఈ కథలో జరిగింది చిన్న దొంగతనం. భర్తకి తాను తప్పు చేసేనన్న బాధ ఉంది. ఆ సమయంలో భార్య చెప్పిన మాటలు విని ఆ తప్పు దిద్దుకోడానికి అంగీకరించడం నమ్మదగ్గదిగా, వాస్తవానికి దగ్గరగా ఉంది.

చిన్న సమస్యలు పరిష్కారమయినంత తేలిగ్గా పెద్ద సమస్యలు పరిష్కారం కావు. సంఘర్షణా, పరిష్కారానికి అవుసరమయిన సన్నివేశాలూ కూడా సమస్యకి తగినస్థాయిలో ఉన్నప్పుడే కథ రాణిస్తుంది. చిన్నసమస్యలు మాటలతో పరిష్కారం అయిపోవచ్చు. పెద్ద సమస్యలు ఆవిష్కరించినప్పుడు పరిష్కారానికి మార్గం అంత బలంగానూ ఉండాలి.

అచ్చమాంబగారు ప్రధానసమస్యని పరిచయం చెయ్యడంలో, తదనుగుణంగా వాతావరణం, సన్నివేశాలూ చిత్రించడంలో, వర్ణనలలో చెప్పుకోదగ్గ ప్రతిభ చూపించారు ఈకథలో.

భార్యాభర్తల సంవాదము – మొత్తం పది కథల్లోనూ ఇది పసలేని కథగా అనిపించింది నాకు. ఇందులో భార్య భార్యని పుస్తకాలు చదవమంటాడు. ఆవిడ నగలు కావాలంటుంది. ఆవిడకి నగలు ఉన్నాయని చెప్పి, అవేమిటంటే, “వినయము, నమ్రత, లజ్జా, సుశీలత, శాంతము, సత్యము, దయాళుత్వము, పరోపకారచింతనము” అంటాడు. పురుషులకు కూడా ఇవి అవుసరమేనని చివరికి అన్నా, ఈకథ చదివినప్పుడు వీరేశలింగంగారి సతీధర్మాలు గుర్తుకి రాకమానవు. అచ్చమాంబగారు ఈకథ 1903లో రాశారు. మరి అంతకు పూర్వమే ధనత్రయోదశి లాటి కథలు రాసిన రచయిత్రి ఇంత నీరసమయిన కథ ఎందుకు రాసేరు అంటే చెప్పలేం. నాఊహకి తట్టింది ఏమిటంటే, ఆ కాలపు ఆలోచనలు, హిందూసుందరి పత్రికవారు రాయమని అడిగితే, రాసేరేమోనని. పత్రికలలో ఇలాటివి జరగడం ఉంది కదా. ఇలాగే జరిగి ఉంటుందని నేను అనడంలేదు. ఇది ఒక ఆలోచన మాత్రమే.

అద్దమును, సత్యవతియును – మూడేళ్లు వెళ్ళని సత్యవతి అద్దంలో తన ప్రతిబింబం చూసి, మరొక పాప అని భ్రమ పడి, కన్నులతోనూ, మూతితోనూ వెక్కిరిస్తుంది. ఆ అద్దములో చిన్నది “వెనకంజ వేయక, సత్యవతి చేష్టలన్నియు తానును చేయుచు సత్యవతికోపము అధికము చేసింద”ట. సత్యవతి వెళ్ళి ముత్తవ్వతో చెప్తుంది, “ఎవరో చెడ్డపిల్ల మనమేడమీదికి వచ్చి నన్ను వెక్కిరించుచున్నది” అని. ఆవిడ మేడమీదికి వచ్చి, చూసి, అది అద్దమని చెప్పి, “మొట్టమొదట నీవు వెక్కిరించితివో, లేక ఈ చెడ్డపిల్ల వెక్కిరించెనో చెప్పుము” అని అడుగుతుంది. సత్యవతి “ఏమో, నాకేమి జ్ఞాపకము లేదు” అంటుంది.

ముత్తవ్వ “నీవే చేస్తివి … ఇప్పుడు నీవాపిల్లను జూచి నవ్వుము. ఆపిల్ల నవ్వునో లేదో చూతము” అని చెప్తుంది. సత్యవతి నవ్వుతుంది. అద్దంలో పిల్ల కూడా నవ్వుతుంది.

సత్యవతి పెద్దదయి, గృహిణి అయినతరవాత కూడా ఈ చిన్ననాటి అద్దపుమాట మరిచిపోదు. తనఅనుభవములు మూలంగానూ, ముత్తవ్వమాటలమూలంగానూ “ఈ జగమంతయు నొక యద్దమనియు, దానివేపున మనము  కోపముగా జూచిన కోపముగా, సంతోషముగా దానిం గనిన ప్రతిబింబము సంతోషముగా కనిపించును అని గ్రహించి తాను పాటించడమే కాక ఇతరులకు కూడా భోధించును” అన్న ముక్తాయింపుతో ఈకథకి అందం వచ్చింది. ఒకరకంగా ఈనాటి “వ్యక్తివికాసం కథ” అని కూడా అనుకోవచ్చు.

బీదకుటుంబం. – మహారాష్ట్రలో గోధుమలు, జొన్నలు, సజ్జల పిండితో రొట్టెలు చేసుకుంటారు. బీద స్త్రీలు ధనవంతులయిళ్ళలో పిండి విసిరి, ఆ ఆదాయంతో సంసారాలు నడుపుకుంటారు. అలాటి ఒక స్త్రీ జీవితం ఈ కథ. ఇది జరిగినకథ అని రచయిత్రి మొదట్లోనే చెప్పేరు.

స్వల్ప ఆదాయం గల భర్త చనిపోయినతరవాత రాత్రింబవళ్ళు పిండి విసిరి ఆరుగురు పిల్లల్ని పోషించి, చదివించి, పెద్దవాళ్ళని చేస్తుంది ఒక బీద స్త్రీ. ఈకథలో ప్రధానంగా ఆ స్త్రీకి గల ఆత్మగౌరవాన్నీ, పిల్లలకి కూడా అదేవిధమైన సంస్కారాన్ని అలవరుస్తూ వారిని పెంచి పెద్ద చేసిన తీరూ బలంగా ఆవిష్కరించేరు రచయిత్రి. ఇలాటి కథలు మనం నిత్యజీవితంలో వింటూనే ఉంటాం.

కథనం విషయంలో మొదట చెప్పుకోవలసింది భాష. నేను ఈకథలమీద అభిప్రాయాలు ఆహ్వానించేను. ఇద్దరు ఒకటి, రెండు కథలు మాత్రం చదివేం, చదవడం కష్టంగా ఉంది అన్నారు. లలిత జి. అభిప్రాయం మీరు ముందు టపాలో చూసే వుంటారు. ఆ టపాకి వ్యాఖ్యలు కనిపించకపోయినా, దాదాపు 600 హిట్స్ తగిలేయి. మరి ఎంతమంది కథలు చూసేరో నాకు తెలీదు.

కానీ నేను అనుకోడం ఈకథలు ఆనాటి సాంఘిక, సాహిత్యపరిస్థితులకోణంలోనుండి చూడాలి. ఎందుకంత కష్టపడి చదవడం అంటే నేను చెప్పలేను. నాకు ఎందుకు చదవాలనిపించిందంటే, ముందే చెప్పినట్టు అచ్చమాంబగారికి రచయిత్రిగా ఇవ్వవలసిన గౌరవం ఈనాటి విమర్శకులు ఇచ్చారా లేదా అన్న ప్రశ్నకి సమాధానం తెలుసుకోడానికి.

ఈ కథల్లో 19వ శతాబ్దం చివరి దశకంలోనే ఆధునికభావాలకి నాంది పలకడం కనిపిస్తోంది. పిల్లలపెంపకం విషయంలో, స్త్రీల వ్యక్తిత్వాలు బలమైనవిగా, ఆత్మగౌరవం గలవారిగా చిత్రించడంలో, స్త్రీవిద్య జ్ఞానసముపార్జన, మానసికవికాసం కోసం అని స్పష్టీకరించడంలో – ఈనాడు మనకి ఆదర్శమయిన ఎన్నో ఆలోచనలు ఈకథల్లో కనిపిస్తున్నాయి. (స్త్రీవిద్య, భార్యాభర్తలసంవాదం). ముఖ్యంగా స్త్రీవిద్యలో అచ్చమాంబగారి భావాలు వీరేశలింగంగారి అభిమతానికి పూర్తిగా భిన్నమయినవి. ఆయన స్త్రీలు పతివ్రతాధర్మాలు పఠించి ఆచరించాలి అంటే అచ్చమాంబగారు స్త్రీలు విజ్ఞానవతులు కావడానికీ, ఆత్మవికాసానికీ, తమ వ్యక్తిత్వాలని పరిపుష్టం చేసుకోడానికీ చదువుకోవాలంటున్నారు. ఇక్కడ వీరేశలింగంగారికంటే మరో అడుగు ముందుకి వేయడం కనిపిస్తుంది. సుఖమైన, సారవంతమైన వైవాహికజీవితానికి భార్యాభర్తలిద్దరిలో సామరస్యం కావాలన్న ఆలోచన కనిపిస్తుంది. (ప్రథమకలహం).

అచ్చమాంబగారి శైలి – కొన్ని కథల్లో ఒకొక సన్నివేశం వర్ణించినతీరు ప్రతిభావంతంగా ఉంది. సుగుణవతి యగు స్త్రీ కథలో అమ్మాయి “ముఖమర్థ చంద్రునిబోలి ఎంతయు మనోహరముగా నున్నది” అనుకుంటాడు అబ్బాయి. సామాన్యంగా మనం అందమైన ముఖాన్ని పూర్ణచంద్రునితో పోలుస్తాం. అర్థచంద్రుడు అంటే నెలవంక అనుకుంటాను, దానిఅందం వేరు. మొహం నెలవంకలా ఉంటే అందంగా కనిపిస్తుందా? అంటే ప్రతీత్మకంగా అని చెప్పుకోవాలి. అర్థచంద్రుని చూచినప్పుడు మనకి ఎటువంటి ఉల్లాసం మనసులో కలుగుతుందో ఆ బాలికను చూచినప్పుడు శక్తికుమారుడికి అటువంటి ఉల్లాసం కలిగిందని తాత్పర్యం. కష్టపడి పని చేసి జీవితాన్ని సుఖవంతం, ఫలవంతం చేసుకోవాలన్న ఆలోచన కూడా నిర్ద్వందంగా వాచ్యం చెయ్యడం చూస్తాం సత్పాత్రదానం కథలో.

ఇకపోతే, ఈనాటిపాఠకులకి కొరుకుడుపడని భాష – మనకిప్పుడు ఇది గ్రాంథికమే అయినా ఆనాటి రచనలకి భిన్నమయినది కాదు. మనకి ఈనాడు అర్థం కాని పదాలు కూడా ఇందులో అక్కడక్కడా తగిలినా, మొత్తంమీద కథ అర్థం కానంత కఠినమయినవి కావు.

కథలలో వర్ణనలు అంటే ప్రకృతి వర్ణనలు అన్న అర్థంలో కాబోలు సుజాతారెడ్డిగారు ఒక్కకథలో మాత్రమే వర్ణన ఉంది అన్నారు కానీ ఈకథల్లో సన్నివేశాలు ఆవిష్కరించడంలో అచ్చమాంబగారు విశేషమయిన ప్రతిభ చూపేరు. ధనత్రయోదశి లో దీపావళి వేడుకలు, ఇంట్లో విజయలక్ష్మి బాధ, వెంకటరత్నము సందిగ్ధావస్థ, లలితా శారదలూ, అద్దమునూ సత్యవతియూ – కథల్లో పిల్లల మనస్తత్త్వాలూ కళ్ళకి కట్టినట్టు చిత్రించేరు.

చిన్నచిన్న దోషాలు – పాత్రలపేర్లు రెండు మూడు రకాలుగా ఉండడంలాటివి ఉన్నాయి. అవి నిజానికి ఈరోజుల్లో కూడా చూస్తున్నాం. కావలిస్తే, రామారావుగారి యజ్ఞం చూడండి. ఎర్రి, ఎర్రెమ్మ, ఎర్రక్క … లాంటివి కనిపిస్తాయి. మనసంస్కృతిలో ఇది ఉంది. జానపదసాహిత్యంనిండా ఇలాటి ప్రయోగాలు కోకొల్లలు. అయితే ఇవి ఇప్పుడు మనని బాధిస్తే, ఎందుకు బాధిస్తున్నాయి అంటే ఇంగ్లీషు సాహిత్యంమూలంగా మనకి అలవాటయిన ధోరణి అనే చెప్పుకోవాలి. ఇంగ్లీషుపండితులు మనకి చెప్పేరు వస్త్వైక్యత, సమయయైక్యత లాగే, పేర్లలో కూడా ఐక్యత కావాలి అని.

ఈకథలకి తన పరిచయంలో సంగిసెట్టి శ్రీనివాస్ అచ్చమాంబగారి కథలు రెండు ప్రేమపరీక్షణము, ఎరువుసొమ్ము పరువుచేటు అన్నవి 1989లోనే ప్రచురితమయేయని రాసేరు. ఆదృష్టితో చూస్తే, ఆమె రచనాకాలం సుమారు పదేళ్లు సంవత్సరాలు మాత్రమే. లభ్యమయిన 10 కథలు ఆధారంగా ఆమె రచనావైదుష్యం అంచనా వేయడం తేలికా కాదు, న్యాయమూ కాదు. అయినా తప్పదు.

“తెలుగుకథకు పునాది భండారు అచ్చమాంబ” అన్న శీర్షికతో సంగిసెట్టి శ్రీనివాస్‌గారు విపులంగా తెలుగుకథాచరిత్రలో అచ్చమాంబగారి స్థానం ఆవిష్కరించేరు. కథాచరిత్రమీద ఆసక్తి ఉన్నవారు తప్పక చదవలసిన పరచయం ఇది.

డా. ముదిగంటి సుజాతారెడ్డిగారు తమ “తెలంగాణా అందించిన తొలి తెలుగుకథలు” (ముందుమాట)లో అచ్చమాంబగారు తెలంగాణాభాష వాడడంచేతా, ఆమె కొంతకాలం తెలంగాణాలో ఉండడంచేతా ఆమెని తెలంగాణా రచయిత్రిగా గుర్తించేరు. ఉదాహరణలుగా కథల్లో తెలంగాణా పదాలు ఎత్తి చూపేరు. నాకు భాషాశాస్త్రంలో అట్టే ప్రవేశం లేదు కానీ “పోవు” అన్న క్రియ “వెళ్ళు” అన్న అర్థంలో చిత్తూరుజిల్లాలో కూడా వాడతారు. అలాగే “పొట్ట పోషించుకొను” అన్న ప్రయోగం విశాఖప్రాంతాల్లో కూడా సర్వసాధారణం. పొట్ట పొడిస్తే అక్షరప్ముక్క లేదు అన్న సామెత తరుచూ వింటుండేదాన్ని నా చిన్నప్పుడు :). అంతకంటే ముఖ్యంగా ఆలోచించవలసినది పదప్రయోగాలూ, కొంతకాలం జీవించడం కారణంగా రచయితని ఒకప్రాంతం రచయితగా గుర్తించడం న్యాయమేనా అన్నది.

నా అభిప్రాయంలో ఒక రచయిత ఆ ప్రాంతపు సంప్రదాయాలూ, ఆచారాలూ విస్తృతంగా చర్చిస్తూ, ఆప్రాంతాన్ని తన ప్రాంతంగా ప్రకటించుకున్నప్పుడే అలాటి వాదన సమర్థనీయమని. ఉదాహరణకి నాతెలంగాణా కోటిరత్నాలవీణ అని దాశరథిగారు రాయడంచేత ఆయనకి తెలంగాణాయందున్న ప్రత్యేకాభిమానం తెలుస్తుంది కనక ఆయన్ని తెలంగాణాకవి అనడం సబబు. ఇలా ఆలోచిస్తే, అచ్చమాంబగారు ప్రత్యేకించి ఒక ప్రాంతాన్ని అభిమానించినట్టు కనిపించదు. ఆమె కృషి, సాంఘికసేవ, పర్యటనా, ఉపన్యాసాలు – ఇవన్నీ గమనంలోకి తీసుకున్నప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్లు ఆమెని ఒక ప్రాంతానికి పరిమితం చేయలేము అన్నవాక్యమే నాకు కూడా సమర్థనీయంగా కనిపిస్తోంది.

(ఫిబ్రవరి 7, 2011)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “భండారు అచ్చమాంబగారి కథల్లో ఏముంది?”

 1. పింగుబ్యాకు: మహిళావరణం – 1 « sowmyawrites ….
 2. లలితా, నిజం చెప్పొద్దూ, నాకు నా చిన్నతనంలో ఇలాటి అవకాశాలు లేవు. బహుశా ఆకాలం చదువు తీరు అదీ. అంతే. మీ అభిప్రాయాలకోసం ఎదురు చూస్తున్నాను.

  మెచ్చుకోండి

 3. ఒక చిన్న గమనిక:
  క్రిందటి నా వ్యాఖ్యలో టీచర్లను తప్పు పట్టడం లేదు.
  ఆంగ్లం curriculum ఉండడమే ఆ విధంగా ఉండేది.
  నేను బడి మారడం, బోర్డు మారడం కూడా ఒక కారణం.

  మెచ్చుకోండి

 4. మాలతి గారూ,
  Thanks.
  చిన్నప్పుడు ఆంగ్లం చదువుకున్నట్టు (టీచర్లు చదివించినట్టు) తెలుగు విషయంలో జరగలేదన్న నా చింతకి కొంత ఊరట కలిగింది.
  చక్కటి కథలూ, మంచి పరిశీలనతో మీరు అందిస్తున్నారు, నా లాంటి వారిని ఆలోచింప చేస్తున్నారు.
  మీరు ముందే చెప్పినట్టు ముచ్చటగా ఉన్నాయి కొన్ని కథలు. పిల్లలకు చాలా బావుంటాయి.
  ఆ ఆలోచనలు వివరంగా మీతో పంచుకుంటాను త్వరలో.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s