మార్పు 9

శ్రీదేవి మాటలే నామనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. ఒక మనిషి మరొక మనిషిని ఎందుకు బాధిస్తాడు, నేను ఆమనిషిని బాధ పెడుతున్నాను, ఎదటివాడి నొప్పి నాకానందం” అన్న స్పృహతో చేస్తాడా? లేక యాదృచ్ఛికంగా జరుగుతుందా బాధించడం అన్నది? అవతలివాడు బాధ పడుతున్నాడు అని తెలిసినతరవాతనయినా తన ప్రవర్తన మార్చుకుంటాడా? …

తలుపు తట్టిన చప్పుడయి, తలెత్తి చూశాను. ఎవరో అమ్మాయి. 18 ఏళ్ళుంటాయేమో…

ఎవరు అన్నట్టు చూశాను.

“నేను అరవిందనండీ. మాఅమ్మమ్మ మీకు ఈపుస్తకం ఇవ్వమంది,” అంది ఆ అమ్మాయి.

“ఓ, అరు! … సారీ, వెంటనే గుర్తు పట్టలేకపోయేను,” అన్నాను పుస్తకం తీసుకుంటూ.

“ఫరవాలేదండీ,” అంది అరు కానీ వచ్చినపని అయింది, ఇహ వెళ్ళొచ్చు అన్నఛాయలు లేవు ఆ మొహంలో.

“రా. కూర్చో.” అన్నాను.

ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నట్టు అరవింద వచ్చి, సోఫాఅంచున నాకు కాస్త ఎడంగా కూర్చుంది.

నాకు ఏం మాటాడాలో తోచలేదు, “నువ్వు చదివేవా?” అన్నాను పుస్తకం తిరగేస్తూ.

“చదివేనండీ,” అంది నెమ్మదిగా.

“తెలుగు బాగా మాటాడుతున్నావే,”

“నాచిన్నప్పుడు కొంతకాలం మాఅమ్మమ్మతో ఇండియాలోనే ఉన్నాను. తరవాత ఆవిడ ఇక్కడికి వచ్చినా తెలుగే మాటాడ్డంతో నాకూ ఆ అలవాటు అలా ఉండిపోయింది.”

మళ్ళీ నిశ్శబ్దం.

“కాఫీ తాగుతావా?”

“ఇప్పుడొద్దండీ. ఇంట్లో తాగే వచ్చేను.”

సంభాషణ కుంటుతోంది. కానీ ఆ పిల్ల కదిలే సూచనల్లేవు. ఆ పుస్తకం నెపం పెట్టుకు ఇంకేదైనా మాటాడ్డానికొచ్చిందేమో అనిపించింది నాకు … విషి విషయమేమో … ఎలా అడగను? ఇక్కడ పిల్లల్ని సొంతవిషయాలు అడిగితే మాట దక్కదు.

ఆలోచిస్తూనే నెమ్మదిగా “హైస్కూలు అయిపోతుంది కదా ఈయేడుతో. కాలేజీలకి అప్లై చేస్తున్నావా?” అన్నాను. ఈపిల్ల కాలేజీచదువుకీ తాను వదిలేసిన, కనీసం వదిలించుకున్నాననుకుంటున్న విషికీ ఓ బీరకాయపీచు సంబంధం ఉంది. ఊరు వదిలి మరో కాలేజీకి వెళ్తోందంటే, ఆకాలేజీకే విషి కూడా ప్రయాణమవుతాడా అన్నది ఒక యక్షప్రశ్న. ఈసంగతి నాకు సిరి చెప్పింది. అది అరవిందకి కూడా తెలుసు. చూశారా చిక్కులు … సిరి చెప్పినప్పుడు నాకెంత నవ్వొచ్చిందంటే, విషి నాన్న కూడా ఇక్కడ ఉద్యోగం వదిలేసి ఆఊరికి మారతాడా అని అడిగేను. అంతటివాడే అంది సిరి కూడా నవ్వుతూ. ఆమాట గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకున్నాను.

“ఎందుకు నవ్వుతున్నారు?”

“ఏం లేదులే, ఏదో ఆలోచిస్తూ … ఇంతకీ ఎక్కడికి అప్లై చేస్తున్నావు?”

“మాఅమ్మ షికాగోకో, మిషిగన్‌కో అంటోంది. వారం వారం ఇంటికొచ్చేయొచ్చనీ. నాకు పెద్ద కాలేజీలకి వెళ్ళాలని లేదు. మరో పక్క … నాకంతా గందరగోళంగా ఉంది. …” అరవింద ఆగిపోయింది. అసలు పాయింటుకి వస్తోంది.  “విషి కూడా అక్కడికే ప్రయత్నిస్తున్నాడు.”

“ఇంత పెద్ద దేశం. లక్షల్లో కాలేజీలు. పోనీ, ఉన్న ఊళ్ళోలోనే చెయ్యకూడదా అండర్‌గ్రాడ్?” అన్నాను నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం వినియోగించి.

“ఏమోనండీ. నాకు కొత్త ఊరూ, కొత్తపరిసరాలూ చూడాలని కూడా ఉంది. ఇక్కడ విసుగేస్తోంది.”

నాకు ఇవన్నీ కొత్త. నాచదువంతా ఆరోక్లాసు తరవాత ఏడూ, తొమ్మిది తరవాత పదీ, హైస్కూలయిం తరవాత కాలేజీ … అలా ఏటవాలుగా, గాలివాటుగా సాగిపోయిందే కానీ ఇన్ని ఆలోచనలు లేవు. నేను కూడా వీళ్ళలా ఆలోచించుకుని ఉంటే ఎలా ఉండేదో … …

“Love does not bind, not hold on; love liberates అంటారు మాయా ఏంజెలో.”

నేను తెల్లబోయేను ఒక్కక్షణం. మరుక్షణం గుర్తొచ్చింది నాఅనుమానం. సందేహంలేదు. ఏదో మాటాడ్డానికే వచ్చిందీ అమ్మాయి.

“అలాగా? నేను వినలేదు,” అన్నాను.

“నాక్కూడా మొదట ఆశ్చర్యంగానే అనిపించింది. ప్రేమ అంటే తాను ప్రేమిస్తున్నమనిషిని కట్టిపడేయడం కాదు. తనబతుకు తాను బతకడానికి అవకాశం ఇవ్వడం అని. కానీ Shakespeare లాటి మహామహులంతా ప్రేమంటే ఇద్దరూ ఒకరికొకరు చుట్టుకుపోయి, ఏకలతగా జీవితాలు సాగించడం అనే కదా నూరి పోస్తున్నది మనకి.”

ఇంకా ఏమంటుందో అని చూస్తున్నాను.

“బహుశా, ఇద్దరూ ఒకేరకం ఆశలూ, ఆశయాలూ, కోరికలూ గలవారైతే, ఒకరి సాన్నిధ్యం రెండోవారికి ఎదగడానికి ఉపయోగపడేదయితే ఇద్దరూ కలిసిఉండొచ్చునేమో. లేకపోతే, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు ఎదగడానికి అవకాశం లేకపోయినా, ఆ వ్యక్తిని రెండోవారు కబంధహస్తాలతో కౌగిలించుక్కూచుకుండా బయటికి పోనివ్వాలి అనేమో. అంటే ఆ వ్యక్తి తనకి కావలసినరీతిలో ఎదగడానికి అవకాశం ఏర్పాటు చెయ్యాలి నిజంగా ప్రేమ ఉంటే.”

నాకు నోట మాట రాలేదు. ఇంత చిన్నపిల్ల ఇంత లోతుగా విశ్లేషిస్తూ మాటాడ్డంతో విస్తుపోయేను. ఆ వాక్కులు ఆ అమ్మాయి తనపరిస్థితికి అన్వయించుకుంటోందేమో అని కూడా అనిపించింది. మౌనంగా వింటున్నాను.

“ఏమోలెండి. ఇలాటివి మాటాడ్డం సుళువే. నాకు ఆ విషీవాళ్ళతో మహ చిరాగ్గా ఉంది,” అంది పొడిగిస్తూ.

“ఏం?” అన్నాను. ఏమయింది అని సూటిగా అడగలేక.

అప్పడు చెప్పింది నడుస్తున్న కథ – అతనితో బ్రేకప్ అయేక, విషీ ఒక వారంరోజులు ఊరుకున్నాడు కానీ  ఆ తరవాత రకరకాలుగా తనని ఇరుకున పెడుతున్నాడు – తాను ఎక్కడికెళ్తే అక్కడికి రావడం, కాఫీకో టీకో రమ్మంటూ పిలవడం … … వాళ్ళనాన్న కూడా “మాఅబ్బాయి నీతో డేటింగ్‌కి ముందు, ఎంతో హుషారుగా ఉండేవాడు. అన్నిట్లో ఏ తెచ్చుకున్నాడు. ఇప్పుడు నీగొడవలో పడి మిగతావన్నీ నిర్లక్ష్యం చేస్తున్నాడు. వాడిబతుకు నాశనం చేశావు. తల తిరుక్షవరం చేయించుకున్నాడుట. మనవాళ్ళు తల్లో తండ్రో చనిపోయినట్టు. ఇదంతా నీనించే …” అంటూ పోరుతున్నాడుట. అంతేకాదు, మళ్ళీ నువ్వే వచ్చి అతన్ని మళ్ళీ మనలోకంలో పడేలా చెయ్యమంటూ విసుర్లూ, కసుర్లూనుట. అందులో కాంట్రడిక్షను ఆయనకీ తెలీడంలేదు. నాకూ తెలీడం లేదు. నావల్ల మరి విషికి మేలు జరుగుతోందా? కీడు జరుగుతోందా?” అంది వెల్తిగా నవ్వుతూ.

నాకు అయ్యో అనిపించింది కానీ నేను చెయ్యగలిగిందేముంది.

“నువ్వన్నట్టు ప్రేమ అంటే రెండోమనిషిని ఎదగనివ్వడమే అన్నది బాగుంది,” అన్నాను.

“నేను కాదండీ. మాయా ఏంజెలో అన్నారు,” అంది. ఆ స్వరంలో రవంత విచారం ధ్వనించింది. తాను అంత గొప్పవాక్యాలు చెప్పలేనందుకో, ఆ వాక్యాల్లోని భావం ఆచరణలో ఎంత కష్టసాధ్యమో గుర్తు చేసుకునో.

“ఏంజెలోకి 17 ఏళ్ళప్పుడు కొడుకుతో ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నప్పుడు ఆవిడకీ తల్లికీ మధ్య జరిగిన సంభాషణ గొప్పగా ఉంది. చూడండి –

“అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను.”

“అమ్మాయీ, ఈ ఇంట్లోంచా?”

“అవును, ఈ ఇంట్లోంచే.”

“ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతావా?”

“అవును. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నాకు పని దొరికింది. అక్కడ వంట చేసుకోడానికి సౌకర్యం ఉంది. ఆ ఇంటావిడ పాపని చూసుకుంటానంది.”

“సరే. వెళ్ళు. నేను నిన్ను అడ్డుపెట్టను. వెళ్ళు. నువ్వంటే నాకు ప్రేమ కనకనే నిన్ను పోనిస్తున్నాను. నీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు రావొచ్చు.”

అది చెప్పి, మాయా అంటారు, “ఆతరవాత నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా, ఓ వచ్చావా అంటూ ఎంతో సంతోషంగా ఆహ్వానించింది కానీ ఒక్కసారి కూడా నేను చెప్పానా అనలేదు.”

అరవింద గుక్క తిప్పుకోడానికన్నట్టు ఆగింది.

నాకు ఏం చెప్పాలో తోచలేదు. ఇలాటి సందర్భాల్లో తెలుగుమాటలు లేవు. మనసంప్రదాయంలో బాగుంది అంటాం. నాకు అది చాలదనిపించింది. “That’s beautiful,” అన్నాను.

అరవింద మరో అరగంట ఉంది. మాయా ఏంజెలోగురించి తను సేకరించిన సమాచారం అంతా చెప్తోంది. ముఖ్యంగా వాక్కు శిలీముఖంలా ఎంత పదునైనదో మాయా ఏంజెలో మాటల్లో అరవింద చెప్పినవి నాకు గట్టిగా తగిలేయి. మాయా మాటల్లో –

మాటలు చాలా బలమైనవి. నాకు ఏడేళ్ళప్పుడు మాఅమ్మ బాయ్‌ ‌ఫ్రెండ్ నన్ను రేప్ చేశాడు. అది ఇంట్లో ఎవరికి చెప్పినా వాళ్ళు అతన్ని హింసిస్తారని చెప్పలేదు. మాఅన్న బెయిలీ అంటే నాకు దైవమే. అంచేత అతనికి చెప్పేను. అతను ఇంట్లో చెప్పేడు. వాళ్ళు పోలీస్ రిపోర్టు ఇచ్చేరు. పోలీసులు అతన్ని ఒక పగలు, ఒక రాత్రి జెయిల్లో పెట్టి వదిలేశారు. ఆతరవాత ఇద్దరు పోలీసులు నీలం సూట్లలో వచ్చి చెప్పేరు ఎవరో ఆ బాయ్ ఫ్రెండుని కాళ్ళతో కుమ్మి చంపేశారు. అప్పుడు నాకనిపించింది. నేను హంతకురాలిని. ఏడేళ్ళ నల్లజాతి నాట్జీని. నామాటవల్ల అతను చనిపోయేడు. నేను మాటాడకపోతే ఇది జరిగేది కాదు.

ఆతరవాత మాయా ఏంజెలో ఆరేళ్ళపాటు మాటాడలేదు. మాటలు జాగ్రత్తగా వాడాలి అంటారామె.”

నాకు మనసు బరువెక్కింది. అంతటి ఘోరం జరిగినందుకో, ఆ అనుభవానికి ఆమె చెప్పుకున్న భాష్యంమూలంగానో, ఆ సంఘటన అరవిందమీద అంతటి బలమైన ముద్ర వేయగలగడమో .. నాకే తెలీదు. నాకు కూడా అదొక ఘనమైన సత్యం.

మరో పావుగంట కూర్చుని అరవింద “వెళ్తానండీ,” అంటూ లేచింది.

“అప్పుడప్పుడు వస్తూ ఉండు,” అన్నాను.

“నిజంగా రావొచ్చా?” అంది అరు.

“నిజంగానే. ఈ పుస్తకం చదివేనంటున్నావు కదా. నేను కూడా చదివేక మాటాడుకుందాం దీన్నిగురించి.” అన్నాను నేను కూడా లేచి గుమ్మంవరకూ నడుస్తూ.

చాలాసేపు “మాట పదును” గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఒకరు మరొకరిని ఎందుకు బాధిస్తారో అనుకుంటూ మొదలు పెట్టేను కానీ ఇప్పుడు మరో ఆలోచన వస్తోంది. ఒకరు మరొకరిని ఎందుకు బాధిస్తారో తెలీదు కానీ నేను మరొకరిని నామాటలతో బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించవచ్చు కదా. అంటే పని గట్టుకు నామాటలతో మరొకరిని బాధ పెడుతున్నానని కాదు కానీ నేను ఆలోచించకుండా అన్న మాటలమూలంగా మరొకరు బాధ పడే సమయాలు ఉన్నాయనే అనిపిస్తోంది వెనక్కి తిరిగి చూసుకుంటే. ఆ సంఘటనలు నాకు గుర్తొస్తున్నాయిప్పుడు!

అరవింద ఇచ్చిన మరో వాక్యం – మాయా ఏంజెలోదే – గుర్తొచ్చింది. “If you cannot make a change, change the way you think. Maybe you will find a solution.” అవును, నేను ఆలోచించే తీరు మార్చుకోవాలి.

Maya Angelou ఇంకా ఏం చెప్పారో తెలుసుకోవాలనిపించింది. అంతర్జాలంమీద పడ్డాను అరవింద చెప్పిన ఇంటర్వూ దొరుకుతుందేమో చూడ్డానికి.

తా.క. సత్యవతిగారి కోరిక లేక సూచననుసరించి ఇక్కడ లింకులు ఇస్తున్నాను. ఈలింకులు ఓపెన్ కాకపోతే, మీకు కావలిస్తే,

ఆ ఇంటర్యూ ఆడియో పంపగలను.

http://www.tudou.com/programs/view/i9bwAfwuYyg/#

http://www.youtube.com/watch?v=y2gTlDze4Q8

మాలతి

 

(ఫిబ్రవరి 13, 2011.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “మార్పు 9”

 1. లలితా, Valentine’s day యాదృచ్ఛికంగానే జరిగింది. నిజమే. అలా నిస్వార్థంగా ప్రేమించడం అంత తేలిక కాదు. ఆమెలాటి ఉత్తములకే చెల్లుతుందనుకుంటా.
  సత్యవతిగారూ, మీకు కూడా మాయా ఏంజెలో నచ్చిందంటే సంతోషంగా ఉంది. లింకులు పైన టపాలో ఇస్తున్నా. ఆడియో చేశాను టీవీలో చూస్తున్నప్పుడు. కావలిస్తే పంపగలను విడిగా.

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ,
  నేను కూడా మాయా ఏంజెలోని చాలా ఇష్టపడతాను.మీకుగనక అంతర్జాలంలో ఆ ఫలానా ఇంటర్వ్యూ దొరికితే నాకు పంపిద్దురూ ..మార్పు 9 చాలా బాగుంది..విషికంటె అతని తండ్రి మరీ కంపరంగా వున్నాడు.

  మెచ్చుకోండి

 3. మీరు Valentine’s day కోసమే రాశారా?
  సందర్భం కలిసొచ్చింది.
  బావుంది.
  “Love does not bind, not hold on; love liberates”
  నిజం. మనని అలా ఎవరైనా ప్రేమిస్తే మన అదృష్టం.
  మనం, మనం ప్రేమించే వారిని అలా ప్రేమించ వచ్చని తెలుసుకున్నా మేలే.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.