తెలుగుకథ తీరుతెన్నులు – రెండోభాగం

(తొలిభాగం ఇక్కడ)

వీరేశలింగంగారి చివరిదశలో అంటే 1875లో పుట్టిన భండారు అచ్చమాంబగారు ఆయనరచనలతోనే ప్రభావితురాలయినా ఆయన ఉపదేశాలను యథాతథంగా స్వీకరించలేదు. ఆవిడ సృష్టించిన స్త్రీపాత్రలు బలమైన వ్యక్తిత్వాలు గలవి. కేవలం భర్తలసేవలకి అంకితమయినవారు కారు. పిల్లలని బుధ్ధిమంతులుగానూ, విద్యావంతులుగానూ తీర్చిదిద్దడమే కాక తప్పిదం చేసిన భర్తలతో మంచిచెడ్డలు వితర్కించి, వారిని సన్మార్గంవేపు, ధర్మవర్తన వైపు నడిపించినవారు. బహుశా ఇది ఈనాటి స్త్రీవాదనకి నాంది కావచ్చు. ఈ కథలగురించి మరింత విపులంగా తరవాత చర్చిస్తాను.

సంఘసంస్కరణభావాలు ప్రాతిపదికగా స్త్రీవిద్య, వితంతువివాహాలమీద కథలు 40లలో వచ్చేయి. వీరేశలింగంగారికాలంలోనే మొదలయిన మరొక అంశం వేశ్యల జీవితాలు. ఈవిషయంలో మార్పులు ఘనతరమయినవి. వీరేశలింగంగారికి పూర్వం కవులు – వేశ్యలు, దేవదేసీలు, కళావంతులు – ఏపేరు పెట్టినా – వారికి సాహిత్యంలో ఒక గౌరవస్థానం కల్పించేరు. వేశ్యలని గొప్ప కళాపోషకులుగా, సంగీత, నాట్యకళల్లో అభినివేశం కలిగిన విద్వాంసులుగా చిత్రించేరు.

వీరేశలింగంగారి కాలంలో ఆ దృష్టి మారింది. ఎవరితో మొదలయిందో తెలీదు కానీ వేశ్యలని సంఘద్రోహులుగా, కుటుంబవిచ్ఛిత్తికి కారణమయిన దుష్టులుగా చిత్రించడం మొదలయింది. కన్యాశుల్కంలాటి రచనల్లో వేశ్యని జాణలుగా చిత్రించినా కులస్త్రీకి సాటిగా చిత్రించినట్టు కనిపించదు. దానికి ప్రత్యామ్యాయంగానే కావచ్చు చలం కులస్త్రీలని వ్యభిచారిణులుగా చిత్రించడం. ఇది నాకు కలిగిన అభిప్రాయం మాత్రమే.

మళ్ళీ 40వ దశకంలో కొందరు రచయితలు వేశ్యలని విద్యావతులుగా, పండితురాళ్లగా చూపడం జరిగింది. అలాటిరచయితల్లో ప్రముఖంగా చెప్పుకోవలసినవారు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. ఆయనకథలు చదువుతుంటే మనకి వేశ్యావృత్తి ఒక గణనీయమయిన కళగానే భాసిస్తుంది. అయితే దీనికి కారణం రామకృష్ణశాస్త్రిగారికి సంప్రదాయంమీద గల అభిమానమా, వేశ్యావృత్తియందు గౌరవమా, వారికి స్వతస్సిద్ధంగా గల మానవీయకోణమా అంటే నిర్దుష్టంగా చెప్పలేను – అన్నీనేమో.

50 వ దశకం మొదట్లో, సరిగ్గా చెప్పాలంటే 1951 లో వచ్చిన మరొక పెద్ద మలుపు లత ప్రచురించిన గాలిపడగలూ నీటిబుడగలూ అన్న నవల.  చిన్నదే. 90 పేజీలు. కానీ ఈనవలతో లత తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా వేశ్యలని మామూలు మనుషులుగా – మీరూ, నేనూ, మరొకరూ – అందరిలాటి మనుషులే అని బలంగా ఎత్తి చూపడం జరిగింది. అంటే అంతవరకూ కొందరు రచయితలు వేశ్యలని కళావిశారదులుగానూ, మరికొందరు సంఘద్రోహులుగానూ చిత్రిస్తుంటే, లత ఆ రెండు కోణాలకీ భిన్నంగా, ఈ అమ్మాయిలు కూడా నీనాటి, నాలాటి మనుషులే, వాళ్ళు పడే హింస కూడా హింసే. వేశ్యలయినంత మాత్రాన వారిని క్రూరంగా హింసించాలని ఎక్కడా ఎవరూ శాసించలేదు, అంటూ మూడో కోణం, సిసలైన మానవీయ కోణం అవిష్కరించేరు. ఆనవల ఆనాడు తెలుగుదేశంలో తుఫాను రేపింది. అదంతా ఇప్పుడు చెప్పను కానీ నాపుస్తకంలో చర్చించాను.

ఇది కథాంశం విషయంలో ఒక గొప్ప మలుపు. నాకు తెలిసి తెలుగుకథా సాహిత్యచరిత్రలో ఇదే మొదటిసారి ఏ రచయిత గానీ వేశ్యలని సెక్స్ పేరుతో పెట్టే ఘోర హింసని ఇంత బాహాటంగా ఇంత స్పష్టంగా చిత్రించడం. అయితే ఆతరవాత మరెవరూ ఈ కోణాన్ని మళ్లీ తీసుకున్నట్టు కనిపించదు. 50,  60లలో కనుపర్తి వరలక్ష్మమ్మ, గుమ్మడిదల దుర్గాబాయమ్మవంటి రచయిత్రులు సంఘసేవాతత్పరులయినా వేశ్యలవిషయం వస్తువుగా స్వీకరించినట్టు కనిపించదు. మరో 30ఏళ్ళతరవాత అంటే 80వ దశకంలో స్త్రీవాదం తలెత్తేకే ఇలాటిరచనలు వచ్చేయనుకుంటాను.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వితంతువులస్థితి కుటుంబరావుగారు స్త్రీల ఆర్థికప్రతిపత్తి చిత్రించారు.

1950నాటికి రచయిత్రులసంఖ్య కనివిని ఎరగనిస్థాయిలో తెలుగుకథాచరిత్రలో మరొక శకాన్ని సృష్టించింది కథాచరిత్రలో. దీనికి బీజం పడింది వీరేశలింగంగారి కాలంలోనే. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినతరవాత, దేశపునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీవిద్య మరో ఊపు అందుకుంది. పత్రికలు ఒక ముఖ్యమయిన పాత్ర వహించేయి ఈ విషయంలో.

తరగతివారీగా మరో ముఖ్యమైన మార్పు. మనకి రాచరికాలూ, జమీందారీలు పోయేయి కానీ వస్తుతః ఆధిపత్యం పోలేదు. మనం ఇప్పుడు దాన్ని ప్రభుత్వం అంటున్నాం. అయితే మార్పు ఎక్కడ అంటే పూర్వకథల్లో రాజులని కీర్తించడం కనిపిస్తుంది ఇప్పుడు అధికారుల దుర్మార్గాలని గర్హిస్తున్నాం.

మధ్యతరగతి కుటుంబాలు, ఆకుటుంబాల్లో పరస్పరసంబంధాలూ, పెళ్ళిళ్లూ, ఆర్థికసమస్యలు, ఇవి 19వ శతాబ్దం చివరలోనూ 20 శతాబ్దపు తొలిదశకంలోనే కనిపిస్తుంది.

అచ్చమాంబమొదలు ఈనాటికీ రచయిత్రులకి మధ్యతరగతి స్త్రీలజీవితాలే వస్తువు కావడం గమనార్హం. అంతేకాదు, దిగువతరగతి స్త్రీపాత్రలని తీసుకున్నప్పుడు కూడా మధ్యతరగతి విలువలే ఆదర్శం కావడం చూస్తాం.

దీనికి ఒక ఉదాహరణ రంగనాయకమ్మగారి ఆర్తనాదం తీసుకోవచ్చు. ఈకథ రోజు కూలీ కన్నమ్మ దీనావస్థ వర్ణనతో మొదలవుతుంది. ఆమెకి తటస్థపడిన ప్రతి మగవాడూ ఆమెమీద అత్యాచారం జరపడానికి ప్రయత్నించడంతో మధ్యతరగతి ఇల్లాలు రాధ చేరదీసి ఇంట్లో పెట్టుకుంటుంది. ఆయింట కూడా కన్నమ్మకి భద్రత లేదు. రాధ భర్త సత్యనారాయణ రాధ ఇంట్లో లేని సమయంలో కన్నమ్మమీద అత్యాచారం చెయబోతాడు. కన్నమ్మ తప్పించుకుని, రాధ వచ్చేక, ఆమెభర్తని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. రాధకి భర్తయందున్న నమ్మకం వమ్ము కాగా, ఆర్తనాదం ఆమెహృదయంలో నుండీ వెలువడుతుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కథ కన్నమ్మకథగా మొదలయినా ఆర్తనాదం వెలువడింది రాధగుండెల్లో నుండి. అంటే సత్యనారాయణ నీతిని పరీక్షకి పెట్టడానికి కన్నమ్మ ఒక పరికరం అయినట్టు కనిపిస్తుంది.

2. నిర్వహణ జానపదచ్ఛాయలు (పొడిగింపు, కథలో కథ).

కథోన్మీలనం, ప్రారంభంనుంచీ ముగింపువరకూ కథ నడిచే తీరు చూస్తే ఈనాడు మనం చెప్పుకుంటున్న కథాంగాలు – ప్రారంభం ప్రధానాంశాన్ని సూచించేదిగా ఉండడం, సన్నివేశాలూ, సంఘర్షణా, ముగింపులో పరిష్కారం కానీ రచయిత సందేశం కానీ స్పష్టం కావడం ఈకథల్లో కూడా సూత్రప్రాయంగా ఉన్నాయనే నాకు అనిపిస్తోంది. కథకి సంబంధించిన పాత్రలు మాత్రమే ప్రవేశపెట్టడం, కథకి తగినట్టు పాత్రలని చిత్రించడం కూడా బాగానే జరిగినట్టే కనిపిస్తుంది.

ఆధునిక కథల్లో మౌఖికసాహిత్య ఛాయలు.

మనం చెప్పుకున్న క్లుప్తత ఒక ప్రమాణం ఆధునికకథకి. అంటే కథలో అనవసరసన్నివేశాలూ, పాత్రలూ, సంభాషణలూ లేకుండా కేవలం నడక అంతా కథాంశంమీదే కథ సంపూర్ణంగా కేంద్రీకృతమయి ఉండాలి. మన జానపదవాఙ్మయంలో కథనం ఇందుకు భిన్నం. ఉదాహరణకి హరికథ తీసుకోండి. సాధారణంగా హరికథ చెప్పినప్పుడు స్థానిక సంఘటనలనీ వ్యక్తులనీ చేర్చి అక్కడున్న శ్రోతలకి ఆహ్లాదం కలిగించేలా చేస్తారు. అందుకే హరికథ ఒకఊరిలో చెప్పినట్టు మరొకఊరిలో ఉండదు. అది హరికథాభాగవతారుల సృజనాత్మకతకి చిహ్నం.

ఆధునికకథలో క్లుప్తత ఇలాటి సృజనాత్మకతని ఆంగీకరించదు. కానీ అప్పుడప్పుడు ఈనాటి కథల్లో ఈ అంశం నేను 60 దశకంలో కూడా చూశాను.. బహుశా 80, 90లలో విమర్శకులు, పత్రికసంపాదకులు పట్టుబట్టి ఇలా అనవసరవిషయాలు చొప్పించడానికి అభ్యంతరం చెప్పడం మొదలయినతరవాత రచయితలు ఈ క్లుప్తతవిషయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్టు కనపడుతోంది.

3. ముగింపులో ప్రధానంగా పరిష్కారం ఇవ్వాలా వద్దా అన్నది.

వెనకటి కథల్లో సాధారణంగా కథలు సుఖంగా ముగిసేయి. వీటిలో సర్వేజనాః సుఖినోభవంతు. శ్రీశ్రీశ్రీ మంగళం మహత్ అంటూ ఆశీర్వచనాలతో ఉంటుంది ముగింపు. ఆధునికకథలో 30, 40 దశకాల్లో దుఃఖభాజనంగా ముగిసిన కథలు చూస్తాం. ఉదాహరణకి కనుపర్తి వరలక్ష్మమ్మగారి కుటీరలక్ష్మి, కుటుంబరావుగారి ఆడజన్మ తీసుకోవచ్చు. అంటే ఈకథల్లో ప్రధానంగా ఈనాటి జీవితం ఇలా ఉందని చెప్పడమే జరిగింది. పాఠకులు ఆకథలు చదివి తమ కర్తవ్యం ఆలోచించుకోవాలని రచయితల అభిప్రాయం కావచ్చు. ఆ తరవాత కధల్లో కష్టమో సుఖమో సందిగ్ధంగా వదిలేయడం జరుగుతోంది. అంటే ముగింపు పాఠకులకే వదిలేయడం. ఇది కూడా పాఠకులలో ఆలోచన రేకెత్తించడంకోసమే. ఈపద్ధతిలో పాఠకులమేధకి మరింత పని కల్పించడం జరుగుతుంది.

పాత్రచిత్రణలో మార్పు

ఈనాటి కథల్లో దిగువతరగతి మనుషులని చిత్రించడం ఒక విశేషం. అది సంతోషించవలసిన విషయమే కానీ ఎంతవరకూ నిజంగా వారిజీవితాలు చక్కగా లోతుగా పరీక్షించి, నిజాయితీగా చిత్రిస్తున్నారు, ఎంత రొమాంటిసైజ్ చేస్తున్నారు అన్నది నాకు తెలీదు. తెలిసినవారు చెప్పాలి.

ప్రప్రథమంగా పాత్రచిత్రణలో మార్పు స్వల్పం. పూర్వకాలపు కథల్లో అందచందాలు వర్ణించడం కనిపిస్తుంది. నవపల్లవ కోమలాంగులైన కథానాయికలూ, ఆజానుబాహులూ, ఆయతోరస్కులూ, ధీరోదాత్తచిత్తులూ అయిన కథానాయకులే కాక బడుగు బాపడూ, పతివ్రతామతల్లులూ – వీరి రూపలావణ్యాలూ, గుణగణాలూ కీర్తించడం కనిపిస్తుంది. అవి క్రమంగా మారి పాత్రల రూపకల్పన పాఠకులకి వదిలిపెట్టడం ఆధునిక సాంప్రదాయం. పాత్రలమాటలద్వారా, చేతలద్వారా పాఠకులు గ్రహించుకోవాలి పాత్రలరూపం. ఈవిధానం పరాకాష్ఠనందుకుంది కథ సంభాషణలరూపంలో నడపడంతో.

అంతకుమున్ను వీరేశలింగంగారి కాలంలోనే పాత్రలకంటే సందేశం ప్రధానం కావడంతో పాత్రల వర్ణనలు తగ్గిపోయి ఉండవచ్చు. అంటే సందేశమే ప్రధానపాత్ర అనవచ్చునేమో కూడా.  అచ్చమాంబగారి కథలు స్త్రీవిద్య, భార్యాభర్తలసంవాదము వంటి కథలు సంభాషణలరూపంగా సాగుతాయి కనక ఆనాడే మొదలయింది అనుకోవాలి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారూ కనుపర్తి వరలక్ష్మమ్మగారూ కూడా సంభాషణలు ప్రతిభావంతంగా వాడుకున్నారు కథనానికి.

ఆవరణ కథల్లో ఇతివృత్తాలనిబట్టి మన జానపదకథల్లాటివి ఈనాడు సై-ఫై కథలూ, ఊహాతీత కథలూ కూడా వస్తున్నాయి. నేను అవి చదవలేదు కనక నాకు తెలీదు కానీ కనీసం ఇలాటి కథలు వస్తున్నాయని చెప్పగలను. అమెరికాలో ఉండి ఇండియా వాతావరణం, ఇండియాలో ఉండి అమెరికా కథలు రాసినప్పుడు కూడా వాతావరణం ఎంత వాస్తవంగా ఉంది అన్నది ఆలోచించుకోవాలి.

భాషలో మరొక గొప్పమార్పు. నిజానికి ఈ ఒక్క విషయంమీదే గంటసేపు తేలిగ్గా మాటాడొచ్చు. అక్షరాలు రాయడం వచ్చినదగ్గర్నుంచీ మార్పు జరుగుతూనే ఉంది – బండి ఱ, అరసున్నలనించీ బండబూతులవరకూ కథల్లో భాషాభివృద్ధి జరుగుతూ వస్తోంది. పూర్వం రాయడం అన్నది పండితులచేతిలో ఉంది కనక, పాండిత్యం అంటే సంస్కృతమే కనక సంస్కృతపదాలు కథల్లో విరివిగా ఉండేవి. ఆతరవాత వ్యావహారికభాషావాదం వచ్చేక, పత్రికలు శిష్టజనవ్యావహారికం అంటూ భాషకి ఒక రూపం ఏర్పరిచేరు. అది కృతకంగా ఉంది అన్నవారు కూడా లేకపోలేదనుకోండి. అయితే ఏది వ్యావహారికం అన్నది నిశ్చయంగా చెప్పలేం. 1930లనాటికి వ్యావహారికంలో రాస్తున్నాం అన్న అప్పారావుగారి రచనల్లోనూ, 40లో ఉన్నవ వారి మాలపల్లిలోనూ వారి భాష మనకి వ్యావహారికంలా కనిపించదు.

తరవాత ప్రాంతీయవాదాలోచ్చి, శిష్టజనవ్యావహారికభాషకి ప్రత్యామ్నాయంగానో తిరుగుబాటుగానో, ప్రాంతీయభాషలో కథలు రాయడం సాగించారు. తెలంగాణారచయితలు తెలంగాణా తెలుగులోనూ రాయలసీమవారు రాయలసీమభాషలోనూ రాస్తున్నారు. అయితే అందరూ అలాగే రాయలేదు. మధురాంతకం రాజారాం శిష్టజనవ్యావహారికం – అదే పత్రికలు ప్రామాణికం చేసినభాషలోనే రాసేరు. పులికంటి కృష్ణారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, కె. సభావంటి రచయితలు పల్లెల్లో రైతులభాషకి సాహిత్యప్రతిపత్తి తీసుకొచ్చారు. దీనివల్ల మేలు ఏమిటంటే ఇంతవరకూ నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలకథలు వెలుగులోకి రావడం, నష్టం ఏమిటంటే ఇతరప్రాంతాలలో పాఠకులకి ఆ భాష అర్థం కాక ఆకథలు కొరుకుడు పడకపోవడం. ఇది నేను స్వానుభవంతోనే చెప్తున్నాను.  నేను నాతూలికలో ప్రచురించుకోడానికి తెలంగాణా కథలు అనువాదం చేయబోయి, చేతకాక వదిలేశాను.

జాతీయాలూ, మాండలీకం,

వెనకటి కథల్లో సంస్కృతం, ప్రస్తుతం ఇంగ్లీషు. జాతీయాలు, నుడికారాలు కూడా ఇంగ్లీషువే తీసుకుని రాయడం మనదైన సాంప్రదాయం పోయింది. ఇంగ్లీషువాడి భావాలూ, భాషే ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యాయాన్యాయాలప్రసక్తిలో గానీ నమ్మకాల్లో గానీ. ఉదా. చక్కని చుక్క, చిదిమి దీపం పెట్టొచ్చు అనేవాళ్ళం మనం అందమైన అమ్మాయి అని చెప్పడానికి.  ఇప్పుడు బార్బీడాల్ లా ఉంది అంటున్నారు.

అలాగే థాంక్స్. నిజానికి మనసంస్కృతిలో థాంక్స్ వాచ్యం చెయ్యం. ఒకవేళ చేస్తే అది పరోక్షంగా ఉంటుంది. మాటల్లో కృతజ్ఞతలూ, ధన్యవాదాలు ఇంగ్లీషు సాంప్రదాయం అనుకరణే కానీ మనకి లేవు. ఆ భావం మనం మరోరకంగా వ్యక్తం చేస్తాం. దండాలు బాబయ్యా,  నీయమ్మ కడుపు చల్లగా, చచ్చి నీకడుపున పుడతా అని దీవిస్తాం.

కథనవిధానంలో మార్పులకి చాలావరకూ ఆంగ్లసాహిత్యప్రభావం అని మొదట్లో చెప్పేను. ఈమార్గంలో బుచ్చిబాబు, ఆతరవాత అంపశయ్య నవీన్, వడ్డెర చండీదాస్ వంటి రచయితలు చైతన్యశ్రవంతి పద్ధతిలో రాసారు. మార్పులు అనేకవిధాలుగా వచ్చేయి, ముందు ముందు వస్తాయి. కథ సజీవం కనక. అయితే ఆ మార్పులు రచయిత కర్తృత్వాన్నీ, సృజనాత్మకతనీ కించపరచేవిగానూ, నీరసింపజేసేవిగానూ ఉండకూడదనే నా నమ్మకం.

కథో వ్యాసమో తెలీని మరొక కొత్త ప్రక్రియ – 40లలో సాక్షి వ్యాసాలు వచ్చేయి. వాటిని వ్యాసాలనే అన్నారు. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే, వ్యాసంలో వాస్తవికతకి ప్రాధాన్యం. కటికనిజాలు ఉన్నవి ఉన్నట్టు ప్రతిపాదించాలి. కానీ సాక్షిలో జంఘాలశాస్త్రిలాటి పాత్రలు కల్పితపాత్రలు. అలాగే 50లలో వచ్చిన లత ఊహాగానం, పురాణం సుబ్రహ్మణ్యశాస్త్రి ఇల్లాలిముచ్చట్లు ఇవి పూర్తిగా వాస్తవాలూ కావు, కల్పనలూ కావు. అంచేత వీటికి వేరే పేరు పెట్టేవరకూ కథలు కాకపోతే కతలు (ఒత్తు తొలగించి, కాకమ్మకతలు, ఊసుపోక కబుర్లు అన్న అర్థంలో) అనొచ్చేమో. ఈనాటి బ్లాగులు చాలావరకూ ఈపద్ధతిలో ఉంటున్నాయి.

చివరగా మరొక విషయం ప్రస్తావించి ముగిస్తాను. పిల్లలకథలు. మీరు చూశారో లేదో పుస్తకం.నెట్ అని వెబ్ పత్రిక ఉంది. ఆ పత్రికలో ఈమధ్య ఒక చర్చ మొదలయింది. హారీ పాటర్ వంటి కథలు మనకి తెలుగులో ఎందుకు లేవు అని.

మనకి జానపదవాఙ్మయంలో పిల్లలకథలు చాలానే ఉన్నాయి. ఆధునికకథ మొదలయినతరవాత పిల్లలకథలమీద ఆసక్తి 40లలో కనిపిస్తుంది. బాల 1945లో, చందమామ 1947లో ఆతరవాత బొమ్మరిల్లు, బుజ్జాయి వంటి పత్రికలు వచ్చేయి. ఆతరవాత ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలాటి వారపత్రికలు ఓ రెండు పేజీలు పిల్లలకథలకోసం ప్రత్యేకించేరు. 50లలో కూడా వీటికి ప్రాచుర్యం బాగానే ఉండింది కానీ తరవాత తగ్గుతూ వచ్చింది. అరవైలు దాటేసరికి బాలసాహిత్యం నామమాత్రంగానే మిగిలిపోయింది. ఈనాడు పిల్లలకోసం ప్రచురించే పుస్తకాలు కనిపించడంలేదు, స్కూలు పాఠ్యపుస్తకాలు తప్పిస్తే. కారణం ఇంగ్లీషు బళ్ళు అనుకుంటాను. అక్కడ పిల్లలు చదివే పుస్తకాలు కూడా ఇంగ్లీషు పిల్లలపుస్తకాలే. అలాగే కథలపోటీలు, రచయితలకి సత్కారాలూ – వీటిల్లో ఎక్కడా పిల్లలకథలు రాసేవారికి ప్రోత్సాహం లేదు. అసలు పిల్లలకథలు రాసేవారు రచయితలు కారన్న అభిప్రాయం ఏర్పడిపోయిందేమో ఏదో ఒక సమయంలో అని అనుమానం కూడా వస్తోంది నాకు.

ఇప్పుడు మళ్ళీ వెనకటి ఉత్సాహం రావాలి బాలసాహిత్యం ఇతోధికంగా అభివృద్ధి చేయడానికి. స్థూలంగా ఆలోచిస్తే, కథలో కథనంలో మార్పులు ప్రచారవిధానంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమ్మలూ, అమ్మలూ తాతలూ చెప్పేవారు పూర్వం. తరవాత కాగితంమీద వచ్చేక ఎవరికి వారు చదువుకుంటున్నారు. రాను రాను అంతర్జాలం ప్రాచుర్యం పొందుతున్న కొద్దీ “కథ చెప్తాను రా” అని ఏ బామ్మో, తాతో అంటే “జాలంలో చూసుకుంటాలే” అనే పిల్లలు రావచ్చు. నాలాటి అమ్మమ్మలయితే, కథ చెప్పు అమ్మమ్మా అని పిల్లవాడు అడిగితే, జాలంలో చూసుకో బాబూ అనొచ్చునేమో కూడా.

ఇటీవల పిల్లలసాహిత్యం సృష్టించే ప్రయత్నం మొదలయింది. సంపుటి, కొత్తపల్లి ప్రింటులోనూ, జాలంలోనూ కూడా బాలసాహిత్యం అందిస్తున్నారు. నాస్నేహితురాలు లలిత తెలుగు4కిడ్స్.కామ్ అన్న సైటులో విదేశాల్లో ఉన్న మనపిల్లలకి తెలుగుసాహిత్యం సాంప్రదాయాలలో ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. వీటి వివరాలు కావలసినవారు నాకు ఇమెయలివ్వండి.

పిల్లల మనస్తత్త్వాలు గ్రహించిన వర్తమాన రచయితలు, వర్థమాన రచయితలు ఈవిషయం సీరియస్‌గా తీసుకుని ఇతోధికంగా కృషి చేయాలని అభిలషిస్తూ మరొకసారి ధన్యవాదాలతో నాప్రసంగం ముగిస్తున్నాను.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “తెలుగుకథ తీరుతెన్నులు – రెండోభాగం”

 1. Wow! Thanks for the article!
  ఈ మధ్య కాలం లో మీ బ్లాగు చూసి రెండు నెల్లు దాటిందనుకుంటా. చాలా మిస్సయినట్లున్నా!!

  “దానికి ప్రత్యామ్యాయంగానే కావచ్చు చలం కులస్త్రీలని వ్యభిచారిణులుగా చిత్రించడం. ”
  -Interesting perspective!! మీరన్నాక నాకూ అలాగే అనిపిస్తోంది! 🙂

  మెచ్చుకోండి

 2. లలితా, నాకు కూడా బాలసాహిత్యంగురించి చెప్పడం అవసరమనపించే చెప్పేను. ఒకావిడ ఆ 3 సైట్సుకి యుఆరెల్స్ కూడా అడిగి తీసుకున్నారు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ,
  ముందుగా తెలుగు4కిడ్స్ ను పరిచయం చేసిందందుకు ధన్యవాదాలు.
  బాల సాహిత్యాభివృద్ధికి పిలుపునిచ్చినందుకు మహా సంతోషం.
  శ్రద్ధగా చదవాల్సిన విషయాలు అని కాస్త తీరిక దొరికే వరకూ ఆగి చదివాను.
  మంచి వ్యాసాలు. చక్కగా తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉండవలసినవి.
  ‘Thanks’ 🙂

  మెచ్చుకోండి

 4. మల్లీశ్వరిగారూ, నావ్యాసం చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. ఇది స్త్రీలకోణంనుండి అని నేను అనుకోలేదండీ. బహుశా, నేను అచ్చమాంబకథ, వేశ్యలు అంశంగా రాసినకథలుగురించి వ్యాఖ్యానించినందుకు అలా మీకు అనిపించిందేమో. నేను వాటిని తెలుగు కథా సాహిత్యచరిత్రలో ఒకభాగంగానే తీసుకున్నాను. ఇతర విషయాలు కూడా చర్చించడం జరిగింది కదా. మాలతి

  మెచ్చుకోండి

 5. మాలతి గారు,
  రొటీన్ కి భిన్నంగానూ,ఆలోచనాత్మకంగానూ,స్త్రీల దృష్టి కోణం నుంచి సాహిత్య విమర్శ శాస్త్రీయంగా రావాల్సిన అవసరం ఉందని ఇటీవల చాలా మంది రచయిత్రులు అభిప్రాయపడుతున్నారు.మీ వ్యాసం ఆ ప్రమాణాలతో ఉండడం చాలా సంతోషం కలిగించింది…మీ నుంచి ఇంకా ఇంకా ….కోరుకుంటూ….మల్లీశ్వరి.

  మెచ్చుకోండి

 6. జె.యస్. ఆర్. మూర్తిగారూ, మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలకీ, మీ అభిమానానికీ ధన్యవాదాలు. కథాశిల్పంవంటి పుస్తకం రాసే ఆలోచనా, తాహతూ కూడా నాకు లేవు కానీ మీరు ఆమాట అన్నందుకు నాకు సంతోషంగా ఉంది.

  మెచ్చుకోండి

 7. చిట్టెన్ రాజు గారూ, నావ్యాసం చదివి మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు సంతోషం. సభలో నేను ఆశించిన చర్చ జరగలేదు. ఇక్కడ మీరు మరొకసారి చదివి మీ అభిప్రాయాలు రాస్తానంటే నాకు పోయిన ఉత్సాహం తిరిగి వస్తోంది. తప్పకుండా రాయండి. ఎదురు చూస్తుంటాను.
  ఇట్లు
  మాలతి

  మెచ్చుకోండి

 8. katha gurinchi chaalaa aasakthi kaliginche vishayaalu cheppaaru. deenni chadivaaka idi meeru raayavalsina kathaa silpam laanti maroka uttama sthaayi pusthakaaniki peetikalaa anipinchindi. intha manchi vyaasam raasinanduku abhivandanaalu raaya boye vyaasaalaki abhnaandanaalu_jonnavitthula sreeraamachandra murthy

  మెచ్చుకోండి

 9. మాలతి గారూ,
  “కథ” అనే ప్రక్రియ మీద ఇంత సమగ్రమైన వ్యాసం ఇటీవలి కాలంలో నేను చదవ లేదు. మళ్ళీ, మళ్ళీ చదివి నాకు తోచిన నాలుగు ముక్కలు త్వరలోనే వ్రాస్తాను. ముఖ్యంగా, కొంతమంది స్వయం ప్రకటిత ఉన్నత సాహితీవేత్తలు అమెరికా రచయితల కథల స్థాయిని చిన్నబుచ్చే ప్రయత్నాలు వీలున్నప్పుడల్లా చేస్తున్న నేపధ్యంలో అమెరికా కథకులకి వర్తించే విషయాలు నాకు చాలా ఆసక్తి. ఎన్ని నిర్వచనాలు ఉన్నా, అభిప్రాయాలు ఉన్నా ఒక కథ బావుందా లేదా అని ప్రతీ పాఠకుడూ, పాఠకురాలూ తమకు తామే నిర్ణయించుకుంటారు.
  మీకు మనస్పూర్తిగా నా ధన్యవాదాలు తెలియపరచడమే ఈ ఉత్తర సారాంశం. .

  భవదీయుడు
  వంగూరి చిట్టెన్ రాజు
  వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాదు)
  E-mail: vangurifoundation@gmail.com
  http://www.vangurifoundation.blogspot.com

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s