మార్పు 11

“నవ్వెప్పుడొస్తుందో చెప్పడం కష్టం,” అన్నాన్నేను.

“నవ్వెప్పుడు రాదో చెప్పడం కూడా కష్టమే,” అంది అరు.

“నువ్వినలేదేమిటి ఇటీవలి లీలాసుందరులవృత్తాంతం” అంది సిరి.

“లేదు. ఏమాకథ? వినుటకుత్సాహంబయ్యెడిని, చెప్పు చెప్పు చెప్పు చెప్పూ” అన్నాను హుషారుగానూ మరియు పూర్వపు బాణీ నెమరేసుకుంటూను.

“ఇది చెప్పులకథ కాదు. చెప్పుదెబ్బలకథ. సరే. ఏమయిందంటే …”

000

“ఇండియానించి ఇప్పుడే దిగేడు రెడ్డి, కోడికూర ఎలాగా చెయ్యవు కనీసం మాంఛ్ఛి ఘ్ఘాటైన తెలుగువంటకం చేసిపెట్టు, పదికాలాలపాటు నిన్ను తలుచుకుంటాడు,” అన్నాడు సుందరం లీలతో రామిరెడ్డిగురించి.

రామిరెడ్డి ఏదో కోర్స్‌కోసం వచ్చేట్ట. ఒక సెమెస్టరుంటాడు. తెలుగుతిండికోసం మొహం వాచి ఉన్నాట్ట.

లీల సరేనంది. ఆమధ్య ఏదో వంటలపుస్తకంలో కనిపించిన “కేరట్ ఆవకాయ పెడతాను. ఆ ఆవగుండ ధాటికి రామిరెడ్డేమిటి హరిహరాదులు కూడా అదిరిపడగలరు,” అంది. అమెరికాలో సామర్లకోటనూనె, అనకాపల్లి మామిడికాయలూ, తుని మిరపకాయలూ దొరక్కపోవచ్చు కానీ ఇంచుమించు ఆఘాటుకి సరి తూగే సరుకులు కమ్యూనిటీ స్టోరులో దొరుకుతాయి. ఇక్కడ మెక్సికన్ మిరపకాయలూ, మరెక్కడినించో వచ్చిన సన్నావాలు రుచికి లోపం లేదు.

కేరట్ తెచ్చి, సన్నగా ముక్కలు తరిగి, రెండ్రోజులు నిమ్మపులుసులో నానబెట్టింది. ఆ తరవాత కారం, ఆవగుండా ఉప్పూ పసుపూ బాగా కలియబెట్టి, కేరట్ ముక్కలేసి మరోమారు కలియబెట్టి మూతపెట్టింది. నాలుగురోజులు ఊరబెడితే రుచి బాగుంటుంది కానీ టైము లేదు. మర్నాడే రెడ్డి భోజనానికి వస్తున్నాడు. ఊళ్ళోనే ఉంటాడు కదా నాలుగు రోజులయింతరవాతే పిలవొచ్చు కదా అనడక్కండి. లేడికి లేచిందే ప్రయాణం. సుందరం తలిచినప్పుడే విందు.

సుందరం వెళ్ళి రెడ్డిని తీసుకొచ్చేడు. లీల సాదరంగా ఆహ్వానించి, “ఆర్డూర్” పేరున నాలుగు బజ్జీలు ముందు పెట్టి, మరో అరగంట తరవాత భోజనాలబల్లమీద వంటకాలు సిద్ధం చేసింది.

ఆ బల్లా, బల్లమీద గిన్నెలూ, గిన్నెల్లో దినుసులూ చూస్తుంటే రెడ్డికి కళ్లూరేయి. తింటుంటే కళ్లూ, నోరూ కూడా ఊరిపోయేయి ఊటబావిలో జలాల్లా. తింటున్నంతసేపూ లీలగారి కేరటావకాయ మెచ్చుకుంటూనే ఉన్నాడు.

“మరేమిటనుకున్నారు మాలీల పాకశాస్త్రప్రావీణ్యం. మీరింకా చూడలేదు. మరో రెండు సార్లు తిన్నారంటే ఆతరవాత రెండు జరగడానికి అవకాశం ఉంది,” అన్నాడు సుందరం.

“రెండంటే?”

“ఈవిడగారి రుచులకి అలవాటు పడిపోయి, మరెక్కడా తినలేక మాయింటికి మకాం మార్చేస్తారు. ఇహ ఇండియా తిరిగెళ్ళేమాటే రాదు కల్లోనైనా. లేదా కళ్లు తిరిగి, మొహం మొత్తి ఇహ తిన్లేను మహాప్రభో అనుకుని మరి మాయింటివేపు చూడరు,” అన్నాడు సుందరం హ హా నవ్వుతూ తనహాస్యచతురతకి మురిసిపోతూ.

రెడ్డి కూడా నవ్వేడు “భలేవారండీ మీరు, భలే మాటాడతారు.”

“అదేమిటండీ రెడ్డిగారూ, నావంటకాలరుచులు వదిలేసి ఆయనగారి హాస్యచతురతమీదికి మళ్ళించేశారు బండి. నావంటలు అంత తీసికట్టా?” అంది లీల సీరియస్‌గా.

“అమ్మమ్మ, ఎంతమాట. మీ పాకాలతరవాతే వారి వాకులు” అన్నాడు రెడ్డి.

భోజనాలయేయి. “ఊళ్ళో తెలుగుసినిమాలు లేవు కానీ పొరుగువారిది తమిళచిత్రం ఆడుతోంది, లీలకి తమిళం కొంచెం వచ్చు. వెళ్దామా?” అన్నాడు సుందరం ఇద్దరివేపూ మార్చి మార్చి చూస్తూ.

“పదండి. మీరేదంటే అదే. నాకేదైనా ఒకటే. ఇంగ్లీషుబళ్ళో చదివేను కదా. నాకు తెలుగూ, తమిళం, మరాఠీ అన్నీ ఒక్కలాగే వినిపిస్తాయి. మూకీ చూసినట్టు బొమ్మలు చూసి కథ తెలుసుకుంటాను,” అన్నాడు రెడ్డి.

“నాతమిళం కూడా అంతంత మాత్రమేలెండి. రెడ్డిగారు చెప్పినట్టు ఏ సినిమా అయినా ఒకటే, పదండి,” అంది ఎంగిలికంచాలూ, గ్లాసులూ సింకులోనూ, మిగిలిన కూరలూ అన్నాలూ ప్రిజ్‌లోనూ సర్దేస్తూ.

000

సినిమా మొదలయి పావుగంట సాగింది. ఎవరికీ ఏమీ తెలీడంలేదు. తమకేమీ తెలీడంలేదని చెప్పడానికి ఎవరూ సిద్ధంగా లేరింకా. మరో పావుగంటయితే చెప్దురేమో.

రెడ్డి ఇబ్బందిగా కదలడం మొదలెట్టేడు కుర్చీలో. మరో పదినిముషాలయింతరవాత కడుప్మీద చెయ్యేసి ఊఁ అంటూ చిన్నగా మూలిగేడు.

“ఏంటండీ, కడుపులో బాలేదా?” అడిగేడు సుందరం గాభరా పడిపోతూ.

“కడుపులో ఏంటోగా ఉందండీ,” అంటూ మొహం వికృతంగా పెట్టి, నెమ్మదిగా లేచేడు.

“అయ్యయ్యో, మాలీలవంటకాలు అగ్గి పెట్టేసేయేంటి మీకుక్షిలో,” అంటూ సుందరం కూడా లేచేడు.

సినిమాలో లీనమయిపోయి, ఆ సంభాషణలసారం గ్రహించడానికి ప్రయత్నిస్తున్న లీలకి సుందరం, రెడ్డి లేచిపోవడమే తెలిసింది కానీ వారిమధ్య మాటలు తెలుసుకోలేదు.

సరే, ఏ సిగరెట్ తగలేసుకోడానికో బయటికి పోతున్నారు వాళ్ళే వస్తారు అనుకుంది వాళ్ళు లేవడం చూసి.

ఆమె అనుకున్నది జరగలేదు. సినిమా అయిపోయింది. తనని తోలుకొచ్చిన బంధుమిత్రులు అయిపు లేరు.

తనవరసలోవారు లేచి ఆమె లేవడంకోసం చూస్తూ నిలబడ్డారు. ఇహ లాభంలేదనుకుని మెల్లిగా లేచి, జనప్రవాహంలో పడి కొట్టుకుపోతూ బయటికి వచ్చింది. తనని కట్టుకున్నవాడూ తనచేతివంట తిన్నవాడూ కనిపిస్తారేమోనని. సినిమా చూసినవారందరూ వెళ్ళిపోయేరు. రెండోఆట చూడ్డానికొచ్చినవాళ్ళు హాల్లోకి పోయేరు. కొందరు పరిచయస్థులు కనిపించి సినిమా చూడ్డానికొచ్చేరా, చూసి వెళ్ళిపోతున్నారా అని ప్రశ్నించేరు.

లీల నెమ్మదిగా నడుస్తూ ఇల్లు చేరుకుంది.

తలుపు తాళాలు తీస్తుండగానే గలగల్లాడుతూ మాటలూ నవ్వులూ వినిపించేయి.

హాల్లో కూర్చుని సుందరం రెడ్డీ పేకాడుతున్నారు.

లీలని చూస్తూనే సుందరం, “అయిపోయిందా సినిమా? బావుందా?” అన్నాడు అతిమామూలుగా.

“చెప్పకుండా వచ్చేశారేమిటి? మీకోసం చాలాసేపు చూశాను,” అంది లీల శాంతంగా.

“నీ కొత్తావకాయ ఘాటు రెడ్డిగారికడుపులో చిచ్చు పెట్టేయి,” సుందరం హోరున నవ్వేడు.

రెడ్డి చిన్నగా నవ్వేడు “మరీ అంత కాదులెండి” అంటూ.

“అంత కాదంటారేమిటి? జులై ఫైర్‌వర్క్స్ కనిపించేయన్నారు కదా మీరే” అన్నాడు సుందరం మళ్ళీ.

రెడ్డి నవ్వేడు.

లీలకి మనసు కలుక్కుమంది. మాటాడకుండా పక్కగదిలోకి వెళ్ళిపోయింది.

ఆ వెనకే సుందరం వచ్చేడు.

“అదేం మర్యాద? పెద్దమనిషి హాల్లో ఉంటే అలా వచ్చేస్తావేమిటి?” అంటూ.

“మర్యాదా? నన్నొక్కదాన్నీ అలా సినిమాహాల్లో వదిలేసి రావడం మర్యాదగా ఉందా?”

“బాగుంది. ఆయనకి కడుపునొప్పి అంటే మీరెళ్ళండి, నేను తరవాత మాఆవిడతో వస్తాను అని చెప్పమంటావా?”

“ఏం పసిపిల్లాడేమిటి? నువ్వు పక్కనుండి బాత్రూంకి తీసుకెళ్ళాలా? పోనీ, వెళ్ళేవు సరే. వెళ్ళేముందు చెప్పొచ్చు కదా. ఆ తరవాతయినా, ఆవిడతో చెప్పకుండా వచ్చేశాం. వెళ్ళి తీసుకొస్తాను మీరు పడుకోండి అని ఆయనకి చెప్పలేవూ?”

“ఇది మహ బావుంది. మామూలుగా ఒక్కదానివీ ఊరంతా ఇంకా పొరుగూళ్లూ కూడా తిరుగుతావు కదా. రెండు బ్లాకులు కూడా లేదు సినిమాహాలు ఇక్కడ్నించి. నిన్ను కొట్టడానికి ఎవడికైనా ఎన్ని గుండెలు. నీఆకారం చూసి వాడే ఝడుసుకుని పారిపోతాడు” సుందరం సుతారంగా నవ్వేడు.

హాల్లో రెడ్డి నవ్వినట్టు లీలకి అనిపించింది..

సుందరం హాల్లోకి వచ్చేశాడు.

రెడ్డి, “తెల్లారగట్లే క్లాసుంది, వేగిరం లేవాలి. వస్తానండీ” అంటూ లేచేడు.

సుందరానికి మాత్రం రెడ్డిని అలా అర్థంతరంగా సాగనంపడం బాలేదు.

“అదేంటండీ. కూర్చోండి. కనీసం ఈ ఆట పూర్తి చేసి వెళ్ళొచ్చు. మీరేం ఆవిడని పట్టించుకోకండి. ఊరికే అలా అలక నటిస్తుంది కానీ నిజంగా బాధ కాదు. గొప్ప సెన్సాఫ్ హ్యూమరు ఆవిడకి. మాకిద్దరికీ ఇదలవాటే …”

లీలకి వినిపిస్తూనే ఉన్నాయి ఈకబుర్లన్నీ. కొంతవరకూ సుందరం చెప్పింది నిజమే. ఇద్దరూ వేసి వేయించుకోడం అలవాటే. పార్టీల్లో కూడా ఒకరినొకరు హేళన చేసుకుని నవ్వుతూ అందర్నీ నవ్విస్తూనే ఉంటారు.

కానీ. .. ఇవాళ మనసు చివుకుమంది.

000

“సుందరం ఎందుకు అలా ప్రవర్తించేడంటావు,” అంది సిరి.

“వాళ్ళిద్దరిమధ్య సామరస్యం అలాటిది కావచ్చు. వాళ్ళెంతకాలంగా కాపురం చేస్తున్నారో తెలీదు. ఆటైంలో అతనికి అలాటి అభిప్రాయం ఏర్పడి ఉండవచ్చు. అంటే తను చేసింది లీలకి సమ్మతంగానే ఉంటుంది అని అనుకున్నాడేమో. మామూలుగా తను ఒక్కర్తీ బయటికి వెళ్ళడం అలవాటే అన్నాడు. అతిథిసత్కారాలవిషయంలో గృహస్థధర్మాలు అవీ అని అతనిఅభిప్రాయాలు. లీల ఇంట్లో మనిషి. ఇంట్లో మనిషిని ప్రత్యేకంగా చూడ్డం మనసాంప్రదాయంలో లేదు కదా. మనలో మనకేంటి అనే తత్త్వం మనది. పరాయివారయితేనే ఏమనుకుంటారో అనుకుంటూ జాగ్రత్త పడాలి. పాపం రెడ్డి కొత్తగా వచ్చేడు. అమెరికాలో అతనిదినాలు హర్షప్రదం చేయడం సాటితెలుగువాడిగా తనవిధి … ఇలా ఉండి ఉంటాయి ఆయన ఆలోచనలు” అన్నాను ఆలోచిస్తూ.

అలా చేయడంలో సుందరం కూడా ఆనందం పొంది ఉండొచ్చు కానీ అది ఇక్కడ అప్రస్తుతం.

“అయితే రెడ్డికి అది బాగుందా? అతననైనా లీలగారిని ఒక్కరినీ సినిమాహాల్లో వదిలేసి వచ్చేం. చెప్పనైనా చెప్పలేదు. పోనీ మీరు మళ్ళీ వెళ్లండి. నేను నారూముకి పోతాను అనలేదా, అనఖ్ఖర్లేదా?” అంది అరవింద.

“ఏమో .. నీట్లోంచి బయట పడ్డ చేపలా కొత్తదేశంలో మనిషికి మాట తోచదు. పైగా సుందరం తనకంటే పెద్దవాడు, అనుభవజ్ఞుడూ… ఆయనకి తను చెప్పేదేమిటి? ఇంకా వాళ్ళ అనుబంధం అలాటిది అనుకొని ఉండొచ్చు కూడా. లేదా కేరటావకాయ కడుపులో మంటలు పెట్టేస్తుంటే బుద్ధి పని చేయలేదేమో. వాళ్ళకి లేనిబాధ నాకెందుకు అనుకోవచ్చు,” అంది సిరి.

“మరి సుందరం ఎకసక్కేలు ఎప్పుడూ తేలిగ్గా తీసుకునే లీలకి ఇప్పుడు కోపం ఎందుకు వచ్చిందంటావు?” అంటూ నావంతు ప్రశ్న వేసేను.

“బాగుంది భేతాళుడిప్రశ్నలా. ఇది అరవిందకి వదిలేస్తున్నా. నువ్వు చెప్పు అరవిందా,” అంది సిరి అరువేపు తిరిగి.

“మంచి ప్రశ్నే. అవును. ఎంచేత లీల నొచ్చుకుంది? ఇంతకాలం ఇంటా బయటా కూడా ఇద్దరూ ఒకరినొకరు వేళాకోళాలు చేసుకుంటూనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు వేరుగా ఉన్నదేమిటి? రెడ్డి కొత్తవాడు, పరాయివాడనా? అతను కూడా నవ్వినందుకా? మొగుడు కొట్టినందుక్కాదు తోడికోడలు నవ్వినందుకు అంటారు ….అసలవేవీ కావేమో … సుందరం జోకులు పాతరికార్డులా అరిగిపోయి కీచుమనే సమయం ఆసన్నమయిందేమో? లీలకి సెన్సాఫ్ హ్యూమరు తరుగుతోందేమో? హుమ్. ఇంకా ఆలోచించి, మరిన్ని పుస్తకాలు చదివి కానీ చెప్పలేను,” అంది అరవింద.

(మార్చి 8, 2011)ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “మార్పు 11”

 1. @లలితా, – ఎవరూ కావాలని చెయ్యకపోవచ్చు – నిజమే. అది రెండోవారికి తోచదు, అలవాటుప్రకారం పోతారనే నేను కూడా అనుకుంటున్నాను. థాంక్స్.

  మెచ్చుకోండి

 2. మీరన్నదే నా అభిప్రాయం కూడానూ 🙂
  వేళాకోళాలు అదే పనిగా చేస్తే ఎప్పుడో ఒకప్పుడు వికటిస్తాయి. అప్పుడు అర్థం చేసుకుని దారి మళ్ళించుకుంటే మేలు. ఎవరూ కావాలని చెయ్యకపోవచ్చు. కానీ అవతలి వారికి కోపం వచ్చినప్పుడు సమర్థించుకునే కన్నా ఆపేస్తే మంచిది.

  మెచ్చుకోండి

 3. @ లలితా, అదేనండీ. లీలకి ఎప్పుడు నవ్వు రాదో సుందరానికి తెలీలేదని చెప్పడమే. నిజం చెప్పాలంటే, ఈ వేళాకోళాలు ఎప్పుడో ఒకప్పుడు బాధ కూడా కలిగిస్తాయని నేను అనుకుంటున్నాను. అది ఏ క్షణంలో జరుగుతుందో చెప్పలేం అని కూడా అనిపిస్తుంది. అందుకే చివర ఆచర్చ పెట్టింది. మరి మీరేం అనుకుంటున్నారో ఇప్పుడు చెప్పండి. ;P.

  మెచ్చుకోండి

 4. అరువు-ఇంద=అరువింద=అప్పు ఇచ్చే ఇంతి. అప్పు తీసుకొనేవాడు బావ అప్పారావు. మీరు అరవిందని అరువిందగా టైపితే, నాకీ అవిడియా తట్టింది.
  చదవటానికేముందండీ, చదివించెడివారు మీరు.

  మెచ్చుకోండి

 5. ““నవ్వెప్పుడు రాదో చెప్పడం కూడా కష్టమే,” 🙂

  ప్రశ్నకి ప్రశ్నలే సమాధానాలు కాదు కదా?
  సమాధానం ఆశించవచ్చా? ఆ పని మాకే వదిలిపెడుతున్నారా?

  మెచ్చుకోండి

 6. “ఆతరవాత రెండు జరగడానికి అవకాశం ఉంది” అంటే నేనింకేదో రెండు అనుకున్నాను, అదే నిజమైంది చివరికి.
  ఈ “అరువింద” ఎవరో అప్పారావ్ గారి మరదలులావుంది!

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s