చరిత్ర, చారిత్రక నవల

చరిత్రంటే తారీకులూ దస్తావేజులూ కావంటారు శ్రీశ్రీ.. చరిత్రకీ చారిత్రిక నవలకీ తేడా ఉందంటారు కవిసామ్రాట్ నోరి నరసింహశాస్త్రిగారు.

తెలుగు నవలకి ఆద్యం లార్డ్ మేయో బెంగాలీలని వారి సంస్కృతీ సంప్రదాయాలు తెలిపే నవలలు రాయమని కోరడం అని ఆరుద్ర రాశారు (సమగ్రాంధ్రసాహిత్యం సం. 4, తెలుగు ఎకాడమీ ప్రచురణ). ఒక జాతి సంస్కతీ సాంప్రదాయాలనీ, ఆచారవ్యవహారాలని నవలలు చెప్పినంత వివరంగా చరిత్ర చెప్పదు అని మేయో అభిప్రాయం అనుకుంటాను.

కాలేజీల్లో విశ్వవిద్యాలయాలలో చరిత్రకి సంబంధించిన కోర్సులలో రెండు, మూడు దశాబ్దాలుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేవలం తారీకులూ, దస్తావేజులూ కాక నిత్యజీవితంలో జరిగే విషయాలకి సంబంధించిన వివిధకోణాలు ప్రతిఫలిస్తూ, సాంఘికచరిత్ర, రాజకీయచరిత్ర, ఆర్థిక చరిత్ర – ఇలా చరిత్రని ముక్కలు చేసి అధ్యయనం చెయ్యడం మొదలయింది.

చరిత్రపాఠాల్లో ఇలాటి మార్పు వచ్చినా, ఇంకా చెప్పనివి ఉంటాయి నిజమైన మానవజీవితాల్లో. పరీక్షలకోసం, ఉద్యోగాలకోసం కాక విషయం – మనం ఎక్కడినుంచి వచ్చేం, ఇప్పుడు ఇలా ఉండడానికి వెనకటి చరిత్ర ఎంతవరకూ కారణం వంటివి తెలుసుకుంటే కానీ మున్ముందు ఎక్కడ ఎందుకు ఎలా తేల్తాం అన్నది అర్థం కాదు.  అలాటి కుతూహలంతో చరిత్రని అర్థం చేసుకోవాలంటే కథలూ, నవలలూ కావాలి. ఈఅభిప్రాయంతోనే లార్డ్ మేయో నవలారచనని ఆహ్వానించేరు. బెంగాలీలు ఏం చేసేరో తెలీదు కానీ ఆ ఆహ్వానానికి స్పందించిన తెలుగువాడు నరహరి గోపాలకృష్ణమ్మ సెట్టిగారుట. ఆయన 1872లో శ్రీ రంగరాజచరిత్ర అన్నపేరుతో తెలుగు నవలకి శ్రీకారం చుట్టేరు. అప్పటికి నవల అన్న పదం తెలుగులో లేదు కనక దీన్ని కల్పితప్రబంధము అంటున్నానని ఆయనే తన ముందుమాటలో రాసుకున్నారు. ఆయన మాటల్లోనే ఇది ప్రబంధం కాదు కానీ ఈ నవలలో ప్రబంధలక్షణాలు ఉన్నాయి. అవి – కథానాయకుడు రాజవంశానికి చెందినవాడు, కథ రాణి సోనాదేవిదే అయినా సాంప్రదాయాన్ననుసరిస్తూ నవలకి శ్రీరంగరాజుగారిపేరు పెట్టడం, వర్ణనలు. అంతే కాక, ఇందులో కల్పనలు కూడా ఉన్నాయి. భాష కూడా అప్పటిఆచారం ప్రకారం ప్రబంధశైలిలోనే నడిచింది. ఇవన్నీ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో వివరించేరు.

అంటే తెలుగులో చారిత్రకనవల పందొమ్మిదో శతాబ్దం చివరలో వచ్చిందన్నమాట. ఆతరవాత వీరేశలింగంగారి రాజశేఖరచరిత్ర వచ్చింది. అదేకాలంలో ఇంకా కొన్ని నవలలు కూడా వచ్చేయి.

నేను చదవడం మొదలయేనాటికి, పత్రికలలో రెండు రకాలు సీరియలులు వచ్చేవి. లేదా సీరియలులు రాసే రచయితలని రెండు తరగతులుగా చెప్పుకోవచ్చు. సాంఘిక నవలలు రాసేవారు, చారిత్రక నవలలూ రాసేవారూ అని. రెంటినీ పత్రికలు ఆదరించి ప్రచురించేయి. మరోరకంగా చెప్పాలంటే క్షుణ్ణంగా తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు చదువుకున్నవారు చారిత్రకనవలలు రాసేరు. రాయాలన్న సరదాతో రాసినవారు ముఖ్యంగా స్త్రీలు సాంఘికనవలలు రాసేరు. పెద్ద చదువులు చదువుకున్నస్త్రీలలో కూడా చారిత్రకనవలలు రాసినవారు నాకు తెలిసి మల్లాది వసుంధర ఒక్కరే. 50లలో అనుకుంటాను ఆంధ్రా యూనివర్సిటీవారు నవలలపోటీ పెట్టినప్పుడు, ఆవిడ “తంజావూరు పతనం” రాసి బహుమతి గెల్చుకున్నారు.

చారిత్రక నవలలు రాయడానికి ఒక కారణం బహుశా మనలో జాతిగౌరవాన్ని, పౌరుషాన్ని పునరుద్దరించడం అనుకుంటా.

తెన్నేటి సూరి గారి ఛంఘిజ్‌ఖాన్ ఆరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. మన చరిత్ర మనం చదువుకోడానికి కూడా ఇంగ్లీషువారు రాసినపుస్తకాలే గతి అయినరోజుల్లో సహజంగా వారికోణంలోనుండి ఆవిష్కరించిన అంశాలే మనకి వేదవాక్యాలవుతాయి. ఇంగ్లీషువారిదృష్టిలో పరమ దుర్మార్గుడయిన ఛంఘిజ్‌ఖాన్ పరిపాలనాదక్షతా, రాజనీతీ, శౌర్యపరాక్రమాలూ అద్భుతంగా ఆవిష్కరించారు తెన్నేటి సూరిగారు అన్నారు ఆరుద్ర. ఆరోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు వంటి ప్రముఖ రచయితలు కూడా చారిత్రకనవలలు పత్రికలలో ప్రచురిస్తూ వచ్చేరు. ఇది అప్రస్తుతం అయినా పత్రికలని ఈ విషయంలో మెచ్చుకోక తప్పదు. పత్రికలు ఈ చారిత్రకనవలలు ప్రచురించడం ద్వారా పాఠకులకి మరచిపోతున్న, అపోహలకి గురి అయిన మన చరిత్రని తిరిగి అసంఖ్యాక సాధారణ పాఠకులముందు పెట్టడం ఒక సత్ఫలితం. అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందిన నవలలు విశ్వనాథ సత్యనారాయణగారి ఏకవీర, అడవి బాపిరాజుగారి గోనగన్నారెడ్డి, నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి – నాకు జ్ఞాపకం ఉన్నవి. కానీ ఇంకా చాలానే ఉన్నాయి ఇప్పుడు నాకు గుర్తు లేవు కానీ.

సాంఘికనవలకీ చారిత్రక నవలకీ, చరిత్రకీ వ్యత్యాసం సూక్ష్మంగా చెప్పాలంటే సాంఘికనవల చాలావరకూ సమకాలీనజీవితాన్ని చిత్రిస్తుంది. చారిత్రక నవల గతకాలపు సమాజాన్ని చిత్రిస్తుంది. గతకాలంలో రాజవంశాలకే ప్రాముఖ్యత కనక సహజంగానే కథానాయకులు రాజులూ, చక్రవర్తులూ అయేరు. శ్రీరంగరాజ చరిత్ర రాసిన నరహరి గోపాలకృష్ణమ్మ సెట్టిగారు “ఇది సోనాబాయి పరిణయము అయినను ప్రబంధములలో కథానాయకునికే ప్రాముఖ్యము కనక శ్రీ రంగరాజ చరిత్ర అని పేరు పెట్టితిని” అని వివరణ ఇచ్చుకున్నారు. ప్రబంధ సాహిత్య లక్షణం అయిన వర్ణనలు కూడా ఇందులో ఉన్నాయని ఆయనే అన్నారు. ఇలాటి వర్ణనలు ఇంగ్లీషు నవలల్లో చదివినట్టు నాకు గుర్తులేదు. బహుశా ఇది కూడా తెలుగునవలకే ప్రత్యేకమేమో.

చారిత్రక నవల అంటే ఇతివృత్తం వెతుక్కోనక్కర్లేదు, అది సిద్ధంగా ఉంటుందనడానకి లేదు సూక్ష్మంగా ఆలోచిస్తే. చారిత్రక నవల సమయానుకూలంగా అద్భుతమైన కల్పనలు చేర్చి, పాఠకులని తనలోకి లాక్కుంటుంది. పాఠకుడు మానసికంగా ఆకాలంలోకి పోయి కథలో లీనమయిపోతాడు. చరిత్ర అస్థిపంజరంలాటిది. దాన్ని నవలగా మార్చడానికి రచయిత రక్తమాంసాలు చేర్చి, ప్రాణం పోసి, ఆపైన కన్నులపండువుగా నానా ఆభరణాలతో అలంకరించి పాఠకులని మైమరపించేలా చేస్తాడు. సన్నివేశాల కూర్పూ, పాత్రచిత్రణాలాటివి రచయితకి పని పెడతాయి. అంతే కాదు. చారిత్రక నవల రాయదలుచుకున్న రచయితకి చార్రిత్రక సత్యాలను పరిశోదించి తననవలకి అనుగుణంగా మలుచుకుని వాడుకోవలసిన అగత్యం కూడా ఉంది.  చరిత్ర చదువుతుంటే పాఠకుడికి ఉత్తేజం కలగదు. తాదాత్మ్యం పొందడు. చరిత్ర చదవడం జ్ఞానసముపార్జనకీ, తాత్త్విక చింతనకీ. చారిత్రక నవల చదవడంలో సాహిత్యపరమైన ఆనందానుభూతి ఉంటుంది. ఆ పైన కొన్ని విశేషాలు తెలుసుకున్నానన్న ఆనందం ఉండొచ్చు.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత మూడున్నర నెలల్లోనూ నేను చదివిన రెండున్నర చారిత్రక నవలలకీ ఇది ఉపోద్ఘాతం అన్నమాట :).

రెండు నవలల్లో కాకతిరాణి రుద్రమదేవికి ప్రముఖపాత్ర ఉంది. మూడోనవలలో ఆవిడే ప్రధానపాత్ర.

అవి – 1.  అన్నమాంబిక. రచయిత చిట్టిబాబు. కథ గోనగన్నారెడ్డిని వరించి వివాహమాడిన రాజకన్య అన్నమాంబిక చరిత్ర.. చిట్టిబాబుపేరు నేను ఆరోజుల్లో వినలేదు కానీ ఈ నవలకి ముందుమాటలో ప్రఖ్యాతరచయిత అనే రాసేరు. ఇది నేను సగానికి మించి చదవలేకపోయేను. రాసింది యాభైలలోనే అయినా ప్రబంధరీతిలోప్రతిపాత్రతోనూ రచయిత లీనమయిపోయి. వీరవైష్ణవాన్ని తలపించే భక్తితో, ఆనాటి కైవారాలు పేజీలకి పేజీలతో నింపేశారు. అంచేత నాకు పట్టలేదు.

 1. అడివి బాపిరాజుగారి గోనగన్నారెడ్డి. ఇది కూడా పైకథే కానీ ఇందులో గోనగన్నారెడ్డికి ప్రాధాన్యం కనక ఆయన రాజనీతి. చతురత, వీరశౌర్యాలు వంటివి చక్కగా వివరించడం జరిగింది. ఈనాటి పాఠకులు చాలామంది మెచ్చుకుంటున్న నవల ఇది. మరియు నేను పూర్తిగా చదివేను. ఇందులో కూడా భట్రాజులు పాడే కైవారాలు అక్కడక్కడ ఉన్నా అన్నమాంబికలో ఉన్నంత అతి లేదు. కథ నడుస్తుంది. మళ్ళీ చదువుతానని చెప్పలేను కానీ ఒకసారి నాచేత పూర్తిగా చదివించిన నవల అని మాత్రం చెప్పగలను. ఆపైన, రుద్రమదేవిమీద నా కుతూహలాన్ని మరింత పెంచింది. ఆఊపులో నోరి నరసింహశాస్త్రిగారి నవల రుద్రమదేవి కొనేసి చదివేశాను.
 2. నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి – నాకు చాలా నచ్చిన నవల.  ఇప్పటికి చాలాసార్లే మనవి చేసుకున్నాను నాకు చదవడం కష్టం అని. అంచేత నేను ఆపకుండా చదివేనంటే అది ఆ నవలకి మరో ప్లస్ అన్నమాట.

ఈ విషయం మరొక టపాలో విపులంగా రాసేను.

(మార్చి 21, 2011)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

One thought on “చరిత్ర, చారిత్రక నవల”

 1. వ్యాసం చాలా బాగుంది. ధన్యవాదాలు.
  వీరి తరువాత చారిత్రిక నవలలు రాసిన వారు లేరా?
  ముదిగొండ శివప్రసాద్ గారి పేరుకు ముందు “చారిత్రక నవలా సామ్రాట్” అని రాస్తారు. మిగితా వాటి సంగతి తెలీదు కానీ, వీరి “శ్రీపదార్చన”, “రెసిడెన్సీ” చదివాను. శ్రీపదార్చన బానే ఉన్నట్లు అనిపించింది, చిన్నప్పుడు చదివినప్పుడు. అప్పుడు చదివుంటే రెండోది కూడా నచ్చేదేమో కానీ, ఊహతెలిసాక చదివినందుకు, రెసిడెన్సీ నవల ను చూస్తున్నంత సేపు ఇదే కథని చర్చించిన ఆంగ్ల నవలే బాగా రాసారు అనిపించింది.

  నోరి గారి “కవిసార్వభౌముడు” చదివినప్పుడు కూడా, పైన మీరన్న పొగడ్తలూ అవే ఎక్కువ అనిపించి, కాసేపటికి ఎంతకీ అసలు కథ రావట్లేదని ఆపేశాను 🙂

  నా గోడుకేం గానీ, వ్యాసం మాత్రం చాలా బాగుంది!

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s