ఊసుపోక – హా, నాస్టాల్జియాయే నేరమౌనా?!

(ఎన్నెమ్మకతలు 69)

ప్రేమే నేరమౌనా అని ఓపాత సినిమాపాట ఉంది చూడండీ, అలాగన్నమాట.

మనం వెనక్కి తిరిగి చూసుకోకూడదా? వెనక్కి చూస్తే అది తిరోగమనవాదమా?

చివరికి మిగిలేది జ్ఞాపకాలే కాదా?

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు?

గతమెంతొ మేలు వచ్చు కాలముకంటెన్ …

కళ్ళెవరికీ వెనక్కి ఉండవు. ఎందుకూ అంటే మనం చూసుకోవలసింది వెనక్కి కాదు ముందుకి అని.

అలనాటి నన్నయ దగ్గరినుండీ కవులూ, రచయితలూ అందరూ సాహిత్యంలో నవ్యత ప్రవేశపెట్టడానికే ప్రయత్నిస్తున్నారు అంటారు నోరి నరసింహశాస్త్రిగారు. అంటే ఏమిటీ, వెనక్కి కాదు, ముందుకి చూడమనే కదా.

నామటుకు నేను కూడా యథాశక్తి ఓ పరక ఆ అగ్నిలో వేసినట్టే ఉంది నిన్నటి కవిత చూస్తే.. హుమ్. నిజంగా నేను అలా అనుకుంటూ మొదలెట్టలేదండీ. అదే అలా తయారయింది, అయ్యవారిని చేయబోతే, కోతి కాదనుకోండి, మరేదో తయారయింది..

మ్.మ్. నిజానికి మావాకిట్లో వేపచెట్టూ లేదు, కర్రియావూ, లేగదూడా అసలే లేవు. హీహీ. అన్నీ కల్పనలే. .. స్వకపోల… కూడా కాదు, ఖర్మ… పాతకథల్లో ఎక్కడో ఎప్పుడో చదివిన రెండు ముక్కలూ పైకొచ్చేయి, అంతే.

అన్నట్టు కథలంటే జ్ఞాపకం వస్తోంది. ఈమధ్య కథల్లో ఈ నాస్టాల్జియా ఎక్కువయిపోయి, ఆరోజులు రావంటూ విడిచిన నిట్టూర్పులు ఆవిరై, మొత్తం ఎట్మోస్ఫియరంతా పొల్యూటయిపోయి, అవే టోర్నెడోలకి కొంతయినా కారణం అయిపోతున్నాయని అభిజ్ఞవర్గాల అభిప్రాయంట. కనీసం కొన్ని విమర్శలు చూస్తే అలా అనిపిస్తోంది మరి.

నిజానికి నాకసలయినా వీళ్ళందర్నీ నిలేసి అడగాలనిపిస్తోంది. ఏమనంటే, “అయితే ఏం?” అని. ఎందుకని అడగండి చెప్తాను.

మీరు ఎప్పుడయినా మీ చిన్నప్పటి ఫొటోలు తీసి చూసుకున్నారా? “నా చిన్నప్పుడు మాఅమ్మ పెరుగూ అన్నం ముద్దలు కలిపి పెట్టేది”. లేకపోతే, మీ తెలుగు మాష్టారు, లేక సైన్సు మాష్టారు “నువ్వు చాలా తెలివైనదానివి, లేక –వాడివి, గొప్పవాడివవుతావు” అని చెప్పలేదూ? అవి మళ్ళీ మీరెప్పుడూ తలుచుకుని మురిసిపోలేదూ? – వీటన్నటికీ “లేదు”, “లేదు”, “లేదు” అని మీరంటే ఇంక నేను చెప్పేదేమీ లేదు. మరో బ్లాగుకెళ్ళిపొండి.

మీరింకా వింటానంటే నేను చెప్పేది ఇలా ఉంటుంది —

నాల్రోజులక్రితం పెట్టిన కవితలో “ఆనాటి” సంగతులున్నాయి. ఇటీవలికాలంలో ఇన్ని వ్యాఖ్యలకి నోచుకున్న టపా ఇదే. ఎందుకంటే ఈ “ఆనాటి” మాటలే అనుకుంటున్నా. అవే చాలామందికి తమ తమ ఆనాటిసంగతులు గుర్తుకి తెచ్చేయి. మనసుల్ని తడి చేసాయి అని అనుకుంటున్నాను. నిజానికి నాకు ఆ కర్రిఆవూ, లేగదూడా అన్నమాటలు చప్పున స్ఫురించలేదు. చాలా చాలా ఆలోచించవలసివచ్చింది. ఇప్పటికీ ఆవువిషయంలో నేను పొరపాటు పడ్డాననే అనుకుంటున్నాను. ఆవులలో ఏదో ఒకరకం ఆవుని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అదేమిటో నాకు గుర్తు రావడం లేదు. ప్చ్.

మరో విషయం. ఇది నేను మొదలు పెట్టినప్పుడు నాఆలోచన వేరు. “అయ్యో ఆనాటి ఆ విషయసంచయం ఇప్పుడు లేదే” అని కాదు.

ఆరోజు నేను వరండాలో కూర్చుని ఉదయిస్తున్న సూర్యుని, ఆకాశంలో మారుతున్న రంగుల్నీ చూస్తుంటే అనిపించింది “అభ్బ ఎంత బాగుంది” అని. అది మాత్రమే రాయాలనుకున్నాను. ఆకాశం విశాలం, పృథ్వి విపులం … ఇలా అనుకుంటుంటే తోచింది మనిషికీ మనిషికీ మధ్య మాత్రం ఎడం పెరిగిపోతోంది అని.

గాస్ స్టేషనుకెళ్తే, సెల్ఫ్ సర్వ్, గ్రోసరీస్టోరులో సెల్ఫ్ సర్వ్, బాంక్‌లో డ్రైవిన్, డ్రైక్లీనర్సుతో, ఫాస్ట్ ఫుడ్ దగ్గర రెండుగజాలదూరంనించీ మైకులో మాటాడాలి. ఫోన్ చేస్తే ఆటోమేటెడ్ జవాబులు, ఆ జవాబుల్లో మీకు కావలసిన సమాచారం దొరుకుతుంది అంటూ వస్తుంది. నూటికి తొంభైవంతులు మనకి కావలసిన జవాబు ఉండదు అందులో. ఈ ఆటోమేషన్ వెనక ఊపిరున్న నిజమనిషిని వెతికి పట్టుకోడం ఓ పెద్ద ఆర్టు. ఐక్యూ చాలా హై లో ఉన్నవారికే సాధ్యం. ఇవన్నీ మనసౌలభ్యంకోసమే అంటారు సాంకేతిక లేక ఆధునిక నరవరులు.

నిజానికి నేను కూడా చాలామటుకు వీటిమీదే ఆధారపడతాను. ఎంచేతంటే, ఒకవేళ మనిషి దొరికినా వాళ్ళు నావేపు చూసిన చూపు చూస్తే, “ఆమాత్రం తెలీదూ నీకు?” అంటున్నట్టుంటుంది.

ఇంతకుముందు నేను మరో టపా రాసేను మాప్రాంతాల్లో ఆతిథ్యంగురించి. దానికి కూడా స్పందన బాగా వచ్చింది. చాలామందే బ్లాగులోనూ, ప్రత్యక్షంగా నాతోనూ తమకి కూడా అలాటి సుహృద్భావంతో కూడిన సహాయాలు అందేయని చెప్పేరు. ఇక్కడ నాప్రశ్న మనం ఇది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవుసరం ఎందుకు వచ్చింది? అని. ఏదైనా మనం ఎప్పుడు చెప్పుకుంటాం? మనిషికి మనిషి సాయం చెయ్యడం అపురూపం ఎందుకయింది? ఎలా? ఎప్పుడు?

నిజానికి మనిషికి మనిషి సాయం ఒక మానవీయ విలువ కదా. గణవిభజన జరిగిననాటినుండీ ఒకరికొకరు సాయం చేసుకోడం జరుగుతూనే వచ్చింది. మరి ఇప్పుడు అది ఆశ్చర్యంగా చెప్పుకోవలసిన పరిస్థితి ఎలా ఏర్పడింది?

ఎంతసేపూ “మాయింటికొస్తే నాకేం తెస్తావు?” “మీయింటికొస్తే నాకేమిస్తావు?” అనే రూలు ఎప్పుడు, ఎలా అమలులోకి వచ్చింది?.

ఒక్కమాటలో నేను అడుగుతున్నది “ప్రపంచం కుంచించుకుపోతోంది” అంటే దేశాల ఎల్లలు దాటి ఒకరినొకరం పలకరించుకోగలుగుతున్నాం కానీ మనిషికీ మనిషికీ ఎడం ఎక్కువయిపోతోంది. ఎంచేత అని? నిజానికీ ప్రపంచం కుంచించుకుపోడానికీ, మనసులు కుంచిచుకుపోడానికీ సంబంధం లేదు. ఉండకూడదు. సాటివాడికి సాయం పడడం అన్నది కూడా విస్తృతం ఎందుకు కాకూడదూ అనీ నాబాధ. అందుకే వెనక్కి తిరిగి చూసుకోడంలో కూడా తప్పు లేదు అని. తిరిగి చూసుకుని, మనం ఉండవలసింది అలా అని మనకి మనం చెప్పుకోడంలో తప్పు లేదు.

వెనకటిరోజుల్లో సంగతులు తలుచుకుని, ఆ  క్షణాల్లో మనసు ఎలా పరవశించిందో ఈనాటి జీవితాన్ని తలుచుకుని అలా పరవశించగలగాలి. అలా కావాలంటే, మనిషికీ మనిషికీ మధ్య దూరం తగ్గాలి కానీ పెరగకూడదు. అదనుకుంటా నేను చెప్పదలుచుకున్నది.

నాకీ చింత మొదలవడానికి కారణం – నోరి నరసింహశాస్త్రిగారి వ్యాసాలు. నన్నయ మొదలుకొని కవులు మహాభారతంలాటి కావ్యాలు రాయడం ప్రజలలో ధార్మికబుద్ధి క్షీణించిపోతున్నప్పుడు, జాతిచరిత్ర గుర్తు చేసి, మళ్ళీ జాతిపౌరుషం, ధర్మం పునరుజ్జీవింపచేయడానికి అని రాసేరు. రెండోది, ఈమధ్య  సౌమ్య రాస్తున్న జర్మనీవిశేషాలు. జర్మనీకి ఎంతో చరిత్ర ఉంది. గతాన్నీ ప్రస్తుతాన్నీ సమన్వయపరుచుకుంటూ, జర్మనులు తమ జీవితాలని ఎలా మలుచుకుంటున్నారో తను చెప్తుంటే నాకు మహ ఆనందంగా ఉంది.

ఏంటోలెండి. ఇదేదో విడదీయడానకి ప్రయత్నించినకొద్దీ మరింత చిక్కులు పడుతున్న దారపుఉండలా మరింత గందరగోళం అవుతున్నట్టుంది.

మీకేమైనా అర్థమయితే సరే. లేకపోతే లేదు. అంతే.

(ఏప్రిల్ 28, 2011)


ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “ఊసుపోక – హా, నాస్టాల్జియాయే నేరమౌనా?!”

 1. #అదేంటండీ. హా, ఎన్నెమ్మ ఎవరో ఇంకా పోల్చుకోలేదా.. ని కి ఎన్, మా కి యమ్.. దాన్ని తెనుగీకరించడానికి “అమ్మ”.

  అరదమయింది ఇప్పుడు..ఎంత చక్కగా పెట్టారు మీ కలంపేరు 🙂

  మెచ్చుకోండి

 2. @ రాజేష్ జి.,. క్షమించాలి. ఈ మోడరేషన్ తో నాకు గొడవగానే ఉంది. ఈమధ్య బుర్రలేనివడొకడు నా బ్లాగులో వ్యాఖ్యపేరుతో దుర్భాషలాడడంతో ఇది పెట్టక తప్పలేదు. మీరు శ్రమ తీసుకుని మీ అభిప్రాయాలు వివరంగా రాసినందుకు ధన్యవాదాలు మనఃపూర్వకంగా..
  అదేంటండీ. హా, ఎన్నెమ్మ ఎవరో ఇంకా పోల్చుకోలేదా.. ని కి ఎన్, మా కి యమ్.. దాన్ని తెనుగీకరించడానికి “అమ్మ”. :))
  – నిడదవోలు మాలతి!

  మెచ్చుకోండి

 3. $మాలతి గారు

  కొద్దిగా ఆలస్యంగా చూస్తున్నా ఈ టపాని వేరే గొడవల్లో పడి :). టపా తెరువగానే మీ గతకాలపు మధురస్మృతులు(గ.మ), ఆలోచనాభరిత పరిమళాల గుభాళింపుని తృప్తిగా పీల్చాను!

  #నాస్టాల్జియాయే నేరమౌనా?!….ప్రేమే నేరమౌనా
  :)) అబ్బే! ప్రేమ అవ్వచ్చేమోకానీ గ.మలు తలుచుకోవడం అస్సలు నేరం కాదు :).

  #(ఎన్నెమ్మకతలు 69)
  ఎవరీ ఎన్నెమ్మ గారు?

  #వెనక్కి తిరిగి..జ్ఞాపకాలే..నిరుడు కురిసిన హిమసమూహములు?
  హ్మ్..!s
  #కళ్ళెవరికీ వెనక్కి ఉండవు.
  తల వెనక్కి తిప్పి చూస్తే సరి 🙂

  #..నన్నయ..నవ్యత..నోరి నరసింహశాస్త్రిగారు. అంటే ఏమిటీ, వెనక్కి కాదు, ముందుకి చూడమనే కదా.
  వారికాలం మనకాలం వేరు కదా? వారికి మనలా గ.మ లు తలుచుకోవలిసిన అవసరం ఉందంటారా?

  #..వేపచెట్టూ,కర్రియావూ, లేగదూడా లేవు…అన్నీ కల్పనలే..
  అయినా బావుంది మీ కల్పనాచాతుర్యం. కాసేపు మమ్మల్నదరినీ కనికట్టు చేసి అవి మీ బాల్యపు సంగతులంటూనే మా బాల్యంలోకి పరుగులెత్తించారు. అది చాలదా 🙂

  #..కథల్లో..నాస్టాల్జియా..విమర్శలు..నిలేసి అడగాలనిపిస్తోంది. ఏమనంటే, “అయితే ఏం?” అని.
  అంతే మాలతి గారు అలా అడగండి. మీకు నా సంపూర్ణమద్దతు. 🙂

  #..చిన్నప్పటి ఫొటోలు.. “లేదు”, “లేదు”, “లేదు”..మరో బ్లాగుకెళ్ళిపొండి.
  నా సమాధానం అవును..అవును..అవును కాబట్టి ఈ బ్లాగులోనే ఉంటా 🙂

  #..కవితలో “ఆనాటి”..మనసుల్ని తడి చేసాయి అని అనుకుంటున్నాను.
  అవును నిజ్జంగా 🙂

  #ఆవులలో..ఆవుని ప్రత్యేకంగా చెప్పుకుంటారు.
  ఆ…మా ఒంగోలు ఆవేనా? 🙂

  #..ఉదయిస్తున్న సూర్యుని, ఆకాశంలో మారుతున్న రంగుల్నీ..ఆకాశం విశాలం, పృథ్వి విపులం..తోచింది మనిషికీ మనిషికీ మధ్య మాత్రం ఎడం పెరిగిపోతోంది అని.
  హ్మ్… సూర్యునికి/ఆకాశానికి మనకు ఉన్న౦త ఎడం 😦

  #..మనిషికి మనిషి సాయం ఒక మానవీయ విలువ కదా…“మాయింటికొస్తే నాకేం తెస్తావు?” “మీయింటికొస్తే నాకేమిస్తావు?”..రూలు ఎప్పుడు, ఎలా అమలులోకి వచ్చింది?
  జీవితాల్లో “మానవ” విలువ తగ్గి ఎప్పుడైతే మనీ విలువ పెరిగిందో అప్పుడు! 😦

  #…“ప్రపంచం కుంచించుకుపోతోంది”..మనిషికీ మనిషికీ ఎడం ఎక్కువయిపోతోంది. ఎంచేత అని?
  #సాటివాడికి సాయం పడడం అన్నది కూడా విస్తృతం ఎందుకు కాకూడదూ అనీ నాబాధ. అందుకే వెనక్కి తిరిగి చూసుకోడంలో కూడా తప్పు లేదు అని. తిరిగి చూసుకుని, మనం ఉండవలసింది అలా అని మనకి మనం చెప్పుకోడంలో తప్పు లేదు.
  మీ మనసులోని భావం, ఉద్దేశ్యం చాలా పదిలంగా, అర్థవంతంగా చెప్పారు. ధన్యవాదాలు. సాయం కావాలి మరి!

  #..ఈనాటి జీవితాన్ని తలుచుకుని అలా పరవశించగలగాలి..మనిషికీ మనిషికీ మధ్య దూరం తగ్గాలి కానీ పెరగకూడదు.
  హ్మ్.. చక్కగా చెప్పారు!

  #..ప్రజలలో ధార్మికబుద్ధి క్షీణించిపోతున్నప్పుడు, జాతిచరిత్ర గుర్తు చేసి, మళ్ళీ జాతిపౌరుషం, ధర్మం పునరుజ్జీవింపచేయడానికి అని రాసేరు.
  నిజమే! స్వార్థావస్థలో నిద్రాణమై ఉన్న సాయాన్ని మేలుకోల్పాలంటే ఇతోధిక రచనలు కావాలి..వాటిని అనుసరించేవారి తోడుగా!

  #మీకేమైనా అర్థమయితే సరే. లేకపోతే లేదు. అంతే.
  :))

  మెచ్చుకోండి

 4. కుమార్ యన్, లేదండీ, ప్రత్యేకించి నాకథల్లో నాస్టాల్జియా ఎక్కువగా ఉందని ఎవరూ అనలేదు. తరుచూ కనిపిస్తున్న ఒక విమర్శని వాడుకున్నానంతే. నిజానికి నేను చెప్పనిది మీరు చెప్పేరు. వెనక్కి తిరిగి చూసుకోడం అన్నది ఆకర్షణీయంగానూ, ఆర్ద్రంగానూ చెయ్యొచ్చు, ప్రాణాల్ని విసిగించేదిగానూ చెయ్యొచ్చు. మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. .

  మెచ్చుకోండి

 5. ము౦దుగా లలిత గారికి,
  “ఎదిగే కొద్దీ మనం చూసే ఎత్తు కూడా పెరుగుతుంది. దృశ్యం మారినట్లనిపిస్తుంది.”
  మ౦చి పరిశీలన.. నేను కొ౦చె౦పెద్దయ్యి పొడుగు పెరిగాక, అమ్మమ్మా, నాన్నమ్మా ఊళ్ళేళ్ళినప్పుడు, ఆ పెద్ద పెద్ద వీధులు అకస్మాత్తుగా అ౦త చిన్నగా కుది౦చుకుపోయాయా అనుకున్న స౦దర్భాలు గుర్తొచ్చాయి.

  ఇహ మీలా వాళ్ళ ఎత్తు లో౦చి చూట్ట౦… ….yeah..we all live in multiple realities at any given point of time, and any sneak peak into Someone Else’s reality, would be very interesting to read, especially if it is of a child.

  మాలతి గారికి,
  నోస్టాల్జియా నిట్టూర్పులే టోర్నాడోలయిన వేళ…….హ హ హ, అదేమో తెలీదు కాని, ఎదురుచూపుల బుసలు, అ౦తకన్నా ప్రమాదకరమయినవి 🙂
  నోస్టాల్జియా కథలు రాయద్దు అన్నారా ఎవ్వరైనా? ఒకవేళ అన్నా మీలా౦టి రచయితలకి అప్లై అవ్వవూ, ఎ౦దుక౦టే మీరు అన్నీ అవ్వే రాయరు కాబట్టి, అ౦తకన్నా ముఖ్య౦గా మీరు అబ్బా, “టిపికల్” అని మధ్యలోనే వెళ్ళిపోయేలా చేయరు కాబట్టి. అయితే ఒక మాట మాత్ర౦ చెప్తాను. రచయితగా కాస్త స్థాన౦ వచ్చాక, నాలా౦టి పాఠకులు ఒక స్థాయి రచనలని ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలా౦టప్పుడు వరసపెట్టి, నోస్టాల్జియా స్టఫ్, టిపికల్ ఇ౦డియా-అమెరికన్ డిఫరెన్సెస్, అది కూడా నాసి రక౦గా రాసిన రచనలు ఓ నాలుగు సీరీస్ లో వచ్చాయనుకో౦డి, నా లా౦టి వాళ్ళు ఖశ్చిత౦గా డిసప్పాయి౦ట్ అవుతారు. అది కాస్తా శ్రుతి మి౦చితే, ఓ కామె౦ట్ కూడా పెడతారు, అబ్బా మీరు కూడా ఏ౦ట౦డీ, టిపికల్ నోస్టాల్జియా స్టఫ్ అని.

  పోతే మీరన్నారే, ఎప్పుడన్నా మీ పాత ఫోటోలు చూసుకున్నారా అని, యా, మే బి, ఎప్పుడో ఒకప్పుడు… బట్ నేను ఎవరి౦టికన్నా పోయినప్పుడు, వాళ్ళు అదే పనిగా వాళ్ళ పాత ఫోటోలు చూపి౦చే ఎపిసోడ్ మొదలెట్టార౦టే నాకు భలే చికాకు. నాకు తెలిసి అ౦దరికీ చికాకే, కొద్ది మ౦ది భరిస్తారు, నేను మాత్ర౦ మొహమాట౦ లేకు౦డా అక్కడ టి వి రిమోట్ వెతుక్కొ౦టా. ఖర్మ..అ౦తకు ము౦దు ఆల్బమ్స్ అన్నా ము౦దేసేవారు, కొన్ని స్నాక్స్, టీ తో, ఈ మధ్య టి వి లకే హార్డ్ డిస్క్ లొచ్చేసరికి, వాళ్ళ ట్రిప్స్ అన్ని టి వి లోనే, మ్యూజిక్ తో సహా చూపిస్తున్నారు. యు సీ, హౌ హార్డ్ హావ్ లైవ్స్ బికమ్.

  “ఏంటోలెండి. ఇదేదో విడదీయడానకి ప్రయత్నించినకొద్దీ మరింత చిక్కులు పడుతున్న దారపుఉండలా మరింత గందరగోళం అవుతున్నట్టుంది.”

  హి హి హి, నేను కూడా ఓ చేయేద్దామని, ఇ౦కొ౦చె౦ చిక్కులేయడానికి

  మెచ్చుకోండి

 6. లలితా, నేను చెప్పదలుచుకున్నది మీరు మరింత స్పష్టం చేసారు, మీ అనుభవాలూ, ఆలోచనలూ పంచుకుని. మీరన్నట్టు, మనం (పొడుగు) ఎదుగుతున్నకొద్దీ మనం చూసే దృశ్యం మారుతూంటుంది. అది గ్రహించి, ఆ మార్పులవల్ల మనం మానసికంగా ఎంత ఎదిగేం అన్నది కూడా పరిశీలించి చూసుకోవాలి అప్పుడప్పుడూ. అలా చేస్తేనే మనకి నిజమైన జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. మరొకసారి ధన్యవాదాలు. – మాలతి

  మెచ్చుకోండి

 7. మాలతి గారూ,
  మీరు చెప్పదల్చుకున్నది నాకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను.
  మీ కవితలో భావం కూడా అర్థమ్యినట్లే అనిపించినా, అప్పటికి బాగా తాకిన ఒక రెండు మాటల గురించి నా ఆలోచనలు పంచుకున్నాను.
  నేను చాలా చూసుకుంటాను వెనక్కి. అందు వల్ల చాలా సార్లు మంచి జరిగింది.
  ఉదాహరణలు:
  మా పిల్ల చిన్నప్పటి ఫోటోలు చూస్తుంటే మా పెద్దబ్బాయి చాలా పసి వాడుగా ఉన్నప్పటి ఫోటో కనిపించింది.అప్పుడనిపించింది మొదటి వాడైనందుకు వాడిని ఎంత త్వరగా పెద్ద వాడిలా treat చెయ్యడం మొదలు పెట్టానో కదా అని. నేను పూర్తిగా మారకపోయినా, అంకుశంలా అది నన్ను మరీ దారి మళ్ళకుండా నడిపిస్తుంటుంది.
  ఇంకా కొన్ని విశేషాలు మాటలలో చెప్పలేనివి నాకు అనుభవం.
  అది ఇప్పటి జ్ఞాపకాలనూ అందంగా పదిలం చేసుకొనే ప్రయత్నానికి ఊపిరి పోస్తోంది. ఉట్టి ఫోటోలే కాదు ఆ జ్ఞాపకాలని బలంగా నాటుకుని పోషించుకుంటూ సాగే ప్రయత్నం చేస్తున్నాను. ఫోటో ఒక సాధనం మాత్రమే.
  ఐతే నాకు వ్యక్తీకరించడానికి ఒక ఉపమానం దొరికినట్లనిపించి nostalgia గురించి ఇంకొన్ని మాటలు ఇక్కడ రాస్తున్నాను.
  చాలా సార్లు మనం అప్పటి రోజులు వేరు అనుకుంటూ ఉంటాము (ప్రతి తరం వాళ్ళూ, వారి పాత రోజుల గురించి). ఐతే మరీ ముఖ్యంగా అలాంటి కొన్ని టపాలు వరసగా చదివిన చదివిన తరవాత అనిపించిన విషయం ఇది:
  చిన్నప్పుడు పిల్లలు వాళ్ళున్న ఎత్తు వరకే చూస్తారు. ఒక సారి ఊహించుకోండి ఆ ఎత్తులో పరిసరాలు గమనించుకోవడం. నాకు ఆ అనుభవం అనుకోకుండా మనసుని తట్టడం ఇలా జరిగింది. మా కిటికీలోనించి కనిపించే దృశ్యం సోఫాలోంచి చూడడం మాత్రమే తెలిసిన నాకు ఒక సారి పిల్లలతో పాటు నేల మీద కూర్చుని అనుకోకుండా అక్కడ్నుంచీ కిటికీలోకి చుస్తే ఎప్పుడూ చూడని దృశ్యం కనిపించింది. డిజిటల్ కెమెరా పట్టుకుని ఫోటో తీసేసాక ఆఫ్ చెయ్యకుండానే వొళ్ళో పెట్టుకున్నప్పుడో, కిందకు పట్టుకున్నప్పుడో అందులోనించి కనిపించే దృశ్యం (మన బట్టల మీది డిజైనో, నేల మీద పడి ఉన్న ఎండుటాకులో) ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది ఒక్కో సారి. ఎదిగే కొద్దీ మనం చూసే ఎత్తు కూడా పెరుగుతుంది. దృశ్యం మారినట్లనిపిస్తుంది.
  అలాగే మనలో చాలా మందిమి ఒక మాదిరి పరిస్థితులలో పుట్టీ పెరిగి ఈ నాడు సౌకర్యాలు పెంచుకున్న వాళ్ళము. ఒకప్పుడు మన తోటి వారిలో మనము ఇప్పుడు ఉన్న స్థితిలో ఉన్న వారు ఉండి ఉంటారు కచ్చితంగా. వారు ఈ నాడు ఇంకా పై స్థాయిలో ఉండ వచ్చు. వారి జ్ఞాపకాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటే?
  నేను చెప్పదలుచుకున్నది అర్థమయ్యిందని ఆశిస్తాను.
  ఈ మధ్య నాకు రాయడానికి ఓపిక తగ్గింది. మీ టపాలన్నీ చదువుతున్నాను కాని కొన్నిటికే వ్యాఖ్యలు రాస్తున్నాను. అలాగే ఇంకా కొందరి టపాలకి కూడా (including Sowmya’s).
  There’s a strong point in what you said about the effect Nori NarasimhaSastri garu’s essays had on you.
  History is important. I am realising it only now as I am reading and learning with my kids once again, from a totally different perspective for a completely different reason from when I read as a kid.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s