మార్పు 18

తలుపు తట్టిన అరవిందకి తలుపు తీసి, “రా, ఇప్పుడే అనుకుంటున్నా, టీ పెట్టుకుందామా అని,” అంది సిరి.

“నే పెడతాలే” అంది అరవింద వంటగదివేపు నడుస్తూ.

అరవింద టీ తెచ్చి సిరికిచ్చి, ఎదురుగా కూర్చుంది.

“నువ్వు తెచ్చుకోలేదేం?”

“ఇప్పుడే తాగి వస్తున్నా, కాంప్లిమెంట్స్ ఆఫ్ సుందరంగారు.”

“ఆహా, సుందరంగారు అతిధిమర్యాదలు బాగా చేసేరేంటి?”

“ఆహా. చాలా బాగా. కళ్ళు తిరిగేయి.”

“మొహం చూస్తే ఏమంత రుచించినట్టు లేదు. ఏమయిందేమిటి?”

“రుచించడానికేం, టీ బాగానే ఉంది రుచి. ఆయన మాటలే … మరోగంట అక్కడుంటే, పరిగెత్తుకెళ్ళి విషిని పెళ్ళాడేసేదాన్నేమో కూడా.”

“ఓహో.”

“నీకు నవ్వెందుకొస్తోంది?”

“నువ్వూ నవ్వుతున్నావు కదా.”

“అది కాదు. అసలు నాకు ఆశ్చర్యం ఏమిటంటే యథార్థాన్ని, పరమసత్యాలని ఎంత అసందర్భంగా ప్రయోగించగలరో అనీ … ఆయన చెప్పిన సు-భాషణలయితే శభాష్ అనిపించేయి. కానీ నాకిప్పుడు ఆ క్లాసు అవుసరమా అన్నదే నాకర్థం కాలేదు.”

“నువ్వేం చెప్పేవు? నువ్వేం తక్కువ తినలేదు కదా డిబేటు మాటకొస్తే.”

“నేనేం చెప్పలేదు. ఎంత చెడ్డా పెద్దవారు కదా.”

కొంచెంసేపు ఇద్దరూ టీవీలో వార్తలు చూస్తూ కూర్చున్నారు.
తరవాత నెమ్మదిగా అంది అరవింద, “అమ్మమ్మా, నాకు ఒక సందేహం. సుందరంగారు చెప్పినట్టు అండర్స్టాండింగ్ ఉండాలి అన్నది అందరూ చెప్పే ఊకదంపుడు కబుర్లే. అది ఆచరణలో ఎలా సాధ్యం అన్నదే ఒకపట్టాన అర్థం కాడంలేదు. ఈ అర్థం చేసుకోడాలు నాకొక్కదానికేనేమిటి? ఇద్దరికీ ఉండాలి కదా.”

“మరి ఆమాట ఆయన్నే అడగలేకపోయావా?”

“ఆయన్నా? మళ్ళీ మరో క్లాసు పెడతారేమోనని భయమేసి ఊరుకున్నా.”

సిరి చిన్నగా నవ్వింది తలూపుతూ.

“ఇంతకీ నాసందేహం మీకాలంలో మీరెలా సాధించుకొచ్చేరు అని. తాతయ్యతో నీకెప్పుడూ అపార్థాలూ, కోపతాపాలూ, మిసండర్స్టాండింగులూ రాలేదా?”

“అసలు ఈ అండర్‌స్టాండింగూ, మిసండర్‌స్టాండింగూ… ఇవన్నీ ఇప్పుడే వచ్చేయి. అంటే మాకాలంలో లేదని కాదు. మేం ఇలా తీరికూచుని ఈ ఈకపీకుడు చేసేవాళ్ళం కాదు. మారోజుల్లో అది కూడా రోజువారీ జీవితంలో భాగమే తినడం, తాగడం, పడుకోడంలాగే. అంతే. అడుగడుగునా ఏదో ఒకరకం పొరపొచ్చాలు అను అభిప్రాయబేధాలు అను వస్తూనే ఉంటాయి. వాటిని మేం అంత సీరియస్‌గా తీసుకోలేదనుకుంటా.” అంది సిరి సాలోచనగా.

“అంటే నీకూ తాతయ్యకూ – అదే పొరపొచ్చాలు – వచ్చేవా?”

“ఆహా లక్షణంగానూ.”

“మరి నువ్వే సర్దుకుపోయేదానివా?”

“అదే మీతో చిక్కు.”

“మీతో.. అంటావేమిటి. నాకు తెలీదు కనకే నిన్ను అడుగుతున్నాను. కదా.”

“మరేంవనమంటావు? – అవును నేనే సర్దుకుపోయేదాన్ని – అని నేను అనాలని నీఆశ. హాహా.   ఆ రోజుల్లో ఆడవాళ్ళందరూ భర్తలచేతా, అత్తా ఆడబడుచులా చేతా నానా అగచాట్లూ పడ్డారనే కదా కథలన్నీ. బాధలు ఎంత విపరీతంగా ఉంటే అంత మంచి కథ. అసలు అలా రాయకపోతే అది కథే కాదు. కానీ అలా కాక, కొందరు, నాలాటివారు తమకీ ఎదటివారికీ కూడా బతుకు ప్రశాంతంగా సాగిపోయేలా జరుపుకొచ్చేరంటే దానికి నువ్వేదో పేరు పెడతావు?”

“ఏమిటి నువ్వనేది?”

“ఇల్లు నా సామ్రాజ్యం. వంటిల్లే నా రాజధాని. నేనక్కడ ఏం చేసుకున్నా ఎవరూ అడగరు. పూజలు చేసుకున్నా వ్రతాలు చేసుకున్నా నాయిష్టమే. వీధిలోకి వెళ్ళినాయన ఆలస్యంగా వస్తే నాకు బాధ లేదు. ఎక్కడెక్కడ తిరుగుతాడో, ఏం చేసుకుంటాడో అనుకుంటూ అనుక్షణం నన్ను నేను హింస పెట్టుకుంటూ ఆయన ఇంటికి రాగానే ఆరాలు తీస్తూ నాబుర్ర పాడుచేసుకోలేదు.”

అరవింద అయోమయంగా చూసింది. “ఆయన ఎలా చేసినా నీకు అంగీకారమే అంటావు. మరి నీకొక వ్యక్తిత్వం, నీజీవితానికొక ధ్యేయం లేవా? నేనూ మనిషినే అని నీకు ఎప్పుడూ అనిపించలేదా?”

“అదే నేనంటున్నది. చూసావా? నా అంగీకారాలూ, వ్యక్తిత్వాలూ, ధ్యేయాలూ … అంటూ పేర్లు పెట్టేస్తున్నావు. ఈనాడు ప్రచారంలో ఉన్న ప్రమాణాలతో ఆనాటి జీవితాన్ని అంచనా వేస్తున్నావు. ఆకాలం అదీ అని నీకు తోచడం లేదు.”

“నీకు ఆ దృష్టి లేకపోతే, దుర్మార్గం దుర్మార్గం కాకుండా పోతుందా? ఏకాలం అయినా మనిషిని మనిషిగా చూడాలన్న ఆలోచన తప్పెలా అవుతుంది?”

“తప్పా ఒప్పా అని కాదు నేనంటున్నది. ఆరోజుల్లో లేని భావజాలం “లేదేం?” అని అడిగితే ఏం చెప్పను అంటున్నా. పోనీ, మరొకటడుగుతాను చెప్పు. ఈరోజుల్లో మీరేదో ప్రేమలూ, పెళ్ళిళ్ళూ మీరే కనిపెట్టినట్టు, మిగతా అందరూ పెద్దలు చెప్పినమాట ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకుని ఏదో కోల్పోయినట్టు మాటాడుతున్నారు. పెళ్ళి ఎలా జరిగినా, అయినతరవాత, ఒకరినొకరు అర్థం చేసుకునో చేసుకోకుండానో కాపురాలు చేసుకుంటున్నవారు వేలకి వేలు లేరా? అసలు ఏ ఇద్దరు ఒక గాటంట చేరినా … ఏ కారణంగానైనా … ఇద్దరూ ఎంతో కొంత వదులుకోడం తప్పదు. తల్లీ పిల్లా, తండ్రీ కొడుకూ, అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ, యజమానీ-పాలేరూ … ఎవరైనా సరే. మరోమనిషి ఎదట ఉంటే నీ జాగాలో కొంత తరుగు అయితీరుతుంది. చాలాసార్లు చిన్నవిషయాలకే పెద్ద రచ్చ పెట్టేసుకుని, – నాకిలా చెయ్యడానికి అధికారం ఉంది, నీకలా చెయ్యడానికి అధికారం లేదూ – అంటూ హోరెత్తిపోతే ఎవరికీ సుఖం లేదు. ఆరోజుల్లో నేను వండినకూర ఆయనకి నచ్చకపోయినా, ఆయన తెచ్చినచీర నాకు నచ్చకపోయినా జానేదేవ్ అనేసి ఊరుకునేవాళ్ళం. అంతే. దీనిలో వ్యక్తిత్వాలూ, అధికారాలూ – వీటి ప్రమేయం లేదు.”

“అయితే నేనే అనవసరంగా రచ్చ చేస్తున్నానంటావు?”

“మారోజులకీ ఈరోజులకీ పోలిక వీలవదు అంటున్నా. మరో ఉదాహరణ – మారోజుల్లో ఇన్ని కారుప్రమాదాలూ, విమానప్రమాదాలూ లేవు కదా అంటే నువ్వేమంటావు? అప్పుడు ఇన్ని కార్లూ, విమానాలూ లేవు కదా అంటావు, అవునా?”

“అంతే కదా మరి.”

“అలాటివే మనుషుల ప్రవృత్తులూను. మార్క్స్ ఏమన్నాడో, మావో ఏమన్నాడో మాకు తెలీదు. మనువూ, శంకరుడూ ఏమన్నాడో కొంచెం తెలుసనుకో, సూచనప్రాయంగానైనా. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆరోజుల్లో మేమే ఎక్కువ ప్రశాంతంగా బతికేం. ఇప్పుడు మీ ధోరణే వేరు కారణం ఏదైనా కానీ. అంచేత, మీఆలోచనల, మీ ధోరణులమూలంగా వచ్చే తికమకలకీ, ఈతిబాధలకీ కూడా మీరే బాధ్యులు. వెనకటిరోజుల్లో మతంపేరుతో ఒకరకం పాఠాలు చెప్పేరు. అసంగత్వం, సంయమనం, నియంత్రణ అనీ పేర్లు పెట్టి  ప్రచారం చేసేరు. ఇప్పుడు సైకాలజిస్టులచేత చెప్పించుకుంటున్నారు సుమారుగా అలాటిమాటే. నువ్వు చెప్పు. ఈ సైకాలజిస్టులు అండర్స్టాండింగుపేరుతో చెప్పేదేమిటి? నువ్వు నీ ఆలోచించేతీరు మార్చుకోమనే కదా. అంటే అందులో వదులుకోడం లేదా?”

“మేమే కోరి ఈ తలనొప్పులన్నీ తెచ్చుకుంటున్నాం అంటావు?”

“నాకు కనిపించిన ధోరణులు నేను చెప్తున్నాను. అవి విపరీతధోరణులా అంటే నేను చెప్పలేను. నువ్వు ఎలాటి టీక చెప్పుకుంటావో నీయిష్టం.”

“కూరా, చీరా – చిన్నవిషయాలు. వాటిమాట వొదిలెయ్. తాతయ్య నిన్ను మీదపడి కొడుతూంటేనో … మరో ఆడదానిళవెంట పడి నిన్ను నిర్లక్ష్యం చేస్తేనో .. అప్పుడు కూడా అలాగే పోనిస్తూ అని ఊరుకుంటావా?”

“అదే అంటున్నాను. అలాటి పెద్ద విషయాల్లో కూడా వారి వారి స్థితిగతులనిబట్టి ఎవరికి వారు నిర్ణయాలు తీసుకున్నారు అంతే కానీ పిడుక్కీ బిచ్చానికీ ఒకటే మంత్రం అనుకోలేదు. కొందరు పుట్టింటికి పోయేరు. కొందరు మరోడితో లేచిపోయేరు. కొందరు చచ్చిపోయేరు. అప్పుడు కూడా ఇన్ని రకాలూ ఉన్నాయి అనే చెప్తున్నాను. ఆ కేసులన్నీ విడివిడిగా దేనికదా ఒకొక కేసు. అలాగే తీసుకోవాలి కానీ వాటిని అన్నిటినీ ఒకగాట కట్టి, ఓ సిద్ధాంతం చేసి, అందరికీ ఇదే మార్గం అని చూపడం జరగలేదు. నామటుకు నాకు అదే నయం అనిపిస్తుంది.”

“అంటే ఇప్పుడు నేను కూడా విషివిషయంలో నీలాగే ప్రశాంతంగా ఉండమంటావేమిటి, అతను ఎంత తనచుట్టూ తనే తిరుగుతున్నా, భూమిలాగ?” అంది అరవింద చిలిపిగా.

సిరి నవ్వింది, “లేదు. అది సాధ్యం కాదు. చెప్పేను కదా కారూ, విమానాల్లాగే – అవి ఎక్కడికీ పోవు. అంచేత వాటివల్ల వచ్చే ప్రమాదాలూ ఎక్కడికీ పోవు. మాకాలపు ఆలోచనలు ఈకాలానికి పనికిరావు. కానీ, ఈకాలంలో వచ్చిన ఇంత స్వోత్కర్ష, అహంకారం మాత్రం -ఈ “నేను”, “నాది” – అన్నది తగ్గించుకున్నప్పుడే మనశ్శాంతి. ఎంతసేపూ దీనివల్ల నాకేం ఒరుగుతోంది అని కాక ఇది లేకపోతేనేం అని కొంత వదులుకోడం నేర్చుకుంటే బాగుంటుందేమో.”

“అది నాకొక్కదానికేనా… విషికీ … ఇంకా అడిగితే వాళ్ళనాన్నకీ కూడా ఉండాలి కదా. వాళ్ళబతుకులే కాక నాబతుకేమిటో కూడా వాళ్ళు ఆలోచించాలి కదా.”

సిరి అవునన్నట్టు తలూపింది.

మళ్ళీ అరవిందే అంది, “అలా అంటే నాది స్వార్థం అంటావు కాబోలు.”

“నేనేమీ అనడంలేదు. నువ్వే ఆలోచించుకో అంటున్నాను. ఏది స్వార్థం, ఏది అవతలివారికి సహకారం అందించడం అన్నది మాటల్లో చెప్పడం కష్టం. నువ్వు సాయం చేస్తున్నాననుకోవచ్చు. అది నీ చేతకానితనం అనుకోవచ్చు అవతలివాడు. లేదా అది అతని గొప్పతనం అని కూడా అనుకోవచ్చు. ఇలాటివే – నేనంటున్నది అర్థాలకీ, అపార్థాలకీ, అనర్థాలకీ కూడా దారి తీస్తాయి. మాకాలంలో మేం అంత సీరియస్‌గా తీసుకోనివి కూడా ఇవే…”

“నాకెందుకో లీలగారితో కూడా మాటాడితే బాగుంటుందేమో అనిపిస్తోంది.”

“మాటాడి చూడు. నీకిదేదో ప్రాజెక్టులా ఉంది. విషీ నువ్వూ మళ్ళీ డేటులు చేసినా చెయ్యకపోయినా, కొంత జ్ఞానసముపార్జన జరుగుతుంది. భవిష్యత్తులో పనికిరావొచ్చు.”

“నీకు అంత హాస్యంగా ఉందేమిటి?”

“అదే కదా చెప్తున్నాను. నేనేదీ సీరియస్‌గా తీసుకోను. హీహీ.”

“హీహీ.”

(మే 20, 2011.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మార్పు 18”

 1. నాగేస్రావ్, ఇంగ్లీషు ఇప్పుడు మీరనేవరకూ నాకు తోచలేదు. మీరన్నారు కనక, చూస్తాను. బహుశా, మరికొంత కాలం అయేక మొదలుపెడితే బాగుంటుందేమో. మీసలహాకీ, వ్యాఖ్యకీ ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. మాలతిగారూ, చాలా బాగా రాసారు. ఈ మార్పు వ్యాసాలు ఇంగ్లీషులో కూడా రాసా(స్తున్నా)రా? తెలుగు చదవటంరాని ఈకాలం పిల్లలకి చూపించటానికి వీలుంటుంది.

  మెచ్చుకోండి

 3. లలితా, చాలా బాగా విశ్లేషించేరు. మీ విశ్లేషణ నా నవల ఇన్ ద మేకింగ్ కి చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. మీరన్నట్టు స్త్రీవాదానికి ఖచ్చితమయిన నిర్వచనం ఉన్నట్టు కనిపించడంలేదు. ఏ స్త్రీలోనైనా సాధారణ అభిప్రాయాలకి భిన్నమయినవి కనిపిస్తే వెంటనే స్త్రీవాదమనిషి అనేస్తున్నారు. అదే ఇక్కడ పేర్లు పెడుతున్నారు అన్నాను నేను. ప్రతిదానికి లేబుల్ ఇవ్వడంలో ఉన్న సరదా సమస్యని అర్థం చేసుకోడంలో కనిపించదు. ఏమైనా మీరందరూ కలిసి నాచేత ఇలా కొన్ని ఆలోచనలు ముందుకు తెప్పిస్తున్నందుకు నాక్కూడా సంతోషంగానే ఉంది. ఇక్కడ నేను కూడా ఒక పాఠకురాలినే..

  మెచ్చుకోండి

 4. ““అదే కదా చెప్తున్నాను. నేనేదీ సీరియస్‌గా తీసుకోను. హీహీ.””
  🙂
  “అదే అంటున్నాను. అలాటి పెద్దవిషయాల్లో కూడా వారి వారి స్థితిగతులనిబట్టి ఎవరికి వారు నిర్ణయాలు తీసుకున్నారు అంతే కానీ పిడుక్కీ బిచ్చానికీ ఒకటే మంత్రం అనుకోలేదు. కొందరు పుట్టింటికి పోయేరు. కొందరు మరోడితో లేచిపోయేరు. కొందరు చచ్చిపోయేరు. అప్పుడు కూడా ఇన్ని రకాలూ ఉన్నాయి అనే చెప్తున్నాను. ఆ కేసులన్నీ విడివిడిగా దేనికదా ఒకొక కేసు. అలాగే తీసుకోవాలి కానీ వాటిని అన్నిటినీ ఒకగాట కట్టి, ఓ సిద్ధాంతం చేసి, అందరికీ ఇదే మార్గం అని చూపడం జరగలేదు. నామటుకు నాకు అదే నయం అనిపిస్తుంది.”

  బాగా చెప్పారు. అలాగే ఇది ఎవరికి వారు ఆలోచించుకునేటప్పుడు వర్తిస్తుందని నా అభిప్రాయం. ఒక న్యాయమో చట్టమో తయారు చెయ్య వలసిన వారు, ఏ వ్యవస్థైనా ముదిరిపోయినప్పుడు అత్యవసరమైన మార్పులు తీసుకు రావసిన అవసరమూ ఇలాంటివి ఈ విషయానికి మినహాయింపులు అని కూడా నా అభిప్రాయం.
  ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరికైనా సాయం చెయ్య వలసి వచ్చినప్పుడు, ఇంకొకరు తమ కష్టాలు (అలా అనిపించినవి) చెప్పుకునేటప్పుడు మనసులో ఉంచుకోవలసిన విషయం.
  ఐతే, ఇప్పుడు స్త్రీవాదాన్ని విమర్శించే వారికి పై మాటలలో స్త్రీవాదం అక్కర్లేదు అన్న మాట వినిపించవచ్చు. కానీ అదే సమయంలో నా మనసులో అనిపించేదేమంటే తర తరాల నుంచీ ఆడ వారి విషయంలో జరిగినది అదే, ఒక సిద్ధాంతం (శాస్త్రం) పేరున ఎవరైనా కొత్త దారి ఎన్నుకుంటే, ఇప్పుడు అరవింద చూపినట్టే పెద్ద విషయాలను చూపి, సమాజం మొత్తం చెడిపోగలదు అన్న పిక్చర్ ఇవ్వడం జరుగుతోంది అని నాకు అనిపించిన విషయం.
  మళ్ళీ స్త్రీవాదం (అంటే ఏమిటో నాకు ఇప్పటికీ కచ్చితంగా తెలియదు) వంటి విషయాలకి వస్తే, కొన్ని కుటుంబాలలో, ఎవరో అన్నట్లు choice feminism వెసులుబాటు ఉంది. అంటే, స్త్రీ తన ఇష్ట ప్రకారమే తను ఉద్యోగం చెయ్యడం, ఇంటి పనులలో సాయం తీసుకోవడం, ఇంకేమైనా వ్యక్తిగత విషయాలలో స్వతంత్ర నిర్ణయం తీసుకోవడం, లేదా ఆధారపడడం వంటి వాటిలో ఏదైనా ఎన్నుకోగలదు. ఇలాంటప్పుడు అమ్మమ్మ గారన్నట్లు సంఘర్షణ ఎక్కువ. ఐనా ఆ సంఘర్షణ స్వయంగా ఎన్నుకున్నది ఐనందువల్ల ఆ మార్గమే ఇష్టపడే అవకాశాలు ఎక్కువ.
  ఇక అరవింద విషయనికి వస్తే ఆ అమ్మాయి ఆ వయసులో అలానే ఆలోచిస్తుంది అనిపిస్తోంది. తనకి విషి పట్ల ఉన్న (లేని) ఉద్దేశమేదో తనకి తెలుసు. తన ముందు కనీసం రెండు మార్గాలున్నాయి. అందులో ఏది తనకి బావుంటుందో తన మనసుకి తెలుసు. ఐతే భవిష్యత్తు గురించి తను ఉన్న సమాజం, తన చుట్టూ ఉన్న వారి ప్రభావం వల్ల తన మనసులో రూపు దిద్దుకుంటున్న చిత్రం hazy గా ఉంది. తన మనసు చెప్పే మాట మంచిదే అని నమ్మకంగా తెలుసుకోవాలనిపిస్తున్నట్లుంది. ఆ నమ్మకం కోసం కాస్త ఇతరుల మీద ఆధారపడుతున్నట్లూ అనిపిస్తోంది.
  ఆలోచించేలా చేస్తున్నారు మాలతి గారూ. అలాగే నా ఆలోచనలకీ మాటలు వచ్చేలా సాయం చేస్తున్నారు 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s