తూలిక.నెట్ చరిత్రలో ఒక దశాబ్దం

నా వెబ్ సైట్ thulika.net అంతర్జాలంలో అడుగెట్టి దశాబ్దం అయింది ఈరోజుకి.

పదేళ్లు! నాకే ఆశ్చర్యంగా ఉంది. నాజీవితకాలంలో ఏ అంతరాయాలూ లేకుండా ఇంతకాలం నేను నిర్వహించిన ఉజ్జోగం – ఆదాయంలేనిదే అనుకోండి – ఇదొక్కటే.    

ఆ తొలినాడు ఎలాటి అనుభూతికి లోనయేనో నాకు జ్ఞాపకం లేదు. బహుశా ఒక సైటు సృష్టించగలిగేనన్న సంబరం కావచ్చు. అప్పటికి మూడో నాలుగో అనువాదాలు చెయ్యడం, ఇంకా చేస్తే బాగుంటుందన్న కోరికా, ఏదో విధంగా కంప్యూటరు నంటిపెట్టుక్కోచోవాలన్న తపనా – ఇలా ఏదైనా కావచ్చు.

మొదటి సంచికకి 340 హిట్స్ వచ్చేయి. గత పదేళ్ళలోనూ మొత్తం లెక్కలు నాకు తెలీదు. యాహూ సైట్ బిల్డర్ వారి గణాంకాల్లో అవకతవకలమూలంగా 90 రోజులపాటు ఓపెన్ చెయ్యని ఫైళ్ళకి లెక్కలు పూర్ణాంకం అయిపోతాయి. అలాటివే కొన్ని పాత టపాలు కరెప్టయి నిర్జీవమయిపోయేయి. ఇలా అనేకకారణాలవల్ల లెక్కలు తుడిచిపెట్టుకుపోయినా, రోజువారీ లెక్కలు చూసినప్పుడు 400 నించి 600 వందలవరకూ ఉంటున్నాయి. తరుచూ కాకపోయినా 900వందలు కనిపించిన రోజులున్నాయి. అంచేత ఈ పదేళ్ళలోనూ రెండు లక్షలకి మించే ఉంటాయనుకుంటున్నాను. ఒస్, అంతేనా అంటే నేనేం చెప్పలేననుకోండి. తూలిక కేవలం ఆధునిక తెలుగు కథలకే పరిమితమైన ఏకైక ఇంగ్లీషు వెబ్ పత్రిక. ఈమధ్యకాలంలో మరో రెండు వెబ్ జీవులు వచ్చినా, వారు ఒక్క తెలుగుకే పరిమితం కాలేదు కనక వాటిని లెక్కలోకి తీసుకోడంలేదు నేను.

ఇంతవరకూ, ప్రచురించినవి – 120 కథలు. వీటిలో 20 కథలు ఇతర అనువాదకులు చేసినవి. ఇతర అనువాదకులలో ఆస్ట్రేలియా శారదని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె పది కథలు అనువాదాలు చేశారు ఇంతవరకూ. ఆ వరసలోనే నాకు ఆత్మీయురాలు కూడా అయేరు. ఇంకా డా. సుజాతా గోపాల్, యస్. నారాయణస్వామి, డా.  వైదేహి శశిధర్, డా. బి.వి.వి. రామారావు వంటి ప్రముఖులు అనువాదాలు అందించేరు. వారికి ధన్యవాదాలు.

విశ్లేషాణాత్మకంగా, పరిశీనాత్మకంగా రాసిన వ్యాసాలు 50వరకూ ఉన్నాయి. వీటిలో ఇతరులు రాసినవి  10. నావ్యాసాలన్నీ తూలికకోసం ప్రత్యేకంగా రాసిన కొత్తవ్యాసాలే. ఇతరులవ్యాసాలలో డా. వైదేహి శశిధర్ డా. నాయని కృష్ణకుమారిగారి కవిత్వంమీద రాసిన వ్యాసం ప్రత్యేకంగా తూలిక కోసం రాసింది.  వైదేహికి ధన్యవాదాలు. మిగతా వ్యాసాలు వేరే చోట ప్రచురించుకున్నవీ, లేదా తెలుగులో రాసినవీను. తూలికలో ప్రచురించిన వ్యాసాలు విదేశాలలో తెలుగు సాహిత్యంమీద అభిమానం గల రిసెర్చి స్కాలర్లు ఉపయోగించుకుంటున్నారు. నావ్యాసాలు ఇతర సైటుల్లో పూర్తిగానో రిఫెరెన్సు రూపంలోనో కనిపించడమే సాక్ష్యం.  మన రచయితలు ఈ విషయం గమనించి, మంచి కొత్త వ్యాసాలు రాయగలరని ఆశిస్తున్నాను.

ఇక్కడ ప్రచురించిన అనువాదాల్లో 51 కథలు మూడు సంకలనాలుగా వచ్చేయి. అవి ప్రచురించినవి ప్రతిష్ఠాత్మకమైన సంస్థలు  – Jaico Publishing House (Mumbai), Central Sahitya Akademi (Bangalore), and Lekhini Mahila Chaitanya Sahiti (Hyderabad). అంచేత ఈవిషయం నాకు గౌరవప్రదంగానే భావిస్తున్నాను. ఆ సంస్థలకి ధన్యవాదాలు.

ఇటీవలికాలంలో కథలఎంపిక విషయంలో నా ఉత్సాహం నీరుగారి పోతోంది. ఈవ్యాసం ఇక్కడ రాయడానికి ఇదొక ముఖ్య కారణం. నేను ఏ ఉద్దేశ్యంతో సైటు మొదలు పెట్టేనో చాలామంది గ్రహించడంలేదు. అంచేత మరోసారి చెప్తాను.

సాధారణంగా ఏ పత్రిక అయినా రచయితలకి ఇచ్చే సూచనలలో “మా పాతసంచికలు చూడండి మేం ఎలాటి కథలు వేసుకుంటున్నామో చూసి, అలాటివి పంపండి“ అంటారు. నా సైటువిషయంలో కూడా ఇది గమనించాలి. ఆ పైన, ఇతరపత్రికలకి భిన్నంగా, అనువాదకులు గుర్తు పెట్టుకోవలసింది నా సైటు ధ్యేయం – అంటే ప్రచురించిన కథలలో మనసంస్కృతికి సంబంధించిన ఏ కోణాలు ఆవిష్కృతమయేయో చూసి, ఇంతవరకూ ఆవిష్కరించబడని కొత్త కోణాలు ఆవిష్కరించే కొత్త కథలు కావాలి. మనదేశంలో మన పాఠకులూ, మన విమర్శకులూ ఎంతో మెచ్చుకున్న కథలు కూడా నా సైటు ధ్యేయానికి అనుగుణంగా లేకపోవచ్చు.

ఒక ఉదాహరణ చెప్తాను. మీఇంట్లో మీఅమ్మా, నాన్నా, తోబుట్టువులతో మాటాడుతున్నప్పుడు మీ కష్టాలన్నీ ఏకరువు పెట్టుకుంటారు. అదే మరో దేశస్థుడు తొలిసారిగా మీయింటికొచ్చి, మీరెలా ఉన్నారు అని అడిగితే “ఏం చెప్పమంటారు. మాఆయన నన్ను ఈడ్చి తంతున్నాడు రోజూ” అంటూ మొదలెట్టరు కదా. అలాగే, ఇది కూడా అనుకోండి. ఇలాటి కథలు రాయకూడదు అనడంలేదు నేను. ఈనాడు అన్ని పత్రికలూ మీడియాలూ ఇలాటికథలే వేసుకుంటున్నాయి. అది కూడా ఒక కారణం అనుకోండి నేను మిగతా కోణాలమీద దృష్టి పెడుతున్నాను. అన్ని కోణాలూ ఆవిష్కరించినప్పుడే ఏజాతి సంస్కృతి అయినా పరిపూర్ణంగా అర్థం చేసుకోడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అది అసమగ్రం అయి, అనేక అపార్థాలకి దారి తీస్తుంది. స్టీరియోటైపులు ప్రచారం కావడానికి ఇదే కారణం.

నాసైటు మన సంస్కృతిగురించి పరాయి దేశస్థులకి తెలియజేయడానికి. ఇప్పుడు ఆవిలువలు లేవంటారా? అదే నిజం అనుకుందాం. లేకపోతే మనవాళ్ళకి కూడా మరొకసారి గుర్తు చెయ్యవలసిన అవుసరం ఉంది. అదే నోరి నరసింహశాస్త్రిగారు ఆంధ్రలో చారిత్రకనవల అన్న వ్యాసంలో చక్కగా ప్రస్తావించేరు.

మన సంస్కృతిగురించి, జీవనవిధానంగురించి పొరుగువారికి మనం చెప్పగలిగింది ఎంతో ఉంది – మనం తినే తిండి, కట్టే బట్టలు, ఆడుకునే ఆటలు, చేసే కాలక్షేపాలు – ఇవన్నీ మన నిత్యజీవనవిధానంలో భాగాలే. అవి నాకు  కావాలి. ఉదాహరణకి ఐ.వి.యస్. అచ్యుతవల్లిగారి కథ ఆండాళ్లు, ఉల్లిపాయలు కథ అనువాదం చేశాను. అందులో దినసరి జీవితంలో జరిగే అతిమామూలు విషయాలు ఎంతో చక్కగా ఆవిష్కరించేరు రచయిత్రి – చెప్పా పెట్టకుండా  వచ్చే పోయే బంధువులూ, అయ్యో తిన్నావా ఉన్నావా అంటూ ఎంతో ఆప్యాయంగా యోగక్షేమాలు కనుక్కునే ఇరుగూ పొరుగూ, నీకేం కావాలో నాకు చెప్పకూడదా అంటూ ఆప్యాయంగా అడిగే మొగుడూ, అత్తా, ఆడబడుచులూ .. ఇలాటివి కూడా మనదేశంలో ఉన్నాయి. ఈ మనుషులు కూడా మనవాళ్ళే. ఇంతవరకూ అందుబాటులో ఉన్న చరిత్రలో ఈభాగాలు కూడా చేర్చినప్పుడే మన జాతిచరిత్ర సమగ్రం కాగలదు.

ఈవిధంగా ఆలోచించుకుని మనం ఇంతవరకూ చెప్పని విషయాలు మీకు కనిపించిన కథలు నాకు ఇవ్వండి. మరొకలా చెప్పాలంటే నా వెబ్ సైటు ప్రత్యామ్నాయ సైటు అనుకోండి. ఇతర సైటుల్లో లేని విషయాలు నాకు పనికిరావచ్చు.

నా ఇంగ్లీషు తూలిక, తూలిక.నెట్ ని అభిమానించి ఆదరిస్తున్న పాఠకులకీ, రచయితలకీ, అనువాదకులకీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

ఇట్లు

నిడదవోలు మాలతి.

జూన్ 1, 2011

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “తూలిక.నెట్ చరిత్రలో ఒక దశాబ్దం”

 1. @ శారదా, నాక్కూడా అంతే. నిజానికి ఇక్కడ నేను చెప్పగలిగినదానికంటే చెప్పాలనుకున్నది చాలా ఉంది. కానీ మాటలు లేవు. ధన్యవాదాలు.
  @ అనిల్, ధన్యవాదాలు మీ ఆదరాభిమానాలు కూడా యిలాగే చిరకాలం నిలిచి నాకు ప్రోత్సాహమిస్తాయని ఆశిస్తున్నాను.

  మెచ్చుకోండి

 2. ఏటువంటి అపోహలకి తావివ్వకుండా ఒక సదాశయానికి కట్టుబడి ఒక దశాబ్దం పాటు నెట్ మీద మనగలగడం చాల గొప్ప విషయం. అందులో తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి మాత్రమే కట్టుబడి తూలిక నిర్వహించడం సంతోషం. అభినంనదనలు. జాలం మీద తెలుగుని సుసంపన్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ,
  మిమ్మల్ని నేను “వెల్ డన్” అని అనడం బాగుండదు. కానీ, పదేళ్ళుగా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే మాటలు కాదు.
  ఈ పదేళ్ళ సాహచర్యంలో, స్నేహం లో నేను అనువాదాలు చేయటమే కాకుండా, చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకు మీకెంతో ఋణ పడి వుంటాను కూడ.
  చాలా ఇంటెన్స్ గా ఫీల్ అయ్యే విషయాలని నేనంత ఈజీగా వ్యక్తీకరించలేను.కానీ నేను చెప్పదల్చుకున్నది మీకు అర్ధం అయే ఉంటుంది.
  I am greatful to you.
  శారద

  మెచ్చుకోండి

 4. @ రాజేష్, మీ సుదీర్ఘవ్యాఖ్య నిజంగా నాకు ఎంతో ఆనందాన్నిచ్చి మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. నిజానికి తెలుగు తూలిక మొదలుపెట్టేకే తెలిసింది నాకు ఈనాటి యువతీయువకుల్లో వయసుమళ్లినవారి మాటలకి మీలా స్పందించేవారున్నారని. నాకు అదే చాలా పెద్ద బలం.
  కాస్త ఆలోచించుకుని మళ్ళీ రాస్తాను ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏదైనా ఉంటే.
  పోతే, తూలిక అంటే ఈక, హంసతూలికాతల్పం అన్నపదంలోనిదే. హంసఈకలతో పరుపులు కుట్టించుకునేవారుట కలిగినవారు వెనకటి రోజుల్లో.
  పూర్వం తాటాకులమీద గంటంతో రాసేవారు కదా. తరవాత సిరా పుట్టినతరవాత ఈకతో రాయడం మొదలయింది. నేను నాసైటు మొదలుపెట్టడానికి ముందు ఫార్మర్స్ మార్కెట్లో నెమలి ఈకలు కనిపిస్తే రెండు కొన్నాను. అంచేత తూలిక రాతపరికరం అన్న అర్థంలో వాడేను. పోతే ఇంకో రహస్యం కూడా చెప్పేస్తాను. ఆ ఈక పట్టుకున్న సుందరహస్తం నాదే! మా ఆఫీసులో ఓ స్నేహితురాలిచేత ఫొటో తీయించేను.
  సంతోషం అంటాను, ధన్యవాదాలు చెప్పొద్దన్నారు కదా మీరు. 🙂
  మాలతి

  మెచ్చుకోండి

 5. $మాలతి గారు

  మరోసారి మీకు దశమవార్షికోత్సవ అభినందనలు. _/\_ :–>%%

  పదేళ్ళకు ముందునుంచే ఇంటర్నెట్ని ఉపయోగించుకోవడమే కాక ఎటువంటి ఫలాపేక్ష లేకుండా పట్టుదలగా మీ రచనలని పాఠకులకి పంచుకోవాలన్న మీ ఆశయం, తపన చూస్తుంటే యువరక్తం ఉరకలెత్తుతున్నట్లు అనిపిస్తుంది. ఏ ఇజాలకీ లోబడకుండా సమకాలీన సమాజంలోని వాస్తవాలని మాత్రమే కథలోని పాత్రల చేత సందర్భానుసారంగా చెప్పిస్తూ సాగే మీ రచనాశైలి అధ్బుతం. అలాంటి రచనలు నాకు అపురూపం.

  మీరు “మన సంస్కృతి, జీవనాధారం ..” అని చెప్పినప్పుడల్లా నా మనసు పులకరించిపోతూ ఉంటుంది. వాటి మీద మీకున్న అపరిమిత అవగాహన, రాసేటప్పుడు తీసుకునే జాగ్రత్త శ్లాఘనీయం. భావితరాలకి మంచిని పంచాలా లేక సొంతభావాల పేరుతొ ద్వేష భావనల్ని రుద్దాలా అన్నదానిమీద స్పృష్టమైన అవగాహన మీకు ఉండడంవల్ల అది సాధ్యమైందని నా అభిప్రాయం.

  సమయాన్ని వృధాచేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాని వాదాల్ని, వాదనకు తప్ప వాస్తవానికి పనికిరాని ఇజాల్ని తట్టుకొని మీరు అనుకున్న దానికే కట్టుబడిఉండడమే కాక ప్రతిరాతలోనూ దాన్ని ఆచరణలో చూపెట్టిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. స్థిరత్వంలేని అస్థిత్వాల పైన, కడుపునిండిన వారి ఇజాల మీద నాది అజ్నానం అంటూనే సూటిగా సంధించిన మీ రామబాణాలు నాకు సూటిగా గుచ్చుకున్నాయి. నేను మీ దగ్గరినుంచి ఏదైతే ఆశించానో అక్కడ అదే దొరికింది. ధన్యవాదాలు. నాకు తెలిసి బ్లాగుల్లో/ఇంటర్నెట్లో ఏ ఇజం లేకుండా రాసేవారు మీరొక్కరే అని గట్టిగా చెప్పగలను. భవిష్యత్తులో కూడా మీరిదే పంధాని అనుసరిస్తారని ఆశిస్తున్నాను.

  చూస్తూ ఉండండి.. విదేశాలను౦డి మక్కికిమక్కీగా దిగుమతి చేసుకున్నవికొన్ని, సొంతకొట్టుడు మరికొన్ని ఇజాలతో దారితెన్నూ తెలీకుండా కొట్టుకుపోతూ ఉన్నవారికి మీలాంటి వారి రాతలు ఉపశమనం కలిగించే రోజు వస్తుంది.

  మా పాలతాలిక లాంటి తూలికకి మరోసారి అభినందనలు.

  చివరిగా ఈ శుభదిన సంధర్భంగా తూలిక అన్న పేరు పెట్టడం వెనక ఏవైనా కారణాలు ఉంటే పంచుకోగలరు. 🙂

  మెచ్చుకోండి

 6. @ కుమార్, యన్, ధన్యవాదాలు
  @ మాధురి, థాంక్స్,
  @ రాజేష్ జి. మీరు ముందే అనుకుంటానండీ. నేను ఇంట్లో లేకపోవడంచేత వెంటనే అనుమతించలేకపోయేను. ధన్యవాదాలు.
  @ జ్యోతి, చాలా చాలా ధన్యవాదాలండీ.
  @ శి. రా. రావు, మీవంటివారి అదరాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. నేను నిమిత్రమాత్రురాలిని అనే నా అభిప్రాయం. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 7. వండర్ ఫుల్ ప్రయత్నం మాలతి గారూ, గత మూడేళ్ళ నించీ చూస్తున్నాను.
  డిఫరెంట్ ఆడియన్స్ కి పరిచయం చెయ్యాలన్న మీ తపన ఫలితం, మీ లెగసీ గా నిల్చిపోవుగాక.

  మెచ్చుకోండి

 8. మాలతి గారూ !
  దశాబ్దం…. రెండు లక్షల పైన హిట్లు….. 120 కథల అనువాదాలు….. వాటిలో 51 కథలతో మూడు సంకలనాలు… అన్నిటినీ మించి సైటు నిర్వహణ విషయంలో మీ ఆశయాలు, ఆలోచనలు, పట్టుదల, కృషి….. ఇవన్నీ అనితర సాధ్యం. ఆంధ్రులు ఆరంభశూరులు కారని, కార్యశూరులని నిరూపించారు. తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలను, సాహితీ సంపదను ప్రపంచానికి రుచి చూపుతున్న మీకు వేనవేల నమస్సులు. మీరు మరిన్ని దశాబ్దాలు తూలికను నడపాలని, మరిన్ని కథలను ప్రపంచానికి అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ…….

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s