మార్పు 20

ఎండ మండిపోతోంది. ఇంత గాలివాన నేనెప్పుడూ చూళ్లేదన్న నక్కలా ఉంది నామటుకు నాకు. అమెరికా వచ్చేక, ఇంత ఎండ చూడ్డం ఇదే మొదలు. విస్కాన్సిన్‌లో ఎండలు 90 డిగ్రీలు దాటిన రోజులు లేవని కాదు కానీ విస్కాన్సిన్ అంటే మంచే తలపుకొస్తుంది కానీ ఎండలు కాదు.

“ఇంకా మీరు టెక్సస్ ఎండలు చూడలేదు” అన్నారు రెడ్డిగారు కిందటివారమే. అంచేత ఆ టెక్సన్ గాడ్పులకోసం ఎదురు చూస్తున్నాను. నిజంగా వచ్చే గాడుపులకన్నా ఈ ఎదురు చూపులమూలంగా వచ్చే ఏడుపే ఎక్కువగా ఉంది … మ్ మ్…

“ఏటలా దిగాలు పడిపోనావు” అంటూ సంద్రాలు ప్రవేశించింది.

“రా, రా. తారకాన్ని కూడా పిలవరాదూ, తోచక ఛస్తున్నాను,” అన్నాను తలూపి పక్కనున్న కుర్చీ చూపుతూ..

“ఒస్, దానికేటి, చిటికల పని,” అని “తాల్కం బాబూ, రా, రా, ఈయమ్మ పిలస్తన్నది, ” అని ఓ గావుకేక పెట్టింది.

పావుగంటలో ప్రత్యక్షం అతను.

“అసలది గాదు కానీ, నివ్వేటి ఆ సీదేవమ్మ కత అని మొదలెట్టి, ఈ ఆరిందమ్మ కతలోకెల్పోనావు?” అంది సంద్రాలు.

“ఆరిందెవరూ?”

“అరవింద.”

“నీకూ అనిపించిందీ .. నేనూ అదే అనుకుంటున్నా. అసలు చెప్పాలనుకున్నదేమో శ్రీదేవిగారికి గత రెండు తరాల్లోనూ కనిపించిన మార్పులేమిటీ అని. తీరా చూస్తే ఈ చిన్నారొచ్చి దురాక్రమణ చేసేసింది నా కథనంతటినీ. హుమ్ ఈకాలప్పిల్లలు,” అన్నాను చిరుకోపం నటిస్తూ.

“మరి అది కూడా మార్పులో భాగమే కదండీ,” అన్నాడు తారకం.

మ్. ఈ తరంవాడు మరెలా అంటాడు?

“ఇంతకీ ఏటి సేస్తవయితే?”

“నేనేం చెయ్యాలో నాకు తోచడం లేదు. తారకం, నువ్వెళ్ళి ఆవిడని తీసుకురారాదూ. ఆవిడే చెప్తారేమో చూద్దాం.”

“ఆవిడెందుకులెద్దురూ. మీ అభిప్రాయాలేవిటో మీరు చెప్పండి, సరిపోతుంది.”

“నా అభిప్రాయాలు నాకే స్పష్టంగా లేవు. నీకేం చెప్పను? అయినా తెలిసీ తెలీని మాటలాడి నేనెందుకూ రొష్టు పడ్డం. ఆమే చెప్తే బాగుంటుంది కదా. నీకిష్టం లేదా? ఏంవయిందేమిటి?”

“ఏమిటోలెండి. ఆవిడదంతా అదో రకం, మీకు మాత్రం తెలీదేమిటి?”

“తెలీదు. ఏం? ఆమెతో కానీ తగువు పడ్డావా? ఏవిషయంలో?”

“తగువులేం లేవండీ. అసలు ఆవిడ రాతలు … అదే అవి బాగానే ఉంటాయండీ. కానీ పాఠకులం ఏదైనా అడిగితే మాత్రం చెప్పే సమాధానాలు …” అంటూ నామొహం చూసి ఆగిపోయేడు.

నేను ఇలాటి వ్యాఖ్యానం వినడం ఇదే మొదలు. నాకు కాస్త ఆశ్చర్యమూ, మరింత కుతూహలమూ కలిగేయి.

“ఓహో. ఏదో పెద్దకథే అయినట్టుంది. మరి అదేదో స్పష్టం చేసుకోడానికేనా ముఖాముఖీ మాటాడుకోడుకోవాలి కదా. వెళ్ళి పిలుచుకురా.”

“సరేలెండి. వెళ్తున్నా. తీసుకొస్తా. మరి నేనేమైనా ఆమెని అడిగితే ఆమెకి కోపం వస్తే మీదే పూచీ.”

000

“ఏంటి కథ? పంచాయితీ పెట్టేరు,” అంది సిరి వరసగా మా మొహాల్లోకి మార్చి మార్చి చూస్తూ.

“ఉండనే ఉంది కదా సామెత పన్లేనివాడు. .. చేసే పని. మాకు హఠాత్తుగా నీ కాలంలో నువ్వెలా నెగ్గుకొచ్చేవో తెలుసుకోవాలని గట్టి కోరిక పుట్టింది. నీచేతే చెప్పించాలని నిర్ణయించుకున్నాం. ఈరోజుకి క్లాసు నీదే,” అన్నాను.

“ఏంటోలే ఆ రోజులు. అసలు మేం అంత అమాయకంగా ఎలా పెరిగేం అని ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది ఇప్పుడు తలుచుకుంటే.”

నేను మాటాడలేదు. నాకూ అనుభవమే మరి.

సంద్రాలు “అద్గదే తల్లీ సెప్పమంతన్నం. ఒకొపాలి తెల్సిన ఇసీలే మరో యమ్మ సెప్తె గాని బుర్రలకెక్కవ్.”

“మీ చిన్నతనం ఎలా జరిగిందో చెప్పండి. పుస్తకాలు చదవడానికి మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించేరు? మీకు కథలు రాయాలన్న కోరిక ఎలా కలిగింది? ఎవరు మీకు స్ఫూర్తినిచ్చేరు?”

సిరి నవ్వింది. “ఇదేమిటి ఇంటర్వ్యూలా ఉంది? ఇలా అని నాకు ముందే తెలిస్తే దానికి తగ్గట్టు సిద్ధం అయి వచ్చేదాన్ని కదా.”

తారకం కూడా నవ్వేడు. “అదేనండీ, మీరు ప్రిపేరయి, సువ్వీ సువ్వీ జవాబులు కాకుండా సహజసిద్ధంగా ఈ క్షణానికి వచ్చే ఆలోచనలూ, అభిప్రాయాలు చెప్తారనీ ఆశిస్తున్నాం.”

“అలాగే చెప్తాను కానీ మళ్ళీ అప్పుడలా అన్నారు, ఇప్పుడిలా అంటున్నారు అని సతాయిస్తే ఒప్పుకోను..”

“అదేంటండీ. పాఠకులం మేం ఏం అడిగినా చెప్పాలి కానీ ‘అది చెప్తాను, ఇది చెప్పను’ అని నిబంధనలేమిటి?”

“నేను చెప్పననడంలేదు. నాకు తెలిసింది నేను చెప్పగలిగినట్టు చెప్తాను. ఆపైన మీయిష్టం అంటున్నాను.”

“ఏటీ పిడకలయేట గానీ, సెప్పమ్మా సిరమ్మతల్లీ. నీకేటి మనసయితదో అద్గదె సెప్పు. ఈ బాబుకి నాను మల్ల ఇడమరిసి చెప్తలే.” అని సంద్రాలు కసురుకోడంతో ‘చర్చ ఎలా మొదలు పెట్టాల’న్న చర్చకి గంటు పడింది.

“సరే మొదలెట్టండి మీ చిన్నతనంగురించి,”

“చిన్నతనంగురించి ఏం చెప్పమంటావు?”

“మీరెంతమందండీ అక్కచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ?”

“ముగ్గరన్నదమ్ములు, ఇద్దరక్కచెల్లెళ్ళు. నేనే ఆఖరు. అంచేతో మరెంచేతో ఇంటిపనుల్లో నాకు అట్టే జోక్యం ఉండేది కాదు. నేను పట్టించుకునేదాన్నీ కాదు. మాఅమ్మ చెప్పేదీ కాదు. ఏ అమావాసకో పున్నానికో ఓ రోజు వంటింటి గుమ్మందగ్గర నిలబడి ‘నేనేమేనా చెయ్యనా’ అంటే మా అమ్మ ‘చెయ్యాలనుంటే చెయ్యి, లేకపోతే లేదు. పనిమనిషికి చెప్పినట్టు చెప్పమంటావేమిటి నీకు’ అనేది. లేదా ‘ఇదుగో ఈ కూర తరుగు’ అని ఓ అరిటికాయా కత్తిపీటా నాముందు పడేసేది. నేనేమో ఆ కాయ తరిగేసి ఆ తొక్కులు పారేసి వెళ్ళిపోయేదాన్ని – ఏదో నాటకంలో వేషం వేసినట్టే. అంతేగానీ ఇంటిపనులు పట్టించుకోలేదు.”

“అంటే irresponsibleగా పెరిగేరన్నమాట.”

“చూసేవా నేనింకా మొదలే పెట్టలేదు అప్పుడే నువ్వో అభిప్రాయం చెప్పేస్తున్నావు.”

“మీరే కదా అన్నారు ఇంటివిషయాలు పట్టించుకోలేదని. అది ఇర్రెస్పాన్సిబుల్ కాదా?”

సిరి నావేపు చూసింది పాహిమాం అంటూ.

“కానీలే. నువ్వు కథ పూర్తి చేసేక చూద్దాం.” అన్నాను.

“ఆ రోజుల్లో మా ధోరణే వేరు. ఇది నాది, ఇది నాయిష్టం అన్న దృష్టి లేదు. అసలు ఒకొక ఇంట్లో అయితే ఎవరు ఏ యింటివారో కూడా తెలిసేది కాదు. ఇరుగూ పొరుగూ కూడా ఇంట్లోవాళ్ళలాగే మసిలేవాళ్ళు. ఓమాట అనుకున్నా ఆడుకున్నా ఆటల్లో అరటిపండు, తూనా బొడ్డూ అనేసి మళ్ళీ ఆటల్లో పడిపోడమే. అసలు నేనయితే ఇంట్లో కంటే పక్కింట్లో తిన్నరోజులే ఎక్కువ.”

“మరి ఆ రోజుల్లో ఆడపిల్లల్ని స్వేచ్ఛగా తిరగనిచ్చేవారు కాదంటారు కదా. మా అమ్మమ్మ అసలు రైలు కాదు కదా బస్సు కూడా ఎక్కలేదుట జీవితంలో.”

“అవును కొన్ని ఇళ్ళలో ఉండేవి రాచసంప్రదాయాలు. మాయింట్లో లేవు. అంటే పూర్తిగా లేవు అని కాదు. నేనెప్పుడేనా చీకటి పడ్డాక స్నేహితులఇంటికి వెళ్తానంటే మాఅమ్మ మాతమ్ముడిని కూడా సాయం పంపేది.”

“చూశారా అదే నేనంటున్నది డిస్క్రిమినేషను. మీ తమ్ముడు మీకంటే చిన్నవాడు మీకు సాయం ఏమిటి? పైగా అతను ఎక్కడికైనా వెళ్తానంటే ఝామ్మని వెళ్ళిపోతాడు కదా ఏ సాయమూ లేకుండా.”

“ఏమో మరి. ఆ రోజుల్లో తోచలేదు నాకు ఈ డిస్క్రిమినేషనులు గట్రా. మ్ .. లేదు ..

తోచిందేమో కానీ అదేదో రచ్చ చెయ్యాల్సినంత పెద్దవిషయంగా అనిపించలేదనుకుంటా.

బహుశా ఇతరత్రా చాలా విషయాల్లో అట్టే ఆంక్షలు లేకపోవడం చేతనేమో.”

“ఎలాటి విషయాల్లో?”

“నువ్వలా నిలదీసి అడిగితే నాకేం తోచడంలేదు. మ్ … చెప్తా ఉండు. చదువుమాట తీసుకో. చాలా ఇళ్ళల్లో ఆడపిల్లలకి చదువెందుకనేవారు. మరి మాయింట్లో మా అమ్మా, నాన్నా ఇద్దరూ కూడా మాఅక్కయ్యనీ నన్నూ కూడా చదివించేరు. దానికోసం మాకు మేమయి ఏ ఆర్భాటాలు చెయ్యవలసిన అవుసరం లేకపోయింది.” అని నావేపు తిరిగి  “మీయింట్లోనూ అంతే కదా. నీచదువుకి ఎవరూ అడ్డు చెప్పలేదు కదా,” అంది.

“లేదు.”

“దానికి కారణం ఏమిటండీ?”

“ఆనాటి పరిస్థితులు అలాటివి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మొత్తం దేశంలో అందరికీ చదువు కావాలి అంటూ మొదలయిన ఉద్యమంలో ఆడా, మగా, చిన్నా పెద్దా, చదువుకున్నవారూ, చదువు లేనివారూ అందరూ ఉన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఆడవాళ్లు కూడా పాల్గొన్నారు కనక ఆ స్పిరిట్ 50, 60 దశకాల్లో కొనసాగింది. ఆ రోజుల్లో మానాన్నగారు విశాఖపట్నంనించీ బరంపురం నడిచి వెళ్ళేరుట కాంగ్రెస్ మహాసభలకి.”

“నడిచా?. నేన్నమ్మను.”

“నాకూ అలాగే అనిపించింది. ఏమైనా నేను విన్నది అదీ. ఇంతకీ చెప్పేది ఆ రోజుల్లో స్వాతంత్ర్యోద్యమం స్పిరిట్ అలా వ్యాపించింది నల్దిక్కులా. ఆ తరవాత స్వాతంత్ర్యం వచ్చినతరవాత, దేశ పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలయేయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది విద్యకి సంబంధించిన కార్యక్రమాలు. అందులో భాగం గ్రంథాలయోద్యమం, వయోజనవిద్యలాటివి. ఇటు స్కూళ్లూ అటు లైబ్రరీలూ, మరో పక్క పత్రికలూ కని విని ఎరగని స్థాయిలో విజృంభించేయి. ఆ రోజుల్లో పత్రిక లేని ఇల్లే లేదు. అంతే కాదు. ఒకింట్లో ఒక పత్రిక మరో ఇంట్లో మరో పత్రిక – అవీ ఇవీ అన్నీ కలిపి ఉమ్మడి సొత్తు. అంచేత కొన్నపత్రికలకంటే చదివినవి ఎక్కువే ఉండేవి ఏ ఒక్కరిని తీసుకున్నా.”

“మీయింట్లో అన్నీ చదవనిచ్చేవాళ్ళా?”

“మాయింట్లో చదవనిచ్చేవాళ్ళు. నాస్నేహితురాళ్ళు కొందరు వాళ్ళింట్లో చదవనివ్వడంలేదని మాయింటికొచ్చి కూర్చుని చదివేవారు కూడా.”

“ఏంటీ, వాళ్ళు దొంగతనంగా చదవడానికి మీరు వీలు కల్పించేవారా? అన్యాయం,” అన్నాడు తారకం కళ్ళింతలు చేసుకుని.

“అద్గదీ మరీ. మీనాటోల్లు పెద్దిళ్ళ ఆడోల్లు కిమ్మనకుండ పడుంతరనుకుంతరు గానీ అమ్మో అప్పట్లో ఆల్లకి గావాల్సినయి ఆల్లు సక్కంగనే నెగ్గించుకునీవోలు సాపకింద నీరునాగ.” అంది సంద్రాలు జ్ఞానిలా తలూపుతూ.

“దొంగతనం ఏముందీ, ఎవరిసొమ్ము దోచుకున్నారని దొంగతనం అనడానికి.  ఒకొకప్పుడు పెద్దవాళ్ళ ఆలోచనలకీ పిన్నల ఆలోచనలకీ పొత్తు కుదరదు. అలాటప్పుడు పెద్దల మనసులనెందుకు కించపరచడం  అనీ … అంతే. పుస్తకాలు చదివినంత మాత్రాన చెడిపోతారనేం లేదు కదా.”

“మరి చెడిపోతారన్న భయంతోనే కదా పిల్లల్ని చదవొద్దని ఆ పెద్దలే ఆంక్షలు పెట్టడం? మరేమో పెద్దలంటే గౌరవం అంటున్నారు మళ్ళీ వాళ్ళకళ్ళు కప్పి … ”

“అదొక అపోహ. అంతే. చెడిపోయే బుద్ధున్నవాళ్ళు చెప్పడానికి అదో వంక, అంతే.”

“మరి మీరిలా ఆ పిల్లలతల్లిదండ్రుల ఆశయాలకి విరుద్ధంగా చేస్తున్నారని మీ అమ్మా, నాన్నలకి తెలీదా? మీరు వాళ్ళకి తెలీకుండా చేసేరంటే, మీరు కూడా వాళ్ళని మోసం చేసినట్టే కదా?”

“ఏ పనికైనా ఎన్ని రకాల భాష్యాలయినా చెప్పొచ్చు. వాస్తవంలో ప్రతి విషయాన్ని ఇలా పీకి పాకం పట్టడం జరుగుతుందా? బత్తుల కామాక్షమ్మగారి వ్యాసం ఒకటి ఉంది అనుభవాలూ, జ్ఞాపకాలూ అని. చిన్నదే. నాలుగే పేజీలు. ఆ నాలుగు పేజీల్లోనూ ఆవిడ ఎంత చెప్పేరో చూడండి ఆనాటి పరిస్థితులూ, వారింట ఆచారవ్యవహారాలూ – వాటన్నిటి మధ్య ఆవిడ నెగ్గుకొచ్చిన తీరూ…”

“నేను చూడలేదులెండి. ఏమిటి రాసేరేమిటి?”

“ఆవిడ బాలవితంతువు. వారిది కలవారి కుటుంబం. ఇంట్లో రాచమర్యాదలు. ఆడవారు గడప దాటితే అవమానం అనుకునే రోజులు. ఆవడకి చదవాలని కోరిక. లైబ్రరీ ఉద్యమంలో భాగంగానో గొప్పింటి బిడ్డ కావడంచేతో ఆవిడకి కావలిసిన పుస్తకాలు ఇంటికి పంపేవారుట. వీరేశలింగంగారి చివరి రోజుల్లో ఆవిడకి 18 ఏళ్ళనుకుంటా. ఆయన పుస్తకాలు చదివేనని రాసుకున్నారు. ఆయనంటే గౌరవం. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, వీరేశలింగంగారి అభిప్రాయాలు గౌరవించినా ఆవిడ మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోలేదు.”

“అదేం గౌరవం అండీ. ఆచరణలో పెట్టని గౌరవం ఒట్టి కబుర్లు.”

“అదే నేనంటున్నది. ఎదటివారి అభిప్రాయాలు అంగీకరించినా తమ అభీష్టాలకి అనుగుణం అయితే ఆచరిస్తాం లేకపోతే లేదు. ఆవిడ చేసుకోలేదు కానీ చాలామంది   ఆడపిల్లలకి మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి అన్ని విధాలా సాయం చేశారు. తన జీవితాన్ని సంఘసేవలో గడపదలుచుకున్నారు. అలా చేశారు. అదన్నమాట వ్యక్తిత్వం అంటే. నువ్వు చదవాలి ఆ నాలుగు పేజీల్లో ఆనాటి పరిస్థితులగురించి ఎంత తెలుస్తుందో …”

“ఆవిడ కూడా చేసుకుని ఉండొచ్చు కదా”

“అదేనయ్యా బాబూ నేనంటున్నది. మూస పోసినట్టు అందరికీ అన్ని సూచనలూ ఒకేలా నప్పవు. ఎవరికి వారు వాళ్ళ ఇష్టాయిషాలని బట్టి, వాళ్ళ పరిస్థితులని బట్టీ వాళ్ళ జీవితాన్ని నిర్ణయించుకోవాలి. ఎంత చదువుకున్నా తనకి ఏది కావాలో ఎవరికి వారు నిర్ణయించుకోలేకపోతే అది చదువే కాదు.”

“సరేలెండి. ఆవిడ 19 శతాబ్దం మనిషి. మరి మీకాలంలో ఎలా ఉండేది? మరి ఏ విషయాల్లో మీకు మీరే నిర్ణయాలు చేసుకోగలిగేరు? ఏవిషయాల్లో మీ అమ్మా నాన్నా మాటలే చెల్లేయి?”

సిరి ఆలోచనలో పడిపోయింది … ఆనాటి జీవితం తలుచుకుంటూ.

 

 

 

(జూన్ 14, 2011.)

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మార్పు 20”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s