మార్పు 21

“ఎంత మంచి సలహా అయినా గుడ్డిగా ఆచరణలో పెట్టడం కాదు. తనకి తానుగా తనజీవితాన్ని తన ఆశయాలకి అనుగుణంగా మలుచుకుంటూ తనకి నచ్చిన సలహాలని తదనుగుణంగా ఉపయోగించుకోవాల”ని కామాక్షమ్మగారి అభిమతం. వారి బంధువు నాళం సుశీలమ్మగారు కూడా ఒక వ్యాసం రాసేరు. ఆ చుట్టరికం నాకు సరిగా గుర్తు లేదు కానీ కామాక్షమ్మగారు సుశీలమ్మగారి మేనత్త అనుకుంటాను. ఇవన్నీ “యుగపురుషుడు వీరేశలింగం” స్మారకోత్సవ సంచికలో ఉన్నాయి. సుశీలమ్మగారు కూడా “ఆ రోజులలాటివి. అందుకు నేను సిగ్గుపడడంలేదు, బాధ పడుతున్నాను గానీ, రామానుజాచార్యులవారి సతి కూడా ఇటువంటి అనుభవాలే పొందేరని విన్నతరవాత నాకు సాంత్వన కలిగింది. ఈనాడు నేను ఆంధ్ర మహిళా గానసభ నడుపుతున్నాను” అంటారు. నేను చెప్పొచ్చేదేమిటంటే, స్త్రీలు గడప దాటరాదు అన్న ఆచారాన్ని ఆచరణలో పెడుతూన్నట్టు కనిపిస్తూనే, బయటికి వెళ్ళగల సౌలభ్యాన్ని మరొక విధంగా సాధించుకున్నారు.”[i]

“ఏమోనండీ. నాకు మాత్రం అదేమంత గొప్పగా కనిపించడంలేదు. నిజంగా ఆమెకి గుండెబలం ఉంటే, ‘నేను బయటికి వెళ్తాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి అనాలి’.”

అన్నాడు తారకం.

“నిజమే. ఈ రోజుల్లో అలాగే అంటున్నారు అందరూను. ఎటొచ్చీ అలాటి ధైర్యం ఈనాడు రావడానికి ఇంతకాలం పెట్టింది. ఆనాడు కామాక్షమ్మగారూ, సుశీలమ్మగారూ, ఇంకా అంతకుముందు భండారు అచ్చమాంబగారూ, ఇంకా మనకి తెలీని ఎందరో స్త్రీలు ఎంతో చాకచక్యంతో ఆంక్షలు పెట్టేవారి అభిప్రాయాలని మార్చుకుంటూ వస్తేనే ఈనాటికి ఇది సాధ్యం అయింది. మార్పు ఏదో ఓ కీ కొడితే ఠక్కున వచ్చేసేది కాదు కదా కంప్యూటరు ప్రోగ్రాంలాగ.”

“మరి మీకు రాయాలన్న కోరిక ఎలా మొదలయింది? మీ నాన్నా, అన్నయ్యలూ రచయితలా?”

సిరి కళ్ళలో కొంటెనవ్వు మెరిసింది.

“ఎందుకండీ నవ్వుతారు?”

“మీప్రశ్నకి. మీ అమ్మా, అక్కయ్యలూ రాసేవారా అని అడగనందుకు. అది సరేలెండి. ఊరికే హాస్యానికంటున్నా కానీ మీప్రశ్నకి సమాధానం – మా పెద్దన్నయ్య ఒక కథా, రెండో అన్నయ్య ఒక కథా రాసేరు. మాఅమ్మ రాయలేదు కానీ చాలా పుస్తకాలే చదివేది. పత్రికలు కాదు. పురాణాలూ, ఉపనిషత్తులూ చదివేది. మా అక్కయ్య కూడా తరవాతికాలంలో ఆత్మవిచారంగురించిన పుస్తకాలు రాసింది.”

“మరి మీరు ఎలా మొదలు పెట్టేరు? మీకు స్ఫూర్తి ఎవరు?”

“హ్మ్. నాకు స్ఫూర్తి నిచ్చినవాళ్ళు … ఏమో .. నేనసలు అలా ఆలోచించలేదనుకుంటా ఆరోజుల్లో. చెప్పేను కదా. పత్రికలు విరివిగా అందుబాటులో ఉన్నరోజులు. అందరం చదివేవాళ్ళం. అందరం కాదులెండి. మాయింట్లో నేనూ, మా చిన్నన్నయ్యే అనుకుంటా. మా చిన్నన్నయ్య భారతిలాటి సాహిత్యపత్రికలు ఎక్కువ ఇష్టపడేవాడు.” “ఒక్కమాటలో మీరొక్కరే. …”

“రైట్. నువ్వే రైటు. నేనొక్కదాన్నే … అయితే అవి చదవొద్దని మాత్రం మాయింట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. పత్రిక కొన్నా అన్నీ చదివేదాన్ని కాదు. ముఖ్యంగా నేను సీరియల్సు అట్టే చదవలేదనే అనుకుంటా. మొట్టమొదటి సీరియలు కోడూరి కౌసల్యాదేవి చక్రభ్రమణం అని గుర్తు. ఆవిడకి బాగానే పేరొచ్చింది సులోచనారాణి సెక్రటరీ వచ్చి కౌసల్యాదేవిగారిని ఓవర్టేక్ చేసేసింది.”

“సులోచనారాణినవలలమీద మీ అభిప్రాయం ఏమిటి?”

“నేను చదవలేదు.”

“అయ్యో అదేమిటి సులోచనారాణి నవలలు చదవకుండా పత్రికలు చదవడమేమిటండీ. మరి ఏం చదివేవారు పత్రికలలో?”

“అందరికీ అన్నీ నచ్చాలనేముంది. నాకు నచ్చిన కథలు నేను చదివేదాన్ని.”

“సర్లెండి. అసలు విషయం వదిలేశారు. మీరు రాయడం ఎలా మొదలయింది?”

“మీ అందరిలాగే. చెప్పేను కదా ఓ కథ చదివినప్పుడు నేనూ మీఅందరిలాగే – ‘ఇది ఇలా కాదు అలా ఉంటే బాగుండేది.’ ‘ఆ పాత్రని చంపక్కర్లేదు,’ ‘ఆయన ఆవిడకి ముందే చెప్పేసి ఉంటే తగువొచ్చేది కాదు,’ ‘ఆవిడే ఆయన్ని అడిగేసి అసలు విషయం తెలిసేసుకుంటే పోలా’ … అనుకుంటూనే నా ఆలోచనలు సాగించేదాన్ని.”

“హా. చూశారా, మరి ఇప్పుడు పాఠకులు ఇలా ప్రశ్నిస్తే మీరూరుకోరు.”

“హయ్యో రామా, నేను ఊరుకుంటే మీరూరుకుంటారా?”

“చూశారా మీరు పెర్సనల్‌ గా తీసుకుంటున్నారు.”

నాకు nerves! ఈ డయలాగు వీరిద్దరినీ ఏ తీరాలకి లాగుకొనిపోయి ఏ ముప్పు తెచ్చునో  … అనుకుంటున్నా ఇద్దరిమొహాలూ చూస్తూ.

“ఉండయ్య బాబు, ఆయమ్మని సెప్పనీవేటి? ఆ యమ్మ ఏటంటదంటే మీ అబిప్పేయేలు మీరు సెప్పినట్టె ఆయమ్మ అబిప్పేయం ఆయమ్మ సెప్తంది. నివ్వట్ల అనుకున్నవు. నానిట్ల అనుకున్నను అని. అదీ సంగతి. అప్డు మీకు ఇంక ఎక్కువ అబిప్పియలు ఎరికయయితయి కద. పస్నలూ లేదు పెసరకాయా నేదు.”

“సరేనండీ” అని సంద్రాలుతో అని, తారకం శ్రీదేవివేపు తిరిగేడు, “మరి మీరు రచయితలకి మీ అభిప్రాయాలు చెప్పేరా? వాళ్ళు ఏం జవాబిచ్చేరు?”

శ్రీదేవి నావేపు చూసి, “ఏంటి నువ్వేం మాటాడ్డంలేదు?” అంది.

“నేను కేవలం శ్రోతని మాత్రమే. వింటున్నాను. చెప్పేను కదా ఈ రోజు క్లాసు నీదని.” అన్నాను. నా అభిప్రాయాలు ఇప్పుడప్పుడే చెప్పే ఉద్దేశం లేదు నాకు మరి.

“ఇప్పుడంటే జాలంలో క్షణాలమీద అభిప్రాయాలు ఒకొరికొకరు చెప్పేసుకుంటున్నారు. కానీ మారోజుల్లో ఈ వసతి లేదు కదా. పత్రిక ఇంటికొచ్చేసరికే పదిరోజులు. ఆ తరవాత పాఠకులు ఉత్తరాలు రాస్తే అవి పత్రికల ఆఫీసులు చేరి, ఎడిటర్లు ప్రకటించేవేళకి మరో మూడు వారాలు అయిపోయేవి. పైగా ఎడిటర్లు అన్ని ఉత్తరాలూ ప్రచురించరు కూడాను. రచయితలకి కోపం తెప్పేంచేవీ, పాఠకులకి కోపం తెప్పించేవీ, పత్రికల పోలసీలకి అనుగుణంగా లేనివీ … ఇలా ఏరిపారేసి, మిగతావాటిల్లో ఒకటో రెండో గోడమీద పిల్లివాటం అభిప్రాయాలు ఎంచి పత్రికలో ప్రచురించేవారు. ఇన్ని గండాలు గడిచి వచ్చిన ఆ అభిప్రాయాలని పట్టించుకునే ఓపికా, తీరిగా ఎవరికుంటుంది కనక. అంచేత రచయితలు జవాబివ్వడం అసలే లేదు. రచయితలకీ పాఠకులకీ ఈనాడున్నంత ‘దగ్గరతనం’ ఆరోజుల్లో లేదనుకో.”

“అంటే రచయితలు పాఠకుల అభిప్రాయాలని పట్టించుకునేవారు కారా?”

“అది కాదు నేనంటున్నది. ఆ దృష్టి లేదని. ఎప్పుడేనా ఏ సభల్లోనో సమావేశాల్లోనూ ఎదురు పడ్డప్పుడు పాఠకులు రచయితలతో మాటాడినప్పుడు రచయితలు పాఠకులకి మర్యాదగానే జవాబులిచ్చేవారు. సందేహం లేదు. నేను అప్పటికింకా చిన్నదాన్ని. ఎప్పుడేనా పెద్దరచయితలని కలవడం జరిగితే వాళ్ళు నాతో మర్యాదగానే మాటాడేరు.”

“మీరు వాళ్ళకథలని విమర్శించేలేదా?”

“ఈరోజు మీరు రాసే వ్యాఖ్యలలాటివా అంటే తక్కువే అనుకుంటాను. అయినా నేను అట్టేమంది రచయితలని కలవలేదు కనక నాకు అంతగా తెలీదు అనడం న్యాయం.”

“మీరు ఇలా కాదు అలా ఉండాలి అన్న పాయింటు తీసుకుని మరో కథ రాసేరా ఎప్పుడైనా?”

“అంటే అచ్చంగా ఉన్నదున్నట్టు తీసుకుని, రామయ్యని సోమయ్యగానూ, పిల్లిని ఎలకగానూ మార్చి రాయడం కాదు నేనంటున్నది. కథగురించి అనేకరకాల ఆలోచనలు వస్తాయి. అందులో ఇవి కూడా ఉంటాయి. వెంటనే కాకపోవచ్చు. ఏదో ఒక వస్తువు తీసుకుని కథ రాయాలని నాకనిపించినప్పుడు ఈ ఆలోచనలు కూడా వచ్చి ఆ కథ మలుచుకోడానికి సాయం చేస్తాయి. చేశాయి అనే చెప్పాలి. నిజానికి ఇలాటివి చాలామటుకు చేతనాచేతనావస్థలో జరుగుతాయి. నేనే ఇదివరలో ఓసారి చెప్పినట్టు we breed what we read :p,” అంది శ్రీదేవి చిన్నగా నవ్వి.

“నాకు వేరే పనుందండీ. ఆలస్యం అయిపోతోంది. వెళ్ళాలి,” అంటూ తారకం లేచేడు. అతనికి శ్రీదేవి మాటలు రుచించలేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

నేను లేచి అతన్ని అనుసరించేను. పని గట్టుకు పిలిచింది నేనే గనక అతన్ని శాంతపరచవలసిన అవుసరం నాకే మరి.

“చెప్పేను కదండీ ఆవిడకి నేనడిగే ప్రశ్నలు నచ్చలేదు. నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుందనీ,” అన్నాడతను గడప దాటుతూనే.

“అది కాదు తారకం. నువ్వు నీఅభిప్రాయం చెప్పినట్టే ఆవిడ తన అభిప్రాయం చెప్పింది. Exhange of ideas అంటే అంతే కదా మరి. ఎవరూ ఎవరినీ అపార్థం చేసుకోనక్కర్లేదు,” అన్నాను.

తారకం అసంతృప్తిగా తలాడించి వెళ్ళిపోయేడు.

వెనుదిరిగి నేను లోపలికడుగిడబోతుంటే సంద్రాలు మాటలు వినిపించేయి, “నివ్వెందుకనాగ అనుకుంతవు. నీమాట నివ్ సెప్పినవు. ఆయనమాట ఆయన సెప్పినాడు. ఎవురి అబిప్పిరియాలు ఆరివి. అంతే.”

శ్రీదేవికి కూడా అదే అనుమానం వచ్చిందన్నమాట.

(జూన్ 19, 2011)


[i]  నా పుస్తకం Telugu women writers, 1950-1975, A critical study లో ఈ విషయాలు విస్తృతంగా చర్చించ

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మార్పు 21”

 1. నమస్తే మాలతి గారూ…

  ఎలా వున్నారు? మీ మార్పు ముగించేసుంటారు అనుకుంటూ వచ్చా మీ బ్లాగుకి చాలా రోజుల తరవాత….ఇంకా సాగుతోంది…ఇవాళ నేను నాలుగు మార్పులు చదివాను 🙂
  గత రెండు నెలల్లో మూడు సార్లు మీ వూరొచ్చినా ఎండలకి జడిసి కాలు బయట పెట్టలేదు…కానీ వచ్చినప్పుడల్లా మా వారు అడుగుతూ వుంటారు మీ ఫ్రెండు దగ్గరకి వెళతావేమిటీ అని 🙂 అన్నట్టు క్రితం నెల కాల్పులు మీవూళ్ళోనే చూసానండోయ్…
  మిమ్మల్ని కలిసిన దగ్గరనుండి ఒక కధ రాద్దామని మొదలెట్టి సాగదీస్తున్నా…అది పూర్తవ్వట్లేదు కానీ మధ్యలో నాకు తోచిన రాతలు నాలుగు రాసేసా…ఇంతకీ కధలెలా రాస్తారండీ (మీ కధలో కధానాయకుడడిగిన style లోనే…)
  ఈ మధ్య నా బ్లాగులో మీ అడుగు జాడలెక్కడా కనిపించక చిన్న బోయింది 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s