కథామాలతి – సంకలనం

ఈ సంకలనంగురించి

నా ముందు టపాలో మాధురికీ, నాకథలు ఆదరించే తదితర పాఠకులకి మాటిచ్చాను నా కథలు వీలయినంత పఠనయోగ్యంగా చేసి ఇ-బుక్ రూపంలో అందించగలనని.

(కథలు చదువుకోడానికి కథలమాలతి 1నొక్కండి)

ఆ ప్రయత్నంలో ఇది తొలి సంకలనం. నేను అమెరికా వచ్చేక రాసినవే ఇవన్నీ. ఆంధ్రప్రభ, స్వాతి, ఆంధ్రజ్యోతి, ఈమాట.కాం, కౌముది.నెట్ వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురణకి నోచుకున్నాయి ఈ కథలు. కథాజగత్ వారు నిర్వహించిన పోటీలలో రంగుతోలు కథమీద శ్రీలలిత రాసి బహుమతి గెల్చుకున్న వ్యాసం ఇక్కడ చూడొచ్చు. భయం కథని బొమ్మలకథగా పిల్లలకోసం తయారు చేశారు లలిత జి  (తెలుగు4కిడ్స్). అది ఇక్కడ చూడొచ్చు.

ఈ సంకలనంలో పదిహేను కథలున్నాయి. తిరిగి టైపు చేస్తున్నాను కదా మరోసారి చూసుకుంటూ అక్కడక్కడ చిన్న మార్పులు కూడా చేశాను. క్రమంగా మిగతా కథలు కూడా ఇలాగే మరో రెండో మూడో సంకలనాలు చేసే ప్రయత్నంలో ఉన్నాను.

సమీక్షలూ, వ్యాఖ్యలూ, రచయితలకీ పాఠకులకీమధ్య గల అవినాభావసంబంధం – ఈ విషయంలో నా అభిప్రాయాలూ ఈ బ్లాగులోనూ ఇతరత్రా కూడా చాలాసార్లే స్పష్టం చేశాను. అధికంగా మరోసారి చెప్పాలంటే వీటిని “పెర్సనల్” తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నది – నామటుకు నాకు సాహిత్యంలో మనం వెలిబుచ్చే అభిప్రాయాలు పెర్సనల్ అనే అనుకుంటాను.  వాదనలకోసమే వాదించడం పండితుల చర్చల్లో జరుగుతాయి. నాలాటి సామాన్యజనాలు మనసా ఏది నమ్ముతామో అదే చెప్తాం కదా.  అది కోపతాపాలుగా ప్రదర్శించనక్కర్లేదని నేను కూడా ఒప్పుకుంటాను.

ఈ పిడియఫ్ పైళ్ళను మీరు ఇక్కడే చదువుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ చేసుకోవచ్చు స్వేచ్ఛగా. మీ స్నేహితులకి పంచిపెట్టుకోవచ్చు కూడా.

కాపీరైటు నిబంధనలు ఈ ఫైళ్ళకి కూడా వర్తిస్తాయి. అంటే వేరే సంకలనాల్లోనో మరో చోటో ప్రచురించేముందు నాకో ఇమెయిలు ఇవ్వవలసిందిగా నా విన్నపము.

ఇక ఈ కథలవిషయానికి వస్తే, –

నేను అమెరికా వచ్చేక రాసిన మొట్టమొదటి తెలుగు కథ కొనే మనిషి. ఈ శీర్షిక వివరించేముందు అసలు నాకథలు అన్నిటికీ నేపథ్యంగానూ అంతర్లీనంగానూ నిక్షిప్తమయి ఉన్న నా ఆలోచనలు వివరిస్తాను.

కథలు రాయడానికి పూనుకున్నప్పుడు నేను ప్రధానంగా ఆలోచించేవి వ్యక్తి విలువలు. కథల్లోనూ నిత్యజీవితంలోనూ మనుషులు ఏ ఒక్క పరిస్థితిలో గానీ ఎలా ప్రవర్తిస్తారు, ఎందుకు అలా ప్రవర్తిస్తారు, ఏం మాటాడతారు, ఎందుకు అలా మాటాడతారు వంటివే నేను ఎక్కువగా ఆలోచిస్తాను. రెండోది జాతి విలువలు. ఇది నాకు అమెరికా వచ్చేక స్ఫురించింది. నేను ఇక్కడికి వచ్చేకే మనదేశంగురించి అమెరికాలో ఉన్న అపోహలూ, అమెరికనులగురించి మనకున్న అపోహలూ అర్థమయేయి. ఆ తరవాత మౌలికమయిన మానవీయ విలువల్లో సామ్యాలు కూడా కనిపించేయి.

ఈ కథలు రాస్తున్నప్పుడు నేను దృష్టిలో పెట్టుకున్నవి ఈ అభిప్రాయాలే. అంటే ఎవరి విలువలు గొప్పవి అని కాక, ఏ విలువలు ఎలా ఆ సంస్కృతిలో రూపు సంతరించుకుంటాయి అన్నది పరిశీలించడానికి ప్రయత్నించేను. ఉదాహరణకి నా మొదటి కథే తీసుకోండి. ఇలాటివి సర్వసాధారణం. అయితే కొనే మనిషి అన్న పదంలో మనకి డబ్బు ధ్వనిస్తుంది. కానీ అమెరికన్ భాషలో అది సామాజిక భావజాలంలో భాగం. ఇక్కడ “కొనడం” అంటే నమ్మించడం అన్న ధ్వని ఉంది. అమెరికన్ సమాజంలో అక్క తమ్ముడికి సాయం చేసింది. తమ్ముడు ఆ అక్కకొడుకుకి సాయం చేసేడనే. అందులో ఉన్నది మన హిందూ సాంప్రదాయంలో చెప్పే “ఋణం తీర్చుకోడం” లాటిదే. మన జీవనసరళిలో మతానికి సంబంధించిన పదజాలంలాటిదే ఇక్కడ వ్యాపారసంబంధిత భాష. “ఇచ్చిపుచ్చుకోడాలకి” అది మరో కోణం, అదే జమాఖర్చుల పట్టిక కథ.

ఈ రెండు కథలూ బయట ప్రపంచాన్ని ప్రస్తావిస్తే తరవాతి నాలుగు కథలు అమెరికా వచ్చిన తెలుగువారి కుటుంబాల్లో కలిగిన ఒక అయోమయ మానసిక స్థితిని తెలుపుతాయి. అటు అమెరికన్ సంప్రదాయాలు పూర్తిగా అర్థం చేసుకోలేకా ఇటు తెలుగుసంప్రదాయాలకి స్వస్తి చెప్పలేకా కొట్టుమిట్టాడే మధ్యగత తెలుగుదనం అది.  ఈ నాలుగు కథలూ ఒకచోట పెట్టి సూక్ష్మంగా పరిశీలించి చూస్తే 70వ దశకంలో అమెరికా వచ్చిన తెలుగువారి మానసికస్థితి  కొంతయినా అర్థమవుతుందేమోనని నా ఆశ.

ఇదే పద్ధతిలో మిగతా కథల్లో కూడా ఒక ఇతివృత్తం తీసుకుని మన సంస్కృతిలోనూ అమెరికన్ సంస్కృతిలోనూ ఆ ఇతివృత్తం ఎలా ప్రకటితమవుతుందో చూపడానికి ప్రయత్నించేను. అంటే నాదృష్టిలో ప్రాథమిక విలువలు ఒకటే అయినా అవి వ్యక్తమయే తీరులో వ్యత్యాసాలు ఉంటాయి. ఆ రీతులు ఆవిష్కరించడమే నాధ్యేయం.

ఈ సంకలనం ఎప్పట్లాగే మీ ఆదరాభిమానాలకు నోచుకుంటుందని ఆశిస్తున్నాను. నా రచనలని ఆదరించి నాకు ప్రోత్సాహమిస్తున్న పాఠకులకి ధన్యవాదాలు.

–         నిడదవోలు మాలతి

–         23 జూన్ 2011.

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “కథామాలతి – సంకలనం”

 1. మాలతి గారు కధామాలతి 1 లో నాకు అన్నిటికన్నా పెంపకం కథ ఎంతగానో నచ్చింది.చిన్న రచనతో జీవన సారం మొత్తం అందించారు హాట్స్ ఆఫ్

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. @ మాధురీ, మీపేరు ఉదహరించడం – నాకథలని ఆదరించే పాఠకురాలిగా – న్యాయమేనండీ. మీ అభిప్రాయాలకోసం ఎదురు చూస్తుంటాను. తప్పక నిర్మొహమాటంగా మీకు కలిగిన ఆలోచనలు పంచుకోవలసిందిగా అర్థిస్తున్నాను. –

  మెచ్చుకోండి

 3. మీరు ప్రస్తావించే స్థాయిలో నేను లేకపోయినా మీరు నా పేరుని ప్రస్తావించారు. మొదటి ధన్యవాదాలు అందుకైతే అసలైన రెండవది మీ కథా సంకలనాన్ని ఇ పుస్తకంగా తెచ్చినందుకు. తప్పకుండా చదువుతాను. చదివాక కొన్ని విషయాలలో నా అభిప్రాయాలను చెప్తాను.

  మెచ్చుకోండి

 4. మాలతి గారు,

  ఇప్పుడేగా మాట్లాడుకున్నాము. పుట్టిన రోజు అని చెప్పనే లేదు. అందుకోండి నా శుభాకాంక్షలు.
  కథామాలతీయం బావుంది. ముఖ్యం గా కవర్ పేజీ. ఇంకా లోపలి కథలు చదవలేదు. దాదాపుగా చదివినవే అయిఉంటాయి.కానీమళ్ళీ చదువుతాను.
  కల్పన

  మెచ్చుకోండి

 5. మీ కథామాలతి చూశాను. తీరిగ్గా కథలన్నీ చదువుతాను. రంగుతోలు కథ క్రింద కథాజగత్‌కు కూడా క్రెడిట్ ఇచ్చి ఉంటే బాగుండేది.

  మెచ్చుకోండి

 6. చాలా సంతోషం మాలతి గారూ ! మాకోసం మీ కథల సంకలనాన్ని అందించినందుకు. మీకు, మిమ్మల్ని ఆ దిశగా ప్రేరేపించిన మిత్రులకు ధన్యవాదాలు. ఇప్పుడే దించుకున్నాను.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.