ఊసుపోక – ఏనాటికీ మరవలేని రోజున్నరసేపూ

(ఎన్నెమ్మకతలు 75)

కిందటి శుక్రవారం మధ్యాహ్నం నించి ఆదివారం ఉదయంవరకూ కొత్తపాళీ ఇంట్లో వారి కుటుంబంతో గడిపిన రోజున్నరసేపు నాకు అపూర్వమైన అనుభవం. నేను ఆయన్ని ముఖాముఖి చూడ్డం ఇదే మొదటిసారి. ఇదివరకు రెండు, మూడుసార్లు ఆయనయితే పిలిచేరు కానీ నాకే అప్పట్లో కుదరలేదు. ఈసారి ఏమైనా సరే వెళ్ళాలి అని దృఢంగా నిశ్చయించుకుని, ఆయనకీ, ఆయన భార్య సావిత్రికీ మాట ఇచ్చి, అది నిలబెట్టుకున్నాను కూడా. హా. వాళ్ళిద్దర్నీ చూడ్డం ఇదే మొదలయినా అక్కడున్నంతసేపూ నాకలా అనిపించలేదు.

కొత్తపాళీ తన బ్లాగులో ప్రకటించిన భస్మాసుర నృత్యనాటకం, కాలాస్త్రి వారిబ్లాగులో రిపోర్టుతో సంపూర్ణంగా బ్లాగరులందరికీ అర్థమయింది కదా అక్కడ గత శనివారం నృత్యప్రదర్శన సంగతి.

కానీ వాళ్ళు చెప్పేశారు కదాని నేనూరుకోలేను కదా. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఇదొక ప్రత్యేకమయిన అనుభవం. మీకు తెలుసో తెలీదో అమెరికాలో అంటుంటారు “ప్రతి మనిషీ జీవితంలో కనీసం ఒక 15 నిముషాలపాటు కీర్తి అనుభవించి తీరుతాడ”ని” అలా అన్నమాట. ఎటొచ్చీ నాకది పదిహేను నిముషాలు కాక ముప్ఫైఎనిమిది గంటలయింది. లేదా జన్మానికో శివరాత్రి అని కూడా అనొచ్చు.

అసలు మొదటి క్షణం దగ్గర మొదలు పెట్టి చెప్తాను కథ. నేను సాధారణంగా ఎక్కడికీ వెళ్ళను. అంచేత డెట్రాయిట్ ఎయిర్పోర్టులో దిగేక నాకొచ్చిన మొదటి అనుమానం -ఈయన ఎయిర్పోర్టులో ఎక్కడ నాకోసం వేచి ఉంటారు, నన్ను పోల్చుకోడానికి నేను ఆయనకేం కొండగుర్తులు చెప్పలేదు కదా, మరిప్పుడెలా అని. హీహీ. లేదులెండి నాకంటే ముందే నన్ను చూసేసి, గబగబా దగ్గరకొచ్చేసి, “మనం ఇంటికెళ్ళేసరికి మరో 40 నిముషాలు పడుతుంది. ఇక్కడ ఏమైనా అల్పాహారం తీసుకుంటారా?” అని ఎంతో ఆప్యాయంగా అడిగేరు. “ఓ మఫిను పుచ్చుకుంటాను” అన్నాన్నేను నిర్మహమాటంగా. ఆహారంవిషయంలోనూ వ్యవహారంవిషయంలోనూ కూడా నాకు మొహమాటాల్లేవు లెండి.

ఇంటికెళ్ళగానే, సావిత్రీ, వాళ్ళమ్మ విజయలక్ష్మిగారూ కూడా నన్నెప్పట్నుంచో తెలిసినట్టు పలకరించి, “ఆలస్యం అయిపోయింది, రండి భోంచేద్దురు గానీ,” అంటూ నాకు మరింత “feel at home” కల్పించేరు.

నిజానికి ఆ శనివారం సాయంత్రం నృత్యనాటకంలో కొత్తపాళీ శివుడి పాత్ర వేయవలసింది కానీ ఏవో కారణాలవల్ల వెయ్యలేదు. మొదటిసారి నన్ను పిలిచినప్పుడూ, ఈసారి ఆరంభదశలోనూ కూడా ఆయన ఒక పాత్ర పోషిస్తారనే అనుకున్నాను. కానీ నేను అక్కడికి బయల్దేరకముందే ప్లానులు మారిపోయేయని చెప్పేరు. అంచేత నేను అక్కడ దిగినప్పుడు ఈయన పాత్ర పోషించకపోయినా, ఆ నటవర్గంతో బిజీగా ఉంటారు కాబోలు అనుకున్నాను. కానీ ఆయన మంచి ఆర్గనైజరేమో నాతో కబుర్లు చెప్తూనే అటు ఆ నాటకానికి కావలిసిన పనులు కూడా చేసుకున్నారు. ఆహా అనుకున్నానన్నమాట.

సావిత్రి బ్లాగులు బాగానే చదువుతుంది కనక మాటాడుతుందనుకున్నాను కానీ తక్కువే. వాళ్ళమ్మ విజయలక్ష్మిగారు మరీ తక్కువ. వాళ్ళ పెద్దమ్మాయి ఛాయ ద్విపాత్రాభినయం చేయలేదు కానీ నాకలా అనిపించింది. ఎందుకంటే నాకు మొహాలు గుర్తు పట్టడానికి కొంత టైం పడుతుంది. అంచేత మొదట ఒక రకం హెయిర్ స్టైలుతో కనిపించి, గంట పోయేక మరో రకం తలకట్టుతో కనిపిస్తే, “మీ రెండో అమ్మాయా?” అనడిగేను. “లేదు. నా హెయిరు ఇప్పుడు మరో స్టైలులో ఉంది,” అంది ఛాయ. “మరి నన్నలా కన్ఫ్యూజు చెయ్యకు,” అన్నాను. “సరే, చెయ్యను. ముందే చెప్తున్నా, రేపు మరోరకంగా ఉంటుంది నా జుత్తు” అంది ఛాయ. భలే నచ్చేసింది నాకా పిల్ల!

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వీలయినప్పుడల్లా, కొత్తపాళీ తను చదివిన పుస్తకాలూ, తాను మెచ్చుకున్న రచయితలూ, వారిలో తాను దర్శించిన ప్రత్యేక కోణాలూ చెప్తుంటే నాకు ఎంతో ఆసక్తికరంగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. ఎంచేతంటే బ్లాగుల్లో ఆయన రాసే టపాలు చూస్తే, ఈయన ఇంత లోతుగా ఆలోచిస్తారన్న సంగతి తెలీదు. (కొత్తపాళీ, నో అఫెన్స్!)

నేను మిషిగన్ వచ్చేముందు కల్పన అంది, మీరిద్దరూ సాహిత్య చర్చలు చేసేసి, వాటిని వ్యాసంగా రాసి మాకందరికీ ఇచ్చేయండి అని. నేను అప్పటికప్పుడు బజారుకెళ్ళి బ్యాటరీలు కొనుక్కుని డిజిటల్ రికార్డరులో ముందున్నవన్నీ చెరిపేసి, ఎక్కు పెట్టిన రాంబాణంలా సిద్ధం చేసుకున్నాను. కానీ శుక్రవారం మధ్యాహ్నం భోజనాలయేక హాల్లో కూర్చుని మాటలు మొదలు పెట్టింతరవాత, లేచి ఆ రికార్డరు తేవాలని నాకు అనిపించలేదు. కులాసాగా కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటుంటే, రికార్డరేమిటి పానకంలో పుడక అనిపించింది నాకు. అంచేత నేను కూడా చక్కగా కాళ్ళు చాపుకుని వింటూ కూర్చున్నా.

ఆయన ఎవరిగురించి చెప్పేరు, ఏం చెప్పేరు అన్నది నేను కావాలనే చెప్పడం లేదు. దానికి రెండు కారణాలు – నాకు జ్ఞాపకం ఉన్నట్టు రాస్తే, తప్పులు రావొచ్చు. రెండోది ఆయన అభిప్రాయాలు ఆయనే మరింత ప్రస్ఫుటంగా రాయడం భావ్యం (అని ఇందుమూలంగా కొత్తపాళీకి తెలియజేస్తున్నాను.).

మరో వింత అనుభవం నాకు – మోహినీ భస్మాసుర చూస్తున్నప్పుడు. కూచిపూడి నృత్యం, నాటకరూపంలో కథ చెప్పడం అద్భుతంగా జరిగేయి. కాలాస్త్రి గారు తమ బ్లాగులో వివరంగా రాసేరు, విడియోలతో సహా. ఇక్కడ చూడండి.

నా అనుభవంలో వింత ఏమిటంటే, 80వ దశకంలో వెంపటి చినసత్యంగారు తమ ట్రూపుతో మాడిసన్ వచ్చేరు. అప్పట్లో వారి ప్రదర్శనలు నాలుగు – హరవిలాసం, క్షీరసాగరమథనం, శ్రీనివాస కల్యాణం, రుక్మిణీకల్యాణం విడియోలు కూడా చేసేరు. అవి నాదగ్గర ఉన్నాయి. ఆరోజుల్లో నేను దాదాపు భగవద్గీత పారాయణ చేసినంత నిష్ఠతో వాటిని కనీసం రెండురోజులకొకమారు చూసేదాన్ని. అంచేత అవి నామనసులో శాశ్వతంగా నిలిచిపోయేయి. అంచేత ఇప్పుడు ఈ ప్రదర్శన చూస్తున్నంతసేపూ నాకు మనసులో inset లాగ ఆనాటి ప్రదర్శన గుర్తుకొచ్చింది. అంటే వీళ్ళకంటే వాళ్ళు బాగా చేసేరు అని కాదు. మనసులో భావముద్రలు ఇలా పడతాయి అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నా. నిజానికి చాలా చాలా కాలం తరవాత ఇంతమంచి నృత్యప్రదర్శన చూడగలిగినందుకు ఆనందంగా ఉందనీ, ఆ అవకాశం కల్పించిన కొత్తపాళీ, సావిత్రి దంపతులకీ కూడా ధన్యవాదాలు చెప్పుకోడానికే ఈ టపా.

విజయలక్ష్మిగారు మాటాడింది తక్కువయినా ఒక చిన్న సంభాషణ చెప్పకుండా ఇది పూర్తి చెయ్యను. ఈమధ్య డల్లస్‌లో ఎండలు విపరీతంగా పేల్చేయడం నాకు బాధాకరం అయింది. ఆకారణంగా నేను నీళ్ళు ఎక్కువగా తాగుతున్నాను. ఆ సందర్భంలో మాటాడుతూ విజయలక్ష్మిగారు, “ఎప్పుడో రీడర్స్ డైజస్ట్‌లో చదివేను భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళు తాగకూడద”ని అన్నారు. నేను ఇదే మొదటిసారి వినడం ఈ విషయం. కొందరేమో భోజనానికి ముందు గ్లాసుడు నీళ్ళు తాగాలంటారు. నేనేమో తింటున్నంతసేపూ తాగుతూంటాను J). ఇలా రకరకాల అభిప్రాయాలు సంపాదించడం ఏ విషయంలోనైనా సరే సరదాగా ఉంటుంది నాకయితే. అందుకన్నమాట ఇక్కడ చెప్తున్నది.

జన్మానికో శివరాత్రి లేక ప్రతి ఒక్కరికీ 15 నిముషాల ఫేము అంటూ కదా మొదలు పెట్టేను. అదేమిటంటే, శనివారం ఉదయం కొత్తపాళీ నాకోసం ప్రత్యేకంగా నృత్యప్రదర్శన ఇచ్చేరు! అది కేవలం నేనంటే ఆయనకి గల అభిమానం తెలియపరుచుకోడానికే కానీ తెల్లార్తే నాపుట్టినరోజు అన్నసంగతి ఆయనకి తెలీదు అప్పటికి. ఆ తరవాత పరోక్షంగా ఆయనకి తెలిసినతరవాత చెప్పేను “మీరు నాకు ఇచ్చిన పుట్టినరోజు కానుక అపూర్వం” అని. ఛేంబర్ ఆర్కెస్ట్రాలాటి నృత్యప్రదర్శన నాలాటి సామాన్యులజీవితంలో ఎన్నిసార్లు సాధ్యం? చెప్పండి మరి.

ఫొటోలేవీ అనడక్కండి. మాకు ఆరోజున్నరసేపూ సావిత్రి ఫొటోగ్రాఫరు. ఆవిడ నాకు పంపితే పెట్టగలను.

(జూన్ 27, 2011)

తా.క. ఫొటోలు వచ్చేయి :))

 

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – ఏనాటికీ మరవలేని రోజున్నరసేపూ”

 1. మాలతి గారు, మీరు మరీనండీ. ఈ మాత్రానికి అంతంత పెద్ద విశేషణాలు కావాలా?
  The pleasure was totally ours.
  ఇక సాహిత్యవిషయాలు రాయడం – అలాంటివి మాట్లాడుకునేందుకే బావుంటై 🙂

  మెచ్చుకోండి

 2. $మాలతి గారు

  ఇప్పు’డే గమనించా…

  : : మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు :: 🙂

  మీకీ పుట్టినరోజు మరువలేని అనుభూతులు మిగిల్చినట్లు౦దిగా.. 🙂

  మెచ్చుకోండి

 3. కల్పనా, అదే కొత్తపాళీ – ఆయన ఆలోచనలు ఆయనచేతే రాయిద్దాం అనీ, నేనిలా రాసినందుకైనా ఆయన మంచి వ్యాసాలు మొదలు పెట్టి అందిస్తారనీ.. :)). రికార్డరూ, కెమెరా – ఇలాటివి మనం వాడుతున్నప్పుడు, అసలు విషయం చాలా మిస్సవుతాం.

  మెచ్చుకోండి

 4. మాలతి గారు,
  మొత్తానికి మీ సాహిత్య చర్చలు రికార్డ్ చేయకుందా, రాయకుండా తప్పించుకున్నారన్న మాట. నిజమే రసవత్తరమైన చర్చలు జరిగేటప్పుడు అప్పుడు వెళ్ళి రికార్డర్ తెచ్చుకోవటం మాత్రం వృధా. ఆ క్షణాన్ని అలా అనుభవించటమే బావుంటుంది. మీకు మంచి జ్నాపకాలు అందించినందుకు కొత్తపాళీ కి, సావిత్రికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.