ఊసుపోక – నాబాసా నా యాసా అడియాసా లంబాడోళ్ళ రామదాస!

(ఎన్నెమ్మకతలు 76)

కిందటివారం మిషిగన్ వెళ్ళినప్పుడు, కొత్తపాళీ  వుప్పల లక్ష్మణరావుగారి అతడు – ఆమె పుస్తకం ఇచ్చారు “మీకు నచ్చుతుంది చూడండం”టూ.

“సరేనండీ” అని తీసుకున్నానే కానీ చదువుతాననుకోలేదు. చెప్పేను కదా ఈమధ్య పుస్తకం పుచ్చుకుంటే కళ్ళు కాయితంమీదున్నా బుద్ధి బుగ్గయిపోయి, ఏం చదువుతున్నానో తెలీకుండా పోతోంది.
ఎయిర్పోర్టులో కూచుని పుస్తకం తెరిచేక పూర్తిగా మారిపోయేను. మా విశాపట్టం బాసా, యాసా భలే ఆకట్టుకునేశాయి నన్ను. కాంసు అంటే తెలుసా? కాబోలుకి గాఁవల్సు అనేవాళ్ళం. అదే కాంసు అయింది. అలాగే ఆఁవె (ఆమె), ఓఢ్రమంగలాడూ, చచ్చడిదీ, … అంటూ ఆనాడు వినిపించినమాటలన్నీ చదువుతుంటే ఆ రోజులు మళ్ళీ గుర్తుకొచ్చేయి. ఆరోజుల్లో ఒసే అనుకున్నా, అది అని అనుకున్నా తప్పు కాదు మాకు.

వేరు చెప్పనేల? మరీ ఆపకుండా చదివేశాను అని చెప్పలేను కానీ ఒకరోజులో నేను చదివేదాన్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగానే చదివేనని చెప్పాలి. ఇంకా పూర్తి కాలేదులెండి. ఆ నవలమీద విడిగా రాస్తాను “ఊసుపోక” కాదు సీరియస్‌గానే :p.

ఈనవల మూడో భాగంలో ఉన్నాను. సౌమ్య చాటులోకి వచ్చి ఈమధ్య తన అనుభవం ఒకటి చెప్పింది భాష గురించే. జర్మనీలో ఓ మనవాళ్ళ హోటలుకి వెళ్ళి, అక్కడ ఇంగ్లీషులో మాటాడుతున్న మనవాళ్ళు కనిపిస్తే, తను హిందీలో పలకరించిందిట. వాళ్ళు ఇంగ్లీషులో మాటాడేరు. దీనికి కాంటెక్స్టు ఏమిటంటే తనే రాసిన టపా చూఢండి ఇక్కడ.

ఇప్పుడు అసలు కథకొస్తాను. లక్ష్మణరావుగారి నవలలో మూడో భాగం వచ్చేసరికి నాకు కళ్ళు తిరిగేయి. అందులో కొన్ని చోట్ల ఇద్దరు తెలుగువాళ్ళు మాటాడుకునే సంభాషణ. ఈనవలలో ఇంతకుముందు కూడా ఇలాటి భాషణలున్నాయి కానీ మరీ ఇంత పేజీలకి పేజీలు తెలుగుఅక్షరాలలో ఇంగ్లీషు లేదు.

మరొకసారి మనవి చేసుకుంటున్నాను ఈ నవల గుణగుణాలని తక్కువ చేసి చూపడం నాధ్యేయం కాదు. ఇది అలా మాటాడే ఒక పాత్ర ప్రవేశపెట్టడమే లక్ష్మణరావుగారి ధ్యేయమని నేను అనుకుంటున్నాను వ్యంగ్యంగానే కావచ్చు.
ఇంతకీ సౌమ్యతో మాటాడుతూ అన్నాను, “నాకు మరో జోకు తోచింది ఇదంతా చూస్తుంటే. ఆ కథావిధానం ఎట్టిదంటే …
నేను మా అమ్మాయిని చూడ్డానికి వెళ్తానుట. తను తన స్నేహితులని పిలుస్తుందిట.

వాళ్ళలో ఒక అమెరికనమ్మాయి “నాకు తెలుగు వచ్చు” అంటుంది.

“ఎలా? కాలేజీలో రెండోభాషగా చదువుకున్నావా?” అని అడుగుతాను.

“లేదు. మాపక్కింటి తెలుగువాళ్ళు మాటీవీలో వంటలు చూస్తారు. నాకు ఆ ప్రోగ్రాం చక్కగా అర్థం అవుతుంది. తెలుక్కీ ఇంగ్లీషుకీ అట్టే తేడా లేదు రెండు మూడు సిలబులులు తప్పిస్తే అనుకుంటున్నాను” అంటుందామ్మాయి.
మాటీవీలో వంటలు ప్రోగ్రాం చూడనివారి సౌకర్యార్థం – వారి భాష “ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి, వెజీస్మీద స్ప్రే చేసి (అనగా స్ప్రింకిల్ చేసి) ప్లేట్లో సర్వ్ చేస్తే వండర్ఫుల్గా ఉంటుంది.”

ఈసందర్భంలోనే నేను చూసిన మరో షో కూడా గుర్తొస్తోంది. అది మోడర్న్ మహలక్ష్మి. అది మరీ విచిత్రం. ఆ మహలక్ష్మి ఒక పోటీ పెడుతుంది – ఆవిడొక సన్నివేశం ఇస్తే ఆ పోటీలో పాల్గొనేవాళ్ళు ఒక్క ఇంగ్లీషు మాట కూడా వాడకుండా ఆ సన్నివేశాన్ని అచ్చ తెలుగులో చెప్పాలి రెండునిముషాలపాటు. నిజంగా వాళ్ళు చెప్పినతీరు నన్ను చాలా ఆకర్షించింది. ఎటొచ్చీ ఆ పందెం నడుపుతున్న మహలక్ష్మిగారి పదవిన్యాసం చూడండి.

“ఇప్పుడు నేను ఒక incident ఇస్తాను. దాన్ని మీరు ఒక్క English Word కూడా use లేకుండా perfect తెలుగులో describe చెయ్యాలి. అలా describe చేస్తే నేను ten, twelve, twenty points అలా ఇస్తాను. ఎవరికి most points వస్తే వాళ్ళు winner. First prize…”

ఇంతకీ, నేను పైన చెప్పిన అమెరికనమ్మాయి జోకు సౌమ్యకి చెప్పేను. సౌమ్య నవ్వలేదు.

“నువ్వు నవ్వలేదు. నీకు జోకులా లేదా?” అన్నాను వదలకుండా.

“ఏం జోకులెండి. అలాగే ఉంది కదా,” అంది సౌమ్య దిగులుగా.

నేనేం మాటాడను? నిజానికి నాకు కూడా ఈ స్ఫూర్తి లేదా యావ ఎక్కువగా తెలిసింది దేశం వదిలి పెట్టి వచ్చింతరవాతే మరి.

తా.క. చెప్పడం మరిచాను. నాభాషా ఘోషమీద మీకింకా సరదా ఉంటే, ఇది కూడా చూడండి. అక్కడ పాఠకుల అభిప్రాయాలు కూడా గమనించవలెను.
(జులై 3, 2011)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “ఊసుపోక – నాబాసా నా యాసా అడియాసా లంబాడోళ్ళ రామదాస!”

 1. @ రాజేష్, రెండు నిముషాలపాటు తెలుగులో మాటాడగలరా అంటూ పందెం కాయడం నిజమేనండీ మన దౌర్భాగ్యం. దానిద్వారా వాళ్ళు ఏ సందేశం ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ముఖ్యంగా వాళ్ళే మిగతా ప్రోగ్రాం అంతా సంకరభాషలో నడుపుతున్నప్పుడు.

  మెచ్చుకోండి

 2. రాజేష్, మరేనండీ మాం ఇసాపట్టపోల్లఁవే. ఔతే మీకింతదాక తెలీదేంటే నాకాశ్యర్యం అయిపోతున్నాదండీ.. అవుతే, ఆ మాలక్ష్మమ్మగోరిపేరు రోజాగోరేంటండీ. ఆమె ఆడీ పంజాబీ డాన్సులకి సరిపోయింది. :))

  మెచ్చుకోండి

 3. $మాలతి గారు

  అవునవును.. బాస ఎంత గొప్పదో యాస కూడా అంతే..కొన్ని యాసల్లో..ముఖ్యంగా గోదారి యాసలో..అభిమాన౦, అప్యాయతలు పరవళ్ళు తొక్కుతూ ఉంటాయి.

  హహ్హ.. దెబ్బకొట్టారుగా.. మోడర్న్ మహాలక్ష్మి గారిని. మీరు చెప్పింది నిజవే.
  అసలా రెండు నిమిషాలు-తెలుగే మాట్లాడాలి అన్న పందెమే నాకు ఎబ్బెట్టుగా ఉంటుంది. తెలుగు మర్చిపోతున్నామని గుర్తుచేస్తున్నారో లేక తెలుగు నేర్పుతున్నామని/తెలుగుని కాపాడుతున్నామని చెప్తున్నారో.. తెలియక ఓ తికమక. రోజాగారికి మీరు తలంటిన విధం తెలిస్తే కొద్దిగా విధానం మారుస్తారేమో.

  వయితే మీది ఇసాకపట్టనామాండీ? 🙂

  మెచ్చుకోండి

 4. @ జ్యోతిగారూ, నాకింకా పూర్వజన్మసుకృతం ఏ కాస్తో మిగిలిపోయినట్టుంది. ఆ ఒక్క చానెలయినా మాయింట్లో లేదు. స్నేహితురాలింటికెళ్ళినప్పుడే. *తన్నాలనిపిస్తుంది* – హా. బాగా చెప్పేరు.

  మెచ్చుకోండి

 5. మాలతిగారు. మీరు చూసింది ఒకటే చానెల్. బ్రతికిపోయారు. మద్యాహ్నం పదకొండు కాగానే ఈ వంటల ప్రోగ్రాములు మొదలవుతాయి మూడువరకు. ఒక్కో చానెల్ ది ఒక్కో కధ. ఈటీవి కాస్త నయం అనిపిస్తుంది. మిగతావాళ్లైతేనా …నాకైతే వాళ్లని తన్నాలనిపిస్తుంది.. :))

  మెచ్చుకోండి

 6. @ కొత్తపాళీ, అవునండీ, మనం మాటాడుకోడం గుర్తుంది. మీరామాట చెప్పేక, సౌమ్య తన కత చెప్పేక ఇక్కడ అవి పెట్టాలనిపించింది. :))

  మెచ్చుకోండి

 7. మీరన్నది నిజం నిజం. ఈ వంటల కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులొకరు చెప్పారు – ఈమె నూనె, మంట, ఇలా మాట్లాడుతుంటే ప్రోగ్రామువాళ్ళే ఆయిల్, ఫ్లేం అనమని పదేపదే గుర్తు చేశారుట.

  మెచ్చుకోండి

 8. మీరు ప్రస్తావించే స్థాయిలో నేను లేకపోయినా మీరు నా పేరుని ప్రస్తావించారు. మొదటి ధన్యవాదాలు అందుకైతే అసలైన రెండవది మీ కథా సంకలనాన్ని ఇ పుస్తకంగా తెచ్చినందుకు. తప్పకుండా చదువుతాను. చదివాక కొన్ని విషయాలలో నా అభిప్రాయాలను చెప్తాను.

  మెచ్చుకోండి

 9. @ మాధురి, *కార్యక్రమాలన్నీ ఇంగ్లీషులోనే నిర్వహిస్తే సరిపోతుంది కదా* బాగా చెప్పేరు. నేనూ అదే అనుకుంటా. ఆ మోడర్న్ మహలక్ష్మిని ఇంటికి పంపేసి, ఆ పోటీదార్లలో ఒకరికి ఆవిడ పని ఒప్పచెప్పినా బాగుండని కూడా అనుకున్నా. ఆ ముగ్గురూ మాత్రం నిజంగా మంచి తెలుగులో చెప్పేరు ఆ కథలు.

  మెచ్చుకోండి

 10. మా టీవీ కార్యక్రమం మాత్రమే కాదులెండి. ప్రతి ఛానెల్ లో వంటల కార్యక్రమాలు ఆ విధంగానే ఉంటున్నాయి. మనవాళ్ళు, ఏంకర్ల నుంచి వంట చేసి చూపించే వారి వరకూ అందరూ ‘ మంచి నీళ్ళు ‘ అన్న మాటనే ఉపయోగించడం మానేశారు. నాకు మహా చిరాకు. అందుకే అటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉంటాను. అసలు ఆ కార్యక్రమాలన్నీ ఇంగ్లీషులోనే నిర్వహిస్తే సరిపోతుంది కదా.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s