ఊసుపోక – సోంవారం ఉదయం పావుకాసువెనక!

(ఎన్నెమ్మకతలు 78)

“అనువాదాలు చేద్దాం అనుకుంటున్నానండీ,” అన్నాడు తారకం.

“ఔతే సేసీండి మరి,” అంది సంద్రాలు.

ఇద్దరినీ చూస్తూ ఆనందిస్తున్నాన్నేను. నాకీమధ్య వీళ్లిద్దరూ ప్రొవైడు చేస్తున్నంత ఎంటర్టైనుమెంటు వేరెక్కడా దొరకడంలేదు.

“మీరు చెప్పండి ఏకథ చేస్తే బాగుంటుంది? ఏభాషలోంచి ఏభాషలోకి తేలిగ్గా చేసీవొచ్చు? గూగుల్ అనువాదాలకి ఏది అనువు?”

“అదేటి బాబూ నానింక నీకే ఏదో కత శానా అబ్బురంగున్నది, ఏరేవోల్లకి గమనం నేదూ, అదందరికి తెలవాలని అనాదం సేస్తవనుకొంటి.”

“నాకేఁవో చాలా కథలే కనిపిస్తున్నాయి. ఏ కుటుంబరావుకథో చలం కథో తీసుకు చేస్తే మనకీ వారికీ కూడా ఘనంగా ఉంటుందని.”

సంద్రాలు హీహీ అంటూ నవ్వింది.

“ఎందుకూ ఆ నవ్వు?”

“ఏటి నువ్వు అనాదం సేస్తే గాని ఆరికి గనం రాదా ఏటనీ …”

తారకంమొహమ్మీద చిరాకు రేగింది. “అది కాదండీ, ఇతర భాషలవారికోసం అనువాదాలు చెయ్యడం. మరి వారికి తెలియాలి కదా మనకింత గొప్ప రచయితలున్నారని,” అన్నాడతను నావేపు చూస్తూ.

“ఆయమ్మకి సెప్తవేటి. నాను అడగతంటె,” అంది సంద్రాలు తనఉనికిని అతను నిర్లక్ష్యం చేసినందుకు నిరసన తెలియజేస్తూ.

“అది కాదమ్మా. మనవాళ్ళకి తెలుసు కానీ ఇతరదేశాల్లో వారికి తెలీదు కదా అని.”

నేను సంద్రాలు మాటకి అడ్డం వస్తూ, “నిజమే,” అన్నాను.

సంద్రాలు అసంతృప్తిగా నావేపు చూసింది.

నవ్వుకున్నాను నాలో నేను.

తారకం సంచీలోంచి ఓ కట్ట లాగేడు. “చెయ్యాలనుంది” అంటూ మొదలెట్టేడు కానీ చెయ్యడం అయిపోయిందన్నమాట. ఆ మాటే అన్నాను.

“లేదులెండి. ఇది నా గళ్ ప్రెండ్ చేసింది.”

“తెలుగమ్మాయేనా?”

“అర్థ తెలుగు. నాన్న తెలుగువాడే.”

“ఆహా” అంటూ తీసుకున్నాను ఆ కాయితాలు.

“తీరిగ్గా చూసి తరవాత చెప్పండి, తొందర్లేదు,” అనేసి అతను వెళ్ళిపోయేడు. సంద్రాలు కదల్లేదు.

“రండి, మిమ్మల్ని మీయింటిదగ్గర దింపుతాను,” అన్నాడు తారకం.

“నేదునే. నాకు పనేం నేదు. కాస్సేపాగి నడిసిపోత,” అంది సంద్రాలు.

000

నేను అనువాదం చూస్తున్నాను. నాకు నవ్వొస్తోంది.

“ఏటి నవ్వతన్నవ్,” అంది సంద్రాలు.

అందుకన్నమాట వెనక్కి ఉండిపోయింది. ఆవిడకి కూడా నాలాగే చిలిపి ఆలోచనలు ఎక్కువ మరి!

“ఈ అనువాదాలు …”

“ఎలగున్నయేటి?”

అది చదువుతుంటే నాకు అక్కడక్కడ చూసిన కొన్ని అనువాదాలు గుర్తుకొచ్చేయి.

తెలుగులోంచి ఇంగ్లీషులోకి –

రెండు తగల్నియ్ దానికి —  let her touch two.

ఎక్కడ చచ్చిందో పిల్లముండ — Wherever did the child widow die?

రమ్మంటే రావు, పొమ్మంటే పోవు — I say come you don’t come I say you go you don’t go.

మళ్ళీ చదవడం మొదలు పెట్టేను తారకం ఇచ్చిన కాయితాలు.

ఇంగ్లీషులోంచి తెలుగులోకి –

Doctor is studying patient’s complaints. –  డాక్టరు రోగి ఫిర్యాదులు పఠిస్తున్నాడు.

Where on earth are you going? – ఈ నేలమీద ఎక్కడికెళ్తున్నావు?

How’re you feeling today? — మీరు ఈ రోజు ఏ అనుభూతి అనుభవిస్తున్నారు?

Monday morning quarterback — సోంవారం ఉదయం పావుకాసువెనక

ఫక్కున నవ్వేన్నేను.

“నాక్కూడ సెప్మంటే సెప్పవేటి?” అని కోప్పడింది సంద్రాలు.

మరో రెండు నిముషాలు విరగబడి నవ్వడం అయేక చెప్పేను, “నాక్కూడా చాలాకాలం తెలీలేదులే ఆ క్వార్టరుబాకేమిటో, అందులోనూ సోమవారం ఉదయం ఏమిటో. ఇంచుమించు నేనూ అలాగే అనుకున్నా మొదట. తరవాత్తెలిసింది ఆయన ఓ ఆటగాడనీ, ఫుట్బాల్ ఆటలో ఆయనది ప్రముఖ స్థానమనీను. అది తెలుసుకునేసరికి, సోమవారం రాత్రి టీవీలో ప్రసారాలు మొదలయేయి. అంచేత నేను సోమవారం రాత్రి ఆడబోయే ఆటగురించి ఉదయం కూచుని మాటాడుకుంటారు కాబోలు అనుకున్నాను.”

“మరి గాదేటి?”

“కాదుట. ఆట ఆదివారాలు ఆడే రోజుల్లో పుట్టిన జాతీయంట అది.”

“ఆట ఐపోనాక ఏటుంటాది మాటాడుకోనాంకి?”

“అదే మరి. ఆట అయిపోయేక, అయ్యో నేనిలా చేయ్యాల్సింది, అలా చేయాల్సింది అంటూ ఆ క్వార్టరుబాకు ఆగకుండా నస పెడుతున్నప్పుడు, “గడిచిపోయినదానికి ఎందుకు ఏడవడం?” అంటూ బుద్ధి చెప్పే మంచిమాటట అది.”

“అదేటి మరి. గాలుపెండు ఈగడ్డనుట్టిన పిల్లే గంద. ఆమాత్రరం ఎరికనేదంటవ?”

“ఆట సంగతి తెలిసే ఉంటుంది. భాషదగ్గరే తిరకాసు.”

“మరయితే ఆ బాబుకేటి సెపతవు?”

హుమ్. నేను కూడా అదే ఆలోచిస్తున్నా ఏం చెప్పనా అని.

 

(జులై 19, 2011.)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

15 thoughts on “ఊసుపోక – సోంవారం ఉదయం పావుకాసువెనక!”

 1. @ అఫ్సర్ గారూ, ఇంకు తెలుగే అనుకుని ఉంటారులెండి. :)). “ఇంకోచేతివేపు” మీకు ఈ చర్చ నచ్చినందుకు నేను గ్లాడు.

  ఇష్టం

 2. “డాక్టర్ గారు( వైద్యులు కాదు పరిశోధకులు) ఒక గొప్ప గ్రంధాన్ని అనువదించారు.అందులో ప్రారంభ వాక్యం ఇంగ్లిష్ లో “much ink has been spilled ..”అని వుంటే ఈ యన “ఈ విషయం మీదా చాలా ఇంకు చల్లారు” అన్నారు”

  హ హ హా…ఇంక్ అంటే సిరా అనీ, స్పిల్ల్ అంటే వొలకడం అనీ ఆ డాక్టర్ గారికి తెలియదేమో…పాపం! తెలిస్టే ఆ అనువాదం మూల విధేయంగా వుండేది.

  ఇంకో చేతి వైపు—ఈ చర్చ నాకు నచ్చింది.

  ఇష్టం

 3. @ సత్యవతిగారూ, హాహా. లేదండీ మీరు అబద్ధాలు చెప్తారనుకోను. అందుకే నాక్కూడా భయమే. నేనే తప్పుగా చేస్తున్నాను కాబోలని – :)).

  ఇష్టం

 4. కాఫీ తేబడింది అన్నారు ఆయనే OH my GOD ఓ నా దేముడా అన్నారు వీళ్ల పేర్లొద్దులెండి.అందుకే అనువాద సార్వభౌములంటే కొంచెం భయం నాకు

  ఇష్టం

 5. ఒక డాక్టర్ గారు( వైద్యులు కాదు పరిశోధకులు) ఒక గొప్ప గ్రంధాన్ని అనువదించారు.అందులో ప్రారంభ వాక్యం ఇంగ్లిష్ లో “much ink has been spilled ..”అని వుంటే ఈ యన “ఈ విషయం మీదా చాలా ఇంకు చల్లారు” అన్నారు.మరొక చోట ఎవర్నో కొట్టడానికి bull hide ఉపయోగించారంటే ఈయన ఎద్దుపేడ అన్నారు.సత్యవతి పేరు పెట్టుకుని అబద్ధాలు చెప్పనండి ఆ అనువాదం వుంది నా దగ్గర.మరొక అనువాద సార్వభౌములు “Coffee was brought” అంటే kaamTe kaa

  ఇష్టం

 6. @ కొత్తపాళీ, కాలాతీతవ్యక్తులు – అయ్యో, పాపం శ్రీదేవిగారు. లేరు కనక అడిగేవాళ్ళు లేరులే అనుకున్నారేమో.

  ఇష్టం

 7. తెలుగు నించి ఇంగ్లీషు అనువాదాల అధ్వాన్నపు నాణ్యత తూలికకే పరిమితం కాదులేండి. నా కథల పుస్తకం అచ్చువేసినప్పుడు ఆంగ్ల అనువాదాల మీద నేను చూపిస్తున్న ఆసక్తి చూసి శ్రీశ్రీ విశ్వేశ్వర్రావు ఒక పుస్తకం చేతిలో పెట్టాడు. అది డా. శ్రీదేవి కాలాతీత వ్యక్తులు నవలకి ఆంగ్లానువాదం. చేసింది ఎవరో ప్రొఫెసరుగారు. ప్రచురించింది కుప్పం విశ్వవిద్యాలయం. మొదటి పేజీ ఒక పది సార్లు చదివి ఉంటాను – ఐనా అర్ధం కాలేదు. ఆ తరవాతెప్పుడో తెలుగు నవల చేతికందితే అప్పుడు రెండిట్లో మొదటి పేజీలు పోల్చి చూశాను. నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. మన అనువాదకులకి ఆంగ్లంలో తాము సృష్టిస్తున్న వాక్య స్వరూపం ఏవిటో బొత్తిగా తెలీదు. ఇంక ఆ వాక్యంలోని ధ్వని, ఆత్మ ఇట్లాంటివి అసలు ఊహకి కూడా అందవు.
  బైదవే, మీరు అనువాదకుల్ని ఏదో అన్నారని నేను అనుకోలేదులేండి, నేనూ సరదాకే అన్నాను🙂

  ఇష్టం

 8. @ కొత్తపాళీ, అయ్యో మీరెందుకు అలా అనుకుంటారండీ. నేనే చేసేను కదా శ్రీపాద, మల్లాది, రావిశాస్త్రి, కనుపర్తి వరలక్ష్మమ్మగారివంటి పెద్దవారి కథలు. నన్ను నేను చాలా చోట్ల హేళన చేసుకుంటూనే ఉన్నాను కదా. అలాటిదే ఇదీను. నిజంగానే నాకు quarterback అంటే ఏమిటో చాలాకాలం తెలీదు.

  సీరియస్ గా చెప్పాలంటే, నేనూ సౌమ్యా ఏదో అనువాదాలగురించి మాటాడుకుంటూ ఇలాటి హాస్య అనువాదాలు కొన్ని అనుకున్నాం. రెండో కారణం, (ఇది ఎక్కువ సీరియస్), నా సైటు తూలిక.నెట్ కోసం పెద్ద పేరూ, బహుమతులూ పొందిన అనువాదకులనించి నాకు వస్తున్న అనువాదాలలో వాక్యాలు ఇలాగే ఉంటున్నాయి (పైన నేను ఉదహరించినట్టు). బహుశా వారు తూలికకి అది చాల్లే అనుకుంటారేమో నాకు తెలీదు.
  అంతే కానీ మిమ్మల్ని గానీ ప్రసిద్ధరచయితలని ఎంచుకుని అనువాదం చేసేవారిని హేళన చేసే ఉద్దేశం లేదండీ నాకు. మంచి కథలు తప్పకుండా అనువాదం చెయ్యవలసిందే. నామాటలు పట్టించుకోకండి. ఇవన్నీ ఊసు పోడానికే కదా!

  ఇష్టం

 9. @ రాజేష్ – *“ఓలమ్మో నేనేటిసెప్పను..సిగ్గు సిలకలకొచ్చింది ఈ అబిమానాన్ని సూసేసినాక” అని సంద్రాలు గారి చేత అనిపించండి :)* అంటుందనుకుంటానండీ. :p. నిజమే. నాకంటే ఆవిడే బాగా చెప్తుంది. అడిగి చూస్తాను పైటపా floor అంతా తనే తీసుకుంటుందేమో..

  ఇష్టం

 10. $మాలతి గారు

  :))) టపా అదరహో.. నీలాల సంద్రాల యాసలో మునిగి తేలుతుంటే..అహ సంద్రమే..ఓహో సంతోసంద్రమే.. :))

  మా సంద్రాలు గారి పాత్ర నిడివిని అలా తగ్గించటం ఏమీ బాలేదు.. తర్వాత టపాలో మొత్తం సంద్రాలు గారే ఉండాలనిన్నూ తన యాస’౦ద్రంలో ముంచి తేల్చాలనిన్నూ ఆశిస్తున్నా :))

  ఏటంతారేటి మీరు?🙂 “ఓలమ్మో నేనేటిసెప్పను..సిగ్గు సిలకలకొచ్చింది ఈ అబిమానాన్ని సూసేసినాక” అని సంద్రాలు గారి చేత అనిపించండి🙂

  ఇష్టం

 11. తరవాత నవ్వించి ఊరడించారుగానీ మొదట్లో వేసిన దెబ్బ బాగానే తగిలిందండీ. ఎందుకంటే నేనుకూడా అనువాదం అంటూ చేస్తే ఏదో కుటుంబరావు స్థాయిలో చేస్తే మనకీ వాళ్ళకీ ఘనంగా ఉంటుంది అనుకుంటూ ఉంటా!🙂

  ఇష్టం

 12. పైవ్యాఖ్యగురించి – నాలాగే ఇంకా ఎవరికైనా సందేహం వచ్చి ఉంటే – ఆ వాక్యానికి అర్థం – నేను చూస్తున్నాను మీరు ఏం చెప్తారు అని – అనిట! మూలరచయిత్రినే (సౌమ్యనే) అడిగి తెలుసుకున్నాను.
  థాంక్స్, సౌమ్యా!

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s