ఊసుపోక – సంద్రాలేటంటదంటె

(ఎన్నెమ్మకతలు 79)

“ఔతె ఏటి సెప్తవు తాల్కకంబాబుకి?”

“చూశారా? ఎలా ఉందంటారు?” అంటూ తారకం వచ్చేడు.

“చూశాన” తారకానికి చెప్పి, ““నువ్వే చెప్పరాదూ?” అన్నాను సంద్రాలుతో.

“అదేటి నన్ను సెప్మంతవు?”

“చూశావు కదా కిందటివారం వ్యాఖ్యలు. నువ్వేం మాటాడతావో అడగమంటున్నారు రాజేష్ బాబు.”

“పోమ్మా. నివ్వు మరీను. నిజింగ అట్టన్నడా?” అంది సంద్రాలు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ.

“ఆ. నువ్విలా సిగ్గు పడిపోతావని కూడా అన్నాడు. అయినా నీకు అభిమానులు ఎక్కువయిపోతున్నట్టున్నారు. ఈ లెక్కన నేను కలం, కాయితాలూ సొరుగులో పారేసి, ముడుచుకు పడుకోవచ్చు,” అన్నాను.

“నేదులే. నీకతలు గూడ సదూతరు,” అంది సంద్రాలు నామోకాలిమీద చెయ్యేసి నన్ను బుజ్జగిస్తూ.

“అవునండీ. మీకథలు కూడా చదువుతారు చాలామందే.” అన్నాడు తారకం.

“ఓరి బగమంతుడా,” అంటూ ఆక్రోసించేను మనసులోనే. వీళ్ళిద్దరూ నన్ను పేట్రనైజు చేస్తున్నారు! ఇంత బతుకూ బతికి …

“సరేలే. నామాటకేం గానీ నువ్వు చెప్పు అసలు ఈరాతల్లో లొసుగులు. లేదా నీ అభిప్రాయంలో కథలు ఎలా ఉండాలి? ”

తారకం అయోమయంగా చూసి, “మీరు ముందు చెప్పండి. సంద్రాలుగారు తరవాత చెప్తారు,” అన్నాడు.

“లేదులే. నేనేముంది ఇప్పటికి చాలాసార్లే చెప్పేను కదా అనువాదాలగురించి. ఆమెనే చెప్పనియ్ ఫ్రెష్షప్రోచీగా కూడా ఉంటుంది.”

“సర్లే. మీరిద్దురు అడ్గతన్నరు గెన్క నాకు తెల్సింది సెప్త. అసులు అనోదాలెందంక సేస్తరంతవు సెప్పు?”

“తెలుగు చదవలేనివాళ్ళకోసం.”

“అదో కార్నం. పెదానంగ నీమనసుకి నచ్చింది ఉంకొ అమ్మకో బాబుకో సెప్పనంవే. నీకేంవో ఏదో కత గొప్పగ ఉందన్పిస్తది. పక్కవోడికి చెప్తవు. ఔతె ఈడ ఏటి ఆలోసింసుకోవల? నివ్వు ఎవ్రుకి సెప్తన్నవూ అని. మా ముత్తవ్వ కతలు బలె సెప్పీది. మాముత్తాతకి ముగ్గురు పెల్లాలు.”

“ముగ్గురా? అసలు మనదేశంలో ఇద్దర్ని చేసుకోడమే చట్టవిరుద్ధం కదా?” అన్నాడు తారకం.

సంద్రాలు నవ్వింది. “సూసినావ? ఒప్పుడె మొదలెట్టీసినావు. నాన్సెప్పీది అద్గదె మరి. నివ్వేమొ నీ సట్టాలూ, దరమాలు మాటాడతవు. మా సట్టాలూ, దరమాలూ ఏరని నీకు ఎరికి నేదు.”

తారకం “అది కాదండీ. చట్టం అందరికీ ఒక్కటే గదా.”

“ముందు ఆవిడ్ని చెప్పనీ. నీ సందేహాలు తరవాత,” అన్నాను.

“ఇది మరోబాద మీ సదూకున్నోల్లకి. అడగనీ. నాను సెప్తన్న గంద. నువ్వేల మాటాడతవు?” అంది సంద్రాలు.

“అది గాదు,” అని ఏదో చెప్పబోయి ఆగిపోయేను. అంటే నన్నను కానీ చదువుకున్నవాళ్ళనందర్నీ ఎందుకు కలుపుతావు అని కూడా అనాలనుంది నాకైతే.

“ఏటి సెపతన్ననూ .. మా సట్టాలు ఏరని గంద. మువ్వురు పెల్లాలు. మీనాగ మాకేటి ఆస్తులా అంతస్తులా, నగలా నానేలా ఏటి పోతాయని మాం బాద పడిపోవాల. ఇస్టంవైతే ఉంటం నేదంటే మరోడితో నేసిపోతం. మా ముత్తవ్వ అంతే సేసింది. బాగున్నన్నాల్లుంది ఆ తరవాత ఊల్లోకి కొత్తొంగొచ్చిన కూలిగుంటడితో పట్నంవెల్లిపోనాది. అది సానాకాలం తరవోతలె. అంసేత నీ సట్టాలూ నీతులూ మాకు సెప్పమాక. ఐన అడిగినవు గెంక సెప్తన్న. ఇది కతలగ్గూడ పనికొస్తది. మాకు కతలు సెప్పీది అన్నానా? మా ముత్తవ్వ ఇట్టనె మజ్జమజ్జలో ఆలతో ఈలతో మాటాడతా, ఆల్లకి పన్లు సెప్తా కతలు సెప్పీది. అదేటి కతమజ్జిన అయీ ఇయీ మంతనాలేటి. కత సెప్పు అని మాంవెప్పుడూ అరవనేదు,” అంది సంద్రాలు గలగల నవ్వుతూ.

“అది కాదమ్మా. కథ చెప్పినప్పుడు కథకి కొన్ని నియమాలున్నాయి. స్థలం, కాలం …”

అంటూ దండకం మొదలెట్టేడు.

నేనేదో చెప్పబోయి సంద్రాలుమొహం చూసి ఊరుకున్నాను.

“అదే బాబూ నాన్సెప్తన్నది గూడ. నివ్వేమొ కతంటే అట్టగుండాల ఇట్టగుండాల అంటా అడ్డుపుల్లలేస్తవు. మాముత్తవ్వకదేం తెలవదు గంద. ఏదో సెప్పీది. మాం వినీవోల్లం. మాకర్తం ఐపోయీది గూడ. మాకదే వెంతొ సక్కగుండీది. సెప్పొచ్చీదేటంటే నివ్వు కత సెప్తంటే వినీవోలకి బావున్నదా నేదా అనే గంద. అదన్నమాట నాను సెప్పీది,” నావేపు తిరిగి, “అదేటదీ బుర్లలోకొచ్చిందనాగె సెప్పెస్తరూ…” అనడిగింది.

“Stream of consciousness.”

“అదన్నమాట. ఎట్టగొస్తె అట్ట సెప్పీడంవే.”

“ఏంటండీ, ఏం తెలీదంటున్నారు, మీకు జేమ్స్ జాయిస్ కూడా తెలుసా?”

“జాయిసో ఓయిసో అదేటీ నాకు తెల్వదు. ఆయనెవురో అట్ట రాస్తరని మాదొరబాబు సెప్పిండోపాలి. ఓస్, అంతేనా మా ముత్తవ్వ, ముత్తాత గూడ అట్టనే సెప్తరు కతలు అంటిన్నేను. మా ముత్తాత గూడ అట్టనే. మజ్జనాల కూడట్టుకెల్లీదాన్నిలే పొలాల పన్జేస్తన్నయేల. కూలీలమీన అజ్మాయిసీ సేస్తా మాకు కతలు సెప్పీవోడు. ఆయన అట్టా అటు కూలీల్తో ఇటు మాతో మాటాడ్తంటే – ఆ మాటల్ల కతెక్కుడుందో మాం ఎతుక్కోవాలన్నమాట. అట్లుండేది ఆయన సెప్పీతీరు. ఔతేనేం మాకదె బహు సక్కంగుండీది.”

“అయితే అనువాదాలమాట సెప్పేరు కారు,” అన్నాడు తారకం ఆమెని దార్లోకి మళ్ళించడానికి.

“ఉండు మరి. అది రెండో ఇసియంవన్నమాట. నువ్వు ఎవురికి సెప్తన్నవు అనీది. మా ముత్తవ్వ నాకోనాగ సెప్పీది, మా బుడ్డోడికోనాగ సెప్పీది. ఆడికేఁవో గోరుముద్దలెట్టినట్టు సక్కంగ యిడమర్సి సెప్పీది. నాకేంవో గబగబ సెప్పీసీది.”

“మీరు కుశాగ్రబుద్ధులని,” అన్నాడు తారకం.

“అదేటి?”

“నువ్వు చాలా తెలివయినదానివి అంటున్నాడు.”

“సూసినావా. ఈపాలి రొండు పాయింట్లొచ్చీసినాయి. నీకు సదువుంది, పెద్ద పెద్ద పుస్తకాలు ఔపోసనొట్టీసినావు. అందుసేత ఆ మాటలన్నీ అనీస్తవు. ‘నాను సదూరాని ఆడమడిసితో మాటాడతన్నను, ఆఁవెకి తెల్సినమాటల్ల సెప్పాల’ అని నీకు తోచనేదు. సూసినావ. అదన్నమాట అనోదాలు సేసీప్పుడు గుర్తెట్టుకోవల్సిన ఒక ఇసయిం. అనగా నివ్వు ఎవురికోసం సేస్తన్నవో ఆరికి అర్తం అవుతాదా అవదా అని.

రొండేదేంవో ఇదింకా నిజం. అందుసేత బాగా వినుకో. నివ్వు ఎవురికి సెప్తన్నది మరిసిపోగూడదని సెప్పినాను గంద. నువ్వు సదివినకత ఎట్టాటి మాటల్లో సెప్పినారన్నది గూడ సూస్కోవాల. మాటకి సెప్త – తొలికతలో ఓ కూలోడేనుకో ఆడు కూడు తిన్నడు అనుంటాది. నువ్వు అదే ఇంగిలీసులో నాకామాటలు తెలీవులే బోయినం సేసేరని రాసేవనుంకో. అప్పుడేటవుతది. మా దొరబాబునాగ బండిసెక్రంవంత పల్లెంలో తొమ్మిది ఆదరవులేసుకు తినీవోడికి బోయినం అనగా అది కల్లడతది. అదే మాలాటోల్లకి యాదకొచ్చీదేటంటే గెంజినీలు, సంగడిముద్ద. అందుసేత మరి నిజింగ కతలో ఏటున్నది, అదెట్ల సెప్తే నిజింకతలో ఉండినట్టు తెలుస్తది నివ్వు సూసుకోవాల. అదన్నమాట యిస్యం. అనువోదం అయినా ఇంతే. కొత్తంగ రాసినకతైన ఇంతే.”

నేను తెల్లబోయి చూస్తున్నాను.

తారకం కూడా నోట మాట రానట్టు కూర్చుండిపోయేడు. అతను తను తెచ్చిన అనువాదంమాట మరెత్తలేదు.

(జులై 25, 2011.)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – సంద్రాలేటంటదంటె”

 1. @ రాధికగారూ, మీకు ఇది బాగున్నందుకు సంతోషం. ముందు టపా కూడా హాస్యంగా రాసిందేనండి. లింకు ఇదుగో. Fhttp://wp.me/p9pVQ-HQ.
  మీకు సీరియస్గా కావాలంటే ఈ వ్యాసాలు చూడండి.
  ఈమూడూ తెలుగులో ఈ బ్లాగులోనే ఉన్నాయి.
  http://wp.me/p9pVQ-lp
  http://wp.me/p9pVQ-jh
  http://wp.me/p9pVQ-lt

  ఇది ఇంగ్లీషులో ఉంది.
  http://www.thulika.net/2009July/transculturaltranslation.html.

  దయచేసి మీ అభిప్రాయాలు కూడా పంచుకోగలరు. నాలాగే చాలామందికి మన తెలుగువాళ్ళు చేస్తున్న ఇంగ్లీషు అనువాదాలగురించి చాలా సందేహాలున్నాయి. ధన్యవాదాలతో – మాలతి

  ఇష్టం

 2. మాలతి గారు

  అనువాదాల గురించి సంద్రాలు చేత హాస్య౦గా చెప్పించిన తీరు బాగుందండి. నేను కూడా రెండు మూడు James Patterson ఇంగ్లీష్ నవల్స్ తెలుగు అనువాదం చేసే పనిలో ఉన్నా. మీరు చెప్పిన పాయింట్స్ ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ పోస్ట్ ఫస్ట్ పార్ట్ లింకు ఇవ్వగలరు. థాంక్స్

  ఇష్టం

 3. $మాలతి గారు

  నేనూ మెలికలతో తిరిగిపోతున్నా..:) నా మాట మన్నించి సంద్రాలు గారి నోట పలికించినందుకు..సంద్రాలు గారికీపాట http://www.youtube.com/watch?v=FUto9zDbzBI

  #“ఓరి బగమంతుడా,” అంటూ ఆక్రోసించేను మనసులోనే. వీళ్ళిద్దరూ నన్ను పేట్రనైజు చేస్తున్నారు! ఇంత బతుకూ బతికి …

  LOL;) బహు సున్నితమైన హాస్యం.

  మళ్ళీ వస్తా…!

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s