ఊసుపోక – రామయమంత్రి భోజనపరాక్రమేమని చెప్పవచ్చు

(ఎన్నెమ్మకతలు 80)

గ్రామము చేత నుండి పరికల్పిత ధాన్యము నింట నుండి శ్రీ
రామ కటాక్ష వీక్షణ పరంపరచే గడతేరె గాక మా
రామయమంత్రి భోజన పరాక్రమ మేమని చెప్పవచ్చు నా
స్వామి యెరుంగు దత్కబళ చాతురి తాళ ఫల ప్రమాణమున్.

అంటూ వర్ణిస్తాడు శ్రీనాథుడు రామయమంత్రి భోజనపరాక్రమము. ఆ రోజులలాటివి.

పూర్వం తిరపతికొండమీద లడ్డూలు గంగాబోండాలంత ఉండేవిట. తరవాత ఒలిచిన కొబ్బరికాయంతై, వెలక్కాయంతై, నిమ్మకాయంతై … ఇప్పుడు ఉసిరికాయంత అయేయేమో తెలీదు.

భోజనం ఒక దినచర్య కాదు. కాలక్షేపం కాదు. దానికదే సాటి అయిన ఒక గొప్ప అనుభవం.

షడ్రసోపేతంగా పంచభక్ష్యపరమాన్నాలూ ఆరగించి కప్పురవిడెము సేవించే కవి సార్వభౌముడికి చల్లా అంబలీ, వెల్లుల్లీ,  తిలపిష్టము కర్నాట పడతులు వడ్డించినప్పుడు పాపం, ఆయన ఎంత బాధ పడ్డాడో. అట్టి విందు ఆనందదాయకం కాదు ఆయనకి.

వివాహభోజనంబు అంటే గారెలూ, బూరెలూ, అప్పళాలూ, ధప్పళాలూ, మూడు కూరలూ, నాలుగు పచ్చళ్ళూ, పప్పూ, పులుసూ, చారూ, జారీకొమ్ములోంచి ఏకధారగా అన్నంగుంటలోకి పారే నెయ్యీ అడుగున్నర పొడుగు అరిటాకులో కలగలుపుకు తినగలగడం ఒక కళ. మనకి భోజనం అంటే అదీ!

షడ్రసోపేతంగా పంచభక్ష్యపరమాన్నాలూ ఆరగించి కప్పురవిడెము సేవించే కవి సార్వభౌముడికి చల్లా అంబలీ, వెల్లుల్లీ,  తిలపిష్టము కర్నాట పడతులు వడ్డించినప్పుడు పాపం, ఆయనకి ఎంత కటకట అయిందో ఆ అలవాటు లేని కూడు.

ఎండాకాలంలో పెరుగన్నంతో పెద్దరసాలు చీక్కుతినడంగురించి వేరే చెప్పక్కర్లేదు కదా. ఒకసారి ఒకాయన ఆత్రంగా పండు చేత్తో పుచ్చుకు – పులుసో చారో అయింతరవాత ఆ చేత్తో అంటే అదొక సర్కసే కదా – గట్టిగా నొక్కేట్ట. దాన్లో ఉన్న టెంక ఎగిరి వెళ్ళి పక్కవారి విస్తరిలో పడింది. ఫాపం అవతల పెద్దమనిషి ఏంవంటాడోనని గుటకలు మింగుతూ ఆయనవేపు చూశాడీయన. ఆయన కూడా ఆ సమయంలో అదే కార్యక్రమంలో ఉండడంచేత తన విస్తరి చూసుకుని, “హా, ఆశ్చర్యం, నా పండులో రెండు టెంకలున్నాయి,” అన్నాడు. వెంటనే మొదటి పెద్దమనిషి, “హో, నాపండులో టెంకే లేదు,” అన్నాడు మరింత ఆశ్చర్యపోతూ.

నిత్యా అలా అన్ని రకాల వంటకాలు లేకపోయినా, ఓ కూరా, పచ్చడీ, పులుసుతో సంతుష్టిగానే తింటాం కదా. అది లేకుండా చేసేస్తున్నారు ఈమధ్య కొందరు ఆరోగ్యసూత్రాలతో ఊదర పెట్టేస్తూ. మొదట్లో ఆడవాళ్ళకి పెట్టేరు, తరవాత మొగవాళ్ళకీ, ప్రస్తుతం పిల్లలకీ పాకింది ఇది. ఆదినించీ వేళా పాళా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డీ తినడం అలవాటు చేయకపోతే అసలీ డైటు బాధలుండవు కదా.

అమెరికా రాగానే డొనట్ చూసి గారెలూ, కీవీ పండు చూసి సపోటా అనుకుని మోసపోని తెలుగువాడుంటాడనుకోను. నాకు కీవీ పండు బాగానే ఉంది గానీ డొనట్ మాత్రం నావల్ల కాదు.

అసలు అమెరికనులకి దవడాడితే గానీ మెదడాడదేమో.

 ఎవరు ఎవరితో ఏం మాటాడాలన్నా కాఫీ, అల్పాహారం, భోజనం … ఏదో ఒకటి నోట పెట్టకపోతే మాట తోచదు. సభల్లో వక్తలు మధ్య మధ్యలో మంచితీర్థం పుచ్చుకుంటారు ఎందుకనుకుంటారు? నోట్లో మాటకి గాటు పడడంచేత.

నవల్డానికేమీ లేకపోతే గమ్. ఇది మాత్రం బుర్ర పని చేయడానికి తోడ్పడదు సరి కదా ఎదురు ఏడో స్వర్గంలోకి తీసుకుపోతుందనుకుంటాను. తెలుగు పాఠాలు చెప్పేరోజుల్లో చూసేను – అరమోడ్పుకనులతో, వెనక్కి వాలి, కాళ్ళు చాపుకుని గమ్ నవుల్తూ కూచున్న అబ్బాయిని చెప్తున్న పాఠం ఆపి ప్రశ్న వేస్తే, అతడులిక్కి పడి “హ?” అంటాడు తికమక పడిపోయి.

మనవాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు మాటాడకూడదంటారు. అంటే తినే తిండి సంతృప్తిగా తినలేం మాటల్లో పడితే అని. మరో సిద్ధాంతం ఎంత తింటున్నామో చూసుకోకుండా మితి మీరి తినేస్తాం అని. అమెరికాలో డైటుసూత్రాలు హెచ్చిపోయేక, భోజనాలవేళ టీవీ కూడదంటున్నారు.

 నేను టీవీ చూస్తాను సర్వకాలాల్లోనూ. మామూలుగా నాతిండికి టీవీ ప్రతిబంధకంకాదు. ఎందుకంటే మంగళగిరి పానకాలస్వామికి ఉండే “కండిషను” నాక్కూడా ఉంది. తినడం సరీఘ్ఘా సహం కాగానే “చాల్చాలు” అంటూ హెచ్చరిక వచ్చేస్తుంది గొంతులోంచి, ఏ జన్మలోనో పెట్టి పుట్టడంచేత కాబోలు. లేదూ, “పెట్టకుండా” పుట్టడంచేత అంటారా? సరే, అలాగే అనుకుందాం.

ఈమధ్య టీవీ చూస్తే తినే తిండి సయించడంలేదు. నాకు ఎంతో ఇష్టమైన కూరో పచ్చడో వేసుకుని, కంచం పుచ్చుకు కూర్చుని, టీవీ పెట్టబోతే, వచ్చేవి ప్రకటనలు – అజీర్తి, విరేచనాలు, కలెస్టరాల్ … మందులు, మందులు, మందులు … అవి చూస్తుంటే భోజనప్రీతి మాట దేవుడెరుగు అసలు ముద్ద దిగుతుందంటారా?

నే చెప్పేది తినేది ఏదైనా, ఎంతయినా, హాయిగా తృప్తిగా, వాటిరుచులు అనుభవిస్తూ పరమానందంగా తినాలని. కేలరీలు లెక్కలేసుకుంటూ, ఏం తింటే ఏ జబ్బులొస్తాయో బేరీజు వేసుకుంటూ తినకండి. అంతకంటే దౌర్భాగ్యం లేదు.

(అక్టోబరు 23, 2011)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – రామయమంత్రి భోజనపరాక్రమేమని చెప్పవచ్చు”

 1. @ కష్టేఫలే, ధన్యవాదాలు.
  @ రసజ్ఞ, హోమంమాట నాకు తెలీదండీ. కొత్తవిషయం తెలిపినందుకు ధన్యవాదాలు.
  @ సి.వి.ఆర్ మోహన్, ధన్యవాదాలు. దీపావళి శుభాకాంక్షలు

  మెచ్చుకోండి

 2. బాగుందండీ! అసలు భోజనం చేయడం అంటే ఒక హోమం చేసినంత పవిత్రమయిన కార్యమని మనకి ఉండనే ఉంది కదా!
  అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః
  ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని అన్నారు కదా!
  కడుపులోని ఆకలి అనే వైశ్వానరుడికి మనం వేసే హవిస్సే మనం చేసే భోజనం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s