కథల చర్చ – చివరిమాటగా …

ఈ టపాధారలో ఆదిని చెప్పేను కొన్ని కథలు తీసుకుని నాసలహాలు ప్రాతిపదికగా సమీక్షిస్తానని.

కథకి కొన్ని ప్రమాణాలున్నాయని వెనక చెప్పేను. అవి ఈనాటి పత్రికల, పాఠకులకోణం దృష్టిలో పెట్టుకుని అని కూడా చెప్పేను. ఇలా రాయకపోతే కథ కాదు అని మాత్రం కాదు.

ఎత్తుగడ, నడక, ముగింపు ముందు చూద్దాం. “రహస్యనివేదిక” లో ఈ మూడు లక్షణాలూ విడి విడిగా లేవు. ఉన్నవి రెండే సన్నివేశాలు. రెంటిలోనూ ఒకే సంఘర్షణ. అదే ఆ కథలో ప్రత్యేకత కూడా. పాఠకుడే గ్రహించాలి రెండు సన్నివేశాల్లో తేడా-  కథలో ప్రధానాంశం  సమాజంలో మార్పు. పైపైనే కానీ మౌలికంగా మార్పేమీ రాలేదని సందేశం. 

కొందరు వ్యాఖ్యాతలు కథలో ఒక్క కోణమే ఆవిష్కరించడం జరిగిందన్నారు కానీ నిజానికి స్త్రీ పురుషులిద్దరిలోనూ మార్పు రాలేదన్నది ఈకథలో స్పష్టమే.   

ముగింపు వాక్యాలు, “నాలుగు గోడలమధ్య  మనసులు నలుగుతూనే వున్నాయ్, నలుగురి మధ్యకూ వచ్చి ఆదర్శదంపతులుగా కొనియాడబడుతున్నాయ్” కథకి నప్పేయా అన్నది రెండో ప్రశ్న. ఆదర్శదంపతులుగా కొనియాడబడుతున్నారన్న విషయం రెండు సన్నివేశాల్లోనూ సూచనప్రాయంగానైనా లేదు. 

ఒక క్లిష్ట సమస్య తీసుకున్నప్పుడు ఆ అంశం పాఠకుడిమనసులో బలంగా ముద్ర వేయడానికీ, అతడు ఆలోచించుకోడానికీ కూడా కథని ఇంకొంచెం విస్తరించడం అవసరం అవుతుంది. కథని మరింత పెంచితే బాగుంటుందని కొందరు పాఠకులనడానికి ఇదే కారణం.

మరొకటో రెండో సన్నివేశాలు చేర్చి ఆదర్శదంపతులుగా కొనియాడబడడం ఎలా జరిగిందో చూపిఉండవచ్చు. లేదా, ఆ పాత్రలు ఇతర సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తారో చూపొచ్చు. ఒక విషయంలో భిన్నాభిప్రాయాలున్నా తదితర సందర్భాలలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు కొందరు. ఆ “రహస్యాలకి” మరొకకోణం చూపవచ్చు.  ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పాఠకులకి పాత్రలు సహజంగా కనిపించేలా చేసేవి ఇలాటి సన్నివేశాలే.

ఈ కథలో భాష, పాత్రచిత్రణ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. కథంతా సంభాషణలరూపంలో నడపడం మంచి పద్ధతే. ముఖ్యంగా కథలో రెండో మూడో పాత్రలు మాత్రమే ఉన్నప్పుడు ఈ విధానానికి సౌలభ్యం ఎక్కువ. ఇది పాఠకుల మేధకి ఎక్కువ పని పెడతుంది కూడా. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారూ, కనుపర్తి వరలక్ష్మమ్మగారూ కొన్ని కథలు చాలామటుకు సంభాషణలతో నడిపేరు. నా చిన్నకథ భయం పూర్తిగా సంభాషణలతోనే సాగుతుంది.  

 “రహస్యకోరిక”లో రెండో సన్నివేశంలో ఇంగ్లీషుమాటలు ఎక్కువే ఉన్నా వాటికొక ప్రయోజనం ఉంది ఈకథలో. రెండు తరాలమధ్య వచ్చిన మార్పుకి నిదర్శనం అది.

“గుండె అలసింది” కథలో ఎత్తుగడా, నడకా చక్కగా సాగేయి. ముగింపు విషయం చర్చించేముందు ప్రధానాంశం చర్చించాలి.

రచయిత్రి తాను  చెప్పదలుచుకున్నది (ప్రధానాంశం) “ఒక్కటే – భర్తకు serious problem వచ్చినప్పుడు కలిగే ఆందోళన ఎలావుంటుంది?” అన్నది. నేను చదివినప్పుడు నాకు వేరుగా అనిపించింది. అంటే భార్య ఆందోళన బలంగా లేదని కాదు. దానికి మూలమైన అన్యోన్యత వారిద్దరిమధ్య అంత బలంగానూ ఉంటుంది కనక ఆ అన్యోన్యతకి కూడా కనీసం అంత ప్రాధాన్యతా ఉంది” అనుకున్నాను. కారణం కథలో రెండు చోట్ల కథకురాలు చెప్పిన మాటలు –

పెళ్ళయి ముప్పై ఏళ్లు దాటాయి, ఇంతవరకు ఒకరికి ఒకరం అంటూ బ్రతికారు. పిల్లలు లేరు కనుక మరింత పటిష్టంగా సాగింది వారి అన్యోన్యత!!” అంటారు ఒకచోట. చివర్లో,  “(మీకు) ఏమైనా అయ్యుంటే  నేనేమి అయ్యేదాన్నండి? అని బావురుమంది,” అని భార్య పాత్రచేత పలికిస్తారు.

కథ కేవలం భార్య ఆందోళన చిత్రించడమే అయితే, ఇక్కడితో కథ అయిపోతుంది.

ఆయన “ఆయుస్సుకు తన ఆయుస్సు పోసి తాను తప్పుకుంది.” అని కథకురాలి వ్యాఖ్యానం. ఇది వారిద్దరిమధ్య గల అనురాగాన్ని సూచిస్తోంది. బహుశా, ఈ మరణం ప్రతీత్మకంగా తీసుకోవాలేమో.  ఆ వాక్యం భర్తచేత పలికిస్తే మరింత అర్థవంతంగా ఉండేదేమో.

ఇవన్నీ భార్య ఆందోళన పరిధిని దాటి ఆ రెండు జీవితాలు ఎంత జమిలిగా పెనవేసుకు పోయేయో కూడా చెప్తున్నాయి.

రెండు కథలూ భార్యాభర్తలసంబంధంగురించే అయినా రచయిత్రులు ఎన్నుకున్న సమస్యలు వేరు. వాటిని కథగా మలిచిన తీరులో ఎవరి ప్రత్యేకత వారిదే.

“రససిద్ధి” కథమీద నేను మీ అభిప్రాయాలు అడగడానికి కారణం వస్తువు – కాలేజీ పిల్లలు తోచక ప్రారంభించిన సమ్మె.  ఆషామాషీగా సమ్మె ప్రారంభించిన రాజారావులో మానసికంగా వచ్చిన మార్పు.

సమ్మె విరమించడానికి దాదాపు మరో కథ చెప్పడం జరిగింది. జి.యస్. లక్ష్మి గారివ్యాఖ్య ఇదే – “… సంగీత కచేరీ దగ్గరికి వచ్చేటప్పటికి కచేరీ గురించి అంతగా వివరించడంవలన కథాంశం కాస్త పక్కకి వెళ్ళినట్లు అనిపించింది,” అని. రెండోది “సంగీత జ్ఞానం ఏమాత్రమూ లేని రాజారావుకి రససిద్ధి కలిగినట్టు కథలో కనిపించలేదు,” అని. శశిధర్ పింగళి గారు, “సంగీతం అంటే ప్రవేశం కాదు కనీసం ఇష్టం కూడా లేని ఒకడు కాలాన్ని మరచి వున్నాడంటే ఆ కళ సిద్దించినట్లే. కనుక శీర్షిక రససిద్ది కూడా ఔచిత్యవంతంగానే వుందనేది నా అభిప్రాయం,” అన్నారు.

రెండూ సీరియస్‌గా పరిశీలించవలసినవే.

 రాజారావు తోచకే అక్కడికి వచ్చేడు.

“వీళ్ళందరికీ నిజంగా సంగీతంలో స్వారస్యం తెలిసే వచ్చేరా? నాలాగే కాలం గడవక దిగబడ్డారా?” – అలా అనిపించిన తరవాత అతను వెనక్కో ముందుకో వెళ్ళాలి. వెనక్కి తిరిగిపోతే సమ్మె విరమించడానికి మరో సన్నివేశం సృష్టించి కథ ముగించాలి.

రాజారావు ముందుకే వెళ్ళేడు. “రాజారావుకి మాచెడ్డ కోపం వచ్చేసింది, తల్లీ, మీరు సంగీతం వినడానికొచ్చేరా లేక … అని అడగబోయి, మానేసి, విసురుగా గబగబా ముందుకెళ్ళి ఓవార నిలబడ్డాడు.

” “ఆవిడ వేసిన స్వరాలు గుండెల్లో ధ్వనిస్తున్నాయి. అతనివేళ్ళు పదాలు పలుకుతున్నాయి.” “మీరు తాళం తప్పు వేస్తున్నారండీ,” అని పక్కనున్న పిల్ల చెప్పేవరకూ రాజారావు గ్రహించనేలేదు తనవేళ్ళు లయకనుగుణంగా కదుల్తున్నాయని.”

శిశుర్వేత్థి పశుర్వేత్థివేత్థి ఫణీ గానరసం అని కదా ఆర్యోక్తి. మన మాటలూ చేతలూ సాధారణంగా రెండు స్థాయిలలో – చేతనాచేతనావస్థలలో – జరుగుతాయి. చేతనావస్థలో రాజారావుమాటలు కాలేజీవిద్యార్థిస్థాయిలో ఉన్నా అంతరాంతరాల ఆ సంగీతం అతడిమనసుని ఆకట్టుకున్నట్టే కనిపిస్తుంది. గాయకురాలు “మందరస్థాయిలో ఎత్తుకుని పైస్థాయిల్లోకి విస్తరిస్తూ పోతూంటే ఎవరో చెయ్యి పట్టుకుని అలా అలా … నడిపించుకు పోతున్నట్టుంది. … ఆ సంగీతం వింటుంటే ఆయనమొహం అందంగా లేదన్న సంగతి గుర్తుకి రాడం లేదు.”

“ఆవిడమొహం ఎలా పెట్టినా నువ్వింతసేపూ కూచున్నావు కదా! సంగీతానికి అనుభూతి ప్రధానం,” అని కామేశ్వరరావు రాజారావుతో అనడంలో ఆంతర్యం కూడా అదే.

సంగీతకచేరీ, చర్చ గంభీరమయిన విషయాలు. వాటికి ఉపయోగించే కంఠస్వరం వేరు. సమ్మెలాటి సాధారణవిషయానికి ఉపయోగించే కంఠస్వరం వేరు. ఒక చిన్నకథలో ఇలాటి స్వరభేదం సమర్థనీయమేనా? అని నా మరో సందేహం. పాఠకులెవరూ ఆ విషయంమీద వ్యాఖ్యనించలేదు కనక బాగానే ఉంది అనుకుంటున్నాను.

గమనిక – ఈ వివరణద్వారా నేను మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నించడం లేదు. మనం చేస్తున్నది చర్చ అంటే భిన్నకోణాలలో పరిశీలించడమే కనక ప్రస్తావిస్తున్నాను. రెండో విషయం –  ఒకే కథకి వేరు వేరు పాఠకులు వేరు వేరుగా స్పందిస్తారని మరొకసారి తెలుస్తోంది. అంతే గానీ తప్పొప్పుల ప్రశ్న లేదు.    

ఒక్క మాటలో, రచయిత తాను చెప్పదలుచుకున్నది తనకి తోచినట్టు చెప్పడమే న్యాయం. మరయితే ఈ పాఠాలన్నీ ఎందుకు అంటే అడిగేరు కనక!

                                           000

ఈ చర్చలు కొనసాగిస్తే బాగుంటుందన్నారు కొందరు. కానీ, చర్చించేవారు ఉంటేనే కదా చర్చ. పది పదిహేనుమంది చర్చలో పాల్గొనేవారుంటే, ఒకొక కథకి కనీసం ఐదారుగురు స్పందిస్తారనుకోవచ్చు. అది జరగడం లేదు. అంచేత ప్రస్తుతం పాల్గొన్నవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇప్పటికి ముగిస్తున్నాను.

(అక్టోబరు 27, 2011)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “కథల చర్చ – చివరిమాటగా …”

 1. మరో విషయం ఇప్పుడే గుర్తొచ్చింది. ప్రింటుపత్రికలవారికి అంత ఓపికా, తీరికా ఉండవేమో గానీ, జాలపత్రికలవారు మీకథలు మెరుగు పరచడానికి బాగానే సూచనలు ఇస్తున్నారు. వారికి పంపి చూడండి.

  మెచ్చుకోండి

 2. మాలతీ గారికి ,
  కొన్ని ఇబ్బందులవల్ల మీ చివరిమాట చదవటం ఆలస్యం అయింది అందుకు చాలా బాధపడ్డాను .
  లలితగారి,నాకథ లపై మీ అభిప్రాయం అమూల్యం.ఎందుకంటే నేను ఎక్కడ ఇంకా స్పష్టత చూపాలో తెలిపారు.ఈకథలో నేను చెప్పదలచుకున్నది మీరు అర్థం చేసుకున్నారు.
  కొందరి విమర్సలవల్ల నన్ను నేను మెరుగు పరచుకునే విధానం తెలిసింది.మీ వేదిక ఒక విధంగా, విమర్సలు ఒక విధంగా, చివర మీ మాట… ప్రోచ్చాహకరంగా వున్నాయి. ముఖ్యంగా ‘కథలు మలచిన తీరు లో ఎవరి ప్రత్యేకత వారిదే ” అన్నారు .బాగనిపించింది .
  మీ చేయి తొందరగా కోలుకోవాలని కోరుతూ ..
  లక్ష్మీ రాఘవ

  మెచ్చుకోండి

 3. @లలితగారూ, “కథ ఎలా రాయకూడదు అని ఉదాహరణగా పనికొస్తుంది ఎవరికయినా :)” – అన్యాయం. నేనలా అనలేదండీ. ఈనాటి కొందరు ప్రముఖ విమర్శకులని, కొందరు వ్యాఖ్యతలనీ దృష్టిలో పెట్టుకుని, కథ మార్చడానికి ఉన్న అవకాశాలు సూచనప్రాయంగా చెప్పేనంతే.
  మీకథ చాలా బాగుందని మెచ్చుకున్న పాఠకులు కూడా ఉన్నారు కదా. మీరు వారిమాట కూడా గుర్తించాలి.
  “చివర మరో తరానికి ఊపిరిపోసే పనిలో పడ్డారు అన్నది వీరుకూడా అటువంటి ఆదర్శ దాంపత్యాన్నే కొనసాగించబోతున్నారనే అర్ధం” – స్పష్టంగానే తెలుస్తోంది.
  “పాతికేళ్ళతరవాత అనడంలో తరవాతితరం అన్నది కూడా స్పష్టమే. “పదినెలలు” అన్న పదంమూలంగా కొంత అయోమయం ఏర్పడింది అనుకుంటా.
  చివర పేరా తొలగించేయొచ్చు. లేదా “ఆదర్శదంపతులు మరి” అనో, (రిపోర్టు కనక) ఊరివారు వీరికి “ఉత్తమ ఆదర్శదంపతులు” బిరుదు ప్రసాదించేరనో రాయండి. :p.
  నాచెయ్యి – రెండు సర్జరీలయేయి. ఇంకా ఏంఅవుతుందో తెలీదు కానీ డాక్టర్లు, ఆస్పత్రివ్యవహారాలు మాత్రం చాలా తెలుసుకున్నాను తొలిసారిగా! గొప్ప ఎడ్యుకేషను. ఇదంతా కథ రాస్తాను ఎప్పుడో. ప్రస్తుతానికి ఉండబట్టలేక ఒక్కచేత్తోనే జరుపుకొస్తున్నాను.

  మెచ్చుకోండి

 4. మాలతి గారు నమస్తే,
  ఈ పోస్ట్ ఇంత ఆలస్యంగా చూసినందుకు బాధపడుతూ……
  మాలతి గారు మాకోసం ( రాయాలనే ఉత్సాహం ఉన్నవారికోసం ) మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. చక్కని సూచనలు, సలహాలు ఇచ్చారు . ఈరోజుల్లో అసలు మంచి కథలే రావటంలేదు అని ఒక్క ముక్కలో కొట్టిపడేసేవారే అంతా . ఆ మంచి కథ రావటానికి తాము ఏవిధంగా తమ అనుభవాన్ని , జ్ఞానాన్ని వినియీగిస్తున్నాం , అని కాస్తయినా ఆలోచించరేమో అనిపిస్తుంది అటువంటి నిరుత్సాహపరిచే వ్యాఖ్యానాలు విన్నప్పుడు( చదివినప్పుడు) . ఈ విషయంలో మీ సహాయానికి మేము చాలా ఋణపడివున్నాం .
  ఇక నా కథ విషయానికొస్తే ……
  కథ అసంపూర్ణంగానూ, అసంతృప్తిగానూ నూ ఉందని నేనూ ఒప్పుకోక తప్పదు .
  ఆదర్శ దాంపత్యం తెలిసేలా సన్నివేసాలు అని అన్నారు – మనసులు, అభిరుచులు కలవటంతో సంబంధం లేకుండా దాంపత్య జీవితం గడుపుతూ పిల్లని కని, పెంచి పెద్దచేసి వాళ్ళపెళ్ళిళ్ళు చేసి …..అలా గ్రుహస్థ ధర్మాలను సక్రమంగా పాటించేవారంతా అదర్శదంపతులుగే సమాజం దృష్టిలో . సరిగ్గా పాతికేళ్ళ పది నెలల తరువాత అన్నది రెండవ తారన్ని సూచిస్తుందనీ, కథ చివర మరో తరానికి ఊపిరిపోసే పనిలో పడ్డారు అన్నది వీరుకూడా అటువంటి ఆదర్శ దాంపత్యాన్నే కొనసాగించబోతున్నారనే అర్ధం వస్తుందని అనుకుని చెప్పినవి ( పాఠకులకు చేర్చలేకపోయాను -ఒప్పుకోవలిసిందే)
  మాలతి గారు కథలో పాత్రలకి పేర్లు లేవుకదా ఈ కథని పొడిగిస్తే అతడు ఆమె అన్నది ఏ సన్నివేసంలో పాత్రలనుద్దేసించి అవుతుందో చెప్పటం ఎలా …..అందుకే ఈ కథని ఎలా పూర్తి చెయ్యాలో అర్ధంకావటంలేదు . ఇది ఒక అసంపూర్తి కథగా అలా వదిలేద్దాం 9 కథ ఎలా రాయకూడదు అని ఉదాహరణగా పనికొస్తుంది ఎవరికయినా 🙂
  ఇంతకీ మీ చెయ్యి స్వాధీనంలోకి వచ్చినట్టేనా ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలావుందండీ
  ( అలా భయపడకండి – మరో కథ తో రానులెండి అభిమానంతోనే అడిగాను )

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s