సిస్టావధానం (కథ)

ఆస్తి పోతే పోయింది కోర్టుపద్ధతులు తెలిసేయి అన్నాట్ట ఓ పెద్దమనిషి వెనకటికి.

చెయ్యి విరిగితే విరిగింది కానీ అమెరికాలో వైద్య విధివిధానం విశదమయింది నాకు, ఏకాలేజీల్లోనూ ఏ బోధనాపద్ధతులూ తెలియజేయలేనంత తేటతెల్లముగా.

ఆస్పత్రి లౌంజిలో నిస్సహాయంగా కూర్చుని ఉన్నవాళ్ళందర్నీ చూసీ చూడనట్టు  కొనకళ్ల పరిశీలిస్తున్నాను మాటలు వినిపించని టీవీకి కళ్ళప్పగించి.  

నర్సెస్ ఎయిడ్ కాబోలు రమ్మంటే, లేచి ఆమెని అనుసరిస్తుంటే, నాకంటే ముందొచ్చి అక్కడ కూర్చున్నవాళ్ళవంక గర్వంగా చూస్తూ నడిచేను నాకేదో విశిష్టగౌరవం లభించినట్టు.

తిన్నగా రెస్ట్ రూంలోకి తీసుకెళ్ళి, “కూర్చో,” అంది కుర్చీ చూపిస్తూ.

“ఇక్కడా?”

అవునన్నట్టు తలూపింది. మాటాడితే నోట్లో ముత్యాలు రాలిపోతాయి కాబోలు.

 అక్కడ్నుంచి మొదలయింది క్రతువు –

ఆవిడచేతిలో కాయితంలో రాసిఉన్న విషయాలే మళ్ళీ చెప్పుకోవాలి “అహం భో”  అంటూ పేరూ, వయసూ, ఒడ్డూ, పొడుగూ… నిజానికి వాళ్ళే కొలుచుకునేవాళ్లు ఇదివరకు. ఇప్పుడు వాళ్ళకంత తీరిక లేదు. ఆ తరవాత వరసక్రమంలో ప్రశ్నావళి … “నీకు డయాబెటిస్ ఉందా?, బీపీ ఉందా? …” ఇలా ఓ పాతిక. … “లేదు“,“లేదు” ..అంటూ చెప్పుకుంటూ పోతుంటే నాకే అనుమానం వేసింది అబద్ధాలు చెప్తున్నానుకుంటారేమోనని. నాబాధలు నాకున్నాయి కానీ అవి వాళ్ళ జాబితాలో లేవు మరి. వాళ్ళజాబితాలో ఉన్న భౌతిక బాధలు నాకు లేవు.

“నువ్వు ఎమేజింగ్,” అంది తలొంచుకుని నా“లేదు”లన్నీ రాసుకుంటూ.

నాకే సిగ్గేసింది అన్ని “లేదు”లు చెప్పినందుకు. “అయ్యో, మరీ అంత పర్ఫెక్టు కాదు నేను. రాసుకోండి, నాకు ఎడమచెవి 60 శాతం వినిపించదు.”

“ఇంతకుపూర్వం ఏమైనా సర్జరీలయేయా?”

“లేదు.” నిజం కాదు కానీ నిజం చెప్తే వివరాలు అడుగుతారు. నాకు అసలు ఎప్పుడు జరిగిందో కూడా సరిగ్గా గుర్తు లేదు, వివరాలమాట సరే సరి. ఎందుకొచ్చిన గొడవ, లేదనేస్తే పోతుంది.

ఆ తరవాత మళ్ళీ మొదలు అదే జాబితా .. “మీకుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉందా?” “బీపీ ఉందా?” … ఏెం చెప్పను? ఆరోజుల్లో మాయింట్లో అంత పకడ్బందీగా చీటికి మాటికి ఆస్పత్రికెళ్ళి నాకిదుందా అదుందా అంటూ పరీక్షలు చేసుకోలేదు. ఇంట్లో ఏం జరుగుతోందన్న యావ నాకసలే లేదు. అంచేత మళ్ళీ అన్నిటికీ “లేదు,” “లేదు,” … ఇది కూడా నిజం కాకపోయినా. అంటే నిజమవునో కాదో నాకు తెలీకపోయినా.

… ఈ తతంగం ముగిసేక, ఆవిడిచ్చిన ఆస్పత్రి గౌనులోకి మారి బయటికి వచ్చి, నాకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచం ఎక్కేను.

ఇద్దరు అమ్మాయిలు చేతుల్లో ఏవో సూదులూ, ట్యూబులూ, తువాళ్ళూ పుచ్చుకుని తయారు. “ఎలా ఉన్నావు?” అంటూ కుశలప్రశ్నలు. హుమ్. నేను కుశలంగా ఉంటే ఇక్కడికెందుకు తగలడతానూ…

రబ్బరుబొమ్మకి అలంకారాలు చేస్తున్నట్టు నా టెంపరేచరూ, బ్లడ్ ప్రషరూ కొలిచి రాసుకుంటోంది ఒకతె నిరామయంగా. నన్నడిగితే చెప్పి ఉండేదాన్ని నా టెంపరేచరు మానసికంగా నూటయాభైకి ఎగసిపోతోందని. రెండో అమ్మాయి రెండో చెయ్యి పుచ్చుకుని సబ్బుతో శుభ్రంగా తోముతోంది.

“మీరిద్దరూ నర్సులేనా?”

అవున్ట. ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా జవాబిచ్చేరు. ఆహా, జన్మకో శివరాత్రి, ఇద్దరు ఇంతుల సేవలు! వాళ్ళశ్రద్ధ చూస్తే ముచ్చటే్స్తోంది కానీ ఈమాత్రం దానికి  ఇద్దరెందుకూ?  నిజానికి ముగ్గురు, మొదట్లో నన్ను బాత్రూంలోకి నడిపించిన పిల్లని కూడా లెక్కేస్తే. అరక్షణంలో జరిగిపోయిన ఒక్క ప్రమాదం ఇంతమందికి పని కల్పిస్తోంది. మ్ … మ్ …  ఏమిటో ఈ సంస్కృతి నాకు అయోమయం. ఓపక్క మల్టీ టాస్కింగంటూ ఒకొకరు నాలుగు పనులు … మరోపక్క ఒక్క పనికి నలుగురూ. …

  “నాపేరు చో. నేను సర్జరీ నర్సుని,” మరో పూబంతి ప్రవేశం. మళ్లీ మొదలు – “బీపీ ఉందా?” “డయబెటిస్ ఉందా?” “ఎలర్జీలు – పెన్సిలిన్‌”? “లేటెక్స్‌?” …

“లేదు,“ “లేదు,” “లేదు” మహాప్రభో.. “ఇందాకా ఇద్దరు నర్సులూ, ఇంకా అంతకుమున్ను మరో సెక్రటరీవో ఎవరో రాసుకున్నారు ఇదందా. ఇవన్నీ మీ సిస్టములో ఉన్నాయి.”

“కావచ్చు. నేను సర్జరీసమయంలో ఉంటాను నీ పక్కన. నాకు తెలియాలి.”

సరి, ఆమెతో నలుగురు …

మరో వైద్యశిఖామణి, “ఎనస్తీషియాలజిస్టుని.”

అదేమిటి, మరి రెండు సూదులెందుకూ? ఎడమచెయ్యికి సర్జరీ చేస్తే కుడిచెయ్యి పుచ్చుకుంటావేమిటి?

“నిన్ను సర్జరీసమయంలో నిద్రపుచ్చడానికి.“

“నిద్రా? కుక్కల్నీ గుర్రాల్నీ నిద్రపుచ్చినట్టా? హీహీ.”

“ఇది ఎనస్తీషియా కాదు. రిలాక్సవుతావంతే.”

నాకు నీరసం వస్తోంది.

“ఈ సూది ఇన్సులిన్, నీరసం రాకుండా ఉండడానికి.”

నాకు నీరసం వస్తోంది మానసికంగా.

“ఆ సూది ఎనాస్తీషియాకి. ఈ రబ్బరుగొట్టం రక్తప్రసారం ఆపడానికి.” … …

                                  000

మళ్ళీ మరో నర్సు. “ఎలా ఉన్నావు?”

ఎలా ఉన్నానో తెలుసుకోలేకుండా ఉన్నాను. “ఎక్కడున్నాను?”

“అంతా అయిపోయింది. నువ్వు ఇంటికెళ్ళిపోవచ్చు. మరోఅమ్మాయి వచ్చి బట్టలు మార్చుకోడానికి సాయం చేస్తుంది.”

“డాక్టరు గారు రారా సర్జరీ ఎలా అయిందో చెప్పడానికి.”

“రారు. కావలిస్తే పిలు.”

మరి నువ్వేం చేస్తావు?

“ఈ ఫారం పూర్తి చేసి నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం చేస్తాను. నొప్పిగా ఉందా? పెయిన్ కిల్లర్ ఇవ్వనా?”

“లేదు. వద్దు.”

ఆ సూదులు గుచ్చినఅమ్మాయి కూడా అడిగింది. “నొప్పిగా ఉందా. ఫరవాలేదు. నెమ్మదిగా ఇస్తాను.”

ఎందుకొచ్చిన హామీలు. అసలిలాటి చోటికి రాకుండానే ఉండాలి గానీ వచ్చింతరవాత రోటిలో తల పెట్టినట్టే కదా.

ఇంతమందికి నొప్పి లేదని చెప్పింతరవాత నాకే నమ్మకం లేకుండా పోతోంది. నాకెందుకు నొప్పి లేదూ? నేనేం మనిషిని కానా? ఉంది కానీ నాకు తెలీడం లేదేమో. ఎందుకు  తెలీడం లేదూ? అసలయినా ఈ అమెరికనులు చీమంత ఉంటే కొండంత చేస్తారు. ఇంత పిసరు నొప్పికి కూడా ప్రాణం పోతున్నట్టు శివతాండవం! నేను నొప్పి లేదని చెప్పడం అలాటివారికి ప్రతిగానేమో. Rebel without cause! లేక ఇదో రకం డిసార్డరేమో. అలా అని చెప్తే, మరో డాక్టరుదగ్గరికి తోలుతారు కాబోలు ఈ “సిస్ట” జనులు. నావల్ల కాదు ఈ వైద్యరాజపోషణ. ఇప్పటికే ముగ్గురయేరు ఎమర్జన్సీ డాక్టరుతో కలిపి. అది కాక మధ్యలో ఎపాయింటుమెంటిచ్చి కాన్సిలు చేసిన వైద్యబ్రహ్మతో నలుగురు. ఆయన మోచేతి కిందిభాగం మాత్రమే చూస్తాట్ట. పైభాగం చూసే డాక్టరు మరొకరు, మణికట్టుకి మరో డాక్టరు. ప్రస్తుతం మణికట్టుడాక్టరుతో కుస్తీ సాగుతోంది.

అవునింతకీ నాకు నొప్పి తెలీడం లేదేం? ఎనాస్తీషియా మహత్యమా? మరి అది ఇవ్వకముందు ఆ నర్సమ్మతల్లి సూదులు గుచ్చినప్పుడు కూడా తెలీలేదు కదా. ఈ “నేను” నిజంగా నేను కానేమో.. నొప్పి తెలిసిన “నేను” వేరూ, అల్లంత దూరంలో నిలబడి అదేదో నాటకమయినట్టు జరుగుతున్నదంతా వీక్షిస్తున్న “నేను” వేరేమో. అందుకేనేమో ఈ చెయ్యి నాచెయ్యిలా అనిపించడంలేదు ఏ ఏనుగుతొండమో, గుర్రంతోకో భుజానికి తగిలించినట్టుందే కానీ.

                                           000

“నొప్పిగా ఉంది. రాత్రి నిద్ర పట్టడంలేదు. ఏదైనా మందు ఇవ్వండి.”

“మొదట్లో లేదు కదా. ఇప్పుడే మొదలయిందా?”

“ఆఁ.”

“Are you feeling numbness or tingling sensation?”

ఏంటో గొడవ, నమ్నెస్, టింగ్లింగ్ … వేళ్ళ చిగుళ్ళ రాళ్ళు కట్టి లాగినట్టుంది అదేనా టింగ్లింగ్ అంటే? నేను అనుభవిస్తున్న నొప్పికీ వాళ్ళు చెప్పే నొప్పికీ తేడా ఉందని నా నమ్మకం. ఎలా చెప్పడమో తెలీడంలేదు.

“నీ ప్రైమరీ కేర్ ఫిజిషియనెవరు?”

“ఎవరూ లేరు. నేను కొత్తగా వచ్చేను ఈ ఊరు.”

“నాకు తెలిసిన వండర్ఫుల్ ఫిజిషియనులున్నారు. పేర్లు కావాలా?”

“ఈ నొప్పి మీరు చేసిన సర్జరీ వల్లే కదా వచ్చింది. మీరెందుకు రాసివ్వరూ?”

“అలా రాయడానికి వీల్లేదు. నీ కండిషను పూర్తిగా తెలిసినవారే చెయ్యాలి ఆపని.”

అబ్భ ఎంతమంది వైద్య నిపుణులు! మోచేతికింద చూడ్డానికొకరూ, మీద చూడ్డానికొకరూ, మణికట్టుకొకరూ. … ఇంకా వేలు వేలుకొకరు కూడా ఉన్నారేమో.  ఇలా చెయ్యడంవల్లే అసలు నాకు రెండుసార్లు సర్జరీలయింది. ఒకే డాక్టరయితే చెయ్యంతా ఒకేసారి చూసి, ఎక్కడెక్కడ విరిగిందో అక్కడక్కడ వైద్యం చేసి ఉండేవాడు. ఈ స్పెషలిస్టులంతా నా చెయ్యి ముక్కస్య ముక్కః చేసి, ఒక్కొక్కరు ఒక్క ముక్కా పంచుకోకపోతే నేను రెండు వారాలకి ముందే తేరుకుని ఉండేదాన్ని. మనదేశంలో ఊరికో ధన్వంతరి హాయిగా. కాలు నొచ్చినా కడుపు నొచ్చినా, కలరా వచ్చినా ఆయనే కదా వైద్యో నారాయణో హరిః. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడినట్టు, ఈ ముక్కలడాక్టర్లు అధికంగా సాధించింది నాకయితే కనిపించడంలేదు బిల్లులు పెరగడం తప్ప.

అయినా ఇప్పుడు నేను మరో డాక్టరుదగ్గరికి వెళ్తే ఆయనకీ తెలీదు కదా నా సంగతి. మళ్ళీ నాకు ఏ జబ్బులు లేవో నిర్ణయించడానికి పరీక్షలూ … దాంతో మరో మూడు వారాలు … ఇప్పటికి తెలుస్తోంది వీళ్ళ వరస … మొదటి ఎపాయింట్మెంటు త్వరగానే ఇచ్చేస్తారు కానీ ఆ తరవాత మాత్రం జీడిబంకలా సాగతీస్తారు మరి మన వల్లోకి వచ్చేసింది కదా అని కాబోలు. … వాళ్ళ పరీక్షలన్నీ అయేవేళకి నాకు నొప్పి లేకుండా పోతే? లేదా, ఈ నొప్పికి నేను అలవాటు పడిపోయి, మందులఅవసరం లేకుండా పోతే? అదీ కాకపోతే – నాకు ఆ నొప్పి మందులు అలవాటయిపోయి వాటికి దాసోహం అయిపోతే? కొండనాలుక్కి మందు వేస్తే ఉన్ననాలుక ఊడిపోయిందనీ … ఇంతవరకూ నేను వెచ్చించిన టైమంతా వృథాయే కదా. అదీ ఇదీ కాకపోతే నాచెయ్యి నొప్పి ఇలా కలకాలం కొనసాగుతూ ఉండొచ్చు కూడా.

ఒకాయన జ్యోతిష్కుడిదగ్గరికి వెళ్ళేడుట. జ్యోతిష్కుడు ఆయనచెయ్యి క్షుణ్ణంగా పరిశీలించి, “నాయనా, నీకు నలభై ఏళ్ళవరకూ కష్టాలు,” అన్నాట్ట. “అయితే నలభై తరవాత సుఖపడతానా?”

“లేదు నాయనా. అప్పటికి వాటికి అలవాటు పడిపోతావు.”

అంతే. నేను కూడా నా నొప్పికి అలవాటు పడిపోతాను. ఈ వైద్య systemల పద్మవ్యూహంలోంచి బయట పడి, నాచెయ్యి నాది కాదనుకుని, ఆ చెయ్యిగల “నేను” వేరు, ఈ “నేను” వేరు అనుకుని ఏకచేత్తో చేయగల పనులు మాత్రం చేసుకుంటూ పోతేనే నయం.

(అక్టోబరు 15, 2011)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “సిస్టావధానం (కథ)”

 1. యదార్ధానికి మీ మార్కు హాస్యాన్ని , వ్యంగ్యాన్నీ జోడించి అద్భుతంగా రాసారండి. అమెరికా ఇన్స్యూరెన్సు తీసుకుని వెళ్ళినా, మాకు ఏ చిన్న రోగమొచ్చినా, పడినా పిల్లలు గజగజలాడిపోతారు. వాళ్ళు సంపాదించుకున్న నాలుగురాళ్ళూ వైద్యాలకు అయిపోతుందని.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. తెరెసా, హాహా. అన్ని pathies… నేనింకా బిల్లులన్నీ చూడలేదు. ఇంకా నీరోసర్జన్తో కుస్తీ ఉంది 10 రోజుల్లో … ఈ డాక్టర్లు, హుమ్…నాచెయ్యి వాళ్ళకి ముడుపు కట్టేసినట్టున్నాను 😦

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ ..అక్కడక్కడా నవ్వేసాను ఏవనుకోకండే !
  ఇంత పెద్ద కథ కొట్టేసేరంటే బాగా కోలుకున్నారన్నమాటే .
  అవునండీ ….అమ్రికాలో కూడా టి.విలు పెడతారా హాస్పిటల్స్ లో . చెవిటి మేళం లాగా ఆ మూగటి.వి చూడ్డం అదో నరకం లెండి

  మెచ్చుకోండి

 4. శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.
  @ సి.వి.ఆర్. మోహన్, వైద్యుడిగా అర్థం చేసుకున్నారంటే మరీ సంతోషం. థాంక్స్.
  @ teresa, sympathetic vibrations అంటారా :))
  @ నాగేస్రావ్, మీ సలహా గుర్తు పెట్టుకుంటానండీ. ధన్యావాదాలు.
  @ జ్యోతిర్మయి, మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
  @ Udaya Reddivari Rani, మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. “నీకు డయాబెటిస్ ఉందా?, బీపీ ఉందా? …” ఇలా ఓ పాతిక. … “లేదు“,“లేదు” ..అంటూ చెప్పుకుంటూ పోతుంటే” నాకు భలే తమాషాగా అన్పిస్తుంది. ఏమున్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నామనే భావన భలే గమ్మత్తుగా ఉంటుంది. కథ చాలా బావుంది. అమెరికాలో వైద్యం గురించి బాగా వివరించారు. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ…

  మెచ్చుకోండి

 6. >>ఆరోజుల్లో మాయింట్లో అంత పకడ్బందీగా చీటికి మాటికి ఆస్పత్రికెళ్ళి నాకిదుందా అదుందా అంటూ పరీక్షలు చేసుకోలేదు. ఇంట్లో ఏం జరుగుతోందన్న యావ నాకసలే లేదు. అంచేత మళ్ళీ అన్నిటికీ “లేదు,” “లేదు,” … ఇది కూడా నిజం కాకపోయినా. అంటే నిజమవునో కాదో నాకు తెలీకపోయినా.
  లేదని చెప్పి మనం అబద్ధం చెపుతున్నామేమోనని సంకోచంగా ఉన్నపుడు – “నాకుతెలిసినంతవరకు లేదు (no, as far as I know)” అని చెప్తాను నేను.
  అంతటితో మన పూచీ సమాప్తం.
  >>మరోపక్క ఒక్క పనికి నలుగురూ.
  ఎన్ని ‘టాస్కు’లకి అన్ని ‘కోడులూ’ ‘బిల్లింగూ’!
  <-త్వరగా కోలుకోండి!

  మెచ్చుకోండి

 7. మీరు అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకోగల ఒక వైద్యుడిగా నా సానుభూతిని వెల్లడిస్తూనే,
  ఆ నిస్సహాయ స్థితిలో కూడా హాస్యాన్ని మేళవించి వ్రాయడాన్ని అభినందిస్తున్నాను.
  మీరు త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
  గెట్ వెల్ సూన్, ప్లీస్ టేక్ కేర్,
  మోహన్

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.