ఊసుపోక – సంస్కృతీ, కల్చరూ

(ఎన్నెమ్మకతలు 81)

ఈరోజు పొద్దున్నే నాకు మాధురీకృష్ణ ఒక విడియో పంపేరు, తణుకుకి చెందిన 11 ఏళ్ళ శృతి తేట తెలుగులో ఇచ్చిన ఉపన్యాసం. విని ఆశ్చర్యపోయేను. ఆ తల్లిదండ్రులని అభినందిస్తున్నాను. విని చూడండి.

<http://www.youtube.com/watch?v=BZg74oCNvZM>

నాకు వెంటనే మరో ప్రశ్న ఉదయించింది – ఆ సభలో మిగతావారిలో ఎంతమంది అంతమంచి తెలుగులో మాటాడిఉంటారా అని. బహుశా మరో ఇద్దరో ముగ్గురో ఉండొచ్చు. కానీ ఈనాడు చాలావరకూ తెలుగుసభల్లో చాలా ఇంగ్లీషు వినిపిస్తుంది.

ఈమద్య ఆడియో టపాలో సంస్కృతిగురించి కొంత ప్రస్తావించేను. నిన్న టీవీలో వార్తలు వింటుంటే, మన సంస్కృతిగురించి నాకు మరి కొన్ని ఆలోచనలు వచ్చేయి.

దాదాపు మూడు వారాలుగా పెన్ స్టేట్ యూనివర్సిటీలో జరిగిన అఘాయిత్యం – యాభై ఏళ్ళ పెద్దాయన పదేళ్ళ పిల్లవాడిమీద జరిపిన అత్యాచారం. దీన్నీ గురించి మీరు వినకపోతే, Scandusky అనో Paterno అనో కీవర్డ్ కొట్టి చూడండి. గురుతుల్యులయిన పెద్దలు పిల్లలని తమ కామానికి గురి చేయడం హేయం అయితే,  ఆ సంస్థ అధికారులు సంస్థపేరూ, ఆదాయం (92 మిలియన్లుట) పరిరక్షించుకోడంకోసం ఆ విషయాన్నిగుట్టు చేసి కుమ్మక్కయి తమనీ, తమవారినీ రక్షించుకోడం మాత్రం నీతిగా గ్రహించండం హేయాతిహేయం.

పెన్ స్టేట్ యూనివర్సిటీ ఫుట్బాల్ అశేష జనాదరణ పొందిన క్రీడ అని నాకిప్పుడే తెలిసింది, అదీ ఆ కోచ్ దుష్ట ప్రవర్తనద్వారా! టీవీలో ఒక వ్యాఖ్యాత ఆ కుట్రని వాళ్ళ “కల్చర్‌”గా అభివర్ణించడం నన్ను మరింత ఆలోచించేలా చేసింది. ఆ ప్రయోగంతో కల్చర్ అన్న పదం కల్ట్ అన్న పదానికి చాలా దగ్గరగా కనిపిస్తోంది.

కల్చర్, కల్ట్ – రెంటికి మూలధాతువు ఒకటే అయినా, మొదటిపదానికి ఉన్న గౌరవం రెండోపదానికి లేదు. సమస్త జనసామాన్యానికి శ్రేయస్కరమైన  కొన్ని నియమాలు ఏర్పరుచుకుని వాటిని పాటించడం కల్చర్ – మనభాషలో దాన్ని గుర్తించడం సంస్కారం, గౌరవించి పాటించడం సంస్కృతి. అందుకు భిన్నంగా కల్ట్ అన్నది ఒకరకం వితండవాదం. మంచీ చెడ్డా వివక్షత లేకుండా తమకి ప్రియమైన ఒకే ఒక అభిమతాన్నో ఒక వ్యక్తినో మూర్ఖంగా అనుసరించడం కల్ట్. దానివల్ల సమాజానికి జరిగే హానే ఎక్కువ.

ఇప్పుడు సంస్కృతి మాట చూద్దాం. మామూలుగా ఒక జాతి తినే తిండీ, కట్టే బట్టా, మాట్లాడే భాషా, అభివ్యక్తీకరించే భావపరంపరా, ఆచారాలూ, నిత్యనైతిక జీవనసరళిలో వారు వ్యవహరించే విధానం, ఉపయోగించే వస్తువులూ – ఇవన్నీ కలిసి ఉమ్మడిగా వారి సంస్కృతిని తెలియజేస్తాయని స్థూలంగా మనం నిర్వచించుకోవచ్చు.

ప్రతి దేశంలోనూ భౌగోళికంగానూ, వాతావరణంలోనూ గల వ్యత్యాసాలమూలంగా వారి ఆహారవ్యవహారాలూ, దుస్తులూ, ఆచారాలూ మొదలనవన్నీ కలిసి వారికే ప్రత్యేకమైనవిధంగా వారి సంస్కృతికి రూపు కల్పిస్తాయి. వారి భాష కూడా తదనుగుణంగానే రూపు కడుతుంది. ఆ వ్యత్యాసాలమూలంగానే మనకి మరొక దేశపుసంస్కృతిగురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది. వారి కథలు చదివినప్పుడు మనం గ్రహించేది వారి భావజాలమే కాక, ఆకథల్లో ప్రకటితమైన ఆచారవ్యవహారాలు కూడా. ఆశలూ, ఆశయాలూ, ఆకలీ, నొప్పీ, ఇల్లూ, వాకిలీ, కోపతాపాలవంటివి అన్నీ అన్ని దేశాల్లో ఒకటే అయినా వాటిని ఎదుర్కొనే లేదా సాధించుకునే తీరులో ఉండే వ్యత్యాసాలు భిన్నం కదా. అవి అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాం వారికథల్లో.

ఈసందర్భంలో నాకు రెండు సందేహాలు. మొదటిది – పైన చెప్పిన సంస్కృతిలో భాగాలు  – ఆహారం, దుస్తులూ, భాషా, నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులూ – మారిపోతూ ఉంటాయి కదా మరి అదే మన సంస్కృతి అవుతుందా? ఉదాహరణకి, మనం ఇదివరకు పుట్టినరోజు జరుపుకునేతీరు వేరు. ఇప్పుడు పుట్టినరోజు అంటే కేక్, కాండిల్స్, హేపీ బర్త్‌డే పాటా. మరి ఇదే మన సంస్కృతి అనగలమా? ఈ విషయం వర్ణస్తూ రాసిన కథ మరొక దేశపు పాఠకుడికి ఆసక్తికరంగా ఉంటుందా? ఆకథవల్ల ఆ పాఠకుడికి మనదేశంగురించి ఏం తెలుస్తుంది?

ప్రస్తుతం మనం మాటాడుతున్న తెలుగులో మూడొంతులు ఇంగ్లీషు. అలాగే బ్లూజీన్స్, పీచా, నూడుల్స్ మనయిళ్ళలో సర్వసాధారణం అయిపోతే, అదే మన సంస్కృతి అవుతుందా? తెలుగువారికి ఇదీ “మన సంస్కృతి” అంటూ  ప్రత్యేకంగా చెప్పుకోడానికి ఏమీ లేదా?

నేనిలా అడగడానికి కారణం ఇదివరకు చెప్పేను కానీ మళ్లీ చెప్తాను. నా వెబ్ సైటు తూలిక.నెట్ తెలుగువారి సంస్కృతిగురించి విదేశీయులకి తెలియజేయడానికి ప్రారంభించిన సైటు అని నేను చెప్తుంటే, ఈనాటి సమాజాన్ని, ముఖ్యంగా పాశ్చాత్యసంప్రాదాయాల్ని పూర్తిగా ఆకళించుకుని అనుసరిస్తున్న పట్టణజీవితాన్ని చిత్రించే కథలు నాకు పంపుతున్నారు అనువాదకులు. నాకు అది పనికిరాదంటే, “ఏంటండీ మీ సంస్కృతి?” అని రొకాయించేరు ఒకరు. అంచేత అడుగుతున్నాను పై ప్రశ్న.

రెండో సందేహం, పెన్ స్టేట్ అధికారులప్రవర్తనని కల్చర్ అన్నారు ఒక అమెరికన్ వ్యాఖ్యత. కారణం, మానవజాతికి సహజమైన “గుంపులో ఒకరినొకరు ఆదుకునే మనస్తత్త్వం,” మనవారిని మనం రక్షించుకోవాలన్న తపన. పాతరాతియుగంనుండీ అనూచానంగా వస్తున్న ఆచారం అది.

ఇక్కడ కల్చర్ అన్న పదానికి అర్థం పైన మనం చెప్పుకున్న భాష్యానికి వేరుగా కనిపిస్తోంది. అది లోకకల్యాణానికి పనికొచ్చేది కాదు. ఒక కుటుంబంలోనో, ఒక గుంపులోనో ఒకరినొకరు ఆదుకునే ప్రవృత్తి మౌలికమైన, మానవీయమైన నీతికి దూరం కాకూడదు కదా. కుటుంబంలో ఒకరు తప్పు చేస్తే వారిని సరైనదారిలో పెట్టే బాధ్యత, ఆ తప్పు చేసినవాడు తన తప్పుని అంగీకరించి శిక్షకి తల ఒగ్గేలా చేయడమే నిజమైన కల్చర్ అని నా విశ్వాసం.

ఇంతకీ మనం మాటాడుకుంటున్న సంస్కృతి – నా అభిప్రాయంలో ప్రస్తుతం మన భాషా, ఆచారవ్యవహారాలూ మారిపోతున్నా, అవి మన సంస్కృతి అనిపించుకోడానికి మరో శతాబ్దం కావాలనీ, ప్రస్తుతానికి మాత్రం వెనకటి ఆచారాలూ, వ్యవహారాలూ మాత్రమే మన సంస్కృతి అనిపించుకుంటాయనీ. ఏమంటారు?

(నవంబరు 18, 2011)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ఊసుపోక – సంస్కృతీ, కల్చరూ”

  1. సౌమ్య, మహదేవశాస్త్రిగారు గొప్ప పండితులు. నువ్వు కనీసం తెలుగువాళ్ళు రాసిన పుస్తకం చదువుతున్నావు. ఏ ఇంగ్లీషువారో ఇంగ్లీషువాళ్ళకోసం రాసిన తెలుగు పాఠాలు కానందుకు సంతోషిస్తున్నా :p

    మెచ్చుకోండి

  2. “Survival of the fittest” అనుకోవచ్చా?

    ఇవ్వాళ నేను లైబ్రరీలో దేనికోసమో వెదుకుతూ ఉంటే, కోరాడ మహదేవశాస్త్రి గారి పుస్తకం ఒకటి కనబడ్డది. ఆధునిక తెలుగు వ్యాకరణం గురించి పాశ్చాత్య తెలుగు విద్యార్థులకి చెప్పేందుకు రూపొందించిన పుస్తకం అది. మొదటి కొద్ది పేజీలు తిరగేశాక గానీ తెలియలేదు నాకు – నీఱు-నీరు, వేఱు-వేరు : వేరు వేరు అర్థాలు గల పదాలని. పుట్టిన ఇన్నేళ్ళకి పాశ్చాత్యులకి నేర్పడం కోసం రాసిన తెలుగు పుస్తకం చూసి, నేను తెలుగు నేర్చుకుంటున్నా అంటే ఏమనుకోను? మన సంస్కృతికే కాలానుగుణమైన మార్పులు తట్టుకుని నిలబడే శక్తి లేదనా? లేదంటే మన జనాలకి లేదనా??

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s