ఇష్టసఖి

“ఒకరికి అసలు ఎవరికైనా మరొకరంటే ఎలా ఇష్టం కలుగుతుంది?”

ట్రినిటీ నదిలో చిరుతరగలు గాలి వీచిన దిక్కుగా కదులుతున్నాయి నిదానంగా.

గట్టున వీపింగ్ విల్లోలు ఊయలలూగుతూ గాలివేగం సూచిస్తున్నాయి.

వాహిని వాహిక అయి గడ్డిపరకల్నీ, ఫోం కప్పుల్నీ మోసుకుపోతోంది దూరతీరాలకి నిరామయంగా. కడిగిన పింగాణీముక్కల్లాటి తెల్లముక్కుల్తో నల్లటి బాతులు (American coot) చిరుతరగలమీద ఓలలాడుతున్నాయి జల్సాగా. ఓ బద్ధకిష్టి బాతుపిల్ల బెత్తెడు ఎత్తు లేచి నీటిపొరలు పైపైన తన్నుకుంటూ నాలుగు గజాలు ఎగిరి మళ్ళీ నీటిమీద వాలింది. ఆ సుందరదృశ్యం కెమేరాలో పట్టడానికి ఎంతసేపు చూసినా మళ్లీ దొరకలేదు. మ్. జీవితంలో ఇలాటి సందర్భాలెన్నో!

అసలు ఎవరికైనా మరొకరంటే ఎలా ఇష్టం కలుగుతుంది? – అవును, ఎవరేనా ఎవరితోనేనా ఎందుకు స్నేహం చేస్తారు? “అది మనిషి తత్వం” – సుళువుగా దొరికే జవాబు. కానీ నిజంగా జవాబుందా ఆ ప్రశ్నకి?

***

“అసలు ఎవరికైనా మరొకరంటే ఎందుకు ఎలా ఇష్టం కలుగుతుంది?”

అహ. భేతాళుడిప్రశ్నలా అడిగేనంటావు. తెలిసి చెప్పకపోతే నీతల వెయ్యి చెక్కలవుతుందని కూడా అన్లేదు కదా నేను. హాహా. ఈ సందేహం ఎందుకంటే ఏమో మరి. పిన్నీ, నాకు దిగులుగా ఉంటోంది ఈమధ్య. ఏం తోచడం లేదు. ఈదేశం వచ్చి ఆర్నెల్లయిందా, అపాయింటుమెంట్లు, ముందు పిలవడాలు ఏంలేకుండా, ఉన్నపాళాన ఆ క్షణానికి కాస్సేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంటే కుదర్దు కదా. నాకెలాగో నువ్వు దొరికేవు, హీహీ. నీతో మాటాడుతుంటే అమ్మతోనో పెద్దక్కయ్యతోనో మాటాడుతున్నట్టే ఉంటుంది హాయిగా. అదే చూడు మరి, పక్కఊళ్ళో మా పెద్దమామయ్య కొడుకున్నాడు. పట్టుమని గంటన్నర కూడా పట్టదు బస్సెక్కితే. చిన్నప్పట్నుంచీ ఇరుగూ పొరుగూ పెరిగేం. ఒకే స్కూలికెళ్ళేం. రాగానే పిలిచానా, ముక్తసరిగా మూడు ముక్కలు వాగేసి, పన్లో ఉన్నా తరవాత పిలుస్తానన్నాడు అవతలేదో ములిగిపోతున్నట్టు. ఆ తరవాత అంతే సంగతులు. మళ్ళీ ఏ కబురూ లేదు. మరో ఆర్నెల్లు పోతే నీనోటా ఆ చిలకపలుకులే వస్తాయనకు. అది ఈ సంస్కృతిలో భాగం అంటే సరే కానీ నాకు మాత్రం ఆ భాష చచ్చినా రాదు బాబూ. అయినా నాకు తెలీకే అడుగుతున్నా. ఇక్కడికొచ్చేసరికి మనవాళ్ళతత్త్వాలు ఇంతగా మారిపోవాలేమిటి? మన ఆప్యాయతలూ, అభిమానాలూ మర్చిపోతారేమిటి? అవున్లే. అందరూ చెప్పే గాలి కబురే – ఇక్కడ ప్రవాహంలో చేరి ఈదుకు పోకపోతే బతకలేవు, ఇంతదూరం వచ్చిందెందుకు? ఈ సమాజంలో నీ ప్రజ్ఞ ఋజువు చేసుకోడానికే కదా! అని. నేనలా అవుతాననుకోను. నాకు మనుషులు కావాలి. ఇక్కడేమో మనవాళ్ళు కూడా అలా అంటీ ముట్టనట్టు అడుగుదూరంలో నిలబడి మాటాడుతుంటే నాకు కంపరంగా ఉంది.

ఆర్నెల్లక్రితం …

హలో. నేనే పిన్నీ, వీచికని. గుర్తున్నానా? పదేళ్ళయిందనుకుంటాను. నువ్వు ఇండియా వచ్చినప్పుడు మా శ్యామలక్క పెళ్ళిలో కలుసుకున్నాం. ఆఁ. అమెరికా వచ్చేను. వారం రోజులయింది వచ్చి … నాకిక్కడేం … బావులే … లేదులే. ఏడవడంలేదు. గొంతు పట్టేసింది చలికి. నిన్ను చూడాలని ఉంది. శనివారమా? … అలాగే వస్తాను. ఫ్లైట్సు ఏంవున్నాయో, టికెట్టెంతో కనుక్కుని మళ్ళీ ఫోను చేస్తాను. … డబ్బు సంగతి … చూస్తాలే. అలాగే, కావలిస్తే నిన్ను కాక ఎవర్నడుగుతాను? డబ్బొక్కటే కాదు కదా. క్లాసులు … ఏం చదవాలో ఏమిటో … నాకంతా అయోమయంగా ఉంది. అసలు వీళ్ళు పాఠాలు చెప్పడానికా, “నువ్వేం అనుకుంటున్నావు, నీకేం అర్థమయిందీ” అంటూ మాప్రాణాలు తియ్యడానికా ఈ ఉద్యోగాలు చేస్తున్నది – నాకయితే అర్థం కాడంలేదు.

***

ఆ ఆర్నెల్లలోనూ – ఏటిఒడ్డున నడుస్తుంటే, పలకరించిందావిడ. ఎదురు బిల్డింగులో ఉంటార్ట. వాళ్ళబ్బాయీ, కోడలూ, ఏడేళ్ళ అమ్మాయినీ చూడ్డానికి ఇండియానించి వచ్చి రెండు వారాలయిందిట. ఆ తరవాత ఇంచుమించు రోజూ …

ఉన్నారా? ఉంటారనుకునే అనుకున్నాలెండి. అనుకుంటూనే వచ్చేను. నాకోసం ఎదురుచూస్తూంటారేమోనని. హాహా. రోజూ మిమ్మల్ని విసిగించి పోకపోతే తోచదు మరి.

అవున్లెండి మీరలాగే అంటారు. లేకపోతే రోజూ ఏవిటీ సొద అంటారేమిటి. హీహీ. ఇంతకీ ఇవాళ్టి కథ చెప్తా.

ఇవాళ నాపుట్టినరోజు లెండి. మా కోడలు కొత్తచీరె కొంది. బియ్యే చదివేవు బియ్యం కడగడం రాదా అన్నట్టు, యమ్మెస్సీ చదివింది పునిస్త్రీలకి చీరె ఒక్కటే ఇవ్వకూడదని తెలీదూ చిత్రం కాకపోతే. పైగా పసుపూ, కుంకుమలతో ఓ పళ్ళెంలో పెట్టి ఇద్దరూ – అదే కొడుకూ, కోడలూ – నాచేతిలో పెడితే వాళ్ళకీ నాకూ కూడా శుభం, శోభస్కరం కాదూ. నాలుగేళ్ళ పిల్లదానిచేత పంపించింది తను పడగ్గదిలో కూర్చుని. ఆ పిల్లొచ్చి ఇదుగో, నీకూ అంటూ నామీద పడేసిందా చీరె. మీరు చెప్పండి ఏమైనా మర్యాదగా ఉందా?

పిల్లదానికి మనమర్యాదలు నేర్పాలని అనుకుంటోందనని ఎలా అనుకోమంటారు మీరు. అలాటి ఆలోచనే ఉంటే, మనపద్ధతిలో ఇదుగో ఇలా చెయ్యాలని పిల్లదానికి చేసి చూపాలి. అదీ పిల్లలికి నేర్పడం అంటే. ఏమోలెండి, నేనెరిగినంతవరకూ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చీరె, రవికలగుడ్డా, పళ్ళూ, పువ్వులూ తాంబూలం లేకపోయినా కనీసం పళ్లెంలో పెట్టి, చేతిలో పెట్టి, కాళ్ళకి మొక్కి దీవెనలందుకుంటారు. అదీ మన సాంప్రదాయం. నావల్ల కాదు లెండి అలా పిల్లదానిచేత చీరె నామీద విసిరేయించడం. మీరేమైనా అనుకోండి. నాకు మాత్రం మాచెడ్డ  అవమానం అయిపోయింది. అది తీసుకెళ్ళి ఆ కోడలుపిల్లమొహంమీద కొట్టాలన్నంత కోపం వచ్చింది, ఎందుకులే మరో నెలరోజులు కళ్ళు మూసుకుంటే ఆవిడదారి ఆవిడది, నాదారి నాదీ అను ఊరుకున్నా.

అంతే. తరవాత ఆవిడదారి ఆవిడదీ, తనదారి తనదీ అయింది. ఇప్పుడెక్కడుందో, ఏం చేస్తోందో …

***

ఆ, ఆర్నెల్లయిపోయిందా పిన్నీ నీతో మాటాడి. తెలీనేలేదు కాలం గడిచిపోతోంది. చాలా జరిగేయిలే ఈమధ్య. అందుకే నిన్ను పిలవడం కుదర్లేదు. హా, హా నీకు నవ్వుగానే ఉంటుందిలే. ఏం చెయ్యమంటావు చెప్పు, నీకూ తెలుసు కదా ఇక్కడ చదువులు. ఈ ప్రొఫెసర్లు వాళ్ళు చెయ్యాల్సిన పనీ మేం చెయ్యాల్సిన పనీ కూడా మాచేతే చేయిస్తున్నారు. ఏంవడిగినా, నువ్వేం అనుకుంటున్నావంటూ మొదలెడతారు. నాకు తెలీకే కదా మిమ్మల్నడగడం అంటే, లైబ్రరీలోనూ, ఇంటర్నెట్టులోనూ చూడు. నాకు తెలుసు, నువ్వు కాస్త ఆలోచిస్తే కనుక్కోగలవు అంటూ కొంత మెచ్చుకోలూ, మరింత ఎత్తిపొడుపులూను. సగానికి చిక్కిపోయేను ఈ తిండీ, చదువూ పడక. … అవున్లే, నామీదా, నాతెలివితేటలమీదా ఆయనకంత నమ్మకం మరి. సరే. ఈ చదువు ఇప్పుడప్పుడే అయేట్టు లేదు. అర్జంటుగా రాయాల్సిన పేపర్లు రెండున్నాయి. అవి ముగిసేక పిలుస్తాను నిన్ను. తప్పకుండాను. లేదు, లేదు. మరే కుంటిసాకులూ చెప్పను. తప్పకుండా పిలుస్తాను. తీరిగ్గా మాటాడుకుందాం. అయినా నువ్వు కాక ఎవరున్నారులే నాసొద వినడానికి.

ఆమధ్య కొంతకాలం నాక్లాసుమేటు ఘోష్ సినిమాకి వెళ్దాం రమ్మని పిల్చేడు. అంతకుముందు ఒకటి రెండుసార్లు లంచికెళ్ళేంలే. … హీహీ … ఆఁ డేట్‌లాగే ఉంది. … నాలుగు రోజులయింది కదూ నీతో మాటాడి. ఏం చెయ్యను. పని. చదువు, సోషలైజింగు … … అదుగో, నువ్వలా నవ్వుతావనే అసలు మాటాడను. ఈ దేశంలో సంగతులు నీకు మాత్రం తెలీవేమిటి? … … … … మనకంటే చదువంటే చదువూ, పనంటే పనీ. ఇక్కడ చదువుసమయంలోనే భావి ఉద్యోగాలకీ, సంసారానికీ కూడా వెసులుబాటు చూసుకోవాలి కదా. … … … …. … …. … …

పిన్నీ … హుమ్ .. మ్ … లేదులే. నేను ఏడవడంలేదు. నాకు చాలా కోపం వస్తోంది. అదే … ఆ ఘోష్ నన్ను గ్రో అప్ అన్నాడు. పోన్లే. వింప్. అలాటి వింప్సంటే నాకసహ్యం … అందుకే  డంప్డ్ హ్ం. … … … … … … … … … … … … … … … …

రేపు బయల్దేరి జేమీతో ఆల్బుకిర్కీ వెళ్తున్నా. చాలా బాగుంటుందిట అమెరికన్ ఇండియన్ సంస్కృతి అవశేషాలు చాలా ఉన్నాయిట చూడ్డానికి. వాళ్లకీ మనకీ విలువల్లో చాలా సామ్యం ఉందని నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. చూస్తుంటే రెండు తరాలవెనక వీళ్ళల్లో కూడా ఉమ్మడి కుటుంబాలవిలువలు కనిపిస్తున్నాయి మనలాగే … హా. సరే నీమాటే మనలాగే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాటి విలువలు ఉండేవి అనుకుందాం. మరి అవి ఎప్పుడు ఎలా మారిపోయేయో … … … … … … … … … … … … … … … … … అవును. వస్తా, వస్తానంటూ రావడంలేదు. ఈ లేబర్ డేకి మూడురోజులు శలవొస్తుంది కదా. అప్పుడొస్తాను. నీకు వీలేనా … … … … … … … … … … … … … … … … …… … … … … … … … … … … … … … … …  లేబర్ డేకి డేనాతో మెక్సికో వెళ్ళేను. మళ్ళీ థీసిస్ రాయడం మొదలు పెట్టేక మరి తీరదు కదా. … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … …. … ఆ. … మ్. … లేదులే, నీకు చెప్పడానికి భయం లేదు. నీకో చిన్న మాట చెప్పాలి. మేం వేరే అపార్ట్‌మెంటు చూసుకున్నాం కిందటి నెల. మాఅమ్మకి చెప్పకేం, గంగ వెర్రులెత్తి పోయి నన్ను వెంటనే వచ్చేమంటుంది. లేదా తనే బయల్దేరి వచ్చేస్తుంది. … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … …. … జేమీని నీకు పరిచయం చేద్దామవి ఉంది. మీయింటికి వచ్చే వారం వస్తాం. ఏమంటావు? … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … …. … … … … … … … … … … … … … … … … … … … … … … … రాలేకపోయేం. జేమీకి పరీక్షలు …  … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … …. … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … …. … … … … … … … … … … … … … … … … … … … … … … …               … ఏమిటీ ఆర్నెలయిపోయిందా.నేను పిలిచేవరకూ చూస్తున్నాటావా. లేదు లేదు నిజంగానే చాలా పని ఉంటోంది. రేపు తప్పకుండా పిలుస్తాను. అప్పుడు చెప్తాను కబుర్లు. … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … …. … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … …. … … … … … … … … … … … … … … … … … … … … … … … జేమీతల్లిదండ్రుల్ని కలుసుకున్నాం క్రిస్ట్‌మస్ శలవుల్లో. అవును. నీకింకా జేమీని పరిచయం చెయ్యలేదు. … హీ హీ … లేదు, తప్పకుండా  వస్తాం వేసవి శలవుల్లో. … …. … … … …. … …. …. … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … …. … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … … …. … … … … … … … … … … … … … … … … … … … … … … … ఏడాదయిపోయినట్టుంది!!!!!!!!!!!!!! … …. … … … …. … …. … … … … … … … … … … … … … … … … …. … … … …. … …. ….. …. …. …. …. …. …. …… …..  ……. ……. ….. …. ……. ….. …….. ………. ………… ………

***

పక్కబిల్డింగులోని తెలుగువాళ్ళు, కొడుకూ, కోడలూ, మనవరాలిని చూడ్డానికొచ్చిన తల్లి, చదువుకోడానికొచ్చిన పెదతాతగారి కూతురు కూతురు, మూడు నెలలు ట్రైనింగుకొచ్చిన ఎలెక్ట్రికలింజినీరు … ఇలా వచ్చి పోయే వాళ్ళు ఎంతమందో! తన బతుకు రాదారీబంగళా?!

***

ఎందుకూ అలా విచారిస్తావు? మనుషులు వస్తారు, పోతారు, జనం పోగు చేసుకునే వస్తువుల్లాగే. ఎల్లకాలం ఏదీ ఉండదు. ఏదీ శాశ్వతం కాదు. వాళ్ళ జీవితాల్లో నీ పాత్ర అది, నాలాగే. రాణికి ఇష్టసఖీ, యువరాజుకి వేడుక చెలికాడూ, పిల్లలకి అయిదోక్లాసు టీచరు – ఇలా ఏదైనా అనుకో. అయిదోక్లాసు కుర్రాడికి కొత్తగా క్లాసులో ప్రవేశించినప్పుడు, ఆ పంతులమ్మ చెప్పే పాఠాలు వింటుంటే, కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ఆవిడ సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపంలా తోస్తుంది ఆ ఏడాదిపాటు. క్రమంగా ఒకొక క్లాసు దాటుతున్నకొద్దీ, మరిన్ని సంగతులు తెలుస్తున్నకొద్దీ అందులో మరింత నిమగ్నమయిపోతాడు. అయిదోక్లాసు పంతులమ్మ వెనకబడి పోతుంది. అది వారి మనోధర్మం. అదే ఎదుగుదల. ముందుకి లేదా పైకి పోడం. … అదుగో, అటు చూడు. ఆ పండుటాకులూ, రాలిన రెమ్మలూ ఎలా తేలిపోతున్నాయో! ఈ బాతులూ, కొంగలూ నిన్నటివే అనుకుంటున్నావేమో. కాదు సుమా. ఇవి ఇవాళ కొత్తగా వచ్చేయి. నాల్రోజులు పోతే ఎగిరిపోతాయి మరో  వనరు వెతుక్కుంటూ. అదుగో అక్కడ గేలం విసిరి కూచున్నాడు, చూశావా? అతనికి ఇదే మొదలు. నాకు మొదటివాడు కాడులే. ఎంతమంది ఆ గట్టున కూచుని వాళ్ళ కతలు వెళ్ళబోసుకున్నారో … రేపు అతనికి ఈ స్థలం, ఈ జలం గుర్తుండకపోవచ్చు. మరో మనిషి అక్కడ కూచుని మళ్ళీ అదే వరస కానిస్తాడు. అది జీవధర్మం, లోకరీతి.

***

ఆహా, ఎంతో ప్రశాంతంగా … అయ్యో, ఉలికిపడ్డారు మీరు, క్షమించండి. మీ ఆలోచనల్లో మీరుంటే నేను అడ్డొచ్చేను. … ఆఁ, ఫరవాలేదంటారా? మీరు కనక అలా అంటున్నారు. మీసంస్కారం అలాటిది. అదే మరొకరైతే కసురుకునేవారు నీపాట్న నువ్వు పో, నామానాన నన్ను వదిలేయమంటూ. ఆహా, ఇదంతా నాకు అనుభవమేలెండి. ఇంతకీ, మీచేతిలో తెలుగు పుస్తకం చూసి పలకరించేను. నాకు తెలుగు పుస్తకాలంటే చాలా ఇష్టంలెండి. ఏమిటా పుస్తకం? … ఓ, ఎప్పుడూ వినలేదు పేరు, కొత్త రచయితేమో … … … హాఁ? ఏమిటీ? రెండు తరాలకి ముందు రాసినపుస్తకఁవా? అమ్మో, చూస్తుంటే మీముందు నేను అయిదోక్లాసు కుర్రాళ్ళా ఉన్నాను. సరే, చెప్పండి …

000

(డిసెంబరు 13, 2011.)

తా.క. ఈ కథని మార్చి, అస్పష్టమైన భాగాలు స్పష్టం చేసి రాసిన English version తూలిక.నెట్ లో ఉంది. లింకు ఇక్కడ

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “ఇష్టసఖి”

 1. @ శాయిపద్మ, హాహా, ఇది సైకాలజీ సెషనులా ఉందా.
  సరే నాకు తోచింది చెప్తాను. పైవ్యాఖ్యలో అన్నట్టు – దూరం, కాలం, అందుబాటు, అవసరం ..చాలా విషయాలు – ఇవన్నీ ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మొదట్లో తెలీవు. క్రమంగా ఒకొక సంగతీ తెలుసున్నకొద్దీ బొమ్మ మారుతూ వస్తుంది. అంచేత ఏ ఇద్దరిస్నేహితులమధ్య అయినా మొదటి అభిప్రాయానికీ చివరి అభిప్రాయానికీ గానీ తేడా ఉండకపత్పదు. నామటుకు నాకు ఈ స్నేహాలన్నీ నవలలో అధ్యాయాల్లా ఉన్నాయి. ఒక అధ్యాయంలో సంగతులు తెలిసంతరవాత తరవాతి అధ్యాయానికి పోతాం ఆ జ్ఞానంతో.
  మనస్తత్వాలు అర్థం చేసుకోడానికి పనికొస్తాయి అనిపిస్తోంది. వాటి ప్రయోజనం అంతే.

  మెచ్చుకోండి

 2. ఇష్ట సఖి కీ, ప్రియ సఖి కీ ఉన్నంత తేడాలా ..పారదర్శకంలా.. దూరం,కాలం, అందుబాటు, అవసరం ..చాలా విషయాలను నిర్దేశిస్తున్నంత .. కటినంగా.. సున్నితంగా కూడా.. భలే రాసేరు మాలతి గారూ, డిజిటల్ ఫోటో ఫ్రేం లా ఒక బొమ్మ పోయి మరోటి వచ్చినట్లు.. కానీ నిజంగా అంత సులభమా.. ఇష్ట సఖులు దూరమైతే కష్ట పడకుండా ఉండటం..??

  మెచ్చుకోండి

 3. మధురవాణి, మీలాటివారిదృష్టిని ఆకర్షిస్తుందనే ఆ ప్రశ్నతో మొదలుపెట్టేను. అందులో అన్ని కోణాలూ రావాలని నాకోరిక. మీరు చెప్పండి మీజవాబు. వచ్చే మార్పులో చర్చించుదాం అనుకుంటున్నా.
  ప్రియసఖి కూడా బాగుంది, కష్టసఖి కాలేదు కదా :p

  మెచ్చుకోండి

 4. <<“అసలు ఎవరికైనా మరొకరంటే ఎందుకు ఎలా ఇష్టం కలుగుతుంది?”
  చెప్పండి చెప్పండి.. జవాబు చెప్పండి.. 😀

  చాలా చాలా బాగుంది. నన్ను బోల్డు ఆలోచనల్లోకి నెట్టేసింది మీ 'ప్రియసఖి' 🙂

  మెచ్చుకోండి

 5. @ లలిత (తెలుగు4కిడ్స్) -:))

  @ ఉదయరాణి, enkolaga feel avutaremo kada. లేదులెండి. ఇంకోలా ఫీలవను. ఒకే వేవ్ లెంత్ లో ఉంటే బాగుంటుంది నూటికి 90 శాతం అలా జరగదేమో.

  @ కొత్తపాళీ, అవునండీ, చాలామందికి అవును అంతే కదా అనిపించే భాగమే ఎక్కువనుకుంటా. థాంక్స్.

  మెచ్చుకోండి

 6. malathi—- garu anakapote enkolaga feel avutaremo kada— nijanga estashakhi chaduvutunte
  naa feelings nenu rayalekapoyina feelings meeru chepputunnarannatlu anipinchindi
  manaku enkokarante estamu or kopamu enduku vastayante— ee paristhito lonina eduti vyakti manaku lage spandiste—- ante mana mind tune edutivalla mind tune oke wave length lo vunte—–

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.