ఊసుపోక – వెనక్కి చూడ్డంలో సొగసులు

(ఎన్నెమ్మకతలు 90)

వెనక్కెందుకూ చూడ్డం, మనకి కళ్ళు వెనక్కున్నాయా? లేవు కదా. మహాశివుడికి నుదుట ఉంటుందిట మూడో కన్ను. భృగు మహర్షికి అరిపాదంలో ఉండేదిట ఓ కన్ను. అదెలా వచ్చిందో తెలీదు కానీ శ్రీమహా విష్ణువు ఆ కంటిని మూసేసిన కథ భలే ఉంటుంది. కదాచితుగా కొందరికి కళ్ళు నెత్తికెక్కేయంటారు, ప్రతీత్మాకంగా అయిఉండొచ్చు. కానీ ఎవరికీ ఎప్పుడూ కళ్ళు నెత్తివెనక ఉన్నట్టు వినలేదు యావత్ సృష్టిలోనూ. ఎందుకంటారు? మనం చూడవలసింది ముందుకి కానీ వెనక్కి కాదు కనక అని పురోగాములు వాదించొచ్చు.

మరి వెనక్కి చూడకుండా మనగలమా? అసలేం జరిగిందంటూ మొదలు పెట్టగానే మనం చెప్తున్నది వెనకటి కథే కదా. అలాగే అనగా అనగా అన్నా పూర్వకాలం శుకుడు శౌనకాది మహాఋషులకు అని మొదలు పెట్టినా చెప్పేవి వెనకటికథలే కదా. పోనీ, నిన్నా మొన్నా జరిగినసంగతులు మాటాడ్డం వేరూ, ముప్ఫై ఏళ్ళక్రితం సంగతులగురించి మాటాడ్డం వేరూ.

వారంరోజులక్రితం ఓ స్నేహితురాలు వాళ్ళ నాలుగేళ్ళ పాపని తీసుకొచ్చింది మాయింటికి. మేం ఏటిఒడ్డున నడుస్తుంటే, ఆ పాప “నాచిన్నప్పుడు” అని మొదలుపెట్టింది. నిజంగానే! ఆ పాప చెప్పిన కబుర్లు మరిచిపోయేను కానీ ఆ ప్రారంభం మాత్రం గుర్తుండిపోయింది.

అమెరికా మరియు ఇతరదేశాల్లో ఉన్న తెలుగువాళ్ళు అమితోత్సాహంతో సాహిత్యం సృష్టించేస్తున్నారు “మేం రచయితలం కాం” అన్నవారితో సహా. తదితర రచయితలు కొందరు ఈ డయాస్ఫొరా సాహిత్యంలో ఏంవుంది ఎంతసేపూ వాళ్ల చిన్నప్పటి ఊరూ, తాత ముత్తాతల కబుర్లూ, గతకాలపు స్మృతులే కదా అంటున్నారు. ఇలా అన్నవారినందర్నీ నిగ్గదీసి అడగాలనిపిస్తుంది నాకు. ఏమనా? మీ చిన్నప్పటి ఫొటోవో ఇల్లో స్నేహితుడో కనిపిస్తే మీమనసు ఎగిరిపడదా? పోనీ, కనీసం ఉలికిపడదా? అవును సుమా ఆరోజులు మరిచేపోయేను అనిపించదా?

వెనక్కి తిరిగి చూసుకోడం ఎందుకో చెప్తాను. ఇలా కేవలం అదొక మధురస్మృతి అనే కాదు. మనం ఎక్కడినుంచి వచ్చేమో తెలుసుకోడంకోసం. గతం తెలిస్తే కానీ భవిష్యత్తు తీరిచి దిద్దుకోలేం. అమెరికావో, రష్యావో, బ్రిటనో గొప్ప చరిత్ర సృష్టించిందని వారి చరిత్ర, సాహిత్యం, సంగీతం తెలుసుకుని ఆనందించే ఉత్సాహంలో మనకీ ఓ చరిత్ర, సాహిత్యం, సంగీతం … ఉన్నాయని గుర్తించకపోవడం శోచనీయం.

ఇదంతా ఎందుకొచ్చిందంటే, ఈమధ్య ఓ స్నేహితురాలు మీ ఎడ్రెసివ్వండి, చక్కగా కలంతో కాగితంమీద రాస్తాను అనడంతో. నిజమే, ఇమెయిలులు, చాటులు, విడియో చాటులు, టెక్స్టింగు … ఇన్న సౌకర్యాలున్న ఆధునిక యుగంలో చేత్తో ఉత్తరం రాయడమేమిటి ఎవరైనా వింటే నవ్విపోతారు అని అనుకుని నవ్వుకునేవారు ఉంటే ఉండొచ్చు గాక. నాకు మాత్రం అర్థమయింది ఆ ఆలోచనలో ఆంతర్యం. టకటక నాలుగు ముక్కలు కీలు కొట్టి సెండు కొట్టేసి మరో పనిలోకి మళ్ళడం ఒక ఎత్తు. తీరిగ్గా కూర్చుని అనేక రకాలు ఆలోచనలు సావధానంగా కూడదీసుకుని కాగితంమీద పెట్టి, ఓపిగ్గా ముందు రోజు ప్రత్యేకం దానికోసం బజారుకెళ్ళి కవరు కొనుక్కొచ్చి దానిమీద ఎడ్రెసు రాసి, స్టాంపు అతికించి పోస్టాఫీసుకో పోస్టు డబ్బాకో వెళ్ళి ఉత్తరం పోస్టు చెయ్యడం ఒక ఎత్తు. ఈ రెండో తంతులో వెచ్చించిన కాలం ఆవ్యక్తికి చేస్తున్నపనిమీద గల శ్రద్ద కూడా కనిపించదూ? మళ్ళీ జవాబుకోసం ఎదురు చూడ్డంలో కూడా అంతటి ఆత్మీయతలూ అంతఃకరణలూ కనిపిస్తాయనే నా నమ్మకం. ఈనాటి స్పీడు బతుకులకి ఇదొక మంచి మందు, విరుగుడు. వెనకటి రోజుల్లో ఉత్తరాలు రాయడం కూడా ఒక కళ. అందుకే కొందరు పెద్దల ఉత్తరాలు పుస్తకరూపంలో నిక్షిప్తం చేసేరు.

మాఅమ్మాయి అప్పుడప్పుడు నాకు నచ్చుతాయనుకున్న సినిమాలు చెప్తుంది. ఈమధ్య అలా చెప్పిన సినిమా ద ఆర్టిస్ట్. మళ్ళీ నిన్న పిలిచి చూసేవా, ఇంకా లేదా అనడిగింది. చూడలేదంటే, “సరే, నేను డివిడీ పంపిస్తాను. ఇంట్లోనే కూచుని చూసుకోవచ్చు,” అంది. ఇంతకీ ఈ సినిమా విశేషం ఏమిటంటే మూడున్నాయి. ఒకటి – ఈనాటి రంగులలోకంలో ఇది నలుపు తెలుపు చిత్రంగా నిర్మించింది. రెండు – ఈనాటి సినిమాలు నానారకాల భాషలతో, అవాచ్యాలతో వీరాంగం వేస్తున్న సందర్భంలో మాటలు, పాటలు లేకుండా తీసినది. అంటే వెనక్కి చూడ్డం ఎందుకు అనేవారందరికి ఇది సినిమా చరిత్రని వందలేళ్ళు వెనక్కి తిప్పడమే అనొచ్చా? రాదు. ప్రేక్షకులూ, సినీవిమర్శకులూ ఎంతో మెచ్చుకుంటున్నారు ఈ సినిమాని. ఇదే మూడో విశేషం.

ఈ సినిమా మాటలు లేకుండా, రంగులు లేకుండా, ఈనాటి ప్రేక్షకులని అలరించేలా తీసేరంటే ఆనాటి సాంకేతిక పరికరాలని ఆధునికం చేసేరనే కదా. అలాగే ఈమధ్య వచ్చిన శ్రీరామరాజ్యం కూడా చాలా చాలా పాతకథే అయినా చాలామంది మెచ్చుకున్నది కద.

అంచేత, వెనక్కి తిరిగి చూసుకోడంలో తప్పు లేదు. అక్కడ నేర్చుకున్న పాఠాలని ఈనాడు మన జీవితాలకి అన్వయించుకోగలిగినవి అన్వయించుకుని బతుకులు తీరిచి దిద్దుకోడంలో ఉండాలి మన నేర్పు. నామాట నమ్మకం లేకపోతే, ఓమారు ప్రయత్నించి చూడండి.

తాజాకలం- నేను నాకథలు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటాను. అలా చూసుకున్నప్పుడు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి కూడాను, అక్షరదోషాలు మాత్రమే కాదు. ఇది ప్రత్యేకించి రచయితలకి నా సూచన -:)

(జనవరి 22, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “ఊసుపోక – వెనక్కి చూడ్డంలో సొగసులు”

 1. @ లలిత (4కిడ్స్), మీ స్పందన బావుందండీ.
  @ కుమార్ యన్, సరే. చూసి చెప్పండి మీ అభిప్రాయం.
  @ ఉష, antidoteకి విరుగుడు, నిజమే. చూశారా, తెలుగు వాడకపోతే ఎలా మరిచిపోతామో. ఇలా అడిగో, జ్ఞాపకం తెచ్చుకునే వాడుతుంటే మనకీ, ఆసక్తి గలవారికీ కూడా ఉపయోగిస్తాయి. అంచేత నేను వీలయినంతవరకూ తెలుగే వాడదలుచుకున్నాను, కష్టపడి అయినా. మీ స్పందనకి ధన్యవాదాలు.
  @ ఉదయరాణి, పాస్ట్ వేరు, బాక్ వేరు – బాగా చెప్పేరు.
  @ లక్ష్మీ రాఘవ, అవునండీ, కథలు రాయాలి ముఖ్యంగా మన మౌలిక విలువలు మన నిత్యజీవితాల్లో ఎలా ప్రతిబింబించేయో.
  @ లలిత, ధన్యవాదాలు మీస్పందనకి.
  @ జ్యోతిర్మయి, ధన్యవాదాలు మీస్పందనకి.

  మెచ్చుకోండి

 2. malathi garu,
  ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయాను .నిజంగా ఉత్హరాలు ఇచ్చిన కిక్కు మెయిల్ లో రాదు ..గతాన్ని తలచుకుంటే ..అప్పటి అఆలోచనలు కూడ ఎంత ప్రేమగా వుండేవి అనిపిస్తుంది ..మీరు అందరిని వెనక్కి మల్లిన్చేస్తున్నరండి. కథలుగాకుడా రాసుకోవచ్చు .

  మెచ్చుకోండి

 3. బాగుంది మీ ఊసు. very true, nothing is as rich as one minute ago. I can recapture it in words, and re-live in it to my heart’s content. And, in my opinion, recapturing and projecting the past in an enchanting way is the prime function of writing. వెనక్కి చూడటం లోని సొగసులు రచయితలికి మరింతగా కనిపిస్తాయి. మీరన్నదే నేనూ చెప్పటానికి ఆ మాట. ఇక ఉత్తరాల అలవాటు ఇంకా పోని కొద్దిమందిలో నేనూ ఒకర్ని 🙂 “ఉత్తరం రెండు మనసుల మధ్య విరిసే ఇంద్రధనుస్సు…” సాక్షి ఈ-పేపర్ లో డా|| గోపరాజు నారాయణ రావు గారి ‘ఉత్తరాల తీగ’ లో వాక్యమిది. “antidote” అంటే విరుగుడు/బేధి కావచ్చు. మీ ‘తాజాకలం’ తడారనీయం, తప్పనిసరిగా పాటిస్తాము.

  మెచ్చుకోండి

 4. The Artist is the best movie అండీ.
  చూద్దాం చూద్దాం అనుకుంటూంటే అస్సలు కుదరట్లేదు. థాంక్స్ బాగా గుర్తు చేసారు. త్వరపడాలి

  మెచ్చుకోండి

 5. “You look at where you’re going and where you are and it never makes sense, but then you look back at where
  you’ve been and a pattern seems to emerge. And if you project forward from that pattern, then sometimes you can come up with
  something.”
  ఈ మధ్య నేను చదివి, ఆలోచించిన ప్రతిసారీ అలా మళ్ళీ మళ్ళీ నా ముందు నిలబడి నా ఆలోచనలకి భాష్యం చెప్తున్న పుస్తకం Zen and the art of Motorcycle Maintenance లోవి ఈ మాటలు. దీని మీద ఆ పుస్తకంలో ఇంకా వివరణ ఉంది. అంతే కాదు ఏ కొన్ని మాటలు quote చేసినా మొత్తం పుస్తకం, జీవితానుభావాల ద్వార అర్థమైన (అర్థం అయ్యాయి అనుకుంటున్న) విషయాలు అన్నీ కలిసి ఆ మాటల అర్థం నాకు గోచరమయ్యేలా చేస్తున్నాయి కనుక నేను నా మాటలలో ఇంకా ఇప్పుడే వివరించలేను.
  సారాంశం, మీ వ్యాసం కూడా నా ఆలోచనలను తడుతోంది అని.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.