మార్పు 24

“లీల గారిని కూడా తీసుకొచ్చేను మీరేం అనుకోరని,” అంది అరవింద లోపలికొస్తూ.

నేను నవ్వి, “రండి,” అన్నాను తలుపు బార్లా తీసి, పక్కకి నిలబడి, వాళ్ళకి దారిస్తూ.

“కాఫీ, టీ?”

“ఏమీ వద్దండీ. మీరు కూచోండి. ముందు మాటాడుకుందాం.”

“అయితే బాల్యవివాహాలకి కారణం తురుష్కుల దండయాత్రలంటారా?”

“నేనలేదు. అలా ఒక వాదన ఉంది అన్నాను. ఆమధ్య ఒక అమ్మాయి విశ్వనాథ సత్యనారాయణగారి వేయి పడగలు చదివేననీ, అందులో ఆయన బాల్యవివాహాలగురించి రాసింది చదువుతుంటే చిన్నపిల్లలకి పెళ్ళి చేయడం మంచిదేమోనని నమ్మేస్తాం అంది. అది ఆయన వాక్చాతుర్యం అనుకో. కానీ నిజంగా అది మంచిదే అని నమ్మేరు ఆరోజుల్లో మరి. ఆలోచిస్తే నాకు మాత్రం అది ఒక సాకు అనిపిస్తోంది. ఇది ఒక్క మనదేశంలోనే కాదు కదా ఇతరదేశాల్లో కూడా చేస్తున్నారు కదా ఈ పిల్లలపెళ్ళిళ్ళు. ఇప్పటకీ, ఇరవైఒకటో శతాబ్దంలో కూడా జరుగుతూనే ఉన్నాయి.”

“ఎంచేతంటారు?”

“మ్. కనీసం ఇవి మధ్యయుగంలోనే ప్రారంభించినట్టు కనిపిస్తోంది.  వైదికాచారాల్లోనూ, పురాణాల్లోనూ ఆడపిల్లలు ఎదిగినతరవాతే పెళ్ళిళ్ళు అయిన్నట్టు చదువుతున్నాం. మను ధర్మశాస్త్రంలో ఎనిమిది రకాల పెళ్ళిళ్ళు – బ్రహ్మ, దైవ, స్వయంవరం, గాంధర్వం, పైశాచం అంటూ లెక్కలేసేరు కానీ వీటిలో బాల్యవివాహం ప్రసక్తి లేదు కదా.  మేధావులు ఒకరో నలుగురో కలిసి నానారకాల లెక్కలూ వేసి, కిందా మీదా పడి శాస్త్రాలూ, చట్టాలూ తయారు చేసేస్తారు. వాస్తవంలో పరిస్థితులనిబట్టీ, అవసరాలనిబట్టి ఆచారాలు ఏర్పడతాయి.”

“అవసరమేమిటండీ?”

“ఇప్పటికీ చిన్నపిల్లలకి పెళ్ళి చెయ్యడం చదువు, డబ్బు లేని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తోంది కదా. చదువుంటే పిల్ల చదువుకుంటోంది కానీలే, అది అయింతరవాత చూద్దాం అని పెళ్ళి వాయిదా వేయొచ్చు. అలాగే చదువుకుంటున్న అబ్బాయివిషయంలో, అతనిచదువు అయి, ఉద్యోగం వచ్చేక చూద్దాంలే అని వాయిదా వేస్తారు.”

“మరి ఆడపిల్లల ఇష్టాయిష్టాలు కనుక్కోడం ఎప్పుడు మొదలయిందంటారు?”

“అదీ అంతే. మరీ చిన్నపిల్లలప్పుడు వాళ్ళకేం తెలీదు కదా. అంచేత తల్లిదండ్రులు  ఏవో కొన్ని ప్రమాణాలు పెట్టుకుని – జాతకాలూ, అవతలివారి ఆస్తిపాస్తులూ, సంఘంలో వారి పరపతీ – ఇలాటివి చూసి పెళ్ళిళ్ళు నిర్ణయించేరు. క్రమంగా పిల్ల వయసు ఆరూ, పదీ, పన్నెండూ, పదహారూ, పద్ధెనిమిదీ, ఇరవై – ఇలా పెరుగుతున్నకొద్దీ ఆమె అభిప్రాయాలు కూడా కనుక్కునే స్థితి వచ్చింది.”

“ఏమిటో ఇక్కడ ప్రతివారూ మన పెద్దలు నిర్ణయించి చేసే పెళ్ళిళ్ళగురించి అడగడం, ఎవరైనా అవును మాది పెద్దలు చేసిన పెళ్ళే అంటే అదిరిపడ్డం అదేదో మహా నేరం అయినట్టు చూస్తే, కానీ అలా చేసుకున్నవారు కూడా బాగానే ఉన్నారు కదా. మా అమ్మా, నాన్నా చూడరాదూ,” అంది అరవింద ఆలోచిస్తూ.

“నిజానికి పెళ్ళి ఎలా జరిగిందన్న ప్రశ్న కంటే పెళ్ళయినతరవాత ఆ వైవాహికజీవనం ఎలా కొనసాగించడం, ఒడిదుడుకులు వస్తే ఎలా తట్టుకు నిలబడడం అన్నది ఎక్కువ ముఖ్యం. వాటికి అంత తేలిగ్గా సమాధానాలు దొరకవు. అందుకే అది నిలబెట్టుకోడం అంత కష్టం. మన పూర్వులు అది గ్రహించి దానికి తగ్గట్టు వాళ్ల జీవితాలు మలుచుకున్నారు,” అన్నాను.

“వాళ్ళది పెద్దలు నిర్ణయించి చేసేందని మీఅమ్మ చెప్పిందా?” అంది లీల.

“ఏం? కాదా?” అంది అరవింద ఆశ్చర్యపోతూ.

లీల నావేపు చూసింది, “మీరు చెప్పండి,” అన్నట్టు.

“అవుననుకుంటే అవును, కాదనుకుంటే కాదు,” అన్నాను తికమకగా.

“అదేమిటి? నేను పెద్దలు చేసిన పెళ్ళి అనే అనుకున్నా.”

“నువ్వు అడిగేవా?”

“లేదు. నాకసలు అడగాలన్న ఆలోచనే రాలేదు.”

“మీ అమ్మ సవితి అన్నగారు ఒకాయన ఉన్నారు, నీకు తెలుసా?”

“లేదు. అమ్మ ఎప్పుడూ చెప్పలేదు.”

“అదొక వింత కథ. మీఅమ్మా, నాన్నలసంబంధం నిశ్చయం అయినప్పుడు జాతకాలూ, కులగోత్రాలూ అన్నీ సవ్యంగానే ఉన్నాయి. తీరా తాంబూలాలు పుచ్చుకున్నాక, ఆ అన్నగారు కాలేజీలో పాఠాలు చెప్పేరోజుల్లో తనదగ్గర చదువుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నట్టు వీరికి తెలిసింది. ఆయన ఈ చెల్లెలిపెళ్ళి అయేక ప్రకటించుదాం అనుకున్నారుట. కానీ వీళ్ళ పెళ్ళికి ముందే ఆవార్త పొక్కింది. దాంతో కులహీనం పిల్లని చేసుకుంటున్నఇంటిపిల్ల నాకోడలు కాడానికి వీల్లేదంటూ మీతాతగారు చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు.”

“తాతగారే!” అంది అరవింద నమ్మలేనట్టు.

“ఆహా మీ తాతగారే. ఆ పెళ్ళి చేసుకుంటే మళ్ళీ గడప తొక్కనీయను, నాకు కూతురే లేదనుకుంటాను, కాశీకి పోతాను, గంగలో దూకుతాను, అంటూ పెద్ద రగడ లేవదీసేరు.”

“నేనింకా అమ్మమ్మకే అభ్యంతరం ఉంటుందనుకున్నా. మామూలుగా పూజలూ, వ్రతాలూ, నోములూ అంటూ సంప్రదాయ పరిరక్షకులు ఆడవాళ్ళే కదా.”

“అదే మరి ఆశ్చర్యం. పైకి కనిపించే సంప్రదాయరక్షకులు ఆడవాళ్ళే. తామేదో మహా అభ్యుదయవాదులం అంటూ ఘోషించే మగవాళ్ళలో చాలామంది తమయింట్లో ఆ గీటు దాటితే ఏమాత్రం సహించలేరు.”

“మీరేదో స్త్రీవాదుల్లా మాటాడుతున్నారు.”

“అదుగో, అదే వద్దంటున్నా. నేనే వాదాలు మాటాడ్డంలేదు. నాకు తెలిసినప్రపంచంలో నేను చూసిన విషయాలు చెప్తున్నా. అంతే. నాకు తెలిసిన ప్రపంచం ఎంత కనక సిద్ధాంతాలు చేసేయడానికి. వాదాలు పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టుంటాయి వాదనలు. ప్రతి మనిషికీ ఎవరి పరిస్థితి వారిదే, వారికి వారే ఆలోచించుకుని నిర్ణయించుకోవాలని నా సిద్ధాంతం. అంచేత నాసిద్ధాంతం ఏ సిద్ధాంతాల్లోనూ ఇమడదు. నీమటుకు నువ్వు నీకు తెలిసిన ప్రపంచం చూడు. ఆతరవాత నీకు తోచినట్టు నువ్వు నిర్ణయించుకో.”

అరవింద ఆలోచనలో పడింది.

“అసలు ఒకొకళ్ళు ఒకొక సందర్భంలో ప్రవర్తించేతీరు చూస్తే వీళ్ళేనా అని ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ మీతాతగారు చేసిన ఆర్భాటం ఇంతా అంతా కాదు. సరేనా, అక్కడ ఆ అన్నగారేమో ఆ అమ్మాయి మనింటికొచ్చింది కానీ మనం వాళ్ళింటికెళ్ళడం లేదు,  పైగా నాది అనులోమం, శాస్త్రాలు కూడా ఆమోదించేయి అంటూ వాదించేరుట.”

“అదేమిటి?”

“మగవాడికంటే కులంలో, ఆస్తిలో తక్కువగా ఉండాలి. అది అనులోమవివాహం. అంతే కాదు, తన పిల్లలవంతు వచ్చేవేళకి మళ్ళీ తనవాదనలు సవరించుకుని, అందరికీ సలక్షణంగా కులగోత్రాలు చూసి మరీ చేసేరు పెళ్ళిళ్ళు.”

“ఘోరం. తనకి పనికొచ్చింది కానీ తనపిల్లలకి పనికి రాలేదా కులాంతరం?”

“అదే నేననేది కూడా. ఎవరికి గానీ వాళ్ళు చేసింది ఒప్పు. దాన్ని సమర్థించుకోడానికి సవాలక్ష కారణాలు చూపిస్తారు. అదే మరొకరు చేస్తే తప్పు.”

“అయితే మరి మాఅమ్మా నాన్నలపెళ్ళి ఎలా అయింది?”

“ఓ శుభముహూర్తాన ఎవరికీ చెప్పకుండా వాళ్ళిద్దరూ వెళ్ళి సింహాచలంలో పెళ్ళి చేసుకు వచ్చేశారు. ఏడాదిపాటు మీ తాతగారు మీఅమ్మని గుమ్మంలో అడుగు పెట్టనియ్యలేదు.”

“ఏడాది అంటే అప్పటికి నేను పుట్టిఉండాలి.”

“అవును. నువ్వు పుట్టేవేళకి, ఆడపిల్ల, తొలికానుపు పుట్టింట్లోనే జరగాలి, మీకిష్టం లేకపోతే మీరీగదిలోకి రాకండి అంటూ మీ అమ్మమ్మ మీఅమ్మని ఇంటికి తీసుకొచ్చింది. నిన్ను చూసేక మీతాతగారు శాంతించేరు.”

“ఆహా, నాకారణంగా మళ్ళీ ఆయింట్లో శాంతి ఏర్పడిందన్నమాట.”

“అవును. కారణజన్మురాలివి.”

“ఇంతకీ మీ పెళ్ళి ఎరేంజుడేనా?”

ఉలికిపడ్డాను, “నాదా? … నాది డిరేంజిడు.”

అరవింద అయోమయంగా చూసింది నావేపు.

“బాగా అన్నారు,” అంది లీల.

కొంచెంసేపు ఎవరం మాటాడలేదు.

“నిజానికి నూటికి తొంభై పాళ్ళు అందరివీ అంతేనేమోలెండి,” అంది లీల మళ్ళీ.

“ఎందుకలా అంటారు?” అని అరవింద, కాస్త సందేహిస్తున్నట్టు నెమ్మదిగా, “మీరిద్దరూ విడిపోయారంటే మేం అందరం నమ్మలేదు,” అంది.

“అవును. నాకే నమ్మకంగా లేదు. నేనే ఇలా చేసేనా అని,” అంది లీల.

“ఎలా చేసేరేమిటి?” అంది లీల.

“మీరు చెప్పినట్టే ఒకో ఇంట్లో ఒకో రకం. మాపెద్దక్క పెళ్ళి తేలిగ్గానే అయిపోయింది మా చిన్నమామయ్యతో. చిన్నక్కకి సంబంధాలు చూస్తున్నారు. ఇంకా నావంతు రాలేదు కదాని నేను ఇంటరు తరవాత బి.ఎ. తరవాత యమ్మే కూడా చేసేను. అప్పటికీ చిన్నక్కకి సంబంధం కుదరలేదు. మా అన్నయ్య కూడా చెల్లెలిపెళ్ళి అయితే కానీ చేసుకోనని తను కూడా పెళ్ళి సంబంధాలు తిరగ్గొడుతూ వచ్చేడు. నాకు ఈ తంతంతా మహా చిరాకనిపించింది. అప్పటికి ఉద్యోగంలో చేరేను. కొంతకాలం అయేక ఏదో పేపరు చూస్తుంటే ఒక పెళ్ళి ప్రకటన కనిపించింది. పెళ్ళికొడుకు అమెరికాలో ఉన్నాడనీ, అమెరికాలో కాపురం పెట్టే ఆసక్తి ఉన్నవాళ్ళు తమ వివరాలు తెలియజేయవలసింది ఫొటో జరపరుస్తూ అని. అప్పటికి ఇలాటి ప్రకటనలు ఇంకా కొత్త. నాకెందుకో అది తమాషాగా అనిపించింది. చూద్దామని నేను జవాబు రాసేను,” లీల ఆగింది.

అరవింది ఆశ్చర్యంగా చూసింది, “మీరా?  నిజంగానే?”

“ఏం? ఎందుకంత ఆశ్చర్యం? ఆ ప్రకటన రావడం ఆశ్చర్యం లేదా, నేను జవాబిస్తే ఆశ్చర్యంగా ఉందా?”

“అది కాదండీ, మీరు అంత సంప్రదాయకంగా కనిపిస్తారు,” అంది అరవింద నసుగుతూ.

“స్వయంవరం సంప్రదాయంలో భాగమేనని ఇందాకా మీరు చెప్పేరు కదండీ,” అంది నావేపు తిరిగి.

“చెప్పేను. నేను లీలగారి తరుఫే,” అన్నాను నవ్వుతూ.

“భలేవారే. నేను మాత్రం లీలగారి తరుఫు కాదేంటి,”

“మరెందుకు ఆంత ఆశ్చర్యం ప్రకటించేవు?”

“అది కాదు, ఆరోజుల్లో, మనదేశంలో ఆడపిల్లలు పెద్దలంటే చాలా భయభక్తులనీ, వారికి ఎదురు చెప్పరనీ, వారినిర్ణయాలకి కట్టుబడి ఉంటారనీ … ఇలా అనీ అనీ చాలా అన్నారు కదా. ఇక్కడ అమెరికాలో కూడా అదే అభిప్రాయం కదా. పైగా మీరేమో పైకి చాలా అమాయకంగా, సాత్వికంగా కనిపిస్తారు ..” అరవింద చప్పున నాలుక కరుచుకుని ఆగిపోయింది.

“ఇంతసేపూ నేను పెట్టిన పాఠం అంతా ఏమయిపోయింది?” అని చిరుకోపం ప్రదర్శించేను నేను.

“సరేనండీ. నాదే పొరపాటు. క్షమించండి. సరే మీ కథ కొనసాగించండి. మీజవాబుకి వాళ్ళు ఏం సమాధానం ఇచ్చేరు? ఆ ప్రకటనవరుడి సంగతి ఏమయింది?”

“ఒకవిదంగా నువ్వు చెప్పింది నిజమే. ఏదో ఆ క్షణానికి అలా సాహసం చేసినా, మళ్ళీ చిన్నభయం కూడా వేసింది. అందులో ఏం మోసం ఉందో, ఎలాటి చిక్కుల్లో ఇరుక్కుంటానో అని. నేరకపోయి ఉత్తరం రాసేను, ఫొటో కూడాను. ఆఖరికి ఇంక ఆగలేక మాఅన్నయ్యకి చెప్పేను కూడా నేను చేసిన పని.”

“తెలివితక్కువ పని అని తిట్టేరా?”

“లేదు. మంచిపని చేసేవు. రాసేముందు నాకు చెప్పలేకపోయేవా? పోనీలే. నేను కనుక్కుంటాను అన్నాడు.”

“కనుక్కుని పెద్దలు నిర్ణయించిన పెళ్ళి చేసేశారా?” అంది అరవింద రెండు చేతులతో గాల్లో కొటేన్లు పెడుతూ.

“లేదు,” అంది లీల నవ్వి.

“మరేమయింది త్వరగా చెప్పండి?”

“మాఅన్నయ్య కనుక్కునేలోపున ఆ తండ్రి మళ్ళీ నాకు ఉత్తరం రాసేరు. తమకి తెలీకుండా అబ్బాయి అమెరికాలో మరెవరినో చేసుకున్నాడని ఇప్పుడే తెలిసిందనీ, జరిగినదానికి విచారిస్తున్నాననీ, నాకు భవిష్యత్తులో మంచి సంబంధం రాగలదని ఆశిస్తున్నాననీ …”

“బాగుంది,” అంది అరవింద కానీ కథ అట్టే రక్తి కట్టనందుకు నిరుత్సాహం కలిగినట్టుంది కూడా. అది కప్పిపుచ్చుకుంటూ, “మరి సుందరంగారిని ఎప్పుడు కలిశారు? అదెలా జరిగింది?” అంది.

(జనవరి 25, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.