మార్పు 25

లీల కథ ఏమిటంటే –

వాళ్ళది పెద్ద కుటుంబం. యింట్లో అక్కలిద్దరూ, అన్నలిద్దరూ కాక చిన్నాన్నగారి అబ్బాయిలిద్దరు ఆయింట్లోనే పెరిగేరు. పెద్దన్నయ్యకి పెళ్ళయింది కానీ చిన్నన్నయ్య మాత్రం ఆడపిల్లలిద్దరికీ అయింతరవాత చేసుకుంటానన్నాడు. పెద్దక్కయ్యని చిన్నమామయ్యకిచ్చి పెళ్ళి చేసేరు. ఇరుగూ పొరుగూ ఉండేవాళ్ళు. అస్తమానం యింట్లోనే తిరుగుతండేవాడు. అందరితో సరదాగా కబుర్లు చెప్తూ, ఇంట్లో మనిషిలాగే తిరిగేవాడు.

పెళ్ళప్పుడు వాళ్ళకి పదహారూ, ఇరవైరెండూ వయసు. చిన్నమామయ్య బియే అయి, బిల్‌లో చేరేడు. అది అయింతరవాత, రెండేళ్ళూ కాలక్షేపం చేసి, ఆఖరికి, బొంబాయిలో ఏదో లా కంపెనీలో చేరేడు. బొంబాయిలో కాపురం పెట్టేరు. ముగ్గురు ఆడపిల్లలయేక, నాలుగో పురిటికి పెద్దక్కయ్య ఒక్కత్తినీ చేసుకోలేకుండా ఉన్నాను అని ఉత్తరం రాస్తే, అమ్మ చిన్నక్కయ్యని పంపింది. చెప్పలేదేమో చిన్నక్కయ్యది కమ్మని కంఠం. చక్కగా పాడేది. ఏదో ఇంటో కొంత పెళ్ళిసంగీతం చెప్పించినా, దానంతట అదే సాధన చేసుకుంటూ నేర్చుకున్నదే ఎక్కువ. చిన్నమామయ్య ఒకసారి విజయవాడ రేడియో స్టేషనుకి తీసుకెళ్ళి పాడించేడు కూడాను. అది బొంబాయి వెళ్ళేక అలాగే మద్రాసులో రేడియో స్టేషనులో ఆడిషనుంది అంటూ మద్రాసు తీసుకెళ్ళేడు పెద్దక్కయ్య పురిటికి సాయం చెయ్యడానికి వెళ్ళినప్పుడు. అలా రెండుమార్లయింతరవాత, మూడోమారు వెళ్ళినవాళ్ళు వారంరోజులయినా రాలేదు. అప్పట్లో ఇప్పటిలా ఫోనుల్లేవు కదా. ఏమయిందోనని అక్కయ్య గాబరా పడుతూ అమ్మకి కబురు చేసింది ఎవరో బొంబాయినించి వస్తున్నారంటే వాళ్ళచేత. చిన్నన్నయ్య ముందు బొంబాయి వెళ్ళి కొంత సమాచారం సేకరించేడు. పెద్దక్కయ్యకి మొదట్లో చిన్న అనుమానంలాటిది వచ్చి, తరవాత గట్టి అనుమానం అయింతరవాత చిన్నక్కయ్యని వెనక్కి వెళ్ళిపోమందిట. అప్పుడన్నమాట, మద్రాసుకి ఆ మూడో ప్రయాణం.

మద్రాసులో ఏవో రెండు రేడియో ప్రోగ్రాములు ఇవ్వగలిగింది. రెండు డబ్బింగు సినిమాల్లో రెండు పాటలు పాడింది. దాంతో మామయ్య తనని మహాగాయనిని చేసేస్తున్నాడన్న ఆనందంతో పెళ్ళికి ఒప్పుకుంది. అమ్మ హడావుడిగా మద్రాసు వెళ్ళి తమ్ముడినీ, కూతురినీ తిట్టి, కొట్టినంత పని చేసి ఆ పెళ్ళి రద్దు చేయించడానికి ప్రయత్నించింది కానీ ఇద్దరూ మొండికేసేరు. మామయ్యేమో దాన్ని కూడా రమ్మను, ఇద్దర్నీ చూసుకుంటాను అన్నాట్ట. చిన్నక్కయ్యేమో అవును, నాకెలాగా సంగీతకార్యక్రమాలతో పిల్లల్ని కనే తీరికుండదు, అక్కయ్య పిల్లలతో వచ్చేస్తే, దానిపిల్లల్నీ కూడా మేం చూసుకుంటాం. దానిపిల్లల్ని నాపిల్లల్లా చూసుకుంటాను అంది. పెద్దక్కయ్య మొదట కొంతకాలం గోడుగోడున ఏడవడం, మొత్తుకోడం అయింతరవాత పోన్లెద్దూ నాచెల్లెలే కదా, పరాయిఆడదయితే నేనూ, పిల్లలూ దిక్కూ మొక్కూ లేకుండా పోయేవాళ్ళం అనీ నానారకాల వ్యాఖ్యానాలూ చెప్పుకు సమాధానపడింది.

ఈ గొడవలన్నిటితో లీలపెళ్ళి ప్రస్తావన మరీ గందరగోళం అయిపోయింది.  దీనికి పెళ్ళెలా అవుతుందంటూ అమ్మ రాగాలూ, దీన్ని కూడా ఆ తమ్ముడికే ఇచ్చి చేసేస్తే పోలే ఇంటా బయటా అవహేళనలూ, ఏమో, ఈ అమ్మాయికి కూడా అతనితో సంబంధం ఉందేమో అంటూ అమ్మలక్కలసూటీపోటీ మాటలూ … ఇలాటి దుర్భరసమయంలో ఈ సుందరంగారు ప్రవేశించేరు.

సుందరం మామూలుగానే ఎన్నారై సంప్రదాయాన్ననుసరిస్తూ నెలరోజులు శలవు పెట్టి వధువులవేటకి తెలుగుదేశంలో దిగేడు. వస్తున్నకారణం ముందుగా ప్రకటించేడు కనక అయినవాళ్ళు, కానివాళ్ళు, చుట్టాలూ, స్నేహితులూ ప్రతిఊళ్ళోనూ ఇద్దరు, ముగ్గురు వధువులని, మొత్తం పన్నెండుమందిని చూసి ఉంచేరు అతను విమానాశ్రయంలో దిగేవేళకి. అతనికి పెళ్ళి చేసి కానీ తిరుగు విమానం ఎక్కనివ్వనని శపథం చేసిన మిత్రుడొకడు విమానాశ్రయానికి స్వయంగా వచ్చి, సుందరాన్ని తీసుకెళ్ళి హోటల్ తాజ్‌లో మకాం ఏర్పాటు చేసి, పెళ్ళికూతుళ్లవివరాలు వల్లించేడు. పెద్దచదువు చదువుకున్న అమ్మాయి, కొంచెం చదువుకున్న అమ్మాయి, కూడబలుక్కుని ఇంగ్లీషు చదవగలిగిన అమ్మాయి, ఆస్తి గలవారి అమ్మాయి, లేనివారి అమ్మాయి, అందమైన అమ్మాయి, అందంగా ఉందని అనిపించుకోలేని అమ్మాయి, పొడుగు పిల్ల, పొట్టి పిల్ల, చక్కని కనుగవ గల పిల్ల, చక్కని కురుసంపద గలిగినపిల్ల … ఇలా అనేకానేక అర్హతలు సూచిస్తూ సుందరం మనోభావాలు కనుక్కున్నాడు.

ఆ తరవాత దేశాటనకి బయల్దేరేరు. గుంటూరులో అమ్మాయి బాగుంది కానీ ఇంకొంచెం పొడుగుంటే బాగుండు. విజయవాడ అమ్మాయి బియే పూర్తి చెయ్యలేదు. పూర్తయితే బాగుండేది. ఏలూరమ్మాయి కాస్త తెల్లగా ఉంటే బాగుండు. కాకినాడపిల్ల మరీ తెల్లటి తెలుపు పిండిబొమ్మలా. సామర్లకోట పిల్ల కట్టుకున్న ఇంకురంగు చీరె చూసేసరికి సుందరానికి మొహం తిరిగింది. ఇలా తిరిగి, తిరిగి ఆఖరికి లీలని చూసేడు. లీలని చూడగానే అతనికి అమ్మాయంటే ఇలా ఉండాలి అనిపించింది. అంతా బాగానే ఉంది, లీలని విడిగా ఓమారు కలుసుకుని మాటాడుకుంటే బాగుంటుంది అన్నాడు స్నేహితుడితో. స్నేహితుడు సరేనని వెళ్ళి, వాళ్ళతో మాటాడి లీలని తీసుకొచ్చేడు. వారిద్దరినీ మాటాడుకోమని చెప్పి, బయటికి వెళ్ళిపోయేడు.

ఇద్దరూ కొంచెంసేపు మాటాడలేదు ఏం మాటాడాలో తోచక.

సుందరమే ప్రారంభించేడు, “మీరు బియేతో ఆపేశారేం? మీకు పైచదువు చదవడం ఇష్టం లేదా?” అంటూ.

లీల క్షణం ఆలోచించి. “మీకు పెద్ద చదువులు చదివిన అమ్మాయి కావాలనుకుంటున్నారా?” అంది నెమ్మదిగా. నిజానికి అమ్మాయి చదువు విషయంలో అతనికి పట్టింపులేమీ లేవు. సంభాషణ మొదలు పెట్టడానికి అలా అడిగేడంతే. ఆమాటే చెప్పేడు.

“అదేం లేదండీ. మీకేమైనా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయేమోనని అడిగేనంతే. మిమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు మీరేం చదివేరో నాకు తెలుసు కద,” అన్నాడు తేలిగ్గా నవ్వుతూ.

అతనలా తేలిగ్గా మాటాడ్డం లీలకి నచ్చింది.

ఆతరవాత చాలా విషయాలు తేలిగ్గానే మాటాడుకున్నారు.

సుందరం సూక్ష్మంగా తనకుటుంబంసంగతి చెప్పేడు. తండ్రి చిన్నప్పుడే పోయేడు. తల్లి పోయేనాటికి తనకి పదహారేళ్ళు. ముగ్గురక్కచెల్లెళ్ళూ, ముగ్గున్నదమ్ములూ – అంతా ఎవరిబతుకు వారు బతుకుతున్నారు. అన్నదమ్ములకీ, అక్కచెల్లెళ్ళకీ చేతనయిన సాయం చేసేడు. ఇప్పటికీ చేస్తున్నాడు.

లీలకి ఆవిషయం విని సంతోషించింది. కుటుంబబాధ్యతలు తెలిసినమనిషి అనుకుంది. ఆ తరవాత ఇతర అభిరుచులూ, రుచులూ చర్చించుకున్నారు.

షేక్స్పియరిష్టమా? విశ్వనాథ సత్యనారాయణ ఇష్టమా?

షా నాటకాలు చదివేరా? తిరుపతి వెంకటకవులనాటకాలు చూసేరా?

ఇండియాలో తాజ్ మహల్ చూసారా? మహా బలిపురం దర్శించేరా?

అమెరికాలో డిస్నీలాండ్ చూసేరా? గ్రాండ్ కాన్యన్ ఎలా ఉంటుందో చెప్పగలరా?

ఇంగ్లీషులో మాటాడతారా? తెలుగులో సంభాషిస్తారా?

గుమ్మడికాయ ముక్కలపులుసు చెయ్యడం వొచ్చా? టొమెటో చారెంత బాగుంటుందో తెలుసా?

తలొంచుకుని కాలికింద రగ్గుకి కళ్ళప్పగించి కూర్చున్న లీల తలెత్తలేదు. ఆ ప్రశ్నకి ఏం జవాబు చెప్పడానికి మాటలు దొరకలేదు. అదేదో సినిమా డైలాగులా అనిపిస్తోంది ఏమాట తలుచుకున్నా. రెండు నిముషాలూరుకుని, “ఆఁ,” అంది. అదే ప్రశ్న తిరిగి అతన్ని అడగడానికి మాత్రం ఆమెకి ధైర్యం చాల్లేదు. నచ్చకపోతే అతనే చెప్తాడులే అనుకుని, “నేనింక వస్తా,” అంటూ లేచింది.

సుందరం కూడా లేచి, “తొందరగా వచ్చేయండి,” అన్నాడు నవ్వుతూ.

లీల గుమ్మందాకా వెళ్ళేక, సుందరం, “అన్నట్టు మరో మాట,” అన్నాడు.

లీల ఆగింది, “ఏమిటి?”

“మీ చిన్నమామయ్యకి ఇద్దరు భార్యులుట కదా?” అన్నాడు సుందరం చిరునవ్వుతో.

రాకూడదనుకున్న ప్రశ్న వచ్చింది. ఏం చెప్పాలో తోచలేదు. అవును, అయితే ఏం? నన్నెందుకు అడగడం? మీస్నేహితుడు చెప్పలేదా? అయితే మీకు నన్ను చేసుకోడానికి అభ్యంతరమా? నేనూ అలాగే చేస్తానేమోనన్న అనుమానమా? అవునంటే తప్పా? కాదంటే తప్పా? నాకు తెలీదంటే సరిపోతుందా? లీల తొట్రుపాటు కప్పిపుచ్చుకుని, అవును అనబోతుండగా, సుందరమే అందుకున్నాడు, “నేనిలా అడిగేనని మరోలా అనుకోకండి. నాకేమీ అభ్యంతరం లేదని చెప్పడానికే అడిగేను. ఆయన ఏపరిస్థితుల్లో చేసుకున్నాడో, పాపం, ఆయన అవుసరాలేమిటో, ఆలోచనలేమిటో … అవన్నీ ఇప్పుడు తవ్వి తీయాలని కాదు నా నేనడిగింది. అలాటి విషయాల్లో మనం ఉదారంగా ఆలోచించాలని నా అభిమతం. మీ కుటుంబరహస్యాలేవో దాస్తున్నానన్న న్యానతాభావం, అది బయట పడితే ఏం చిక్కులొస్తాయో అన్న భయంలాటివి లేకుండా ఉండాలనీ, ఆదిలోనే ఇది తేల్చేసుకుంటే ఇద్దరికీ మనశ్శాంతి అనీ అడిగేను. ఇలాటి విషయాల్లో మనకి సమదృష్టి అవసరమని నా నమ్మకం,” అన్నాడు.

అతని హృదయవైశాల్యానికి ఆవిడ ముగ్ధురాలయింది.

సుందరం చివరిప్రశ్న వేశాడు, “ఇవన్నీ ఎటు పడితే అటు తిప్పుకోగల విషయాలు. ప్రాథమికంగా కావలసింది నేను మీకు నచ్చేనా అన్నది?”

లీల నవ్వింది తృప్తిగా.

ఇంటికి రాగానే అమ్మా, చిన్నన్నయ్యా, “ఏమయిందేమయింది?” అంటూ చుట్టుముట్టేరు అమెని.

“ఏముంది అవడానికి? మాటాడుకున్నాం అంతే. మంచివాడిలాగే ఉన్నాడు,” అంది లీల పక్కగదిలోకి వెళ్ళిపోతూ.

మరోగంటకి సుందరం స్నేహితుడు వచ్చేడు. సుందరానికి లీల నచ్చిందనీ, పెళ్ళి మాత్రం ఈ శనివారమే చేసేయాలనీ చెప్పేడు. సుందరం పెళ్ళి చేసుకు వెళ్ళిపోతాడట. లేకపోతే, మళ్ళీ ఇప్పుడప్పుడే ఇండియా రావడం పడదు. ఆలోచించి చెప్తాం అన్నాడు చిన్నన్నయ్య.

“ఆలోచించడానికి టైము లేదండీ. మీరు సరేనంటే పెళ్ళి ఏర్పాట్లు మొదలు పెట్టేస్తాను,” అన్నాడు స్నేహితుడు.

సరేనంది అమ్మ.

ఆవిధంగా పెళ్ళి అయిపోయింది అట్టే ఆర్భాటం లేకుండా. అట్టే టైము లేదు కనక చాలామంది రాలేదు. అదీ మంచిదే అనుకున్నారు ఆడపెళ్ళివారు. మంది ఎక్కువయినకొద్దీ ఎవరేం మాట అంటారో అన్న బెరుకు కూడా ఎక్కువే అవుతుంది కదా.

పెళ్ళయిన రెండోరోజు సుందరం వెళ్ళగానే వీసాకి కావలసిన కాయితాలు పంపిస్తానని లీలకి చెప్పి శలవు తీసుకున్నాడు.

మరో రెండు నెలలకి లీల అమెరికాకి ప్రయాణమయింది.

000

“అయితే మీపెళ్ళి చాలా తేలిగ్గా అయిపోయింది. మీది విజయవంతమయిన వివాహాల్లో ఒకటనొచ్చు, పెద్దలు నిర్ణయించినదే అయినా,” అంది అరవింద.

“విజయవంతమయితే ఎందుకు వదిలేస్తానూ?” అంది లీల.

నేను మాటాడలేదు.

అరవింద కూడా తప్పు మాటాడేనేమో అనుకుని బాధ పడుతూ, “సారీ,” అంది.

“సారీ ఎందుకులే. నువ్వు కారణం కాదు కదా నాజీవితం ఇలా మలుపు తిరగడానికి.”

“నాకూ అదే అర్థం కావడంలేదు. మీరిద్దరూ కూడా తెలివైన వాళ్ళే కదా.”

“తెలివితేటలకీ, జీవితం సుఖవంతం చేసుకోడానికీ అట్టే సంబంధం లేదనుకుంటా.”

 

 

(జనవరి 30)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “మార్పు 25”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.