మార్పు 27

“పదండీ, అలా నడుస్తూ మాటాడుకుందాం,” అన్నాను, లీలమనసుకి నదీజలాలు తెరిపి ఇస్తాయేమోనన్న ఆశతో. “పదండి,” అంటూ ఇద్దరూ లేచేరు.

తీరాన నడుస్తున్నాం నెమ్మదిగా. లీల నెమ్మదిగా గతాన్ని గుర్తు చేసుకుంటూ నీటి అట్టడుగు పొరల్లోకి చూస్తున్నట్టు ఆగింది.

“ఇక్కడే నా మొదటి ఫొటో. సిమెంటు చెప్టాలా గడ్డ కట్టిన నదీజలాలమీద నేను నిల్చుని తీసుకున్న బొమ్మ మాఅమ్మకి పంపేను. “చూసేవా నేను నీటిమీద నిలబడగలను,” అని రాసేను ఉత్తరంలో. మాఅమ్మ నమ్మలేదు. “నువ్వసలే చలి ఓర్చుకోలేవు, ఎలా ఉన్నావో అనుకుంటున్నాను. నీళ్ళమీద నిల్చున్నావా?” అని రాసింది తిరుగుజవాబు! నిజమే. బక్కదాన్ని. చిన్న గాలి వీచినా ఎముకలు కొరికేస్తున్నట్టు ఉంటుంది. మళ్ళీ నాలుగు పేజీలఉత్తరం రాసేను నేను వేసుకున్న మణుగు బరువు ఉన్నికోటూ, బూటూ పట్టుపురుగు గూడులా వెచ్చగా ఉంటాయని వివరిస్తూ.

అసలు బయల్దేరేముందే మాఅమ్మ బాధ పడింది, “నువ్వసలే చలి ఓర్చుకోలేవు,” అంటూ. నేనేమో, “ఒస్, అదెంత చలి, ఢిల్లీలోనే ఉన్నాను” అన్నాను. అప్పట్లో తెలీలేదు ఈచలితో పోలిస్తే ఆ చలి చలే కాదని. ఇక్కడికొచ్చేక తెలిసింది నిజం చలంటే ఏంటో. కానీ మంచు మాత్రం భలే సరదాగా ఉంది. ఇప్పటికీ నాకు మంచు ఇష్టమే. తెల్లగా, దూదిపింజెల్లా మంచు తరగల్లా గాలిలో తేలిపోతూంటే ఆ సౌందర్యానికి మనసు కూడా అలా అలా తేలిపోతుంది.

ఈదేశం, ఈ వాతావరణం ఎంత కొత్తగా అనిపించిందో చెప్పలేను. చాలాకాలం పాటు అసలు ఇదంతా కలే అనుకున్నాను. ఏదో ఓ సమయంలో తెలివొచ్చీసి, ఇదంతా కలే కదా అని ఊరడిల్లుతానని చాలామాట్లు అనుకున్నాను. బహుశా కొంతవరకూ కారణం ఇక్కడ ప్రతీదీ వింతగానో మనకి విరుద్ధంగానో కనిపించడం కాబోలు. పాలూ, నీళ్ళూ రుచులు వేరు. కూరలదేమిటో ఎక్కళ్ళేని తీపి. గాలీ, వెలుగూ, మన్నూ, మిన్నూ, చెట్టూ, చేమా … అన్నీ మనకి భిన్నంగానే ఉన్నట్టు వింత అనుభూతి.

ఇండియాలో ఉన్నంతకాలం నావయసువాళ్ళందరూ అమెరికా వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతుంటే, వారికోరికకి నిరసనగా కొంతా, సహజంగా నాకు ఏదో సాధించాలన్న తపన తక్కువ కావడంచేత కొంతా అమెరికాసరదా నాకు ఉండేది కాదు. పెళ్ళికి ముందు సుందరంగారితో ఆమాట చెప్పేను కూడా. ఆయన ముందు రా, తరవాత చూద్దాం అన్నారు. తీరా వచ్చేక మటుకు, ప్రతివారూ కేవలం ప్రత్యేకించి ఈ అనుభవంకోసమయినా అమెరికా కాకపోతే మరో దేశం వెళ్ళి ఓ ఆర్నెల్లు దేశాంతరవాసం చెయ్యాలనే తీర్మానం చేసేసేను. ఆమాట అయినవాళ్ళకీ కానివాళ్ళకీ ప్రచారం చేస్తూ వచ్చేను కూడా.  మరో దేశం ప్రత్యక్షంగా చూసి అనుభవిస్తే కానీ మనకి ఆ దేశంగురించి ఉండే అపోహలు పోవు.

మనకి అమెరికనులగానే కొన్ని స్టీరియోటైపు అభిప్రాయాలు, మూక ఉమ్మడిభావాలు అనొచ్చేమో ఉన్నాయి కదా. నేనూ వాటితోనే వచ్చేను కానీ ఈ భూమ్మీద అడుగెట్టేక అదంతా నిజం కాదని అర్థమయింది. అయితే మరి నిజం ఏమిటి అన్నది మాత్రం ఒకంతట తేలలేదు, లేదు ఏమిటిలే, ఇప్పటికీ నాకు సందేహమే మనం వీళ్ళని సరిగ్గా అర్థం చేసుకున్నామా అన్నది. ఈ ఊరికి ఆ ఊరెంత దూరఁవో ఆ ఊరికి ఈ ఊరూ అంతే దూరం అని, వీళ్ళకి మనం అంటే ఉన్న అభిప్రాయాలూ అంతే, మూక ఉమ్మడి భావాలే కానీ నిజంగా మనతత్త్వం వీరికి తెలీదనే అనిపిస్తుంది నాకయితే.

వీళ్ళందరికీ ఇండియా అంటే కొన్ని నిర్దుష్టమయిన అభిప్రాయాలు – అన్నీ పుస్తకాల్లోనూ ఇతర మాధ్యమాలద్వారాను ఏర్పడ్డవే ఉన్నాయి. అంచేత వాళ్ళ ప్రశ్నలు వాటికి తగ్గట్టుగానే ఉంటాయి. మొదట్లో ఓపిగ్గానే జవాబు చెప్పేను కానీ రాను రాను విసుగేయడం మొదలయింది. తరవాత చిరాకేసింది. ఆ తరవాత వీళ్ళకి మన సంస్కృతిగురించి ఎలా చెప్పడమా అని సుదీర్ఘంగా ఆలోచించేను. నేనేదైనా అడిగితే వీళ్ళు ఆ పుస్తకం చదువు ఈ పుస్తకం చదువు అని సలహాలివ్వడంతో నాకు అదే మార్గం ఆసరా అయింది. అయితే పుస్తకాలు అని కాక కథలు చదవమన్నాను. అలాగే వీళ్ళగురించి తెలుసుకోవాలన్న యావ కూడా నాకు ఎక్కువే. అంచేత వీళ్ళెవరైనా పలకరిస్తే మాట కలపడానికి సిద్ధంగానే ఉండేదాన్ని, మామూలుగా అది నాతత్వం కాకపోయినా. నాలో వచ్చిన మొదటిమార్పు అదనుకుంటా. ఇండియాలోనే ఉంటే ఎవరితో గానీ నేను మాట కలపడం అన్నదే లేదు!

మా పక్కవాటాలో ఉన్న ఒకమ్మాయి, నాన్సీ అని, నెమ్మదిగా పరిచయం అయింది. ఒక రోజు బజారుకి తీసుకెళ్తాను రమ్మంటే వెళ్ళేను. అంతకుముందు సుందరంగారు తీసుకెళ్ళినా నాకేమీ తలకెక్కలేదు. అంచేత మళ్ళీ అంతా కొత్తే. అది చాలనట్టు వీళ్ళ భాషొకటీ. మనం దేశంలో నేర్చుకున్న ఇంగ్లీషుకి వీళ్ళ ఇంగ్లీషుకీ పోలికే లేదు. వీళ్ళ ఉచ్చారణ, సగం సగం నవుల్తూ మాటాడ్డం, ఏదీ స్పష్టంగా పలకరు. నీకు ఇండియా వెళ్లినప్పుడు మన తెలుగు కూడా అలాగే అనిపించిందంటావా? ఏమోలే నువ్వు అలా అంటే నేనేం చెప్పలేను. నువ్వెవరితో మాటాడేవో. మావాళ్ళెవరూ అలా మాటాడరు మరి. హీహీహీ. ఇంతకీ ఆరోజు నాన్సీ బజారుకి తీసుకెళ్ళిందా. ఏదో కొన్నాను. నాకు ఇంకా ఈ క్వార్టర్లు, నికెలులూ అలవాటు కాలేదు. నేనింకా రూపాయలూ, నయాపైసల్లోనే ఉన్నాను. ఆ షాపువాడికి రెండు డాలర్లు కాబోలు ఇచ్చేను. మరో నికెలు,  అన్నాడు. నేను తెల్లబోయి నాచేతిలో చిల్లరా, అతని మొహమూ మార్చి మార్చి చూస్తున్నాను. ఆ అమ్మాయి నాన్సీ నాచేతిలో నికెలు తీసి అతనిచేతిలో పెట్టొచ్చు కదా. ఉహు, అదేం లేదు, నవ్వుతూ నిలుచుంది. అలా పావుగంట భాగోతం అయేక, నావెనకనున్న మరోమనిషి నాచేతిలో నికెలు వేపు వేలు పెట్టి చూపుతూ అదియ్యి అంది. అదే మనదేశంలో అయితే, ఆపని మనపక్కనున్నవాళ్ళు వెంటనే చేసేవారు కదా అనుకున్నాను. మొదట వీళ్ళకి చొరవ తక్కువేమో అనుకున్నాను కానీ తరవాత చాలామందిని చూసేక అర్థమయింది, అలా చొరవగా ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడం అంటే నీ తెలివితేటలమీద, అంటే నీ తెలివితక్కువతనంమీద  వ్యా ఖ్యానం అన్నమాట.

మనలో చాలామంది ఎవరో  ఒకరు చేస్తారులే అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. ఇక్కడ ఎవరికి వారు సాధించుకోవాలి. ప్రతిపనీ ఎవరో చేసిపెడతారు అనుకుంటూ ఎదురు చూస్తూ కూర్చోరు. చేసి పెట్టమని అడగరు. చిన్నవిషయం కానీ పెద్ద విషయం కానీ నీకు కావాలిసింది నువ్వే పూనుకుని సాధించుకోవాలి.

ఓసారి నేను కూరలబజారులో లైనులో నిల్చున్నాను కొనడం అయిపోయింతరవాత. నా బండీలో చాలా సామానే ఉంది. నావెనక ఒకావిడ నించుంది. ఆవిడ బండిలో రెండు వస్తువులున్నాయి. నేను మర్యాదకే, ఆవిడని ముందుకి వెళ్ళమన్నాను. వెంటనే ఆవిడ, ఏం నేను ముసిలిదాన్ననా? నావంతు వచ్చేవరకూ ఆగే ఓపిక నాకుంది అంది. నేను గతుక్కుమన్నాను, ఎంత చిన్నవిషయానికి తప్పు పడతారో అనిపించింది. అంటే అందరూ అలాగే అని కాదు కానీ, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అదే ఆవిడే నన్ను ముందు వెళ్ళనిస్తావా అని అడగొచ్చు. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయిలే. అందుకే నాకు ఇదంతా అయోమయంగా అనిపిస్తోంది.

అప్పటికింకా అంటే డెబ్భయిలలో అమెరికాలో తెలుగువాళ్ళు అట్టే లేరు. నాయుడిగారికుటుంబం అరవైలలో వచ్చేరుట. ఆ తరవాత మరో రెండు కుటుంబాలు వచ్చేయి. అందులో ప్రద్యుమ్నోత్తమరెడ్డి అప్పటికింకా కుర్రాడే. పేరు పీటర్ అని మార్చుకున్నాడు అమెరికనులు పలకలేరని. ఆ తరవాత నాలుగేళ్ళకి చదువయింతరవాత ఇండియా వెళ్ళి మేనమామకూతురు జగదీశ్వరిని చేసుకుని అమరికా తీసుకొచ్చేడు. అప్పటికి ఆ అమ్మాయికి పదహారు నిండి పదిహేడో ఏడు ప్రవేశించింది. పల్లెలో వసతి లేదు కనక ఆ అమ్మాయి చదువుకోలేదు కానీ మంచి తెలివితేటలున్నాయి. ఆరోజుల్లో ఈత వచ్చిన తెలుగు పడుచు ఆ అమ్మాయి ఒక్కతే నాకు తెలిసినంతమటుకు. “అదెలా వచ్చింది?” అనడిగేను. ఎందుకంటే ఈత అనగానే ఇక్కడి స్విమ్ సూటులే కదా తలపుకొచ్చేది. పేరుకి సూటులే కానీ గోచీపాతలే. జగదీశ్వరి తేలిగ్గా, “మాయింట్లో నేనొక్కదాన్నే ఆడపిల్లని. ముగ్గురు అన్నలు. ఆళ్ళతోబాటే నేనూ బిళ్ళంగోడూ, కోతికొమ్మచ్చీ ఆటలాడుతూ గట్లమ్మటా పుట్టలమ్మటా తిరుగుతుంటే మానాయన, ‘ఏ దిగుడుబావిలోనే పడి సస్తావే అంటా ఈత నేర్పించీసినాడు,’ అంది. వచ్చిన ఆర్నెల్లలో ఇంగ్లీషు మాటాడ్డం ఓమోస్తరుగా నేర్చీసుకుని భలే చలాకీగా ఊరంతా తిరిగేస్తూండేది. నాతరవాత వచ్చిన పిల్ల నాకు ఊరు చూపించేదంటే ఇంక చూసుకో ఆమె చలాకీతనం.

000

“మీరు మీ సంసారంసంగతి వదిలేసి, దేశంసంగతి మాటాడుతున్నారు,” అంది అరవింద.

లీల ఉలికిపడి చిన్న నవ్వు నవ్వి, “ఆఁ, అవును కదూ. ఏమిటో నాకూ అదే స్పష్టంగా తెలీడం లేదు. అందుకే నువ్వు అడిగితే, నీకు చెప్తుంటే నాక్కూడా తెలుస్తుందేమోనని చూస్తున్నట్టున్నాను,” అంది.

“మనదేశంలో అత్తారింటికెళ్ళడం వేరూ, మరోదేశంలో అత్తారింటికెళ్ళడం వేరూ అని చెప్తున్నారనుకుంటా,” అన్నాను నేను. దేశకాలపరిస్థితులు – వీటి ప్రభావం ఒక మనిషి వ్యక్తిత్వంమీదా జీవనవిధానంమీదా కూడా బలంగా ఉంటుంది. మనుషుల్ని అనేకవిధాల మర్పులకి లోను చేస్తుంది అని నేను చాలామాట్లే అనుకున్నాను మరి.

లీల నావేపు చూస్తూ అవునన్నట్టు తలూపింది. “మనదేశంలో అత్తారింటికి వెళ్ళినప్పుడు ఆ ఊరూ, ఆ మనుషులూ కొత్తే అయినా కొత్తగా అనిపించదు. ఆ పసుపుతాడు బలం అలాటిది. నాభర్త, మాఅత్తమామలు, మా ఆడబిడ్డలు, మామరిది … అంటూ అదోరకం మమత్వం అత్తారింట అడుగెట్టిన తక్షణమే ఏర్పడిపోతుంది. దేశం విడిచి బయటికి వచ్చినప్పుడు అలా కాదు. ఆ అత్తమామలు, మరుదులు, ఆడబిడ్డలు ఉండరు. తనవాడు అనిపించుకోగలవాడు భర్త ఒక్కడే. అతడు ఎంతో హుషారుగా భార్యని ఊళ్ళో తెలుగవాళ్ళకీ, తదితర స్నేహితులకీ పరిచయం చేస్తాడు కానీ …” అంటూ లీల ఆగిపోయింది.

“మీరు ఇప్పుడు నన్ను మరింత అయోమయంలో పడేశారు,” అంది అరవింద.

“కాదులే. నువ్వు ఈదేశంలో ఉన్నావు కదా. పైగా మీఅమ్మా, నాన్నా, విషి వాళ్ళ అమ్మా, నాన్నా అందరూ ఇక్కడివాళ్ళే కనక నీకు బాధ ఉండదు,” అంది లీల.

“లేదు లెండి. ఇందాకా మీరన్నారు చూడండి ఇక్కడి తెలుగువాళ్ళతో మాటాడుతుంటే ఏదో వెలితి అని. మాకుటుంబం, విషికుటుంబం ఇక్కడున్నా వాళ్ళకి మన సంస్కృతీ, సాంప్రదాయాలూ కూడా గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడు. ముఖ్యంగా నేను ఆడపిల్లననీ, వాళ్ళబ్బాయి మగపిల్లవాడనీ, … ఇంకా నాధర్మాలూ, వాళ్ళ ఔన్నత్యాలూ… ఇలా చాలా ఉన్నాయి లెండి,” అంది అరవింద. అవి తలుచుకుంటుంటే ఆ అమ్మాయికి నిరుత్సాహం కూడా వచ్చేసినట్టుంది.

నాకేం తోచలేదు. “ఇవాళ్టికి చాలిద్దాం. మరోసారి మాటాడుకుందాంలే,” అన్నాను.

ముగ్గురం ఇంటిదారి పట్టేం.

 

000

 

(ఫిబ్రవరి 9, 2012)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

One thought on “మార్పు 27”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s