మా నిడదవోలు వంశంలో కథకులు (నేను కాక!)

ముందు టపాలో మా నిడదవోలువారి వంశంలో నాకంటె ముందు కథలు రాసినవారున్నారని చెప్పేను. కళాప్రపూర్ణ నిడుదవోలు వెంకటరావుగారు ఈ కోవలోకి రారు. మిగతావారిలో నాకు ఒకతరం ముందు మా బుచ్చినాన్న (నాన్నగారి చిన్న తమ్ముడు) అని కూడా చెప్పేను. ఆయన రాసిన కథ ఇది. 1959లో విజయనగరంనించి వెలువడిన   ది అడ్వర్టైజరు వారపత్రికలో ప్రచురితమయింది రెండువారాలపాటు అంటే వారానికి రెండు పేజీలచొప్పున.

ఈ కథలో ప్రప్రథమంగా నన్ను ఆకర్షించింది విజీనారం నుడికారం. ఇందులో నాకు తెలీని పదాలు, కొంత ఆలోచించినతరవాత అర్థమయిన పదాలు ఉన్నాయి. నాకు తెలీని పదాలు అండర్లైను చేసేను. మీకెవరికైనా తెలిస్తే చెప్పగలరు.

మరొకమాట – ముందు టపాలో నాకథ 1946లో ప్రచురింపబడిందని రాసేను కానీ మరింత ఆలోచిస్తే అది నిజం కాదనిపిస్తోంది. మరొకసారి క్షమాపణలు చెప్పుకుంటున్నాను.

———————–

 

మావోడు – ఆడికత

రచన: ని. లింగమూర్తి

 

 

సూర్నాయుడు గొప్ప లిటిగేహన్లో పడిపోనాడు. ఆళ్లంతా కమీండైపోనారు. ఈడొక్కడు. నాను తొలికాడ్నుంచి సెబతనేవున్నాను. “ఓరయ్యా నువ్వాటూసు బోకు మనకేటి కళ్ళా కాళ్లా. మన్ను దిని మన్ను కక్కే బతుకు మన్ది” అంతా. ఈగుంతడు యినుకుంతేనా. ఉప్పుడు ఏటానాది అనుబగిత్తున్నాడు. ఇల్లా గుల్ల. వొల్లా గుల్ల.

ఈ సూర్నాయుడునాగే అడిబాబు నారన్నాయుడు. నేనుంతే యీడికి సిప్పే మిగిలేది.

నారన్నాయుడు – మాంవంతా ఆడిని నారన్ననే పిలిసేవోళ్లం – గోసి కట్టకముందే అచ్చుంనాయుడుగారాక్కడ (ప్రింటులో అక్షరాలని కలంతో దిద్దేరు గారాక్కడ అని) కంబారిగ కుదిర్నాడు. నారన్నకి కండ ముదిర్నాక అచ్చుంనాయుడు కొత్తాఁవాసకి కొలికెడు దాన్నం, పంచల్జత యిచ్చేవోడు. అదే గనకారంనాగ ఆడు సూసుకునేవోడు.

నారన్న బుద్దిమంతుడు కాబట్టి ఆ కొలికెడు పాయిదాలకిచ్చి నాలుగు సమచ్చరాల్లో మూడు గరిసెలు కొల్సుకొని అవెట్టి బుగతగారి మెరక మళ్ళు నాలుగు రాపించుకున్నాడు. అచ్చుంనాయుడు గారాక్కడ కంబార్తనం వొగ్గేసేడు.

ఆడ్ని యీడ్ని అయ్యా బాబూ అంతూ మూడేసు దుక్కులు దున్నించేవోడు. ఆడిదినాలు బాగుండి గోంవులుకి వొల్లమాలిన దర పుట్టీసింది. రెండు పంటల్లో కోఁయిటోడు మూడు సంటుల రూపాయిలు యివ్వోల్సి యిచ్చుకోనేక ముక్క రాసినాడు. ముక్క రాసి కోఁయిటోడు కరణంగారింటికాడ్నుంచి వొసులుకోగానే “బాబూ నానీముక్కేటి సేసుకుంతాను వోపల్లంసెక్క రాపించి పెడితే యీ జలమంలో బతికి పోతాను. అందునోది తఁవరూ వొక తాంబూలం ఖర్సు పుచ్చుకొందురు” అన్నాడు.

కరణంగోరు కూడా మా మంచోరండి. సెయ్యెత్తి దణ్ణం పెట్టాల. అప్పుడేటన్నారనుంతారు. “నారిగా, నీకు పల్లంసెక్క ఎందుకురా. నీకేటి ఇల్లా, వోకిలా, ఏరా బక్కలా (ఎద్దులు?)? ముందు వొ గుంటని సూసి ముడెట్టుకో. అతల పల్లంమాట సూద్దాం” అన్నారు.

నారన్న కరణంగోరింటికెళ్ళినట్టు అచ్చుంనాయుడు సిటికెలో గెహించి ఆవెయినం నాగినాడు.

అంబటేళకి నారన్నకి కేకెట్టి “నారిగా నువ్వు అదుష్టమంతుడివొస్సి. పెందిల కరణంగార్ని పల్లం సెక్క రాపించమన్నావంత. నన్నడిగితే న్ను కాదంతానేటి. పల్లంమాటకేటి నువ్వు ఊం అంతే మా పైడిగుంట నిచ్చి ముడెడతాను కూడాని. సిన్నప్పట్నుంచి నాకాడే వున్నావు. వుప్పుడూ వుందువు” అన్నాడు.

“నువ్వు కరణంగోరు ఎనగంతే అనగేనే” అనేసి పల్లకున్నాడు నారన్న.

ఆయేళ కాయేళే మాపిటేళ నారన్న అచ్చుంనాయుడోరి బక్కలు తోల్తెత్తుంతే కరణంగారు పిలిసి “నారిగా యింతసేపూ నానూ అచ్చుంనాయుడు నీవూసే ఆడుకుంతున్నాం. ఆళ్ల పైడిగుంట నిన్ను వొలిసిందంట. సేసుకుంతావేటి” అనడిగినారు. నారన్న సిటం పల్లకున్నాడు. కరణంగోరు “సెప్పరా నాకాడ బయఁవా, చిగ్గా” అని ముదలకించినారు. అప్పుడ నారన్న “బాబూ తఁవరు పెద్దోరు. తఁవలాటోళ్లు సెబితే నాను దాన్లేను కానండి. అచ్చుంనాయుడిగారమ్మికి నాను తగను. నాకు అదీ తగదు బాబు. అది మా గనకారంగ పెరిగినాది. ఇత్తలదాక అత్తలెట్టదు (ఇటు దాక (తట్ట) అటు పెట్టదు?). గనకారం ఆడదాయి నాకెందుకు బాబు. సుక్కలో నెగిసి బక్కలో  తొంగునేదాయయితే ఇంత కూడు దొరుకుద్ది” అన్నాడు.

“అయితే ఇంకోర్ని సేసుకుంతావురా.”

“తఁవరి దయుంతే ఆ రాఁవయ్య కూతురు సిన్ని.”

“సిన్నా. మారు మనువుదాయి గదరా.”

“మారుమనువుదాయి అయితేనేటండి. ఆడికి బూమ్మీద నూకలు నేక సచ్చిపోనాడు కానండి. కేకనాగుంతాది. కట్టం చుకం తెల్సినదాయి. నాకు మానచ్చినదాయి” అంటూ ఒకటే దౌడు తీసినాడు బక్కలకేసి.

నారన్న సిన్ని వూసెత్తేసరికి కరణంగోరి మనసు సివుక్కుమన్నాది. ఆరేమో అప్పటికే బారికాడిసేత సిన్నికి వూసెట్టేరు. గానయితే సిన్ని కూడా మామంచి ముండకూతురు. “నానెగా ఒక మొగుడికి సెడ్డాను. మల్లీ ముడెట్టుకున్నోడే ముట్టుకోవాల నన్ను. కరణంగోరికి నానాటోళ్లు కొదవేల. నాను ఆరి బొట్టినాటిదాన్నని సెప్పు” అన్నాది.

కరణంగోరు ఆ మలిరోజు పొద్దూకువేళ “సిన్నీ” అని పిలిసి “నారన్నినగంతున్నాడు. నీకిట్టమేటే అని అడిగినారు. “తఁవరి బొట్టినాటిదాన్ని ఆడడిగితే నాను కాదంతానా” అంది. కరణంగోరు సిటంలో పంసాంగం ఎటో సూసి “ఆదివోరం దాళి కట్టించేత్తాను నువ్వెళ్లు” అన్నారు. ఈ ఊసు అచ్చుంనాయుడుకి తిళ్లేళకందిపోనాది. అగ్గిరాంవుడునాగ నెగిసిపోయి నారిగా యింక యిక్కడ కంబారితనం వొగ్గీ అనేసినాడు.

ఆ బగమంతుడు తల్సుకుంటే ఈ అచ్చుంనాయుడినెక్కేటి. అచ్చుంనాయుడు అద్దరేతిరికాడే నారన్నకి బాకీ వున్న గింజలు కొలిసేసి యిల్లిడిసి పొమ్మన్నాడు. నారన్న ఆ గింజలు అంకెలకెత్తుకుని కరణంగోరింటి ముంగిటికొచ్చి “బావూ యినగైనాది నాబతుకు. వుప్పుడు తలదాసుకోడమెక్కడ” అంతే “యీరేతిరి మాచోపాలో తొంగో చల్దులేళకి రాఁవయ్యగారింటికే పొదువు” అన్నారు.

పొద్దింకా పొడకముందు కరణంగోరు రాఁవాయకి కబురెట్టి అంతా సెటిలిమెంటు చేసినారు. ఆ మర్రోజు నారన్న సిన్నికి తాళి కట్టేసి ఆళ్ళింటోనే ఉండిపోనాడు.

సిన్నికి తాళి కట్టేగానే రాఁవాయ కుటుమానఁవంతా యీడికి తోడయిపోనారు. ఆళ్లఏరు, బక్కల బండి, ముంగల కూలికి తోల్తుండేవి. వుప్పుడు నారన్న చేరిలోకొచ్చిపడ్డాయి. పదిమంది మడుసులు గొడ్డు గాదె వుంతే యింకేటి కావాల. మరొటేటంటే కరణంగోరికి సిన్నిమీది మనసో నారిగాడిమీద్దయో సెప్పనేం గానీ మాటసాయం మాసెడ్డ సేస్తుండోరు.

మూడు సవచ్చరాల్లో నారిగోడు నారన్నాయుడానాడు. పాయిదాలకిచ్చోడు పద్దులు పట్టోడు. వొరు మడిసెక్క అమ్మ జూపినా యీడే కొనేవోడు.

ఆరోజుల్లోనే సూరిగాడు పుట్టినాడు. సూరుగాడ్ని సూసుకుని సిన్ని మా మురిసిపోయేదాయి. “ఆడికేటి అదుష్టమంతుడొ” “ఆడికేటి మారాజు” అంతుండేది. ఆడికోసం పత్తేకం బుడ్డిదీపం తీసేసి నాంతరు పెట్టేది. తానం ఆడిస్తే వోసన సబ్బట్టే రుద్దేది.

పెరిగి బుద్దెరిగినాక కూడా సదువులు పంతులు “సిన్నమ్మా సూరిగాడ్ని మా యిస్కూలు బడికి పంపరాదా” అంతే “ఏటో బాబు ఆనలుసు అమ్మవోరి ఎంగినాకై బతకనీ బవూ. ఆడికేటి నోటు సదువున్నదాక. అచ్చరాలొచ్చినోడికాడ నచ్చిమి నిలదంతారు. ఆ అయ్యని యిడిసిపెట్టేయండి” అంది.

సూరిగోడు తిన్నగ గోసి కట్టడం నేర్సకముందు రగుడీసుతనం నేర్సుకున్నాడు. యింకా ఎన్నేనా ముదర్నేదు అచ్చుంనాయుడిగోరి పైడిగుంట కూతుర్ని ఆళ్లకళ్లంనోనే అత్తలఅళంతా దమ్ముల్లుంతంతే రెక్కొట్టుకన్నాడు. ఆ ముండకూతురు కెవ్వుమని కేకనెట్టలా. కానీ అచ్చుంనాయుడివి పిల్లికళ్ళు. పాంవు సెవులు. ఎనగ సూసినాడొ “వోరి ముండపాపడ సిన్నగుంటని వొక్కదాయిని సూసి ఏటా యమకం సేస్తున్నావు. పిలు మీబాబుని. అంతిట్టమయితే ముడెట్టుకెళ్ళు. నేకుంచే యిటుకేసే రాక. నాను మాసెడ్డోణ్ణి సుమ్మీ” అన్నాడు. సిన్ని ఆదొడ్డుకెపుడొచ్చిందో గెబగెబా అచ్చుంనాయుడు దెగ్గిరకొచ్చి “సినబాబూ సిన్నోళ్లు. ఆళ్లు మనసుబడితే మనంవెందుకు కాదనాల. నువ్వొప్పుగుంతే మాకేటి అబ్బెంతరం. కరణంగోరినడిగి తాళి కట్టించు” అన్నాది.

దాన్ని ముడెట్టుకోడమేటి. ఆడికి ఎర్రెత్తడమేమిటి. ఒక్కపాలే జరిగినాయి. ఆలిమొగలిద్దరు అవిటవిటికి గూడు బండేలేటి, వొసర్కాసులేటి, వొసీరలేటి, వొగాజులేటి, అదెటి మొవానికేసుకుంతారు పవోడరు. అయి ఇయి వోటేటి అన్నీను. ఆ గుంటయితే మరీను సానిపాపలా వుండేది. ఈడికి పట్టపోళ్లు సేనామంది జతబడి సూర్నాయుడు నువ్వో కమీసనెవ్వారమెట్టు. పట్టంనోనే వుందువు. మీబాబేటి గడింసేడు. నీకు కుప్పలు కుప్పలు రూపాయిలొస్తాయి అని పురెక్కింసి యిడిసినాడు.

ఆమాటే ఆడింటికాడంతే నాను ఆడిబాబు నారన్నాయుడు, అచ్చుంనాయుడు, కరణంగోరు మావంతా సెడపోరి వొద్దంతే ఆడు యినుకుంతేనా. తండ్రికాడ్నుంచి వొసిలిపోతానని బెదిరించి పదేల రూపాయిలు పట్టుకుని పట్టంనో కొట్టూ, కాపరం రొండూ ఎట్టేడు.

ఒక్క సమచ్చరం ఎనుగెనుగిపోనాది. చరి సప్పున సల్లారిపోనాది. పట్టం మాయలు మానాటోళ్లకి ఏటి తెలుస్తది బావూ.

తిరిగి పారెచ్చిన్తరువోతన్నా బుద్దొచ్చి పొలం యవసాయం సూసినాడా. నేదు. అన్నీ పట్టం బుద్దులు పట్టినాయి. అప్పులు బేంకు వుంది కాదా. దానికి కరణంగోరే సేన్నాళ్ళాయి పెసెంటు. దరమరాజు. యిచ్చినోడు మంచోడే. ఇవ్వనోడూ మంచోడే అనగే గైపుచ్చుకునేవోరు. వోనాడు యీడికెందుకుట్టిందో యినాసికాలం. “నాను పెసెంటవుతాన”న్నాడు. కరణంగొరు అగ్గిరుద్దుడైపోనారు. వొద్దురా సూరీ యవారం పడనేవన్నారు. ఈడినలె. కుర్రగుంతలందరు యీడికాసి కాసినారు. పెసెంటు ఆనాడు.

కాని మాలాటోళ్లకి కళ్ళా కాళ్లా. పట్టం బేంకికెళ్ళినప్పుడల్లా ఆళ్ళేటి సెబితే దానికే బుర్రూపి ఎక్కడ ఏనిముద్రెయ్యమంటే అక్కడేసి వొచ్చేవోడు.

ఒకనాడంతట యినీసిపెక్టరు ఆళ్ళు యీళ్ళు అంతా వొచ్చినారు. ఒకరేతిరి ఒక పొగలు నెక్కలు సూసి సూర్నాయుడు నువ్వు పాతికేలు కట్టాల. నేకుంతే కొసకొట్టులో కూకోవాల అన్నారు.

ఏటి సేస్తడు. పుస్తే పూస అమ్మీసి పల్లంసెక్కలు కరణంగోరికి రాసి సెల్లబెట్టెడు.

వుప్పుడేటుంది. యిల్లా గుల్ల. వొల్లా గుల్ల.

 

 

(ది అడ్వర్టయిజర్, జయవారం ఆశ్వీయుజ 21, 1881 (13-10-1959), జయవారం ఆశ్వీయుజ 28, 1881 (20-10-1959) – వరసగా రెండు వారాలు ప్రచురింపబడింది.)

 

(ఫిబ్రవరి 13, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “మా నిడదవోలు వంశంలో కథకులు (నేను కాక!)”

 1. మాలతి గారూ,
  భలే బాగుందండీ! నాకు కొంచెం కూడా ఈ భాష తెలియకపోవడం వల్ల కష్టపడ్డాననుకోండి. అయినా చాలా నచ్చింది!
  శారద

  మెచ్చుకోండి

 2. గోపాలకృష్ణారావుగారూ, మీ వ్యాఖ్య నాకు చాలా సంతోషం కలిగించిందండీ. వయసు మళ్ళిన రచయితలకి ఇంతకంటె గొప్ప ఆమోదముద్ర లేదు! ఆలస్యంగానైనా బ్లాగులు చూడ్డం మొదలు పెట్టినందుకు కూడా సంతోషంగా ఉంది. ఈనాడు వస్తున్న పత్రికలకి ఏమాత్రమూ తీసిపోని బ్లాగులు కొన్ని ఉన్నాయి. తప్పకుండా చూడండి.
  మీరు ఇచ్చిన అర్థాలకి ధన్యవాదాలు. ఇదొక్కటే నాదగ్గర ఉంది, ఇంకేం కథలు లేవు. మరొకసారి మనఃపూర్వక ధన్యవాదాలతో,
  మాలతి

  మెచ్చుకోండి

 3. మాలతి గారికి, కథా రచయిత్రిగా మీరు సుపరిచితులే (చాలా ఏళ్లక్రితం పత్రికల్లో వచ్చిన మీ కథలు చదువుతుండే వాణ్ణి, కానీ మీ బ్లాగు చూడడం ఇదే ప్రథమం.(బ్లాగ్ లోకం లోకి నేను Late entrant ని. మీరందించిన మీ బుచ్చినాన్నగారి కథ చాలా బాగుంది.అప్పటి విజీనారం యాసని చాలా చక్కగా రికార్డు చేసారు.ఇలాంటివి ఇంకేమైనా ఉంటే అందిచండి. చదివి ఆనందిస్తాము. ఇక కథ లోని పదాలగురుంచి-

  1. కమీండై పోవడం– ఇది నిస్సందేహంగా తెలుగు పదం కాదు. ఇంగ్లీషే. అయితే అచ్చు తప్పు ఏమైనా ఉందేమో ననే అనుమానం ఉంది. ఈ పదానికి అర్థం పోలీసు కేసులో బుక్ అవడం అరెస్టు అవడం.కాకపోతే దీనిని కమ్మిట్టు అని రావి శాస్త్రిగారి కథల్లో చదివి నట్టు గుర్తు.
  2.గారాక్కడ–ఫలానా..గారి+ అక్కడ గారక్కడలేదా గారాక్కడ–అంటే వారి వద్ద అని అర్థం. కొంత మంది గారి+కడ–గారికాడ అనీ అంటుంటారు.
  3.పాయిదా– ఇది వడ్డీల కియ్యడమే. అసలు ఫాయిదా లంటారు.ఇది ఉర్దూనుంచి తెలుగు లోకి వచ్చిన పదం.ఫాయిదా అన్నఉర్దూ పదానికి లాభం అని అర్థం వడ్డీ లాభం కదా. కౌలు మాత్రం కాదు. ఫాయిదాలు కట్టటమంటే వడ్డీలు కట్టడమే.
  4.ఒసులు కోవడమనే పదానికి తొలగుట తప్పుకొనుట అని అర్థం. కానీ ఇక్కడ తండ్రినుంచి వేరై పోవడం. దూరమై వేరు కాపరం పెట్టడ మన్న మాట.
  5. దాక అంటే వెడల్పు మూతి కలిగి ఎత్తు బాగా తక్కువగా ఉండి అంచు ఉన్న మట్టి కుండ. ఇప్పుడు మనం వాడుకునే Cooking pan కి అంచు ఉంటే ఎలాగుంటుందో అలాగుంటుంది. తట్ట కాదు. మన చిత్తూరు జిల్లా వేపు తట్ట అంటే పళ్ళెం.తట్ట లోఅన్నం పెడితే తింటారా అని అడిగితే అపార్థం చేసుకో వద్దు.
  విజీనారం కథలు ఇంకా వినిపించండి.

  మెచ్చుకోండి

 4. జోగారావుగారూ, మీ వివరణలకి ధన్యవాదాలు. ఇందులో 2 – నాకు అదే అర్థం కాలేదు. ఎంచేతంటే నాదగ్గరున్న ప్రింటుకాపీలో కలంతో దిద్దబడి ఉంది రాకి దీర్ఘం, క కింద క వత్తు. అది లేకపోతే నేను కూడా అది ..గారికాడ అని చదువుకుని ఉండేదాన్ని. ఏమైనా మీరు శ్రమ తీసుకుని ఈవిషయాలు రాసినందుకు చాలా సంతోషం.

  మెచ్చుకోండి

 5. 1. కమీండై పోనారు ….. ?
  2. గారాక్కడ ……ఇది అచ్చు తప్పే.
  3. పాయిదా … ఫాయిదా అనుకుంటాను. వడ్డీ లేదా కవులుకియ్యడం కావచ్చును
  4.వొసులు కోవడం అంటే తప్పు కోవడం లేదా వెళ్ళి పోవడం
  5. ఇత్తల దాక అత్తల పెట్టదు. … దాక అంటే తట్ట కాదనుకుంటాను. దాక అంటే గిన్నె.
  ఇక్కడ గిన్నె అక్కడ పెట్టదు.

  మెచ్చుకోండి

 6. @ కొత్తపాళీ, తరవాణి కుండలు కోస్తాజిల్లాల్లో కూడా ఉన్నాయండి. మరింకా యిజీనారంవోల్లు ఇంకా ఏటయినా సేస్కుంతారేంవో నాకెరికనేదు.
  పోతే. మట్టిమనిషి నవల గుర్తొచ్చేమాట నిజమే కానీ నాకు ఆ నవల అంతగా నచ్చలేదండీ. మొదటి వందో, వందన్నర పేజీలో తప్పిస్తే ప్రధాన కథానాయకుడు, రైతు సాంబయ్యా, అతనిజీవితమూ కనిపించవు. మీరన్నమాట ఇది కాదనుకోండి. మాట వచ్చింది కనక చెప్పేను.

  మెచ్చుకోండి

 7. అబ్బబ్బ .. ఉప్పేసిన తరవాణీ అంత కమ్మగా ఉంది .. అందామనుకున్నా గానీ తరవాణీ తూగోజి స్పెషలని గుర్తొచ్చింది. మరి మీ యిజీనారం లోకల్ స్పెహ్సలు ఏదైతే అదే – అంత కమ్మగా ఉంది!!

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s